విరోధి పరిహారాలు – 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.


36. గతి విరోధి – మన నడవడిలో అడ్డంకులు.

సాధారణంగా గతి అనగా నడుచుట అని అర్ధం (గామనం – వెళ్ళుట), మార్గం (అర్చరాది గతి వంటిది – పరమపదానికి ప్రకాశవంతమైన మార్గం) మరియు ఆశ్రయం / లక్ష్యము (అగతిలో – శరణాగతి లేదు). ఇక్కడ ప్రధాన చర్చినీయాంశము,  శ్రీవైష్ణవుల (ఒక ఆచార్యుల ద్వారా భాగావ్ యొక్క ఆశ్రయం తీసుకున్న ఒకరు) పట్ల, సంసారులు (భౌతిక ప్రవ్రుత్త్తులు కలవారు), మొదలైన వారి పట్ల మనము ఎలా వ్యవహరించాలో చూద్దాము. దీనికి ముందు శ్రీవైష్ణవులు, ముముక్షువులు, సంసారులు మొదలైన వారి   యొక్క వివరణము చర్చించారు – అవసరమైన విధంగా వాటిని గుర్తు చేసుకుందాము.

  • శ్రీవైష్ణవులు పడుకున్న పక్కపైన అడుగుపెట్టుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులు వాడినదేమైనా పవిత్రంగా భావించి గౌరవించాలి. మన సంప్రదాయంలో, ఏ వస్తువైనా కాలికి తగిలితే అపచారంగా భావిస్తారు. కాలు తగలడం గానీ పైన పెట్టడం గానీ  కాలితో వస్తువులు లాగడం గానీ మొదలైనవి ఇతర సంస్కృతుల్లో చాలా సాధారణమైనప్పటికీ, మన సంప్రదాయంలో మన కాళ్ళు లేదా పాదాలు ఏదైనా వస్తువును తాకితే గొప్ప అగౌరవంగా పరిగణించబడుతుంది.
  • మన దగ్గరకు వస్తున్నా శ్రీవైష్ణవుల నిర్లక్ష్యం చేయరాదు, ఇది అగౌరవంగా పరిగణించబడుతుంది. వినయపూర్వకముగా, వినమ్రంగా వారికి ప్రణామాలు అందించి ముందుకు సాగాలి. అనువాదకుని గమనిక: ఒక శ్రీవైష్ణవుడు మరొక శ్రీవైష్ణవుని కలిసినపుడు  పరస్పరం సాష్టాంగ ప్రణామం చేసి గౌరవించాలని శాస్త్రంలో వివరించబడింది – కానీ ఈ అలవాట్లు ఈ రోజుల్లో వేగంగా కనుమరుగవుతున్నాయి.
  • మునుపటి వివరణకు విరుద్ధంగా, సంసారుల పట్ల అతి వినయంగా ఉండుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: సంసారులు  లౌకిక సుఖాలపై మక్కువ పెంచుతారు –  లౌకిక ప్రయోజనాల కోసం వారి పట్ల వినమ్రంగా ఉంటే మన ఆధ్యాత్మిక పురోగతికి హాని వాటిల్లుతుందని మన పుర్వాచార్యులు వివరించారు – కావున అలాంటి విషయాలపట్లగానీ వారి పట్ల గానీ ఆణుకువగా ఉన్నట్లయితే  మన ఆధ్యాత్మిక పురోగతికి హాని వాటిల్లుతుంది.
  • దేవాలయాల యొక్క విమానాలు, గోపురాలపై మన దృష్టి పడినపుడు, వాటిని నమస్కరించాలి, వాటి అందాన్ని ఆస్వాదించాలి. వాటిని నిర్లక్ష్యం చేసి లేదా హడావిడిగా వాటిని దాటి వెళ్ళడం అనేది ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: పెరియ తిరుమొళి 2.6.6 పాసుర వ్యాఖ్యానంలో, పెరియవాచ్చాన్ పిళ్ళైవారు నంజీయర్ వారి ఒక సంఘటనను కీర్తిస్తూ, వారు తిరునఱైయూర్ అరయర్ మరియు భట్టార్ ఆలయ గోపురాన్ని, శ్రీవైష్ణవుల యొక్క నివాసాలని మొదలైన వాటిని చూస్తూ ఆస్వాదించుకుంటూ ప్రదక్షిణ చేసేవారని వివరించారు.
  • దేవతాంతర (ఇతర దేవతలు) ఆలయాల విమానాలు, గోపురాలు శ్రీవైష్ణవుల దృష్టిలో పడితే, వాటిని పూజించి  ఆస్వాదించ కుండా త్వరగా ఆ ప్రాంతం నుండి తప్పుకోవాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:ఈ సందర్భంగా ఒక సంఘటనను నంపిళ్ళై తన తిరువాయ్మోళి 4.6.6 పాసురం ఈడు వ్యాఖ్యానంలో వివరించారు. పిళ్ళై ఉఱంగావిల్లి దాసుని యొక్క మేనల్లుళ్ళు వణ్దర్ మరియు చొణ్దర్ ఒకసారి అగళంగ నాట్టాళ్వన్ తో కలిసి నడుస్తునారు. వారిని ఆట పట్టించాలనే ఉద్దేశ్యంతో, అగళంగ నాట్టాళ్వన్ ఒక జైన దేవాలయాన్ని చూపించి, అది ఎమ్బెరుమాన్ ఆలయమని చెప్పి వారిని  నమస్కారం చేయమంటారు. వారు వెంటనే అతను చెప్పినట్టుగా చేస్తారు కానీ అది భగవానుని ఆలయం కాదని గమనించి వారు వెంటనే మూర్చపోతారు. ఇది విని, పిళ్ళై ఉఱంగావిల్లి దాసు అక్కడకు వచ్చి తన పాదాల ధూళిని అందిస్తారు, ఆ ధూళి స్పర్శతో వారు స్పృహలోకి వస్తారు. అంతటి గాఢమైనది వారి విశ్వాసం.
  • ఎమ్బెరుమానుని దేవాలయాన్ని ప్రదక్షణ చేసేటపుడు సవ్యదిశలో (కుడి నుండి ఎడమ పక్కకు గుండ్రంగా) చేయాలి – వ్యతిరేక దిశలో ప్రదక్షణ చేయుట ఒక అడ్డంకి.
  • ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, దివ్య ప్రబందం మొదలైనవి అనుసంధానం వినిపిస్తే, కాసేపు ఆగి విని నెమ్మదిగా అక్కడనుంచి వెళ్ళాలి. ఆ స్థితిలో చాలా హడావిడిగా తొందర్లో  విడిచి వెళ్ళుట సరైన పద్దతి కాదు.
  • ఇతర విషయాలను చర్చించటం లేదా మహిమపరచట వంటివి విన్నప్పుడు, చెవులు మూసుకొని అక్కడినుంచి వెళ్లి పోవాలి.
  • ఆచార్యులు లేదా శ్రీవైష్ణవులతో పాటు నడుస్తున్నపుడు వారి నీడను తొక్కరాదు.
  • మన నీడ వారిపై పడకుండా మనం నడవాలి.
  • అంతేకాక, మన నీడ సంసారులకు తాకకుండా,  సంసారుల నీడ మనకు తాకకుండా జాగ్రత్త పడాలి.
  • భగవత్ / భాగవత అరాధానం కోసం ముడి సరుకుల సేకరణకై వెళ్ళినపుడు, బ్రహ్మ, రుద్రులను ఆరాధించే వారి నివాసాలకు దగ్గరగా వెళ్ళకూడదు. వారి నివాసాలు స్మశానంతో సమానమని శాండిల్య స్మ్రుతిలో వివరించబడింది.
  • దేవతాంతరం ఆరాధనలో ఉపయోగించే పదార్థాలను తాకుట గానీ తొక్కుట గానీ అశౌచంగా భావిస్తారు, చేయకూడదు.
  • పాశండుల ( అవైష్ణవులు, భగవానుని ప్రశంసలను వ్యతిరేకించేవారు) యొక్క సాంగత్యంలో ఉండకూడదు.
  • ప్రయాణాల్లో మనకు తోడుగా వచ్చిన శ్రీవైష్ణవుల పట్ల కృతజ్ఞత భావం చూపాలి. వారిని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయుట ఒక అడ్డంకి.
  • శ్రీవైష్ణవుల పంపుతున్నప్పుడు, వారిని కొంత దూరం వరకు వెళ్లి, మన కనుచూపు మేర నుండి అదృశ్యమయ్యే వరకు ఉండి రావాలి. మన గుమ్మం వద్దనే వారిని పంపుట సరైన పద్దతి కాదు. అనువాదకుని గమనిక: సాధారణంగ మన పెద్దవాళ్ళు శ్రీవైష్ణవులను, ఊరి పోలిమేరుల్లో ఉన్న నది లేదా సరస్సు దాకా పంపి రమ్మనేవారు.
  • ఆచార్యులు లేదా శ్రీవైష్ణవులు మన వైపు వస్తున్నపుడు, మనం వారి దగ్గరకు వెళ్ళి స్వాగతించాలి. మనం ఉన్నదగ్గరే ఉండి లేదా వారిని స్వాగతించకుండా కూర్చొని ఉండుట సరైన వైఖరి కాదు.
  • సంసారులను వ్యవహరించేటప్పుడు వారిని స్వాగతించేటప్పుడు లేదా వారిని పంపించేటప్పుడు మితిమీరిన శ్రద్ధ వహించడం అనవసరం.
  • ఆర్ధిక లాభాల కోసం సంసారుల గృహాలకు వెళ్ళకూడదు.
  • దివ్య దేశములను “ఉగంతు అరుళిన నిలంగళ్” – భగవానుడు గొప్ప కరుణతో ఇక్కడకి దిగివచ్చారు – ఈ ఆలయాలు ఆళ్వారుల చేత ప్రసంసించబడిన / మహిమపరచబడిన దేవాలయాలు. ఆచార్యులకు కొన్ని క్షేత్రాలపై ప్రత్యేకమైన అనుభందం ఉంది – వీటిని అభిమాన క్షేత్రాలు అని పిలుస్తారు (శ్రీ రామానుజుల వారు తిరునారాయణపురంపై ఎక్కువ అభిమానం చూపేవారు, మణవాళ మాముణులు రాజమన్నార్ కోయిళ్ పై ఎక్కువ అభిమానం చూపేవారు, మొదలైనవి). అలాంటి క్షేత్రాలకు వెళ్లినప్పుడు, భగవంతుని పూజించి, మహిమపరచడంలో సమయాన్ని గడపాలి.  ఆ క్షేత్రాలలో అటూ ఇటూ చుట్టూ ఒట్టిగా తిరుగుట సరైన వైఖరి కాదు. అనువాదకుని గమనిక: తీర్థ యాత్రల (పవిత్ర తీర్థయాత్రలు) యొక్క ఉద్దేశమే, ఎమ్బెరుమానుని పూజించుట, ఇతర శ్రీవైష్ణవుల సాంగత్యం పొందుట.
  • దేహ బంధువుల ఇండ్లకు  పండగలకు / సంబరాలకు వెళ్లడం.
  • ఆత్మ భందువులైన శ్రీవైష్ణవుల యొక్క పూజలు / పండుగలకు వెళ్ళకుండా నిర్లక్ష్యం చేయుట – కైంకర్య పరంగా పూర్తి అంకిత భావంతో ఉన్నవారు.
  • ఎమ్బెరుమాన్ ప్రతి ఒక్కరిలో అంతర్యామి స్వరూపంగా  ఉన్నాడు. కాబట్టి, మనం అనవసరంగా గబగబగా  నడిచి, అంతర్యామి  ఎమ్బెరుమాన్ని కలవర పరచకూడదు. నడకను నెమ్మదిగా ఉంచాలి. అనువాదకుని గమనిక:  ప్రహ్లాదుని పర్వతంపై నుండి క్రిందకు  పడవేసినపుడు,  అతను తన హృదయంలో ఉన్న ఎమ్బెరుమానునికి ఎటువంటి కుదుపు ఉండకూడదని తన హృదయాన్ని గట్టిగా పట్టుకున్నాడని ప్రహ్లాద చరితంలో చెప్పబడింది. అలాగే మన వైఖరి కూడా ఉండాలి.
  • ఎల్లపుడు నిరంతరం మనం సదాచార్యులతో (నిజమైన ఆచార్యులు – పంచ సంస్కారం చేయువారు లేదా భగవత్ విషయంలో విలువైన జ్ఞానాన్ని ఉపదేశించేవారు) ఉండి వారికి సేవలందించాలి. మణవాళ మామునులు ఈ సిద్ధాంతాలను ఉపదేశ రత్న మాల 64, 65 మరియు 66 పాసురాలలో చాల అందంగా వివరించారు. దయచేసి వాటిని చదివి స్పష్టంగా అర్థం చేసుకోండి.అనువాదకుని గమనిక:  65 వ పాసురంలో, మణవాళ మామునులు వివరిస్తూ అన్నారు, శిష్యుల (జీవాత్మ / ఆత్మ) బాగోగులు ఆచార్యుల బాధ్యత, అలాగే ఆచార్యుల యొక్క శారీరక అవసరాలు చూసుకోవడం శిష్యుని బాధ్యత, ఇంకా వివరిస్తూ ఈ సూత్రం పూర్తిగా అర్థం చేసుకొని అమలు చేయడం చాలా కష్టమని వివరించారు. 66వ పాసురంలో, మణవాళ మామునులు వివరిస్తూ, పింభళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళై వారి యొక్క అత్యున్నతమైన శిష్యులని వారు నిరంతరం నంపిళ్ళై వారికి సేవలు అందించే వారని ఇంకా వారి ఆచార్యుల సేవ కోసం వారు పరమపదాన్ని కూడా త్యజించారని వివరించారు. వారి హృదయాన్ని ఈ ఉద్దేశ్యాన్ని నిష్ఠగా అనుసరించమని నిర్దేశించారు.
  • భగవత్ / భాగవత కైంకర్యం కాకుండా ఇతర లౌకిక లాభాలకై ఎవరి వెనుకా వెళ్ళకూడదు.
  • సదాచార్యులకు (నిజమైన ఆచార్యులు) పూర్తి అధీనులై  ఉండాలి – ఆచార్యులు వెళ్ళమన్నపుడు వెళ్ళాలి రమ్మన్నపుడు రావాలి –  ప్రశ్నించడం గానీ / నిరాకరించడం గానీ ఉండకూడదు – సదాచార్యులను గుడ్డిగా అనుసరించాలి.
  • ఊరేగింపు సమయంలో దివ్య ప్రబంధ గోష్ఠి (సాముహిక పఠనం) లో ముందుకి వెళ్లాలని ప్రయత్నించకూడదు – ఎల్లప్పుడూ వినయంగా వెనుక ఉండాలి.  సంకోచించకుండా వెనుక పంక్తులలో నడవాలి.
  • అటువంటి గోష్ఠి సమయంలో వేగంగా నడివ లేని వారికి సహాయం చేయాలి. సహాయం అవసరమైన వారిని నిర్లక్ష్యం చేయుట ఒక అడ్డంకి.
  • ఆచార్యులకు సహాయం చేస్తున్నప్పుడు, గౌరవప్రదంగా అభిమానంతో చేయాలి. ఆశ్రద్దగా చేయకూడదు.
37. స్థితి విరోధి  –  మనం ఉంటున్న విధానంలో అవరోధాలు (మరియు ప్రవర్తన)
స్తితి అంటే ఉనికి మరియు కూర్చోవటం అని అర్థం. ఈ అంశం విభిన్న పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో వివరిస్తుంది. సంసారి అనగా వారి నిజమైన స్వభావం ( భగవాన్ మరియు భాగవత దాసులు) గురించి తెలియని వారు. ప్రధానంగా వారి దృష్టి ఎప్పుడూ మంచి ఆహారం, మంచి వస్త్రాలు, మొదలైన వాటిపై  ఉంటుంది. ఈ అంశంపై అడ్డంకుల గురించి తెలుసుకుందాం.
  • సంసారుల ధరించిన దుస్తులను తాకుట. అనువాదకుని గమనిక: ఈ అంశానికి సంభందించిన భట్టర్ జీవితంలోని ఒక సంఘటన గురించి ఇది వరకే చర్చించాము, ఇక్కడ ఒక దేవతాంతర భక్తుని వస్త్రం భట్టర్ని తాకితే అప్పుడు ఒక భాగవతుని యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి వారు  ప్రాయశ్చిత్తము చేసుకుంటారు.
  • సంసారులు కూర్చున్న ఆసనం లేదా సమానమైన ఆసనముపై కూర్చొనుట.
  • మన వస్త్రాలు శ్రీవైష్ణవులకు తాకుట. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులకు దగ్గరగా ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలి వారిని తాకకూడదు. కొన్ని సందర్భాలలో వారు ఎమ్బెరుమాన్, ఆచార్యులు, భగవతాల కైంకర్యం మధ్యలో ఉండి ఉండవచ్చు. కొన్నిసార్లు మనం అపవిత్రగా ఉండి ఉండవచ్చు – కాబట్టి మనం శ్రీవైష్ణవులను తాకి వారిని అపవిత్రం చేయకూడదు.
  • ఇతర శ్రీవైష్ణవులకు సమానంగా మనని పరిగణించుట మరియు శ్రీవైష్ణవులతో సమాన ఆసనంలో కూర్చునట. అనువాదకుని గమనిక: శ్రీవాచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యుల చేత గుర్తించబడిన ప్రధాన అపచారం ఏమిటంటే, తమని తాము ఇతర శ్రీవైష్ణవులకు సమానంగా భావించుట. ఎప్పుడూ వినయంగా ఉండి ఇతర శ్రీవైష్ణవుల కన్నా  తమని తాము తక్కువగా భావించాలి.
  • సంసారులను మనకన్నా ఎక్కువగా భావించి వారి కంటే తక్కువ స్థానంలో క్రింద కూర్చోకూడదు. అనువాదకుని గమనిక: సంసారులు అనగా మన శారీరక అనుబంధాలను, అనురాగాలను అనేక రకాలుగా పెంచేవారు. ఏదేమైనా సంసారుల ప్రశంసించుట, వారిపై ఆధారపడుటలో జాగ్రత్తగా ఉండాలి. అది క్రమేణా లౌకిన వస్తువులపై మన ప్రీతిని పెంచి చివరికి ప్రమాదకరమైన ఈ సంసారంలో  జన్మ మృత్యు  చక్రంలో చిక్కుకొని ఉండిపోతాము.
  • సంసారులు నివసించే ఇంట్లో ఉండకూడదు.
  • లౌకిక ప్రయోజనాలు పొందడం కోసం సంసారుల రాకకై ఆత్రుతగా వేచి ఉండకూడదు.
  • సంసారుల సాంగత్యంలో ఉండకూడదు.
  • సంసారుల నిండి ఉన్న ప్రదేశంలో ఉండరాదు (నివసించరాదు).
  • శ్రీవైష్ణవులకు తక్కువ స్థానంలో కూర్చొనుటకు నిరాకరించడం. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులతో పోల్చినప్పుడు క్రింద స్థానంలో కూర్చొనుటకు సంతోష పడాలి.
  •  శ్రీవైష్ణవుల నివసిస్తున్నఇంట్లో ఉండటానికి సంకోచించుట.
  •  శ్రీవైష్ణవుల రాక కోసం ఆత్రుతగా ఎదురు చోడటానికి సిగ్గుపడుట.
  •  శ్రీవైష్ణవుల సాంగత్యంలో ఉండటానికి ఇష్టపడక పోవుట.
  •  శ్రీవైష్ణవుల నిండి ఉన్నస్థానంలో నివసించుటకు ఇష్టపడక పోవుట.
  • ఆచార్యులు లేదా ఎమ్బెరుమాన్ ఊరేగింపు సమయములో ఇంట్లో ఉండుట మరియు ఇంటి బయటవెళ్ళుట. అనువాదకుని గమనిక: దివ్య దేశాలు మొదలైన ప్రదేశాలలో, దేవాలయంలో చుట్టుపక్కల మాఢవీధుల్లో భగవానుడు ఊరేగింపులో వస్తారు.  భగవానుడు యొక్క గొప్ప కరుణతో ప్రతి ఒక్కరిపై కృపను వర్షించాలనే ఉద్దేశ్యంతో  ఆలయం నుండి బయటికి వస్తారు.   (వృద్ధులు, వ్యాధి గ్రస్తులు, వైకల్యం ఉన్నవారు, ఆలయానికి రాలేనివారు). ఎమ్బెరుమాన్ ఊరేగింపుగా బయలుదేరినపుడు, వారు రాక ముందే ఇంటి బయటికి వెళ్లి వేచి ఉండి, స్థానిక ఆచారాల ప్రకారం (తగిన పండ్లు పువ్వులు మొదలైనవి) సామగ్రితో వారిని స్వాగతించాలి.
  • ఆచార్యులను మరియు శ్రీవైష్ణవులను చూసినప్పుడు వెంటనే లేచి ప్రణామం చేసి స్వాగతించాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • దీనికి భిన్నంగా, సంసారులు వచ్చినపుడు, వారు బాగా శ్రీమంతులైనప్పటికినీ, వాటిని గడ్డిపోస (యోగ్యమైనది కానిది) తో సమానంగా పరిగణించాలి, మరియు వారికి గొప్ప స్వాగతం ఇవ్వడం మానుకోవాలి.  అనువాదకుని గమనిక:  “యోనిత్యం అచ్యుత …” ఎమ్బెరుమానార్ తనియన్ను గుర్తుచేసుకోవాలి, ఎమ్బెరుమానార్ ఒక్క భగవానుని యొక్క చారణ కమలాల తప్ప మిగిలిన అన్నింటికీ గడ్డిపోసతో సమానంగా భావించేవారు.
  • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల రాకను సాధారణంగా భావించుట. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవుల రాకకు సంతోషించి వారికి జాగ్రత్తగా సత్కారాలు నిర్వహించాలి.
  • ఎమ్బెరుమాన్ తిరువారాధన సమయంలో శ్రీవైష్ణవులు వస్తే, తిరువారాధనం ఆపి, శ్రీవైష్ణవులను స్వాగతించి కూర్చోపెట్టి సపర్యలు చేసి తిరిగి  తిరువారాధనం కొనసాగించాలి. తిరువారాధనం కారణంగా శ్రీవైష్ణవులను వేచి ఉంచకూడదు. భగవత్ ఆరాధనం కన్నా భాగవత ఆరాధనం ఎంతో ముఖ్యం అని అర్థం చేసుకోవాలి.
  • ఒక శ్రీవైష్ణవుని వద్ద  శ్రీపాద తీర్థం తీసుకుంటున్న సమయంలో మరొక శ్రీవైష్ణవుడు వస్తే, మొదటి శ్రీవైష్ణవుని వద్దనుండి శ్రీపాద తీర్థం  స్వీకరించుట ఆపకూడదు. అప్పుడే   వచ్చిన శ్రీవైష్ణవుని  నుండి క్షమాపణ అడిగి, కొద్దిసేపు వేచి ఉండమని అతనిని కోరి, శ్రీపాద తీర్థం  స్వీకరణ క్రమం ముగించి రెండవ శ్రీవైష్ణవుని నుండి కొనసాగించాలి.
  • శ్రీపాద తీర్థం ఇస్తున్న శ్రీవైష్ణవులు కూడా సరైన శైలిలో సహకరించాలి మరియు అర్థాంతరముగా వదిలివేయకూడదు.
  • జంగమ విమానం అనగా కదిలే వస్తువు అని అర్ధం – ఉత్సవాల సమయంలో కనిపించే వహానాలు మరియు శ్రీవైష్ణవులు (వారి హృదయాల్లో ఎమ్బెరుమానుని భరించేవారు) రెండింటిని సూచిస్తుంది. అజంగమ విమానం అంటే స్థిరమైన వస్తువు – ఆలయ గోపురం. స్థిర మరియు అస్థిరమైన విమానాలు రెండింటి నీడపైన కాలు పెట్టరాదు.
  • దేవతాంతర దేవాలయాల నీడ గానీ ఆలయ గోపుర నీడ గానీ మన మీద పడకుండా నిలబడాలి.
  • దేవతాంతరులకు ప్రియమైన చెట్ల నీడలో నిలబడకూడదు (ఉదాహరణకు వేప చెట్టు). నమ్మాల్వారికి ప్రియమైన చింత చెట్టు యొక్క నీడలో ఉండుట శ్రేష్టం.
  • దేవతాంతరులు ఆధిపత్యం ఉన్న స్థలాలలో మరియు వారికి ప్రియమైన ఆ స్థలాలలో ఉండకూడదు.
  • భాగవతుల గృహాలను నిర్లక్ష్యం చేసి అభాగావతుల (శ్రీమన్నారాయణునికి అంకిత భావం లేనివారు) వద్ద ఉండుట సబబు కాదు. అభాగావతుల వద్ద ఉండట మానుకోవడం ఉత్తమం. అనువాదకుని గమనిక: మహాభారతంలోని ఒక ప్రసిద్ధ సంఘటన నుండి ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్ళినప్పుడు, వారు దుర్యోధన, భీష్మ ఇంకా ద్రోణాచార్యుల వద్ద కాక విదురుని భవనంలో బస  చేస్తారు.  విదురుడు, భగవానుని గొప్ప భక్తుడు, వారి రాకకు ఎంతో సంతోషిస్తారు. ఈ విషయం గురించి శ్రీకృష్ణుని దుర్యోధనుడు అడిగినపుడు, ఎమ్బెరుమాన్  సమాధానంగా “పాండవులు నాకు చాలా ప్రియమైన వారు కాబట్టి, వారికి విరుద్ధంగా ఉన్న వారి వద్దకు నేను వెళ్ళలేను.” – ఎమ్బెరుమాన్ తాను స్వయంగా భాగవతుల వద్ద బస ఉండి ఈ సిద్ధాంతాన్ని స్పష్టంగా వివరించారు.
  • ఆచార్యులు నిలబడి ఉన్నప్పుడు, శిష్యులు కూర్చుని ఉండకూడదు.
  • ఆచార్యులు నడుస్తున్నపుడు, శిష్యులు కూర్చుని ఉండకూడదు. ఆచార్యులతో కలిసి నడిచి వారికి అవసరమైన సహాయం చేయాలి.
  • ఆచార్యులు శిష్యుని నిలబడమని ఆదేశిస్తే, నిరాకరించుట అనుచిత వైఖరి.
  • భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల దిశ వైపుగా కాళ్ళు చాచుట సరైన వైఖరి కాదు.
  • దేవాలయాలలో కూడా, శ్రీవైష్ణవులు వచ్చినప్పుడు, లేచి నిలబడి వారిని గౌరవించాలి. వారు దేవాలయాలలో ప్రవేశించుట చూసి కూడా కూర్చుని ఉండటం సరికాదు.
  • భగవాన్ మరియు భాగవతుల (దేవాలయాలలో మొదలైనవి) సమక్షంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోకూడదు. ఎమ్బెరుమాన్, వారి దివ్య సమూహం, ఆ దివ్య సమూహ సౌందర్యం, అద్భుతమైన భాగవతల ఉనికిని పూర్తిగా ఆస్వాదించాలి. భట్టార్ జీవితంలో ఒక సంఘటనను సూచిస్తూ, ఎమ్బెరుమాన్ ముందర కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న ఒకరిని భట్టార్ గమనిస్తారు, అతని అజ్ఞానానికి విచారించి అతను అద్భుతమైన ఎమ్బెరుమానుని దర్శనం  కోల్పోతున్నాడని ఆ వ్యక్తికి  చెబుతారు. తర్వాత ఆ వ్యక్తి తన కంటి చూపును కోల్పోయాడని కూడా చెప్పబడింది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : https://granthams.koyil.org/2014/01/virodhi-pariharangal-8/

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

 

Leave a Comment