శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
ఈ సంచికలోని శీర్షికలు పుస్తకము నందు పొందుపరపబడినవి – https://docs.google.com/file/d/0ByVemcKfGLucNUV6UVlCQ1BrVUU/edit?usp=sharing
శ్రీమన్నారాయణుని చేరి ఆయనకు అకుంఠిత కైంకర్యము సమర్పించడమే జీవులకు పరమ ధ్యేయమని శాస్త్రములు నిర్ణయిస్తున్నాయి. అందుకుగాను కైంకర్యప్రాప్తిని పొందుటకు అనేక మార్గములు నిర్వచింపబడినాయి. వాటిలో భక్తి మరియు ప్రపత్తి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. స్వాచార్యులందు పూర్తిగా భారము నుంచి సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండటము శ్రేష్ఠము మరియు ఆచరణాసౌలభ్యము కలిగి భక్తి ప్రపత్తుల కంటెనూ శ్రీమన్నారాయణ కైంకర్యమనెడి శ్రేష్ఠతమమైన ప్రసాదమునకు పరమోన్నత మార్గము.
ఆచినోతి యః శాస్త్రార్ధమ్ ఆచరేస్థాపయతి అపి
స్వయమ్ ఆచరతే యస్మాద్ ఆచార్యస్తేన కీర్తితః
ఆచార్యులనగా,శాస్త్రములను క్షుణ్ణముగా అధ్యయనము చేసి, వాటియందు విధింపబడిన విధి నిషేధములను నిర్ధారించి, వాటినే తామును ఆచరించెడివారు.
ఆచార్యులనగా కేవలము శ్రీమన్నారాయుణునే పరమదైవముగా అంగీకరించి తమ భక్తి విశ్వాసములనుంచిన వారుగా శాస్త్రములాధారముగా మన పూర్వాచార్యులచే విశదీకరింపడినది. ఆచార్యులు శ్రీమన్నారాయణుని పట్ల భక్తి ఙ్ఞాన వైరాగ్యము లందు పరిశుధ్దతతో నెలకొని, ఉపాయాంతరములు (శ్రీమన్నారాయణుని కంటే ఇతరమైన ఉపాయములు), ఉపేయాంతరములు (శ్రీమన్నారాయుణుని మరియు ఆయన భక్తులకైంకర్యము కంటే ఇతరమైన ధ్యేయములు) మరియు దేవతాంతరములు (ఇతర దేవతలందు అనురాగము) అనువాటిని ఉపేక్షించ వలెను. ఇట్టి ఆచార్యలక్షణములకు మన పూర్వాచార్యులు ఉత్తమ నిదర్శనములు.
వేదశాస్త్రముల బోధనలను ఉపదేశించిన మన పూర్వాచార్యుల శ్రీసూక్తుల సారముగా పిళ్ళైలోకాచార్యస్వామి ప్రసాదించిన శ్రీవచనభూషణమను దివ్యశాస్త్రములో అంతిమముగా “ఆచార్య అభిమానమే ఉత్తారకము” అని నిశ్చయించారు. అనగా శిష్యుల ఉజ్జీవనమునకు వారి పట్ల స్వాచార్యులకు గల దయాభిమానములే పరమోత్కృష్ఠమైన కైంకర్య ప్రాప్తమునకు ఉత్తమ మార్గము.
ఈ దివ్యసూత్రమును మణవాళమామునుల శిష్యకోటిలో అష్ట దిగ్గజములుగా పిలువ బడిన వారిలో ఒకరైన పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ తమ అంతిమోపాయనిష్ఠ అను గ్రంథములో విపులముగా వివరించారు. అంతిమ = ఉన్నతము/చివరి; ఉపాయ = మార్గము; నిష్ఠ = ధృఢవిశ్వాసము/అధ్యవసాయము. అనగా స్వాచార్యుల యందు సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలిగి ఉండడము (అత్యున్నత మార్గము). ఈ గ్రంథము మనవాళమామునుల ప్రత్యక్ష ఉపదేశముల అనుసారమని, తాము కేవలము వారి హస్తములుగా ఆ ఉపదేశములను గ్రంథస్తపరిచామని పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ భావించారు. ఈ ఐతిహ్యము నంపిళ్ళైస్వామిచే అనుగ్రహింప బడిన ఈడు వ్యాఖ్యానము వడక్కు తిరువీధిపిళ్ళై స్వామిచే గ్రంథస్తపరచబడి నట్టు సంభవించినది. కనుక, ఈ గ్రంథము నందలి ఉపదేశములు మణవాళమామునుల ప్రత్యక్ష ఆదేశములుగా పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ స్వామి పరిగణించారు.
ఈ అకుంఠిత ఆచార్య నిష్ఠకు నిదర్శనములుగా మధురకవియాళ్వార్లకు నమ్మాళ్వార్లయందు, ఆండాళ్కు పెరియాళ్వార్ల యందు, వడుకనంబికి ఎంపెరుమానార్ల యందు ప్రస్ఫుటమయింది. ఆచార్య నిష్ఠను చరమ పర్వ నిష్ఠ (అత్యున్నతమైన విశ్వాసము) అని కూడ పేర్కొన వచ్చును. శ్రీమన్నారాయణుని యందు సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలిగి ఉండడము ప్రథమ పర్వ నిష్ఠగాను, స్వాచార్యులయందు సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలిగి ఉండడము చరమ పర్వ నిష్ఠగాను సంప్రదాయఙ్ఞులు పరిగణించారు. మన ఆళ్వారాచార్యాదులు చరమ పర్వ నిష్ఠయందు అనేక ఉపదేశములను మనకు దివ్యప్రబంధములలోను మరియు శ్రీసూక్తులలోను అందించారు.
ఈ గ్రంథము మణిప్రవాళములో(అనగా తమిళము మరియు సంస్కృతముల మిశ్రమ పదములతో) కూర్చబడి, ఇతర పూర్వాచార్య గ్రంథములవలెనే సుధీర్ఘములైన వాక్య పద జాలములను కలిగియుండటము చేత, దాసుడు యథా తథముగా అనువదింప అశక్తుడనయి, ప్రతి భాగము/విభాగముల సారాంశమును అర్ధాపత్తి కలుగ నటుల దాసుని శక్త్యాను సారము నివేదింప ప్రయత్నిస్తాను.
యాధృఛ్చికముగా, ఎంపెరుమాన్ దివ్యానుగ్రహము వలన, ఈ అనువాద ప్రక్రియ శ్రీమద్భగవద్గీత యందలి 18 అధ్యాయములవలెనే 18 శీర్షికలుగా రూపొందినది. శ్రీమద్భగవద్గీత యందలి 18వ అధ్యాయమున ఎంపెరుమాన్ శరణాగతి యొక్క శ్రేష్ఠతను విశదీకరించినట్లు, ఇందలి చివరి శీర్షికలో ఆచార్య శరణగతి విశదీకరింప బడినది. ఇంకనూ విశిష్ఠముగా ఈ సంచిక ఆళవందార్ తిరునక్షత్రమున ముగియుచున్నది. స్వామి ఆళవందార్ తమ ఆచార్యుల యందు పూర్ణ నిష్ఠ కలిగి యుండి, స్వామి నాథమునుల యందు తమకు గల దివ్య భావములను స్తోత్త్రరత్నము యందు వ్యక్తీకరించి నటుల, ఈ దివ్య పర్వదినమున మనము “అంతిమోపాయ నిష్ఠ” అను ఈ గ్రంథమును అనుసంధించుకొని పరవశమును పొందెదము.
దాసుడను ఈ గ్రంథ రచనకు ఎంతగానో ప్రోత్సహించి, ఇంకా ఉత్సాహపరుస్తున్న ఎందరో శ్రీవైష్ణవులకును. మన పూర్వాచార్యులకును, ఆళ్వార్లకును మరియు శ్రీభూనీళాసమేత ఎంపెరుమాన్లకును కృతఙ్ఞతాభివందనములతో ఈ గ్రంథమును సమస్త శ్రీవైష్ణవకోటికి సమర్పిస్తున్నాను.
అస్మదాచార్యులు శ్రీమత్ పరమహంస ఇత్యాది వానమామలై పట్టర్ పిరాన్ రామానుజ జీయర్ స్వామి (29వ పట్టము)ల పాదకమలములకు ఈ చిన్న కైంకర్యమును సమర్పించునటుల కృప చేసిన శ్రియఃపతికును, ఆళ్వాచార్యాదులకును సదా కృతఙ్ఞుడను.
ఇంకనూ శ్రీ రంగనాథన్ స్వామి (బంగళూరు – https://antaryami.net website సంపాదకులు) వారు ఎంతో ఉదారముగా సమయానుకూలముగా సంస్కృత శ్లోకములకును మరియు ప్రమాణములకును చక్కని అనువాదములను అందించినందులకు దాసుడు కృతఙ్ఞుడు.
ఇక మనము ఈ సంచికలో వివిధ ఉపశీర్షికలలో ఈ దివ్యగ్రంథమునందు ఎంతో అద్భుతములైన మన పూర్వాచార్యుల ప్రశస్తియొక్క వివరణములను అనుభవించి తరించెదము.
- 1వ భాగము – ఆచార్య వైభవము మరియు శిష్యలక్షణము – ప్రమాణములు
- 2వ భాగము – మధురకవి ఆళ్వార్ మరియు పిళ్ళై లోకాచార్య స్వామి శ్రీసూక్తులలొ ఆచార్యవైభవము
- 3వ భాగము – అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్, తిరువరంగత్తాముదనార్, పిళ్ళైలోకాచార్య మరియు మామునుల శ్రీసూక్తులలో శిష్య లక్షణము
- 4వ భాగము – వడుగ నంబి మరియు అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానర్ల పట్ల ఎంపెరుమానర్ల దయ మరియు ఎంపెరుమానార్లయందు వారి శరణాగతప్రపత్తులు
- 5వ భాగము – భట్టర్, నంజీయర్ మరియు నంపిళ్ళై – ఆదర్శ గురుశిష్య సంబంధమునకు ఉత్తమ ఉదాహరణములు
- 6వ భాగము – భగవంతుని కంటెనూ ఆచార్యుల ఉత్తమస్థితి
- 7వ భాగము – నంపిళ్ళై వైభవము – 1
- 8వ భాగము – ఆణి తిరుమూలమ్ – రమ్యజామాతృ (శ్రీరంగనాథుడు) మరియు రమ్యజామాతృముని (మామునులు)
- 9వ భాగము – నంపిళ్ళై వైభవము – 2
- 10వ భాగము – శ్రీమద్రామానుజులవారి శిష్యులయొక్క నిష్ఠ
- 11వ భాగము – ఎంపెరుమానర్ల పట్ల ఎంబార్ మరియు ఇతర శిష్యుల నిష్ఠ
- 12వ భాగము – భగవంతుని అవతారముగా ఆచార్యుడు
- 13వ భాగము – ఆచార్యుల పట్ల అపచారముల వివరణము
- 14వ భాగము – భాగవతాపచారము వివరణమ
- 15వ భాగము – ఆచార్య/భాగవత ప్రసాదము మరియు శ్రీపాదతీర్థము యొక్క వైభవము
- 16వ భాగము – జన్మప్రాధాన్యతారహితముగా భాగవతుల వైభవము
- 17వ భాగము – భాగవతుల నిర్హేతుకకృప
- 18వ భాగము – ముగింపు – ఆచార్యనిష్ఠ వైభవము
మూలము: https://granthams.koyil.org/anthimopaya-nishtai-english/
అడియేన్ అనంతరామన్ రామానుజదాసుడు
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org