శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/11/15/virodhi-pariharangal-40-telugu/
72. తత్వ విరోధి – యథార్థము / వాస్తవికతను అర్థం చేసుకోవడంలో అవరోధాలు – రెండవ భాగం
మనము తత్వ విరోధి యొక్క ఈ భాగంలో ముందుకు వెళదాము. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి చాలావరకు లోతైన జ్ఞానం, అవగాహన అవసరం, అది క్రమబద్ధమైన శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా పొందవచ్చు. పూర్తి మరియు లోతైన అవగాహనకై, జ్ఞానుల ద్వారా ఈ సూత్రాలను నేర్చుకోవడం మంచిది.
- మన అణ్డం (విశ్వం) మరియు వేరే ఇతర అండాల (విశ్వాలు) లో తత్వం యొక్క అన్ని మార్పులు / పరివర్తనలు ఒక చేతన యొక్క సంకల్పం వల్ల జరుగుతుంది అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మన విశ్వంలో అనేక అచిత్తులు, ఈ విశ్వం బయట ఉన్న ఇతర విశ్వాలు (ఈ భౌతిక విశ్వాలన్నింటినీ కలిపి లీలా విభూతి (సంసారం) అంటారు) పరమ చేతనుడు (భగవాన్ – శ్రీమన్నారాయణ) యొక్క సంకల్పం ఆధారంగా రూపాంతరం / మార్పు చెందుతాయి. ఛాందోగ్య ఉపనిషత్తులో ఇలా వివరించబడింది, “తదైక్షత – బహుస్యాం ప్రజాయేయేతి” – నా భిన్న భిన్న అభివ్యక్తములను చూద్దాం. అనువాదకుల గమనిక: అత్యున్నత చెతనుడైన (అత్యున్నత జ్ఞానుడైన) భగవాన్ యొక్క సంకల్పం ప్రకారం సృష్టి జరుగుతుంది. “నిత్యో నిత్యానాం చేతనస్ చేతనానాం” – సమస్థ నిత్యులలో నిత్యుడు, సమస్థ జ్ఞానులలో మహా జ్ఞానుడు అని అర్థం. అనేక సందర్భాలలో “బహు స్యాం” అని సూచించబడింది, భగవాన్ యొక్క సంకల్ప ఫలితం శ్రుతి అని స్థాపించబడింది. తిరువాయ్మొళి 3.2.1 లో, నమ్మాళ్వారులు ఇలా వివరిస్తున్నారు, “మున్నీర్ జ్ఞాలం పడైత్త ఎం ముగిల్వణ్ణనే…” – మేఘం లాంటి వాడు (నలుపు వర్ణంతో, కృపా స్వభావం గలవాడు)! – మూడు రకాల నీటిని కలిగి ఉన్న ఈ విశ్వాన్ని సృష్టించావు నీవు. నంపిళ్ళై ఇక్కడ నమ్మాళ్వార్ యొక్క ఉత్కృష్ఠమైన భావాలను వెల్లడి తెస్తున్నారు. ఈ విశ్వాన్ని సృష్టించినందుకు ఆళ్వారులు భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని, అందువల్ల తనతో సహా జీవాత్మలందరికీ తగిన శరీరాలు, ఇంద్రియాలు మొదలైనవి పొందారని, దానితో వారు ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది, చివరికి వాళ్ళు ఉద్ధరించబడతారని తెలుపుతున్నారు. అయినప్పటికీ, కేవలం భౌతిక కోరికలను తీర్చడానికి శరీరం ఉపయోగించబడుతున్నందున, అలాంటి అవకాశం వృధా అవుతుందని ఆళ్వారులు బాధను వెల్లడి చేస్తున్నారు. దీని నుండి, భగవాన్ యొక్క దివ్య చిత్తాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, జీవాత్ములందరి అభ్యున్నతికి ఈ సృష్టి దోహదపడుతుందని మనం అర్థంచేసుకోవచ్చు.
- జగత్ (విశ్వం) పరిణామం (మార్పు) అధ్వారక భగవద్ సంకల్ప అధీనం (భగవత్ సంకల్పం యొక్క ప్రత్యక్ష నియంత్రణ) అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకుముందు వివరించినట్లుగా, సృష్టి రెండు రకాలు అని మనం చెప్పుకున్నాము – అధ్వారక సృష్టి మరియు సధ్వారక సృష్టి. అధ్వారక సృష్టి అనేది సూక్ష్మ పదార్థాన్ని స్థూల పదార్థంగా (విశ్వాల సృష్టి వరకు) మార్చే మొదటి దశ, ఇది స్వయంగా భగవాన్ చేత సృష్టించబడుతుంది. భగవాన్ చేత బ్రహ్మ ద్వారా వివిధ రకాలైన రూపాలు / జాతులు సృష్టించబడతాయి. అదేవిధంగా, సంహార సమయంలో కూడా, పరోక్షంగా భగవాన్ రుదృడు, అగ్ని మొదలైనవారి ద్వారా విశ్వంలోని వివిధ రూపాలను / జాతులను నాశనం చేయబడతాయి. తుదకు, వారు స్వయంగా సమస్థ స్థూల పదార్థాలను తనలో లీనం చేసుకొని వాటిని సూక్ష్మ రూపంగా మారుస్తాడు. ఈ చక్రం అలా మళ్లీ మళ్లీ కొనసాగుతుంది.
- సమస్థ అస్తిత్వాలు భగవదాత్మకం (అందరిలో అంతరాత్మగా వ్యాపించి ఉన్న పరమాత్మ) అని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఇది నారాయణ సూక్తం నుండి స్పష్టమౌతుంది – “అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్తితః” – నారాయణుడు అన్నింటి లోపల మరియు బయటి వ్యాపించి ఉండి అన్నింటినీ ఒక్కటిగా పట్టుకుని ఉన్నాడు, “సర్వభూతాంతరాత్మా” – సమస్థ అస్తిత్వాలలో నివసించే ఆత్మ అని అర్థం. అనువాదకుల గమనిక: బ్రహ్మం (భగవాన్) అస్తిత్వమున్న ప్రతిదానిలో నివసించి ఉన్న ఆత్మ. భూత అనే పదము “భూ సత్తాయం” (అస్తిత్వం ఉన్న) నుండి ఉద్భవించింది. అస్తిత్వమన్నది ఏదైనా భగవాన్ నియంత్రణలో ఉంటుంది. అంతర్యామిగా ఉండటం ద్వారానే ప్రతి అస్తిత్వము ఉనికిలో ఉంటుంది. శాస్త్రం ఇలా చెబుతుంది “యస్య ఆత్మా శరీరం, యస్య పృత్వి శరీరం, …” – బ్రహ్మానికి శరీరం జీవాత్మ, బ్రహ్మానికి శరీరం పృథ్వీ…. ఇదే సూత్రము నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 1.1.10లో వివరించారు, “పరంద తణ్ పరవైయుళ్ నీర్ తొఱుం పరందుళన్ పరంద అండ ఇదెన నిల విసుంబు ఒళివఱ కరంద సిల్ ఇడం తొఱుం ఇడం తిగళ్ పొరుళ్ తొఱుం కరన్దెంగుం పరందుళన్ ఇవై ఉణ్డ కరనే” – సముద్రపు చల్లని నీటి బిందువులలో హాయిగా భగవాన్ ఎలా ఉంటారో అంతే హాయిగా విశాల విశ్వంలో కూడా ఉంటారు.
- భగవాన్ చేత వ్యాపించబడి ఉన్నందున అన్ని తత్వాల ఉపయుక్తమైనవి అని తెలియక పోవడం ఒక అడ్డంకి. అన్ని తత్వాలు (చేతనా చేతనములు) భగవాన్ చేత విస్తరించబడి ఉన్నందున, అవి ఉపయుక్తకరమైనవిగా ఉంటాయి.
- మనం శరీరమన్న భ్రమ కారణంగా కొన్ని అంశాలు అననుకూలమైనవిగా గోచరిస్తాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. శరీరాన్ని ఆత్మగా భావించే మన అజ్ఞానం వల్లనే కొన్ని సందర్భాలలో ప్రతికూల భావనకు దారితీస్తుంది. అనువాదకుల గమనిక: ఇది మునుపటి వివరణకు సంబంధించినది. దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. జీవాత్మ యొక్క స్వభావాన్ని నిజంగా గ్రహించిన వ్యక్తికి జీవాత్మ స్వాభావికంగానే పరమానందకరమైనదని తెలుస్తుంది. ఈ సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు చేత తత్వ త్రయం, సుత్రాలు 73 నుండి 76 వరకు అందంగా వివరించబడింది, మాముణులు తమ వ్యాఖ్యానంలో విస్తృతంగా వివరించారు. సుత్రాలు 73 లో, వికసించిన నిజమైన జ్ఞానం ఆనందానికి దారితీస్తుంది, ఇది జీవాత్మ స్వభావానికి అనుకూలంమైనదని వారు వివరిస్తున్నారు. తరువాతి సూత్రంలో విషము, ఆయుధాలు మొదలైనవి ఆత్మతో శరీర భ్రమ కారణంగా అననుకూలమైనవిగా కనిపిస్తాయని వారు వివరించారు. మూడు కారణాల వల్ల మనము విషం మొదలైన వాటికి భయపడతామని మాముణులు వివరిస్తున్నారు – 1.) తానూ శరీరం ఒకటేనని భావించి, ఏదైనా శరీరాన్ని హానిచేసేది తనకు (ఆత్మకు) కూడా హాని చేస్తుందని భావించడం; 2.) మన ఆలోచన విధానమును ప్రభావితం చేసే మన కర్మ (ఇది విషము, ఆయుధం మొదలైన వాటిలో భయం కారణానికి అనుసంధానమైన). 3) మన శరీరంలో వ్యాపించి ఉన్న భగవానుడు, విషము, ఆయుధంలో కూడా వ్యాపించి ఉన్నాడనే వాస్తవిక జ్ఞానం లేకపోవడం. తరువాతి సూత్రంలో, అన్ని వస్తువులు భగవాన్ చేత విస్తరించి ఉన్నందున, అవి సహజంగానే అనుకూలంగా ఉంటాయి, అవి అననుకూలమైనవి అనే భావన ప్రమాదకరం అని ఆయన వివరించారు. మాముణులు వివిధ ప్రామాణాలను ఉదహరించి ఈ సూత్రాన్ని స్థాపించారు (వాటిలో కొన్నింటిని ఇప్పటికే చూశాము). చివరగా, పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని చక్కని ఉదాహరణలతో వివరిస్తున్నారు. 74 వ సూత్రంలో, “ఒక వస్తువు అనుకూలంగా ఉండటానికి ఈ కారణం (అవి భగవాన్ చేత వ్యాపించబడటం మినహా) కాక వేరే కారణం ఉంటే, ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తికి అనుకూలంగా ఉండే గంధపు లేహ్యం, పువ్వులు మొదలైనవి అదే వ్యక్తి వేరే సమయంలో / స్థలంలో ఉన్నప్పుడు ఆ వస్తువులు అననుకూలమైనవి అవుతాయి, కానీ అదే ప్రదేశంలో మరొక వ్యక్తికి అనుకూలమైనవి అవుతాయి – అలా ఉండకూడదు”. మాముణులు దీన్ని చక్కగా వివరిస్తున్నారు. ఒక వ్యక్తికి, శరీర వేడిని తగ్గించడానికి చందనం లేహ్యం అనుకూలమైనది. కానీ అదే వ్యక్తి, చల్లగా ఉన్నప్పుడు, అ చందనం లేహ్యం అననుకూలమైనదిగా ఉంటుంది. అదేవిధంగా, వేసవిలో ఆరోగ్యమైన వ్యక్తికి, గంధపు లేహ్యం అనుకూలమైనది, కానీ అదే స్థితిలో, మరొక వ్యక్తి జ్వరంతో బాధపడుతుంటే, అదే చందనం అననుకూలమైనది అవుతుంది. కాబట్టి, చందనం లేహ్యం యొక్క చల్లని స్వభావం అనుకూలమైనదో కాదో అదే నిర్ణయించదు – కాని దాన్ని స్వీకరించే వ్యక్తి యొక్క శారీరక స్థితి ద్వారా తీర్మానించబడుతుంది. కాబట్టి, అది గంధపు చెక్కతో వ్యాపించి ఉన్న అనుకూల స్వభావం ఉండటం మరియు అనుకూలమైన స్వభావం కలిగిన శరీరంతో తనను తాను అనుబంధించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. భగవత్ శరీరం అనేదానిపై మనకు నిజమైన అవగాహన ఉన్నప్పుడు – వారు ఏ శారీరక పరిస్థితుల్లో ఉన్నా స్వాభావికంగానే ఆనందంగా ఉంటారు.
- నిత్య బ్రహ్మం (నిత్య భగవానుడు) యొక్క నిత్య ఇచ్ఛ (శాశ్వతమైన కోరిక) వల్ల నిత్య విభూతి (నిత్య ఆధ్యాత్మిక ప్రపంచం) నిత్యమైనదని తెలియకపోవడం ఒక అడ్డంకి. నిత్య విభుతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం – శ్రీ వైకుంఠం. భౌతిక క్రియాకలాపంలోని భాగంగా సృష్టించబడిన లీలా విభూతిలో ఎల్లప్పుడూ సృష్ఠి నాశనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా, ఇది ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా ఉన్నందున, దీనిని నిత్య విభుతి అంటారు. దీనికి ప్రాథమిక కారణం భగవత సంకల్పం. అనువాదకుల గమనిక: ఆధ్యాత్మిక ప్రపంచమైన పరమపదం గురించి వివిధ సాహిత్యాలలో వివరించబడింది. విష్ణు సూక్తం “తద్ విష్ణోర్ పరమం పదం సదా పశ్యంతి సూరయః” – విష్ణు వారి నివాసంలో నిరంతరం నిత్య సూరులతో కనిపిస్తారు. లింగ పురాణం “వైకుంఠేతు పరే లోకే ….ఆస్తే విష్ణుర్ అచింత్యాత్మా” – ఉభయ దేవేరులతో శ్రీమన్నారాయణను వారి భక్తులు నిత్యం సేవిస్తుంటారు. ఆళవందారులు తమ స్తోత్రరత్నంలో శ్రీ వైకుంఠం యొక్క సౌందర్యాన్ని వివరించారు. ఎమ్పెరుమానార్ శ్రీ వైకుంఠ గద్యంలో ఇదే విషయాన్ని వివరించారు. ఈ పరమపదం శ్రీమన్నారాయణుడి యొక్క నిత్య ఆధ్యాత్మిక నివాసంగా వివరించబడింది.
- అప్రాకృత అచిత్ (దివ్య పదార్థం) యొక్క పరివర్తనలు భగవద్ సంకల్పంతో జరుగుతుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. పరమపదంలో కనిపించే అచిత్ తత్వం మన భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిలా ఉండదు. అది శుద్ధ సత్వమైన (స్వచ్ఛమైనది) దివ్య పదార్థం. భగవాన్ కోరిక ఆధారంగా, వివిధ రూపాలను ధరిస్తుంది. అనువాదకుల గమనిక: పరమపదం గురించి ఈ సూత్రాలను పిళ్ళై లోకాచార్యులు తత్వ త్రయంలో చాలా వివరంగా వివరించారు. సరైన మార్గదర్శకత్వంలో అధ్యయనం చేయడం మంచిది.
- ఐదు మూలకాలతో కూడిన సూక్ష్మ, స్థూల స్థితులు, భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగా పరమపదంలోని దివ్య తత్వాలు ఉండవని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఈ దివ్య తత్వం పంచ ఉపనిషద్దులతో (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 మూలకాలతో తయారైన భౌతిక ప్రపంచంలా కాకుండా) తయారు చేయబడిందని అంటారు. కాబట్టి, అవి భౌతిక ప్రపంచంలో కనిపించే పదార్థంతో సమానం కాదు. అనువాదకుల గమనిక: భౌతిక ప్రపంచంలో జీవాత్మ స్వభావాన్ని విషయం కప్పివేస్తుంది, అది జీవాత్మలో అజ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. కానీ పరమపదం యొక్క దైవీక తత్వాలు జ్ఞానాన్ని సులభతరం చేస్తుంది, అక్కడ ఉన్న జీవాత్మలకూ మరింత ఆనందాన్నిస్తుంది.
- భగవాన్ యొక్క దివ్య రూపాలు, దివ్య తత్వాలతో (ఇది పంచ ఉపనిషద్లతో తయారు చేయబడినవి) కూడినవని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: సాధారణంగా భగవాన్ యొక్క దివ్య రూపాలు 5 వర్గాలలో వివరించారు – పర, వ్యూహ, విభవ, అర్చా, అంతర్యామి. దీన్నిhttps://granthams.koyil.org/2012/10/archavathara-anubhavam-parathvadhi/లో వివరంగా వివరించబడింది. ఈ ఐదు సందర్భాల్లో, భగవాన్ రూపం ఉన్నచోట, అది దైవీక తత్వముతో తయారైందని మనం అర్థం చేసుకోవాలి. ఈ వివరణతో ప్రారంభించి, ఈశ్వర తత్వం (భగవాన్), వారి రూప గుణాలను అర్థం చేసుకోవడం వైపు దృష్టి మారుతుంది.
- భగవాన్ యొక్క ఈ రూపాలు వారి 6 ప్రధాన గుణాలను వెల్లడి చేస్తాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. దివ్య తత్వాలతో తయారైన ఈ రూపాలు భగవాన్ యొక్క నిజమైన గుణాలను వెల్లడిస్తాయి, మన జ్ఞానాన్ని పెంచుతాయి. ఆరు ప్రధాన లక్షణాలు ఉన్నాయి – జ్ఞానం, బలం, వీర్యం (శౌర్యం), ఐశ్వర్యం (సంపద, అందరినీ నియంత్రించే సామర్థ్యం), శక్తి, తేజస్సు (అందం / ప్రకాశం). ఇతర భగవాన్ గుణాలన్నీ ఈ 6 గుణాల నుండి ఉద్భవించినవే. అనువాదకుల గమనిక: భగవాన్ అంటే ఈ ఆరు లక్షణాలు సంపూర్ణగా కలిగి ఉన్నవాడు (ముందు వివరించినట్లు). ఈ విధంగా, ఈ ఆరు గుణాలు పూర్తిగా ఉన్న శ్రీమన్నారాయణను మాత్రమే భగవాన్ అని పిలవబడే అర్హత ఉన్నవాడు. ఇతర వ్యక్తిత్వాలను భగవాన్ (పరాశర భగవాన్, వ్యాస భగవాన్ మొదలైనవారు) అని పిలువడం ఇది కేవలం వారి ప్రశంసగా మాత్రమే కాని అసలు అర్థంతో కాదు – ఎందుకంటే ఈ లక్షణాలను పూర్తిగా మరెవరొ లోనూ లేవు. భగవాన్ యొక్క దివ్య రూపాలు అతని అంతర్లీన గుణాలను వ్యక్తపరుస్తాయి.
- భగవాన్ మరియు నిత్యసూరులు ఒకే వర్గానికి చెందినవారని తెలియకపోయినా (విముక్తి చెందిన ఆత్మలు), భగవత్ స్వరూపం దివ్య తేజస్సుగల స్వరూపం కారణంగా ఇది వర్గీకరణపరంగా అసాధారణమైనది అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనంత, గరుడ, విశ్వక్సేనుడు మొదలైనవి నిత్య విముక్తులు. వర్ణ భేదాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగా వాళ్ళల్లో ఆ తేడాలు ఉండవు. వీళ్ళ స్వరూపాలు కూడా అసాధారణమైనవి. వారి శరీరాలు / రూపాలు దైవిక తత్వాలతో తయారైనందున, వారు చేసే భిన్న భిన్న కైంకార్యాధారంగా వారు వర్గీకరించ బడతారు. ఉదాహరణకు, అనంతుడు ఒక సర్ప రూపాన్ని ధరిస్తాడు, గరుడ ఒక పక్షి రూపాన్ని వహిస్తాడు, అలాగే విశ్వక్సేనుడు మానవ రూపాన్ని ధరిస్తాడు. గజముక (ఏనుగు ముఖం గల వ్యక్తి), సింహాముక (సింహ ముఖం గల వ్యక్తి), మగ సేవకులు, ఆడ సేవకులు మొదలైనవారు కూడా ఉంటారు. కానీ స్థ్రీ పురుష సంబంధం (దేహ సౌదర్యం మొదలైనవాటికి సంబంధించిన) ఈ సంసారంలో ఉన్నట్లుగా అక్కడ ఉండదని గమనించాలి. అనువాదకుల గమనిక: ముఖ్యమైన కైంకర్యాలకై, నిత్యసూరులు వివిధ రూపాలను ధరిస్తారు. పరమపదంలోని అన్ని “తత్వాలు” దైవీకమైనవని, ఈ సంసారంలో కనిపించే తత్వాలకు భిన్నమైనవని ఇంతకు ముందే చూశాము. అలాగే, నిత్యసూరులు కూడా భగవానుడికి భిన్నమైన వారని అర్థం చేసుకోవాలి – నిత్యసూరులు జీవాత్మలు అయితే, భగవాన్ పరమత్మ. భగవాన్ యొక్క దివ్య సంకల్పం ద్వారా, నిత్యసూరులు నిత్య ముక్తులుగా సృష్ఠించబడ్డారు. భగవత్ స్వరూపం అత్యంత తేజస్సుతో ప్రకాశించేదిగా మరియు మేలిమి బంగారు రూపంగా ఉంటుందని ఛాందోగ్య ఉపనిషత్తులో వివరించబడింది.
- భగవాన్ తమ అవతార (వరాహ, నరసింహ, శ్రీ రామ, కృష్ణ మొదలైన) రూపాలలో కూడా దివ్య తత్వాలతో (పరమపదంలో ఉన్నట్లు) కూడి ఉంటారు. భగవాన్ దివ్య సంకల్పం చేత శివుడు మొదలైన వాళ్ళు వారి (భౌతిక) రూపాలు / శరీరాలు పొందుతారు, భగవాన్ యొక్క దివ్య స్వరూపాన్ని “సాధారణ తత్వం” గా పరిగణించడం ఒక అపరాధం. అతని ఆర్చావతార రూపాలను ఇఛ్ గృహీత అప్రాకృత దివ్య మంగల విగ్రహం అని పిలుస్తారు – తమ కోరిక మేరకు దివ్య మంగళ రూపాన్ని ధరిస్తారు. ఈ రూపాలు మానవుడిలా కనిపిస్తున్నప్పటికీ, అవి ఒకే తత్వంతో తయారు చేయబడినవి కావు. అనువాదకుల గమనిక: భగవద్గీత యొక్క 4 వ అధ్యాయంలో, భగవాన్ అనేక స్లోకాములలో తన అవతార రహస్యాన్ని బహిర్గతం చేయడం మనం ఇప్పటికే చూశాము. ఆయన స్వయంగా భగవద్గీత 4.9 లో ఇల ఉపదేశించారు – “జన్మ కర్మ చ మే దివ్యం” – నా జన్మ, లీలలు అలౌకికమైనవి అని అర్థం. భగవాన్ స్వయంగా గీత 9.11 లో “అవజానంతి మాం మూడా…” – నా ఆధిపత్యాన్ని అర్థం చేసుకోని మూర్ఖులు నన్ను మానవునిగా భావిస్తారు (నా అవతారాల సమయంలో) నన్ను అవమానిస్తారు అని ఉపదేశిస్తున్నారు. పిళ్ళై లోకాచార్యులు, తమ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, సుత్రాలు 303 మరియు 304 లలో భగవత్ అపాచారము గురించి వివరించారు. భగవాన్ తమ ఇష్టం ప్రకారం ఈ దివ్య రూపాలను ధరిస్తారు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన ఇతర దేవతలు, వాళ్ళు అనేక పుణ్యకర్మలు చేసిన జీవాత్మలు అని వివరిస్తున్నారు. కాబట్టి, భౌతిక ప్రపంచంలో అటువంటి శక్తివంతమైన పదవులను చేపట్టడానికి జీవాత్మల కర్మలు మరియు భగవత్ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది.
- సమస్థ చిత్ (జీవాత్మలు – ఆత్మలు) మరియు అచిత్తులతో (పదార్థం) కూడినది భగవాన్ శరీరం అని తెలియకపోవడం ఒక అడ్డంకి. “సర్వం విష్ణుమయం జగత్” – విశ్వంలో కనిపించే వాటన్నిటిలో విష్ణువు వ్యాపించి ఉన్నాడు, భగవాన్ అంతరాత్మ – కాబట్టి ప్రతిదీ శ్రీమన్నారాయణ శరీరంలోని భాగం అని వివరించబడింది. అనువాదకుల గమనిక: దీనిని ఇప్పటికే మనం నారాయణ సూక్తంలో “అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః”, శ్రీ రామాయణ శ్లోకం “జగత్ సర్వం శరీరం తే” – సర్వం వ్యాపించి ఉన్నవాడు విష్ణువు – కాబట్టి శ్రీమన్నారాయణుడు అన్నింటిలో నివసించే అంతరాత్మ అని అర్థం.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/10/virodhi-pariharangal-41/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org