శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/03/16/virodhi-pariharangal-28-telugu/ .
63. దాస్య విరోధి – దాసత్వంలో అవరోధాలు
దాస్యం అంటే ఒకరి పూర్తి నియంత్రణలో ఉండటం – అనగా, యజమాని యొక్క సేవలో ఉండటం. ఇక్కడ, ప్రతి ఒక్కరూ సర్వాధికారి అయిన శ్రీమాన్నారాయణుని సేవకులమని వివరించబడింది. “దాస భూతాః స్వతస్సర్వే హి ఆత్మనః పరమాత్మనః” అన్న ప్రమాణం ముఖ్యమైనది – అంటే జీవాత్మలందరూ సహజంగానే పరమాత్ముని దాసులు – ఇక్కడ “హి” అంటే ప్రసిద్ధం (స్పష్టమైన వాస్తవం) అని అర్థం. ఎమ్పెరుమాన్ పట్ల మన దాసత్వం కారణంలేనిది (సహజమైనది – అతడు అందరికీ అధిపతి కావడం తప్ప వేరే కారణాల ఆధారంగా కాదు), జీవాత్మ మరియు పరమత్మల మధ్య శాశ్వత సంబంధం ఆధారంగా కూడా మన దాసత్వం వారి పట్ల ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇతరుల పట్ల మన దాసత్వం ఔపాధికమైనది (ఒక నిర్దిష్ట కారణాధారంగా, అనగా, మన కర్మానుసారంగా జన్మ / సంబంధం కారణంగా వారికి మనం సేవ చేస్తాము). భగవాన్ పట్ల మన దాసత్వం “స్వరూప పరియుక్త దాస్యం” మరియు “గుణ కృత దాస్యం” అనే రెండు రకాలుగా ఉంటాయి. “స్వరూప ప్రయుక్త దాస్యం” అంటే జీవాత్మ మరియు పరమాత్మ మధ్య శాశ్వతమైన సంబంధం కారణంగా జీవాత్మ భగవత్ దాసుడు. అనగా, భగవాన్ యజమాని కాబట్టి జీవాత్మ వారి నిత్య సేవకుడు. గుణ కృత దాస్యం అంటే భగవాన్ కల్యాణ గుణాల కారణంగా జీవత్మ వారి దాసుడు (నిజంగానే. గొప్ప కరుణ, సౌందర్యం, జ్ఞానం,ఐశ్వర్యం, బలం, వీర్యం మొదలైనవి ఉన్నపుడు, అలాంటి వారికి ఎవరైనా సేవ చేయాలనుకుంటారు). మనలో రెండు రకాల దాసత్వాలు ఉంటాయి. భగవాన్ మన అద్యంతరహితమైన యజమాని కాబట్టి మనం వారిని సేవిస్తాము, ఇంకా వారికి అనేక కల్యాణ గుణాలున్నందున మనం వారిని సేవిస్తాము. అయినప్పటికీ, జీవత్మ సహజ స్వరూపం కాబట్టి ప్రయుక్త దాస్యం ముఖ్యమైనది.
అనువాదకుల గమనిక: దాస్యం (స్వరూప ప్రయుక్త మరియు గుణ కృతం) యొక్క ఈ సూత్రాన్ని మన పూర్వాచార్యులు విస్తారంగా వివరించారు. తిరువాయ్మొళి 5.3.5 పాసుర ఈడు మహా వ్యాఖ్యానంలో నంపిళ్ళై దీనిని వివరించారు. ఈ పాసురంలో, పరాంకుస నాయకి భగవానుడికి దూరమై ఆమె విరహవేదనను చూసి ఒక క్షణం ఆమె మనస్సును మల్లించాలని ఆమె స్నేహితురాలు “శ్రీ కృష్ణుడు చాలా చెడ్డవాడు, కఠినాత్ముడు” అనంటుంది. ఇది విన్న పరాంకుస నాయకి (నాయికా భావంలో నమ్మాళ్వార్) తన స్నేహితురాలితో – ఆయన అలా ఉన్నప్పటికీ ఆమె అతన్ని మాత్రమే ప్రేమిస్తుందని, ఎందుకంటే ఆ భావం ఆమె సహజ స్వభావం కాబట్టి అని చెబుతుంది. వ్యాఖ్యానంలో, నంపిళ్ళై స్వరూప ప్రయుక్త దాస్య సూత్రాన్ని వివరిస్తున్నారు. వారు శ్రీ రామాయణం నుండి సితా పిరాట్టి అనుసూయను (అత్రి మహర్షి యొక్క ధర్మ పత్ని) కలిసినప్పటి సంఘటన వివరిస్తూ శ్రీ రాముడు అంత గొప్ప వ్యక్తిత్వం కలవారు కాకపోయినా, ఆమె అతన్ని అదే విధిగా ప్రేమిస్తుందని – అది సహజ స్వభావం కాబట్టి అని వివరిస్తారు. తిరుమంగై ఆళ్వార్ పాసురం 11.8.7 కూడా ఇక్కడ అందంగా ఉదహరించబడింది “వేంబిన్ పుళు వేంబన్ఱి ఉణ్ణాతు” – ఒక వేప పండ్లలో పుట్టిన పురుగు, చెరుకును వెతుక్కుంటూ వెళ్ళదు – వేప చేదు, చెరుకు తియ్యదైనపటికీ, వేప మరియు పురుగు మధ్య సంబంధం కారణంగా పురుగు వేప పండు మాత్రమే తింటుంది. ఇదే సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 108 నుండి 114 వరకు పిళ్ళై లోకాచార్యులు మరింత లోతుగా వివరించారు. ఈ సూత్రాలకు మాముణుల యొక్క వ్యాఖ్యానం చాలా అద్భుతంగా మన పూర్వాచార్యుల వ్యాఖ్యానముల యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది. ఈ పరిచయంతో మనం ముందుకు వెళ్దాం.
- తాను స్వతంత్రుడని భావించడం, గర్వపడటం ఒక అడ్డంకి. ఇది పెద్ద అడ్డంకి. మనం పూర్తిగా భగవాన్ మీద ఆధారపడి ఉన్నామని అర్థం చేసుకోవాలి. అనువాదకుల గమనిక: తిరుమంత్రంలో “నమః” గురించి వివరిస్తూ పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని ముముక్షుప్పడి 83, 84 సూత్రాలలో అందంగా వివరిస్తున్నారు. వారు “నమః” (న మమ – నా కోసం కాదు) తన కోసం కాదు, భగవాన్ కోసమన్న సూచనను చూపిస్తుంది. ఎవరైనా తాను ఇతర దేవతలకు దాసునిగా భావించినప్పుడు, భగవాన్ తన ఆధిపత్యాన్ని, గుణాలను చూపించి ఆ జీవత్మాను తన వైపు ఆకర్షించగలడు. కానీ పూర్తిగా స్వతంతృడని భావించినప్పుడు, అతను తన శేషత్వాన్ని (దాస్యం) గ్రహించే ప్రాథమిక అర్హతను కూడా కోల్పోతాడు. మాముణులు “త్వమ్మే” (నువ్వు నా వాడివి) మరియు “అహమ్మే” (నేను నా వాడిని) క్రమాన్ని అందంగా వివరిస్తునారు. భగవాన్ మనల్ని “నువ్వు నా వాడివి” అని అన్నపుడు ఒకవేళ జీవాత్మ “నేను నా వాడిని” అని చెబితే, భగవాన్ ఆ పరిస్థితిలో చిక్కులోపడి ఈ జివాత్మాను ఎలా ఉద్ధరించాలో నని ఆశ్చర్యపోతారు.
- శ్రీమన్నారాయణుడిని (మరియు భాగవతులు) కాకుండా మరొకరి సేవకుడు కావడం ద్వారా పనికిరానివాడుగా మారడం ఒక అడ్డంకి. ఇక్కడ ప్రత్యేకంగా దేవతాంతర భజనంపై దృష్టి సారించారు – దేవతాంతరుల సేవ శ్రీవైష్ణవులు ఎప్పుడూ చేయకూడదు. అనువాదకుల గమనిక: భగవాన్, భాగవతులకు మనము చేసే నిజమైన సేవపైనే మన విలువ ఆధారపడి ఉంటుంది. నాచియార్ తిరుమొళి 1.5వ పాసురంలో ఆండాళ్ ఇలా వివరిస్తున్నారు “వానిడై వాళుం అవ్వానవర్కు మఱైయవర్ వేళ్వియిల్ వగుత్త అవి కానిడైత్తిరివతోర్ నరి పుగున్తు కడప్పతుం మోప్పతుం సెయ్వతొప్ప ఊనిడైయాళి సంగుత్తమర్కెన్రు ఉన్నిత్తెళున్త ఎన్ తడములైగళ్ మానిడవర్కెన్రు పేచ్చుప్పడిల్ వాళకిల్లేన్ కణ్డాయ్ మన్మతనే” – బ్రాహ్మణులు యాగం చేయటానికి వారు హవిస్సు (దేవతలకు సమర్పణలు) సిద్ధం చేసిఉంచుకున్న వాటిని ఒక నక్క తాకినట్లయితే అది పనికిరాకుండా అయిపోతుంది. అదేవిధంగా, బాగా అభివృద్ధి చెందిన నా భక్తి ఒక్క శ్రీమన్నారాయణుడి కోసం మాత్రమే – నా భక్తి మరెవరికోసమైనా అన్న చర్చ తలెత్తితే, ఒక్కసారి నేను నా ప్రాణం తీసుకుంటాను. పిళ్ళై లోకాచార్యుల ముమ్ముక్షుప్పడి సూత్రం 62 లో ఈ విషయానికి సంభందించి ఒక వివరణ ఉంది “దేవర్గళుక్కు సేశమాన పురోతాసత్తై నాయ్కు ఇడుమాపోలే, ఈశ్వర సేశమాన ఆత్మ వస్తువై సంసారిగళుక్కు సేశమాక్కుగై” – మాముణులు అందంగా ఇలా వివరిస్తున్నారు. దేవతల కోసం సిద్ధం చేసిన హవిస్సు కుక్కలకు ఇస్తే ఎలా ఉంటుందో (సాధారణంగా దాన్నిచూడరూ తాకరు), జీవాత్మ (సహజంగా భగవాన్ యాజమాన్యంలో ఉన్న) సంసారుల (దేవతాంతరములు, మొదలైనవారు – తమ నిజమైన స్వభావాన్ని ఎరుగకుండా లౌకిక సుఖాలపై వ్యామోహం చూపేవాళ్ళందరు సంసారులు) సేవలో ఉంటె అలా ఉంటుంది. ఈ విధంగా,మన పూర్వాచార్యులు దేవతాంతరములకు సంబంధించిన వాటితో సంబంధం పెట్టుకోకూడదని తీవ్రంగా హెచ్చరించారు, ఎందుకంటే ఇది మన స్వస్వరూపాన్ని ప్రతికూల మార్గంలో ప్రభావితం చేస్తుంది.
- తమ వర్ణం కారణంగా తమను దేవతాంతరముల దాసులమని భావించుట ఒక అడ్డంకి. సమస్త జీవులు జీవాత్మలు శ్రీమన్నారాయణుడి దాసులు మాత్రమే. వర్ణాల మధ్య వ్యత్యాసం ఏ లేదు. అనువాదకుల గమనిక: ఇది ఒక ఆసక్తికరమైన అంశం. వార్తా మాలై 450 వ అంశంలో, ఎమ్పెరుమానార్ ముదలియాండాన్కు యగ్యోపవీతం ఉన్న శ్రీవైష్ణవులు, యగ్యోపవీతం లేని శ్రీవైష్ణవుల గురించి వివరించారు. శ్రీవైష్ణవ రెండు వర్గాల మధ్య 10 తేడాలను వారు వివరించారు. ప్రధానంగా వారి దృష్థి యగ్యోపవీతం ఉన్న శ్రీవైష్ణవులు వేదాధ్యయనం చేస్తూ, దేవతాంతర సంబంధం (ఇంద్రుడు, వరుణ, వాయు, సూర్య, మొదలైనవి) ఉన్న నిత్య/నైమిత్తిక కర్మలను ఆచరించాలి. సాత్తాద శ్రీవైష్ణవులు (యగ్యోపవీతం లేని శ్రీవైష్ణవులు) వేదాధ్యయనం కాకుండా వారు పూర్తిగా దివ్య ప్రబంధం, వాటి వ్యాఖ్యానాల అధ్యయనం చేస్తూ భగవత్, భాగవత కైంకార్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వారు వివరించారు. గమనించి చూసినప్పుడు నిత్య / నైమిత్తిక కర్మాచరణ చేస్తున్నప్పుడు దేవతాంతరులను ఆరాధిస్తున్నామేమో అని అనిపిస్తుంది. కానీ ఈ తికమకకు, నంపిళ్ళై ఒక అందమైన వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి నంపిళ్ళై వద్దకు వెళ్లి, “మీరు మీ నిత్య కర్మలలో దేవతాంతరములను (ఇంద్రుడు, వరుణ, వాయు, సూర్య మొదలైనవి) పూజిస్తున్నారు, కానీ వారి దేవాలయాలకు ఎందుకు వెళ్ళరు?” అని అడిగారు. తక్షణం నంపిళ్ళై ఒక అద్భుత సమాధానం ఇస్తారు, “మీరు యజ్ఞంలో అగ్నిని ఆరాధిస్తారు కానీ శ్మశానంలో అదే అగ్నికి దూరంగా ఎందుకు ఉంటారు? అదే విధంగా, ఎమ్పెరుమాన్ సమస్త దేవతలకు అంతర్యామి అని అర్థం చేసుకొని, నిత్యకర్మలను భగవదారాధన రూపంగా తప్పకుండా నిర్వహించాలని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి చేస్తాము. అదే శాస్త్రం భగవాన్ తప్ప మరెవరినీ పూజించకూడదని కూడా చెప్పింది. కాబట్టి మనం ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదు. అలాగే, ఆలయాలలో దేవతా ప్రతిష్థాపన చేసినపుడు, వారిలో రాజో గుణం పెరిగి తమను తాము ఎక్కువనుకోవడం మొదలు పెడతారు. శ్రీవైష్ణవులు సత్వ గుణంలో ఉన్నందున రాజో గుణం ఉన్న దేవతలను ఆరాధించము”. కాబట్టి, శ్రీవైష్ణవులు (యజ్ఞోపవితం ఉన్న) నిత్యా / నైమితిక కర్మలను అనుసరిస్తున్నప్పటికీ, వారు దేవతాంతరములను సేవిస్తున్నారని భావించకూడదు – శ్రీవైష్ణవులకు అలాంటి కార్యాలన్నీ భగవత్ ఆగ్య కైంకర్యములోని (భగవాన్ ఆగ్యాపించిన కైంకర్యాలు) భాగములు.
- తమను పుట్టించిన కారణంగా తల్లిదండ్రులకు సేవకునిగా భావించడం ఒక అడ్డంకి. మన కర్మానుసారంగా ఒక ప్రత్యేక కుటుంబంలో తల్లిదండ్రులకు మన జన్మ ఆధారపడి ఉంటుంది, వారి పట్ల మన సేవ అనేది శాస్త్రాధార పరిమితమైనది (తల్లిదండ్రుల అవసరాలను చూసుకోవాలి). కానీ భగవాన్ ప్రతి ఒక్కరికి తల్లి మరియు తండ్రి. కాబట్టి, భగవాన్ సేవకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవుల తల్లిదండ్రులు అయితే, ముందు వివరించిన విధంగా ఇతర శ్రీవైష్ణవులను ఎలా ఆదరింస్తామో అదేవిధంగా వారిని కూడా చూసుకోవాలి.
- వివాహం ద్వారా ఏర్పడిన సంబంధం కారణంగా తాను భర్తకు సేవకురాలిగా భావించడం ఒక అడ్డంకి. మునుపటి వివరణ మాదిరిగానే. అనువాదకుల గమనిక: శ్రీమన్నారాయణుడే పరమ పురుషుడు. భగవాన్ మరియు జీవత్మా మధ్య ముఖ్యమైన సంబంధాలలో ఒకటి భాత్రు – భార్య (భర్త – రక్షకుడు మరియు భార్య – రక్షిత) సంబంధం. వారి కర్మానుసారంగా ఒక స్త్రీ యొక్క వివాహం పురుషునితో అయినప్పటికీ, ప్రతి జీవాత్మ యొక్క నిజమైన భర్త భగవాన్ మాత్రమే. ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా స్త్రీ తన భర్తకు చేయవలసిన ప్రాథమిక విధులు చేయాలి – భగవాన్‌తో మన శాశ్వత సంబంధం గురించి అంతర్లీన అవగాహన ఎప్పుడూ ఉంచుకోవాలి. ముందు వివరించినట్లుగా, భర్త శ్రీవైష్ణవుడైయితే, అతన్ని ఎంతో గౌరవంగా, భక్తితో చూడాలి. గొప్ప ఆచార్య అయిన నాంపిల్లైకి ఇద్దరు భార్యలు ఉన్నారు. అతను ఒకసారి తన భార్యలతో విడివిడిగా ఒక ప్రశ్న అడుగుతారు. మొదట తన మొదటి భార్యను “నీకు నా గురించి అభిప్రాయమేమిటి?” అని అడుగుతారు. మొదటి భార్య స్పందిస్తూ “నేను మిమ్మల్ని నంపెరుమాళ్కి సమానంగా, ఆచార్యునిగా భావిస్తాను” అని జవాబిస్తుంది. అతను చాలా సంతోషించి తన తిరువారాదనం కొరకు వంటవండే కైంకర్యాన్ని ఆవిడకిస్తారు. అతను తన రెండవ భార్యకిదే ప్రశ్న అడుగుతారు, ఆమె “నేను మిమ్మల్ని నా భర్తగా భావిస్తాను” అని జవాబిస్తుంది. అతను తన మొదటి భార్యకు వంటలో సహాయ కైంకర్యాన్ని ఆవిడకిస్తారు. మొదటి భార్య తన నెల సమయంలో వంట చేయలేని సమయంలో, అతను తన రెండవ భార్యకు వంటకనుమతించేవారు. కాని వారి ప్రియమైన శిష్యులలో ఒకరిని ఆ ప్రసాదాన్ని ముట్టుకోనిచ్చి ఆ తరువాత తినేవారు. ఈ విధంగా నిజమైన శ్రీవైష్ణవులను వారి భార్యలు ఎంతో గౌరవించాలని మనం అర్థం చేసుకోవచ్చు.
- లౌకిక ప్రయోజనాలు పొందటానికి లౌకిక వ్యక్తులకు సేవ చేయడం ఒక అడ్డంకి. తాత్కాలిక అల్ప ప్రయోజనాలను పొందడంపై దృష్టి పెట్టకుండా, శాశ్వతమైన కైంకర్యం చేయాలనే లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. అనువాదకుల గమనిక: ఒకసారి ఒక రాజు భట్టార్ కీర్తి విని భట్టార్ వద్దకు వచ్చి ఆర్థిక సహాయం కోసం వారి వద్దకు రమ్మంటారు. అప్పుడు భట్టార్ , నంపెరుమళ్ అభయ హస్తం (రక్షణ భంగిమలో) ఇంకో పక్కకు మారినా, నేను సహాయానికి ఎవరి వద్దకు వెళ్ళను, అని జవాబిస్తారు. మన పూర్వాచార్యులు యొక్క నిష్ఠ అలాంటిది. భయంకరమైన పరిస్థితులలో కూడా వారు సంపూర్ణంగా ఎమ్పెరుమాన్ మీద మాత్రమే ఆధారపడేవారు కానీ ఏ సహాయంకైనా భౌతిక వ్యక్తుల వెంట వెళ్ళేవారు కాదు.
- అల్ప లౌకిక సుఖాల పట్ల ఆసక్తి పెంచుకొని మన గౌరవాన్ని కోల్పోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులు సాధారణంగా రాకుమారులుగా మహిమపరచబడతారు – అద్భుతమైన శ్రీమన్నారాయణుని యొక్క దివ్య స్రీమంతులైన సంతతి అని అంటారు. అలాంటి స్థానం నుండి తమను తాము దిగజార్చుకొని ప్రాపంచిక వ్యక్తులకు సేవ చేసి వారి గౌరవాన్ని కోల్పోకూడదు.
- తాను సమస్త జీవాత్మల శాశ్వత సంబంధం ఉన్న శ్రీమన్నారాయణుని దాసుడని తెలియకపోవడం, సమస్త జీవాత్ముల నిత్య రక్షకుడు, సమస్త జీవాత్మల శాశ్వత అధికారి అని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. పిళ్ళై లోకాచార్యుల యొక్క నవ విధ సంబంధంలో చెప్పినట్లుగా, ఒక్క ఎమ్పెరుమాన్ మాత్రమే జీవాత్మలతో అనేక విధాలుగా సంబంధం ఉన్న వాడు. అన్ని వేదాలు / వేదాంతాల యొక్క సారాంశంమైన తిరుమంత్రం యొక్క ప్రధాన మూలాంశం జీవాత్మ యొక్క దాసత్వం. అనువాదకుల గమనిక: శ్రీమన్నారాయణుడే సర్వస్వామి (అందరికీ స్వామి/యజమాని), లోక భర్త (ప్రతి ఒక్కరికీ భర్త / రక్షకుడు), జగన్నాథుడిగా (విశ్వానికే స్వామి) పిలుస్తారు. అందువల్ల మనం అటువంటి భగవాన్ సేవకుడిగా ఉండేలా అనుగ్రహం పొందామని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తించాలి.
- భగతాధీనులై ఉండకపోవడం ఒక అడ్డంకి. దాస్యత్వం యొక్క అత్యున్నత స్థితిని పారతంత్రియం అంటారు – తమను తాము (జీవాత్మ) భగవాన్ నియంత్రణలో ఉంచుట. అనువాదకుల గమనిక: శ్రీ రామాయణంలో, భరతుడు పెరుమాళ్ (శ్రీ రాముని) అధీనుడై ఉన్నట్టు మనం చూడవచ్చు. శ్రీ రాముని కోరికలేమైనా సరే భరతుడు ఆ కోరికలను నెరవేర్చాడు. జీవాత్మలందరూ వారి స్వభావాన్ని నిరూపించుకోడానికి వారిలా ఉండాలి.
- భగవాతాధీనులుగా ఉండడం అంటే భాగవతులకు సేవకుడిగా ఉండటం అని తెలియకపోవుట ఒక అడ్డంకి. తత్ శేషత్వం (భగవాతాధీనుడు) తదీయ శేషత్వానికి (భాగవతులకు దాసుడు) దారితీస్తుంది. ప్రత్యేకించి, మన ఆచార్యులకు సంపూర్ణ సేవ చేయాలి – ఇది జీవాత్మ స్వభావానికి చాలా ముఖ్యమైనది, సముచితమైనది. అనువాదకుల గమనిక: భగవత్ దాస్యత్వం (భగవాన్ ఆధీనుడుగా ఉండుట) జీవత్మ యొక్క సహజ స్థితి మరియు పూర్తిగా భగవాతాధీనుడిగా ఉండాలి. ఇంకా ముఖ్యమైనవి – స్వరూప యాతాత్మ్యం (నిజమైన స్వభావసారము) – భాగవత దాస్యత్వం (భాగవతులకు సేవకుడిగా ఉండుట). పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వార్ స్వయంగా భగవానుడికే తిరుమంత్రం (అష్థాక్షరి) సారాన్ని ఇలా వివరించారు “నిన్ తిరువెట్టెళుత్తుం కత్తు నాన్ ఉత్తతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే” – ఓ ప్రియమైన తిరుక్కణ్ణపురం భగవానుడా! తిరుమంత్రసారాన్ని తెలుసుకున్న తరువాత, నేను నీ భక్తులకు సేవకుడినని అర్థం చేసుకున్నాను). తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాది 18 వ పాసురంలో “ఏత్తియిరుప్పారై వెల్లుమే మర్రవరైచ్ చాత్తియిరుప్పార్ తవం” – భగవాన్ పట్ల భక్తి కన్నా భాగవతుల పట్ల భక్తి గొప్పది. ఎత్తియిరుప్పవర్ – భగవత్ సేష భూతర్ – భగవానుకి శరణాగతులైనవారు. అలాంటి భక్తులకు శరణాగతి చేయుట ఇంకా గొప్పది. శ్రీ రామాయణంలో, లక్ష్మణ భరతులు శ్రీ రామునికి శరణాగతులైనవారు. శతృఘ్నునికి భరతుడే సర్వస్వం. శ్రీరామాయణంలో “చాత్రుగ్నో నిత్యచతృగ్నః” – (శాశ్వతమైన అడ్డంకిని జయించినవాడు) అని చెప్పబడింది. మన పూర్వాచార్యులు “శతృఘ్నుడు శ్రీరాముని సౌందర్యాన్ని దివ్య గుణాలను వదిలి సంపూర్ణంగా భరతుని సేవించాడు” అని వివరించారు. తిరువాయ్మొళి 8.10.3 లో, నమ్మాళ్వార్ “అవనడియార్ సిఱుమామనిసరాయ్ ఎన్నైయాన్దార్” అని అన్నారు. సిఱుమామనిసర్ – భగవానుకి శరణాగతులైనవారు, పరిమాణంలో చిన్నవారు కాని జ్ఞానం అభ్యాసంలో గొప్పవారు. అటువంటి భక్తులు తన అధిపతులు అని నమ్మాళ్వార్ ప్రకటిస్తున్నారు. అటువంటి భాగవతులు ఉన్నప్పుడు, వారిని విస్మరించి ఎమ్పెరుమాన్ పాద పద్మాలకు ఎలా సేవ చేయగలము? ఈ విధంగా, జీవత్మ సహజ స్వభావానికి భగవత్ కైంకర్యం కంటే భాగవత కైంకర్యం చాలా సముచితమైనది.
- యజమాని యొక్క ఇష్టాయిష్టాలు మన ఇష్టాయిష్టాలు కూడా అని తెలియకపోవుట. ఈ సందర్భంలో మనం శ్రీ వైష్ణవానికి తగినది ఏమిటో నిర్ణయించడానికి పెద్దల అభ్యాసాన్ని ఎల్లప్పుడూ అనుసరించాలి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు కైంకర్యం యొక్క అంశాలను వివరించారు. సూత్రం 275 లో, భగవత్ కైంకర్యం గురించి శాస్త్రం ద్వారా నేర్చుకోవాలని, ఆచార్య కైంకర్యం గురించి శాస్త్రం ద్వారా మరియు స్వయంగా ఆచార్యుని ద్వారా నేర్చుకోవాలి. కైంకర్యంలో రెండు అంశాలు ఉన్నాయని ఆయన సూత్రం 276 లో వివరించారు. సూత్రం 277 లో, అనుకూలమైనదాన్ని చేయడం (భగవాన్ / ఆచార్యుల ఇష్టాలు) మరియు అనుకూలం కాని వాటిని నివారించాలని (భగవాన్ / ఆచార్యుల అఇష్టాలు) అని చెప్పారు. సూత్రం 278 లో, అనుకూలమైన / ప్రతికూలమైన అంశాలు వర్ణాశ్రమ ధర్మం మరియు ఆత్మ స్వరూపం ఆధారంగా ఉంటాయని వివరించారు. మాముణులు ఈ 278 వ సూత్రానికి వివరణాత్మక వ్యాఖ్యానాన్ని వ్రాశారు. వారు ఈ సూత్రానికి 3 వేర్వేరు వివరణలు ఇచ్చి, చివరికి మొదటి వివరణ చాలా సముచితమైనదని చెప్తున్నారు. మొదటి వివరణ యొక్క సారాంశం:
- వర్ణాశ్రమం ప్రకారం నిత్య/నిమిత్తిక కర్మలలో పాల్గొని శిష్యులు, పుత్రులు మొదలైనవారిని వైధిక ధర్మాన్ని అనుసరించమని, ఇతరుల పట్ల కరుణాభావంతో ఉండాలని ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలి – ఇతరుల అభ్యున్నతిపైన దృష్టి పెట్టాలి.
- వర్ణాశ్రమానికి ప్రతికూలమైనది ఏమిటంటే, నిత్య / నైమిత్తిక కర్మలను భయంతో చేయడం, చేయకపోతే పాపానికి దారితీస్తుందనే భావంతో చేయుట – తమ పాప రక్షణపై (స్వార్థపూరిత ఉద్దేశ్యం) దృష్టి పెట్టుట.
- ఆత్మ స్వరూపానికి అనుకూలమైనది ఏమిటంటే మనపై భగవాన్ పూర్తి నియంత్రణ.
- ఆత్మ స్వరూపానికి ప్రతికూలమైనదేమిటంటే, భగవానుడిని కొన్ని కార్యాలు చేయుటకు అనుమతించకపోవడం, కొన్ని సార్లు ఇది మన దాస్యభావాన్ని ప్రభావితం చేస్తుంది (అనగా, వారు యజమాని మనం వారి సేవకులము). ఉదాహరణకు, ఒక తండ్రి తన సొంత బిడ్డనుతో ఆడుకుంటుంన్నపుడు ఆ బిడ్డను లేపవచ్చు, బిడ్డ పాదాలను అతని ఛాతి లేదా తలపై కూడా పెట్టుకోవచ్చు. ఆ సమయంలో, పిల్లవాడు “నాన్నా! మీరు నాకన్నా గొప్పవారు, నా పాదాలను మీ తలపై పెట్టుకోలేరు”, అని చెప్పి పాదాలను ముడుచుకోకూడదు. బదులుగా సంతోషంగా ఆ తండ్రిని తృప్తిగా ఆస్వాదించనివ్వాలి.
- మన దాసత్వాన్ని దృష్ఠిలో పెట్టుకొని భగవానుడిని సుఖమనుభవించనివ్వక పోవుట ఒక అడ్డంకి. యజమానిని సుఖపెట్టడం సేవకుడి కర్తవ్యం. తన స్థాయిని కోల్పోతున్నప్పటికీ, యజమానికి సేవ చేసి సుఖపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడి, సుత్రం 177 లో, పిళ్ళై లోకాచార్యులు, శేషభూత (సేవకుడు), శేషి (స్వామి) కి సుఖానందాన్ని తెచ్చిపెట్టడం, స్వరూపం మరియు ప్రాప్యం (లక్ష్యం) రెండూ అని వివరిస్తున్నారు. కాబట్టి, జీవాత్మ దాని కోసం నిరంతరం కృషి చేయాలి.
- భగవాన్ జీవాత్మ యొక్క శేషత్వాన్ని (దాసత్వం) పతనం చేసినప్పుడు సంకోచించడం ఒక అడ్డంకి. ఎమ్పెరుమాన్ తనను తాను తగ్గించుకుని, ప్రేమతో జీవాత్మకు సేవ చేయడం ప్రారంభించినప్పుడు, జీవాత్మ ఎమ్పెరుమాన్ని సేవ చేయడానికి అనుమతించాలి – అలా చేయకపోవడం బాధాకరం. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడి సూత్రం 92 లో, పిళ్ళై లోకాచార్యులు అదే సూత్రాన్ని వివరించారు. మాముణులు, తమ వ్యాఖ్యానంలో ఒక అందమైన ఉదాహరణ చెబుతున్నారు. ఎమ్పెరుమాన్ నమ్మాళ్వార్ను ఉద్ధరించే ఉద్దేశంతో ప్రీతితో వారి హృదయంలోకి ప్రవేశిస్తారు. ఆళ్వార్ పట్ల ప్రేమతో, ఎమ్పెరుమాన్ వారికి సేవ చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో, ఆళ్వార్ “నేను ఒక సాధారణ జీవత్మను, ఎందుకు భగవాన్ నాకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఎమ్పెరుమాన్ కు జీవాత్మ దాసుడన్న శాస్త్రం సారాంశం ఎరిగిన వాడిని, అలా చేయకుండా వారిని ఆపుతానని అనలేదు. బదులుగా, ఆళ్వార్ ఎమ్పెరుమాన్ కోరుకున్నట్లుగా సేవకనుమతించారు. ఇది ఎమ్పెరుమాన్ను సంతృప్తిపరుస్తుందని తెలిసి వారు ఊరుకుంటారు. అది చాలా ముఖ్యమైన అంశం.
- సేవలో పాల్గొనకుండా అవరోధాలు/అడ్డంకులతో చేరి ఉండట ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శాస్త్రంలో “అకిన్చిత్కరస్య శేశత్వ అనుపపత్తిః” – పరమాత్మను సేవించుట జీవాత్మ యొక్క నిజమైన స్వభావం, అటువంటి సేవను వ్యక్త పరచకపోతే జీవాత్మ తన స్వభావాన్ని కోల్పోతాడు, అని చెప్పబడింది. అలాగే, మనం జాగ్రత్తగా అడ్డంకులను నివారింకోవాలి – మన శరీర అడ్డంకులు / ఇబ్బందులకు దూరంగా ఉన్నట్లే (ఎవరైనా విషం ఇస్తే, అది మనకు ప్రాణ హాని చేస్తుందని చెప్పి వెంటనే దానికి దూరంగా ఉంటాము), అలాగే ఆత్మకు హాని కలిగించే వాటికి కూడా దూరంగా ఉండాలి.
- ఆచార్యులకు మనం చేసే సేవ తాత్కాలికమైనదని భావించుట ఒక అడ్డంకి. ఆచార్యులను భగవాన్ అవతారంగా పరిగణిస్తారు – కాబట్టి ఆచార్యులు – శిష్యుల మధ్య సంబంధం కూడా శాశ్వతమైనదని గుర్తుంచుకోవాలి. అనువాదకుల గమనిక: ఆచార్యులను ఎమ్పెరుమాన్ యొక్క పాదపద్మాలుగా పరిగణిస్తారు. శ్రీవచన భూషణం, సూత్రం 427 లో, ఈ సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు చక్కగా వివరించారు. ఎమ్పెరుమాన్ను నేరుగా ఆశ్రయించడమంటే “వారి చేతులు పట్టుకొని సహాయం కోరడం” వంటిది, ఆచార్యుల ద్వారా భగవానుని ఆశ్రయించడం అంటే “తన పాద పద్మాలను పట్టుకొని సహాయం కోరడం” వంటిది – ఖచ్చితంగా రెండోది అన్నివిధాలా సముచితం. ఇలా చూసినా కూడా, ఆచార్యులతో మన సంబంధం శాశ్వతమైనదిగా పరిగణించవచ్చు.
- సర్వాధికారి అయిన భగవానుడి నిత్య సేవకులమని మనం అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. జీవాత్మ పరమాత్మల మధ్య స్వామి-దాస్య భావం (యజమాని – సేవకుడు) శాశ్వతం. ఇది కాలానికి, ప్రదేశానికి, పరిస్థితులకు కట్టుబడి ఉండదు.
- దేవతాంతరములను, పితృలను (తాతముత్తాతలు / పూర్వీకులు) పూజించడం ఒక అడ్డంకి. మనము ఎమ్పెరుమాన్ యొక్క శాశ్వత సేవకులు కాబట్టి, దేవతాంతరములను, పితృ దేవతలను మొదలైన వారికని సేవించడం ఇక్కడ తిరస్కరించబడింది. ఇది శాస్త్రంలో నిర్దేశించిన పితృ తర్పణం మొదలైనవాటిని (నైమిత్తిక కర్మలు) తిరస్కరించినట్లుగా పరిగణించాల్సిన అవసరం లేదు – మనం ఆజ్ఞ కైంకార్యాలను చేయటానికి కట్టుబడి ఉన్నామని మనం మునుపటి శీర్షికలలో తెలుసుకున్నాము.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/06/virodhi-pariharangal-29/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org