విరోధి పరిహారాలు – 7

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

34.శయన విరోధి  – నిద్రించుట/శయనించుట లోని విరోధాలు.
 ఎమ్బెరుమానార్ తో  వంగి పురత్తు నంబి
శయనం  అనగా నిద్రపోవుట, పడుకొనుట, విశ్రాంతి పొందుట అని అర్థం. శ్రీవైష్ణవ పరిభాషలో స్నానాన్ని “నీరాట్టం”  అన్నట్లుగా నిద్రను “కణ్ వళర్గై” అని అంటారు. ఈ అంశంలో కొన్ని అడ్డంకులు ఇవ్వబడ్డాయి. వాటిని ఇప్పుడు చూద్దాము.
  • సంసారుల (లౌకికవాదుల) గృహాలలో నిద్రించుట ఒక అడ్డంకి. మోక్షాన్ని కోరుకునేవాడిని ముమ్ముక్షువు అంటారు. సంసారులు మోక్షాన్ని కోరుకునే వారు కాదు. నమ్మాల్వార్ ఒక సంసారి జీవిత చక్రం గురించి వివరిస్తూ తిరువిరుత్తం మొదటి పాసూరంలో “పోయ్ నిన్ఱ  జ్ఞానముం పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం” – అజ్ఞానంతో మళ్ళీ మళ్ళీ పాపపు పనులు చేసి ఫలితంగా పదే పదే పుట్టి శరీరాన్ని పొందుతున్నాడు.
  • వాళ్ళతో కలిసి పడుకున్నా లేదా నిద్రపోయినా.
  • వాళ్ళ మంచం పైన పడుకున్నా లేదా నిద్రపోయినా
  • వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకున్నా లేదా నిద్రపోయినా
  • సంసారులకు క్రింద గట్టుపై నిద్రపోవుట (ఉదాహరణకు: సంసారులు మంచం పైన, మనం నేలపైన నిద్రపోవుట).
  • వాళ్ళకు నిద్రపోవడానికి స్థలమిచ్చుట.
  • వాళ్ళు నిద్రపోయిన స్థానాన్ని శుద్ధి చేయకపోవుట.
  • శ్రీవైష్ణవుల గృహాలలో నిద్రించక పోవుట. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవుల ఇంట్లో  నిద్రపోయే అవకాశం దొరికినపుడు గొప్ప అదృష్టమని భావించాలి.
  • శ్రీవైష్ణవులు మనకు సమానమని భావించి వారితో పడుకొనుట. అనువాదకుని గమనిక: మనమెప్పుడూ శ్రీవైష్ణవులను మనకంటే ఎక్కువగా భావించాలి.
  • వాళ్ళ పవిత్రమైన మంచంపైన పడుకొనట, ఆ మంచముని గౌరవించక పోవుట.
  • వాళ్ళ చరణాల వద్ద పడుకోవడానికి సంకోచించుట.
  •  వాళ్ళ కంటే ఎత్తులో పడుకొనుట (ఉదాహరణకి: వాళ్ళు నేలపైన మీరు మంచంపైన నిద్రపోవుట).
  • వాళ్లకి నిద్రపోవడానికి సరైన స్థానం అందించకుండా తాను పడుకొనుట.
  • వారు నిద్రపోయి లేచింతరువాత ఆ స్థలాన్ని పవిత్ర పరచడం. అనువాదకుని గమనిక: మామూలుగా మనం నిద్రపోయి లేచిన స్థలాన్ని పగటి సమయంలో ఉపయోగించాల్సిన అవసరం ఉన్నట్లయితే ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి / పవిత్రం చేస్తాము, ఇది సాధారణ పద్ధతి. నీరు పోసి ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రపరుస్తాము. కానీ మనం ఇతర శ్రీవైష్ణవులను పవిత్రంగా భావిస్తాము కాబట్టి, వారు నిద్రించినటువంటి ప్రదేశాన్ని పవిత్రం చేయకూడదు.
  •  విహిత విషయం అనగా శాస్త్రంలో సూచించిన / అనుమతించిన సుఖానుభవము/భోగములు – అది కూడా ఒక అడ్డంకి. ఇక్కడ అది ఒక శ్రీవైష్ణవ భార్య (లేదా శ్రీవైష్ణవ భర్త)ని సూచించబడినది. భర్త తన భార్యతో కలిసి నిద్రపోవుట మన శాస్త్రంలో అనుమతించబడిందని భోగించకూడదు. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 101 వ సూత్రంలో వివరిస్తూ “మఱ్ఱ ఐయిరువర్కుం నిషిద్ధ విషయ నివృత్తియే అమైయుం; ప్రపన్ననుక్కు విహిత విషయ నివృత్తి తన్నేఱ్ఱ౦” – మాముణులు ఈ సూత్రాన్ని వారి అందమైన శైలిలో వివరించారు. లౌకిక ప్రయోజనాలను ఆశించేవారు, ఉపాయాంతరాలను (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు) అనుసరించేవారు –   ఇతరుల భార్యల నుండి దూరంగా ఉండుట సరిపోతుంది. (అనగా, ఇతరుల భార్యలను కాంక్షిచుట సాధారణంగా శాస్త్రంలో  ఖండించబడినది). ఇతరులు తమ భార్యతో కలిసి తమ ధర్మాన్ని నిర్వర్తించవచ్చు (సంతానం ఉత్పత్తి కోసం), కానీ ప్రపన్నులకు ఇటువంటి కలయిక వారి స్వరూపానికి  అవరోధంగా పరిగణించబడింది, అందువల్ల అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎరుమ్బిఅప్పా ద్వారా రచించబడిన విలక్షణ మోక్ష అధికారి నిర్ణయం అను గ్రంథంలో మరింత వివరించబడింది. మన పుర్వాచార్యులు ఉత్తమ ప్రపన్నులు  అయినప్పటికీ, కొద్ది రోజులు మాత్రమే ఈ రకమైన కలయికలో అత్యంత కారుణ్య అనుభూతితో (వ్యక్తిగత అనుభవం లేకుండా) ఒకరు లేదా ఇద్దరు శ్రీవైష్ణవ సంతానోత్పత్తి (పిల్లలు) కోసం పాల్గొనేవారు, తరువాత పూర్తిగా అటువంటి చర్యలకు దూరంగా ఉండి పూర్తి భగవత్ విషయంలో మాత్రమే సమయం గడిపేవారు. ఇది ఒక సంక్లిష్టమైన విషయం కావున, తమ ఆచార్యుల నుండి సూత్రాలను సరిగ్గా వినడం  అవసరం.
  • తమ భార్య కూడా ఒక శ్రీవైష్ణవి అని పరిగణించి, ఏ కోరిక లేకుండా  ఆమెతో పాటు నిదిరించాలి. అలాంటి ఆలోచన ఉండక పోవుట ఒక అడ్డంకి.
  • ఇంద్రియ  సుఖాలను ఆనందాలను ప్రేరేపించే ఆలోచనలతో నిద్రించకూడదు.
  • భగవంతుడిని సంస్మరించకుండా నిద్రపోవటం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: నిద్రపోయే ముందు పెరియాళ్వార్ తిరుమొళిలోని  (“ఉఱగల్ ఉఱగల్”),  “పానిక్కడలిల్ పళ్ళి కోళై”, “అరవత్తమళియినోడుం” లాంటి మొదలైన పాసురాలను స్మరించాలి.  పంచకాల పారాయణములకు నిద్ర జీవాత్మ మరియు పరమాత్మ యొక్క సంగమం (వైదికంగా ఒక దినము 5 భాగాలకు విభజించబడి ఉంది,  చివరి భాగాన్ని యోగము అని పిలుస్తారు) – భగవానుని నామాలు, రూపాలు, కళ్యాణ గుణాలను నిద్రపోయే ముందు స్మరించుట చాలా ముఖ్యమైనది.
  • వారి ఆచార్యులను మరియు ఇతర పూర్వాచార్యులను స్మరించకుండా నిద్రపోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మునుపటి అంశంలోని వివరణ మాదిరిగా, ఆచార్య తనియన్లు, వాళి తిరునామాలు మొదలైనవి, నిద్రపోయే ముందు మన సంబంధం భగవానునితో ఏర్పరచిన ఆచార్యుల వారిని గుర్తుచేసుకోవడం ఎంతో అవసరం.
  • దేహ సంబంధమైన పనుల ఆలోచనలతో నిద్రపోవుట ఒక అడ్డంకి.
  • ఆత్మ మరియు ఆత్మ స్వభావ సంబంధమైన  ఆలోచనలు లేకుండా నిద్రించుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మునుపటి అంశంలో చర్చించినట్లు, ఆత్మ భగవాన్ మరియు భాగవతుల యొక్క దాసుడని భావించే ఆలోచనలతో ఉండాలి.
  • పడుకునేటపుడు  భగవానునికి గానీ, భాగవతుల వైపు గానీ, ఆచార్యులవైపు గానీ మన కాళ్ళు చాపకూడదు.
  • నిద్రపోతున్నప్పుడు/పడుకునేటప్పుడు దేవాలయ దిశ వైపుగాని, మన ఇళ్ళల్లోని తిరువారాధనపు గది వైపుగాని, ఆచార్యుల  మఠ౦వైపుగాని / తిరుమాలిగ (నివాసము) వైపుగానీ  చాపకూడదు.
  •  ఆచార్యుల కైంకర్య సమయములో మనం నిద్రపోకూడదు.
  • ఆచార్యులు నిద్రపోకుండా మనం ముందు నిద్రపోకూడదు.
  • ఆచార్యులు మనల్ని ఏదో అవసరంమేరకు నిద్రలేపినపుడు మనం నిద్రపోకూడదు.
  • అనువాదకుని గమనిక: నిద్రపోవడాన్ని ఒక సాధారణ క్రియగా  భావించొచ్చు. కానీ ప్రతి క్రియలోనూ, వివిధ అంశాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ముందు ఉదహరించబడిన విధంగా, ఒక దినమును 5 భాగాలుగా విభజించుటను వైధిక అంటారు – అభిగమనం (ఉదయం  మేల్కొనట, ఉదయం నిత్యకృత్యాలు), ఉపాధానం (తిరువారాధానం కొరకు ముడిపదార్ధాలను సేకరించడం), ఇజ్జా (ఇంట్లో పెరుమాళుని తిరువారాధానం చేయుట), స్వాధ్యాయం (ఉభయ వేదాంతాన్ని నేర్చుకొనుట/నేర్పుట) మరియు యోగం (విశ్రాంతి – జీవాత్మ మరియు పరమాత్మ యొక్క సంగమం). యోగ భాగం సాధారణంగా మనం నిద్రిస్తున్నప్పటి సమయం, ఆ నిద్రను నియంత్రించి  /  సరైన మార్గదర్శనం చేయబడినప్పుడు, తమో గుణం అణిగి సత్వ గుణం పెరుగుతుంది. చాలా నిద్రపోవుట తమో గుణంగా భావిస్తారు, ఉదయాన్నే లేచి, భగవత్ /భాగవత కైంకర్యంలో మన మనస్సును మరియు దేహాన్ని నిమగ్నం చేసే ప్రయత్నం చేయాలి.

35. ఉత్తాన విరోధి  –  మేలుకొనే/ నిద్రలేచే సమయంలోని అడ్డంకులు

మంచం నుండి నిద్రలేయుటను ఉత్తానం అంటారు. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  • ఆచార్య/ శ్రీవైష్ణవులు మనలను మేల్కొలిపే టప్పుడు  బద్దకంగా / నెమ్మదిగా లేచుట.  అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులు మనల్ని మేల్కొలిపినపుడు, వారిచే మేల్కొలప బదినందుకు పశ్చాత్తాపపడాలి.  అందువలన ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేవాలి.
  • లౌకిక మనస్తత్వం కలవారు నిద్ర లేపినపుడు ఠక్కుమని లేచుట.
  • నిద్రలేచినపుడు  భగవాన్ యొక్క కీర్తి ప్రశంసలు మరియు ఆచార్యుల కీర్తి ప్రశంసలు గుర్తుచేసుకోకపోవుట అనేది ఒక అడ్డంకి.   సాధారణంగా పండితులు “హరి: హరి:” అని స్మరించుకుంటూ  మేల్కొంటారు. “హరిర్ హరతి పాపాని” శ్లోకాన్ని మరియు ద్వయ మహా మంత్రాన్ని స్మరించుట మంచిది. అనువాదకుని గమనిక:  మన శాస్త్రంలో, ఉదయాన్నే  బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, శ్రీమన్నారాయణుని  మహిమలను గుర్తుంచుకోవాలి అని చెప్పబడింది. సాధారణంగా మన పెద్దలు నిద్రలేచే పద్దతిలో, గురు పరంపర మంత్రం “అస్మద్ గురుభ్యో నమః… శ్రీధరాయ  నమః”, రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకం), ఆచార్య తనియన్,  “హరిర్ హరతి పాపాని” శ్లోకం, “కౌసల్యా సుప్రజా” శ్లోకం, నదాతూర్ అమ్మాళ్ పరమార్థ ద్వయ శ్లోకం, గజేంద్ర మోక్షం శ్లోకం, ఇంకా పరత్వాధి పంచక శ్లోకాలను స్మరించుకుంటూ నిద్రలేస్తారు.
  • ఆచార్యులు, లేదా శ్రీవైష్ణవులు మనకోసం వేచి  చూస్తున్నపుడు మనం దివ్య ప్రబందం, స్తోత్రములు, ఇతిహాస / పురాణాలు లేదా జప పఠనం వంటి వారి అనుసంధానంపై దృష్టి ఉంచుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  శ్రీవైష్ణవులు మనకొరకు వేచిఉన్నపుడు లేదా మన ఇంటికి వచ్చినప్పుడు, మన నిత్య అనుసంధానం కారణంగా వారిని వేచి ఉంచకూడదు – వీలైనంత త్వరగా పూర్తి చేసి, సంతృప్తికరంగా వారిని పరిచర్యలు చేసిన తరువాత మరళా మన అనుసంధానం కొనసాగించాలి.
  • ఆచార్యులు వారి సిరస్సును మన ఒడిలో పెట్టుకుని విస్రమిస్తుండగా, అకస్మాత్తుగా తన కాలు నెప్పిగా ఉందని లేవకూడదు. ఈ సందర్భంగా భట్టార్-నంజీయార్ సంఘటనను మనం గుర్తుచేసుకోవచ్చు. నంజీయార్ (శిష్యుడు) యొక్క వడిలో తన తలని ఉంచి భట్టార్ (ఆచార్యులు) విశ్రాంతి తీసుకుంటారు – నంజీయర్ చాలాసేపు కదలకుండా ఉంటారు, భాట్టార్ నిద్రలేచి  వారి సేవా భావాన్ని, సంకల్పాన్ని గొప్పగా ప్రశంసిస్తారు. ఈ సందర్భంగా  పరశురామ, కర్ణుని సంఘటనను కూడా మనం గుర్తుచేసుకోవచ్చు.  పరశురాముని వద్ద కర్ణుడు ధనుర్విద్య నేర్చుకునే రోజుల్లో ఒకానొక సమయంలో పరశురాముడు వారి తలను కర్ణుని వొళ్ళో ఉంచి విశ్రాంతి తీసుకుంటుండగా ఆ సమయంలో, ఒక పురుగు కర్ణుని కుట్ట సాగుతుంది కాని అతను కదలకుండా అలాగే ఉంటారు. ఈ సంఘటన మనకు మహాభారతంలో కనబడుతుంది.
  • శ్రీవైష్ణవ గోష్ఠి మధ్యలో నుండి లేచి వెళ్లిపోవుట అమర్యాద, అది గోష్ఠికి అవమానంగా పరిగణించబడుతుంది. అనువాదకుని గమనిక: దివ్య ప్రభంద గోష్ఠి లేదా కాలక్షేప గోష్ఠిలో, ప్రారంభంలో ప్రవేశించి ముగింపు వరకు ఉండుట ఎల్లప్పుడూ మంచిది. మధ్యలో  వచ్చి వెళ్ళే వారి నుంచి ఇతరులకు  ధ్యానభంగం అవుతుంది.
  • శ్రీవైష్ణవులను అరిచి మేల్కొలుపుట ఒక అడ్డంకి. శ్రీవైష్ణవులు మేల్కొలపడానికి లేదా శ్రీవైష్ణవులు ఒకపక్క నుండి మరొక పక్కకు జరగమని వినయంగా చెప్పాలి.
  • ఆచార్యులను నిద్రలేవమని అనుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఆచార్యులు నిద్రలేచే ముందే మనం లేచి ఆచార్యులు  మేల్కొనే వరకు వేచి ఉండాలి. ఆచార్యను నిద్ర లేవమని బలవంతం చేయకూడదు. ఈ సందర్భంగా భట్టార్ జీవితంలోని ఒక సంఘటనను మనం గుర్తుచేసుకోవచ్చు. తిరుప్పావై 8 వ పాసురం 4000 పడి ఆయ్ జనన్యాచార్యుల వ్యాఖ్యానంలో, అందరు శ్రీవైష్ణవులు ఉదయాన్నే మేల్కొని, తమను అలంకరించుకొని, వెళ్ళి భట్టార్ ఇంటి గుమ్మం దగ్గిర వేచి ఉండి వారిని అతి వినమ్రంగా  మేల్కొలిపేవారు. భట్టార్ ఆళ్వాన్ / ఆండాళ్ యొక్క ప్రియమైన కుమారుడు మరియు శ్రీరంగనాథుని / శ్రీరంగ నాచియార్ యొక్క దత్తపుత్రునిగా కుమారుడు, సాటిలేని పండితులు మరియు సాంప్రదాయం యొక్క మార్గదర్శకుడైయినందున శిష్యులందరు వారి సమయములో అత్యంత గౌరవ భావంతో సేవించేవారు.
  • ఆచార్యుల మేల్కొనే ముందు మనం నిద్రలేవక పోవడం ఒక అడ్డంకి. ఆచార్యులు నిద్రించిన తరువాత నిద్రపోయి వారు మేల్కొనే ముందే లేచి వారి అవసరాలకు సహాయపడి సంతృప్తిపరచి వారిని సేవించాలి .
  • ఆచార్యుల ఇతర శిష్యులను “సబ్రహ్మచారులు” (సహపాటి) అని పిలుస్తారు. వారితో కూడా గొప్ప గౌరవంతో వ్యవహరించాలి. వారి ముంది ఆవలించకూడదు, వారి ముందు కాళ్ళు చాచుట, వారికి కాళ్ళు తగిలేటట్టుగా కూర్చోవడం వాటివి అపరాధాలుగా పరిగణిస్తారు. అటువంటివి మానుకోవాలి.
  • ఈ సహపాఠులను గౌరవించాలి. వారికి ప్రణామాలు అందించే ముందు, ముందుగా “అడియేన్” అని సంబోధించి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.
  • ఆచార్యుల పట్ల, ఆచార్య పత్నిపట్ల (ఆచార్యుల భార్య) మరియు ఆచార్య పుత్ర (ఆచార్యుల కుమారులు) వారి పట్ల గొప్ప గౌరవం ఉండాలి. వారు నిద్ర లేచిన వెంటనే వారికి ప్రణామం చేసి సేవించాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : https://granthams.koyil.org/2013/12/virodhi-pariharangal-7/

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment