విరోధి పరిహారాలు – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://granthams.koyil.org/2020/04/21/virodhi-pariharangal-29-telugu/

64. సఖ్య విరోధి  – మన స్నేహంలో అవరోధాలు

 ప్రతి ఒక్కరి పట్ల చూపిన కారుణ్య భావానికి కూరత్తాళ్వాన్ ఎంతో కీర్తిపొందారు.

సఖ్యం అంటే స్నేహం / పరిచయము. స్నేహం అంటే ఒకరి సంక్షేమం ఒకరు చూసుకోవడం.  స్నేహానికి మొదటి మెట్టు శత్రుత్వం చూపించకపోవడం. సాత్వికులు (భాగవతులు – శ్రీమన్నారాయణుని భక్తులు) మరియు దివ్య జ్ఞానం ఉండి ఆ జ్ఞానాన్ని రోజువారీ జీవితంలో ఆచరణాత్మకంగా వర్తింపజేసే వారి పట్ల స్నేహం మరియు గౌరవం రెండూ ఉండాలని కోరుకోవాలి. నిజమైన స్నేహం పవిత్రమైనదని అర్థం చేసుకోవాలి. శ్రీ గుహ పెరుమాళ్తో (గుహా)  శ్రీరాముని స్నేహాన్ని ఆధ్యాత్మిక స్నేహంగా అర్థం చేసుకోవచ్చు. సుగ్రీవునితో వారి స్నేహం కూడా అలాంటిదే. అనువాదకుల గమనిక: స్నేహాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శారీర స్థాయిలో ఉంటుంది –  మన శరీరాన్ని ఎవరైతే చక్కగా చూసుకుంటారో మరియు మన శారీరిక అనుకూలతను బట్టి వారితో స్నేహం పెంచుకుంటాము. ఉదాహరణకు, మనం క్రింద పడినపుడు ఎవరైనా సహాయపడి ఉండవచ్చు, మనం వారితో స్నేహాన్ని పెంచుకుంటాము. లేదా మనతో చదువుకునే సహపాటులతో స్నేహం పెంచుకుంటాము. ఆధ్యాత్మిక స్థాయిలో మరొక స్నేహం ఉంటుంది – అనగా, ప్రతి ఒక్కరూ భగవాన్ మరియు భాగవతుల దాసులు అని అర్థం చేసుకొని, ఒకే మనస్తత్వంతో ఉన్న భాగవతులతో స్నేహాన్ని పెంచుకోవడం. ఈ భాగవతులను ఆత్మ-బంధువులు (ఆత్మకు సంబంధించినవారు) అని అంటారు. నిజమైన భాగవతులు ఎప్పుడూ భగవత్ విషయాల గురించి చర్చించడంలో నిమగ్నమై ఉంటారు, భగవాన్ / ఆళ్వారులు / ఆచార్యుల యొక్క అద్భుతమైన అనుభావాలను పంచుకుంటారు. అటువంటి భాగవతులతో స్నేహాన్ని ఆనందించాలి ఎందుకంటే వారు మన చివరి శ్వాస వరకు ఈ ప్రపంచంలో మనకు తోడుగా ఉంటారు. భౌతిక వ్యక్తులతో స్నేహాన్ని మానుకోవాలి, ఎందుకంటే వారు మనల్ని సంసారంలోకి మరియు భౌతిక వ్యవహారాలలోకి లాగే ప్రయత్నం చేస్తారు. ఈ పరిచయంతో అసలు విభాగానికి వెళ్దాం.

  • అధములు, లౌకిక వ్యక్తులతో కలవడం ఒక అడ్డంకి. వీళ్ళు ఎప్పుడూ ఆహారం, ఇల్లు, బట్టల వెనుకనే వారి ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడూ వారు భౌతిక వ్యవహారాలలో ఉండాలని చూస్తుంటారు, వారితో కలపడం కేవలం మన సమయం వృధాకి దారితీస్తుంది. వారితో స్నేహం మన  ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధంగానూ సహాయం చేయదు.
  • గొప్ప భాగవతులతో స్నేహం చేసుకొని వారిని మన సమాన స్థాయిలో పరిగణించడం ఒక అడ్డంకి. ఇతర శ్రీవైష్ణవులను తనతో సమానంగా భావించకూడదు – ఎప్పుడూ వారిని గౌరవించి మనకంటే ఉన్నత స్థాయిలో ఉంచాలి. అయినప్పటికీ, సంతోషకరమైన స్నేహంతో ఉండాలి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, సూత్రం 222 నుండి 225 వరకు, పిళ్ళై లోకాచార్యులు ఒక భాగవతునితో ఎలా వ్యవహరించాలో వివరించారు. భాగవతులను వారి ఆచార్యులకు సమానంగా భావించాలి, తమకన్నా, భగవాన్ కన్నా గొప్పగా భావించాలి. భాగవతుల పట్ల ఆ గౌరవం లేకపోవడం ఒక అపచారంగా పరిగణించబడుతుంది.
  • భాగవతులతో స్నేహం కలిగి ఉండి వారిలో తప్పులు ఎంచడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు దీనిని అద్భుతంగా వివరించారు. సాధారణంగా ఎవరిలోనైనా సరే తప్పులు ఎంచకూడదు, తప్పులు ఎత్తి చూపకూడదు (సంసారులలో కూడా). అన్ని తప్పులకూ తామే కారణం అని భావించాలి. తిరుప్పావైలో, ఆండాళ్ 15 వ పాసురంలో “నానే తాన్ ఆయిడుగ” – అన్ని తప్పులు నావే గాక అని అన్నారు.  శ్రీ రామాయణంలో, భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి, పెరుమాళ్ (శ్రీ రాముడు) అయోధ్యను వదిలి అడవికి వెళ్ళాడని, దశరధుడు మృతిచెందాడని తెలుసుకున్నప్పుడు, అతను కైకేయి వద్దకు వెళ్తాడు. ఇలా జరగడానికి మొదట దశరధుని, కైకేయి, మంతర (గూని) మొదలైనవారిని తప్పుపట్టి చివరికి “పెరుమాళ్ నుండి వేరు చేయబడిన ఈ స్థితికి నేను చేసుకున్న పాపమే కారణం” అని అంటాడు. ఇటువంటి వైఖరి/ఆలోచన రావడం చాలా కష్టం, కానీ మన పూర్వాచార్యుల మార్గ దర్శకత్వంలో నడిచి మనం కూడా అలాంటి వైఖరిని పొందాలని కోరుకుందాము.
  • ప్రతిదీ / ప్రతి ఒక్కరూ భగవాన్ యొక్క ఆస్తి / సేవకులు అని పరిగణనలోకి తీసుకొని, ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భగవాన్ నిత్య విభూతికి (ఆధ్యాత్మిక ప్రపంచం – పరమపదం) మరియు లీలా విభూతికి (భౌతిక ప్రపంచం) రెండింటికి అధిపతి. ప్రతి ఆత్మ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భగవాన్నే సేవిస్తుంన్నాడు.  ఒక ఆత్మ తన నిజ స్వరూపాన్ని గ్రహించినట్లయితే, అతను భగవాన్ను సహజ స్థితిలో ప్రత్యక్షంగా సేవిస్తాడు. ఒక ఆత్మ తన నిజ స్వభావాన్ని గ్రహించనట్లయితే, అతను ఇతరుల ద్వారా పరోక్షంగా భగవాన్ సేవ చేస్తాడు (దేవతాంతరములు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, సొంత శరీరం మొదలైన వాటి ద్వారా). ఈ విషయాన్ని అర్థం చేసుకొని, అవగాహన ఉన్న శ్రీవైష్ణవులు ఎల్లప్పుడూ అందరితో కరుణా స్వభావంతో ఉండి, ఆధ్యాత్మిక విషయాలలో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి.
  • భగవానుడి శరీరభాగాలైన ఇతర జీవాత్మల పట్ల శత్రుత్వం కలిగి ఉండటం ఒక అడ్డంకి. అంతటా/అన్నింటిలోనూ అంతర్యామిగా వ్యాపించి ఉన్న భగవానుడిని మనం చూడాలి – ఆ దృష్టిని కలిగి ఉన్న వ్యక్తి గొప్ప జ్ఞాని. అందువలన, ఎల్లప్పుడూ స్నేహాం చూపించాలి, ఎవరి పట్ల శత్రుత్వంతో ఉండకూడదు.  అనువాదకుల గమనిక: భగవాన్ ప్రతిదానిలో / ప్రతి ఒక్కరిలో అంతర్యామిగా (అంతరాత్మగా  నివాసం ఉన్న) విస్తరించి ఉన్నారు. చిత్ (జీవాత్మ) మరియు అచిత్ (అచేతనం – పదార్థం) రెండింటిలో భగవాన్ వ్యాపించి ఉన్నాడు – దీనిని భగవాన్ యొక్క సర్వ వ్యాపకత్వంగా వివరించారు.  శరీరి అంటే శరీరాన్ని ధరించినవాడు  (అనగా ఆత్మ).  శాస్త్రం ఇలా ఘోషిస్తుంది, “యస్య ఆత్మా శరీరం , యస్య పృథ్వీ శరీరం…” (ఆత్మ అతని శరీరం, భూమి మొదలైనవి అతని శరీరం). శరీరంలో జీవాత్మ ఉనికిని పోలి, భగవాన్ జీవాత్మలో ఉన్నాడు. ఈ విధంగా, ప్రతి వస్తువు / ప్రతి జీవి భగవంతుని శరీరంలోని భాగంగా అర్థం చేసుకోవడంతో వారి పట్ల శత్రుత్వం ఉండకూడదు. భగవాన్ స్వయంగా భగవద్గీతలో  “సుకృతం సర్వ భూతానాం” (నేను అందరి స్నేహితుడిని) అని అన్నారు. మన ఆచార్యలు కూడా అందరి పట్ల గొప్ప కరుణ చూపించారు.  ఇలాంటి విషయాలలో కొంచెం ఆసక్తి చూపిన వారందరికీ కూడా భగవాన్ యొక్క దివ్య సందేశాన్ని వ్యాప్తి చేశారు.
  • శ్రీవైష్ణవులతో స్నేహం కలిగి ఉండి, వారికి హానికలిగించడం / మోసంచేయడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొందరు బాహ్యంగా చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తారు, కాని అంతర్గతంగా వారు ఇతరులపై ద్వేషం కలిగి ఉండవచ్చు. అలాంటి ద్వేషం తెలిసి తెలియక కొన్ని సమయాల్లో బయటపడుతుంది. అటువంటి ప్రవర్తనను ఇక్కడ ఖండించారు.
  • మనసులో అపేక్షలు పెట్టుకొని స్నేహం చేయడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇతరుల నుండి ప్రయోజనాలను ఆశించి స్నేహం చేస్తే, అలాంటి ప్రవర్తన చాలా లోకువగా పరిగణించబడుతుంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమ మరియు ఆప్యాయతపై మన స్నేహం ఆధారపడి ఉండాలి.
  • ఇతరుల తప్పులను మంచి గుణాలుగా పరిగణించకపోవడం ఒక అడ్డంకి. సన్నిహితులతో, వారి లోపాలు కూడా మంచి లక్షణంగా పరిగణించబడతాయి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు తత్వ త్రయంలోని మూడు తత్వములను (చిత్ – జీవాత్మ, అచిత్ – పదార్థం, ఈశ్వర – భగవాన్) చాలా వివరంగా వివరించారు. ఈశ్వర ప్రకరణంలో, సూత్రం 150 వరకు, భగవాన్ యొక్క అనేక అద్భుతమైన గుణాలు అందంగా వివరించబడ్డాయి. సూత్రం 151 లో, ఈ అతి అద్భుతమైన గుణాల వల్ల, వాత్సల్యంతో భగవాన్ తన సొంత పట్టమహిషి అయిన శ్రీ మహాలక్ష్మి మరియు నిత్యసూరుల కంటే తన నూతన భక్తుల పట్ల (ఇటీవల శరణాగతి చేసేవారు) గొప్ప స్నేహం మరియు అనుబంధాన్ని చూపిస్తారని వివరించబడింది. ఈ విభాగంలో, పిళ్ళై లోకాచార్యులు వివరిస్తున్నారు – ఒక ఆవు తన కొమ్ములతో తన ఒక దూడను దూరంగా నెట్టివేస్తుంది, కానీ అప్పుడే పుట్టిన లేగ దూడను మాత్రం  ప్రేమగా చూసుకుంటుందని వివరిస్తున్నారు. భగవాన్ కూడా తనకు కొత్తగా శరణాగతులైన వారి పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తాడు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ జ్ఞాన సారం పాసురం 25 లో వివరిస్తున్నారు, “ఎత్తే తన్ కన్ఱిన్ ఉడంబిన్ వళువన్ఱో కాదలిప్పదు అన్ఱదానై ఇన్ఱుగంద ఆ” – అప్పుడే పుట్టిన దూడ శరీరాన్ని తన నాలుకతో శుభ్రం చేస్తుంది అని వివరిస్తున్నారు. పిళ్ళై లోకాచార్యులు కూడా మరొక గొప్ప ఉదాహరణను ఇస్తున్నారు – ఎలాగైతే ఒక మగ ప్రేమికుడు తన ప్రేయసి యొక్క స్వేదాన్ని ఇష్టపడతాడో (చెమట సాధారణంగా ఇష్టపడనప్పటికీ), అలాగే భగవాన్ శరణాగతులైన భక్తుల లోపాలను కూడా ఇష్టపడతాడు. మాముణులు తన వ్యాఖ్యానంలో చాలా ఉదాహరణలతో ఈ విభాగాన్ని అందంగా వివరించారు. అదేవిధంగా, మన ఆచార్యులు ఇతర శ్రీవైష్ణవులలోని మంచి లక్షణాలను మెచ్చుకొని, వారిలో చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వారు ఎల్లప్పుడూ వాటిని సానుకూల దృష్థితో చూసి ముందుకు సాగారు.
  • మన పట్ల ఆప్యాయత చూపించే వారి పట్ల ఆప్యాయత చూపడం, మన పట్ల కోపం చూపించేవారికి కోపం చూపించడం అడ్డంకులు. అనువాదకుల గమనిక: ఎదుటి వారు మనతో ఎలా వ్యవహరిస్తారనే దాని ఆధారంగా కాకుండా అందరి పట్ల సమతుల్యతతో ఆప్యాయంగా ఉండాలి.
  • ఆచార్యుల పట్ల శత్రుత్వం చూపించే వారితో సంబంధాలు పెట్టుకోవడం అడ్డంకి. అనువాదకుల గమనిక: అందరి పట్ల స్నేహంగా ఉన్నప్పటికీ, భగవాన్ మరియు ఆచార్యుల శత్రువులతో వ్యవహణను జాగ్రత్తగా నివారింకోవాలి. జీవాత్మ మరియు పరమాత్మతో మన సంబంధాన్ని ప్రేరేపించేవాడు ఆచార్యుడు. అతను జీవత్మా మరియు పరమాత్మలిద్దరికీ సహాయకుడని గొప్పగా కీర్తింపబడ్డారు. భగవాన్ దాసుడని తన నిజమైన స్వభావాన్ని గ్రహింపజేసి అతను జీవాత్మకు సహాయం చేస్తాడు. జీవాత్మకు తన నిజమైన స్వరూపాన్ని గుర్తింపజేసి సరైన అవగాహన కల్పించి పరమాత్మసంపత్తిని (జివాత్మను) తన వద్దకు పంపినందుకు పరమాత్మకు సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో పిళ్ళై లోకాచార్యులు అందంగా వివరించారు.
  • తమ ఆచార్యుల  శిష్యులు / భక్తులతో స్నేహపూర్వక సంబంధం పెట్టుకోకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చివరిలో, పిళ్ళై లోకాచార్యులు సూత్రం 451 లో ఇలా వివరిస్తున్నారు, ఆచార్య నిష్థులకు  (ఆచార్యులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన వారికి), అటువంటి ఇతర ఆచార్య నిష్టులతో సంబంధం చాలా అనుకూలమైనది. మాముణులు వ్యాఖ్యానంలో ఇలా వివరించారు, వారి సంబంధం ద్వారా, తమ ఆచార్య నిష్ట మెరుగుపడుతుంది, అందువల్ల అటువంటి అధికారులతో మాత్రమే స్నేహం ఉండాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/07/virodhi-pariharangal-30/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment