శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/07/07/virodhi-pariharangal-20/.
54. భోజన విరోధి – తదీయారాదనంలో అవరోధాలు
సాధారణంగా, భోజనం అంటే ఆహారం వడ్డించడం అని అర్థం. దీనినే “భాగవత తదీయారాదనం” అని కూడా అంటారు. ఈ విభాగంలో, ప్రసాదం ఇచ్చేవారు (ఆతిథ్యం వహించేవారు), ప్రసాదం (అతిథిగా వచ్చినవారు) ను స్వీకరించే శ్రీవైష్ణవుల వైఖరి, దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. ఇక్కడ, చాలా చోట్ల సాధారణంగా జరిగే తప్పుల గురించి వివరణ ఇవ్వబడింది. అలాంటి తప్పులను చూసి / అర్థం చేసుకొని వాటిని సరిదిద్దడమే ఇక్కడ మన ఉద్దేశం. అనువాదకుల గమనిక: ఈ రోజుల్లో కనిపించే ప్రధాన సమస్య ఏమిటంటే – చాలా చోట్ల భాగవత తదీయారాదనం సరైన తిరువారాధనం లేకుండా జరుగుతుంది మరియు భగవానుడికి భోగ సమర్పణ చేయకుండా జరుగుతుంది. భోగం మొదట భగవానుడికి సమర్పించకపోతే అది ప్రసాదం కాదు. అటువంటి ప్రదేశాలలో ఎమ్పెరుమాన్ను సరిగ్గా చూసుకోడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, భోగం మొదట ఎమ్పెరుమాన్కు సమర్పించి, ఆపై తదీయారాదనంలో వడ్డించే ఏర్పాట్లు చేయాలి.
- శ్రీవైష్ణవులు ప్రేమతో ప్రసాదం (భగవానుకి అర్పించిన ఆహారం) ఇచ్చినప్పుడు, వాటి నాణ్యతను, పరిమాణాన్ని, రుచిని మొదలైనవాటిని ఆరాతీయడం ఒక అడ్డంకి. మనం దానిలో కేవలం ప్రేమా భావాన్ని మాత్రమే చూసి ప్రసాగదాన్ని స్వీకరించాలి. అనువాదకుల గమనిక: భగవాన్ స్వయంగా భగవద్గితలో, తనకు అర్పించిన పదార్థం పరిమాణం, రుచి కాకుండా ప్రేమతో ఇచ్చినదేదైనా (ఆకు, పుష్పం, పండు లేదా నీరు ఏదైనా) తాను స్వీకరిస్తాను అని అన్నారు. కాబట్టి, మనం కూడా, ప్రసాదంలోని ప్రేమను మాత్రమే చూడాలి.
- భాగవత ప్రసాదాన్ని గౌరవంగా ఆదరించకపోవడం ఒక అడ్డంకి.
- ఆతిథ్యం వహించేవారు కొన్ని తప్పులు చేసినప్పుడు, “ఈ వ్యక్తికి ప్రసాదం ఎలా ఇవ్వాలో కూడా తెలియదు” అని ఆశ్చర్యపోవడం ఒక అడ్డంకి. ప్రసాదం పంచే నిజమైన భాగవతునిలో మనం లోపాలు చూడకూడదు.
- ఇక్కడి నుండి, ఆతిథ్యం వహించేవారు చేసే తప్పుల గురించి వివరించబడింది. (అలాంటి తప్పులను చేయకుండా నివారించుకోవచ్చు). మనకోసం మరియు ఇతరుల కోసం వేరు వేరు వంటకాలు / వస్తువులను సిద్ధం చేయడం ఒక అడ్డంకి. అతిథులతో తనకన్నా ఎక్కువగా లేదా సమాన పద్ధతిలో వ్యవహరించాలి.
- అహంకారంతో ప్రసాదం ఇవ్వడం (నేను ప్రసాదం ఇస్తున్నాను) ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఒకసారి ఎమ్పెరుమానార్ తిరుమలకు ప్రయాణిస్తున్నప్పుడు, దారిన వారు తిరుక్కోవలూర్ కి చేరుకున్నారు. అక్కడ తమ ఒక శ్రీమంతుడైన శిష్యుడు ఎణ్ణాయిర్త్తు ఎచ్చాన్ నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది విన్న ఎచ్చాన్ ఎమ్పెరుమానార్ ను తమ నివాసానికి స్వాగతించడానికి గొప్ప ఏర్పాట్లు చేస్తారు. వారు కొంత దూరం వెళ్ళాక ఆ దారి రెండుగా విడిన చోటికి చేరి అక్కడ ఆగుతారు. ఎమ్పెరుమానార్, దారిని వెళ్లే ఒక బాటసారుని ఆ రెండు మార్గాల గురించి అడిగారు. ఆ వ్యక్తి చెబుతూ, ఒక రహదారి ఎచ్చాన్ నివాసానికి దారి తీస్తుంది, దీనిని తరచుగా రాజస గుణం (ఉద్వేగభరితమైన గుణం) ఉన్నవారు వెళ్తూ ఉంటారు మరియు మరొక దారి పరుత్తిక్కొల్లై అమ్మైయార్ ఇంటికి వెళ్తుంది. వీరింటికి తరచూ సాత్విక గుణం (శాంత స్వభావం) ఉన్నవారు వెళ్తూ ఉంటారు. ఎమ్పెరుమానార్ తమ మనస్సు మార్చుకుని పరుత్తిక్కొల్లై అమ్మైయార్ (ఒక సాత్విక శిష్యురాలు) ఇంటికి వెళ్తారు. పిళ్ళై లోకం జీయర్ రాసిన రామానుజార్య దివ్య చరితైలో ఈ సంఘటన వివరించబడింది. ఇతరులను గౌరవించేటప్పుడు అహంకారానికి దూరంగా ఉండాలని దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
- అతిథి, యజమాని అని భావించకపోవడం మరియు తమ సొంత సంపద వస్తువులపై మక్కువ చూపడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: తైత్రియ ఉపనిషద్ “అతిధి దేవో భవ” అని కీర్తించారు – అతిథులను (శ్రీవైష్ణవులు) భగవంతుడిలా చూడాలి. భగవాన్ అన్నింటికీ యజమాని – మనం అర్పించే ప్రతి వస్తువుకి కూడా వారు యజమాని. శ్రీవైష్ణవులు మనింటికి వచ్చినపుడు కూడా మనం వారిని అలాగే చూడాలి. మన దగ్గర ఉన్నవన్నీ వచ్చిన శ్రీవైష్ణవులకు చెందినవని మనం పరిగణించాలి మరియు మనం వారి సొంతమైనదానిలో నుండి వారికి ఇస్తున్నామని వారు దానిని దయతో స్వీకరిస్తున్నారన్న భావన ఉండాలి.
- అతిథి ప్రసాదం ఎలా/ఎంత తింటున్నాడు అని విమర్శించుట ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఉదాహరణకు, ఒక వ్యక్తి కొంచెం ఎక్కువగా తింటుంటే, ఆ వ్యక్తిని తక్కువగా చేసి విమర్శించకూడదు.
- తదీయారాదనంలో ఏమైనా లోపాలు, తప్పులు ఉన్నప్పుడు, అతిథి “అతను నన్ను సరిగ్గా ఆదరించలేదు” అని భావించకూడదు – అది ఒక అడ్డంకి.
- మనల్ని సరిగ్గా ఆదరించలేదని తప్పుగా భావించి కోపంతో ప్రసాదం పూర్తిగా తినకుండా మధ్యలో లేచి వదిలి వెళ్ళడం ఒక అడ్డంకి.
- ఆతిథ్యం వహించేవారు ఒక ప్రత్యేక ప్రదేశంలో లోపల తినడం మరియు అతిథులకు హాలులో ప్రసాదం ఇవ్వడం ఒక అడ్డంకి. అతిథులను గౌరవంతో ఆదరించాలి.
- ఆతిథ్యం వహించేవారు మొదట తినడం, తరువాత అతిథులకు సేవ చేయడం ఒక అడ్డంకి. ఆతిథ్యం వహించేవారు ముందుగా అతిథులను సంతృప్తి పరచి ఆ తరువాత మాత్రమే తినాలి.
- ఆతిథ్యం వహించేవారు మరియు అతిథి కలిసి భోజనం చేస్తున్నప్పుడు, అతిథి ప్రసాదం తినడం ముగించే వరకు వేచి ఉండి తరువాత మాత్రమే లేచి వెళ్ళాలి. అనువాదకుల గమనిక: సాధారణంగా, తదీయారాదనంలో, ప్రారంభంలో కొన్ని స్లోకాములు (ఆచార్య తనియన్లు, దేవరాజ అష్టకం, పూర్వా / ఉత్తర దినచర్యా , వానమామలై జీయర్ ప్రపత్తి / మంగళాసాసనం, మొదలైనవి – వారి వారి మఠం, తిరుమాలిగను బట్టి) పఠనం చేసిన తరువాత ప్రతి ఒక్కరికి పెరుమాళ్ తీర్థం పరిశేషణంగా (తినడానికి ముందు అంతర్యామి భగవానుకి ప్రసాదం అందించే సాధారణ చర్య) ఇవ్వబడుతుంది . అందరు శ్రీవైష్ణవులు కలిసి దీన్ని చేయాలి (ఇతరులు పెరుమాళ్ తీర్థం అందుకునే వరకు వేచి ఉండాలి). అదేవిధంగా, పూర్తయిన తర్వాత, పెరుమాళ్ తీర్థం ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించి వారి భోజనాన్ని ముగించాలి. ఆ తరువాత అందరూ కలిసి వారి చేతులు / కాళ్ళు కడుక్కోడానికి లేచి వెళ్లాలి. ఇది సాధారణ ప్రక్రియ. తదీయారాదనం సమయంలో మనంతకు మనం మధ్యలోనే లేచి బయలుదేరడం సరైన మర్యాద కాదు.
- ఆతిథ్యం వహించేవారు లోపల తిన్నట్లు అతనికి బయట వడ్డించారని అతిథి దుఃఖపడకూడదు. అనువాదకుల గమనిక: మునుపటి చర్చాంశానికి సంబంధించినది. అతిథి ఆ విషయాన్ని తేలికగా తీసుకోవాలి, అతిథి మనస్తాపం చెందకూడదు.
- వారి కంటే ముందు ఆతిథ్యం వహించేవారు తిన్నారని భావించి అతిథి భోజనం చేయుటకు సంకోచించుట ఒక అడ్డంకి.
- అతిథి తినడం పూర్తికాకుండా ఆతిథ్యం వహించేవారు వెళ్ళిపోయారని భావించడం ఒక అడ్డంకి.
- ఆతిథ్యం వహించేవారు వినయంగా అతిథిని ఆహ్వానించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ముందు చెప్పినట్లుగా, ఇక్కడ అతిథులు కూడా శ్రీవైష్ణవుల అయి ఉండాలి.
- ఆతిథ్యం వహించేవారు అతి వినయమైన పదాలతో అవైష్ణవులను ఆహ్వానించడం ఒక అడ్డంకి. అలా చేయవలసిన అవసరం లేదు.
- ఆతిథ్యం వహించేవారు, వారిని సరైన మాటలతో స్వాగతించలేదని అతిథి కోపగించుకోవడం ఒక అడ్డంకి.
- ఆతిథ్యం వహించేవారు వారు తమను దయగల మాటలతో స్వాగతించారని అతిథి గర్వపడుట ఒక అడ్డంకి.
- అతిథి వినయం చూపించకపోవడం మరియు “మీరు నన్ను అతివినయంగా స్వాగతించాల్సిన అవసరం లేదు” అని చెప్పడం ఒక అడ్డంకి.
- అతిథి తీర్థం స్వీకరించడానికి ముందు ఆతిథ్యం వహించేవారు తీర్థాన్ని తీసుకోవడం (ముందు వివరించినట్లు). సాధారణంగా, అతిథి తినడం పూర్తిచేసే వరకు ఆతిథ్యం వహించేవారు వేచి ఉండాలి.
- ఆతిథ్యం వహించేవారు మొదట తిని మిగిలినదాన్ని అతిథికి ఇవ్వడం ఒక అడ్డంకి. ఆతిథ్యం వహించేవారు మొదట అతిథికి తృప్తిగా ఆహారం వడ్డించి ఆ తరువాత వారు తినడం ఆచారం. అందు వలన, మొదట తినడం, మిగిలిన వాటిని ఇతరులకు ఇవ్వడం సరైన మర్యాద కాదు.
- అతిథి తామొక్కరే తినడం ప్రారంభించడం ఒక అడ్డంకి. సాధారణంగా, శ్రీవైష్ణవుల తదీయారాదనంలో, కొన్ని స్లోకాలు, ఆచార్య తనియన్, మొదలైనవి మొదట పారాయణం చేయబడతాయి. అప్పుడు పెరుమాళ్ తీర్థ వితరణ చేయబడుతుంది, పరిశేషణం జరుగుతుంది. అప్పుడు మాత్రమే, మనము తినడం ప్రారంభించాలి.
- శ్రీవైష్ణవుల ఒక పంక్తి తినడం పూర్తి అయిన తరువాత, ఒకవేళ ఎవరైనా అతిథి తినడానికి వచ్చినట్లయితే, ఆహారం ఇప్పుడు అవశేష (మిగిలినవి) మయిపోయిందని అతిథి భావించి భోజనానికి వెనుకాడకూడదు. అలా చేయడం ఒక అడ్డంకి.
- ఎదుటి వారి నిజమైన నిష్ట (విశ్వాసం) ను అర్థం చేసుకోకుండా శ్రీవైష్ణవులతో ప్రసాదం మార్చుకోవడం ఒక అడ్డంకి. ప్రసాదం ఆచార్య నిష్ఠలో ఉన్న శ్రీవైష్ణవుల యొక్క శేషం (మిగిలినది) కావచ్చు లేదా ఆచార్య నిష్ఠలో ఉన్న శ్రీవైష్ణవుల చేత వడ్డించబడినది కావచ్చు. ఒకరికి ఆచార్య అభిమానం (ఆచార్యకు ప్రియమైనవారు) ఉన్నప్పుడు, వారు అటువంటి ప్రసాదం పట్ల భక్తిని పెంచుకుంటారు. అటువంటి నిష్ఠ ఉన్న తరువాత కూడా, ఆ ప్రసాదాన్ని విస్మరించడం గొప్ప పాపం. ఈ విషయంలో నేను (డాక్టర్ వి వి రామానుజం స్వామి) నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 20 సంవత్సరాల క్రితం (ఈ వివరణలు వ్రాసినప్పటి నుండి), నేను ముదలియండాన్ స్వామి తిరుమాలిగలో శ్రీ కార్యం (కైంకార్యాలను చూసుకునే వారు) గా పనిచేస్తున్నాను. ఆ సమయంలో, సింగపెరుమాళ్ కోయిల్లో మహా సంప్రోక్షణం నిర్వహించారు. తిరుమాలిగలో పెద్ద తదీయారాదనం ఏర్పాటు చేయబడింది. నా మంచి స్నేహితుడు (శ్రీ పెరుంబుతూర్ నుండి ఒక ఆచార్య పురుషుడు) అక్కడకు వచ్చారు. తిరుమలిగకు వచ్చి ప్రసాదం స్వీకరించమని వారిని అభ్యర్థించాను. “నేను కందాడైయార్ (ముధాలియాండాన్ వారసుల) తిరుమాలిగలో ప్రసాదం స్వీకరించను అని అన్నారు. అనువాదకుల గమనిక: ప్రమేయ రత్నంలో, కూరత్తాళ్వార్ మరియు వారి భార్య ఆండాళ్ అమ్మాల్‌కు సంబంధించిన ఒక సంఘటన వివరించబడింది. సుదీర్ఘ ప్రయాణం తరువాత, ఆళ్వాన్ మరియు ఆండాళ్ ఇంటికి తిరిగి వస్తున్నారు. వారు ప్రయాణం చేసి చాలా అలసిపోయి చాలా ఆకలితో ఉన్నారు. వారు ఒక శ్రీవైష్ణవుని ఇంటికి చేరుకుంటారు, అతను వారికి ప్రసాదం మరియు బస చేయడానికి ఏర్పాటు చేస్తారు. ఆళ్వాన్ తన అనుష్ఠానం పూర్తిచెసుకొని భోజనంచేస్తారు. ఆండాళ్ ప్రసాదం నిరాకరించి, ఆళ్వాన్తో “మీరు అతని శ్రీవైష్ణవ పేరుని రూపాన్ని చూసి భోజనం చేశారు. కాని అతని నిష్ఠ మనకి తెలియదు. కాబట్టి, మనం ఇంటికి చేరే వరకు వేచి ఉంటాను”. ఈ మాటలు ఆళ్వాన్ విని ప్రశంసలతో నిండి (భౌతిక పురుషుల మాదిరిగా కాకుండా) ఆండాళ్తో “నీలాంటి నిష్ఠ నాకెందుకు లేదు? దయచేసి నేను కూడా నీలాగే అవ్వమని భగవానుని ప్రార్థించు”. అని అంటారు. అది ఆండాళ్ అమ్మాళ్ యొక్క నిష్ఠ మరియు ఆళ్వాన్ యొక్క వినయం – మనం ఎంతో కీర్తించవలసినది. విలువైనది.
- శ్రీవైష్ణవుల ఆచార్య నిష్థను తెలుసుకున్న తరువాత, ప్రసాదం తీసుకోకపోవడం ఒక అడ్డంకి. ఇది మునుపటి వివరణ యొక్క కొనసాగింపు.
- ఎంగిలి చేతులతో ప్రసాదం పంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: నోరు, పెదాలు, నాసికా రంధ్రాలు, మన శరీరంలోని దిగువ ఏదైనా భాగాన్ని (నడుము క్రింద భాగము) మొదలైనవాటిని తాకినప్పుడు మన చేతులు కలుషితమవుతాయి. మరేదైనా తాకే ముందు వెంటనే నీటితో చేతులను కడగాలి.
- వడ్డించమని వినయంగా అభ్యర్థించడానికి బదులుగా, నేరుగా వడ్డించేపాత్ర నుండి తీసుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: వడ్డించే పాత్ర నుండి నేరుగా ఎప్పుడూ తినకూడదు. ఈ రోజుల్లో, మనలో చాలా మంది ఈ ప్రాథమిక సూత్రాలను పూర్తిగా మరచిపోయారు. ఇతరుల ప్రభావం వల్ల చేతులు నాకడం, వడ్డించే పాత్ర నుండి తినడం, ఎంగిలిని పట్టించుకోకపోవడం మొదలైనవి ఈ రొజుల్లో ప్రబలంగా ఉన్నాయి.
- తిరుమాలై 41 “పోనగం సెయ్త సేడం తరువరేల్ పునిథమన్ఱే” – శ్రీవైష్ణవుల ప్రసాద అవశేషాలు చాలా పవిత్రమైనవని మనలను శుద్ధిచేయ గలిగేవని తెలుకోవాలి. దానిపై నమ్మకం లేకపోవడం ఒక అడ్డంకి. ఇవి తొండరడిప్పొడి ఆళ్వార్ యొక్క దివ్య పలుకులు. శేషం (అవశేషాలు) రెండు రకాలుగా ఉండవచ్చు – పాండ శేషం (వడ్డించే పాత్రలోని అవశేషాలు) మరియు పాత్ర శేషం (శ్రీవైష్ణవులు తిన్న అరటి ఆకులోని అవశేషాలు). ఈ సందర్భంలో, ఆళ్వార్ పాత్ర శేషం ( శ్రీవైష్ణవులు చేత తిన్న అరటి ఆకులో మిగిలి ఉన్న ప్రసాద అవశేషాలు) గురించి మాట్లాడుతున్నారని పెద్దలు గట్టిగా వివరిస్తున్నారు. అటువంటి ప్రసాదం యొక్క కీర్తిపై విశ్వాసం పెంపొందించడం చాలా కష్టం (ఎందుకంటే చాలా మంది ఇతరులు మిగిల్చిన ప్రసాదం తినడం అనేది చాలా తక్కువగా చూస్తారు). అనువాదకుల గమనిక: ఈ సందర్భంలో, మనం “మోర్ మున్నార్ ఐయర్” (మాముణులు తిన్న ప్రసాదం రుచి మారకూడదని మొదట పెరుగన్నం తినేవారు) – క్రమం తప్పకుండా మొదట మాముణులు తిన్న అరటి ఆకులో తిన్న మాముణులు యొక్క ప్రియమైన శిష్యుడు. సుమారు 30 సంవత్సరాలు ఇలా చేశాడని పూర్వాచార్యుల గ్రంథాలలో కీర్తించబడింది. తద్వారా అతను చివరికి సన్యాసిగా మారి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ అని పేరుగాంచారు.
- ప్రసాదం వడ్డించడానికి శ్రీవైష్ణవుడు తీసుకున్నప్పుడు, అలా చూస్తూ ఉండటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: వడ్డించే సేవలో సహాయం అందించాలి.
- ఇతర శ్రీవైష్ణవులకు వడ్డించడానికి పాత్రను తీసుకోకపోవడం ఒక అడ్డంకి.
- తదీయారాదనం చేసేటప్పుడు, ఆతిథ్యం వహించే ఇరువురు దంపతులు భార్యా భర్తలతో సహా అతిథులకు వడ్డించాలి, ఇతర పనివాళ్ళను లేదా సంసారులతో చేయించరాదు. అలా చేయడం ఒక అడ్డంకి.
- భోజనం తరువాత, అతిథులు వారి ఎంగిలి అరటి ఆకును వారే తీసే ప్రయత్నం చేయాలి. ఇది శ్రీవైష్ణవుల గృహం అని భావించి గౌరవించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
- ఆతిథ్యం వహించేవారు అరటి ఆకును తీసే ప్రయత్నం చేసినా ఆ బాధ్యతను మనమే వహించే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
- అరటి ఆకును తీసేటప్పుడు, తిరుమాళిగలో అన్నం మెతుకులు చిందకుండా జాగ్రత్త పడాలి.
- ఇతర శ్రీవైష్ణవుల మధ్యలో నుండి ముందు ముందుకి దూసికొని వెళ్లి చేతులు కడుక్కునే ప్రయత్నం చేయడం ఒక అడ్డంకి. మన వంతు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి ఆపై చేతులు కాళ్ళు కడుకోవాలి.
- ఇతరుల నీటి అవశేషాలుగా పరిగణించి చేతులు, కాళ్ళు మొదలైనవి కడగడానికి వెనుకాడటం, ఒక అడ్డంకి. అలాంటి అవకాశం కోసం ఎదురుచూడటం అదృష్టంగా భావించాలి.
- శ్రీవైష్ణవులు ప్రసాదం తీసుకున్న స్థలాన్ని పవిత్రం చేయడం ఒక అడ్డంకి. తరువాత పంక్తిలో భొజనం చేసే శ్రీవైష్ణవుల కోసం మామూలుగా ఈ స్థలాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది, కానీ పవిత్రం చేసే అవసరం లేదు. ఇది సాధారణంగా మఠాలలో తిరుమాలిగలలో గమనించవచ్చు, ఒక పంక్తి శ్రీవైష్ణవులు తిన్న తరువాత, ఆ స్థలాన్ని ఆవు పేడతో శుభ్రం చేస్తారు.
- బూడిదతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం ఒక అడ్డంకి.
- అజాగ్రత్తగా శ్రీవైష్ణవులు ప్రసాదం తిన్న స్థలంపై అడుగు పెట్టడం ఒక అడ్డంకి.
- ఇతర శ్రీవైష్ణవులకు ఇవ్వకుండా సున్నంతో ఆకూ, వక్క, మనం తీసుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: తదీయారాదనం తరువాత ఆకూ, వక్క సాధారణ పద్ధతి.
- ఇతర శ్రీవైష్ణవులకిచ్చే తమలపాకుపైన మన అవశేష సున్నం పెట్టి ఇవ్వడం ఒక అడ్డంకి.
- తదీయారాదనం ఏర్పాటు చేసిన శ్రీవైష్ణవుల గృహంలో అతిథి వచ్చి వంకలు పెట్టడం ఒక అడ్డంకి.
- ఆతిథ్యం వహించి తదీయారాదనం ఏర్పాటు చేసినవారి యొక్క భావాలను అతిథి గాయపరచుట ఒక అడ్డంకి
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/02/virodhi-pariharangal-18/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org