విరోధి పరిహారాలు – 15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/08/06/virodhi-pariharangal-14-telugu/ .

46. సేవ  విరోధి – ఎమ్పెరుమాన్ ఆరాధనలో అవరోధాలు

శ్రీవైష్ణవ పరిభాషలో సేవకి అనేక అంశాలు ఉన్నాయి. సాధారణంగా పెరుమాళ్ళని దర్శనం చేసుకోవటాన్ని, అంటే వారిని చూచుటను సేవ అంటారు. దండవత్ ప్రణామాలు (సాష్టాంగ నమస్కారాలు) సమర్పించడం, అంజలి (నమస్కారం) జోడించడం కూడా సేవ అంటారు. పాసుర పఠనం, గ్రంథాలను చదవడం కూడా సేవగా గుర్తించవచ్చు . సంగ్రహంగా చెప్పాలంటే, సాంప్రదాయకంగా, ఏ రకమైన కైంకార్యమైనా సేవ అంటారు. అనేక విభిన్న అంశాలు – ప్రధానంగా ఆలయంలో ఎమ్పెరుమాన్ ఆరాధనకు సంబంధించినవి ఈ శీర్షికలో వివరించబడ్డాయి.

పెరియ పెరుమాళ్ – శ్రీరంగం
ఆళ్వార్
ఆచార్యుల మధ్య ఎమ్పెరుమానార్
  • దివ్య దేశాలు, అభిమాన  స్టలములు మొదలైన వాటి యాత్రకు వెళ్లేటప్పుడు, (ప్రధానంగా అర్చావతార) ఎమ్పెరుమాన్ తో సంబంధం లేని ఇతర ప్రదేశాలకు వెళ్ళకూడదు. మనం అలాంటి ప్రదేశాలకు ఒకవేళ వెళ్ళవలసి వచ్చినప్పుడు, అటువంటి ప్రదేశాల యొక్క ప్రత్యేక లక్షణాలను విస్మరించాలి. మన మనస్సు భగవత్ విషయం (భగవాన్కు సంబంధించిన విషయాలు) పై మాత్రమే పెట్టాలి, ఇంక దేనిపైన కాదు. అనువాదకుల గమనిక: ఈ రోజుల్లో, దివ్య దేశాల యాత్రకు వెళ్లేటప్పుడు, ప్రజలు సమీప పర్యాటక ఆకర్షణలు, మార్కెట్లు, కొనుగొళ్ళు మొదలైనవాటికి కూడా వెళ్ళుతున్నారు. దివ్య దేశ యాత్రలకు వెళ్లేటప్పుడు అలాంటి చర్యలలో పాల్గొనకపోవడమే మంచిది. ప్రతి ఒక్కరినీ ఉద్ధరించాలనే గొప్ప సంకల్పముతో ఎమ్పెరుమాన్ స్వయంగా అర్చావతార రూపంలో అవతరించిన ప్రదేశాలు దివ్య దేశాలు. ఇక్కడ ఎమ్పెరుమాన్,  సౌలాభ్యం (సులభంగా ప్రాప్యత) మరియు కృపను అభివ్యక్తం చేస్తున్నారు. అటువంటి దివ్య దేశాల యొక్క కీర్తిని గ్రహించి, ఆళ్వార్ల పాసురాలతో, ఆచార్యల స్తోత్రములతో ఎమ్పెరుమాన్కి మంగలాసాసనం చేయడంపై పూర్తి దృష్టి పెట్టాలి.
  • దేవాలయాలు మరియు గోపురాలు చూసినప్పుడు, అది మొదట ఎమ్పెరుమాన్ ఆలయమా / గోపురమా కాదా అని విచారణ చేయాలి. అవి ఇతర దేవతలు లేదా అవైధిక విశ్వాసాలు సంబంధించిన దేవాలయాలు అయితే, మర్యాద సమర్పణ చేయవలసిన అవసరం లేదు. ఎమ్పెరుమాన్ ఆలయమా / గోపురమా కాదా అని విచారణ చేయకుండా పొరపాటున మర్యాదలు సమర్పిస్తే, అలాంటి సంధర్భంలో తప్పుకు పశ్చాత్తాపపడి శుద్ధి చేసుకోవాలి. ఈ సంధర్భంగా, తిరువాయ్మొళి 4.6.6కి నాంపిల్లై వారు ఇచ్చిన ఈడు వ్యాఖ్హ్యానంలో గుర్తించబడిన ఈ క్రింది సంఘటనను మనం గుర్తు చేసుకోవచ్చు. వాణ్డర్ మరియు చొణ్డర్ (పిళ్ళై ఉఱంగా విల్లి దాసు యొక్క మేనల్లుళ్ళు) ఉఱైయూర్ రాజు (అకళంగ నాట్టాళ్వాన్) కు రక్షక బఠులుగా పనిచేస్తుండేవారు. ఒకసారి వాళ్ళు రాజుతో కలిసి నడుస్తున్నప్పుడు, వారు ఒక జైన దేవాలయాన్ని చూశారు (నిర్మాణాత్మకంగా విష్ణు ఆలయానికి సమానంగా కనిపిస్తున్నది). వారిని పరీక్షించాలనుకుంటున్న రాజు, “చూడండి, అక్కడ పెరుమాళ్ ఆలయం ఉంది! నమస్కారం చేయండి” అని చెబుతాడు. ఇది విన్న వారు చటుక్కున క్రింద పడి పూర్తి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ ఘోరమైన పొరపాటు చేశామని వారు గ్రహించి – మూర్ఛపోతారు. అందరూ అవాక్కైపోతారు, రాజు తన సిబ్బందిని  పిళ్ళై ఉఱంగా విల్లి దాసును తీసుకురమ్మని పంపుతారు. ఉఱంగా విల్లి దాసులు ఆ స్థలానికి చేరుకుని ఏమి జరిగిందో వింటారు. వారు తన చరణ కమలాల ధూళిని వారి నుదుటిపైన పూస్తే వెంటనే ఇద్దరూ స్పృహలోకి వస్తారు. ఈ విధంగా, దేవతాంతరముల  ఆరాధనకు సంబంధించి ఏదైనా పొరపాటు జరిగితే , శ్రీవైష్ణవుల యొక్క శ్రీపాద ధూలి (చరణ కమలాల ధూళి) ని స్వీకరించడం ద్వారా శుద్ధి కావచ్చని మనం అర్థం చేసుకోవచ్చు.
  • ఎమ్పెరుమాన్ యొక్క దేవాలయాలు లేదా గోపురాలను చూసినపుడు, వెంటనే గొప్ప ఆనంద అనుభూతి చెందాలి, నమస్కారాలు చేయాలి, వాహనాల నుండి దిగాలి (ఒక వేళ ప్రయాణం చేస్తుంటే) చెప్పులు / బూట్లు విప్పాలి (ఒక వేళ వాటిని ధరిస్తే). అలా చేయకపోవడం గొప్ప నేరం.
  • చెప్పులు / బూట్లతో దివ్య దేశములలోకి ప్రవేశించుట. కనీసం, ఆలయం ఉన్న వీధిలోకి ప్రవేశించే ముందు చెప్పులు / బూట్లు విప్పాలి.
  • ప్రవేశద్వారం వద్ద గడపకి నమస్కారం చేయకుండా ఆచార్యులు, శ్రీవైష్ణవుల యొక్క తిరుమాళిగ (నివాసం) లోకి ప్రవేశించకూడదు.
  • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల తిరుమాళిగ (ల) కి వెళ్ళకుండా నేరుగా ఎమ్పెరుమాన్ ఆలయానికి వెళ్ళడం. ఆచార్యుల నివాసం ఆలయానికి సమీపంలో ఉన్నట్లైతే, అక్కడకు వెళ్లి, ఆచార్యులను మరియు ఆచార్యుల తిరువారాధన ఎమ్పెరుమాన్ ని ఆరాధించిన తరువాత మాత్రమే, ఆలయానికి వెళ్లాలి. అనువాదకుల గమనిక: మనకు  ఎమ్పెరుమాన్ ని చూపించేవారు ఆచార్యులు. శ్రీవైష్ణవులు మనలను ఆచార్యులవైపు మార్గనిర్దేశం చేసి, ఎమ్పెరుమాన్ గురించి గొప్ప సూత్రాలను వివరిస్తారు. కాబట్టి, ఎమ్పెరుమాన్ని ఎల్లప్పుడూ ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల ద్వారా సమీపించాలి, స్వతంత్రంగా ఎప్పుడూ సమీపించకూడదు. నమ్మాళ్వార్ ఈ విషయాన్ని తిరువాయ్మొళి 4.6.8 లో ఇలా అన్నారు “వేదం వల్లార్గళై క్కొండు విణ్ణోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు” – వేదంలో నిపుణులైన శ్రీవైష్ణవుల ద్వారా నిత్య సూరులకు యజమాని అయిన ఎమ్పెరుమాన్ కమల పాద పద్మాలను ఆరాధించండి.
  • ప్రవేశద్వారం వద్ద సాష్టాంగ నమస్కారాలు సమర్పించకుండా ఆలయంలోకి వెళ్ళకూడదు.
  • ఉత్తరీయంతో నడుం పై భాగం కప్పుకొని ఆలయంలోకి ప్రవేశించుట. అనువాదకుల గమనిక: మనల్ని దాసులు (ఎమ్పెరుమాన్ సేవకులు) అని పిలుస్తారు. దాసులు ఎప్పుడూ నడుము వస్త్రాంతో ఛాతీని కప్పి ఉంచకూడదు (కనీసం యజమాని ముందు). కేరళ దేవాలయాలలో ఈ సూత్రాన్ని ఇప్పటికీ ఆచరణలో చూడవచ్చు, అక్కడ పురుషులు ఆలయంలోకి ప్రవేశించే ముందు చొక్కాలు తీసివేస్తారు మరియు మహిళలు సాంప్రదాయ దుస్తులతో (చీరలో) మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు. వానమామలై (తోతాద్రి), వంటి కొన్ని పాండ్యనాడు దివ్య దేశాల (దక్షిణ) లో కూడా ఇది ఆచరణలో చూడవచ్చు.
  • ఎమ్పెరుమాన్ మరియు బలి పీఠం (పరివార దేవతలకు మొదలైన వారికి సమర్పణలు ఇచ్చే ప్రదేశం) మధ్యలో ప్రవేశించకూడదు.
  • అప్రదక్షిణ  (సవ్యదిశకి వ్యతిరేకంగా) పద్ధతిలో ఆలయంలోకి ప్రవేశించుట. సన్నిధులకు సవ్యదిశలో వెళ్ళాలి.
  • ప్రధాన సన్నిధి (గర్భగుడి) బయట ఉన్న మెట్టుపై నడవడం / అడుగు పెట్టడం సరైన మర్యాద కాదు. పెరుమాళ్ తిరుమొళి 4.9 లో తిరుమల వేంకటేశ్వరునితో కులశేఖర ఆళ్వార్ ఈ మాటలు చెప్పడం మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు  “పడియాయ్ క్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – నీ సన్నిధి వద్ద మెట్టు (గడప) లా మారి సంతోషంగా ముత్యం లాంటి నీ ముఖాన్ని ఆరాధిస్తాను.
  • ఆలయం చుట్టూ ఉన్న వివిధ సన్నీధులను ఆరాధించకుండా నేరుగా ములావిరాట్టు (ప్రధాన) సన్నీధికి వెళ్ళకూడదు. సాధారణంగా తాయార్ సన్నిధి, ఆళ్వారుల / ఆచార్యుల సన్నిధి, మొదలైనవి ప్రధక్షిణంలో ఉంటాయి. ఆలయ ప్రధాన సన్నీధిలోకి ప్రవేశించే ముందు వీరందరినీ మొదట సేవించాలి. అనువాదకుల గమనిక: పూర్వ దినచర్య 23 వ స్లోకంలో ఎఱుంబి అప్పా ప్రతిరోజూ శ్రీరంగం ఆలయంలో మాముణులు మంగళసాసనం చేసే క్రమాన్ని వివరించారు. “దేవి గోదా యతిపతి సటద్వేశిణౌ రంగసృంగం సేన నాతో విహగ వృషబః స్రీనిధి స్సింధుకన్యా భూమా నీలా గురుజనవృతః పూరుషచ్చేత్యమీషం అగ్రే నిత్యం వరవర మునేరంగ్రియుగ్మం ప్రపధ్యే”  – ప్రతిరోజూ, నేను మణవాళ మాముని యొక్క చరణ కమలాలను ఆండాళ్ నాచియార్, ఎమ్పెరుమానార్, నమ్మాళ్వార్, శ్రీరంగ విమనం, విశ్వక్సేనులు, గరుడ ఆళ్వార్, శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్యమైన శ్రీరంగనాథుడిని ,  ఆళ్వారులు / ఆచార్యలు శ్రీ భూ నీళా సమేత పరమపదనాథు (పరమపదనాథుని సన్నీధిలో)ని సమక్షంలో ఆరాధిస్తాను.  ఈ శ్లోకంలో ఎఱుంబి అప్పా  శ్రీరంగ ఆలయం మరియు వివిధ సన్నిధుల వరుసను చిత్రీకరణ చేసారు. మన సాంప్రదాయంలో మనం మొదట ఆచార్యలను, ఆళ్వర్లను, తాయార్ని ఆరాధించిన తరువాత ఎమ్పెరుమాన్ సమీపిస్తాము.
  • దేవాలయం యొక్క దివ్య విమానం (గోపురం) నీడలపై అడుగు పెట్టడం ఒక అడ్డంకి – ఎప్పుడూ అలా చేయకూడదు.
  • దివ్య  ద్వారపాలకుల (జయ / విజయులు) అనుమతి తీసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించడం సరైనది కాదు. సన్నీధిలోకి ప్రవేశించే ముందు, తిరుప్పావై 16 వ పాసురమును  “నాయగనాయ్ నిన్ఱ” పఠించాలి – ఈ పాసురంలో, ఆండళ్ నాచియార్, ఎమ్పెరుమాన్ యొక్క సన్నీధిలోకి ప్రవేశించే ముందు ద్వార పాలకుల అనుమతి పొందెందుకు సరైన మర్యాదను మనకు ఏర్పాటు చేసారు. అనువాదకుల గమనిక: మన ఇంట్లో పెరుమాళ్ తిరువారధనం ప్రారంభించడానికి ముందు, ఈ పాసుర పారాయణం చేసిన తరువాత, ఆపై కోయిల్ ఆళ్వార్ (పూజ గది) తలుపులు తెరవాలి.
  • విశ్వక్సేనుల అనుమతి తీసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: విశ్వక్సేనులు పరమపదంలో భగవాన్ యొక్క ముఖ్య కార్య నిర్వాహకులు మరియు ప్రధానమైన నిత్యసూరులు (భగవాన్ యొక్క సహచరులు) కూడా. మన గురుపరంపరలో కూడా ఉన్నారు, మన గురుపరంపర క్రమం ఇలా ఉంటుంది: పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టి, విశ్వక్సేనులు, నమ్మాళ్వార్, నాథమునులు, మొదలైనవారు …. మాణవాళ మాముణులు వరకు. కాబట్టి, ఎమ్పెరుమాన్ సన్నిధి లోకి ప్రవేశించే ముందు అతని అనుమతి తీసుకోవడం సముచితం.
  • మనం ఎప్పుడూ మన ఆచార్యల ద్వారా ఎమ్పెరుమాన్ ని సమీపించాలి. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమాన్తో మన శాశ్వతమైన సంబంధాన్ని గుర్తుచేసిన వ్యక్తి ఆచార్య. మనం ఎల్లప్పుడూ వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి మరియు ఎప్పుడూ మన ఆచార్యల ద్వారా ఎమ్పెరుమాన్ ని సమీపించాలి. మన ఇంటి పెరుమాళ్లకు తిరువారాదనం చేస్తున్నప్పుడు కూడా, మనల్ని మన ఆచార్య హస్తాలుగా భావించి, ఆచార్యల తరపున తిరువారాధనం చేయాలి.
  • ఏ సిగ్గు లేకుండా సన్నీధికి నేరుగా మధ్యలో ప్రవేశించడం ఒక అడ్డంకి. ఎంతో భక్తితో, వినయంతో పక్కన నుంచి  జాగ్రత్తగా సన్నీధిలోకి ప్రవేశించాలి.
  • కుడి వైపున ఖాళీ ఉన్నప్పుడు, ఎడమ వైపుకు వెళ్లి, ఎమ్పెరుమాన్ను అక్కడ నుండి పూజించడం అడ్డంకి.
  • సంసారుల (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) సమక్షంలో ఎమ్పెరుమాన్ ని ఆరాధించడం ఒక అడ్డంకి. వీలైనంత వరకు చేయకూడదు.
  • ఎమ్పెరుమాన్ ని వారి దివ్య చరణాల నుండి దివ్య ముఖం వరకు నెమ్మదిగా మన నేత్రాలు, హృదయం పూర్తి సంతృప్తి చెందే వరకు పూజించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమాన్ ని ఆరాధించడానికి అత్యంత ఆదర్శవంతమైన ఉదాహరణ తిరుప్పాణి ఆళ్వారులు. వారు అమలానాదిపిరాన్ రచించారు, ఇందులో పెరియ పెరుమాళ్ యొక్క దివ్య శరీర భాగాలను అందంగా వర్ణించారు. చివరిలో, పెరియ పెరుమాళ్ను చూసిన మరియు ఆనందించిన ఈ కళ్ళు మరేదీ చూడలేవని వారు ప్రకటించారు. అలా మన వైఖరి కూడా ఉండాలి.
  • ఎమ్పెరుమాన్ను తిరుపల్లాండు మరియు ఇతర దివ్య ప్రబంద పాసురములతో (దివ్య దేశానికి  ప్రత్యేకమైనవి) మరియు పూర్వాచార్య స్తొత్రాల (పెద్దల నుండి విన్నవి) యొక్క పఠనం / జ్ఞాపకంతో పూజించాలి.
  • భౌతికంగా దృష్టి సారించిన స్లోకములను పఠించకూడదు, భౌతికంగా ఆలోచించే వ్యక్తులు చేసే విధంగా మనం ఆరాధించకూడదు.
  • భౌతిక ప్రయోజనాలను పొందాలనే కోరికతో ఎమ్పెరుమాన్ ని పూజించకూడదు. అనువాదకుని గమనిక:  పొయిగై ఆళ్వార్ ముదల్ తిరువందాది పాసురం 26లో వివరిస్తూ – ” ఎళువార్ తుళాయానై వళువా వగై నినైందు వైగళ్ తొళువార్ వినైచ్ చుడరై నందువిక్కుం వేంగడమే  వానోర్ మనచ్ చుడరైత్ తూణ్డుం మలై” – మూడు రకాల జనులు తిరువెంకటముడయాన్ దగ్గరకు వెళతారు – లౌకిక ప్రయోజనాలు కావాలనుకునే వారు, కైవల్యం కావాలనుకునే వారు మరియు చివరకు శాశ్వత కైంకర్యం కావాలనుకునే వారు. ఈ మూడు రకాల మనుషుల కోసం, తిరుమల కొండ అడ్డంకులను తొలగిస్తుంది (వారు కోరుకున్నది సాధించడానికి). ఇందులో, మనం “ఇన్ తుళాయానై వళువా వగై నినైందు వైగల్ తొళువార్” – ఎమ్పెరుమాన్ ని ఏ దోషం, కళంకము లేకుండా నిరంతరం పూజించేలా ఉండాలి.
  • ఎమ్పెరుమాన్ ని ఆరాధించేటప్పుడు, వారిపై పూర్తి దృష్టి పెట్టాలి. అలా దృష్టి ఉండక పోవడం అడ్డంకి.
  • ఎమ్పెరుమాన్ ని ఆరాధించేటప్పుడు వారి మీదే మనస్సు స్థిరపరచాలి. ఎక్కడా స్థిరంగా ఉండని ఈగ లాగా ఎగురుతూ ఉండకూడదు.
  • దేవాలయాలలో పెరుమాళ్ తిరువారాదనం,   ఎమ్పెరుమాన్ భోగం సమర్పణల తరువాత, బలి పీఠంపైన పరివార దేవతలకు ప్రసాదం ఇవ్వబడుతుంది. ఆ తరువాత సాత్తుముఱై (పాసురముల పూర్తి) జరుగుతుంది. మధ్యలో వదిలి వెళ్ళాకూడదు (అనగా, తిరువారాదనం తరువాత).
  • ధూపం (సుగంధం), దీపం, తిరువందిక్కాప్పు (ధ్రుష్టి దోషాలు నివారించడానికి చేసే హారతి), ఎమ్పెరుమాన్కు భోగం సమర్పించడం మొదలైనవటువంటి ఉపచారము (సేవలు) లను పూర్తిగా గమనించాలి / ఆనందించాలి మరియు తగిన పాసురములను పఠించాలి. అలా చేయకపోవడం, వేరే వాటిపై దృష్టి పెట్టడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  జీయర్ పడి తిరువారాదన క్రమంలో, మాముణులు మన ఇళ్లలో తిరువరాధనం ఎలా నిర్వహించాలో అందంగా వివరించారు. తిరువారాదనం నిర్వహిస్తున్నప్పుడు, శ్రీవైష్ణవులు సాధారణంగా అనేక సమయాల్లో అనేక పాసురములను పఠిస్తారు. తిరుమంజనం (దివ్య స్నానం) సమయంలో, మనం పంచ సూక్తం, పెరియాళ్వార్ తిరుమోళిలోని వెణ్ణెయ్ అళైంత కుణుంగుం పదిగం మొదలైనవి  పఠించాలి. ఎమ్పెరుమాన్ ని అళంకరించే సమయంలో, చందనం సమర్పించే సమయంలో గంధత్వారం(శ్రీ సూక్తం) శ్లోకం, పూసుం చాంతు (తిరువాయ్మొళి) పాసురం పఠించాలి. తిరు ఆభరణాలు మరియు దండలు అర్పించేటపుడు, స్పురత్కిరీటాంగ హరకంటికా (స్తోత్ర రత్నం) శ్లోకం, చూట్టు నన్ మాలైగళ్ (తిరువిరుతం). ధూపం సమర్పణ సమయంలో, పరివతిల్ ఈసనైప్ పాడి (తిరువాయ్మొళి) పారాయణం చేస్తారు. దీపం సమర్పణ సమయంలో, వైయం తగళియా (ముదల్ తిరువంతాది), అన్బే తగళియా (ఇరండం  తిరువంతాది), తిరుక్కాండేన్ (మున్రామ్ తిరువంతాది) పఠిస్తారు. హరతి సమయంలో, ఇందిరణోడు బిరమన్ (పెరియాళ్వార్ తిరుమోళి పదిగం, ఇక్కడ పెరియ ఆళ్వార్ తిరువెళ్ళఱై  పెరుమాళ్పై వారి శ్రద్ధను చూపిస్తుంన్నారు) పదిగాన్నిపఠిస్తారు. దేవాలయాలలో,  ఎమ్పెరుమాన్కు ప్రత్యేకమైన ఉపచారములను సమర్పించేటపుడు, మనము దానిపై సంపూర్ణ దృష్టి కేంద్రీకరించాలి,  ఆ ఉపచారమునకు సంబంధించిన పాసురాలను పఠించాలి.
  • భౌతికవాదమైన నృత్యాలపై మరియు పాటలపై దృష్టి పెట్టి ఎమ్పెరుమాన్ యొక్క అర్చా విగ్రహాన్ని విస్మరించకూడదు.
  • ఆరిపోతున్న దీపాన్ని చూసి (ఎమ్పెరుమాన్/ ఆళ్వార్లు/ ఆచార్యల సన్నిధిలో ) వెంటనే దాన్ని సరిచేసి మరళా వెలిగేలా చేయక పోవడం  ఒక అడ్డంకి. శ్రీవచన భూషణం 382 సూత్రం యొక్క వ్యాఖ్యానంలో లలితా చరిత్రం గురించి దయచేసి చూడండి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణంలో, పిళ్ళై లోకాచార్యులు ఒక పురాణ చరిత్రమును (పురాణాలలో కీర్తించ బడిన సంఘటన) చెబుతున్నారు, ఒక ఎలుక అనుకోకుండా దీపంలో ఒక ఒత్తును గుచ్చుతూ దీపాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఆ ఎలుక మరు జన్మలో  అందమైన కన్యగా జన్మించి ఆమె కాశి రాజును వివాహమాడుతుంది. మునుపటి జన్మలో కర్మ కారణంగా, క్రమేణా ఆమె తరువాత ఎమ్పెరుమాన్ని  దీపాల ఆరాధన చేయుటకు చాలా ఇష్టపడేది. ప్రపన్నులం అయిన మనం, మంచి జన్మ కావాలని కైంకర్యం చేయము, అయినప్పటికీ మనం ఎమ్పెరుమాన్ పట్ల భక్తితో సహజమైన చర్యగా కైంకార్యం చేస్తాము.
  • నేలపై ధూళిని చూసి  (ఎమ్పెరుమాన్ / ఆళ్వార్లు/ ఆచార్యల సన్నీదిలో) వెంటనే శుభ్రం చేయకపోవుట. నమ్మాళ్వార్  తిరువాయ్మొళి 10.2.7 లో “కడైత్తలై చీయ్క్కప్పెత్తాళ్ కడువినై కళైయళామే” – ఆలయాన్ని ఊడవడం తుడవడం ద్వారా మన పాపాలు  తొలుగుతాయి. అనువాదకుల గమనిక: తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ వారి సర్వస్వాన్ని వదులుకొని తిరుక్కణ్ణమంగై భక్తవత్సల ఎమ్పెరుమాన్ సన్నీదిలో శాష్వతంగా ఉండిపోయారన్నది అందరికీ తెలిసిందే.  వారు   ఆలయంలో ఊడ్చే కైంకర్యం ఎంతో ప్రీతిగా క్రమం తప్పకుండా ఆ కైంకార్యం చేసే వారు.  నాచియార్ తిరుమోళి మొదటి లోనే, పెరియవాచాన్ పిళ్ళై చెప్తూ , తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ ఊడ్చే కైంకర్యమే వారి అంతిమ లక్ష్యంగా (ఏదో సాధించడానికి కాదు) నిర్వహించేవారు అని వారిని కీర్తించారు. తిరువాయ్మొళి 9.2.1 వ్యాఖ్హనంలో, నంపిళ్ళై ఒక ముఖ్యమైన అంశాన్ని అందంగా వివరించారు.  ఇక్కడ పాసురంలో, నమ్మాళ్వార్  ఎమ్పెరుమాన్తో  “మేము అనేక తరాల నుండి ఆలయాన్ని శుభ్రపరచడం మొదలైన అనేక కైంకర్యాలు చేస్తున్నాము”. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రపన్నులు పూర్తిగా ఎమ్పెరుమాన్నే ఏకైక ఉపాయంగా స్వీకరిస్తారు.  వ్యక్తిగత ప్రయత్నంలో వారి ప్రమేయం ఉండదు – కాబట్టి అసలు కైంకర్యాలు కూడా ఎందుకు చేయాలి? తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ పాల్గొన్నఈ క్రింది సంఘటన ద్వారా దీనిని నంపిళ్ళై అందంగా వివరించారు. వారి తరగతిలో ఒక సహచరుడు (నాస్తికుడైన) ఆణ్డాన్ను ప్రశ్నిస్తాడు. స్వయం ప్రయత్నం కాకపోతే నేలను శుభ్రం చేయడం , తుడవడం ద్వారా తనను తాను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతాడు. ఆణ్డాన్ అతనికి దుమ్ము ఉన్న ప్రదేశాన్ని మరియు దుమ్ము లేని ప్రదేశాన్ని చూపిస్తారు – మనం చేసిన దానికి ఫలితం ఇది అంతే అని చూపిస్తారు – ఈ స్థలం శుభ్రం అయ్యింది – ఇంకేమీ లేదు అని అంటారు. “శుభ్రమైన ప్రదేశం మరియు మురికి ప్రదేశం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరా?” అని అడుగుతారు. ఈ విధంగా, కైంకర్యం  చేయడం దాస భూతుల (సేవకుని) యొక్క సహజమైన స్వభావం అని మరియు కైంకర్యం  (సేవ) ఉపాయం కాదని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీవచన భూషణంలో, పిళ్ళై లోకాచార్యులు సూత్రం 88 లో అందంగా వివరిస్తూ, “భౌతికంగా నడుచుకునే వ్యక్తి తన కోసం (లేదా అతని ప్రియమైనవారి కోసం) లౌకిక కోరికలను తీర్చడానికి ఎన్నో పనులు చేస్తాడు, అలాంటప్పుడు ఒక ప్రప్పన్నుడికి  ఎమ్పెరుమాన్కి సేవ చేయాలనే కోరిక ఎంత ఉండాలి, పరమానందకరమైన భగవాన్ కి సేవ చేయడమే జీవాత్మ యొక్క నిజమైన స్వభావం సముచితం కూడా” అని అంటారు.
  • ఎమ్పెరుమాన్ ధరించే వస్త్రాలు, తిరు ఆభరణాలు, దండలు మొదలైనవాటిని చూసేటప్పుడు, వాటిని ఎమ్పెరుమాన్ కోసం ఆనందించాలి. “నేను వాటిని ధరిస్తే బాగుంటుంది” అని అనుకోకూడదు.
  • ఎమ్పెరుమానుకి భోగాన్ని సమర్పించే ముందు  నోరూరించుట, ఆపై వాటిని ప్రసాదంగా అందరికీ పంచుట. అనువాదకుల గమనిక: అన్నీ సహజంగానే ఎమ్పెరుమాన్కు చెందినదే, వారు ప్రతిదాన్ని ఆస్వాదించడానికి అర్హుడు. వారు కృపతో, వాటిని స్వీకరించి అవశేషాలను మనకిచ్చి ఆశీర్వదిస్తారు. తన అవశేషాలను మనకిచ్చినందుకు ఎమ్పెరుమాన్కి మనము కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే,  గీతా శాస్త్రములో, ఎమ్పెరుమాన్కి అర్పించకుండా ఏదైనా తినడం అంటే పాపాలను తినడం లాంటిది అని వివరించబడింది. కాబట్టి, ఎమ్పెరుమాన్కి సమర్పించే ముందు వారి కోసం తయారుచేసిన మరియు ఉంచబడిన ఆహారాన్ని చూడటం గొప్ప పాపం.
  • ఈ క్రింద  చెప్పబడినవి ఆలయాల లోపల చేయకూడదు.
    • కాళ్ళు చాచుట – కాళ్ళు  ఎప్పుడూ మడుచుకొని ఉంచుకోవాలి.
    • వస్త్రం (పంచ వగైరా) పైకి మడచ కూడదు – సరైన రీతిలో ధరించాలి.
    • ఆవలించకూడదు.
    • సోమరితనంతో చేతులు/కాళ్ళు చాచకూడదు.
    • తల విదిలించి జుట్టును విరపోసుకోకూడదు.
    • గోర్లను కొరకడం లేదా కత్తిరించుకోకూడదు.
    • తుమ్మడం, ముక్కు చీదుట
    • ఉమ్ముట
    • ఆకూ, వక్కా,పొగాకు మొదలైనవి నములుట చేయకూడదు.
    • శరీరం పైభాగాన్నివస్త్రంతో కప్పకూడదు.
    • నిద్రపోవుట, కునుకు తీయుట
    •  ముచ్చట్లాడుట
    • గట్టిగా నవ్వి చేతులు చప్పట్లు కొట్టకూదడదు
    • గట్టిగా అరిసి ఎవరినీ పిలవకూడదు.
    • ఇతరులను తిట్టుట
    • ఇతరులను కోపగించుట
    • వినమ్రత లేకుండా అహంకరంతో ఉండుట
  • ఆలయం లోపల లౌకిక ఆలోచనల వ్యక్తులతో మాట్లాడటం / చర్చించడం చేసి శ్రీవైష్ణవులను విస్మరించడం ఒక అడ్డంకి
  • భాగవతులను సేవించకుండా భగవన్ని సేవించుట.
  • మన ఆచార్యుల కైంకర్యానికి దూరంగా ఉండటం.  అనువాదకుని గమనిక: ఉపదేశ రత్న మాల 64 వ పాసురం లో మాముణులు  చాలా ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేస్తున్నారు. “ఆచార్యులకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మాత్రమే మన  ఆచార్యులకు సేవ చేయగలము. ఇది గ్రహించిన తరువాత కూడా,  ఆచార్యులకు సేవ చేయకపోతే మనం ఏమి చెప్పగలము?”
  • మనం మన ఆచార్యులకు  నీడలా ఉండి అనుసరించి వారికి ఎప్పుడూ సేవ చేయాలి. ఎంబార్ను “రామానుజ పదచ్ చాయా” గా కీర్తిస్తారు – శ్రీ రామానుజుల యొక్క పాద పద్మాల నీడగా ఉండేవారు. పెరియాళ్వార్  తిరుమోళి చివరి భాగాన్ని (చివరి పాసురం యొక్క చివరి పంక్తి) మనం కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు “చాయై పోలప్ పాడ తాముం అణుక్కర్గళే”. అనువాదకుని గమనిక: ఈ పాసుర వ్యాఖ్యానంలో, పెరియవాచాన్ పిళ్ళై ఒక మంచి సంఘటనను వివరించారు. కొంతమంది శ్రీ వైష్ణవులు ఎంబార్‌ దగ్గరకు వచ్చి ఈ వాక్యానికి అర్ధాన్ని వివరించమని అడుగుతారు. ఈ వాక్యము యొక్క అనువాదం ఇది – “నీడ వలె పాడగలవాడు ఎమ్పెరుమాన్ యొక్క ప్రియమైన సేవకులు” – కానీ ఇది స్పష్టంగా ఆనిపించడం లేదు. ఎంబార్‌  అంటారు “నేను దీని అర్థం ఎమ్బెరుమానార్ నుంచి వినలేదు, ఇప్పుడు వారు తిరుక్కోష్టియూర్ నంబిని కలవడానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను మీకు ఈ విషయం వివరిస్తాను” అని చెప్పి ఎమ్బెరుమానార్ యొక్క పాదుకలను తీసుకొని తన శిరస్సుపై ఉంచి కొంచెము సేపు ధ్యానం చేస్తారు. కొద్దిసేపటి తరువాత వారు కళ్ళు తెరిచి, “ఇప్పుడు ఎమ్బెరుమానార్ దీని యొక్క అర్ధాన్ని నాకు వివరించారు. మీరు వినవచ్చు. దీనిని పాద వల్లార్ – చాయై పోల – తాముం అణుక్కర్గళే, అని తీసుకోవాలి.  అనగా, ఈ పాసురములను పాడగలిగేవాడు, నీడ లాగా అవుతాడు వారికి చాలా ప్రియమైనవాడుగా ఉంటాడు” అని అంటారు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/02/virodhi-pariharangal-15/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment