శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/07/07/virodhi-pariharangal-20/.
52. గృహ విరోధి – నివాస స్థలంలో అవరోధాలు
ఎమ్పెరుమానార్ పరుత్తిక్ కొల్లయ్ అమ్మాళ్ ఇంటికి వెళ్లినపుడు, చిరిగిన బట్టలతో బయటకు రావడానికి ఆమె సిగ్గుపడుతున్నట్లు గమనించి తన సొంత ప్రపన్న పాకై (వారి తలను కప్పుకునే ఒక వస్త్రం) ను ఆమెకిచ్చి ఆశీర్వదిస్తారు. వారి తిరువేంకట యాత్రా సమయంలో, ఆమె అద్భుత సాత్విక లక్షణాలను తెలుసుకొని ఎమ్పెరుమానార్ ఆమె నివాసానికి వెళ్లి ఆశీర్వదిస్తారు – ఈ సంఘటన పిళ్ళై లోకం జీయర్ రాసిన రామానుజార్య దివ్య చరితలో వివరించబడింది.
ఈ విభాగంలో, ప్రపన్నులు / శ్రీవైష్ణవుల నివాసం యొక్క స్వభావం గురించి వివరించబడింది. అనువాదకుల గమనిక: సాధారణంగా మన పూర్వాచార్యులు దివ్య దేశాలు, వారి అభిమాన స్థలాలు, ఆళ్వారుల / ఆచార్యల అవతార స్థలాలు మొదలైన వాటిలో నివాసంపై దృష్టి పెట్టారు. పెరియాళ్వార్ తిరుమోళి 5.1.3 లో పెరియాళ్వార్ వివరిస్తూ ఇలా అన్నారు, “ఉన్ కోయిలిల్ వాళుం వైట్టణవన్ ఎన్నుం వన్మై కండయే” – శ్రీ వైష్ణవుడిగా అత్యున్నతమైన లక్ష్యం ఏమిటంటే , మీకు (భగవాన్) ప్రియమైన ప్రదేశంలో నివసించి, భగవాన్ మరియు భాగవతుల కైంకర్యములో నిమగ్నమై జీవించడమే. దివ్య దేశములును “ఉగంతరుళినా నిలంగళ్ ” – భగవాన్ గొప్ప ఆశతో ఆశీర్వదించిన ప్రదేశం అని అర్థం. దివ్య దేశములు మొదలైన వాటిలో నివసించే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, నేర్పరులైన శ్రీవైష్ణవులతో పరస్పరం వ్యవహారంలో ఉండి తద్వారా భగవత్ విషయం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో నిరంతరం నిమగ్నమవ్వడం, భగవాన్ మరియు భాగవతులకు నిరంతరం కైంకర్యంలో పాల్గొనడం. చుట్టూ భాగవతుల మధ్య ఉండటం ద్వారా, సంసారుల (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) తో కలవ వలసిన అవసరం కూడా ఉండదు. అదంతకదే తొలగిపోతుంది. ఈ సూత్రాన్ని ఈ విభాగంలో వివరంగా నొక్కిచెప్పారు.
- దేవతాంతరములతో (బ్రహ్మ, రుద్ర మొదలైన ఇతర దేవతలు) సంబంధం కారణంగా ఖండించబడిన ప్రదేశంలో నివాసం ఉండటం ఒక అడ్డంకి.
- పాషండులు (బాహ్యులు – వేదాన్ని అంగీకరించని వారు, కుదృష్టులు – వేదాన్ని అంగీకరిస్తారు కాని వాటిని తప్పుగా అర్ధం చేసుకునేవారు) ఉండే వీధుల్లో నివసించడం ఒక అడ్డంకి.
- పొరుగిడ్లల్లో సంసారులు (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ఉన్న (నివసించిన) ప్రదేశంలో నివసించడం ఒక అడ్డంకి.
- ఊర్ధ్వపుండ్రాలు, శంఖం, చక్రం మొదలైన భగవాన్ యొక్క దివ్య చిహ్నాలను వ్యక్తపరచని గృహాలలో నివసించడం ఒక అడ్డంకి. ఊర్ధ్వపుండ్రాలు మొదలైన వాటితో శ్రీవైష్ణవ ఇండ్లకు గుర్తులు పెట్టుకోవడం / గుర్తించడం యొక్క అవసరాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు.
- భౌతికంగా ఆలోచించే వారి యాజమాన్యంలో ఉన్న నివాసాలు లేదా వారికి ప్రియమైన గృహాలలో నివసించడం ఒక అడ్డంకి.
- ఆచార్యులకు అప్రియమైన నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఒక ఇల్లు నిర్మించినప్పుడు, అది మన ఆచార్యులకు అర్పించి మరియు వారి ఆమోదం మీద ఆశీర్వాదంగా ఆ నివాసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ అర్థం చేసుకోవాలి. గృహ ప్రవేశ సమయాన ఆచార్యులను ఆహ్వానించి, కొత్త ఇంటికి వారి ఆశీర్వాదాన్ని ప్రసాదించమని అభ్యర్థిస్తున్నట్లు ఇప్పటికీ మనం చూడవచ్చు. ఆచార్య హృదయంలో, 85 వ చూర్ణికలో ఒక అందమైన సంఘటన వివరించబడింది – “మ్లేచనుం భక్తన్ ఆనాళ్”. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ భాగవతుల కీర్తిని వివరిస్తూ, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ ఒక కొత్త గృహాన్ని నిర్మించి, ఆ స్థలాన్ని శుద్ధి చేయటానికి, అతను కేవలం పిళ్ళై వానమామలై దాసును కొత్త గృహంలో అడుగు పెట్టమని, వారి చరణ కమలాలతో ప్రతి గదిలో ప్రవేశించమని కోరారు. కొత్తింటిని శుద్ధి చేయడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు మొదలైనవి చేయడానికి బదులు ఇది అన్నివిధాలా సరిపోతుంది.
- ఏ సమయాల్లోనైన భాగవతులు వచ్చి ఉండటానికి పూర్తి వసతి లేని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భాగవతులు ఏ సమయంలోనైనా వచ్చి ఉండగలిగే విధంగా మన ఇండ్లను ఉంచుకోవాలి. పెరియాళ్వార్ తిరుమొళి 4.4 పదిగంలో, పెరియాళ్వార్ తిరుక్కోష్టియుర్ నివాసులను శ్రీవైష్ణవ అతిథులను స్వాగతించడంలో, వారికి సేవలందించడంలో నిపుణులని గొప్పగా కీర్తించారు.
- భౌతిక – అంశాలపై ఎక్కువగా దృష్టి ఉన్న రక్త సంభంధం ఉన్న – బంధువులు తరచూ వచ్చే ఇండ్లల్లో నివసించడం. ఒకానొక సమయంలో వడుగ నంబి ఇంటికి కొంతమంది బంధువులు వచ్చి వెళ్లినపుడు, వారు ఉపయోగించిన కుండలను / పాత్రలను బద్దలు కొట్టేసి ముదలియాండాన్ ఉపయోగించిన కుండలను తెచ్చుకుంటారు. అనువాదకుల గమనిక: గురుపరంపరా ప్రభావం 6000 పడిలో, వడుగ నంబి యొక్క కీర్తిని వివరించారు. అందులో ఈ సంఘటన వివరించబడింది. ఒకసారి వడుగ నంబి బంధువులు (శ్రీవైష్ణవులు కానివారు) ఆయనను చూడటానికి వస్తారు. వారు వెళ్ళిన తరువాత, వడుగ నంబి అన్ని కుండలను / పాత్రలను బద్దలు కొట్టి నాశనం చేసి, ఆ స్థలాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. తరువాత అతను ముదలియాండాన్ ఇంటికి వెళ్లి, వారు వాడి పడేసిన కుండలను తీసుకొని వచ్చి వాడడం ప్రారంభించారు. వారు ఈ విధంగా స్వచ్ఛమైన ఆచార్య సంభంధం ఉన్నవారు, వాటికి సంబంధించిన ప్రతిదీ (వాడి పడేసినవి కూడా) పూర్తిగా పవిత్రమైనవి మనకు ఆమోదయోగ్యమైనవి, సంసారులు తాకిన ఏదైనా అక్కడే విడిచిపెట్టాలి అని నిర్ధారించారు.
- ప్రత్యేక/వేరుగా కోయిళ్ ఆళ్వార్ (తిరువారాధన గది/దేవుడి గది) లో లేని ఆర్చావతార ఎమ్పెరుమాన్ (సాలగ్రామ శ్రీ మూర్తి, విగ్రహ ఎమ్పెరుమాన్ మొదలైనవి) నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: పంచ సంస్కారాంలో భాగంగా, తిరువారాధనం ఎలా చేయాలో ఆచార్యుల నుండి మనం తెలుసుకుంటాము. అది తెలుసుకున్న తరువాత, అటువంటి శ్రీవైష్ణవుల నివాసంలోకి దయతో దిగిన వచ్చిన భగవానుడిని సరిగ్గా ఆరాధించాలి. గృహార్చ (గృహాలు / ఇండ్లల్లో ఉన్న ఆర్చావతార భగవాన్) మన పూర్వాచార్యుల చేత గొప్పగా మహిమపరచబడింది. శ్రీవైష్ణవ తిరువారాధనంపై ఒక వివరణాత్మక కథనాన్ని https://granthams.koyil.org/2012/07/srivaishnava-thiruvaaraadhanam/ లో చూడవచ్చు.
- ప్రవేశద్వారం వద్ద ప్రముఖంగా సాంగు (శంఖం) ఉన్న నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. శంఖం ఎమ్పెరుమాన్ యొక్క దివ్య ఆయుధం మరియు చిహ్నం అయినప్పటికీ, దీనికి ఒక్కటే ప్రముఖ్యత ఇవ్వడం ఇక్కడ ఖండించబడింది.
- ఆచార్య శ్రీపాద తీర్థం (చరణామృతం) లేని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. ప్రతి నివాసంలో ఆచార్య శ్రీపాద తీర్థం మరియు ఎమ్పెరుమాన్ (సాలగ్రామ శ్రీ మూర్తి) తీర్థం (పవిత్రమైన జలం) తప్పనిసరిగా ఉండాలని మన పుర్వచార్యులు వివరించారు. సాధారణంగా ఆచార్యుల చరణ పాద పద్మాలకు కుంకుమ లేదా చందన లేపం రాసి, వారి పాదాల ముద్రలను ఒక గుడ్డలోని అచ్చు తీసుకొని ఇంట్లో భక్తితో ఉంచుకుంటారు. కొన్నిసార్లు, ఆచార్య ధరించే పాదుకలు కూడా ఇంట్లో ఉంచుకుంటారు. శ్రీపాద తీర్థం వీటిలో ఒకదాని నుండి తయారు చేయవచ్చు – ఆచార్యుల యొక్క తామర పాదాల ముద్రతో లేదా వారి పదుకలతో. శ్రీపాద తీర్థం సిద్ధం చేయడానికి మరో మార్గం కూడా ఉంది – తులసి మొక్క కింద ఉన్న మట్టిని ఆచార్య యొక్క శ్రీపాద తీర్థం తో కలిపి ఒక ముద్ద తయారు చేస్తారు. ఎండినప్పుడు దీనిని “తీర్థవడి” అని పిలుస్తారు – ఈ ముద్దపైన నీటిని పవిత్రం చేయడం ద్వారా శ్రీపాద తీర్థం తయారు చేయవచ్చు. ఏదేమైనా, శ్రీపాద తీర్థాన్ని ప్రతిరోజూ శిష్యులు తీసుకోవాలి.
- ఊర్ధ్వపుండ్రాన్ని (శ్రీచూర్ణం) తీసుకువెళ్ళే పెట్టి లేని నివాసంలో నివసించడం మరియు భిక్ష (భగవాన్ యొక్క ప్రసాదం) తీసుకువెళ్ళే బుట్ట లేని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఈ వస్తువులు శ్రీవైష్ణవుల యొక్క రోజువారీ దినచర్యలకు చాలా అవసరమైన వస్తువులు.
- జప మాల (జపించేటప్పుడు మంత్రాలను లెక్కించడానికి ఉపయోగించే పూసలు) యాలాడేసిన నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. ఎప్పుడైనా మన మంత్ర పారాయణం చేసేటపుడు లెక్కించాల్సిన అవసరం ఉంటే, మన వేళ్ళతో లెక్కపెట్టుకోవచ్చు. అనువాదకుల గమనిక: మంత్ర పఠనాన్ని సూచించే ఇతర సాంప్రదాయాలలా కాకుండా, మన సాంప్రదాయం మంత్రాల (తిరుమంత్రం, ద్వయం మొదలైనవి) యొక్క అర్ధాలను ధ్యానం చేయడంపై దృష్టి పెట్టింది. మొదటి 3 వర్ణాలకు (బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య) సంద్యావందనంలో భాగమైన గాయత్రి మంత్ర పారాయణం మినహా మన సాంప్రదాయంలో మంత్రజపం యొక్క సంఖ్యకు ప్రాదాన్యత ఇవ్వలేదు.
- కుక్కలు, తోడేళ్ళు, నక్కలు, పాషండులు (మనము ఇంతకు ముందే చూశాము) మొదలైన వాటికి దగ్గరగా ఉండే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి.
- శైవ, బౌద్ధ, జైన, చార్వాక (బాహ్యా మరియు కుదృష్టులు) సాంప్రదాయాల సాహిత్య పుస్తకాలు ఉంచే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. తొండరడిప్పొడి ఆళ్వార్ తన తిరుమాలై 7వ పాసురంలో “కాణ్బరో కేట్పరో తాం” – ఇతర సాంప్రదాయ సాహిత్యాన్ని ఎప్పుడైనా చూస్తారా లేదా వింటారా) అని అన్నారు. పాసుర వ్యాక్యానంలో, పెరియవాచాన్ పిళ్ళై వివరిస్తూ, చిన్నతనంలో కూరత్తాళ్వాన్ అలాంటి ఉపన్యాసాలు విన్నందుకు వారి తండ్రిగారు అతన్ని ఎలా శిక్షించారో మనం ఇంతకు ముందు శీర్శికలలో చూశాము.
- శుక్రవారం, అమావాస్య, మొదలైన రోజుల్లో మాత్రమే ఆవు పేడను అలికి శుభ్రం / పవిత్రం చేసే నివాసాలలో నివసించడం ఒక అడ్డంకి. ప్రతిరోజూ మన ఇండ్లను చక్కగా శుబ్రం చేసి పవిత్రం చేసుకోవాలి. అర్జన విరోధిలో కూడా ఇదే విధమైన సూత్రం వివరించబడింది (చివరికి, శుక్రవారం మాత్రమే శుభ్రం చేయబడిన గృహాల నుండి భిక్షను స్వీకరించడం కూడా వర్జితం). అనువాదకుల గమనిక: ప్రతి శ్రీవైష్ణవుల ఇంటిలో భగవానుడు నివసిస్తున్నందున, నివాసాన్ని ఎమ్పెరుమాన్ ఆలయంగా పరిగణించి వీలైనంత శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచాలి.
- వంటగది లేదా వండిన ఆహారాన్ని ఉంచిన ప్రదేశం బయటి నుండి సామాన్యులకు కనిపించే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఒకసారి వండిన తర్వాత, ఆహారాన్ని ఎమ్పెరుమాన్కు సమర్పించే ముందు వేరొకరు చూడటం గానీ / వాసన చూడటం గానీ / రుచి చూడటం గానీ చేయకూడదు. కాబట్టి, వండిన పదార్దాలను సాధారణంగా మూతతో లేదా బట్టతో గానీ కప్పి భద్రంగా ఉంచాలి. ఈ కారణంగానే సమర్పణ కోసం ఎమ్పెరుమాన్కు తీసుకువెళ్ళే భోగాన్ని ఎప్పుడూ పూర్తిగా కప్పబడి ఉండటం మనం సాధారణంగా గుళ్ళల్లో గమనిస్తాము. ఈ పద్ధతిని ఇండ్లల్లో కూడా పాటించాలి.
- అన్ని చోట్ల బూడిద చల్లిన నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. బూడిద సాధారణంగా శైవులు నుదిటిపై పెట్టుకుంటారు. శ్రీవైష్ణవులు తాకడం అస్సలు సరికాదు. అనువాదకుల గమనిక: ఈ విషయం ఇళ్ళ పరిశుభ్రతను మరియు పవిత్రతను సరిగ్గా నిర్వహించడానికి సంబంధించినది.
- వండిన అన్నాన్ని ఒక మూలన కుండలో నిలువ ఉంచే ఇంట్లో నివసించడం ఒక అడ్డంకి. ఇది సాధారణంగా ఈశాన్య మూలలో ఉంచబడుతుంది. అనువాదకుల గమనిక: వండిన అన్నం ఆ రోజున అయిపోనప్పుడు, సాధారణంగా రాత్రిపూట నీటిలో ఆ అన్నం కుండను ఉంచుతారు. ఇది అన్నాన్ని కొంతవరకు పాడవకుండా ఉంచుతుంది, అది మర్నాడు తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు. పాత రోజులలో (15 సంవత్సరాల క్రితం కూడా), చాలా కుటుంబాలు (శ్రీవైష్ణవ కుటుంబాలు కూడా) ఈ విధంగా అన్నాన్ని ఉంచి మరుసటి రోజు ఉదయం పెరుగుతో కలిపి తినడం వంటివి చేసేవారు. ఈ రకమైన ప్రక్రియను ఇక్కడ ఖండించారు. శ్రీ కృష్ణుడు భగవద్గితలో వివరించారు, మునుపటి పూట వండిన ఆహారాన్ని తినకూడదు, ఎందుకంటే ఆ ఆహారం సద్ది అవుతుంది, సాత్విక స్వభావానికి మంచిది కాదు. కాని ఈ రోజుల్లో, జనం ఆహారం విలువ తెలియక మిగిలినవి పారవేస్తున్నారు. – ఇది కూడా సమానంగా మన శాస్త్రంలో ఖండించారు ప్రత్యేకంగా “అన్నం నా నింధ్యాత్” (ఆహారాన్ని వృథా చేయవద్దు) అని చెప్పబడింది. కాబట్టి, మనం ఆహారాన్ని(ప్రసాదం) వృథా చేయకుండా అవసరమైనంతగా వండుకోవాలి, ఎక్కువైనపుడు అవసరం ఉన్న వారికి ఇవ్వాలి.
- చేతులకు , కాళ్ళకు మొదలైన వాటిలో తాయిత్తులు/ కంకణాలతో నిద్రించడం. అనువాదకుల గమనిక: చేతులు, కాళ్ళు, మెడ మొదలైన వాటిలో దేవతాంతరములకు సంబంధించిన నలుపు / ఎరుపు రంగు దారాలను ధరించడం శ్రీవైష్ణవుల మధ్య కూడా దాదాపు ఫ్యాషన్‌గా మారింది. కొన్ని సార్లు వాళ్ళు దానిని తిరువడి (హనుమాన్), శ్రీవేంకటేశ్వరునిదని వచ్చిన వారకి చెప్పుకుంటారు. ఏది ఎమైనా, మన సాంప్రదాయాని విరుద్దమైనది. శ్రీవైష్ణవులకు సర్వ రక్ష వారి ఊర్ధ్వపుండ్రాలు (తమిళ్లో తిరుమన్ కాప్పు అని కూడా పిలుస్తారు, ఇక్కడ కాప్పు అంటే రక్షణ). సాధారణంగా, శ్రీవైష్ణవులు ధరించగలిగే దారాలు / కంకణాలు ఇవి:
- బ్రహ్మణులు, క్షత్రీయులు మరియు వైస్యులు కొరకు – యగ్యోపవీతం (దీనిని జంద్యం అని కూడా పిలుస్తారు) అనుమతించబడింది.
- కటి సూత్రం (మొల త్రాడు) ప్రతి ఒక్కరికీ తప్పనిసరి – కౌపీనం (కోవణం – సాంప్రదాయకమైన లోని వస్త్రం) ఇందులో తప్పనిసరిగా కట్టుకోవాలి.
- రక్షాబందనం – రక్షణ దారం / కంకణం, ఇది యాగాలు, దీక్షలు (ఉపనయనం వంటి ప్రత్యేక వైధిక వేడుకలు) మొదలైన సమయాల్లో ధరిస్తారు – సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.
- తిరువారాధనం మొదలైన వాటిలో ఉపయోగించే కుండలు మరియు పాత్రలపైన ఊర్వపుండ్రాలు లేని నివాసంలో నివసించుట. అన్ని వస్తువులను భగవాన్ చిహ్నాలతో అలంకరించాలి. అనువాదకుల గమనిక: పెరియాళ్వార్ వారి పెరియాళ్వార్ తిరుమొళి 5.4.1లో “ఎన్నైయుం ఎన్ ఉడైమైయైయుం ఉన్ చక్కరప్ పొఱి ఒర్క్కొణ్డు” – నా శంఖ చక్ర గుర్తును నా పైన (ఆత్మ) నా సంపదపైన పెట్టండి. ఆసక్తి ఉన్న అన్ని వస్తువులలో భగవాన్ గుర్తును ఉంచడం ప్రతి శ్రీవైష్ణవుని యొక్క విధి.
- భాగవతుల పాదాలతో శుద్ధి చేయని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇప్పటికే మనం నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మరియు పిళ్ళై వానమామలై దాసు యొక్క ఉదాహరణలను చూశాము – మరింత వివరించాల్సిన అవసరం లేదు.
- పాషండులు (భగవాన్ మరియు శాస్త్రం యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించేవాడు) ఉండి వెళ్లిన తరువాత శుద్ధి చేయని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. పాషండులు ఉండి వెళ్లిన తరువాత, ఈ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి శుద్ధి చేయాలి.
- పశువులను ఇతర దేవతల చిహ్నాలతో గుర్తించే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. ప్రత్యేక చిహ్నాల ద్వారా పశువులను గుర్తించడం గ్రామాల్లో ఒక సాధారణ పద్ధతి. అటువంటి దేవతాంతర చిహ్నాలు లేవని నిర్ధారించుకోవాలి.
- మన పూర్వాచార్యుల చేత పఠించబడని స్లోకాల సామూహిక పఠనంలో నిమగ్నమై ఉన్న నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: మన సాంప్రదాయం ను సత్ సాంప్రదాయం లేదా శుద్ద సాంప్రదాయం అని అంటారు. మన పూర్వాచార్యులు, ఆళ్వారుల పాసురములు, పూర్వాచార్యుల స్తోత్రాలు, వ్యఖ్యానాలు మరియు రహస్య గ్రంధాల పై దృష్టి సారించారు – ఇవన్నీ దేవతాంతర భజన, ఉపాయాంతర నిష్ఠ (భగవానుడు కాకుండా ఇతర ఉపాయాలను స్వీకరించుట) విహీనమై ఉన్నవి. మన పూర్వాచార్యుల చేత అంగీకరించబడని ఎదీ మన ఆళ్వారులు / ఆచార్యుల రచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. కాబట్టి, అటువంటి పఠణాలలో పాల్గొనక పోవడం మంచిది.
- తులసి పెంచని గృహంలో నివసించడం ఒక అడ్డంకి. గృహ అర్చా తిరువారాధనం కోసం, మన స్వంత తులసిని ఇంట్లో పెంచుకోగలిగితే చాలా మంచిది.
- దివ్య ప్రబందం యొక్క ధ్వని ప్రకంపన వినపడని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంట్లో కూడా మనం దివ్యప్రభంధాలు, స్తోత్ర పాఠములు, రహస్య గ్రంథాలు మొదలైనవాటిని నిత్యకృత్యంగా పఠించడంలో నిమగ్నమవ్వాలి. ఈ విధంగా, కుటుంబ సభ్యులందరికీ భగవత్ గుణానుభవం మరియు కైంకర్యంలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది.
53. క్షేత్ర విరోధి – భూమి యాజమాన్యంలో అవరోధాలు.
ఇది మునుపటి అంశం యొక్క కొనసాగింపుగా చూడవచ్చు. గృహ విరోధిలో, నివాస స్థలంతో వ్యవహరించే విషయాలు వివరించబడ్డాయి. ఈ అంశం ఇల్లు నిర్మించాలనుకున్న భూమికి సంబంధించినది. అనువాదకుల గమనిక: సాధారణంగా, క్షేత్రం అంటే సాగు భూమి అని అర్థం. వ్యవసాయం లేదా ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా భూమి లేదా ఆస్తి అని కూడా దీని అర్థం. సాధారణంగా, పూర్వాచార్యుల గ్రంథాలలో సాధారణంగా గృహం , క్షేత్రం రెండూ కలిసి చర్చించబడ్డాయి. ఇప్పుడు వివరంగా చూద్దాం.
- దేవతాంతర యాజమాన్యంలో / నియంత్రణలో ఉన్న భూమిని పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొన్ని భూములు ఇతర దేవతలు మరియు వారి దేవాలయాలకు చెందినవి కావచ్చు. శ్రీవైష్ణవులు అలాంటి భూములను వారి ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.
- దేవతాంతరముల చిహ్నాలను కలిగి ఉన్న భూమిని ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: దేవతాంతరముల చిహ్నాలు – నుదుటిన అడ్డం నామాలు, త్రిశూలం వంటి అనేక ముఖ్యమైన చిహ్నాలు ఉన్నాయి. అటువంటి చిహ్నాలు ఉన్న భూములతో వ్యవహరించకుండా ఉండటం మంచిది.
- భగవాన్కు అప్రియమైన ప్రదేశంలో భూములు ఉండటం అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకు ముందు చూసినట్లుగా, దివ్య దేశములు, ఆళ్వారులు/ ఆచార్యుల అవతార స్థలాలు మొదలైనవి భగవాన్‌కు ప్రియమైనవి, అందువల్ల మనకు అలాంటి ప్రదేశాలలో మాత్రమే భూములు ఉండాలి.
- భగవాన్ నుండి దొంగిలించబడిన / స్వాధీనం చేసుకున్న భూములను పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొంతమంది ఆలయ భూములను దొంగిలించడం / స్వాధీనం చేసుకోవడం మొదలైన వాటిలో పాల్పడతారు. అలాంటి భూములకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే దొంగిలించబడిన భూములతో సంబంధం కలిగి ఉండటం మన స్వరూపానికి మంచిది కాదు.
- ఇతరుల నుండి దొంగిలించబడిన / స్వాధీనం చేసుకున్న భూములతో సంబంధం ఒక అడ్డంకి.
- ఇది “నా భూమి” అని భావించి భూమిని పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి . అనువాదకుల గమనిక: ప్రతి వస్తువుకి సంపదకి యజమాని భగవాన్, కేవలం వారి ఆస్తిని ఉపయోగించుకునే అవకాశం మనకుంది అని మనం అర్థం చేసుకోవాలి.
- ఆచార్య సేవలో ఉపయోగించని భూములను పట్టి ఉంచుకోవడం. అనువాదకుల గమనిక: నంజీయర్ జీవిత చరిత్రలో ఒక మంచి సంఘటన చూపబడింది. ఒకసారి భట్టర్ తన కుటుంబంతో పాటు కూరకులోత్తమన్ (ఒక గ్రామం) లో ఉన్నప్పుడు, భట్టర్ కుటుంబ సభ్యులతో నంజీయర్ తోటకి కొంత నష్టం జరుగుతుంది. నంజీయర్ యొక్క ఏకాంగి (సేవకులు) కలత చెంది, వారితో కఠినంగా మాట్లాడుతారు. ఈ సంఘటన గురించి నంజీయర్ విని కలత చెందుతూ, భట్టర్ యొక్క సంతృప్తి కోసమే తోట ఉందని నంపెరుమాళ్ కోసం కాదని తన సేవకులకు వివరిస్తారు (అనగా, ఆచార్యుల కైంకర్యం మరింత ముఖ్యమైనది). దీని నుండి మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మన సంపదను ఆచార్యుల కైంకార్యానికి వాడాలి అని అర్థం.
- భగవాన్, భాగవతులు మరియు ఆచార్యలకు పూర్తిగా అందుబాటులో లేని భూములను పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: మునుపటి వివరణ మాదిరిగానే. ఎంపెరుమానార్ ఆదేశాల మేరకు తిరువెంకటేశ్వరుని యొక్క కైంకార్యం కోసం తిరుమలలో ఒక కొలను మరియు అందమైన ఉద్యానవనాన్ని సృష్టించడంలో అనంతాళ్వాన్ చేసిన అద్భుతమైన అంకితభావాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/05/virodhi-pariharangal-21/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org