విరోధి పరిహారాలు – 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://granthams.koyil.org/2020/02/16/virodhi-pariharangal-26-telugu/ .

60. సంబంధ విరోధి  – బాంధవ్యాలలో అవరోధాలు.

    నమ్మాళ్వార్ ఎమ్పెరుమాన్ని  తమ తల్లితండ్రులుగా చాటారు. మధురకావి ఆళ్వార్ మరియు ఆళవందార్లు నమ్మాళ్వార్ని తమ తల్లితండ్రులుగా చాటారు.

సంబంధం అంటే బాంధవ్యము ఈ సంబంధం  ఎ) శారీర సంబంధం, బి) స్నేహం సి) ఆత్మ  ద్వారా ఏర్పడతుంది. ఈ మూడు అంశాలలో, మూడవ అంశం చాలా ముఖ్యమైనదని మనం అర్థం చేసుకొని ఆదరించాలి. శారీరక సంబంధం అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి మరియు ఇతర శారీర బంధువులు. ఈ సంభందాలు అన్ని సామాన్యంగా ఒకే కారణంగా భావించబడతాయి – వారి కర్మానుసారంగా ఒక ప్రత్యేక కుటుంబంలో తల్లితండ్రులకు జన్మిస్తారు. అదేవిధంగా, తల్లిదండ్రుల కర్మ ఆధారంగా ఆరోగ్యకరమైన / అనారోగ్యకరమైన, మంచి / చెడు మర్యాదగల పిల్లలు పుడతారు. ఆండాళ్, నాచియార్ తిరుమోళిలోని వారణమాయిరం(6వ దశకం)  చివరి పాసురంలో, ఫల స్రుతి (10 పాసురాలను పఠించిన ఫలితం) “తూయ తమిళ్ మాలై  ఇరైంతుం వల్లవర్ వాయు నన్ మక్కళైప్ పెత్తు మగిళ్వరే”  ఈ 10 పవిత్రమైన పాసురాలను నేర్చుకుని నమ్మకంగా అనుసరించే వారికి అద్భుతమైన సంతానం కలిగి సంతోషంగా జీవిస్తారని వివరించారు. నమ్మాళ్వార్, తిరువాయ్మొళి పాసురం 8.10.10 లో ఇదే విధమైన సూత్రాన్ని వివరించారు “ఇవైయుం పత్తుం వల్లార్గళ్ నల్ల పతత్తాల్ మనై వాళ్వర్ కొణ్డ పెణ్డిర్ మక్కళే” – భాగవత కైంకర్యాన్ని అర్థంచేసుకొని ఈ 10 పాసురాలను ఎవరైతే నేర్చుకుని నమ్మకంగా అనుసరిస్తారో వారికి అద్భుతమైన భగవాన్ మరియు భాగవతుల పట్ల భక్త్యానుకూలమైన కుటుంబజీవితం లభిస్తుంది. తిరుమంగై ఆళ్వార్, తిరుమొళి  8.2.9 లో “కణపురం కై తొళుం పిళ్ళైయై పిళ్ళై ఎన్రెణ్ణప్ పెఱువరే?”  (ఒకవేళ తమ సొంత బిడ్డ అయినా తిరుక్కణ్ణపురంను ఆరాధిస్తే, ఆ పిల్లవాడిని చిన్నపిల్లగా భావించక గొప్ప భక్తుడిలా పరిగణించాలి). వారు తిరునెడుంతాణ్డగం 20 లో కూడా “పేరలన్ పేరోతుమ్ పెణ్ణై మణ్మేల్ పెరుంతవత్తళ్ ఎన్ఱల్లాల్ పేచలమే”  ఎమ్పెరుమాన్ని కీర్తిస్తున్న ఒక చిన్న అమ్మాయిని (సొంత బిడ్డ) కూడా నిత్యసూరిగా (పరమపదం యొక్క నిత్య నివాసి) భావించాలి. తమ సొంత సంతానం అయినప్పటికీ, భగవాన్ అనుగ్రహం వల్ల, ఆ పిల్లవాడు భక్తి భావంతో ఉంటే ఆ పిల్లవాడిని “నా పిల్లవాడని” సాధారణంగా చూడకూడదు, బదులుగా ఆ పిల్లవాడిని “సుకృతినః” (ధార్మికం) అని గౌరవంతో వ్యవహరించాలి.  (అనువాదకుల గమనిక: పరాశర భట్టర్ జీవితంలో, ఈ సూత్రాన్ని చాలా అందంగా వివరించారు. కూరతాళ్వాన్ యొక్క ధర్మపత్ని ఆండాళ్, మన సాంప్రదాయంలో అగ్రశేణికి చెందిన పండితురాలిగా పరిగణించబడుతారు. పరాశర భట్టర్ మరియు వేదవ్యాస భట్టర్ శ్రీరంగనాథుని యొక్క ప్రసాద ఫలితంగా వారికి జన్మించిన కుమారులు. వారిరువురిలో, పరాశర భట్టర్ అత్యోన్నత మెధస్సు, తెలివితేటల కారణంగా అనేక విధాలుగా కీర్తింపబడ్డారు. ఆండాళ్ జన్మనిచ్చినప్పటికీ, భట్టార్ యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరించేది. ఎందుకు అలా చేస్తున్నారని ఆమెను  అడిగినప్పుడు, శిల్పి ఒక శిల్పాన్నితయారుచేస్తాడు, భగవానుడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత, ఆ శిల్పం తయారుచేసిన శిల్పికి కూడా పూజ్యనీయంగా మారుతుంది. అదేవిధంగా, నేను అతనికి జన్మనిచ్చినప్పటికీ, భగవాన్ అనుగ్రహంతో అమితమైన భక్తిని పెంపొందింన వెంటనే, అతను నాకు కూడా పూజ్యనీయుడు. ఈ సూత్రాన్ని స్థాపించడానికి  తిరుమొళి 8.2.9 పాసురం ఆమె ఉదహరించింది.  ఈ విషయంలో, మన దేహబంధువులకు ఆ అవగాహన ఉన్న భాగవతులైనట్లైతే  అలాంటి సంబంధాలను ఎంతో గౌరవించాలి మరియు మహిమపరచాలి. భగవాన్, భాగవతులు మరియు ఆచార్యల ద్వారా ఉత్పన్నమైన సంబంధాలు / స్నేహాలని సాధారణ దేహ సంబంధాల కంటే అధిక ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుందని నొక్కి చెప్పబడింది. కేవలం దేహ సంబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వడం జీవాత్మ యొక్క పురోగతికి తగదని కూడా నొక్కి చెప్పబడింది. ఈ విభాగంలో వివరించబడిన ముఖ్యమైన సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకోడానికి  సుదీర్ఘమైన ఈ పరిచయం అవసరం. ఈ పరిచయంతో, ఈ విభాగం యొక్క అంతర్గత సారాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.

  • దేహ సంబంధులను (భౌతిక బంధువులు) బంధువులుగా పరిగణించడం మరియు భగవత్ సంబంధీలను (భగవత్ శరణాగతులు) బంధువులుగా పరిగణించకపోవడం అడ్డంకులు. దేహ సంబంధం (శారీర సంబంధాలు) వారి స్వంత కర్మల నుండి ఉత్పన్నమవుతాయి. కానీ భగవత్ సంబంధం స్వరూప జ్ఞానం (నిజమైన స్వభావం సాక్షాత్కారం) నుండి పుడుతుంది కావున మరింత మహిమాన్వితమైనది.
  • ప్రపన్నుడు కావడం వలన , దేహ బంధువులతో సంబంధాలు కలిగి ఉండటం, వైష్ణవులతో సంబంధాలు కలిగి ఉండకపోవడం అవరోధాలు. అనువాదకుల గమనిక: ఒక ప్రపన్నుడు అంటే ఆచార్యుల కృపతో భగవానుడికి శరణాగతులైనవాడు. అలాంటి వ్యక్తులకు, భౌతిక వ్యక్తుల సంబంధాలలో ఆసక్తి ఉండదు.  భగవాన్/ భాగవతులకు కైంకార్యం చేయడం, అలాంటి కార్యాలలో పాల్గొనడంలో మాత్రమే వారి సంపూర్ణ దృష్టి ఉంటుంది.
  •  కేవలం  శరీరాన్ని ఇచ్చిన వారిని తల్లితండ్రులుగా  పరిగణనలోకి తీసుకోవడం మరియు జ్ఞానం ఇచ్చిన వ్యక్తిని (ఆచార్య) తల్లితండ్రులుగా  పరిగణించకపోవడం అవరోధం. తిరువాయ్మొళి పాసురం 2.3.2 లో, నమ్మాళ్వార్ “అఱియాధన అఱివిత్త అత్తా! నీ చెయ్వన అడియేన్ అఱియేనే” – ఇక్కడ ఆళ్వారులు భగవానుడిని ఆచార్యులవలే దివ్య ఆవశ్యకమైన సూత్రాలను భోదించేవారుగా కీర్తించారు. శిష్యులలో, నిజమైన ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని తీసుకువచ్చేవాడు ఆచార్య. తల్లిదండ్రులు శరీరానికి కారణం, ఉన్నత జన్మగా పరిగణించబడే నిజమైన సాక్షాత్కారానికి ఆచార్యులు కారణం. సొంత తల్లిదండ్రులను గౌరవించి, వారి పట్ల భక్తితో ప్రవర్తించాలి, అయితే, జ్ఞానమిచ్చిన ఆచార్యులను సర్వోత్తమ తల్లిదండ్రిగా పరిగణించాలి, తిరువాయ్మొళి పాసురం 5.1.8 లో నమ్మాళ్వార్ వివరించిన విధంగా “మేలాత్ తాయ్ తనితైయరుం అవరే ఇనియావారే”  నేనెవరో నాకు తెలియజేసినందుకు ఇక నుండి భగవానుడే నాకు సర్వోత్తమ తల్లి, తండ్రి.  అనువాదకుల గమనిక: మధురకవి ఆళ్వార్ యొక్క కాణ్ణినుణ్ చిఱుతాంబు 4వ పాసురం తెలిజేస్తూ ఇలా అన్నారు “అన్నైయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆణ్డిడుం తన్మైయాన్ శడగోపన్ ఎన్ నమ్బియే” – పవిత్ర గుణాలున్న నమ్మాళ్వారు తల్లిదండ్రిగా (వారి పిల్లలపై పూర్తి నియంత్రణ ఉంటుంది) నన్ను నియంత్రిస్తున్నారు. ఇదే విధమైన మానసిక స్థితిని ఆళవందారులు తమ అత్యంత ప్రజాదరణ పొందిన తనియన్లో “మాతా పితా …” ప్రదర్శించారు, ఇక్కడ ఆళవందారులు నమ్మాళ్వార్ని తమ తల్లి, తండ్రి, సర్వంగా వారిగా  చాటారు.
  • దేహ సంబంధం ఉన్న సోదరులను (అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు) సోదరులుగా పరిగణించడం, తమ ఆచార్య శిష్యులను సోదర సోదరీమణులగా పరిగణించక పోవడం ఒక అడ్డంకి. ఎలాగైతే మన తల్లిదండ్రులకు జన్మించిన వారెవరైనా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అవుతారో, అలాగే ఆచార్యులు మన తండ్రిగా పిలువబడతారు, వారి శిష్యులు వారి కుమారులు / కుమార్తెలుగా పిలువబడతారు – వారి శిష్యులు సహజంగానే మనకు సోదరులవుతారు.
  • దేహ సంబందాన్ని ఔపాదికం (నిబంధనలతో కూడిన) గా పరిగణించకపోవడం, భగవత్ సంబంధం (భగవాన్, భాగవతులు – ఆధ్యాత్మిక బంధువులు) నిరుపాదికం (నిబంధనలతో కూడనిది) గా పరిగణించకపోవడం అడ్డంకులు. ప్రతి ఒక్కరూ వారి వారి కర్మానుసారంగా ఒక ప్రత్యేక కుటుంబంలో జన్మిస్తారు – కాబట్టి నిబంధనలతో కూడినది. కానీ భగవత్ సంబంధం మరియు ఆచార్య సంబంధం (భగవాన్, ఆచార్యులు మరియు భాగవతులతో సంబంధం) నిబంధనలు లేనిది.
  • అచిత్ సంబంధం (శరీరం మరియు దేహ బంధువులతో సంబంధం) తాత్కాలికమైనది, ఎప్పటికైనా వదులుకోవలసినది. అయన సంబంధం (భగవాన్‌తో సంబంధం – అయన అంటే ఆశ్రయించే స్థలం / నివాసం) తాత్కాలికమైనది కాదని తెలుసుకోకపోవడం అవరోధాలు. జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధం యజమాని సేవకుల లాంటిది. జీవాత్మకు యజమాని భగవాన్ –  ఈ సంబంధం శాశ్వతమైనది మరియు అనశ్వరమైనది. అన్ని పరిస్థితులలో, జీవాత్మ భగవాన్ యొక్క దాసుడు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
  • అచిత్ సంబంధం (దేహ సంబంధాలు) జీవాత్మ స్వరూపానికి  హాని కలిగిస్తాయని పరిగణించకపోవడం మరియు అయన సంబంధం (భగవత్ సంబంధం) ఈ సంసారము నుండి జీవాత్మాను ఉద్ధరిస్తాయని పరిగణించకపోవడం అవరోధాలు. శరీరం 3 లక్షణాలను కలిగి ఉన్న పదార్థంతో తయారైంది – సత్వ (మంచితనం), రజస్ (భావావేశము) మరియు తమస్ (అజ్ఞానం), ఇవి జీవాత్మ స్వభావ చింతనను నిరంతరం ఆపుతుంటాయి. కానీ భగవానుడికి శరణాగతి చేసినవారికి,  జీవత్మ యొక్క నిజమైన స్వభావ చింతనను గ్రహించడంలో భగవాన్ సహాయపతాడు.   అనువాదకుల గమనిక: మాణిక్క మాలైలో, పెరియవాచాన్ పిళ్ళై ఈ సూత్రాన్ని అందంగా వివరించారు. అతను అచిత్ మరియు ఈశ్వరుల మధ్య పోలికలను అందంగా వివరించారు. మనం ప్రాపంచిక సుఖాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం ప్రారంభించినప్పుడు, అచిత్ మనలను అలాంటి ప్రాపంచిక సుఖాలలో మునిగిపోయేలా చేస్తుంది, మనల్ని వేరే చోటికి వెళ్ళకుండా ఆపుతుంది (ప్రత్యేకంగా భగవాన్ వైపు). అదేవిధంగా, మనం భగవాన్ పట్ల ఇష్టాన్ని పొందడం ప్రారంభించినప్పుడు, భగవాన్ మన నిజమైన స్వభావాన్ని గ్రహింపజేసి వారి పట్ల మరింత భక్తిని పెంపొందిస్తారు. వారు ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. హిరణ్య కశిపు ప్రకృతి (విషయవాంఛలు) యొక్క ఆశ్రయం పొంది  భగవాన్ను వ్యతిరేకించాడు – నాశనం చేయబడ్డాడు. ప్రహ్లాద ఆళ్వాన్, భగవాన్ ఆశ్రయం పొందాడు, ప్రకృతి నుండి దూరంగా ఉన్నాడు – అతను ఉద్ధరించబడ్డాడు. మనం విషయవాంఛలకు ఎంత ఎక్కువ అనుభూతులమౌతామో, మనం అంత అజ్ఞానులమవుతాము. మనం భగవాన్‌తో ఎక్కువ అనుభూతులమైనపుడు, జ్ఞాన విస్తరణ పొంది మనం పరమానందాన్ని పొందుతాము. చివరగా, పెరియవాచాన్ పిళ్ళై  అందంగా ముగిస్తూ – భగవత్ సంబంధం (ఆచార్యుల ద్వారా) ఏర్పడిన తరువాత, వారి శరీరం, శరీర కార్యక్రమాలకు భయపడకపోతే, అలాంటి వ్యక్తి యొక్క జ్ఞానాన్ని సందేహించాలి / ప్రశ్నించాలి.
  •  అన్ని భౌతిక పదార్థాలు భాగవత సేవకై ఉపయోగించాలని పరిగణించకపోవడం మరియు శ్రీమన్నారాయణుని  (అంతర్యామిగా నివసిస్తున్న పరమాత్మ) సంబంధమే మనల్ని కాపాడుతుందని పరిగణించకపోవడం అడ్డంకి. శ్రీమన్నారాయణ ప్రతిచోటా అంతర్యామిగా ఉన్నాడు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి పాసురం 1.1.7 లో “ఉడన్మిసై ఉయిరెనక్ కరంతెంగుం పరన్తులాన్ ” – ఎలాగైతే జీవాత్మ మన శరీరం మొత్తంలో వ్యాపించి (ధర్మ భూత జ్ఞానం ఆధారంగా) ఉన్నాడో అలాగే భాగవాన్ కూడా ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు. వేదంలో, భగవాన్ అసంఖ్య జీవాత్మల ద్వారా అన్నింటీలోకి ప్రవేశించాలని కోరుకుంటాడు మరియు ఈ విశ్వమంతా (అసంఖ్య విశ్వాలు) అనేక రకాలైన జీవులుగా ఉనికిలోకి వస్తాడని చెప్పబడింది.
  • భగవాన్ సంబంధం ప్రతిఒక్కరితో (భౌతికవాదులు కూడా భగవాన్‌తో అనుబంధం ఉన్నవారు కాబట్టి)  ఉన్నందు వలన మన సంబంధం భౌతిక వ్యక్తులతో ఉందని భావించుట మరియు శుద్ద చైతన్యం ఉన్న శ్రీవైష్ణవులతో శాశ్వత సంబంధం ఉందని భావించకపోవడం ఒక అడ్డంకి. దేహ బంధువులను గౌరవించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అక్కడితో ఆగిపోకూడదు.  ఇతరుల సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న  శ్రీవైష్ణవులను అభినందించి వారికి సేవ చేయాలి. అటువంటి శ్రీవైష్ణవుల సంబంధం శాశ్వతమైనదని మనం అర్థం చేసుకోవాలి. అనువాదకుల గమనిక: ఆళవందార్ తమ స్తోత్ర రత్నం2 వ స్లోకం లో “నాథాయ నాథా మునాయేత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం”  – నాథమునుల చరణాలు (వారి తాతగారు) ఈ లోకంలోనూ మరియు ఇతర లోకాలాలలో (పరమపదం) నాకు వారే శరణ్యం.
  • భగవత్ సంబంధం బంధానికి (ఈ భౌతిక ప్రపంచ బంధం), మోక్షానికి (ఈ భౌతిక ప్రపంచం నుండి ముక్తి) రెండింటికీ వర్తిస్తుందని పరిగణించకపోవడం మరియు ఆచార్య సంబంధం మోక్షంపై మాత్రమే కేంద్రీకృతమై ఉందని పరిగణించకపోవడం అవరోధాలు. పిళ్ళై లోకాచార్యుల యొక్క శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 433వ సూత్ర వ్యాఖ్యానంలో, మాముణులు అద్భుతంగా వివరిస్తూ  భగవాన్కు శరణాగతులమైనపుడు మన పాపకర్మల దృష్ఠితో మరికొంత కాలం ఈ సంసారంలో ఉంచవచ్చు లేదా వారి అసీమిత కరుణతో (వారు సహజంగా దయామయులు కనుక) మనల్ని ఉద్ధరిస్తూ ఈ భౌతిక ప్రపంచంలోని కష్టాల నుండి ముక్తి నిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తారు. దీనికి కారణం భగవాన్ నిరంకుశ స్వతంత్రుడు (సంపూర్ణ స్వతంతృడు, ఎవరిచేత నియంత్రించబడడు) కాబట్టి – కేవలం వారి సంకల్పం మాత్రం చేత.  కానీ కరుణాస్వరూపుడైన ఆచార్యుడు, తనకు శరణాగతులైన వారిని ఉద్ధరించడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు. శ్రీ మహాలక్ష్మి తాయార్ ఎప్పుడూ జీవాత్మల పట్ల కరుణ కలిగుండడం వలన వారి అభ్యున్నతికై  భగవానుడికి సిఫారసు చేయడానికి ప్రయత్నిస్తుంది – ఆచార్యలు కూడా ఇలాంటి మనస్థితి కలవారు, వారు అందరి పట్ల కరుణతో నిండి ఉండి తమ శిష్యులు ఉద్ధరింపబడేలా చూస్తారు. ఇది 447 వ సూత్రంలో వివరించబడింది – “ఆచార్య అభిమానమే ఉత్తార్గం” – ఆచార్య కృప మాత్రమే అభ్యున్నతికి మార్గం.
  •  ఆచార్య సంబంధంతో తాను సంరక్షించబడుతున్నాడని భావించకపోవుట. ఆచార్యులు శిష్యుడికి అవసరమైన సూత్రాలను భోదిస్తున్నందున (శిక్షణ పొందుతున్నందున) మాత్రమే వారి సంబంధం ఉందని భావించడం. మాముణులు ఉపదేశ రత్నమాలలో  “ఆచార్య శిష్యన్ ఆరుయరైప్ పేణుమవన్” – జీవాత్మను పోషించేవాడు ఆచార్యులు. వారిని కేవలం బోధకుడిగా పరిగణించరాదు. వారిని సర్వంగా భావించి అతి గౌరవంగా సేవలందించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/06/virodhi-pariharangal-27/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment