విరోధి పరిహారాలు – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/10/31/virodhi-pariharangal-39-telugu/

72. తత్వ విరోధి  – యథార్థము / వాస్తవికతను అర్థం చేసుకోవడంలో అవరోధాలు – మొదటి భాగం

నమ్మాళ్వార్, ఎమ్పెరుమానార్, పిళ్ళై లోకాచార్యులు, మణవాళ మాముణులు

ఈ విషయాలలో చాలావరకు లోతైన జ్ఞానం అవసరం, ఇది క్రమబద్ధమైన శాస్త్రాధ్యయనం ద్వారా పొందవచ్చు. పూర్తి అవగాహన కొరకు, ఈ సూత్రాలను జ్ఞానుల నుండి నేర్చుకోవడం మంచిది.

  • తత్వ త్రయం (భోక్తృ – ఆనందించేవాడు – ఆత్మ, భోగ్య – ఆనందించినది – విషయం, నియంతృ – నియంత్రించువాడు – భగవాన్) తప్ప మరే తత్వం లేదని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. “భోక్తా, భోగ్యం, ప్రేరితారం చ మత్వా” అని శృతి అంటుంది. భోగ్యం – ఆనందించేది. భోక్తా – ఆనందించేవాడు. ప్రేరితా – భోక్తా, భోగ్యం రెండింటిని తన సంపత్తిగా ఉన్నవాడు, ఈ రెండింటిని నియంత్రించేవాడు. కాబట్టి, ఇవి మూడు సత్యాలు. ఎమ్పెరుమానార్ (శ్రీ రామానుజ) దర్శనం యొక్క ప్రాథమిక సూత్రమైయిన తత్వ త్రయాన్ని ఏకైక సిద్ధాంతంగా స్వీకరించాలి. అచిత్ – పదార్థం – ఆనందించబడేది శరీరం. శరీరం లోపల నివసించేవాడు మరియు సుఖ దుఃఖాలను అనుభవించే వాడిని చిత్ – జీవత్మ – ఆత్మ అంటారు. అచిత్ మరియు చిత్ రెండింటినీ తన శరీరంగా కలిగి ఉన్నవాడు, వాటిని నియంత్రించేవాడు సర్వేశ్వరుడు (శ్రీమన్నారాయణ). ఈ 3 వాస్తవ తత్వాలకు మించి ఏమీ లేదని గట్టి నమ్మకం ఉండాలి. ఈ సిద్ధాంతంపై స్పష్టత, దృఢమైన విశ్వాసం ఉన్నవాడు ఇతర తత్వశాస్త్ర సిద్ధాంతాలను ఎప్పటికీ అంగీకరించలేడు. లేదా ఆ సిద్ధాంతాలను విని ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత, వివిధ మతాల తత్వాలు వివరించబడ్డాయి, అలాంటి తత్వాలతో మనం భ్రమ చెందడం మన ఆధ్యాత్మిక పురోగతికి ఒక అడ్డంకి అని కూడా వివరించబడింది.  అనువాదకుని గమనిక: వేదాంత సారాన్ని ఎమ్పెరుమానార్లు శ్రీ భాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం మొదలైన గ్రంథాలలో వివరించారు. నమ్మాళ్వార్ యొక్క దివ్య ప్రబంధములు (తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువంతాది మరియు తిరువాయ్మొళి) వేద సారంగా గొప్ప కీర్తిచెందినవి. వీటిలో, తిరువాయ్మొళి అత్యంత ప్రసిద్ధమైన ప్రబంధము. తిరువాయ్మొళికి 5 వ్యాఖ్యానములు ఉన్నాయి, అవి తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ రాసిన 6000 పడి, నంజియార్ రాసిన 9000 పడి, పెరియావాచ్చాన్  పిళ్ళై వ్రాసిన 24000 పడి, నంపిళ్ళై యొక్క కాలక్షేపాలను వడక్కు తిరువీధి పిళ్ళై ఈడు 36000 పడిలో నమోదు చేసారు, వాధి కేసరి అళగియ మణవాళ జీయర్ వ్రాసిన 12000 పడి. వీటిలో, ఈడు 36000 పడి చాలా విస్తృతమైన మరియు సమగ్రమైన వ్యాఖ్యానంగా నిలుస్తుంది. నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానానికి రెండు అరుంపదములు (ఇంకా లోతైన వివరణములు) ఉన్నాయి, వాటిని అప్పు అరుంపదము మరియు జీయర్ అరుంపదము అని పిలుస్తారు. ప్రతి పరిచయంలో అనేక అద్భుతమైన సూత్రాలను వెలికి తీసుకువచ్చే ఈడు వ్యాఖ్యానానికి నంపిళ్ళై 3 పరిచయాలను ఇచ్చారు. “ముదల్ శ్రీయః పతి” – మొట్ట మొదటి శ్రీయః పతి, అనే మొదటి పరిచయంలో, యదార్థం యొక్క ఉత్కృష్ట జ్ఞానాన్ని భగవాన్ స్వయంగా నమ్మాళ్వారుకి అనుగ్రహించారు అని వారు వివరిస్తున్నారు.  మన సిద్ధాంతం గురించి వివరించే ముందు, మొదట అతను విభిన్న తత్వాలను, వాటి పరిమితులను తెలియ చేస్తున్నారు. తత్వాలను (వాస్తవికతలు / సత్యాలు) వేర్వేరు సిద్ధాంతాలు ఎలా అర్థం చేసుకుంటాయో అతను వివరించడంతో ప్రారంభిస్తున్నారు. అతను అలాంటి 17 తత్వాల గురించి చర్చించి, అవన్నీ వేదానికి విరుద్ధమైనవని కొట్టివేసారు. చివరకు వేదాంతం తత్వ త్రయాన్ని (3 తత్వాలు) మాత్రమే వివరిస్తుందని వారు స్థాపించారు. పిళ్ళై లోకాచార్యులు ఈ 3 తత్వాలను (చిత్, అచిత్, ఈశ్వర) “తత్వ త్రయం” అనే రాహస్య గ్రంథంలో వివరించారు. ఈ గ్రాంథాన్ని “కుట్టి భాష్యం” (చిట్టి శ్రీ భాష్యం) అని పిలుస్తారు, ఎందుకంటే ఇది భగవద్ రామానుజుల శ్రీ భాష్యంలో (వేదాంత సూత్రానికి వ్యాఖ్యానం) వివరించబడిన ముఖ్యమైన సిద్ధాంత అంశాలను వెల్లడి చేస్తుంది కాబట్టి. మాముణులు ఈ గ్రంథానికి ఒక విశాలమైన వ్యాఖ్యానం రాశారు, దీనిలో అతను వేదాంతం యొక్క అత్యంత సంక్లిష్టమైన విషయాలను చాలా అనర్గళంగా వివరించారు. ఈ అంశం యొక్క క్రమములో, మనము నంపిళ్ళై యొక్క మొట్ట మొదటి శ్రీయః పతి మరియు  మాముణుల వ్యాఖ్యానంతో పిళ్ళై లోకాచార్యుల తత్వ త్రయం నుండి వివిధ అంశాలను చర్చిస్తాము.
  • వైశేషిక వివరించిన విధంగా 6 తత్వములు (ద్రవ్యంతో మొదలయి) ఉన్నాయని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. మన సిద్ధాంతం తత్వ త్రయం (3 తత్వములు) పై ఆధారపడి ఉందని మనము ఇప్పటికే చూశాము. సాంఖ్య, వైశేషిక, పాసుపత, చార్వాక, బౌద్ధ, జైన అని వివిధ సిద్దాంతాలు ఉన్నాయి. అలాంటి తత్వాలను వినకూడదు, విని భ్రమ చందకూడదు. ఎమ్పెరుమానార్ (శ్రీ రామానుజ) దర్శనాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఈ ఇతర తత్వాలతో భ్రాంతి చెందడు.  ఈ తత్వాలన్నీ తిరస్కరించాల్సిన అవసరం ఉంది. “అఱుసమయ చ్చెడియతనై అడియఱుత్తాన్ వాళియే,  అడర్ న్తువరుం కుదృట్టిగళై అఱత్తుఱంతాన్ వాళియే” – షన్మతం (6 తత్వాలు – వేదానికి విరుద్ధమైనవి) అనే మొక్కను నాశనం చేసిన శ్రీ రామానుజ నీవు దీర్ఘకాలం జీవించు, కుదృష్టి మతాలనే (వేదాన్ని స్వీకరించని, తప్పుగా అర్ధం చేసుకునే తత్వాలు) కలుపు మొక్కలను తొలగించిన ఓ శ్రీ రామానుజ నీవు దీర్ఘకాలం జీవించు. వారి తిరునాక్షత్ర రోజును “శంకర భాస్కర యాదవ భాట్ట ప్రభాకరర్ తంగళ్ మతం చాయ్వుఱ వాదియర్ మాయ్గువరెన్రు చతుమఱై వాళ్ న్తిడునాళ్” –   శంకర, భాస్కర, యాదవ ప్రకాశ, భాట్ట, ప్రభాకర, మొదలైన తత్వశాస్త్రాలను చెరిపి,  వాదకులను ఓడించిన రోజున 4 వేదాలు సంతోషంగా స్థిరపడ్డాయి. ఇప్పటికే తిరస్కరించబడిన ఈ తత్వాలను మనము చర్చించాల్సిన అవసరం లేదు.
  • నైయాయికలో (న్యాయ పాఠశాల) వివరించిన విధంగా 16 తత్వములు (ప్రమాణంతో ప్రారంభమయ్యి) ఉన్నాయని భ్రాంతిపడటం ఒక అడ్డంకి.
  • సాంఖ్య సిద్ధాంతంలో వివరించిన విధంగా 25 తత్వములు (ములా ప్రకృతితో మొదలయ్యి) ఉన్నాయని  భ్రాంతిపడటం ఒక అడ్డంకి.
  • పతంజలిలో వివరించిన విధంగా 26 తత్వములు ఉన్నాయని భ్రాంతిపడటం ఒక అడ్డంకి.
  • పాసుపతుడు వివరించిన విధంగా 36 తత్వములు ఉన్నాయని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: రుదృనిపై కేంద్రీకృతమై పాసుపత ఆగమం ఆధారపడి  ఉంది.
  • చర్వాకుడు వివరించినట్లు  పృథ్వితో ప్రారంభమయ్యి 4 భూతములు ఉన్నాయని, అవి తత్వాలని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: వాస్తవానికి కేవలం 4 మూలాధారాలు (భూమి, నీరు, అగ్ని మరియు గాలి) ఉన్నాయని చర్వాకుడు అంగీకరించేవాడు. అవగాహనకు మించినది ఏమీ లేదని వారి ఆలోచన. చారు వాక్ అంటే అందమైన / పుష్పించే పదాలు అని అర్థం. ఇది మాత్రమే కనుక వీలైనంత సంతోషంగా ఈ జీవితాన్ని గడపాలని, ఎందుకంటే ఇదే వాస్తవం కనుక, అని వారి నమ్మకం. అతనిని లోకాయత అని అంటారు. వట్టి భౌతికవాది, నాస్తిక తత్వం కలిగినవాడు.
  • బుద్ధుడు వివరించినట్లుగా సత్యమనేది పంచ స్కందాలు (ఐదు వేర్వేరు సముదాయములు) మొదలైన వాటిపై ఆధారపడి ఉందని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ప్రధానంగా 4 రకాల బౌద్ధ తత్వాలు వివరించబడ్డాయి. బౌద్ధ శాస్త్రంలో 4 సిద్ధాంతాలు – వైభాషిక, సౌత్రాంతిక, యోగాచర మరియు మాధ్యమిక అని 4 సిద్ధాంతాలు వివరించబడ్డాయి. ప్రాథమికంగా, ఇది శూణ్యవాదం (పూర్తి శూన్యత) పై ఆధారపడి ఉంది – అనగా, సమస్తం  శూన్యము అని వారి భావన.
  • జైన మతంలో వివరించినట్లు సత్యమనేది ధర్మం, అధర్మం మొదలైన వాటిపై ఆధారపడి ఉందని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: జైన సిద్ధాంతం అహింస, త్యజించడం మొదలైన వాటిపై దృష్టి పెడుతుంది, వేద సూత్రాలతో సంబంధం లేకుండా.
  • మాయావాదులు వివరించిన విధంగా ఏక మాత్ర తత్వం జీవాత్మ అని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: మాయావాదులు ఏ పేరు, రూపం, గుణాలు మొదలైనవి లేని ఒక ఆత్మ (ఇది బ్రహ్మంగా పరిగణిస్తారు) ఉనికిని వివరిస్తుంది. ఆ ఆత్మ అజ్ఞానంతో కప్పబడి ఉండి అవాస్తవిక ప్రపంచాన్ని వాస్తవం అన్న భావనకు దారితీస్తుంది. అజ్ఞానం పొర తొలగిన తర్వాత, ఆత్మ దాని నిజమైన స్వభావాన్ని తిరిగి పొందుతుంది, అదే ముక్తి.
  • జీవాత్మలకు మించి ఈశ్వరునికి ప్రత్యేక అస్తిత్వం లేదని భట్టా, ప్రభాకర శాస్త్ర వివరణలకు భ్రాంతిపడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కుమారిల భట్టా మరియు ప్రభాకరులిద్దరు బలమైన అధ్వైత వేదాంత తత్వవేత్తలు.

ఇక్కడి నుంచి మొదలుకొని, అచిత్ తత్వం (పదార్థం – జ్ఞానం లేనిది) గురించి అనేక భ్రాంతులు, అపోహలు స్పష్టం చేయబడ్డాయి. పిళ్ళై లోకాచార్యులు రచించిన తత్వ త్రయం గ్రంథంలో స్థాపించబడిన అచిత్ తత్వ సూత్రాలను మనము మొదట చర్చిద్దాము. దీనిని అర్థం చేసుకున్న తర్వాత, అడ్డంకులు అవంతకు అవే తొలగిపోతాయి. ప్రత్యేకంగా వాటికి వివరణలు అవసరం లేదు.

అచిత్ తత్వము 3 వర్గాలుగా విభజించ బడ్డాయి. శుద్ధ సత్వం (స్వచ్ఛమైన మంచితనం), మిశ్ర సత్వం (మిశ్రమమైన మంచితనం) మరియు సత్వ శూన్యం (ఏ మంచితనం లేనిది). అనువాదకుల గమనిక: ఒక వస్తువులో ఈ గుణాలలో (సత్వం (మంచితనం), రాజసం (భావావేశం) మరియు తామసం (అజ్ఞానం))  ఒకటి లేదా ఒకటికంటే ఎక్కువ గుణాలు కలిగి  ఉంటాయి. ఇక్కడ, వస్తువులను శుద్ధ సత్వం అని పిలుస్తారు, ఎందుకంటే శుద్ధ సత్వం మాత్రమే వాటి గుణంగా ఉన్నవి కాబట్టి. గుణం వస్తువుకి భిన్నమైనది, కానీ ఇక్కడ వస్తువుకి దాని గుణంతో పేర్కొనబడింది. కాబట్టి, మనం శుద్ధ సత్వం అని అన్నప్పుడు – దాని అర్థం శుద్ధమైన మంచితనంతో నిండి ఉన్న వస్తువు అని అర్థం.

  • పరమపదంలో మాత్రమే శుద్ధ సత్వం కనిపిస్తుంది. అనువాదకుల గమనిక: పరమపదంలో అన్ని పదార్థాలు శుద్ధ సత్వానికి చెందినవి. శుద్ధ సత్వం అనేది ఏ రాజస తామస గుణం లేనిది, సంపూర్ణంగా స్వచ్ఛమైనది అని పిళ్ళై లోకాచార్యులు వివరిస్తున్నారు. ఈ దివ్య పదార్థం పరమపదంలో వివిధ మండపాలు, గోపురాలు, విమానములు, ప్రసాదములు మొదలైనవాటిగా రూపాంతరం చెందుతుందని, భగవానుడికి, నిత్యులకు (నిత్య ముక్తులు) మరియు ముక్తులకు (ముక్తి పొందిన ఆత్మలు) అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుందని వారు వివరిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే భగవాన్ యొక్క దివ్య అర్చా రూపాలు కూడా శుద్ధ సత్వం వర్గంలోకి వస్తాయి.
  • మిశ్ర సత్వం అనేది సత్వం, రాజసం మరియు తామస మిశ్రమంతో కూడినది, ఈ సంసారం (భౌతిక ప్రపంచం) లో కనిపిస్తుంది. అచిత్ (పదార్థం) శాశ్వతమైనది అయినప్పటికీ, ఇది స్థిరమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల  తాత్కాలికమైనది అంటారు. చిత్ (జీవాత్మ) జ్ఞానంతో నిండినప్పటికీ, భౌతిక శరీరంలో కట్టుబడి ఉన్నప్పుడు, జీవాత్మకు అంతర్గతంగా ఉన్న జ్ఞానం మరియు ఆనందం అనేవి అచిత్ చేత కప్పబడి ఉంటాయి. ఈ అచిత్  కొన్నిసార్లు విపరీత జ్ఞానాన్ని (అపార్థాలు) కూడా ప్రేరేపిస్తుంది. ఈ విషయాన్ని వివరంగా చూద్దాము.
  • సత్వ శూణ్యం అనేది కాలం (సమయం). అనువాదకుల గమనిక: కాలాన్ని కొంతమంది తత్వవేత్తలు తిరస్కరించారని పిళ్ళై లోకాచార్యులు తత్వ త్రయంలో వివరించారు. ప్రత్యక్ష అవగాహన మరియు శాస్త్ర  అవగాహన ద్వారా కాల అస్తిత్వమును మనం అర్థం చేసుకోగలం కాబట్టి, దానిని తిరస్కరించే ప్రశ్న లేదు. అచిత్ యొక్క నిత్య పరివర్తనకు దోహదపడే కారకంగా కాలాన్ని వివరించారు. ఇది భగవాన్ యొక్క కాలక్షేప సాధనంగా వివరించబడింది. పరమపదం (ఆధ్యాత్మిక ప్రపంచం) మరియు సంసారం (భౌతిక ప్రపంచం) రెండింటిలోనూ కాలం ఉంది – ఇది పరమపదంలో పూర్తి అధీనంలో ఉంటుంది (సంపూర్ణ భగవద్ ఆనందాని కొరకై ఉంటుంది), భౌతిక ప్రపంచలో కాలం ఆయా కార్యకలాపాలను నిరంతరం నియంత్రించే పాత్రను వహిస్తుంది.

మిశ్ర సత్వంపై మరింత:-

  • మూల ప్రకృతి (ఆదిమ పదార్థం) అంటే సత్వం, రాజసం మరియు తామసం అనే 3 గుణాలు సంపూర్ణ సమతుల్యతతో ఉన్న ఒక స్థితి. ఇది ఒక సూక్ష్మ స్థితిలో ఉండి భగవాన్ శరీరంలో ఒక తత్వంగా ఉంటుంది. సృష్టి సమయంలో, ఆ లక్షణాల సమతుల్యత మారినప్పుడు, సూక్ష్మ పదార్థం భిన్న భిన్న రూపాలు పేర్లతో స్థూల రూపంగా మారుతుంది. సృష్టి సమయంలో, ప్రకృతి అనేది ఉపాదాన కారణం (భౌతిక కారణం). భగవాన్ యొక్క దివ్య సంకల్పంతో, సూక్ష్మ స్థితి స్థూలంగా మారుతుంది. అటువంటి స్థితి మార్పు 24 తత్వముల యొక్క అభివ్యక్తికి దారితీస్తుంది. నమ్మాళ్వార్ దీనిని తిరువాయ్మొళి 10.7.10 లో “పొంగైమ్ పులనుం పొరియైన్తుం కరుమేంద్రియం ఐమ్బూతం ఇంగివ్వుయిరేయ్ పిరకిరుతి మానాంగార మనంగళే” అని వివరించారు.  అనువాదకుల గమనిక: శ్రుతిలో చెప్పినట్లుగా, భగవాన్ “బహు స్యాం ” – నేను అనేకము అని ప్రకటించారు. ఆ ప్రతిజ్ఞతో, వెంటనే అతను సూక్ష్మమైన మూల పదార్థాన్ని అనేక భిన్న భిన్న స్థూల రూపాలుగా మారుస్తాడు. విషయ పదార్థం యొక్క ఈ 24 తత్వములు ఇలా వివరించబడ్డాయి.
    • పొంగైమ్పులన్ –  మన కోరికలను పెంచేవి – పంచ తన్మాత్రములు –  శబ్ద (ధ్వని), స్పర్శ, రూప, రస (రుచి), గంధ (వాసన)
    • పొఱియైన్తుం – ఆ కోరికలలో మనలను నిర్బంధించేవి – పంచ జ్ఞానేంద్రియములు – జ్ఞానం యొక్క 5 ఇంద్రియ అవయవాలు –  శ్రోత్ర (చెవులు), త్వక్ (చర్మం), చక్షుర్ (కళ్ళు), జిహ్వా (నాలుక), గ్రాహ్నా (ముక్కు)
    • కరుమేన్దిరియం – అటువంటి కోరికలో పాల్గొనడానికి సహాయపడేవి – పంచ కర్మేంద్రియాలు – క్రియల యొక్క 5 ఇంద్రియాలు – వాక్ (నోరు), పాణి (చేతులు), పాద (కాళ్ళు), పాయు (విసర్జన అవయవాలు), ఉపస్థ (సంతానోత్పత్తి అవయవాలు)
    • ఐమ్బూతం –  ఐదు తన్మాత్రాల నివాసం – పంచ భూతాలు – ఆకాశ (ఆకాశం), వాయు (గాలి), అగ్ని, ఆప / జల (నీరు), పృథ్వీ (భూమి)
    • మనస్ – బుద్ధి
    • అహంకారం – అహంభావము
    • మహాన్ – తత్వం యొక్క ప్రత్యక్ష స్థితి
    • మూల ప్రకృతి – తత్వం యొక్క అవ్యక్త స్థితి
  • శబ్ధం (ధ్వని), రూపం, రసం (రుచి), గంధం (వాసన), స్పర్శం  (స్పర్శ) – ఐదు విభిన్న అనుభవాలు. ఈ అనుభవాలకు ఆకర్షించబడే జ్ఞానేంద్రియములు ఐదు – శ్రోత్ర (చెవులు), త్వక్ (చర్మం), చక్షుర్ (కళ్ళు), జిహ్వా (నాలుక), గ్రాహ్నా (ముక్కు). కోరికలను నెరవేర్చేవి కర్మఎంద్రియాలు ఐదు – అంటే అవి వాక్ (నోరు), పాణి (చేతులు), పాద (కాళ్ళు), పాయు (విసర్జన అవయవాలు), ఉపస్థ (సంతానోత్పత్తి అవయవాలు). ఏ స్వరూపమైనా ఐదు అంశాలతో తయారు చేయబడుతుంది – ఆకాశం, వాయు (గాలి), అగ్ని, అపా / జల (నీరు), పృథ్వీ (భూమి). ఇప్పటి వరకు మనము 20 అంశాలను చూశాము. మహాన్ అనేది జీవాత్మ యొక్క ప్రయత్నాలను ప్రోత్సహం చేసే సూత్రం. అహంకారం అనేది తన పట్ల గర్వం / గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. మనస్సు కోరికలను ప్రోత్సహిస్తుంది. చివరిగా, ములా ప్రకృతితో (మూల పదార్థంలో 24 అచిత్ అంశాలు) ఉంటాయి. జీవత్మా 25 వ తత్వం, 26 వ తత్వం ఈశ్వరుడు.
  • అచిత్ (పదార్థం) యొక్క లక్షణాలను సత్వ, రాజస మరియు తామసంతో సమానంగా పంచినప్పుడు, ఆ స్థితిని ములా ప్రకృతి అని అంటారు. ఆ సమతుల్యత చెదిరినప్పుడు, స్పష్టముగా ఆ ప్రభావాలు కనిపిస్తాయి. అటువంటి సమతుల్యత కోల్పోయినప్పుడు, మొదట మహాన్ దర్శనమిస్తుంది. దీన్ని మహత్తత్వం అని కూడా అంటారు. మొలకెత్తిన విత్తనంతో ఈ ప్రక్రియను పోల్చవచ్చు. ఈ మహత్తత్వం మూడు స్థితుల్లో ఉంటుంది – సాత్వికం, రాజసం, తామసం. మహాన్ యొక్క ఈ 3 స్థితుల నుండి, వైకారికం, తైజసం, భూతాది అనే మూడు రకాల అహంకరాములు వస్తాయి. అహంకారం అనేది వాస్తవికతను అణచి అపార్థాలకు దారితీస్తుంది. ఉదాహరణకు ఆత్మ శరీరం ఒకటేనని భావించడం ఒక రకమైన అపార్థం. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు వీటిని తత్వ త్రయంలో వివరించారు. విషయ పదార్థం యొక్క విభిన్న అంశాల  స్వభావాలను స్థాపించడానికి మాముణులు తమ వ్యాఖ్యానంలో ఎన్నో ప్రామాణాలను ఉల్లేఖించారు. సాధారణంగా, ములా ప్రకృతిని ప్రధానంగా (తత్వం యొక్క ముఖ్య స్థితి), అవ్యక్తంగా (అవ్యక్త స్థితి) వివరించబడింది. ములా ప్రకృతి మహాత్ తత్వంగా (మహన్)  రూపాంతరం చెందినప్పుడు – పేరు, రూపం మొదలైన వాటితో ఆ పదార్థం వ్యక్తమవుతుంది. మహాన్తో ప్రారంభించి, ప్రకృతి మొత్తం 23 తత్వములుగా విస్తరిస్తుంది.
  • వైకారికం (సాత్విక అహంకారం) నుండి, కర్మేంద్రియాలు (కర్మ యొక్క 5 ఇంద్రియ అవయవాలు) మరియు జ్ఞానేంద్రియములు (జ్ఞానం యొక్క 5 ఇంద్రియ అవయవాలు) సృష్టించబడతాయి, అవి సూక్ష్మ స్థితిలో ఉంటాయి. మనస్ (మనస్సు) కూడా వైకారికం యొక్క ఉత్పత్తి. భూతాది (తామస అహంకారం) నుండి, పంచ భూతములు సృష్టించబడతాయి. తైజసం (రాజస అహంకారం)  వైకారికం మరియు భూతాదికి వారి పరివర్తనలో సహాయం చేస్తుంది.
  • భూతాది నుండి, పంచ భూతం (ఐదు స్థూల మూలకాలు) యొక్క సూక్ష్మ కారకమైన పంచ తన్మాత్రాలు  సృష్టించబడతాయి. వాటి క్రమం ఇక్కడ వివరించబడింది. భూతాది నుండి, మొదటి శబ్ద తన్మాత్రం (ధ్వని) దర్శనమిస్తుంది. ఇది ఆకాశం యొక్క సూక్ష్మ స్థితి. శబ్ద తన్మాత్రం నుండి, ఆకాశ మరియు స్పర్శ తన్మాత్రం దర్శనమిస్తుంది. స్పర్శ తన్మాత్రం నుండి, వాయు మరియు రూప తన్మాత్రం (దృష్టి) దర్శనమిస్తుంది. రూప తన్మాత్రం నుండి, తేజస్సు (అగ్ని) మరియు రస తన్మాత్రం (రుచి) దర్శనమిస్తుంది. రస తన్మాత్రం నుండి, గంధ తన్మాత్రం (వాసన) మరియు అప్పు (నీరు) దర్శనమిస్తుంది. గంధ తన్మాత్రం నుండి, పృథ్వీ (భూమి) దర్శనమిస్తుంది. అనువాదకుల గమనిక: తైత్రీయ ఉపనిషత్తులో, దీనిని “ఆకాశాత్ వాయుః, వాయోర్ అగ్నిః, అగ్నియైర్ ఆపః, అభ్యాః పృథ్వి …”  అని  వివరించబడింది. ఆకాశం నుండి గాలి వస్తుంది, గాలి నుండి అగ్ని వస్తుంది, అగ్ని నుండి నీరు వస్తుంది, నీటి నుండి భూమి వస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియను పంచీకరణం (5 అంశాల మిశ్రమం) గా వివరిస్తారు.
  • ఈ విధంగా, సృష్టిలో భాగంగా, భగవాన్ మొదట ఈ 24 మూలకాలను ఉపయోగించి వివిధ బ్రహ్మాండాలను సృష్టిస్తాడు,  ఈ బ్రహ్మాండాల తర్వాత, వివిధ జాతుల సృష్టి, మొదలైనవి, బ్రహ్మ ద్వారా పరోక్షంగా నిర్మించబడతాయి. అనువాదకుల గమనిక: సృష్టిని అద్వారక సృష్టి – భగవాన్ చేత చేయబడిన ప్రత్యక్ష సృష్టి మరియు సాధ్వరాక సృష్టి –  బ్రహ్మ, ఋషులు మొదలైన వారి ద్వారా భగవాన్ చేత పరోక్ష సృష్టి అని వర్గీకరిస్తారు. విశ్వాలు సృష్టించబడే వరకు, ఇవన్నీ నేరుగా భగవాన్ చేత చేయబడతాయి. విశ్వాల సృష్టి తర్వాత, ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మను సృష్టించి,  ఆ విశ్వంలో తరువాత సృష్టిలో అతనికి మార్గనిర్దేశం చేస్తాడు. బ్రహ్మ, సప్త ఋషులు, మను, మొదలైనవారందరూ విశ్వంలో కనిపించే భిన్న భిన్న జాతులు మరియు రూపాలకు దారితీసే ఉత్పత్తిలో నిమగ్నమై ఉంటారు.  అటువంటి అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయని, ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ నాయకత్వం వహిస్తాడని వివరించబడింది. ఈ విధంగా, భౌతిక ప్రపంచం మన ఊహకు మించినదని చాలా పెద్దదని మనం అర్థం చేసుకోవచ్చు.  పరమపదాన్ని సాధారణంగా త్రిపాద్ విభూతి (3 భాగాలు – సంసారం కంటే 3 రెట్లు పెద్దది) గా వర్ణించబడింది. అలాగే, మనం చూసే సృష్టి కూడా చక్రీయమైనది. శ్రుతి (సృష్టి), స్తితి (సంరక్షణ) మరియు లయ(వినాశనం) ఉంటాయి. ఈ చక్రం అతి ప్రాచీన కాలం నుండి కొనసాగుతోంది – ఈ చక్రానికి ప్రారంభం లేదు – అంతం లేదు.

ఈ పరిచయంతో ఈ భాగంలో వివరించిన మిగిలిన అడ్డంకులతో ముందుకు కొనసాగిద్దాం.

  • ఆవరణ అభావం (సరిహద్దు లేని రాష్ట్రం) అకాశమని, దానిని శాశ్వతమైనదిగా, అభేధ్యమైనదిగా,  సర్వవ్యాప్తి చెందినదని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. శ్రుతిలో భాగంగా సృష్టించబడిన పంచ భూతములలో అకాశం ఒకటి. అందువలన దీనిని శాశ్వతమైన, అభేధ్యమైనదిగా పరిగణించలేము.
  • దిక్ (దిశ) ఒక భిన్నమైన అంశం అని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. తూర్పు, పడమర మొదలైన దిశలు భిన్నమైన పదార్థాలు కావు. చెన్నైలో ఉన్నవారికి శ్రీరంగం దక్షిణాన ఉంటుంది. కానీ ఆళ్వార్ తిరునగరిలో ఉన్నవారికి, శ్రీరంగం ఉత్తరంలో ఉంటుంది. కాబట్టి, ఇది సాపేక్షమైనది. అనువాదకుల గమనిక:  తత్వ త్రయం 127 వ సూత్రం వ్యాఖ్యానంలో మాముణులు వైశేశికులు మొదలైనవారి గురించి వివరిస్తూ, దిక్ (దిశ) ను పృథ్వీ (భూమి) వంటి భిన్న మూలకంగా వివరించారు. ఈ విషయాలపై పండితుల నుండి మరిన్ని నేర్చుకోవచ్చు.
  • కాలం (సమయం) ఉనికిలో లేదని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. కాలాన్ని నిమిషం, మణి, ముహూర్తం మొదలైనవిగా సూచిస్తారు. ఇది సమయం మార్పుపై ఆధారపడి ఉంటుంది, మార్పులు ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. “కాలో హి దురతిక్రమః” – సమయం యొక్క ప్రభావం అనివార్యమైనది, అనే ప్రసిద్ధ ఉక్తి మనలో చాలామందికి తెలిసిందే. అనువాదకుల గమనిక: బౌద్ధ మొదలైన మతస్తులు కాల తత్వాన్ని స్వీగీకరించరని తత్వ త్రయం 125 వ సూత్ర వ్యాఖ్యానంలో మాముణులు వివరించారు. కాలాన్ని గ్రహణ శక్తి మరియు శాస్త్రం రెండింటి ద్వారా అర్థం చేసుకోగలము కాబట్టి, కలం ఉనికిని తిరస్కరించేటువంటి సూత్రాన్ని అంగీకరించలేము అని తరువాతి సుత్రాంలో, పిళ్ళై లోకాచార్యులు వివరిస్తున్నారు. మాముణుల అందమైన ఉదాహరణలను ఉదహరించి అదే సూత్రానికి తమ వ్యాఖ్యానం ద్వారా స్థాపించారు.
  • వాయువును అవగతించలేమని భ్రాంతిపడటం ఒక అడ్డంకి. వాయు (గాలి) కనిపించనప్పటికీ, దాని ఉనికిని స్పర్శ ద్వారా అనుభవించవచ్చు, దీనిని అప్రత్యక్షం (కనిపేట్టలేనివి) అని వివరించలేము.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/10/virodhi-pariharangal-40/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

0 thoughts on “విరోధి పరిహారాలు – 40”

  1. చాలా అద్భుతమైన విషయాలు విశదీకరించారు.
    మీరు facebook లో కూడా ఇవి గనుక పెట్టగలిగితే ఎక్కువ మందికి వీటిని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. Please consider giving share icons on posts, so that atleast we can share them.

    చిన్న విన్నపం. శ్రీవైష్ణవ ఆరాధన, పూజలు (క్షీరాబ్ది ద్వాదశి లాంటివి) విధానాలు కూడా అనుగ్రహిస్తే సంప్రదాయం తెలియని వారికి చాలా help అవుతుంది.

    Reply
  2. Swamy🙏, we do have facebook page. You can search with name koyil.org – Srivaishnava portal.

    For more information, please join our watsapp group by giving a message to 9445400573.

    Reply

Leave a Comment