శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/09/24/virodhi-pariharangal-38-telugu/
71. సిద్ధాంత విరోధి – సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే అవరోధాలు – భాగం 3 (ముగింపు భాగం)
ఆళ్వార్ తిరునగరి, శ్రీపెరుంబుదూర్, శ్రీ రంగం, తిరునారాయణపురంలో శ్రీ రామానుజులు
మనము ఇప్పుడు ఈ భాగాన్ని ముందుకు కొనసాగిద్దాము. ఈ విషయాలలో చాలావరకు లోతైన శాస్త్ర జ్ఞానం అవసరం, శాస్త్రం యొక్క క్రమబద్ధమైన అధ్యయనం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందవచ్చు. లోతైన సంపూర్ణ అవగాహనకు, పండితుల మార్గదర్శకత్వంతో ఈ సూత్రాలను నేర్చుకోవడం మంచిది.
- పరమపదంలో అపరిమిత నిత్య కైంకర్యానికి దారితీసే మోక్షం పట్ల కోరిక లేకపోవడం ఒక అడ్డంకి. మునుపటి వివరణలో, అల్పమైన తాత్కాలిక ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి వదులుకోవలసిన అవసరాన్ని మనము చూశాము. ఇక్కడ మోక్షం, అనంత (అనంతమైన) స్థిర (నిత్య / శాశ్వతమైన) ఫలితమని వివరించబడింది. అలాంటి లక్ష్యం పట్ల కోరిక లేకపోవడం ఒక అడ్డంకి. ఇక్కడ వివరించినట్లుగా “ముక్తిర్మోక్షః మహానంధః” – మోక్షం పరిమితి లేని నిత్యానందం. ముక్తి పొందినవారికి, పునర్జన్మ ఉండదు. అనువాదకుల గమనిక: ఛాందోగ్య ఉపనిషత్ ఇలా ఘోషిస్తుంది, “న చ పునరావర్తతే, న చ పునరావర్తతే” – తిరిగి రావడం ఉండదు. సూత్రాన్ని రెండుసార్లు చెప్పడం అనేది దృఢంగా నొక్కి చెప్పి, బలపరచడం అని అర్థం. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత 8.16వ శ్లోకంలో, “ఆ బ్రహ్మ భువనాత్ లోకాః …” – అగ్రస్థానమైన బ్రహ్మ లోకం నుండి అత్యల్ప స్థానము వరకు జన్మ / మరణాలు పునరావృతమవుతాయి అని వివరిస్తునారు. కాని అతన్ని చేరుకున్నవాడు, భౌతిక ప్రపంచంలో మరళా జన్మించడు. ఇది పరమపదం యొక్క ఒక అపూర్వమైన స్వభావం – ఎవరైనా అక్కడకు చేరుకున్న తర్వాత, జీవాత్మ సంపూర్ణ శుద్దులై, జ్ఞానం సంపూర్ణగా వికసించబడుతుంది. కాబట్టి, మరళా సంసారానికి తిరిగి వచ్చే అవకాశం లేదు. పరమపదంలో వివిధ రూపాలలో వివిధ రకాలుగా భగవానుకి సేవలను కొనసాగిస్తారు. ఇది ఛాందోగ్య ఉపనిషద్లో ఇలా వివరించబడింది, “స ఏకతా భవతి, త్రితా భవతి,….” – అతను ఒక రూపం, 3 రూపాలు మొదలైనవి ధరించవచ్చు. అతను పరమానందాన్ని రుచి చూసిన తరువాత జీవాత్మ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం లేదు. భగవాన్ సకల ప్రయత్నాలు చేసి జీవాత్మను పరమపదానికి రప్పించిన తరువాత తిరిగి ఈ సంసారానికి పంపడు. కాబట్టి, పరమపదంలోని ఆ నిత్య కైంకర్యాన్ని కోరుకోవాలి.
- ముముక్షువుగా సంసారం పట్ల అసహ్యం ఉండక పోవడం ఒక అడ్డంకి. ముముక్షు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు. నమ్మాళ్వారుల తిరువిరుత్తం 1 వ పాసురంలో, “ఇన్నింఱ నీర్మై ఇనియాం ఉఱామై” – ఈ సంసారంలో చిక్కుకున్న నా పరిస్థితిని నేను తట్టుకోలేక పోతున్నాను, అని వారి భావనను ప్రదర్శించారు. ఈ భౌతిక ప్రపంచం పట్ల వ్యక్తికి అయిష్టత ఉండాలి, దాన్ని జయించడానికి పరమపదం చేరుకోవాలనే మహా సంకల్పం ఉండాలి. దీనిని “సంసారత్తిల్ అదిక్కొదిప్పు” – భౌతిక ప్రపంచంలో ఉండటం వేడి ఇసుకలో నడవడం లాంటిది అని వివరించబడింది. అనువాదకుల గమనిక: వేడి ఇసుక మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే గబగబా నీడ కోసం వెదుకుతాడు. సంసారాన్ని వేడి ఇసుకతో పోల్చారు, పరమదాన్ని చల్లని నీడతో పోల్చారు. భగవాన్ని కూడా, “వాసుదేవ తరు ఛాయా” – వాసుదేవుడు నీడనిచ్చే చెట్టు అని వివరించారు. పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడి సూత్రం 116 (ద్వయ ప్రకరణం యొక్క మొదటి సూత్రం) లో శ్రీవైష్ణవ లక్షణం గురించి వివరిస్తున్నారు. అనేక శ్రీవైష్ణవ లక్షణాలలో, ఒక వైష్ణవుడు పరమపదం చేరుకొని నిత్య కైంకర్యం చేయాలని గట్టి నమ్మకంతో ఉండాలని చెబుతున్నారు. అతను ఆ లక్ష్య సిద్ధికి నిరంతరం ఆరాటపడాలి. ఆ వ్యక్తి ఎలాగో అలాగ జీవితాన్ని గడుపుతున్నానని తృప్తి పడకూడదు. ఈ భౌతిక ప్రపంచ దుఃఖాల నుండి విముక్తి పొందాలని, పరమపదంలో నిత్యం భగవానుడికి సేవ చేయాలని నిరంతర కోరిక ఉండాలి. అలాంటి ఉద్దేశం లేకపోవడం ఒక అడ్డంకి.
- కర్మ ద్వారా సాధించినదేదైనా తాత్కాలికమైనదని, ముఖ్యం కాదని అర్థం చేసుకోకపోవడం, బ్రహ్మం గురించి తెలుసుకోవాలని ఇష్టపడకపోవడం ఒక అడ్డంకి. కర్మ సాధ్య ఫలం – యాగం, యాజ్ఞాలు మొదలైన వాటి ద్వారా సాధించినదేదైనా, అంటే లౌకిక సంపద, స్వర్గ సుఖాలు మొదలైనవి తాత్కాలికమైనవి – ఆ పుణ్యం ఖర్చయిపోయిన తర్వాత అంతమౌతాయి. అవి శాశ్వతమైనవి కావు. పరమపదంలో నిత్య ఆనందకరమైన కైంకర్యంతో పోల్చినప్పుడు, ఇవి చాలా అల్పమైనవి. అటువంటి ప్రాపంచిక ఆనందాల పరిమితులను అర్థం చేసుకున్న తరువాత కూడా భగవత్ కైంకర్యాలకై ప్రయత్నించని వారిది ఒక దయనీయ స్థితి. అనువాదకుల గమనిక: భగవద్గీత 8.15 లో, శ్రీ కృష్ణ పరమాత్మ “మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం…” అని ఉపదేశించారు. అనగా ఎవరైతే నన్ను చేరుకుంటారో వాళ్ళు అన్ని దుఃఖాలకు నిలయమైన (దుఃఖాలయం), తాత్కాలికమైన (అశ్వతం) ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తి పొందుతాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా, పాతాళ లోకం నుండి బ్రహ్మ లోకం వరకు, జన్మ, మృత్యు, జరా, వ్యాధుల సమస్యలు ఉంటాయి. ఈ నాలుగు ప్రధాన సమస్యలు ఉండటంతో, దుఃఖానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల, అతి అల్పమైన భౌతికాంశాల పట్ల మక్కువ తగ్గించుకొని, పరమపదంలో భగవాన్కు నిత్య ఆనందకరమైన కైంకర్యం చేయాలనేది లక్ష్యంగా పెట్టూకోవాలి.
- “బ్రహ్మ” అనే పదంతో సూచించబడినవారు, నారాయణ అనువాకం (సూక్తం) లో వెల్లడైన నారాయణుడని తెలుకోకపోవడం ఒక అడ్డంకి. నారాయణ సూక్తంలో, మనం “నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరోజ్యోతిః ఆత్మా నారాయణః పరః”. నారాయణ అని పిలువబడే అతి ఉన్నత స్వామి తనతో సమానంగా ఎవరూ లేని పరబ్రహ్మం అని ఇక్కడ శ్రుతిలో ప్రకటించబడింది. ఇది ప్రతి ఒక్కరూ నేర్చు కోవడం మరియు అర్థం చేసుకోవడం చాల అవసరం.
- శాస్త్రంలోని కర్మ భాగం స్వయంగా భగవాన్ చేత స్థాపించబడిందని, అందరూ అనుసరించాలని తెలియకపోవడం ఒక అడ్డంకి. వేదం రెండు భాగాలుగా విభజించబడింది. కర్మ భాగం – యాగం, యజ్ఞం (ఆరాధన) మొదలైన వాటిని వివరిస్తుంది. కర్మలు రెండు రకాలు. ఆజ్ఞ కర్మలు – నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. ఈ నిత్య / నైమిత్తిక కర్మలు నియమం తప్పకుండా చేయాలి. అకరణే ప్రత్యవాయం – అటువంటి కర్మలను ఆచరించనపుడు పాపాలకు దారితీస్తుంది. కామ్య కర్మము అని పిలువబడే ఇంకొక రకమైన కర్మలు ఉన్నాయి – ఇవి ఐచ్ఛికమైనవి, సాధారణంగా భౌతిక ప్రయోజనాలపై దృష్టి ఉన్నవి. మన నిత్య కర్మలను ఈ సంకల్పంతో “శ్రీ భగవదాజ్ఞా భగవత్ కైంకర్యం రూపం” ఆచరిస్తాము – భగవాన్ చేత నిర్ణయించబడిన కర్మలు భగవత్ కైంకర్యంలోని భాగములు. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యుల శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రం యొక్క 1 వ సూత్రానికి తన వ్యాఖ్యానంలో మాముణులు వేదం యొక్క రెండు భాగాల విభజన సూత్రాన్ని, పూర్వ భాగం, ఉత్తర భాగంగా వివరిస్తున్నారు. “అతతో ధర్మ జిజ్ఞాస” తో పూర్వ మీమాంస (జైమిని సూత్రం) మరియు ఉత్తర మీమాంస (వేద వ్యాసుని బ్రహ్మ సూత్రం) “అతతో బ్రహ్మ జిజ్ఞాస” తో మొదలవుతుందని వారు వివరిస్తున్నారు. కర్మానుష్ఠానము ద్వారా బ్రహ్మను ఆరాధించే పద్ధతిని వివరించడంపై పూర్వ భాగం కేంద్రీకృతమై ఉంది మరియు ఆరాధింపబడే బ్రహ్మం యొక్క గుణాల వివరణపై ఉత్తర భగం దృష్టి సారించింది. అందరు దేవతలు భగవానుడి శరీర భాగములు, భగవాన్ చేత సంరక్షింప బడుతున్నారని నిర్ధారించడానికి అతను తైత్రియా ఉపనిషత్ లోని “స ఆత్మా, అంగాన్యన్యా దేవతః”ను కూడా ఉల్లేఖిస్తున్నారు. ఇది తెలుసుకున్న పండితులు భగవత్ ఆరాధనను (స్వయంగా భగవాన్ నిర్దేశించినట్లుగా) కర్మ అనుష్ఠానములోని భాగంగానే ఆచరిస్తారు. ఈ విభాగానికి వారి వ్యాఖ్యాన వివరణ సుదీర్ఘమైనది – కాని ఇది మన సత్ సాంప్రదాయం యొక్క ప్రాథమిక సూత్రాలకు అద్భుతమైన ఒక విశ్లేషణ, ఇది పండితుల సరైన మార్గదర్శకత్వంలో అధ్యయనం చేయాలి.
- వేదములోని బ్రహ్మ భాగం తన స్వరూప, రూప, గుణ, విభవ (అవతారాములు) మొదలైనవాటిని వివరిస్తుందని, భాగవాన్ను చేరుకోవడంతో పూర్తి అవుతుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మ భాగం – ఉపనిషత్తులు. ఇవి మహోన్నతుడైన శ్రీమన్నారాయణుని నిజమైన స్వరూప, రూపాలు, గుణాలు, అవతారాములు మొదలైనవాటిని వివరిస్తాయి. స్వరూపం అంటే స్వభావం – సర్వాధికారం, సర్వవ్యాపకత్వం మొదలైనవి. రూపం అనగా వారి దివ్య ఆకారం, మృదు స్వభావం మొదలైనవి. గుణం అనగా వారి సమస్త దివ్య మంగళ గుణాలు – వారి ఆధిపత్యాన్ని తెలియజేసే జ్ఞానం, శక్తి మొదలైన గుణాలు, వారి సౌలభ్యాన్ని తెలియజేసే సరళత , అందరితో స్వేచ్ఛగా కలవడం, మాతృత్వం మొదలైనవి వారి సరళతను తెలియజేసే గుణాలు, విభవం మొదలైనవి తెలియజేసే అతని అవతారములు, అపరిమిత సంపద మొదలైనవి. ఒక వ్యక్తి వీటిని (స్వరూప, రూప, గుణ, విభవ మొదలైనవి) అర్థం చేసుకున్న తర్వాత, అతనికి భగవానుడిని చేరుకునే కోరిక పెరుగుతుంది, ఆ తరువాత అతన్ని సాధించే మార్గాల గురించి అన్వేషిస్తాడు. అనువాదకుల గమనిక: ఇక్కడ బ్రహ్మ భాగం అనగా ఉపనిషత్తులు మరియు బ్రహ్మ (వేదాంత) సూత్రం అని అర్థం. వేదాంత సూత్రాలు బ్రహ్మం యొక్క గుణాలను స్పష్టంగా స్థాపించే అతి ముఖ్యమైన సాహిత్యాలు. బోదాయన ఋషి మొదట కాశ్మీర్‌లో భద్రపరచబడిన బ్రహ్మ సూత్రానికి వ్యాఖ్యానం రాశారు. ఆళవందారుల (యామునాచార్యులు) కోరిక మేరకు విశిష్టాద్వైత సిద్దాంతాన్ని స్థాపించడానికి శ్రీ రామానుజులు ఒక వివరణాత్మక వ్యాఖ్యానాన్ని వ్రాస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, భగవత్ రామానుజులు కూరత్తాళ్వానులతో పాటు కాశ్మీర్కు ప్రయాణించి, బోధాయన వృత్తి గ్రంథాన్ని సంపాదించి, శ్రీరంగానికి తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. దీని గురించి విన్న కొంతమంది దుండగులు, వారు శ్రీ రామానుజుల జాడ వెతికి, బోధాయన వృత్తి గ్రంథాన్ని ఎత్తుకెళ్లిపోతారు. శ్రీ రామానుజులు దుఃఖ సాగరంలో బాధపడుతుండగా, కూరత్తాళ్వాన్ ఉపశమనం చేకూరుస్తారు. ఎలా అంటే, ప్రయాణ సమయంలో శ్రీ రామానుజులు విశ్రాంతి తీసుకుంటున్నపుడు కూరత్తాళ్వాన్ మొత్తం గ్రాంథాన్ని కంఠస్తం చేసుకుంటాడు. వాళ్ళు శ్రీరంగానికి తిరిగి వస్తారు. శ్రీ రామానుజ కూరత్తాళ్వానుల సహాయంతో శ్రీ భాష్యం (బ్రహ్మ సూత్రానికి వివరణాత్మక వ్యాఖ్యానం) పూర్తి చేస్తారు. శ్రీ రామానుజులు అప్పుడు కాశ్మీర్కు తిరిగి వెళ్లినపుడు శారదా పీఠంలో స్వయంగా సరస్వతి దేవి ఎంతో ఆనందంతో స్వాగతం పలుకుతుంది. ఆమె అతని నుండి భాష్యాన్ని స్వీకరించి తన దృష్టితో అనుగ్రహిస్తుంది. గొప్ప సాహిత్య స్పష్టతతో ఉన్న భాష్యాన్ని చూసి ఎంతో ఆనందంతో శ్రీ రామానుజులను “శ్రీ భాష్యకార” అనే బిరుదుతో సత్కరిస్తుంది. శ్రీ రామానుజులు ఉపనిషత్తులకు ప్రత్యేక వ్యాఖ్యానం వ్రాయలేదు. రామానుజులు శ్రీనివాసుని (తిరువెంకటేశ్వరుడు) ఎదుట వేదార్థ సంగ్రహం ఉపన్యాసమిచ్చారు. ఈ వేదార్థ సంగ్రహంలో, అధ్వైతులచే తప్పుగా అన్వయించబడిన ఉపనిషత్తుల అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అహం బ్రహ్మాసి, తత్వమసి మొదలైన పదబంధాలను అధ్వైతులు తప్పుగా అర్థం చేసుకోగా, అలాంటి పదబంధాలను సరైన ప్రమాణాల ద్వారా వేదార్థ సంగ్రహంలో స్పష్టంగా వివరించారు. ఈ విధంగా, శ్రీ రామానుజుల ఈ గొప్ప రచనల ద్వారా బ్రహ్మం యొక్క అద్భుతమైన అంశాలను సందేహం లేకుండా సహజమైన రీతిలో మనం అర్థం చేసుకోవచ్చు.
- కైంకర్యం (పరంపదంలో) అత్యోన్నత లక్ష్యమని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. శ్రీమన్నారాయణుడను చేరుకోవడం పరమ పురుషార్థం (అత్యోన్నత లక్ష్యం). భగవత్ అనుభవం (భగవానుడిని అనుభవించే పరమానందం) ఈ లక్ష్య సాధనలో మొదటి మెట్టు. అలాంటి అనుభవం అతని అద్భుతమైన గుణాలను తెలుసుకోవాలనే ప్రీతి మనలో ఏర్పడుతుంది. అలాంటి ప్రేమ వారి ఆనందానికై కైంకర్యం వైపు నడిపిస్తుంది. అనువాదకుల గమనిక: “అకిన్చిత్కరస్య శేషత్వ అనుపపత్తిః” అని చెప్పినట్లుగా – మన నిజ స్వరూపమైన దాస్యత్వం చిన్న చిన్న కైంకర్యాలు చేయడంతో సిద్దమౌతుంది. శేషత్వంలో స్థిరమవుటయే విముక్తి, అని విముక్తి గురించి వేదాంతం వివరిస్తుంది. శేషత్వం ఆత్మ యొక్క ప్రధాన గుణం. ఆ శేషత్వం భగవత్ ప్రీతికై సంపూర్ణ నిస్వార్థ కైంకర్యానికి దారి తీయాలి. అత్యోన్నత లక్ష్యం గురించి మరేదైనా ఇతర అవగాహన, కేవలం ఒక అపార్థం మాత్రమే అవుతుంది.
- సామ్యపత్తి (జీవాత్మ బ్రహ్మంతో సమాన స్థాయిని సాధించడం) సామరస్యం (సమాన ఆనందాన్ని పొందడం) అనే కోణంతో మాత్రమే సూచించబడుతుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. శ్రుతిలో, “పరమం సామ్యముపైతి”, “సోస్నుతే సర్వాన్ కామాన్ సహబ్రహ్మణా” అని మోక్షం గురించి వివరించబడింది. ముఖ్యంగా, నిత్యసూరులు, ముక్తాత్మలు, భగవాన్ మధ్య సమాన జ్ఞానం, ఆనందం ఉంటుంది. అయినప్పటికీ, భగవాన్ స్వామిగానే ఉంటాడు, జీవాత్మలు వరికి సేవకులుగానే ఉంటారు. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమాన్ను చేరుకోవడమే జీవాత్మకు నిజమైన అనుగ్రహం. తన వద్దకు చేరుకున్నవారికి, సామ్యాపత్తి మోక్షంతో ఆశీర్వదిస్తాడు, అతను తిరుమంగై ఆళ్వార్ చేత పెరియ తిరుమోళి 11.3.5 లో గుర్తించినట్లు, “తమ్మైయే ఒక్క అరుళ్ చెయ్వర్” – భగవాన్ ముక్తాత్మలకు తన గుణాలను అనుగ్రహిస్తారు అని అర్థం. సామ్యాపత్తి మోక్షం అనగా భగవాన్ కృపతో ముక్తాత్మ ఎనిమిది గుణాలను పొందుతాడు. ఈ గుక్షణాలు భగవాన్లో సంపూర్ణంగా ఉంటాయి. కానీ ఈ ఎనిమిది గుణాలకు మించి ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి శ్రియః పతిత్వం (శ్రీ మహాలక్ష్మి భర్త కావడం), శేష సాయిత్వం (ఆదిశేషుపై పవలించేవాడు), ఉభయ విభూతి నాతత్వం (నిత్య విభూతి మరియు లీలా విభూతి రెండింటినీ నియంత్రించేవాడు) మొదలైనవి కేవలం భగవానుడికి మాత్రమే ప్రత్యేకమైనవి. ఎనిమిది గుణాలు; అపహతపాప్మా – పాప విముక్తిడు, విజరః – నిత్య యవ్వనుడు, విమృత్యుః – మరణము లేని వాడు, విశోకః – దుఃఖాలు లేనివాడు, విజిగత్సః – ఆకలి లేని వాడు, అపిపాసః – దాహం లేని వాడు, సత్యకామః – అన్ని కోరికలను తీర్చగల వాడు, సత్యసంకల్పః – ఏ కార్యాన్నైనా పూర్తి చేయగలవాడు.
- స్వరూప ఐక్యం (పరమాత్మలో జీవాత్మ విలీనమవుట) ఒక అడ్డంకి. మునుపటి అంశంలో వివరించినట్లుగా, అధ్వైతులు ప్రచారం చేసిన జీవాత్మ బ్రహ్మంగా మారడం అనే సూత్రం కేవలం భ్రమ మాత్రమే.
- ముక్తి పొందిన తరువాత భగవానుడికి కైంకార్యం చేయుటకు జీవాత్మ అనేక రకాల రూపాలను ధరిస్తాడు. ముక్తి తరువాత శరీరం ఉండదనే భ్రమలో ఉండటం ఒక అడ్డంకి. ముక్తాత్మలకు కైంకార్యం అత్యున్నత లక్ష్యమని మనం అర్థం చేసుకోవాలి. కైంకార్యం చేయటానికి, జీవాత్మకి ఒక శరీరం అవసరం. పొయ్గై ఆళ్వార్ ముదల్ తిరువందాది 53 వ పాసురంలో “చెన్రాల్ కుడైయాం ఇరున్తాల్ చింగాచనమాం నిన్రాల్ మరవడియాం…..” – భగవాన్ నడుస్తున్నపుడు ఆదిశేషుడు గొడుగు రూపంగా మారతాడు, భగవాన్ కూర్చున్నపుడు ఆదిశేషుడు సింహాసనంగా మారతాడు, భగవాన్ నిలుచున్నపుడు ఆదిశేషుడు వారి పాదుకలుగా మారతాడు… కాబట్టి ఆదిశేషుడు (నిత్యసూరుడు) గొడుగు, సింహాసనం, పాదుకలు, శయ్య మొదలైన రూపాలను ధరించి కైంకర్యమును నిర్వహిస్తాడు. అదేవిధంగా, ముక్తాత్మలు (విముక్తి పొందిన ఆత్మలు) కూడా అనేక కైంకర్యాలలో వేర్వేరు రూపాలను ధరిస్తారు. శరీరం లేకుండా కైంకర్యము ఎలా చేయగలము? చేయలేము కాబట్టి. అనువాదకుల గమనిక: ఈ పాసుర వ్యాఖ్యానంలో, శ్రీ మహాలక్ష్మిని శ్రీమన్నారాయణులను సంతోషపెట్టడానికి ఆదిశేషుడు ఏ రూపమైనా ధరిస్తాడని నాంపిళ్ళై అందంగా వివరిస్తున్నారు. ఈ పాసురంలో ఆదిశేషుని మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ, ఇది పరమపదంలోని అందరు ముక్తాత్మలకు ఉపలక్షణం (ఉదాహరణ) గా చేయబడుతుందని వారు ఉల్లేఖిస్తున్నారు. మనము ఇప్పటికే చంధోగ్య ఉపనిషద్లోని “స ఏకతా భవతి, త్రితా భవతి, …” ఈ ప్రమాణం చూశాము.
- ముక్తి అంటే అర్చరాది మర్గం (అర్చిరులతో ప్రారంభమయ్యే మార్గం) ద్వారా ప్రయాణించి ఆఖరున పరమపదాన్ని చేరుకోవడం, జీవన్ముక్తితో భ్రమపడటం (ఈ సంసారంలో ఈ జీవితంలోనే ముక్తి పొందడం) ఒక అడ్డంకి. నిజమైన ముక్తి / మోక్షం అంటే ఈ సంసారంలో జన్మ / మరణ చక్రం నుండి ముక్తి పొందడం, పరమపదం చేరుకోవడం, పరవాసుదేవుని అనుభవించడం, అతనికి నిత్య సేవ చేయడం, వారి పరమానందము కోసమని వివరించబడింది. జీవాత్మ మరణించే సమయంలో తన శరీరాన్ని విడిచిపెట్టి, అర్చరాది మర్గం ద్వారా ప్రయాణిస్తాడు, ఇది స్వయంగా భగవాన్ సహాయమందించిన ప్రకాశవంతమైన మార్గం. ఈ అంతిమ స్థితిని “ముక్తిర్ మోక్షః మహానందః” – పరమానందకరమైన విముక్తి అని అర్థం. శంకరుని అద్వైత తత్వశాస్త్రంలో, “తత్వమసి” వంటి వేదాంతంలోని వాక్యముల అర్ధాలను నేర్చుకోవడం, “స్వయం బ్రహ్మం” అని అర్థం చేసుకోవడాన్ని ముక్తిగా భావించారు. అద్వైత తత్వశాస్త్రం ప్రకారం జీవాత్మ ఈ జీవితంలోనే విముక్తి పొందుతాడు. కానీ అలాంటి అవగాహన ఒక భ్రమను కలిగింపజేస్తుంది. అనువాదకుల గమనిక: అర్చిరాది మార్గాన్ని నమ్మాళ్వారులు తిరువాయ్మొళి పదిగం 10.9 – “సూళ్విసుమ్బణిముగిల్” లో వివరించారు. అర్చిరాది మార్గం, పరమపదంలోని అమితానందకరమైన అనుభవాన్ని పిళ్ళై లోకాచార్యులు చేత “అర్చిరాది ” అని పిలువబడే ఒక రహస్య గ్రంథంలో వివరించబడింది. పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడి 27వ సూత్రంలో పరమపదంలో భగవానుడిని సేవించాక అనుభవించే అత్యున్నత ఫలితాన్ని, ప్రమేయ శేఖరం మరియు అర్చిరాది గతిలో వివరించారు (వారి 18 రహస్య గ్రంథాలలో రెండు) అని పేర్కొన్నారు. తిరుమోగూర్ ఆప్తన్ పెరుమాళ్ళు అర్చిరాది గతిలో (జీవాత్మాను మోక్ష భూమికి చేర్చే మార్గం) జీవాత్మను తోడు తీసుకువెళతాడని నాయనార్ నమ్మాళ్వారుల దివ్య భావనలను వర్ణిస్తున్నారు. ఆప్తన్ అంటే నమ్మదగిన వాడు అని అర్థం – అతను మనలను సురక్షితంగా పరమపదానికి తీసుకువెళతాడనే నమ్మకం ఉండాలి.
- ఈ జీవితం ఆఖరిలో ఒక ప్రప్పన్నగా మన కర్మలు అన్ని శూణ్యం అయిపోయినప్పటికీ, సూక్ష్మ శరీరం జీవత్మాతో పాటు ప్రయాణిస్తుందని, అది విరజా నదిలో మునిగిన తరువాత మాయమౌతుందని, ఈ విషయంలో సందేహం ఉండటం ఒక అడ్డంకి. భగవాన్ కృప వల్ల మన కర్మలు (సత్కర్మలు / దుష్కర్మలు) జీవితం ఆఖరిలో నిర్మూలించబడి, అర్చిరాది గతిలో ప్రయాణిస్తున్నప్పటికీ, అప్పటికీ సూక్ష్మ శరీరం ఆ జీవాత్మతో ముడిపడి ఉంటుంది. ఇది భగవత్ సంకల్పం ప్రకారం జరుగుతుంది. పరంపదం సరిహద్దులో (పరంపదం మరియు సంసారాన్ని వేరుచేసే) విరజా అనే పవిత్ర నది ఉంటుంది. జీవాత్మ ఈ నదిలో మునుగుతాడు, భగవాన్ “అమానవ” రూపంలో జీవాత్మ చేయిని పట్టుకొని అతనిని పైకి తీస్తాడు. ఈ కృప స్పర్శతో, సూక్ష్మమైన భౌతిక శరీరం సంపూర్ణంగా నశిస్తుంది (అప్పటి వరకు జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంతో ముడుపడి ఉంటాడు). “భౌతిక అంశాలను పూర్తిగా తొలగించడంతో అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది”, ఆ సమయంలో ఆ జీవాత్మ జ్ఞానం పూర్తిగా వికసించి ఉంటుంది. అనువాదకుల గమనిక: స్థూల శరీరం – పంచ భూతాలతో (ఐదు అంశాలు – భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం) కూడి ఉన్నది. సూక్ష్మ శరీరం – మునుపటి అనుభవాలతో కూడి ఉన్న మనస్సు, వాసన / రుచి. మాముణులు ఈ విషయాన్ని అచార్య హృదయం 104 వ చూర్ణిక వ్యాఖ్యానంలో అందంగా వివరించారు. పరమమపదంలో నిత్య సేవ చేయడానికి, సంసారంలో మునిగి ఉన్న ఒక జీవాత్మను తీసుకురావడంలో భగవాన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో ఈ చూర్ణికలో అందంగా వివరించారు. ఈ చూర్ణికలో, అతను కోరుకున్న పంటను పొందడానికి పొలంలో కష్టపడి పనిచేసే ఒక రైతు యొక్క ఉదాహరణను నాయనార్ ఉపయోగించారు. ఈ చూర్ణికలోని ఒక సూత్రం “సూక్ష్మవొట్టుం నీరిలే కళువి” అని వివరిస్తున్నారు. ఇక్కడ నాయనార్ బియ్యం ఉదాహరణగా తీసుకున్నారు, “బియ్యాన్ని నీళ్ళతో కడిగితే సూక్ష్మమైన మురికి కూడా తొలగిపోతుంది, అలాగే విరజా నదిలో మునిగిన తరువాత జీవాత్మ యొక్క సూక్ష్మ శరీరం తొలగిపోతుంది. ఇక్కడ మాముణులు ఒక అద్భుతమైన ప్రశ్నను లేవనెత్తుతున్నారు – జీవాత్మ యొక్క కర్మ పూర్తిగా తొలగించబడినప్పుడు, వాసనా (భౌతిక కోరికల అవశేషాలు) మొదలైన వాటితో కూడిన సూక్ష్మ శరీరం ఎందుకు అవసరం? సూక్ష్మ శరీరాన్ని విరజా నది వరకు తీసుకెళ్లడం భగవాన్ యొక్క సంకల్పం అని వారు స్వయంగా సమాధానం ఇస్తున్నారు, ఎందుకంటే ఒక జీవాత్మ ప్రయాణించడానికి (ఇంకే పనైనా సరే) శరీరం అవసరం. కాబట్టి, జీవాత్మ విరజా నదికి చేరే వరకు అతనిని సూక్ష్మ శరీరంతో చేర్చి ఉంచుతాడు భగవాన్. ఈ సూత్రాన్ని కూడా గట్టిగా స్థాపించడానికి మాముణులు పూర్వాచార్యుల పదాలను ఉల్లేఖిస్తున్నారు. జీవాత్మ విరజా నదిలో మునిగిన తర్వాత, సూక్ష్మ శరీరం తొలగి అమానవన్ స్పర్శతో ఆధ్యాత్మిక శరీరం ఇవ్వబడుతుంది (ఇది కూడా అదే చూర్ణికలో నాయనార్ చేత వివరించబడింది). ఇక్కడ ఎఱుంబి అప్పా యొక్క పాసురం గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం, “మన్నుయిర్గాళ్ ఇంగే మణవాళ మామునివన్ పొన్నడియామ్ సెంగమలప్పోదుగళై ఉన్నిచ్ చిరత్తాలే తీణ్డిల్ అమానవనుం నమ్మై క్కరత్తాలే తీణ్డల్ కడన్” – ఓహ్, ఇక్కడ స్థిరమై ఉన్న వడా! నమ్మకంతో మణవాళ మాముణుల పాదపద్మాలను తమ తలతో తాకినవారిని, అమానవన్ నియమ బద్ధుడై మమ్మల్ని తాకుతాడు (పరమపాదానికి మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు) అని అర్థం. ఈ పాసురం మాముణులు యొక్క ఉపదేశ రత్నమాల చివరిలో పారాయణం చేయబడుతుంది.
- సంసారం నుండి ముక్తి పొందడనికి ఒక మార్గంగా వివరించబడిన భక్తి యోగం పట్ల భయం ఉండటడం, భగవాన్ చేరుకోవడానికి ప్రపత్తి నిజమైన మార్గమని తెలియకపోవడం ఒక అడ్డంకి. ముక్తి కోసం (పరమపదంలో నిత్య కైంకర్యం) శాస్త్రంలో వివరించిన అనేక మార్గాలు ఉన్నాయి. భగవానుడిని చేరడానికి ఉన్నతమైన మార్గంగా శాస్త్రంలో నియమించబడిన భక్తియోగమని భగవద్గీతలో వివరించబడింది. కానీ ఈ భక్తి యోగం జీవత్మ యొక్క సొంత ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇది జీవత్మ సహజ స్వరూపమైన శేషత్వం (దాస్యం) మరియు పారతంత్రియం (ఆధారపడటం) కి విరుద్ధమౌతుంది. ఆ విధంగా మన ఆళ్వారులు, ఆచార్యలు భక్తి యోగాన్ని ఉపాయంగా తిరస్కరించారు, ప్రపత్తిని (పూర్ణ శరణాగతి) మాత్రమే ఉపాయం గా పరిగణించాలి, ఇది జీవాత్మకు సహజమైనది. మన పూర్వాచార్యుల అడుగు జాడలను అనుసరించడమే మనకు సముచితం.
- ప్రపత్తి అనే పదం నేరుగా భగవాన్ని సూచిస్తుందని స్పష్టత లేకపోవడం ఒక అడ్డంకి. ప్రపత్తి అనేది శరణాగతి – భగవానుడికి లొంగిపోవడం, వారిని ఆశ్రయంగా స్వీకరించడం. “మనము” అతనిని పట్టుకున్నట్లు అనిపించినప్పటికీ, అది నిజం కాదు. శారణాగతి యొక్క అసలు అర్ధం “త్వమేవ ఉపాయ భూతో మే భవ – ఇతి ప్రార్థనా మతిః” -ఇది ఒక మానసిక ప్రార్థన “నీవే నాకు ఉపాయంగా ఉండు”. అంటే ప్రపత్తి స్థానంలో, స్వయంగా భగవానుడే ఉపాయం అవుతాడు. అతను ఉపాయం కాబట్టి, “నేను శరణాగతి చేస్తున్నాను” అనే మన భ్రమతో కూడిన ఆలోచన ఉపాయం కాదు. అతను మాత్రమే ఉపాయం మరియు ఏకైక ఉపేయం కూడా. ఈ విధంగా ప్రపత్తి కూడా భగవానుడిని మాత్రమే సూచిస్తుందని చెప్పవచ్చు. అనువాదకుని గమనిక: గీతా చరమ స్లోకంలో, భగవాన్ అన్ని ధర్మాలను విడిచిపెట్టి, అతనికి మాత్రమే లొంగిపోమని, అతను అన్నిబాధల నుండి విముక్తుడుని చేస్తానని అర్జునుడిని ఆదేశిస్తాడు. పిళ్ళై లోకాచార్యులు ముముక్షుప్పడిలో ఈ చరమ స్లోకాన్ని అందంగా వివరిస్తున్నారు. ఇక్కడ శ్రీ కృష్ణ పరమాత్మ “మాం ఏకం శరణం” అని అంటున్నారు – నన్ను మాత్రమే ఉపాయంగా స్వీకరించు అని అర్థం. పిళ్ళై లోకాచార్యులు “ఏక” పదానికి విస్తృతమైన వివరణ ఇచ్చారు. శరణాగతి చర్య కూడా ఉపాయం కాదని, భగవాన్ మాత్రమే ఉపాయమని ఈ “ఏక” పదం నిర్ధారిస్తుందని ఇక్కడ వారు గుర్తుచేస్తున్నారు. అనేక సూత్రాలలో, “ఏక” పదం వివరించబడింది. ఈ సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మాముణుల అందమైన వ్యాఖ్యానంతో ముమ్ముక్షుప్పడి కాలక్షేపం వినాలి.
- శరణాగతి చర్యను పరిశీలిస్తే అది అధికారి విశేషణం (అర్హత కలిగిన వ్యక్తి యొక్క లక్షణం) ఉపాయమని భావించడం ఒక అడ్డంకి. మునుపు వివరించినట్లుగా, శరణాగతి చర్య కేవలం మోక్షం కోరుకునే వ్యక్తి యొక్క గుణం మాత్రమే – మరేమీ కాడు. ఉపాయంగా భ్రమపడటం సముచితం కాదు. అనువాదకుల గమనిక: అధికారి విశేషణం అంటే వ్యక్తిని గుర్తించే ప్రత్యేక లక్షణం. ఇక్కడ అధికారి మోక్షాన్ని కోరుకునేవాడు – అటువంటి జీవాత్మలకు, భగవానుడికి శరణాగతి చేయుట స్వాభావిక చర్య, ఇది జీవాత్మ యొక్క నిజమైన స్వభావం. ముమ్ముక్షుప్పడి సుత్రం 55 లో, పిళ్ళై లోకాచార్యులు “శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం” – భగవానుడికి దాసునిగా ఉండటం జీవాత్మ యొక్క వాస్తవ స్వభావం. జీవాత్మ ఒక సేవకుడని, శ్రీహరి స్వామి అని అనేక ప్రామాణాల ద్వారా మాముణులు అందంగా స్థాపించారు. తరువాతి సుత్రాంలో, అతను “శేషత్వమిల్లాదపోదు స్వరూపమిల్లై” – శేషత్వం లేనప్పుడు, వాస్తవ స్వరూపం ఉండదు. కాబట్టి, జీవత్మ స్వభావం ప్రకారం, భగవాన్కు శరణాగతి చేయడం సహజమైన చర్య మాత్రమే – దీనిని విశేష మార్గంగా పరిగణించలేము. ఈ సూత్రాన్ని వివరించడానికి కాలక్షేపంలో విన్న మంచి ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పరోపకారి తమ గృహంలో జనాలకు భోజనం పెడుతున్నాడు. తినాలని అనుకున్నవాళ్ళు అక్కడకు వస్తారు. ఇక్కడ ఆహారానికి ఉపాయం (మాధ్యమం) అందరికీ భోజనం పెట్టాలనే పరోపకారి యొక్క దయగల చేష్ట. కానీ అక్కడ తినాలనుకునేవారికి “ఆకలి” ఉండాలి – ఈ ఆకలి అధికారి విశేషణం – ఆకలి లేకుండా, వడ్డించినా తినలేడు. కానీ ఈ ఆకలి అనేది ఉపాయం (మాధ్యమం) కాదు – ఇది తినడానికి ఇష్టపడే వారి సహజ గుణం మాత్రమే.
- పురుషాకారం లేకుండా శరణాగతి చేయడం ఒక అడ్డంకి. సాధారణంగా పురుషకారం అంటే సిఫార్సు చేయడం. ఇది మన అభ్యున్నతికై భగవానుడిని ఉపాయంగా ఉండమని ఒప్పించే ఒక చర్య. మనలో కృత్య అకరణం (శాస్త్ర ఆజ్ఞలను పాటించక పోవడం), అకృత్య కరణం (శాస్త్రంలో నిషేధించబడిన చర్యలలో పాల్గొనడం), భగవత్ అపచారం (భగవాన్ పట్ల అపచారం), భాగవత అపచారం (వారి భక్తుల పట్ల అపచారం) మొదలైన వాటితో నిండి ఉన్న వాళ్ళము కనుక, భగవాన్ మనలను తిరస్కరించవచ్చు. లోపాలతో ఉన్నా కానీ దివ్య మాత శ్రీ మహాలక్ష్మి మన సిఫార్సు భగవానునితో చేసి స్వీకరించమని అతనిని ఒప్పించి, మన పట్ల అతని సంరక్షణను సులభతరం చేస్తుంది. పురుషాకారం యొక్క ప్రధాన అర్ధం ఇది. పురుషాకారం లేకుండా చేసిన ఏ శరణాగతి అయినా విఫలమవుతుందని చెప్పవచ్చు. అనువాదకుల గమనిక: శ్రీ మహాలక్ష్మి తాయార్ యొక్క పురుషాకార పాత్రను మన పూర్వాచార్యులు విస్తారంగా వివరించారు. ఎమ్పెరుమానార్ తమ శరణాగతి గద్యంలో మొదట తాయార్ వద్దకు వేళ్లి, ఆపై భగవానుడికి శరణాగతులౌతారు. ద్వయ మహా మంత్రం మన సత్ సాంప్రదాయంలో గొప్పగా కీర్తింపబడింది, ఎందుకంటే ఇది తాయార్ పాత్రను పూర్తిగా కీర్తింస్తుంది. ద్వయం యొక్క మొదటి భాగంలో, శ్రీమన్నారాయణను తాయార్ యొక్క పురుషాకారం (సిఫారసు) తో శరణాగతి చేసి అతన్ని మాత్రమే ఉపాయంగా స్వీకరించబడాలని వివరించారు. రెండవ భాగంలో, భగవత్ ఆనందాని కొరకు, వాళ్లిద్దరినీ దివ్య జంటగా కలిపి సేవించాలని వివరించబడింది. ముముక్షుప్పడిలో, పిళ్ళై లోకాచార్యులు తాయార్ను, ఆమె పురుషాకార పాత్రను చక్కగా వివరించారు. 135 వ సూత్రంలో పిళ్ళై లోకాచార్యులు వివరిస్తూ, శ్రీ రామునితో సీతాదేవి ఉన్నందుకు కాకాసురునికి ఎంతో సహాయమైయ్యింది, దురుఉద్దేశంతో బాధపెట్టాలని వచ్చిన కాకాసురుడిని చివరికి ఆమె సిఫార్సు కారణంగా రక్షింపబడ్డాడు. కానీ మరోవైపు, శ్రీ రామునితో సీతాదేవి లేనందున రావణుడిని ఆ సమయంలో శ్రీ రాముడు సంహరిస్తాడు. కాబట్టి, భగవాన్కు శరణాగతి చేస్తున్నపుడు, తాయార్ ఉనికి జీవాత్మను పూర్తిగా భగవాన్ స్వీకరించేలా చేస్తుంది. ఆమె పురుషాకారాన్ని విస్మరించడం అవాంఛనీయ ఫలితాలకు దారి తీస్తుందని నిర్ధారింపబడింది.
- ఆచార్యుని ఆశ్రయించినపుడు, వారిని స్వతంత్ర ఉపాయానికి (స్వతంత్ర మాధ్యమం) బదులుగా పురుషాకరంగా పరిగణించడం ఒక అడ్డంకి. సాధారణంగా ఆచార్యుని, తాయార్ సేవకుడిగా వర్ణిస్తారు. ఆచార్యులు కూడా తాయార్ వలే, దయగల మనస్సుతో, అందరి పట్ల కారుణ్యంతో ఉంటారు. నిర్లక్ష్య ప్రసక్తి లేకుండా అందరిపట్ల దయగలవారు. కానీ, రామానుశ నూత్తందాది 95 వ పాసురంలో వివరించినట్లుగా, “విణ్ణిన్ తలై నిన్రు వీడళిప్పాన్ ఎమ్మిరామానుశన్” – పరమపదం నుండి ఈ ప్రపంచంలోకి దిగిన తరువాత, మన స్వామి రామానుజులు ముక్తిని (స్వతంత్రంగా) ప్రసాదిస్తారు, ఆచార్యులు స్వతంత్ర ఉపాయంగా పరిగణించవచ్చు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో కీర్తించినట్టుగా సూత్రం 447 యొక్క సారమిది “ఆచార్య అభిమానమే ఉత్తారకం” – ఆచార్య అనుగ్రహమే మనకు అత్యున్నత ఉత్తారకం. అనువాదకుల గమనిక: ఆచార్యులను భగవాన్ అవతారంగా వివరిస్తారు. ఈ అంశంపై పూర్తి వివరాల కోసం దయచేసి https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-12/ చూడండి. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 427 వ సూత్రంలో వివరిస్తూ, భగవాన్‌ను నేరుగా ఆశ్రయించడం వారి చేతులు పట్టుకొని సహాయం చేయమని ప్రార్థించడం లాంటిది, కానీ ఆచార్యుల ద్వారా వారిని ఆశ్రయించడం వారి పాద పద్మాలను పట్టుకొని సహాయం కోరడం లాంటిది. ఆచార్యలను భగవాన్ యొక్క పాద పద్మాలుగా భావిస్తారు. భగవాన్ పాద పద్మాల మాదిరిగానే, ఆచార్యలు కూడా గొప్ప కారుణ్యం గలవారు. అందువలన, వారిని స్వతంత్ర ఉపాయంగా భావిస్తారు.
- ఉపాయం మరియు ఉపేయాన్ని రెండు వేర్వేరు తత్వాలుగా పరిగణించడం ఒక అడ్డంకి. పరమపదం చేరుకొని భగవానుడికి వారి ప్రీతి కోసం నిత్య సేవ చేయడమే అత్యోన్నత లక్ష్యం. ఈ అత్యోన్నత లక్ష్యాన్ని సాధించడానికి, అతను మాత్రమే సాధనం. ఈ విధంగా, భగవాన్ మాత్రమే ఉపాయం మరియు ఉపేయం కూడా.
- భగవాన్ యొక్క జగత్ శరీరత్వం (అన్ని విశ్వాలలో అంతర్యామిగా నివసించి ఉండటం) మొదలైన తత్వాలను స్వీకరించని వివిధ తత్వశాస్త్ర సంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటం ఒక అడ్డంకి. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 1.1.7వ పాసురంలో “ఉడన్మిసై ఉయిరెనక్కరన్తెంగుం పరన్తుళన్” – ఆత్మ శరీరం మొత్తంలో వ్యాపించినట్టుగా, భగవాన్ విశ్వం మొత్తంలో వ్యాపించి ఉన్నాడు అని వివరించారు. ఇక్కడ అన్ని విశ్వాలలోని ప్రతి అస్తిత్వంలో ఎమ్పెరుమాన్ ఉన్నారు, అన్ని అస్తిత్వాలు ఎమ్పెరుమాన్ యొక్క శరీరం – ఇది విశిష్ఠాద్వైత సిద్ధాంతం. రావణుడిని వధించి విజయం సాధించిన తరువాత బ్రహ్మ శ్రీ రాముడిని గొప్పగా కీర్తించారు. వారు శ్రీ రాముని యొక్క ఆధిపత్యాన్ని దృఢంగా స్థాపిస్తూ ఇలా వర్ణించారు, “సీతా లక్ష్మి భవాన్ విష్ణుః” – శ్రీమహాలక్ష్మి సీతగా, నీవు విష్ణువుగా. “జగత్ సర్వం శరీరంతే” – ఈ జగత్తు మొత్తం నీ యొక్క శరీరం అని వివరిస్తున్నారు. కానీ కుద్రుష్టులు (శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకునేవారు) ఈ సూత్రాలను అంగీకరించరు. అందువలన, అలాంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు. అనువాదకుల గమనిక: విష్ణువు సర్వవ్యాపి. వాసుదేవ అనగా అన్ని చోట్లా నివసించేవాడు. నారాయణ అనగా ప్రతిదానికీ నిలయంగా ఉన్నవాడు, అన్నింటిలో ఉన్నవాడు కూడా. భగవాన్ యొక్క ఈ మూడు నామాలు వారి సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఆయన అన్నింటిలో ఆత్మగా ఉండటం వల్ల తన జగత్ శరీరత్వం స్థాపించబడింది. ఇది చాలా సరళమైన విషయం. ఆత్మకు ఒక శరీరం ఉన్నట్టుగా, పరమాత్మకు ఈ విశ్వం శరీరం లాంటిది. ఈ సారూప్యతలో ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే – శరీరంలోని ఒక భాగంలో ఆత్మ ఉండి, జ్ఞానం ద్వారా శరీరమంతా వ్యాపించి ఉంటుంది (అనగా, శరీరంలోని ప్రతి భాగంలోనూ ఆత్మ భౌతికంగా ఉండదు) – దీనికి కారణం ఆత్మ అణు (సూక్ష్మ) స్వరూపమైనది. కానీ పరమాత్మ విభుడు (సర్వవ్యాప్తి) – కాబట్టి, అతను ఈ విశ్వంలోని ప్రతి కణంలోనూ భౌతికంగా ఉంటాడు. వేదాంతం యొక్క ఈ సూత్రాన్ని వివిధ సంస్థల పండితులు స్వీకరించరు. మనలో ఈ జ్ఞాన బలం లేకపోతే అలాంటి వ్యక్తులతో స్నేహం మనలో ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అలాంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదని ఇక్కడ చెప్పబడింది.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/10/virodhi-pariharangal-39/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org