విరోధి పరిహారాలు – 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/08/25/virodhi-pariharangal-16-telugu/.

48. వందన విరోధి  – నమస్కారం చేయడంలో అవరోధాలు. 

వందనం అనగా సాష్టాంగ నమస్కారం – ఈ సందర్భంలో భూమిని ఎనిమిది అవయవాలతో (2 కాళ్ళు, 2 మోకాళ్ళు, ఉదరము (కడుపు), 2 భుజాలు, 2 చేతులు మరియు నుదురు) తాకినట్టుగా పూర్తి నమస్కారాలు (సాష్టాంగ నమస్కారం) సమర్పించుట. “వైష్ణవో వైష్ణవం ధృష్త్వా దణ్డవత్ ప్రణామేత్ పువి” – ఒక వైష్ణవుడు మరొక వైష్ణవుడిని కలిసినప్పుడు, అతను వెంటనే భూమిపై ఒక కర్ర లాగా పడి నమస్కారాలు సమర్పించాలి. పూర్తి నమస్కారాలను సమర్పించడాన్ని దండం సమర్ప్పిత్తల్, దణ్డనిడుతల్  (తమిళం లో) అని అంటారు. ఈ విభాగంలో, భగవాన్, భాగవతలు మరియు ఆచార్యుల సమక్షంలో నమస్కారాల గురించి అనేక అంశాలు వివరించబడ్డాయి. ఇక్కడ ఒక సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన పూర్వాచార్యులు ఎప్పుడూ ఒకసారి నమస్కారాలు అర్పించేవారు – సకృత్ (ఒకటి) ప్రణామం (నమస్కారం) మాత్రమే. ఒక విభాగం వైష్ణవులు  ఒకటి కంటే ఎక్కువ సార్లు నమస్కారాలు చేస్తారు – నేను (వి.వి.రామానుజం స్వామి) ఇక్కడ ఆ సూత్రంపై చర్చలోకి రావడం లేదు. కానీ దణ్డనిడుతల్ (ఒకవేళ) – అంటే కర్ర లాగా నిటారుగా పడటం. కింద పడిన కర్ర పైకి లేచి మళ్ళీ పడదు – మనం అలా గుర్తుంచుకోవచ్చు.

అనువాదకుల గమనిక: సాధారణంగా, ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం / భక్తి చూపించడానికి నమస్కారం చేస్తారు. మనం మన నమస్కారం ఎమ్పెరుమాన్ , తాయార్, నిత్యసూరులు (అనంతుడు, గరుడ, విశ్వక్సేనుడు, మొదలైనవారు), ఆళ్వారులు, ఆచార్యలు మరియు భాగవతులకు అర్పిస్తాము. మనతో దేహ సంభందము ఉన్న లౌకిక ప్రవ్రుత్తి గల వ్యక్తులకు లేదా వారు వృద్ధులైనందున, దేవతాంతర సంభందం ఉన్న వారికి, సామాన్య ఆచార్యులకు (కళలు, విజ్ఞానము నేర్పించే ఉపాద్యాయులు), భగవాన్ పట్ల గౌరవం లేనివారికి మనం నమస్కారం చేయకుండా ఉండాలి.  ఈ విభాగంలో ఈ అంశాలు వివరంగా చర్చించబడ్డాయి. మరో ముఖ్యమైన విషయం – శ్రీవైష్ణవంలో, నమస్కారం చేసేటప్పుడు వయస్సుకు పరిమితం లేదు. మన పూర్వాచార్యుల జీవితంలో చాలా సంఘటనలలో, వయస్సులో పెద్ద శ్రీవైష్ణవుడు చిన్న శ్రీవైష్ణవునికి నమస్కారం సమర్పించారు. తిరుమంగై ఆళ్వార్ తిరుమొళి పాసురం 8.2.9 లో  “కణ్ణపురం కైతొళుం పిళ్ళైయైప్ ఎన్ఱేన్నప్ పెఱువఱే” – తిరుక్కణ్ణపురం ను  ఎవరైతే  ఆరాధిస్తారో వాడు చిన్నపిల్లవాడైనా సరే, చిన్నవానిగా భావించరాదు.  అతడైనా / ఆమైనా శ్రీవైష్ణవిడిగా భావించాలి. తిరుమంగై ఆళ్వార్ తిరునెడుంతాణ్దగం పాసురం 14 లో “వళర్త్తతనాల్ పయన్ పెఱ్ఱఏన్ వరుగవెన్ఱు మడక్కిళియైక్ కైకూప్పి వణంగినాళే ” – పరకాల నాయకి (తిరుమంగై ఆళ్వార్ నాయికా భావంతో) ఒక చిలుకను చేరదీసి పెంచినపుడు, ఆ చిలుక ఎమ్పెరుమాన్ నామాలను చాలా ఆనందంగా పలుకుతుండటం చూసి ఆనందంతో పరకాల నాయకి చేతులు జోడించి తన స్వంత చిలుకకు అంజలి పెడుతుంది. ఆళ్వాన్ యొక్క ధర్మ పత్ని (భార్య) ఆండాళ్ తన సొంత పుత్రుని ( శ్రీ రంగంలోని మన సత్ సాప్రదాయం యొక్క గొప్ప పండితులు పరాశర భట్టర్ ) శ్రీపాద తీర్ధాన్ని తీసుకునేవారు. కాబట్టి, యువకులైనా వ్రుద్ధులైనా, శ్రీవైష్ణవులకు పరస్పర నమస్కారం చేయడం అవసరమైన అంశం.ఆదర్శమైన ఉదాహరణ – ఎంపెరుమానార్ తిరుక్కోష్టియూర్ నంబికి ప్రణామాలు అందిస్తున్నారు

  • నమస్కారం చేసే ముందు భూమిని తనిఖీ చేయడం ఒక అడ్డంకి. నేల తడిగా, బురదగా ఉన్నప్పటికీ, శరీరాన్ని / బట్టలను పట్టించుకోకుండా నమస్కారం చేయాలి.
  • పూర్తి నమస్కారం చేయకపోవడం ఒక అడ్డంకి. కిందకు కొంచం వంగి చేతులతో నేలను తాకకూడదు. క్రింద పడుకున్నపుడు మొత్తం ఎనిమిది అవయవాలు భూమిని తాకేలా చూడాలి. కర్ర లాగా పడటం అని ఇప్పటికే వివరించబడింది.
  • పూర్తి ఏకాగ్రత లేకుండా నమస్కారం చేయుట ఒక అడ్డంకి. నమస్కారం చేసేటప్పుడు ఆ వ్యక్తి పూర్తి దృష్టి ఎమ్పెరుమానుపై / భాగవతులపై / ఆచార్యలపై పెట్టాలి.
  • ద్వయ మహ మంత్రాన్నిస్మరించకుండా, పఠించకుండా నమస్కారం చేయుట. ఎమ్పెరుమాన్కి నమస్కారాలు చేస్తున్నప్పుడు ద్వయ మహ మంత్రాన్ని పఠించాలి. మన పెద్దలలో సాధారణంగా ఆళవందార్ యొక్క స్తోత్ర రత్న స్లోకం 22 పఠించడం గమనించ వచ్చు,  “న ధర్మ నిష్టోస్మి …” – నాకు కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి ఏవీ లేవు; నా చేతులతో మీకు అర్పించగలది ఏమీ లేదు, ఇంకెక్కడికి వెళ్ళ లేను; నేను మీ పాద పద్మాలకు శరణాగతి చేస్తున్నాను. ఈ సందర్భంలో మనం ఒక ముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి. నమస్కారాలు చేసిన తరువాత, అభివాదనం (మన గోత్రం, సూత్రం, పేరు మొదలైనవి) తెలియ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అభివాదనం  వైధిక కర్మానుష్టానమునకు మాత్రమే పరిమితం. శ్రీ వైష్ణవులని కలిసినప్పుడు మనల్ని మనం “అడియేన్ రామానుజ దాసు” అని సంభోదించుకోవాలి”, అడియేన్ శ్రీవైష్ణవ దాసు”  – ప్రతివాది భయంకర అణ్ణా శిష్యులు పఠించినట్లు. ” అడియేన్ మధురకవి దాసు” అనంతాళ్వార్ శిష్యులు మొదలైన వారు పఠించినట్లు. ఈ అంశాన్ని శ్రీవైష్ణవులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అనువాదకుల గమనిక: అభివాదనం (గోత్రం , సుత్రం, వేదం మొదలైన వాటికి సంబంధించి తనను తాను గుర్తించుకోవడం) శరీరానికి సంబంధించినది. మనం ఆత్మ (స్వయం) పై దృష్టి కేంద్రీకరించినప్పుడు, మనం ఆత్మ-బంధువులను (శ్రీవైష్ణవులు – ఎమ్పెరుమానార్ యొక్క సేవకులుగా ఉండటం వల్ల మనకు సంబంధించిన వారు) కలిసినప్పుడు, మనం మన ఆత్మను సూచిస్తూ మనల్నిసంభోదించుకోవాలి. ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ చాలా అందంగా చూర్ణిక 36లో ఈ సూత్త్రాన్ని వివరించారు – “విప్రర్క్కు గోత్ర చరణ సూత్ర కూటస్తర్ పరాశర పారాసర్య బోదాయనాదిగళ్; ప్రపన్న జన కూటస్తర్ పరాంకుశ పరకాల యతివరాదిగళ్”-  బ్రహ్మణులకు (కేవలం శారీరికముగా ఆలోచిస్తున్న వారు), గోత్రం (వంశం), చరణ (వేదం యొక్క భాగం), సూత్రం (కర్మానుష్టానముపై  దృష్టి కేంద్రీకరించే వేదం యొక్క ఒక భాగం) పరాశర, వ్యాస, భోదాయన వంటి ఋషులు. ప్రపన్నులకు (వారు ఎమ్పెరుమాన్ యొక్క సేవకులని పూర్తిగా గ్రహించి, వారికి శరణాగతి చేసినవారు), వారి గుర్తింపు ఆళ్వారులైన అయిన నమ్మాళ్వార్ (పరామ్గుస), తిరుమంగై ఆళ్వార్ (పరకాల), మరియు ఎమ్బెరుమానార్ మొదలైన అచార్యుల సంబంధంతో ఉంటుంది. ఇక్కడ, మాముణులు వారి వ్యాఖానంలో చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నారు – ప్రపన్నులు ఆళ్వారులు మరియు అచార్యుల సంబంధంతో తమను తాము గుర్తించుకుంటారు, ఎందుకంటే ఆళ్వారులు మరియు అచార్యులు, వారి ఉపదేశాలు (సూచనలు) మరియు అనుష్ఠానాలు (ఆచరణాత్మక ఉదాహరణలు) ద్వారా ప్రపన్నలుకు అనుసరించాల్సిన సూత్రాలను నిర్దేశించారు. 
  • ఇది శాస్త్రంలో నియమించబడినదని ప్రేమ, భక్తి విహీనంగా నమస్కారం అర్పించడం.
  • ఎమ్పెరుమానుని నమస్కరించినట్టగా భాగవతులకు నమస్కారం సమర్పించడంలో సంకోచించుట. అనువాదకుల గమనిక: భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్పెరుమాన్కు సులభంగా ప్రేమ భక్తులతో నమస్కారం చేయవచ్చు. కానీ భాగవతులకు కూడా అదేవిధంగా ప్రేమ గౌరవాలు సమర్పించాలి. భగవాన్ తన భక్తుల నుండి ఆశించే ఎనిమిది లక్షణాలను వివరిస్తూ, తన భక్తులను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా చూసుకోవాలని వివరించారు.  భక్తుడిగా అర్హత పొందాలంటే, మొదట భగవాన్ భక్తుల పట్ల గౌరవం మరియు శ్రద్ధ ఉండాలి.
  • ఆచార్యులకు నమస్కారం చేసేటప్పుడు వారి పాద పద్మాలకు దగ్గరగా మన శిరస్సు ఉండే విధంగా చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇలా చెప్పినప్పటికీ, ఆచార్యులను తాక కుండా జాగ్రత్తగా ఉండాలి – ముఖ్యంగా సన్యాసులకు కఠినమైన నియమనిబంధనలు ఉంటాయి, ఎవరితో కూడా శారీరక సంబంధం ఉండదు. కాబట్టి, మనం సరైన మర్యాదను పాటించాలి,  అలాంటి సందర్భాల్లో ఆచార్యులను శారీరకంగా తాకకుండా ఉండాలి.
  • ఒక్కసారి నమస్కారం చేసి సంతృప్తి చెందకూడదు. ఇక్కడ అసకృత్ ప్రణామం (పదేపదే నమస్కారాలు) ను సూచించట్లేదు – ఏదైనా నిర్దిష్ట కారణాల వల్ల ఆచార్యులచే సూచించబడినపుడు లేదా ఎమ్పెరుమాన్ / ఆచార్య సన్నీధి నుండి బయలుదేరుతున్న సమయాల్లో, “నేను మొదల్లో ఒకసారి నమస్కారం సమర్పించుకున్నాను ఈ రోజుకు సరిపోతుంది” అని అనుకోకూడదు.
  • ఆచార్యులు “చాలు! దయచేసి లేవండి” అని చెప్పే వరకు నమస్కారం చేస్తూ నేలపైనే ఉండాలి. ఇక్కడ మనము ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకోవచ్చు: ఎమ్పెరుమానార్ శ్రీ రంగంలో ఆలయ పరిపాలనలను సంస్కరిస్తున్నారు. ఆ సమయంలో, ఎమ్పెరుమానార్ యొక్క పరివర్తన ప్రయత్నాలను కొంతమంది ఇష్టపడ లేదు,  ఎమ్పెరుమానార్ యొక్క భిక్షను విషపూరితం చేయడానికి ఏర్పాట్లు చేశారు (సన్యాసిగా, వారు భిక్షాటన చేసేవారు – కాబట్టి వారి ఆహారాన్ని విషం చేయాలని నిర్ణయించుకున్నారు). ఎమ్పెరుమానార్ విష ప్రయత్నం గురించి తెలుసుకొని, సుమారు ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉంటారు. ఇది విన్న తిరుక్కోష్టియూర్ నంబి (ఎమ్పెరుమానార్ యొక్క ఆచార్యలలో ఒకరు) శ్రీరంగానికి పరుగెత్తుకు వెళతారు. ఎమ్పెరుమానార్ వారి ఆచార్యులను స్వాగతించాలన్న తపనతో, మిట్ట మధ్యానం మండే ఎండలో కావేరి నది ఒడ్డుకి వెళతారు. నంబిని చూసిన తరువాత, ఎమ్పెరుమానార్ క్రింద పడి వారికి నమస్కారాలు చేస్తారు. నంబి అతనికి లేవమని సూచించనందున, ఎమ్పెరుమానార్ వేడి ఇసుకలో అలాగే ఉంటారు. ఇది చూసిన కిడంబి ఆచాన్ (ఎమ్పెరుమానార్ యొక్క ప్రియమైన శిష్యులలో ఒకరు), పరుగెత్తుకు వెళ్ళి ఎమ్పెరుమానార్ని ఎత్తడానికి ప్రయత్నిస్తారు,  నంబిని “శిష్య ఆచార్యల మధ్య ఎలాంటి మర్యాద ఇది? మీరు ఈ వేడి మైదానంలో ఎమ్పెరుమానార్ని ఎందుకు బాధపెడుతున్నారు? ఎవరైనా లేత పువ్వును అగ్ని / వేడితో కాలనిస్తారా? ” అని అడుగుతారు. కిడంబి ఆచాన్కి ఎమ్పెరుమానార్ పట్ల ఉన్న అనుబంధంతో నంబి సంతోషిస్తారు మరియు “ఎమ్పెరుమానార్ పట్ల గొప్ప అనుబంధం కలిగి ఉన్న నీలాంటి వ్యక్తిని నేను వెతుకుతున్నాను. ఇప్పడినుండి ఎమ్పెరుమానార్  భిక్ష (ప్రసాదం) మీ నుండి మాత్రమే పొందుతాడు, వారు భిక్షాటన చేయవలసిన అవసరం లేదు”.  ఎమ్పెరుమానార్ స్వయంగా  నమస్కారాలు అర్పించి సరైన మర్యాదలను ప్రదర్శించే వారని దీని నుండి మనం తెలుసుకోవచ్చు.
  • నమస్కారం అర్పించడం మరియు ఆచార్య  పాద పద్మాలని శిరస్సుతో తాకక పొవడం. గతంలో చర్చించిన అంశాన్ని పోలి ఉంటుంది.
  • మనము ఎమ్పెరుమాన్ ఆరాధనకై వెళ్ళినప్పుడు, ఆచార్యులు అక్కడ ఉన్నట్లయితే, మొదట  ఆచార్యులకు మరియు తరువాత ఎమ్పెరుమాన్కు నమస్కారం అర్పించాలి. భౌతికంగా సాధ్యం కాకపోతే, ఎమ్పెరుమాన్కు నమస్కారాలు చేసే ముందు తమ ఆచార్యులకు మానసికంగా నమస్కారాలు అర్పించాలి. అనువాదకుల గమనిక:  ఎప్పుడూ మన ఆచార్యుల ద్వారా ఎమ్పెరుమాన్ దగ్గరకు వెళ్లాలి. కాబట్టి, వారు ఉన్నట్లయితే, మొదట ఆచార్యులకు నమస్కారం చేసి, ఆపై ఎమ్పెరుమాన్ దగ్గరకు వెళ్లాలి. ఈ అంశాన్ని మనం తిరువారాధనంలో కూడా చూశాము, మొదట మన ఆచార్యులను ఆరాధించి, వారి అనుమతి తీసుకొని  వారి తరపున తిరువారాదనం చేస్తాము. మాముణులు తన “జీయర్ పడి తిరువారాధన క్రమం” లో మనం తిరువారాదనమును ఎమ్పెరుమానార్, ఆళ్వార్లు, నిత్యసూరులకు అర్పించి ఆపై చివరికి  ఎమ్పెరుమాన్కి అర్పిస్తాము.
  • భగవాన్ సన్నిధిలో భాగవతులకు నమస్కారం సమర్పించుటకు సంకోచించడం ఒక అడ్డంకి. అయినప్పటికీ, ఈ రోజుల్లో ఇది ఆచరణలో కనిపించట్లేదు. సాధారణంగా, ఆలయం లోపల, ఎమ్పెరుమాన్ , తాయార్, ఆళ్వారులు, ఆచార్యలు తప్ప మరెవరికీ నమస్కరించడం ఈ రోజుల్లో పాటించబడటం లేదు.
  • ఇతర శ్రీవైష్ణవుల వందనాలకై ఆగి (వేచి) ఉండి, ఆపై మనం నమస్కారించి ప్రతిస్పందించడం ఒక అడ్డంకి. శ్రీ రాముడు “మృదు పూర్వంచ భాషతే” గా వర్ణించబడ్డారు –  ఎవరైనా కలిసేటప్పుడు శ్రీ రాముడు దయగల పదాలతో మొదట బాగోగులను అడిగేవాడు. అదేవిధంగా, శ్రీ వైష్ణవులు మనకు నమస్కారం చేసే ముందే మనం నమస్కారం చేయాలి.
  • ఒక శ్రీవైష్ణవుడు నమస్కారం చేసినప్పుడు, “అతను నన్ను ఆరాధిస్తున్నాడు” అని భావించి ప్రతిస్పందించడం  ఒక అడ్డంకి. ఈ సంధర్భంలో అళగియ మణవాళ పెరుమాళ్ నాయానార్ యొక్క తిరుప్పావై 1 వ పాశురం వ్యాఖ్యానంలోని ఒక సంఘటన గుర్తించబడింది. ఒకసారి ఎమ్పెరుమానార్ తన శిష్యులతో కలిసి నడుస్తున్నప్పుడు, పెరియ నంబి (మహా పూర్ణ స్వామి – ఎమ్పెరుమానార్ యొక్క ఆచార్యులు) ఎదురు వస్తే ఎమ్పెరుమానారుకి నమస్కారాలు చేస్తారు. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎమ్పెరుమానార్ పెరియ నంబి యొక్క అంతర్ హృదయాన్ని తెలుసుకున్నప్పటికీ, చుట్టూ ఉన్న జనాలకు స్పష్టం చేయడానికి,  వారు తన సొంత శిష్యులకు నమస్కారాలు ఎందుకు చేశారని నంబిని అడుగుతారు. ఆళవందార్ ఉన్నారని భావించి తాను నమస్కారాలు చేశానని నంబి బదులిస్తారు (ఎమ్పెరుమానార్ను ఆళవందార్ (పెరియ నంబి యొక్క ఆచార్యులు) ప్రతినిధిగా చూసారు). ఆ విధంగా ఎమ్పెరుమానార్ వారి హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా, నమస్కారాలు తనకు చెందినవి కాదని భావించడం ద్వారా వారి ఆచార్యులపై పారతంత్రియాన్ని(పూర్తిగా  ఆధారపడుటను) ప్రదర్శించారు.  అనువాదకుల గమనిక: ఇచ్చే నమస్కారం తమకేనని మనము అనుకోకూడదు, కాని అవి అంతర్యామిగా ఉన్న భగవాన్ కోసమని మరియు మన సొంత అచార్యులతో, ఇతర అచార్యులతో  మరియు ఆళ్వారులతో కలిగి ఉన్న భాగవత సంభంధం కోసమని అని భావించాలి. ఇది నమస్కారం స్వీకరించి దానిని ఇతరులకు ప్రతిస్పందించే సరైన విధి.
  • ఒకవేళ  శ్రీవైష్ణవులకు మన పట్ల ఉన్న అభిమానం కారణంగా నమస్కారం చేయాలనుకుంటే, దానిని విస్మరించి పక్కకు తప్పుకోకూడదు. అనువాదకుల గమనిక: మునుపటి వివరణ మాదిరిగానే. శ్రీవైష్ణవులను, వారి నిజమైన కోరికలను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. వారి కోరిక ప్రకారం వారు మనకి నమస్కారాలు అర్పించాలని ఉంటే, అది మనకంటే ఉన్నత స్థానంగా భావించి, ఎంతో వినయంతో స్వీకరించాలి.
  • తిరువారాదనం పూర్తి చేసిన తర్వాత పూర్తి నమస్కారం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: తిరువారాదనం చివరలో, “ఉపచారాపదేశేన …” స్లోక పారాయణం చేసి, పూర్తి నమస్కారాలు చేస్తాము, తిరువారాదన సమయంలో ఏదైనా తప్పులు జరిగితే క్షమించమని అడుగుతాము. ఈ అంశం ఇక్కడ వివరించబడింది.
  • ఇయల్ గోష్టి సేవాకాలం (పురప్పాడు / ఊరేగింపు సమయంలో కలిసి పాసుర పఠనం) పూర్తి అయిన తరువాత, శ్రీవైష్ణవులు ఒకరికొకరు నమస్కారాలు చేస్తారు. నమస్కారం చేయకుండా వదిలివేయడం నేరం. ఇక్కడ “ఇయల్ సాఱ్ఱఉ”, కీర్తింపజేసే శ్లోకాన్ని పేర్కొన్నప్పటికీ, దీనిని ఇయల్ గోష్టి (రేగింపుల సమయంలో పాసురాలను జపించడం) గా పరిగణించవచ్చు. అనువాదకుల గమనిక: ఇది ఇప్పటికీ ప్రతిచోటా ఆచరణలో కనిపిస్తుంది. పురప్పాడు పూర్తయిన తరువాత, సమావేశమైన శ్రీ వైష్ణవులు సాధారణంగా నమస్కారాలు చేస్తారు, తరువాత తిరువందిక్ కాప్పు (దిష్టి నుండి రక్షణ కోసం హరతి) చేస్తారు.
  • శ్రీవైష్ణవ గోష్తిలోకి ప్రవేశించినపుడు ప్రారంభంలో నమస్కారం చెయ్యాలి,  ఆఖరిలో వెళ్ళేటపుడు నమస్కారం చేసి బయలుదేరడానికి అనుమతి తీసుకోవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • మనము ఆచార్యుల సమీపంలో నివసిస్తే, ప్రతిరోజూ ఆచార్యులను దర్శించుకొని, నమస్కారం చేసి  శ్రీపాద తీర్థం  (చరణామృతం) తీసుకోవాలి. కానీ, ఆచార్యుల సమీపంలో ఉండకపోతే, ప్రతిరోజూ ఆచార్యుల నివాసం దిశవైపు నమస్కారం చేయాలి.
  • పురోదాస అంటే యజ్ఞం (భగవాన్) యొక్క అవశేషాలు – అవి కుక్కలకు అర్పించకూడదు. అదేవిధంగా మనం ఒకసారి ఎమ్పెరుమానునికి శరణాగతి చేసిన తరువాత,  దేహ సంభందం (శ్రీవైష్ణవులు కాని వారు) ఉన్న వారు వృద్ధులు కదా అని నమస్కారం చేయకూడదు.
  • ఎవరైనా కెవలం ఎక్కువ కులంలో (బ్రహ్మణ  మొదలైనవి) జన్మించి నందున మనము నమస్కారం చేయకూడదు. అనువాదకుల గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ శ్రీవైష్ణవులు మరియు కేవలం బ్రహ్మణుల మధ్య తేడాలను అందంగా మరియు విస్తృతంగా వివరించారు. బ్రాహ్మణ్యం పూర్తిగా భగవాన్‌ను చేరికను  ఉద్దేశించినది – ఒక బ్రాహ్మణునికి అది అర్థం కాకపోయి, వేదం, వేదాంతం, మొదలైన వాటిలో బాగా ప్రావీణ్యం ఉన్నట్లు చెప్పుకుంటే, అది కేవలం విలువైన జ్ఞానాన్ని వృధా చేసినట్టవుతుంది.
  • ఒక శ్రీవైష్ణవుడు మన ఇంటికి వచ్చినప్పుడు, తగిన సౌకర్యవంతమైన ఆసనాన్ని అందించాలి, ఆపై నమస్కారం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: అతిథులు వచ్చినప్పుడు, వారి చేతులు, కాళ్ళు కడగడానికి మరియు నోరు శుభ్రం చేసుకోవడానికి నీటిని అందించాలి.  ప్రయాణంలో అలసినందుకు వారిని సుఖవంతంగా ఉంచాలి.
  • దేవతాంతర దేవాలయాల పరిసరాల్లో పాషండుల సమక్షంలో (అవైష్ణవులు , ప్రధానంగా అవైధికులు – వెదాన్ని ప్రమాణంగా స్వీకరించనివారు) నమస్కారం చేయుట. అవైష్ణవులను గౌరవించకూడదనే ఈ సూత్రం గురించి గతంలో విస్త్రుతంగా వివరించబడింది.
  • తిరుప్పత్తి లోకి (తిరుప్పత్తి అంటే సాధారణంగా దివ్య దేశం అని అర్ధం, దేవాలయం అని కూడా అర్ధం), ప్రవేశించే ముందు ప్రవేశద్వారం వద్ద నమస్కారం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • ఆచార్యులకు మరియు ఆచార్య సమానులైన వారికి (శ్రీవైష్ణవులు) బహిరంగంగా  నమస్కారాలు సమర్పించడానికి సంకోచించడం ఒక అడ్డంకి. మనం వారిని ఎక్కడ చూసినా వెంటనే నమస్కారం చేయాలి.
  • ఇతర (ప్రాపంచిక) విషయాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మ విద్య (భగవాన్ యొక్క అత్యంత రహస్య జ్ఞానం) గురించి అంత బాగా తెలియని వ్యక్తికి నమస్కారం చేయుట ఒక అడ్డంకి. “తత్ కర్మ యన్నా భందాయ స విద్యా య  విముక్తయే, ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా సిల్పనైపుణం” – (మనలను బంధ విముక్తులను చేసే చర్య, మనలను బంధ విముక్తులను చేసే జ్ఞానమే నిజమైన జ్ఞానము,  ఇతర చర్యలన్నీ కెవలం మనిషిని అలసేలా చేస్తాయి).  ప్రాపంచక జ్ఞానాన్ని బోధించే గురువులు మన నమస్కారాలకు నిజమైన యొగ్యులు కారు. మన పూర్వాచార్యులు అటువంటి జ్ఞానాన్ని చెప్పులు కుట్టటానికి పనికివచ్చే జ్ఞానం (ఇతర సామాన్య చేతి కళల నైపుణ్యత లాగా) పోల్చారు మరియు వేదం యొక్క ఉద్ధేశ్యాన్ని అర్థం చేసుకోకుండా పఠించే వ్యక్తులను కాషాయాన్ని మొసుకెళుతున్న గాడిదలతో పోల్చారు (కాషాయము యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోకుండా).
  • మంత్ర రత్నం (ద్వయ మహా మంత్రం మరియు దాని అర్ధాలు) బొధకులు కానివారికి,  ఇతర మంత్ర బొధించే వారికి నమస్కారాలు సమర్పించుట. ఇక్కడ ద్వయ మహా మంత్రం మాత్రమే కీర్తించబడింది. అంటే తిరుమంత్రం, ద్వయ మంత్రం, చరమ స్లోకం ఈ మూడు పరస్పర సంబంధం ఉన్నందున అని మనం అర్ధం చేసుకోవాలి. ఇక్కడ ఇతర మంత్రాలు అంటే సాధారణంగా అవైష్ణవ మంత్రాలు మరియు పాము కాటు మొదలైన వాటి నుండి ఉపశమనం పొందటానికి ఇవ్వబడేటువంటి మంత్రాలను సూచిస్తుంది.
  • కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు లౌకిక వ్యక్తులకు లొంగిపోకూడదు (నమస్కారం చేయకూడదు). అనువాదకుల గమనిక: భగవాన్‌ ఎల్లప్పుడూ మనలను సంరక్షిస్తారని పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు, ఇతర సహాయాల కోసం చూడవలసిన అవసరం ఉండదు.
  • మనము సోమరితనంతో ఎమ్పెరుమానుకి  నమస్కారాలు సమర్పించడం మానకూడదు. ఆచార్యులకు మరియు భాగవతులకు కూడా ఇదే వర్తిస్తుంది.
  • ఎమ్పెరుమాన్ యొక్క సన్నీధి / ఉనికిలో, అభాగవతులకు నమస్కారం చేయడం, భాగవతులకు నమస్కారం చేయకపోవడం అడ్డంకులు. మనము ఇంతకు ముందు ఈ విషయాన్ని చర్చించాము – అవైష్ణవులకు నమస్కారాలు చేయడం మానుకోవాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/03/virodhi-pariharangal-17/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment