శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ – లో చూడవచ్చు.
17. ఉపాయ విరోధి – ఉపాయంలో అడ్డంకులు (మాధ్యమాలు / ప్రక్రియలు). సరిగ్గా అర్ధం చేసుకోవటానికి ఈ క్రింది అవరోధాలు వివరించబడ్డాయి.
- “సిద్దోపాయుడైన భగవాన్ మోక్షానికి అత్యుత్తమమైన ఉపాయంగా పరిగణించాలి. కాబట్టి, సిద్దోపాయ నిష్టుడు (ప్రపన్నుడు) భగవంతుడు కాకుండా కర్మ యోగము వంటి ఇతర వాటిని ఉపాయంగా పరిగణించరాదు. అటువంటి ప్రక్రియలను పరిగణనలోకి తీసుకుంటే దానికదే అడ్డంకి.
- కర్మ యోగమును సిద్దోపాయానికి సమానంగా భావించడం ఒక పెద్ద అడ్డంకి. (అనువాదకుని గమనిక: మనం గత సూత్రాల వ్యాక్యానాలలో చూసినట్టుగా ఇతర ఉపాయాలు అచేతనమయినవి. భగవాన్ గొప్ప చేతనుడు – అందువల్ల వాటికి సమవంతం చేసే ప్రశ్నే లేదు – భగవానుడు ఉపాయం అనేదే అత్యంత మహిమాన్వితమైనది).
- “భగవానుడు ఉపాయం” గా స్వీకరించుట, ఎమ్బెరుమాన్ కృప యొక్క ఫలితం కూడా. ఇది మన కర్మ ఫలితంగా పరిగణించుట ఒక అడ్డంకి.
- సాధారణంగా “భగవాన్ ని ఉపాయంగా” మన అంగీకారాన్ని ఒక విధంగా వివరించాలంటే “సర్వ ముక్తి ప్రసంగ పరిహార్థం” గ చెప్పవచ్చు – అంటే “భగవాన్ అంగీకారాన్ని ఆశించకుండానే ముక్తిని ఇస్తే, ఇప్పటికె అందరికీ మోక్షాన్నిప్రసాదించి ఉండేవారు, అందుచే భగవాన్ వారిని ఉపాయంగా స్వీకరించిన వారికే ముక్తిని ఇవ్వాలని ఎంచుకుంటారు”. ఇది మన పూర్వాచార్యుల వ్యఖానాలలో మరియు రహస్య గ్రంథాలలో వివరించబడింది. నమ్మాళ్వారు ఈ సూత్రాన్ని తిరువాయ్మోళి 4.10.6 వ పాశురంలో “ఎల్లీరుం వీడు పెఱ్ఱాళ్ ఉలగిల్లై” – (ఈ సంసారంలో ప్రతి ఒక్కరూ మోక్షం పొందినట్లయితే శాస్త్రాలకి ప్రయోజనం ఉండదు). నంపిళ్ళై వివరించినట్లుగా మోక్షాన్ని అందరికి ప్రసాదించకుండా భగవానుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ఆదుకున్నారు. పిళ్ళైలోకాచార్యులు కూడా ముముక్షుపడిలో ఇదే సూత్రాన్నివివరించారు. కాని దానికే ప్రాధాన్యత ఇవ్వడం (సర్వ ముక్తి ప్రసంగాన్ని తప్పుకోవటానికి మాత్రమే భగవానుడు వారిని ఉపాయంగా అంగీకరించిన మొక్షాన్ని ప్రసాదిస్తున్నారు అని కారణంగా భావించడం) ఒక అడ్డంకి. (అనువాదకుని గమనిక: భగవాన్ సర్వస్వతంత్రుడు, అతను ఏ ప్రత్యేకమైన తార్కికంతో ముడివేయ లేము – అందువల్ల సర్వ ముక్తి ప్రసంగాన్ని తప్పుకోవటానికి మాత్రమే భగవానుడు వారిని ఉపాయంగా అంగీకరించినవారికే మోక్షాన్ని ప్రసాదిస్తున్నారని అనుకోలేము).
- ఎమ్బెరుమాన్ని ఉపాయంగా స్వీకరించినా లేకపోయినా దానికి సంబంధం లేకుండా చిత్ మరియు అచిత్తులందరిని సంరక్షించువారు భగవానుడు. “భగవానుడే ఉపాయం” అను ఈ అంగీకార స్వీకారం, జీవాత్మను అచిత్ నుండి వేరు చేస్తుంది. జీవాత్మ చిత్తుడు – జ్ఞానం / తెలివి కలిగినవాడు. అచిత్ జ్ఞానం లేనిది – ఎటువంటి మేధస్సు లేనిది (అందుచే భగవానుని ఉపాయంగా అంగీకరించ లేనిది). కనుక జీవాత్మ తన జ్ఞానంతో సహజంగా ఎమ్బెరుమాన్ని ఉపాయంగా స్వీకరిస్తారు. ఈ సహజమైన ప్రవర్తనను ఒక ఉపాయంగా పరిగణించడం ఒక అడ్డంకి. (అనువాదకుని గమనిక: “నా స్వీకారం” ఉపాయం, అని మనం అనుకోకూడదు, భగవాన్ ఉపాయం, అనే మన అంగీకారం కేవలం మన జ్ఞానం యొక్క సహజ ఫలితం).
- అచిత్ లాగానే జీవాత్మలు కూడా పూర్తిగా ఎమ్బెరుమాన్ అధీనంలో ఉంటారు. భగవానుని జీవాత్మ స్వతంత్రంగా స్వీకరించి లేదా తిరస్కరించ వచ్చని అనుకోలేము (అనువాదకుని గమనిక: ఎమ్బెరుమాన్ తలచుకుంటే ఏ ఆత్మనైనా ప్రభావితం చేయగలడు – కాని అలా చేయడు).
అందువల్ల ఉపాయాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి పైన చెప్పినవి అడ్డంకులుగా వివరించబడ్డాయి.18. ఉపేయం విరోధి – ఉపేయంలో అడ్డంకులు (లక్ష్యం).ఉపేయం అనగా ఉపాయాన్ని అనుసరించడం ద్వారా సాధించేది అని అర్థం. ఈ క్రింద వివరించినవి ఉపాయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవటంలో అవరోధాలుగా వివరించబడ్డాయి.
- భగవతుపాయనుడు – ప్రపన్నుడు కేవలం భగవానుడే ఉపాయంగా భావించేవాడు. అతను కేవలం భగవానుడి కైంకర్య సాధన మాత్రమే లక్ష్యంగా ఉంచుకోవాలి. లౌకిక ప్రయోజాలను మొదలైనవి కోరుటను, “ఏ కోరికనైనా తీర్చగలిగే కల్ప వృక్షాన్నిఒక చిన్న కోరిక కోరినట్లు” తగనిదిగా వివరించబడింది. ఎమ్బెరుమాన్ నుండి ఇతర ప్రయోజనాలు కోరడం ఒక అడ్డంకి.
- కర్మ, జ్ఞాన, భక్తి యోగం వంటి ఇతర ఉపాయాల ద్వారా భగవానుని ఉపాసించడం ఒక అడ్డంకి (అనువాదకుని గమనిక: భగవతాధీనుడైన జీవాత్మకి భగవానుని ఉపాయంగా స్వీకరించడం సహజమైనది. స్వప్రయత్నాలు జీవాత్మ యొక్క స్వభావానికి వ్యతిరేకమైనవి) .
- భగవత్ కైంకర్యం చేస్తున్నప్పుడు “ఈ కైంకర్యం నేను స్వతంత్రంగా చేస్తున్నానని” భావించరాదు. భగవానుడు భగవద్గీతలో 3.27 లో “అహంకార విమూడాత్మా కర్తా అహం ఇతి మన్యతే) – అహంకార (అహం) అయోమయంలో, జీవాత్మ మొర్ఖత్వంతో తానే చేస్తున్నాడని భావిస్తున్నాడు. ఇటువంటి అహంకరం ఒక అడ్డంకి.
- అకర్తగా భావించుట, కైంకర్యం పట్ల నిరాసక్తి చూపించరాదు. (అనువాదకుని గమనిక: శ్రీవాచన భుషణ దివ్య శాస్త్రంలో వివరించినట్లుగా, కైంకర్యాలు శాస్త్రాలు మరియు ఆచార్యుల మార్గదర్శకత్వంలో గొప్ప కోరిక మరియు అంకితభావంతో చేయాలి).
- భగవంతునికి / ఆచార్యులకు చేసిన కైంకర్యం నుండి తానూ ఆనందాన్ని పొందుట. నమ్మాల్వార్ తిరువాయ్మోలి 2.9.4 లో వివరించారు ” తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే” – భోగించేవాడు (ఆనందించేవాడు) భగవానుడు మాత్రమే. “భోక్తా” అనగా ఒక చర్య యొక్క ఫలాలను అనుభవిస్తున్న వాడు అని అర్థం. భగవనుడే నిజమైన భోక్తా. కాబట్టి, జీవాత్మ స్వతంత్రంగా ఆస్వాదించే ఆస్కారమే లేదు. జీవాత్మ స్వతంత్రముగా ఆనందించాలానే కోరిక కలిగి ఉండటం ఒక అడ్డంకి.
- భోగ్యం అంటే ఆస్వాదించబడినది అని అర్థం. భగవంతుని సంపూర్ణ ఆనందం కోసం జీవాత్మ వారి పరాధీనుడై తనను తాను పూర్తిగా అంకితం చేయాలి. భగవనుడు ఆనందించి, వారి ముఖంలో ఆనందం కనబరిచినప్పుడు, జీవాత్మ ఆనందంతో ప్రతిస్పందించాలి. కుళశేఖర ఆళ్వార్ దీనిని పెరుమాళ్ తిరుమ్మోహి 4.9 లో “పడియాయ్క్ కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బెనే” అని వివరించారు – నీ సన్నిధి ద్వారం దగ్గర ఒక చెప్పులా పడిఉంటాను (చేతనం లేని అచిత్ మాదిరిగా) మరియు ఆనందంతో చిరునవ్వును చిందించిన మీ ఆధారాలను చూచి ప్రతిస్పందిస్తాను (జ్ఞానం ఉన్న చిత్ మాదిరిగా). (అనువాదకుని గమనిక: పవిత్రమైన మన సత్ సాంప్రదాయం యొక్క అత్యోన్నతమైన సూత్రంగా పిలవబదిన ఈ “అచిత్వత్ పారతంత్రియం” సూత్రం – అచిత్ వలె భగవదాధీనులుగా, కాని మళ్ళీ భగవంతుడు ఆనందాన్ని వెల్లడిచేసినప్పుడు ఒక జీవాత్మ వలె ఆనందంతో ప్రతిస్పందించుట వంటిది). ఈ సూత్రం (స్వతంత్రముగా ఆనందించాలానే కోరికను నిర్మూలించడానికి) “నమః” అను ద్వయ మహామంత్రం యొక్క రెండవ భాగంలో వివరించబడింది. ఆలవందారులు వారి స్తోత్ర రత్నం 46 లో “కదా…..ప్రహర్శయిశ్యామి” – భగవదానందంకై పరితపించుట. భగవదానందాన్ని జీవాత్మ ప్రతిస్పందించినపుడు, భగవానుడు సంపూర్ణ ఆనందాన్ని పొందుతాడు. భగవదానందమే మన కైంకర్య ఏకైక లక్ష్యం. ఏ ఇతర మార్గాలని కోరుకొనుట ఆశించుట ఒక అడ్డంకి.
19. ఉపేయత్రి విరోధి – ఉపేయం లో మరిన్ని అడ్డంకులు (లక్ష్యం)మునుపటి వివరణను పొడిగించి ఇక్కడ కొన్ని అడ్డంకులు చూపబడ్డాయి. ఉపాయ సాధన ఫలితంగా ఉపేయం లభించును. ఒక శ్రీవైష్ణవ ప్రపన్నునికి, భగవంతుడే ఉపాయం(మాధ్యమం) మరియు ఉపేయం(లక్ష్యం) కూడా. భగవంతుడే ఉపేయం అనగా పరమపదంలో భగవంతుడిని చేరుట, తన అత్యంత పవిత్రమైన కళ్యాణ గుణాలను పరమానందించుట, అతనిపట్ల పూర్తి ప్రేమపూర్వక అనుబంధాన్ని అభివృద్ధి చేస్తూ చివరకు అతనికి నిరంతర కైంకర్యం చేయుట. దీనిని “భగవత్ అనుభవ జనిత ప్రీతి కారిత కైంకర్యం” అని పిలుస్తారు. ఇది అంతిమ లక్ష్యం. ఇప్పుడు ఈ ఫలితానికి మధ్యలో వచ్చే అడ్డంకులను చూద్దాము.
-
- ఒక ప్రత్యేక లక్ష్యాన్ని (గతంలో వివరించిన కైంకర్యం కంటే ఇతర) కోరుకోవడం. ఈ వైఖరి శ్రీ వైష్ణవ ప్రపన్నులకు తగినది కాదు మరియు అది ఒక అడ్డంకి.
- సంపద, ఆహార వస్త్రాలు, ఇల్లు, భార్య, పిల్లలు, కీర్తి, మొదలైనవి వంటి ద్రుష్ట ఫలాలు (ప్రాపంచిక ప్రయోజనాలు – ఈ జీవితంలో ఆశించి చూడాలనుకున్నవి మరియు ఆనందించాలనుకున్నవి). భగవంతుడిని సేవించి పొందిన పరమానందానికి పోలిస్తే ఈ ప్రాపంచిక ఫలితాలు చాలా అల్పమైనవి. కాబట్టి అటువంటి అనురాగాలు, ఆశలు కలిగి ఉండుట అడ్డంకి.
- అదృష్ట ఫలాలను ఆశించుట (ఉన్నత లోకాల ప్రయోజనాలు – ఈ జీవితంలో చూడలేనివి మరియు అనుభవించలేనివి). ఇవి రెండు అంశాలుగా వర్గీకరించవచ్చు:
- స్వర్గలోక ప్రపంచాలలోని ఆనందాలను ఆశించుట (బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనవారి నివాసాలు). ఇది ఒక అడ్డంకి.
- అపరిమిత ఆనందంతో నిండి ఉన్న పరమపదంలోని (అత్యున్నతమైన నివాసం) భగవంతుడిని సేవించుటయే అమితమైన ఆనందం. అలాంటి స్థితిని కోరుకోకపోవడం అనేది ఒక అడ్డంకి – అనగా, శాశ్వతమైన కైంకర్యాన్ని ఆశించాలి కోరుకోవాలి.
- భగవత్ కైంకర్యం ఆపడం ఒక అడ్డంకి. భాగవత కైంకర్యం అని పిలువబడే తదీయారాధనం ( తదీయులను ఆరాధించడం – భగవాన్ భక్తులు), భగవత్ ఆరాధనం (భగవానునికి కైంకర్యం) కంటే ఉన్నతమైనది. తదీయారాధనం అంటే ప్రసాదంతో భక్తులకు తినిపించడమే కాదు – వారికి సేవ చేయటం మరియు సరైన శ్రద్ధ వహించడం వంటివి అని అర్ధం.
5. భాగవత కైంకర్యాన్నితక్కువగా (భగవత్ కైంకర్యంతో పోల్చి) పరిగణించుట ఒక పెద్ద అడ్డంకి.6. ఏదో కొంత ఆచార్య కైంకర్యంతో సంతృప్తి పొందుట ఒక అడ్డంకి. భాగవతులందరిలో ఆచార్యులు ప్రథములు. పూర్తి సంతృప్తి ఎవరూ పొందలేరు – ఆచార్యుల కైంకర్యం ఇంకా ఇంకా కావాలనే నిరంతర తపన, కోరిక ఉండాలి. ఆకలితో ఉన్న వ్యక్తి తనకు ఏది వడ్డించినా తింటాడు మరియు ఏది వండినా తినడానికి ఉత్సాహంగా ఉంటాడు. అలాగే, తన ఆచార్యుల కోసం అన్ని రకాల కైంకర్యాలకు శిష్యుడు కోరుకోవాలి, సిద్ధంగా ఉండాలి. “ఆచార్యునికి నేను చాలా చేసాను” అని అనుకోవడం ఒక అడ్డంకి.
సారాంశంగా, భగవత్ కైంకర్యం తో ఆగకుండా – క్రమేణా భాగవత కైంకర్య పరివర్తనం ఉండాలి. మరియు, భాగవతోత్తములైన ఆచార్యులను గొప్ప ఆసక్తితో ఉత్సాహంగా సేవించాలి. ఇది మధురకవి ఆళ్వారుల కణ్ణినున్ చిఱుతాంబు 9 వ పాసురంలో “శటగోపన్ ఎన్ నంబిక్కు ఆట్పుక్క కాతల్ అడిమై ప్పయనన్ఱె ” లో వివరించారు – నిండా పవిత్రమైన కళ్యాణ గుణాలున్న నమ్మాల్వార్ కు ప్రేమపూర్వకమైన సేవ చేయాలనేది నాకు తగిన కర్తవ్యము.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2013/12/virodhi-pariharangal-3/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org