విరోధి పరిహారాలు – 46

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2021/03/22/virodhi-pariharangal-45-telugu/

శ్రీమన్నారాయణ తో పాటు ఉభయ దేవేరులు – పరమపదము

81. పతిత్వ విరోధి  – స్వామిత్వంలో  అవరోధాలు

“పతిం విశ్వస్య” (భగవాన్ ప్రతి ఒక్కరికీ సర్వశ్రేష్టమైన స్వామి) అని వివరించబడింది. ప్రజాపతి (బ్రహ్మ), పశుపతి (శివుడు), బృహస్పతి (దేవతలకు గురువు), సురపతి (ఇంద్రుడు), ధనపతి (కుబేరుడు), సేనాపతి (స్కందుడు), గణపతి (గణేశుడు) మొదలైన వారిని స్వామిగా భావించడం  భగవానుడి సర్వశ్రేష్టమైన స్వామిత్వానికి విరుద్ధమౌతుంది కాబట్టి అది ఒక అడ్డంకి.

పతి అంటే స్వామి.  “పతిం విశ్వస్య” – శ్రీమన్నారాయణుడు విశ్వం మొత్తానికి ఏకైక స్వామి అని ఉపనిషత్తులో స్థాపించబడింది. ఎన్నో ఇతర దేవతల పేర్లలో  “పతి” ఉంటుంది. ప్రజాపతి – 4 ముఖాల బ్రహ్మ. పశుపతి – శివుడు. బృహస్పతి – దేవతలకు గురువు, సురపతి – అన్ని దేవతలకు నాయకుడు అయిన ఇంద్రుడు. ధనపతి – ధనానికి అధిపతి అయిన కుబేరుడు. సేనాపతి  – కార్తికేయుడు, దేవతల సైన్యానికి సేనాధిపతి. గణపతి – ఏనుగు ముఖంగల గణేశుడు. ఈ దేవతలను స్వామిగా పరిగణించడం తప్పు.

అనువాదకుల గమనిక: సాధారణంగా  పతి అంటే యజమాని, ప్రభువు, నాయకుడు, భర్త మొదలైన ఎన్నో అర్థాలు ఉన్నాయి. శ్రీమన్నారాయణుడను “విశ్వపతి” (విశ్వానికి  ప్రభువు) మరియు “లోక భర్త” (అందరికీ భర్త) అని ఆచార్య హృదయం 121 వ చూర్ణికలో నాయనార్ వర్ణించారు. ఈ పదాలు  నారాయణ సూక్తం (పతిం విశ్వస్య) మరియు శ్రీ రామాయణం (కౌసల్యా లోకభర్తారం స్లోకం) నుండి తీసుకొని నాయనార్ చేత అందంగా కూర్చబడ్డాయి. కాబట్టి, భగవాన్ అందరికీ ప్రభువు/ యజమాని అని అర్ధం. భగవాన్ యొక్క దివ్య అనుగ్రహం కారణంగా ఈ దేవతలకు అటువంటి గౌరవం ఇవ్వబడింది అని అర్థం చేసుకోవాలి. ఆళవందారులు స్తోత్ర రత్నం 11 నుండి 14 వ స్లోకము‌ వరకు ఈ సూత్రాన్ని అందంగా వివరించారు. ముఖ్యంగా 13 వ స్లోకంలో, ” వేదాపహార గురుపాతక దైత్యపీడాతి ఆపద్విమోచన మహిష్ట ఫలప్రదానైః । కోన్యః ప్రజా పసుపతీ పరిపాతి కస్య పదోదకేన స శివః స్వసిరోద్రుదేన ॥” ఇక్కడ, ఆళవందారులు శ్రీమన్నారాయణుడను ప్రశ్నిస్తున్నారు “దేవతలకు ముప్పు వచ్చినపుడు వారిని ఎవరు ఆదుకున్నారు? బ్రహ్మ వేదాలకు దూరమైనపుడు, రుద్రుడు తన సొంత తండ్రి అయిన బ్రహ్మ తలని నరికినపుడు, అసురుల కష్టాల నుండి ఇంద్రుడిని కాపాడటం వంటి విపత్తులు వచ్చినపుడు వారిని ఎవరు ఆదుకున్నారు? నీవు తప్ప ప్రజాపతిని (బ్రహ్మ) మరియు పశుపతిని (రుద్రుడు) ఇంకెవరు రక్షించగలరు? ఎవరి పాదాలను కడిగిన నీటిని శిరస్సున ధరించి రుద్రుడు పవిత్రమైయ్యాడు? “. ఈ స్లోకం పురాణాలలో కీర్తించబడిన సంఘటనల ఆధారంగా వ్రాయబడింది.  ప్రతి ఒక్కరికీ నిజమైన రక్షకుడైన భగవానుడిని ఆళవందారులు  ప్రశ్నిస్తున్నారు.  బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు గొప్ప దేవతలు అయినప్పటికీ, వారు కూడా తమ శక్తిని వారిలో అంతర్యామిగా ఉన్న భగవాన్ నుండి పొందుతారు,  కొన్ని కార్య నిర్వహరణలకై అటువంటి శక్తులు వారికి ప్రసాదించబడ్డాయి, విపత్తి పరిస్థితుల్లో వారిని రక్షించేది శ్రీమన్నారాయణుడు మాత్రమే.  బ్రహ్మ దగ్గర నుండి అసురులు వేదాల్ని దొంగిలించినప్పుడు, శ్రీమన్నారాయణుడు హయగ్రీవ రూపాన్ని ధరించి, వేదాన్ని అసురుల నుండి రక్షిస్తాడు. తన తండ్రి బ్రహ్మ యొక్క చతుర్ముఖాలలో ఒకదాన్ని ఛేదించడం వల్ల బ్రహ్మ యొక్క కపాలం రుద్రుని  చేతికి అంటుకుపోతుంది. రుద్రుడు బ్రహ్మ హత్య దోషంతో బాధపడుతున్నప్పుడు, శ్రీమన్నారాయణుడు వద్దకు వెళ్లి వేడుకుంటాడు. భగవాన్ తన వక్షస్థలం నుండి స్వేదం (చెమటను) తీసి చల్లి ఆ కపాలాన్ని ముక్కలు చేసి, రుద్రుడికి దోష విమోచనం చేస్తాడు. అసురులు ఇంద్రుడిపై దాడి చేసినప్పుడల్లా, ప్రతి సారి తనని కాపాడమని  శ్రీమన్నారాయణుడను  ప్రార్థిస్తాడు. బ్రహ్మ తన కమండలం లోని నీటితో శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలను కడిగినప్పుడు, ఆ జలం గంగా నదిగా ప్రవహించడం ప్రారంభిస్తుంది. భాగీరథ మహర్షి ఆ గంగను భూమిపైకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు,  మొదట రుద్రుడు తన జటాజూటంలోకి తీసుకొని ఆ వేగ ప్రవాహాన్ని నియంత్రిస్తాడు. శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాల నుండి క్రిందికి ప్రవహించిన పవిత్ర జల స్పర్శ ద్వారా, అతను పవితృడౌతాడు, “శివ” అని పిలువబడ్డాడు, అంటే శుభం/పవిత్రం అని అర్థం. ఈ విధంగా, శ్రీమన్నారాయణుడు ప్రతి ఒక్కరికీ స్వామి అని, అటువంటి అత్యోన్నత ప్రభువును ఇతరులతో జోడించడం ఒక అడ్డంకి అని మనం అర్థం చేసుకోవచ్చు.

82. వర్జనీయ విరోధి – వర్జనీయమైన వాటిలో అవరోధాలు

శాస్త్రంలో నిషేధించబడిన తామస ఆహారం తీసుకోవడం. ఉదాహరణకు మధ్యం, మాంసాహారం మొదలైనవి భుజించడం, సాత్విక ఆహారాములను (సత్వ స్వభావం గల ఆహారం) తీసుకోకపోవడం, సాత్విక శాస్త్రములను మరియు సాత్విక అనుష్ఠానములను (సత్వ గుణాలను ప్రేరేపించే కార్యాలు) అనుసరించకపోవడం అవరోధాలు.

వర్జనీయం అంటే వర్జించబడినవి అని అర్థం. నిషిద్ధం అంటే నిషేధించబడినవి అని అర్థం. ఆహార పదార్థాలని సాధారణంగా సాత్వికం, రాజసం, తామసం అని మూడు వర్గాలుగా వర్గీకరించారు. సత్వ గుణాన్ని పెంపొందించే పదార్థాలను సాత్విక ఆహారం అంటారు. సోమరితనం, నిద్ర, బద్ధకం మొదలైన వాటికి దారితీసే వాటిని తామస ఆహారం అంటారు. మధ్యం, మాంసం మొదలైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అదే సూత్రాన్ని ఇతర అంశాలలో కూడా గమనించవచ్చు.
అనువాదకుల గమనిక: మనము ఆహార నియమాలు, ఆహార  పదార్థాల గురించి ఈ శీర్షికలలో చూసాము. https://granthams.koyil.org/2019/12/15/virodhi-pariharangal-23-telugu/.

ఆహార నియమాల వివరణ ఇక్కడ చూడవచ్చు  Http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-aahaara-niyamam_28/ వద్ద http: //ponnadi.blogspot

ప్రశ్న ఉత్తరాలను https://granthams.koyil.org/2012/08/srivaishnava-ahara-niyamam-q-a/. లో చూడవచ్చు.

శాస్త్రంలో నిషేధించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మరోవైపు, శాస్త్రంలో నియమించబడిన  జీవాత్మ గూణాలకు సానుకూలత పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయకూడదు.  అకృత్య కరణం (శాస్త్రంలో నిషేధించబడినవి చేయడం) మరియు కృత్య కరణం (శాస్త్రంలో నిర్దేశించినట్లు చేయకపోవడం) రెండూ ఖండించబడ్డాయి. ఈ రెండింటినీ మానుకోవాలి. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి శాస్త్రంలో వివరించిన వాటిని, మన ఆచార్యలు అనుసరించిన వాటిని మనం కూడా అనుసరించే ప్రయత్నం చేయాలి.

83.  అవర్జనీయ విరోధి  – అవర్జనీయమైన వాటిలో అవరోధాలు

అవర్జనీయ – మనము వదులుకోలేనివి – అనివార్యమైనవి. అనువాదకుల గమనిక: ఈ అంతిమ అంశంలో, ముముక్షు (మోక్షాన్ని కోరుకునేవాడు – ప్రత్యేకంగా ప్రపన్నులు, శరణాగతులు),  ముక్త (మోక్షాన్ని పొందిన తరువాత స్థితి) గురించి చాలా ముఖ్యమైన అంశాలు తెలియ చేయబడ్డాయి.

  • ముముక్షువు అయిన తరువాత కూడా భౌతిక సంపత్తి, కామ కోరికలు కలిగి ఉండటం, ముముక్షు యొక్క స్వభావానికి అవి తగనివి అని మర్చిపోవటం ఒక అడ్డంకి. అప్రాప్త – సరి తగనివి. అలాంటి కోరికలు ముముక్షువుకి ప్రమాదకరమైనవని అని చెప్పబడ్డాయి. అనువాదకుల గమనిక: ముముక్షు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు. ముఖ్యంగా, ఇక్కడ  ప్రపన్నుల (ఆచర్య సంబంధం కలిగి ఉన్న వారు) గురించి చెప్పబడింది. అలాంటి వ్యక్తులు భగవాన్ మరియు భాగవతులకు దాసుడన్న వారి నిజమైన స్వభావాన్ని ఎప్పటికీ మరచిపోకూడదు. ఆస్థిపాస్థులకు, కామ కోరికలను (ఇంద్రియ సుఖం, కుటుంబం, మిత్రులు మొదలైన లౌకిక కోరికలు) ఆశిస్తే, అది భౌతిక జీవితానికి దారి తీస్తుంది, చివరికి మనం ముముక్షు స్థితి నుండి దిగజారిపోతాము. ఎందుకంటే  ప్రాపంచిక సుఖాలను పొందాలనే కోరిక మన మోక్షము యొక్క ఇచ్ఛను ఆవహించేస్తుంది. పిళ్ళై లోకాచార్యులు తత్వ త్రయం యొక్క మొదటి సూత్రంలో, మోక్షం పొందాలనుకున్న ముముక్షుకి, తత్వ త్రయం – చిత్, అచిత్ మరియు ఈశ్వరుడి యొక్క పూర్తి జ్ఞానం ఉండాలని  వివరించారు. ఆ జ్ఞానం పూర్తిగా స్థిరపడిన తర్వాత, లౌకిక కోరికలు ఉండవు. అలాగే ముముక్షుప్పడిలో ద్వయ ప్రకరణం ప్రారంభంలో, పిళ్ళై లోకాచార్యులు ఒక శ్రీవైష్ణవుడికి ఉండ వలసిన ముఖ్యమైన లక్షణాలను వివరించారు. మాముణులు ఈ సూత్రానికి విస్తృతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. మొదటి లక్షణం – లౌకిక సుఖాల కోరికలను పూర్తిగా వదులుకోవడం. తరువాత, పరమపదంలో నిత్య కైంకార్యమైన మన లక్ష్యంపైన దృఢ విశ్వాసం ఉంచి, ఆ శాశ్వత కైంకర్యానికై  మన నిరంతర తపన యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కిచెప్పబడింది. ఈ విధంగా, ముముక్షు మనస్సులో ఏ రకమైన భౌతిక కోరికలకు చోటు లేదు.
  • అటువంటి భౌతిక కోరికల ఫలితంగా వచ్చే భాగవత అపాచారాలు అడ్డంకులు.  అనువాదకుల గమనిక: ప్రాపంచిక సుఖాల పట్ల మన కోరిక పెరిగినప్పుడు, అటువంటి సుఖాలను పొందేటపుడు భాగవతులను కొన్నిసార్లు  అవమానించడం లేదా నిర్లక్ష్యం చేయడం వంటి అపచారాలు జరుగుతుంటాయి. పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో పపన్నుని దినచర్య తెలియజేసేటపుడు ఇటువంటి ఒక సూత్రం యొక్క వివరణ ఇచ్చారు. ఇతర విషయాలతో పాటు అహంకారం, భౌతిక సంపద, కామం అనే మూడు విపత్తులకు భయపడాలని, అవి 3 రకాల ప్రమాదాలకు కారణమవుతాయని వారు తెలియజేస్తున్నారు. అహంకారం మనల్ని ఇతర శ్రీవైష్ణవుల‌కు సమానమని భావింపజేసి వారికి తగిన గౌరవం / శ్రద్ధ చూపకుండా  అగౌరవానికి దారితీస్తుంది. డబ్బు ఆశ, వాళ్ళు కావాలనికున్న సంపదను పొందటానికి సంసారులు (భౌతిక ప్రజలు) వద్దకు చేరేలా చేస్తుంది. కామ కోరిక స్త్రీల వద్దకు వెళ్ళేలా చేస్తుంది. ఇవన్నీ చివరకు శ్రీవైష్ణవుల అవమానానికి దారితీస్తాయి కాబట్టి ఇటువంటి ఆపదలకు జాగ్రత్తగా దూరముండాలి.
  • భౌతిక అంశాలను సుఖకరమైనవని భావించి అపోహ పడటం ఒక అడ్డంకి. భౌతిక అంశాలను సుఖకరంగా భావించడం అంటే, అలాంటి భౌతిక సుఖాల పట్ల వైరాగ్యం అభివృద్ధి కాలేదని అర్థం. అనువాదకుల గమనిక: భగవత్ దాసుడన్న తన యొక్క అసలు స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు, భగవత్ సేవ మాత్రమే మనలి ఆనందింపజేస్తుందని అర్థమౌతుంది. పేయాళ్వార్ దీనిని మూన్రాం తిరువంతాది 14 వ  పాసురంలో వివరించారు, “మార్పాల్ మనం సుళిప్ప మంగైయర్ తోళ్ కైవిట్టు” – శ్రీమన్నారాయణుడి పట్ల ప్రీతిని అభివృద్ధి చెందిన తరువాత, స్త్రీ వ్యామోహం (ప్రాపంచిక సుఖం) అదంతకదే మాయమౌతుంది.
  • పరంపదం చేరుకున్న తరువాత, భగవత్ సేవ చేస్తూ తాను ఆనందాన్ని పొందవచ్చు అని భావించుట అవరోధం. ముక్తి పొంది పరంపదం చేరుకున్న తరువాత, భగవానుడిని సేవిస్తున్నప్పుడు ఆనందించేవాడిని నేను అని భావించకూడదు – అది తప్పు. దీనిని నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.9.4 లో “తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే” – నీవు (భగవాన్) నీ ప్రీతి కొరకు నన్ను నీ కైంకర్యానికి వాడుకో అని వివరించారు.
  • తాను ఆనందించాలి అన్న వైఖరి, పరమపదంలో కూడా తానే ఆనందించాలనే కోరికకు కారణమౌతుంది. అటువంటి వైఖరి కలిగి ఉండటం ఒక అడ్డంకి. భోక్తృత్వ బుద్ధి – తనను ఆనందించే వ్యక్తిగా భావించడం. భగవానుడికి ఆనందం కలిగించేందుకు ఆరాటపడాలి. ఆళవందారులు స్తోత్ర రత్నం 46వ శ్లోకంలో “ప్రహర్షయిష్యామి” – నేను భగవానుడికి పరమానందాన్ని ఎప్పుడు కల్పిస్తాను అని ఆరాటపడుతున్నారు. అనువాదకుని గమనిక: – అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం చూర్ణిక 21లో “శేషత్వ భోక్తృత్వంగళ్ పోలన్రే పారతంత్రియం భోగ్యతైగళ్” – పారతంత్రియం (సర్వాధారం) మరియు భోగ్యతైగళ్ (భోగ్య వస్తువు), శేషత్వం (దాస్యం) మరియు భోక్తృత్వంగళ్ (ఆనందించేవాడు) కన్నా ఎక్కువ అని వివరిస్తున్నారు. శేషత్వం ఇక్కడ ఒక బంగారు ఇటుక లాంటిదని (విలువైనది ఇంకా ఆకారం / రూపాన్ని మార్చిన తర్వాత మాత్రమే ఉపయోగించవచ్చు) మరియు పారతంత్రియం బంగారు ఆభరణం లాంటిది (దాన్ని ఉపయోగించవచ్చు) అని ఇక్కడ మాముణులు అందంగా వివరిస్తున్నారు. మన అస్థిత్వం యొక్క ఉద్దేశ్యం భగవానుడికి పూర్తి ఆనందాన్ని కలిగించడమే అని దృఢంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవలసిన ప్రధాన సూత్రం ఏమిటంటే – భగవాన్ స్వామి అని (యజమాని),  జీవాత్మ సేవకుడని (యాజమాని యొక్క ఆస్తి) అని అర్థం చేసుకోవాలి. ఆస్తి అనేది యజమాని యొక్క సుఖం కోసం మాత్రమే ఉంటుంది. జీవాత్మ వివేకము కలవాడు కాబట్టి, భగవాన్ యొక్క ఆనందాన్ని చూసి, తాను వివేకంతో  ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. ఇది చాలా లోతైన సూత్రం, ఆచార్యుల నుండి కాలక్షేపం ద్వారా అర్థం చేసుకోవాలి.
  • పైన పేర్కొన్న సొంత – ఆనందం వైఖరి కారణంగా, “భగవత్ ఆనందం కోసం మాత్రమే” అనే సూత్రాన్ని మరచిపోవడం ఒక అడ్డంకి. భోగ్యం – ఆనందించేది. పరైక భోగ్యత్వం – భగవాన్ చేత మాత్రమే ఆనందింపబడాలి అన్న బలమైన నిశ్చయం. ఈ వైఖరిని కోల్పోకూడదు. అనువాదకుల గమనిక: ఇది మన సత్ సాంప్రదాయం యొక్క అత్యున్నత సూత్రం, “అచిత్వత్ పారతంత్రియం” – అచిత్ లాగా భగవాన్ యొక్క పూర్తి అధీనంలో ఉండటం, భగవాన్ తన ఆనందాన్ని వ్యక్తపరచినపుడు జీవాత్మ లాగా తానూ ఆనందంతో ప్రతిస్పందించడం. ఈ సూత్రాన్ని ద్వయ మహామంత్రం యొక్క రెండవ భాగంలోని “నమః” లో  వివరించబడింది. కులశేఖర ఆళ్వార్ పెరుమాళ్ తిరుమొళి, 4.9 లో,  “పాడియాయ్క్ కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” –  ఒక మెట్టుగా ఉండి,  నేను నీ అందమైన పెదాలను (ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న) చూసి ఆనందించాలనుకుంటున్నాను. ప్రవేశద్వారం వద్ద మెట్టు ఇక్కడ అచిత్, దీనికి జ్ఞానం ఉండదు. కానీ ముఖంలో ఆనందాన్ని చూడటం జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమౌతుంది. పెరియ వాచాన్ పిళ్ళై  “పాడియాయ్క్ కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే ” అంటే అచిత్వత్ పారతంత్రియం అని అర్థం – మనం అచిత్  లాగా ఉండేలా భగవాన్ పట్ల పారతంత్రియంతో ఉండాలి. ఉదాహరణకు, మనం ఒక పుస్తకాన్ని తీసుకొని దానిని వేరే చోట పెడితే, అది మనల్ని ప్రశ్నించదు – భగవాన్ మనతో ఏదైనా చేసినప్పుడు, మనం కూడా అతన్ని ప్రశ్నించకూడదు. మన కైంకర్యంతో అతను తృప్తి చెందినప్పుడు సంతృప్తిని ఆనందాన్ని చూపిస్తాడు, మనం కూడా ప్రతిస్పందించాలి, లేకపోతే అచిత్తుకి మనకి తేడా ఉండదు. ఉదాహరణకు, ఒక పిల్లవాడిని ఎత్తుకొని ఆడించినపుడు, పిల్లవాడు మనకు స్పందిస్తాడు. అప్పుడు మన ఆనందం రెట్టింపు అవుతుంది. అదే విధంగా, మనము భగవానుడి ఆనందానికి స్పందించిపపుడు, అతని ఆనందం రెట్టింపు అవుతుంది. ఇంతకు మునుపు చూసినట్లుగా, ఆళవందారులు తన స్తోత్ర రత్నం 46వ శ్లోకంలో “కదా … ప్రహర్షయిష్యామి” – భగవత్ ఆనందానికి ఆరాటపడలి.  జీవాత్మ భగవాన్ యొక్క ఆనందానికి ప్రతిస్పందించినపుడు, భగవాన్ పరమానందిస్తాడు. ఆయన సంతోషమే మన కైంకార్యం యొక్క ఏకైక లక్ష్యం.
  • ముక్తాత్మ స్థితిలో, ఆనందించే కోరిక భగవాన్ చేత ప్రేరేపించబడి ఉంటుంది, భగవానుడికి  గొప్ప ఆనందాన్ని ఇస్తుంది,  అతని ఆనందాన్ని పెంచుతుంది, ఇక్కడ అది అడ్డంకి కాదు. తిరువిరుత్తం 33 “అగల్విసుంబం నిలనుం ఇరుళార్ వినైకెడచ్ చెంగోల్ నడావుతిర్”. విముక్తి పొందిన స్థితిలో కూడా, భగవాన్ యొక్క నిత్య సంకల్పం వలన, ముక్తాత్మ తన నియంత్రణ మరియు తను ఆనందించాలనే కోరిక రాకుండా చూస్తాడు. అద్మి  – నేను తింటాను, ఆనందిస్తాను. అహమన్నం – నేను ఆ ప్రభువుకి ఆహారం (ఆనందించే అంశం). అహం అద్మి- నేను తినేవాడిని (ఆనందిస్తున్నాను). దీని అర్థం ఏమిటంటే, భగవాన్ విందుని (జీవాత్మ) ఆనందించడం చాలా ముఖ్యం. భగవాన్ యొక్క ముఖారవిందంలో ఆనందాన్ని చూసి, జీవత్మా కూడా ఆనందాన్ని అనుభవిస్తుంది. పరప్రేరితం – అతనిచే ప్రేరేపించబడినది. జీవాత్మ ఆనందించే ఈ చిన్ని అంశం భగవత్ సంకల్పం ఆధారంగా జీవాత్మలో ఉద్భవిస్తుంది. ఇది అడ్డంకి కాదు. అనువాదకుల గమనిక:  ఈ అంశాన్ని మునుపటి విభాగాలలో వివరంగా చూశాము.  ఆనందించాలనే వైఖరి జీవాత్మలో ఉండటం సహజం. విముక్తి పొందిన పరిస్థితిలో, భగవాన్ మొదట జీవాత్మను ఆనందించి తన కృపను చూపుతాడు. అది చూసిన జీవాత్మ కూడా పరమానందాన్ని అనుభవిస్తాడు. ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, తండ్రి తన బిడ్డను ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు, అతను గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాడు. తండ్రి ముఖంలో చిరునవ్వు చూసిన పిల్లవాడు, తాను చిరునవ్వును చిందిస్తూ ప్రతిస్పందిస్తాడు. అది చూసిన తండ్రి మహదానందాన్ని పొందుతాడు. ఈ విధంగా, పరంపదం (శ్రీ వైకుంఠం) లో ఎప్పటికీ ఈ పరమానందానికి అంతం ఉండదు.  ఇది శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య సంకల్పం.
  • “అనివార్యమైన అంశాలు” లకు ప్రత్యామ్నాయ వివరణ ఇక్కడ ఇవ్వబడింది. ఆచార్య కైంకర్యానికి (ఇక్కడ) అడ్డంకిగా ఉన్న భగవత్ సౌందర్యం ఈ ప్రపంచంలో (భౌతిక ప్రపంచం) మరియు ఇతర ప్రపంచంలో (పరమపదం – ఆధ్యాత్మిక ప్రపంచం) రెండింటిలోనూ కైంకర్యానికి ప్రధాన అడ్డంకి. భగవాన్ ఆ అడ్డంకిని తొలగించి, జీవాత్మ యొక్క కైంకర్యాన్ని స్వీకకరిస్తాడు. ప్రధానంగా క్రమశిక్షణ లేకుండా ఎన్నో జన్మలలో మనము నిషేధించబడిన పనులు చేయడం వలన ఫలించిన కర్మలు ఈ అవరోధాలు. ఇక్కడ, “అవర్జనియ వీరోధి” కు ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వబడింది, ఇది మునుపటి వివరణకు,  ఇక్కడ మరియు అక్కడ – లీలా విభూతి (సంసారం – భౌతిక ప్రపంచం) మరియు నిత్య విభూతి (పరమపదం – ఆధ్యాత్మిక ప్రపంచం) భిన్నమైనది. “సౌదర్యం అంతరాయం” (ముముక్షుపడి 182 – ఆ దివ్య రూపం యొక్క దివ్య సౌందర్యం ఆటంకం) భగవాన్ యొక్క దివ్య సుందర రూపాన్ని చూసినప్పుడు మనము కరిగి కన్నీటి సాగరంలో మునిగిపోతాము, అని పెరియ తిరువంతాది 34వ పాసురంలో “కాలాళుం, నెంజళియుం, కణ్సుళలుం” – మనస్సు కరికి, కాళ్ళు వనికి కళ్ళు తిరుగుతాయి అని వివరించబడింది. ఈ కారణంగా వారు కైంకర్యం సరిగా చేయలేరు. ముఖ్యంగా భాగవతులకు, ఆచార్యలకు కైంకర్యం చేసేవారికి, భగవత్ సౌందర్యాన్ని ఆనందించడం మహా అడ్డంకి అవుతుంది. శ్రీ రామాయణం, అయోధ్య కండం 1.1 లో, “చతృఘ్నో నిత్య సతృఘ్నః – “శతృఘ్న – శత్రువుని శాశ్వతంగా జయించినవాడు”. ఇక్కడ శాశ్వతమైన శత్రువు అంటే ఏమిటి? శ్రీ రాముని యొక్క దివ్య సౌందర్యం, గుణాలు భగవానుడికి కైంకర్యం చేయడంలో అడ్డంకులు అవుతాయి. దీనిని అవర్జనీయ విరోధి (అనివార్యమైన అడ్డంకి) అని వివరించబడింది. గత కర్మల వల్ల అనుకోకుండా తలెత్తే మన ఆచార అనుష్థానాలలోని లోపాలు కూడా ఇక్కడ చేర్చబడ్డాయి. అనువాదకుల గమనిక: ఇక్కడ రెండు ముఖ్యమైన అడ్డంకుల గురించి వివరించబడింది. మొదట భగవత్ సౌందర్యం, మన కైంకర్యంలో అడ్డంవస్తుందని వివరించబడింది. ముముక్షుప్పడిలో, పిళ్ళై లోకాచార్యులు దీనిని ద్వయ ప్రకరణం చివర్లో చక్కగా తెలియజేస్తున్నారు. మన నిజమైన లక్ష్యం దివ్య దంపతులైన శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీమన్నారాయణుడు వారి ఆనందం కోసం సేవ చేయడం. కానీ అతని సౌందర్యం మనల్ని మంత్ర ముగ్దులను చేసి మన కైంకర్యంలో అడ్డం వచ్చి ఆపుతుంది. అతని సౌందర్యం మన హృదయాన్ని దోచేసి చలనం లేకుండా చేస్తుంది, కాబట్టి అతని సౌందర్యం కైంకర్యానికి ఒక అడ్డంకి అని మాముణుల వ్యాఖ్యానంలో వివరిస్తున్నారు. కాబట్టి, భగవాన్ ఆ అడ్డంకిని తొలగించి, మనం కైంకార్యం కొనసాగించేలా చేస్తాడు. శతృఘ్నడుని ఉదాహరణ ఇక్కడ చక్కగా వివరించబడింది. అతను ఎన్నడూ శ్రీ రామునివైపు చూసేవాడుకాదట. ఎందుకంటే అతను శ్రీ రాముని వైపు చూస్తే, అతను మైమరచిపోయి భరతునికి (శ్రీ రాముని కైంకర్యంలో లీనమై ఉన్న శుద్ధ భాగవతుడు) చేసే కైంకార్యానికి  బాధ వటిల్లుతుంది. ఇక్కడ వివరించిన రెండవ అంశం గత కర్మల వల్ల చేసే అపచారాల గురించి. పెరియవాచాన్ పిళ్ళై ఈ సూత్రాన్ని తమ సకాల ప్రమాణ తాత్పర్యంలో విస్తృతంగా వివరించారు. ఈ ప్రత్యేక అంశంపై ఇప్పుడు వారి వివరణ చూద్దాం. ఒక ప్రపన్నుడు, భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేసిన తరువాత కూడా గత కర్మల కారణంగా వాసనా (గత స్మృతులు),  రుచి (ఇటువంటి పాపాత్మకమైన కార్యములపై అనుబంధం) కారణంగా అపచారములు చేస్తుంటాడు. వీటిని ఉత్తరాగం (ఉత్తర – తరువాతి, అగం – పాపం) అంటారు. ఈ పాపాలు రెండు రకాలుగా అంటారు – కొన్ని ఉద్దేశపూర్వకంగా చేసినవి, కొన్ని తెలియకుండా చేసినవి ఉంటాయి. మరొక వర్గం కూడా ఉంది – ప్రాయశ్చిత్తం చేసిన పాపాలు, ప్రాయశ్చిత్తం చేయని పాపాలు. ప్రాయశ్చిత్తం అంటే చేసిన తప్పుకి క్షమాపన వేడుకొని మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉండటం. భగవానుడికి సంబంధించిన విషయాలలో చేసిన పాపాలు, భగవాన్ ముందు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. భాగవతుల పట్ల చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయాలి. భగవాన్ జీవత్మ పట్ల ఉన్న అమితమైన ఆప్యాయతతో తాను అనుకోకుండా చేసిన పాపాలను, భాగవతుని పట్ల చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసినపుడు ఆ పాపాలను తొలగిస్తాడు. పాపాలకు ప్రాయశ్చిత్తం చేయకపోవడం మూడవ రకము – 1.) క్రూరమైనవి – శాస్త్రాంలో మరియు మన పూర్వాచార్యులు ఖండించబడిన చర్యలు.  ఇందులో ఇతరుల భార్యలపై కోరిక, మాంసం తినడం, మధ్యపానం చేయడం మొదలైనవి, వారి వర్ణాశ్రమం ప్రకారం సంధ్యావందనం మొదలైనవి చేయకపోవడం. 2) మరింత క్రూరమైనవి – భగవాన్ పట్ల చేసే అపరాధాలు. ఇతర దేవతలను శ్రీమన్నారాయణకు సమానంగా భావించడం, భగవానుడి అవతారాలను కేవలం మానవులుగా పరిగణించడం మొదలైనవి. 3) అతి క్రూరమైనవి – భాగవతులను వారి సంపద, హోదా, జన్మను బట్టి వారిని గౌరవించడం, అగౌరవించడం, నిర్లక్ష్యం చేయడం మొదలైనవి. ప్రాయశ్చిత్తం చేయని ఈ మూడు రకాల పాపాల యొక్క పరిణామాలను ప్రపన్నుడు అనుభవించ వలసి ఉంటుంది. ఒక ప్రపన్నుడు భగవత దయపై మాత్రమే దృష్టి సారించి ఉంటాడు కాబట్టి, అతను చాలా జాగ్రత్తగా ప్రవర్తించి ఈ మూడు రకాల అపరాధాలు చేయకుండా ఉంటాడు. ఒకసారి శరణాగతి చేసిన తరువాత, ప్రపన్నుడు ఎటువంటి పాపాలకు పాల్పడడు. పొరపాటున తప్పు చేసినా, వారు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు – ఒక ప్రపన్నుడు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయకపోవడం అనేది ఊహించలేనిది. అందువల్ల, అనుకోకుండా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసినపుడు భగవాన్ యొక్క గొప్ప కృప కారణంగా అవి తొలగించ బడతాయని అర్థం చేసుకోవచ్చు.

దీనితో మనము ఎమ్పెరుమానార్ చేత వంగి పురత్తు నంబికి ఉపదేశించబడి విరోధాలు,  వంగి పురత్తు నంబి యొక్క వివరణలు,  శ్రీ ఉ. వె. వి వి రామానుజం స్వామి యొక్క సహాయంతో అన్ని అవరోధాలను పూర్తి చేసాము. తరువాతి వ్యాసంలో,  ఇప్పటివరకు చర్చించిన అన్ని అడ్డంకులను సంగ్రహించే ఈ గ్రంథం యొక్క ముగింపు విభాగాన్ని చూస్తాము.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/12/virodhi-pariharangal-46/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment