శ్రీ రామానుజ వైభవము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

ఎంపెరుమానార్లు మన సంప్రదాయానికి చేసిన ఎనలేని కృషిని ప్రతి ఒక్కరూ చిరకాలము గుర్తుంచుకునేలా స్వయంగా శ్రీ రంగనాథుడు మన సత్ సంప్రదాయానికి ఎంపెరుమానార్ దరిశనము (రామానుజ దర్శనం) అని నామకరణము చేశారు, అని మాముణులు ఉపదేశ రత్నమాలలో తెలియజేశారు. శ్రీరామానుజులు ఈ సత్ సంప్రదాయానికి స్థాపకులు కాదు, ఈ సంప్రదాయానికి వారు ఏకైక ఆచార్యులు కాదు. కానీ వారు ఈ సంప్రదాయాన్ని ముందుండి దృఢంగా మర్గదర్శకత్వము వహించి నిత్యము వర్ధిల్లేలా చేశారు, ఈ కారణంగా వారు గొప్పగా కీర్తింపబడ్డారు. వారు చేసిన కృషి ఎంత అపారమైనదంటే, మనము ఎంతో ప్రయత్నిస్తే , ఎంపెరుమానార్ల మహిమలను కొంత వరకు సంగ్రహించి అర్థం చేసుకోవడానికి సాధ్యము కావచ్చు. కానీ కీర్తి ప్రతిష్ఠల గురించి వివరించుట ఎవరికైనా కష్టమే. కానీ మన అద్భుతమైన గురువు పరంపర ద్వారా వారి సంబంధము కలిగి ఉండటం మన అదృష్టం, ఆ శక్తితో ఎంపెరుమానార్ల  మహిమలను కొద్ది కొద్దిగా ఆనందిద్దాం.

జన్మము మరియు ప్రారంభ రోజులు

ఈ ప్రసిద్ధమైన శ్లోకములో “అనంతః ప్రథమమ్ రూపం లక్ష్మణశ్చ తతః పరం బలభద్రః తృత్ల్యస్తు కలౌ కశ్చిద్ భవిష్యతి”,

ఈ శ్లోకములో అనేక యుగాలలో ఆదిశేషుని అనేక అవతారాల గురించి వివరించబడింది, వారి కలియుగ అవతారం గురించి కూడా సూచించబడింది. శ్రీరామనుజులు ఆదిశేషుని కలియుగ అవతారమని చరమోపాయ నిర్ణయంలో వివరించబడింది.

రామానుజ నూఱ్ఱందాదిలో, “మణ్మిశై యోనిగళ్ తోఱుం పిఱంతు ఎంగళ్ మాధవనే కణ్ణుఱ నిఱ్కిలుం కాణగిల్లా ఉలగోర్గళెల్లాం అణ్ణల్ ఇరామానుశన్ వందు తోన్ఱియ అప్పొళుతే నణ్ణరు జ్ఞానం తలైక్కొణ్డు నారణఱ్కాయినరే” అని అముదనార్లు ఎంబెరుమానుడి అవతారము కంటే ఎంపెరుమానార్ల అవతారము గొప్పదని కీర్తుంచారు. మాముణులు ఈ విషయాన్ని, “మనందరి స్వామి అయిన శ్రీమన్నారాయణుడు ఈ భూమిపైన అనేక అవతారములెత్తినప్పటికీ, ఈ లోక వాసులు అతడిని స్వామిగా స్వీకరించలేదు. కానీ ఈ ప్రపంచంలో ఎమ్పెరుమానార్లు అవతరించిన వెంటనే (శ్రీభాష్యం మొదలైనవి వివరించి), ప్రపంచ ప్రజలు వాస్థవ జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవానుడికి దాసులైనారు.

మాముణులు కూడా తమ ఆర్తి ప్రబంధంలో శ్రీ రామానుజుల జన్మని ఇలా కీర్తించారు, “ఎనైప్పోల్ పిళై సెయ్వార్ ఇవ్వులగిల్ ఉణ్డొ, ఉనైప్పోల్ పొఱుక్క వల్లార్ ఉణ్డో అనిత్తులగుం వాళప్పిఱంత ఎతిరాశ మామునివా ఏళైక్కు ఇరంగాయ్ ఇని”. అనగా “తప్పులు చేసే నా వంటివాడు మరొకడు ఉన్నాడా,  వాటిని క్షమించే మీ వంటి వారు మరొకరెవరైనా ఉన్నారా?  అందరి ఉద్ధరణకై అవతరించిన ఓ యతులకు రాజా! దయచేసి నాకు సహాయం చేయండి”.

వీటి నుండి, భగవద్ రామానుజులు మనందరి కష్టాలను తొలగించి, మనల్ని ఉద్దరించి ఆధ్యాత్మిక లోకంలో మనచే భగవానుడి నిత్య సేవ చేయించడానికి అవతరించారని మనం అర్థం చేసుకోవచ్చు.

వారు కేశవ సోమయాజి, కాంతిమతి అమ్మలకు కుమారుడిగా జన్మించారు. వారి మేన మామగారు అయిన పెరియ తిరుమలై నంబి “ఇళైయాళ్వార్” అని వారికి నామకరణము చేసి, తాప సంస్కారము నిర్వహించి శ్రీవైష్ణవంలోకి ప్రవేశింపజేశారు.

తమ ప్రారంభ రోజుల్లో, వారు యాధవప్రకాశుల వద్ద వేదాంతం అభ్యసించారు, వారు “భేదాభేదం” సిద్దాంత  ప్రతిపాదకులు (ఒకే సమయంలో బ్రహ్మం/ఆత్మ  విభిన్నమైనవి మరియు ఏకమైనవి కూడా). ఒక ప్రశ్న తలెత్తవచ్చు – వారు వేరే సిద్ధంతపు పండితుల వద్ద ఎందుకు అభ్యాసము చేశారు అని? ఎందుకంటే, వాళ్ళ తత్వశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, వారి లోపాలను బయటపెట్టి, విశిష్ట అధ్వైత సిద్దాంత విధానాన్ని స్థాపించడానికి వారు అలా చేశారని మన పెద్దలు వివరించారు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి పెరియవచ్చాన్ పిళ్లై తమ ఆచార్యులైన నంపిళ్ళైలను పెరియ తిరుమొళి 5.8.7 వ్యాఖ్యానములో కీర్తించిన విధానాన్ని మనము గమనించాలి. వారు “అంతణన్ ఒరువన్” (అద్వితీయ బ్రహ్మణ) అని వివరిస్తూ ఇలా అన్నారు – “ముఱ్పడ ద్వయత్తైక్కేట్టు, ఇతిహాస పురాణంగళైయుం అతిగరిత్తు, పరపక్ష ప్రతిక్షేపత్తుక్కుడలాగ న్యాయమీమాంసైకళుం అతిగరిత్తు, పోతుపోక్కుం అరుళిచెయలిలేయాంపడి పిళ్ళైయైప్పోలే అతిగరిప్పిక్క వల్లవనైయిరే ఒరువన్ ఎన్బతు”, ఎవరైతే పప్రథమంగా ద్వయం అనుసందానము చేసి, తరువాత ఇతర సిద్దాంతముల చర్చలలో నెగ్గడానికి పురాణాలు, ఇతిహాసాలు, న్యాయం, మీమాంసము నేర్చుకుంటారో, ఆళ్వార్ల అరుళిచ్చెయల్ని (దివ్య ప్రబందాలను) వాటి అర్థములను నేర్చుకుంటూ మరియు బోధిస్తూ నంపిళ్ళై వారిలా తమ సమయాన్ని గడుపుతారో, వారిని విశిష్ట పండితుడని చెప్పవచ్చు). దీని నుండి మనం మన సిద్ధాంతాన్ని స్థాపించడానికి పూర్వ పక్షాన్ని (ఇతర తత్వవేత్తల వాదనలు) నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

యాదవప్రకాశుల వద్ద శ్రీ రామానుజుల విధ్యాభ్యాస సమయంలో, వారి మధ్య కొన్ని విభేదాలు తలెత్తుతాయి. తత్వశాస్త్రంలో రామానుజులకి ఉన్న అపారమైన జ్ఞానం, ఇతరులకు వివరించే సామర్థ్యం కారణంగా కూడా వారు ప్రజాదరణ పొందసాగారు, ఈ కారణంగా శ్రీ రామానుజుల ప్రసిద్దిని వారు సహించలేక యాదవ ప్రకాశుల శిష్యులు కాశి యాత్రలో వారిని చంపాలని కుట్ర పన్నారు. కానీ సరైన సమయములో గోవిందులు (భవిష్యత్తులో ఎంబార్ అవుతారు) ఇచ్చిన సూచనతో, శ్రీ రామానుజులు వారి పన్నాగం నుండి తప్పించుకుంటారు. అడవిలో దారి తప్పిన శ్రీ రామానుజులకు సహాయం చేయడానికి బోయవాడి వేషంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ (దేవ పెరుమాళ్) పెరుందేవి తాయర్లు వచ్చి తిరిగి వారిని కాంచీపురానికి చేర్చుతారు.

పంచ సంస్కారము

ఈ సమయంలో, శ్రీ రామానుజులు కాంచీపురంలో దేవ పెరుమాళ్ళ అంతరంగ సేవకుడైన తిరుక్కచ్చి నంబిని కలుసుకుంటారు. పూవిరుందవల్లి గ్రామస్థులైన వారు దేవ పెరుమాళ్ళకి క్రమం తప్పకుండా వింజామర సేవని అందిస్తుండేవారు. వారు యామునాచార్యుల ప్రియ శిష్యులు. దేవ పెరుమాళ్ళకు నంబి పట్ల ఉన్న గొప్ప అనుబంధం కారణగా వారితో నిత్యము సంభాషించేవాడు. శ్రీ రామానుజులు నంబి ఆదేశాన్ని స్వీకరించి, సమీపంలో ఉన్న బావి నుండి ప్రతిరోజూ దేవ పెరుమాళ్ళ కోసం నీరు తీసుకువచ్చే కైంకర్యాన్ని చేయ సాగారు. ఇప్పటికి, శ్రీ రామానుజులకు రక్షకాంబతో వివాహమై కాంచీపురంలో స్థిరపడ్డారు. వారిలో కొన్ని సందేహాలు తలెత్తినప్పుడు  దేవ పెరుమాళ్ళతో స్పష్టం చేయాలనుకొని, ఆ సందేహాలకు (అవి ఏమిటో చెప్పకుండా) సమాధానాలు పెరుమాళ్ళను అడిగి చెప్పమని నంబిని అభ్యర్థిస్తారు. నంబి శ్రీ రామానుజులు స్థితిని పెరుమాళ్ళకి వివరిస్తారు, పెరుమాళ్ళు నంబి ద్వారా శ్రీ రామానుజులకు 6 సూచనలు (ఆరు వార్తలు) అందిస్తారు. అవి:

  • నేను సర్వోన్నతుడిని
  • జీవాత్మ (ఆత్మ) మరియు పరమాత్మ (భగవానుడు) భిన్నమైనవి, ఒకటి కాదు
  • పూర్ణ శరణాగతియే నన్ను పొందే సాధనము
  • అలాంటి శరణాగతి చేసిన వ్యక్తి వారి ఆఖరి క్షణాల్లో నన్ను స్మరించాల్సిన అవసరం లేదు (నేను వారిని స్మరిస్తాను)
  • ఈ జన్మ తరువాత శరణాగతి చేసిన ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు
  • మహా పూర్ణ (పెరియ నంబి) స్వామిని ఆచార్యులుగా స్వీకరించు

ఈ సంఘటన శ్రీ రామానుజుల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది.

తిరుక్కచ్చి నంబి దేవ పెరుమాళ్ళ ఈ ఆరు సూచనలను (వార్తలను) శ్రీ రామనుజులకి వివరించి, వారి మనస్సులో ఉన్న సందేహాలకి సమాధానములు దొరికాయా అని అడుగుతారు. శ్రీ రామనుజులు నంబికి తమ ప్రణామాలు సమర్పించుకొని, దొరికాయని ధృవీకరిస్తారు. పెరుమాళ్ళు మరియు శ్రీరామనుజుల దివ్య మనస్సుల సమకాలీకరణకు నంబి ఆశ్చర్యపోతారు. ఈ వార్తలను విన్న తర్వాత, శ్రీరామనుజులు పెరియ నంబిని కలవడానికి శ్రీరంగానికి బయలుదేరారు.

నాథమునుల మనవడు అయిన అళవందార్ల (యమునాచార్యులు) ప్రధాన శిష్యులు పెరియ నంబి. దీనికి ముందు, సంప్రదాయానికి మొట్టమొదటి ఆచార్యులుగా ఉన్న అళవందార్లు, ఒకానొక సమయంలో కాంచీపురానికి వెళ్ళినపుడు కొంత దూరము నుండి శ్రీ రామరాజులను చూసి గొప్ప బోధకుడు కావాలని ఆశీర్వదిస్తారు. శ్రీ రామరాజులు కూడా, అళవందార్ల గురించి విన్న తరువాత, వారి శిష్యులు కావాలనుకున్నారు. కానీ అళవందార్లని కలుసుకోవాలని వారు శ్రీరంగము కావేరీ నది ఒడ్డుకి చేరే సమయానికి, మూడు నెరవేరని కోరికలతో అళవందార్లు పరమపదానికి చేరుకుంటారు. అవి 1) వ్యాస మరియు పరాశర ఋషుల పట్ల కృతజ్ఞత చూపించడం, 2) నమ్మాళ్వార్లకి కృతజ్ఞతలు, 3) బ్రహ్మ సూత్రానికి భాష్యము వ్రాయడం. మూడు ముడుచుకున్న వేళ్లతో అలవందార్ల దివ్య చరమ తిరుమేనిని చూసినప్పుడు, శ్రీరామరాజులు ఆ కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తారు, వెంటనే ముడుచుకున్న వేళ్లు విప్పుకుంటాయి. ఆ తర్వాత శ్రీరామరాజులు నిరాశగా కాంచీపురానికి తిరిగి వచ్చి తన కైంకర్యాన్ని కొనసాగించ సాగారు. అనంతరం శ్రీరంగంలోని శ్రీవైష్ణవులు పెరియ నంబిని శ్రీ రామరాజులకు సంస్కారము గావించి సంప్రదాయ తదుపరి నాయకుడిగా తీర్చి దిద్దమని వారిని ప్రార్థించారు. పెరియ నంబి, శ్రీ రామరాజులను తన శిష్యుడిగా చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో కాంచీపురానికి బయలుదేరారు.

వారిద్దరూ కాంచీపురానికి దగ్గరగా ఉన్న మధురాంతకం అనే పట్టణంలో కలుసుకుంటారు. శ్రీ రామరాజులు ఏరికాత్త పెరుమాళ్ళ ఆలయానికి చేరుకుని, సపరివార సమేతంగా పెరియ నంబిని చూసి, తన ప్రణామాలను సమర్పించి, తనను శిష్యుడిగా స్వీకరించమని నంబిని అభ్యర్థిస్తారు. అందరూ కలసి కాంచీపురానికి వెళ్లి అక్కడ సంస్కారాలు పూర్తి చేయవచ్చని పెరియ నంబి వారు సూచిస్తారు. కానీ శ్రీ రామనుజులు ఎంతో అస్థిరత ఉన్న ఈ ప్రపంచంలో, తాను ఆళవందార్ల శిష్యుడిగా మారే అవకాశాన్ని కోల్పోయాడని, అలాంటివి మళ్లీ జరగకూడదనుకుంటున్నానని విన్నపిస్తారు. కావున, వారు వెంటనే నంబీని పంచ సంస్కారాన్ని చేయమని పట్టుబట్టగా నంబి సరేనంటారు. ఆ విధంగా శ్రీ రామానుజులు శాస్త్రం నిర్దేశించిన విధంగా సరైన పద్ధతిలో ఆచార్యుల ఆశ్రయం పొందడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించారు. ఆ తర్వాత వారందరూ కాంచీపురానికి చేరుకుంటారు, పెరియ నంబి తమ కుటుంబంతో కలిసి కొంతకాలం అక్కడ ఉండాలని నిర్ణయించుకుంటారు.

కాంచీపురంలో పెరియ నంబిని  తిరుక్కచ్చి నంబి స్వాగతిస్తారు. ఆపై వారు దేవ పెరుమాళ్ళకు  మంగళాశాసనము సమర్పిస్తారు. ఆ తరువాత, శ్రీ రామానుజులు పెరియ నంబి కోసమై తన నివాసంలోని ఒక భాగంలో వారికి ఉండడానికి సౌకర్యం కల్పించారు. పెరియ నంబి తన కుటుంబంతో ఆరు నెలలు అక్కడే ఉంటూ దివ్య ప్రబంధము, రహస్యాలు మొదలైనవి బోధిస్తారు.

సన్యాసాశ్రమ స్వీకారము

ఒకసారి, ఒక శ్రీవైష్ణవుడు శ్రీ రామానుజుల నివాసానికి వెళ్లి తాను ఆకలితో ఉన్నానని చెప్పగా, వారు తమ ధర్మ పత్నితో కొంచము అన్నము పెట్టమనగా, ఆవిడ ఏమీ మిగలలేదని చెప్తుంది. ఆ శ్రీవైష్ణవుడు నిరాశతో వెళ్ళిపోతాడు, శ్రీ రామానుజులు వంటగదిలోకి వెళ్ళి చూడగా ఆహార అవశేషాలు కనిపిస్తాయి. వారికి క్రోధము ముంచుకు వచ్చి ఆ కోపాన్ని తన భార్యపై చూపిస్తారు. గతంలో కూడా, రక్షకాంబ (శ్రీ రామానుజుల ధర్మ పత్ని) తిరుక్కచ్చి నంబి పట్ల అనుచితంగా వ్యవహరిస్తుంది. శ్రీ రామానుజులు తిరుక్కచ్చి నంబి యొక్క శేష ప్రసాదము పొందాలనే ఉద్దేశ్యముతో వారిని భోజనానికి తన నివాసానికి ఆహ్వానిస్తారు, తిరుక్కచ్చి నంబి వారి గొప్పతనాన్ని అర్థము చేసుకోకుండా,  శ్రీ రామానుజుల అంతరార్థాన్ని గమనించకుండా, వారు ప్రసాదం స్వీకరించిన తరువాత ఆ శేషాన్ని విసిరివేసి ఆ ప్రదేశాన్ని కడిగి శుద్దిచేస్తుంది. చివరికి, ఒకసారి బావిలో నుండి నీళ్ళు తోడుకునే సమయంలో రక్షకంబకి మరియు పెరియ నంబుల ధర్మ పత్నికి మధ్య గొడవ జరుగుతుంది. పెరియ నంబి తీవ్ర మనస్తాపానికి గురై, శ్రీ రామానుజులకు చెప్పకుండా తన కుటుంబంతో  శ్రీరంగానికి తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత శ్రీ రామనుజులు జరిగిన విషయము గురించి తెలుసుకుని తీవ్రంగా బాధపడతారు.

వేంటనే భగవానుడి పట్ల పూర్తి నిబద్ధతతో తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని సన్యాస ఆశ్రమం స్వీకరించాలని నిర్ణయించుకుంటారు. వారు కాంచీపురం దేవ పెరుమాళ్ళ ఆలయంలోని అనంత సరస్సు పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, దేవ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి, అతడిని ఆచార్యునిగా స్వీకరించి, సన్యాసులకు అనుగుణమైన త్రిదండము, కాషాయం మొదలైనవి ప్రసాదించమని అభ్యర్థించారు.  దేవ పెరుమాళ్ళు  శ్రీ రామానుజుల కోరికను మన్నించి, సన్యాస ఆశ్రమాన్ని ప్రసాదించి, వారికి  “రామానుజ ముని” అని నామకరణము చేసి, వారు ఉండటానికి ఒక మఠాన్ని కూడా ఇస్తారు. ఇది విన్న ముదలియాండాన్ మరియు కూరత్తాళ్వాన్లు వెంటనే కాంచీపురం చేరుకున్నారు, శ్రీ రామానుజుల నుండి పంచ సంస్కారాన్ని స్వీకరించి, నిత్యము వారికి సేవ చేయడం ప్రారంభించారు. యాదవప్రకాశులు కూడా, వారి తల్లి సలహా మేరకు, శ్రీ రామానుజుల శిష్యులు అవుతారు. ఆ విధంగా శ్రీ రామానుజులు రామానుజ మునిగా మారి సన్యాస జీవితాన్ని అద్భుతంగా ఆచరించడం ప్రారంభించారు.

శ్రీ రామానుజులు యతిరాజ (సన్యాసులకు నాయకుడు) గా ప్రసిద్ధి చెంది, యాదవ ప్రకాశులని తమ శిష్యుడిగా స్వీకరిస్తారు, వారిచే సన్యాస ఆశ్రమ స్వీకారము చేయించి గోవింద జీయర్ అని నామకరణము చేస్తారు. అతను శ్రీవైష్ణవ సన్యాసుల నిత్య ఆచరణలను వివరించే వ్యాఖ్యనము  “యతి ధర్మ సముచ్యం” అనే  వివరణాత్మక గ్రంథాన్ని వారు రచించేలా చేశారు. ఇది యాదవప్రకాశులను స్వీకరించిన శ్రీ రామనుజుల ఔన్నత్య భావాన్ని చూపుతుంది (ఇంతకు ముందు వారిని చంపడానికి ప్రయత్నించారు). వారికి విలువైన కైంకర్యాలను అప్పగిస్తారు.

కాంచీపురంలో ఉండి, వారు విలువైన శాస్త్ర భాగాలను ముదలియాండాన్ మరియు కూరత్తాళ్వాన్లకి బోధిస్తారు.

శ్రీ రంగ ప్రవేశము

శ్రీ రామానుజులను  శ్రీరంగంలోకి తీసుకువచ్చి సంప్రదాయాన్ని గొప్ప శిఖరాలకు ఎదిగించాలనే కోరికతో శ్రీరంగనాథుడు శ్రీ వరదరాజులని శ్రీ రామానుజులను పంపమని  అభ్యర్థనను పంపుతారు. శ్రీరంగనాథుని అభ్యర్ధనను శ్రీ వరదరాజ పెరుమాళ్ళు పట్టించుకోరు. ఒక ప్యూహ రూపంగా, శ్రీరంగనాథుడు తిరువరంగ పెరుమాళ్ అరాయర్ని శ్రీ వరదరాజుల ముందు దివ్య కీర్తనలను పాడమని, పెరుమాళ్ళని మెప్పించి  శ్రీరామానుజులను బహుమానంగా పొందమని కాంచీపురానికి పంపుతారు. అరయార్ కాంచీపురానికి చేరుకుని, తిరుక్కచ్చి నంబి ద్వారా ఎంబెరుమానుడిని సమీపించి, శ్రీ వరదరాజుల ముందు పాడతారు, అరైయర్ పాటకి శ్రీ వరదరాజుల మైమరచిపోతాడు. “నీకు ఏమి కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను” అని శ్రీ వరదరాజు చెప్పిన వెంటనే, అరయార్ స్వామి తనతో పాటు శ్రీరామానుజులను  శ్రీరంగానికి పంపమని కోరతారు. ఎంపెరుమాన్ శ్రీరామానుజుల సహవాసాన్ని కోల్పోవలసి వస్తున్నందుకు బాధపడతారు – కానీ మాట ఇచ్చినందున, అరైయర్‌తో పాటు యతిరాజుని పంపుతాడు.

శ్రీరంగం చేరుకున్న తరువాత, అరైయర్ మరియు యతిరాజులకు గొప్ప స్వాగతం లభిస్తుంది. వారిరువురూ పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాథుడు) సన్నిధికి చేరుకోగా, పెరియ పెరుమాళ్ళు వారిని ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు. శ్రీరంగనాథుడు యతిరాజులకి “ఉడయవర్” (ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తుకి యజమాని) అనే బిరుదును ప్రదానం చేస్తాడు, వారికి ఒక మఠాన్ని కేటాయించి, ఆలయ కార్యకలాపాలను పూర్తిగా సంస్కరించమని ఆదేశిస్తాడు. శ్రీ రామానుజులతో  సంబంధము ఉన్న వారందరికీ ముక్తిని ప్రసాదిస్తానని అభయమిస్తారు. పెరియ నంబికి ఎంతో రుణపడి ఉన్నానని భావిస్తూ ఉడయవర్లు వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటారు. పెరియ నంబులు కూడా సంప్రదాయానికి మంచి రోజులు రాబోతున్నాయని చూచి ఎంతో ఆనందిస్తారు.  ఉదయవర్లు శ్రీరంగంలో తన సమయాన్ని గడపుతూ గొప్ప నైపుణ్యంతో ఆలయ నిర్వహణలను సంస్కరించడం ప్రారంభించారు.

అలా శ్రీ రామానుజులు శ్రీరంగంలో ఉండి ఆలయ విధులను సమర్ధవంతంగా నిర్వహించారు. గోవింద (యదవప్రకాశులతో పాటు తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు తన ప్రాణాలను కాపాడిన వారి పిన్నమ్మ కుమారుడు) శివ భక్తుడిగా మారి కాళహస్తీలో ఉంటున్నవారిని  శ్రీ రామానుజులు  తిరిగి సంప్రదాయములోకి తీసుకురావాలని ఆశించారు. పెరియ తిరుమలై నంబిని కాళహస్తికి వెళ్ళి శివభక్తుడిగా మారిన గోవిందుడిని సంస్కరించమని కోరతారు. వారు ఆళవందార్ల స్తోత్ర రత్నం మరియు దివ్య ప్రబంధ పాశురాల ఆధారంగా శ్రీమాన్నారాయణుడి  ఆధిపత్యాన్ని వివరిస్తారు. ఆ సూచనలను అలా కొన్ని సార్లు విని విని వారి మనస్సు మారి పరిశుద్దులై  శైవ సంబంధాన్ని విడిచిపెట్టి, ఒక్కసారిగా పెరియ తిరుమలై నంబి పాద పద్మాల యందు పడిపోతారు. నంబి వారిని ఎంతో సంతోషంతో స్వీకరించి, అతనికి పంచ సంస్కారాన్ని నిర్వహించి వెంట తీసుకొని వెళతారు. గోవిందులు నంబితో పాటు  తిరుమలలో ఉండి, అవసరమైన అన్ని పరమార్థాలను నేర్చుకుంటూ, పూర్తిగా నంబిని సేవిస్తారు. చివరికి గోవిందులు తిరిగి శ్రీరంగంలోకి వచ్చి శ్రీ రామానుజులతో శాశ్వతంగా ఉండిపోతారు.

వారి ఆచార్యులు

శ్రీ రామానుజులు పెరియ నంబుల తిరుమాలిగై (నివాసం) కి వెళ్లి, ముఖ్యమైన విషయాలన్నీ తనకు భోదించమని అభ్యర్థించారు. నంబి సంతోషించి, శ్రీ రామానుజులకు అత్యంత దివ్యమైన ద్వయ మహా మంత్రం యొక్క దివ్య అర్థాలను బోధిస్తారు. వారు శ్రీ రామానుజులను “ఈ అంశంలో తెలుకోవలసింది ఇంకా చాలా ఉంది; ఆళవందార్ల ప్రియ శిష్యుడైన తిరుక్కోష్ఠియూర్ నంబి వద్దకు వెళ్లి వారి వాద్ద అభ్యసించండి” అని ఆదేశిస్తారు.

శ్రీ రామానుజులు వెంటనే దివ్య పట్టణమైన తిరుక్కోష్ఠియూర్ కి బయలుదేరతారు. పట్టణంలోకి ప్రవేశించిన తరువాత, ఆ పట్టణ వాసులకి తిరుక్కోష్ఠియూర్ నంబి తిరుమాలిగ ఎక్కడ ఉందని అడుగుతారు. వారు చూపించిన దిశలో ప్రతి అడుగుకి సాష్ఠాంగ ప్రణామములు సమర్పించుకుంటూ వెళ్ళి వారి తిరుమాలిగకి చేరుకుంటారు, అప్పుడు నంబి మహిమను తెలుసుకున్న ఆ పట్టణ వాసులు ఆశ్చర్యపోతారు. శ్రీ రామానుజులు నంబి పాద పద్మాల యందు పడి, రహస్య అర్థాలను బోధించమని ప్రార్థించారు. కానీ నంబి అతనికి అర్థాలు నేర్పాలని పెద్దగా ఆసక్తి చూపరు, శ్రీ రామానుజులు నిరాశతో శ్రీరంగానికి తిరిగి వస్తారు.

శ్రీ రామానుజులు శ్రీరంగానికి తిరిగి వచ్చిన తరువాత, వారు తిరుక్కోష్ఠియూర్ నంబి నుండి రహస్య అర్థాలను నేర్చుకోవాలని ఆరాటపడుతుండేవారు. నంబి ఒకసారి శ్రీరంగానికి వచ్చినపుడు, తిరిగి వస్తుండగా, శ్రీరామనుజులకి రహస్య అర్థాలను బోధించమని నంపెరుమాళ్ళు నంబిని ఆదేశిస్తారు. శాస్త్రం ప్రకారం, అంకితమైన సేవ చేయని వారికి ఈ రహస్య అర్థాలను నేర్పరాదని నంబి నంపెరుమాళ్ళతో పలుకగా,  మంచి శిష్యుడిగా ఉండే అన్ని అర్హతలు శ్రీరామనుజులలో ఉన్నందున, అతనికి నేర్పడంలో తప్పేమీ లేదని నంపెరుమాళ్ళు అంటారు. అప్పుడు నంబి శ్రీ రామానుజులని తిరుక్కోష్ఠియూర్ వచ్చి అర్థాలను తెలుసుకోమని ఆదేశిస్తారు. శ్రీ రామానుజులు తిరుక్కోష్ఠియూర్కి వెళ్ళగా, తరువాత మరో సారి రమ్మని నంబి శ్రీ రామానుజులను తిరిగి పంపిచేస్తారు. అలా 18 సార్లు జరుగుతుంది. పరిస్థితిని తట్టుకోలేక, శ్రీ రామానుజులు తిరుక్కోష్ఠియూర్ నంబి యొక్క శిష్యుని ద్వారా తాను ఆ అర్థాలను తెలుకోవాలని ఆరాటపడుతున్నట్లు వారికి తెలియజేస్తాడు. చివరికి నంబి ఆ అర్థాలను బోధించడానికి అంగీకరించగా, శ్రీ రామానుజులు గితా చరమ స్లోకము యొక్క రహస్య అర్థాలను వారి నుండి తెలుసుకుంటారు. అర్హత లేని వారికి ఈ అర్థాలను చెప్ప వద్దని నంబి శ్రీ రామానుజులను ఆదేశిస్తారు. కానీ శ్రీ రామానుజులు ఈ అర్థాలను తెలుసుకోవాలని కోరుకునే వారికి అర్థాలను వెల్లడి చేస్తారు. ఇది విన్న నంబి క్రోధితులై శ్రీ రామానుజులను రమ్మని కబురు పంపుతారు. శ్రీ రామానుజులు వచ్చి నంబికి ఇలా వివరిస్తారు – రహస్య అర్థాలు తెలుసుకున్నవారు ఆ యదార్థ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఉద్దరింపబడతారు అని వివరిస్తారు. శ్రీ రామానుజుల ఔన్నత్య స్వభావాన్ని అర్థం చేసుకొని, నంబి వారిని “ఎంపెరుమానార్” (ఎంపెరుమానుడు శ్రీమన్నారాయణుడి కంటే గొప్పవాడు) అని ప్రశంసిస్తారు. ఆ తరువాత నుండి మన సంప్రదాయము కూడా “ఎంపెరుమానార్ దరిశనం” (శ్రీ రామానుజ దర్శనం) అని పిలువబడింది. ఆపై కూరత్తాళ్వాన్లు మరియు ముదలియాండాన్ల అభ్యర్థన మేరకు ఎంపెరుమానార్లు వారికి  రహస్య అర్థాలను బోధిస్తారు.

తదనంతరం, తిరుక్కోష్ఠియూర్ నంబి  ఎంపెరుమానార్లకి తిరువాయ్మొళి యొక్క అర్థాలను బోధించమని తిరుమలై ఆణ్డాన్లని ఆదేశించారు. ఎంపెరుమానార్లు  ఉత్సాహంగా ఆణ్డాన్ వారి  నుండి అవసరమైన అన్ని అర్థాలను నేర్చుకోవడం ప్రారంభించారు. కొన్ని సందర్భాలలో, ఆణ్డాన్ మరియు ఎంపెరుమానార్ల మధ్య  కొన్ని పాశురార్థాలపై భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. తిరువాయ్మొళి 2.3.3 వ “అఱియాక్ కాలత్తుల్లే” పాశురము నేర్చుకుంటున్నప్పుడు, ఎంపెరుమానార్లు  భిన్న అర్థాలను ఇవ్వడంతో ఆణ్డాన్ వారు బాధపడి వారి ఉపన్యాసాన్ని ఆపివేస్తారు. ఈ జరిగిన సంఘటన గురించి విన్న తిరుక్కోష్ఠియూర్ నంబి వెంటనే శ్రీరంగానికి బయలుదేరతారు. వారు ఎంపెరుమానార్ల గొప్పతనాన్ని ఆణ్డాన్ వారికి వివరించి, ఉపన్యాసాలను తిరిగి కొనసాగించమని ఆదేశిస్తారు. ఆండన్ వారు అంగీకరించి ఎంపెరుమానార్లకి తమ బొధనలు పునః ప్రారంభిస్తారు. తరువాత మరొక చిక్కు ఏర్పడి “ఆళవందార్లు అయితే  ఇలా వివరించరు” అని ఎంపెరుమానార్లు  అంటారు. “ఆళవందార్లను ఎన్నడూ కలవని నీకు ఎలా తెలుసు?” అని ఆండన్ వారు ప్రశ్నించగా, ఎంపెరుమానార్లు  “నేను ఆళవందార్లకి ఏకలవ్య శిష్యుడిని” అని బదులిస్తారు. అది విన్న ఆణ్డాన్ వారు, తిరుక్కోష్టియుర్ నంబి నోట ఎంపెరుమానార్ల వర్ణనని విని, అది స్వయంగా ఎంపెరుమానార్ల  నుండే విని గ్రహిస్తారు. ఎంపెరుమానార్లు ఒక విశేష అవతార పురుషులని వారు గ్రహించి, ఆళవందార్ల నుండి తాను వినలేకపోయిన అర్థాలను వినాలని ఆశిస్తూ ఎంపెరుమానార్లతో అతి గౌరవంగా వ్యవహరిస్తారు.

తిరువాయ్మొళి ఉపన్యాసాము పూర్తి అయిన తర్వాత, వారు పెరియ నంబి వద్దకి తిరిగి వెళతారు.  పెరియ నంబి ఎంపెరుమానార్లని వెళ్లి తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్లని సేవించి వారి నుండి కొన్ని రహస్య అర్థాలు నేర్చుకోవాలని సూచిస్తారు. ఎంపెరుమానార్లు  అరైయర్ల వద్దకి వెళ్లి, వారికి పాలు సిద్ధం చేయడం, పసుపు నూరడం వంటి సేవలు 6 నెలల పాటు నిష్ఠగా చేస్తారు. ఒకసారి ఎంపెరుమానార్లు నూరి సమర్పించిన పసుపు అరయార్ స్వామికి అంతగా నచ్చదు, వారు తమ  అసంతృప్తిని వ్యక్త పరచగా వెంటనే ఎంపెరుమానార్లు మరో పసుపు ముద్దని సిద్ధం చేసి వారికి సమర్పిస్తారు. అరైయర్ స్వామి ఎంతో సంతృప్తి పడతారు. అరయార్ స్వామి ఆనందంతో, ఆచార్యులపై సంపూర్ణంగా ఆధారపడాలనే “చరమోపాయం” (అత్యున్నత సాధనం) యొక్క రహస్య సూత్రాన్ని వారికి బోధిస్తారు.

ఎంపెరుమానార్లు  అనేక మంది ఆచార్యుల నుండి ఎందుకు అభ్యాసము చేయవలసి వచ్చిందని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఒక రాజు యువరాజుకి శిక్షణ ఇవ్వమని అనేక మంత్రులను నియమించినట్లే, ఆళవందార్లు తమ అనేక శిష్యులకు తన జ్ఞాన సంపదనిచ్చి సరైన సమయంలో ఆ జ్ఞానాన్ని ఎంపెరుమానార్లకు అందించమని ఆదేశించారు. ఆళవందార్ల ఈ శిష్యులందరూ శ్రీరామానుజుల పట్ల గొప్ప అనుబంధం మరియు గౌరవాన్ని కలిగి ఉండేవారు, ఎందుకంటే వారు ఆళవందార్లకి చాలా ప్రియమైనవారు కనుక. ఈ కారణంగా ఎంపెరుమానార్ల కంటే మునుపటి ఆచార్యులు ఎంపెరుమానార్ల ఆచార్యులుగా గొప్ప ఖ్యాతిని పొందారు, ఇక ఎంపెరుమానార్ల  శిష్యుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వారితో ఉన్న అనుబంధం కారణంగా వారి శిష్యులు గొప్ప కీర్తిని సాధించారు. ఎలాగైతే ఒక హారము మధ్యలో ఉన్న పతకము అటు ఇటు రెండు వైపులా అందాన్ని ఇస్తుందో అలాగే, ఎంపెరుమానార్లు కూడా వారి ముందు మరియు తరువాత ఆచార్యులకు ఎంతో కీర్తిని జోడించి ఇచ్చారు..

గద్య త్రయ పఠనము

తరువాత, అద్భుతమైన పంగుని ఉత్తరము రోజున శ్రీరంగంలో శ్రీరంగనాయకి రంగనాథుల ఎదుట ఎంపెరుమానార్లు గద్య త్రయాన్ని సేవించారు. వారు మన ఇంట్లో భగవానుడిని ఆరాధించే పద్ధతిని వివరిస్తూ నిత్య గ్రంధాన్ని కూడా సంకలనం చేశారు.

ఈ సమయంలో, ఎంపెరుమానార్లు శ్రీరంగంలో భిక్షాటన చేసి ఆ భిక్షని స్వీకరిచేవారు. శ్రీరంగ కోవెలలో వీరు చేసిన సంస్కరణలకి  ఇష్టపడని కొంతమంది, ఒక మహిళ సహాయముతో వారికి విషముతో కూడిన అన్నాన్ని భిక్షగా పెట్టే ఏర్పాటు చేశారు. ఆమె ఇష్టపడకున్నా ఆదేశాన్ని అనుసరించి, బాధతో ఎంపెరుమానార్లకి భిక్షని ఇచ్చింది. ఎంపెరుమానార్లు  ఏదో తప్పు జరుతుందని గమనించి, ఆ ఆహారాన్ని కావేరీ నదికి పడవేసి ఉపవాసము ఉంటారు. ఈ సంఘటన గురించి విన్న తిరుక్కోష్ఠియూర్ నంబి వెంటనే శ్రీరంగానికి చేరుకుంటారు. మండే ఎండలో ఎంపెరుమానార్లు వారికి స్వాగతం పలికేందుకు  కావేరీ ఒడ్డుకు వెళతారు. నంబిని చూసి,  తమ ప్రణామాలను ఆ మండే ఇసుకపైన అర్పించుకుంటారు, నంబి తనను లేవమని ఆజ్ఞాపిస్తారని అలాగే వేడి ఇసుకపైన వేచి ఉంటారు. నంబి ఒక క్షణం ఆశ్చర్యపోతుండగా, ఎంపెరుమానార్ల శిష్యుడు కిడంబి ఆచ్చాన్ నంబితో “ఇంత గొప్ప ఆచార్యుడిని ఇంత వేడిలో ఎలా బాధపడనివ్వగలరు మీరు?” అని అంటూ ఎంపెరుమానార్లని పైకి లేపుతారు. నంబి ఆచ్చాన్తో ఇలా అన్నారు, “నన్ను అగౌరవపరిచినప్పటికీ నీవు ఎంపెరుమానార్లని కంటికి రెప్పలా చూసుకుంటావని నేను గమనించాను. కాబట్టి, ఎంపెరుమానార్లకై  ప్రతిరోజూ నీవు ప్రసాదాన్ని సిద్ధం చేయాలి” అని ఆదేశిస్తారు. ఈ విధంగా, ప్రతి ఒక్కరూ ఎంపెరుమానార్ల పట్ల తమ శ్రద్దా భక్తులను చూపించారు.

యజ్ఞ మూర్తి ఓటమి

ఆ రోజుల్లో యజ్ఞ మూర్తి అనే ఒక మాయావాద పండితుడు అనేక విజ్ఞానులను చర్చలలో ఓడించి గొప్ప ప్రశంసలు అందుకుంటూ, సన్యాసిగా తమ శిష్య సంపదతో వారణాసిలో ఉంటుండేవారు. వారు శ్రీ రామానుజుల గురించి విని శ్రీరంగానికి చేరుకొని, శ్రీ రామానుజులను చర్చకి ఆహ్వానిస్తారు. చర్చకు శ్రీ రామానుజులు అంగీకరిస్తారు. యజ్ఞ  మూర్తి “నేను చర్చలో ఓడిపోతే, నీ పాదుకలను నా శిరస్సుపై మోసి, మీ పేరుతో పాటు మీ తత్వాన్ని స్వీకరిస్తాను”, ఉడయవర్లు  “నేను ఓడిపోతే ఈ సాహిత్యాన్ని మానేస్తాను” అని ఇరువులు చర్చకు ముందు ఒప్పందము ఏర్పరచుకుంటారు. ఇద్దరి మధ్య 17 రోజుల పాటు తీవ్ర చర్చ జరిగింది. 17 వ రోజున, యజ్ఞ  మూర్తులు గెలవడం ప్రారంభించి, ఆ రోజు చర్చ సమాపనము చేసుకొని గొప్ప గర్వంతో వెళ్లిపోతారు. శ్రీ రామానుజులు నిరాశతో వారి పేరరుళాళ పెరుమాళ్ళతో (వారి మఠం తిరువారాధన పెరుమాళ్) ఇలా మొరపెట్టుకున్నారు: “ఆళ్వార్ల నుండి ఆళవందార్ల వరకు పుష్కలంగా పోషించబడిన ఈ గొప్ప సంప్రదాయం నా కారణంగా నేల మట్టమవబోతుంది; ఒక మాయావాది చేత నాశనం అవుతుంది; ఇదే నీ సంకల్పమైతే, అలాగే కానివ్వు” అని మననము చేసుకుంటూ ప్రసాదం కూడా తినకుండా నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రిలో పేరరుళాళ పెరుమాళ్ళు కలలో కనిపించి, ఆళవందార్ల రచనలను ప్రయోగించి యజ్ఞ  మూర్తిపై విజయం సాధించమని ఆదేశిస్తారు.

మర్నాడు మేల్కొని శ్రీ రామానుజులు ఎంతో ఉత్తేజముతో తమ నిత్య అనుష్ఠానములు గావించుకొని తమ మఠ పెరుమాళ్ళ నుండి సెలవు తీసుకుంటారు. వారి గంభీర రాకను చూసి, యజ్ఞ  మూర్తులు గొప్ప జ్ఞానులు కనుక, ఈ విషయంలో ఏదో దివ్య జోక్యము ఉందని గ్రహించి, ఒక్కసారిగా శ్రీ రామానుజుల దివ్య పాదాల వద్ద పడి “నా ఓటమిని నేను స్వీకరిస్తున్నాను” అని ప్రకటిస్తారు. ఆశ్చర్యపోతూ, శ్రీ రామానుజులు “మీరు ఇంకా చర్చించకూడదనుకుంటున్నారా” అని అడగగా,  “పెరియ పెరుమాళ్ళు మీతో సంభాషించినందున, నాకు మీరు వేరు పెరియ పెరుమాళ్ళు వేరు కాదు అని అర్థమైంది. మీ సమక్షంలో నేను ఇక ఎలా నోరు తెరవగలను. అని యజ్ఞ మూర్తులు తెలియజేస్తారు. అయినా గానీ శ్రీ రామానుజులు బ్రహ్మం యొక్క గొప్ప గుణాలను వివరించి మాయావాద సూత్రాలను నాశనం చేస్తారు. యజ్ఞ మూర్తులు సమ్మతించి తన ఏకదండాన్ని (మాయావాద సన్యాసులు ధరించే ఏక దండం) విరిచి వేసి, తనకి త్రిదండ సన్యాసం (శ్రీవైష్ణవ సంప్రదాయ సన్యాసం) ప్రసాదించమని శ్రీ రామానుజులని అభ్యర్థించారు. పేరరుళాళ పెరుమాళ్ళ దివ్య జోక్యానికి జ్ఞాపకార్థముగా, తన నామాన్ని స్వీకరిస్తానని యజ్ఞ మూర్తుల  ప్రతిజ్ఞని నెరవేర్చడానికి, శ్రీ రామానుజులు వారికి  “అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్” అన్న నామాన్ని ప్రసాదిస్తారు. శ్రీ రామానుజులు స్వయంగా వారికి దివ్య ప్రబంధముల నిగూఢ అర్థాలను బోధిస్తారు. అరుళాళ పెరుమాళ్ ఆ తర్వాత ఎంపెరుమానార్లతోనే ఉంటూ తమ అంకితభావాన్ని నిరూపించుకున్నారు.

తిరుమల యాత్ర మరియు కైంకర్యాలు

ఉడయవర్లు శ్రీరంగంలో మహా అద్భుత రీతిలో ఆళ్వాన్, ఆండన్, అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు మొదలైనవారికి విద్యా బోధనలు కొనసాగిస్తున్నారు. అనేక మంది పండితులు ఉడయవర్ల మహిమల గురించి విని వారి ఆశ్రయం పొందాలని శ్రీరంగానికి చేరుకుంటారు. అనంతాళ్వాన్, ఎచ్చాణ్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి ఉడయవర్లను తమ ఆచార్యులుగా స్వీకరించడానికి వచ్చినప్పుడు, వాళ్ళని  అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ల  శిష్యత్వం స్వీకరించమని వారు నిర్దేశిస్తారు. వాళ్ళు సంతోషంగా వారిని ఆచార్యులుగా స్వీకరిస్తారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు వారిని ఎంపెరుమానార్ల పాద పద్మాలపైనే  పూర్తిగా ఆధారపడి ఉండాలని వారికి సూచిస్తారు.

తరువాత, ఉడయవర్లు తిరువాయ్మొళి అర్థాలను బోధించారు. వారు “ఒళివిల్ కాలం” దశకాన్ని వివరించడం మొదలుపెట్టినప్పుడు, “తిరుమల తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక తోటను ఏర్పాటు చేసి, ప్రతిరోజూ తిరువేంకటముడయానుడికి పూల దండలు తయారు చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా” అని అడిగారు. అనంతాళ్వాన్లు ఒక్కసారిగా పైకిలేచి ఈ కైంకర్యాన్ని నేను చేస్తాను అని స్వీకరిస్తారు. ఎంపెరుమానార్లు వారిని ఈ కైంకర్యాన్ని చేయమని ఆశీర్వదిస్తారు. అనంతాళ్వాన్లు  తిరుమలకు వెళ్ళి, ఒక కొలను మరియు తోటని నిర్మించి, ఆ తోటకి “ఇరామానుశ” అని పేరు పెట్టి తిరువేంకటముడయానుడికి సేవ చేయడం ప్రారంభిస్తారు.

ఉడయవర్లు కూడా తీర్థయాత్రకు వెళ్లాలని ఆశిస్తూ, నంపెరుమాళ్ళ అనుమతిని కోరతారు. అనుమతి పొందిన తరువాత, తిరుక్కోవళూర్ మరియు కాంచీపురంలో మంగళాశాసనాలు సమర్పించుకొని ఆ తరువాత తిరుమలకి బయలుదేరుతారు.

ఉడయవర్లు తమ శిష్యులతో కలిసి తిరుమల వైపు ప్రయాణిస్తుండగా మధ్యలో వాళ్ళు దారి తప్పుతారు. వారు దగ్గర్లో ఒక రైతును చూసి అతడిని దారి అడుగగా, ఆ రైతు మార్గాన్ని స్పష్టంగా వివరించడంతో, ఉడయవర్లు ఆ రైతుని అమానవుడిగా (శ్రీవైకుంఠం మార్గంలో మనకి దారిచూపించి నడిపించే వాడు) భావించి, ఎంతో కృతజ్ఞతతో సాష్ఠాంగ ప్రణామాలు అర్పించుకుంటారు. చివరికి వారు తిరుపతి కొండ వద్దకి చేరుకుని క్రింద ఆళ్వార్లను సేవిస్తారు.  వారు కొంతకాలం తిరుపతిలోనే ఉండి, అక్కడి రాజుని తన శిష్యుడిగా చేర్చుకుంటారు. తమ అనేక శిష్యులను అక్కడే స్థిరపరుస్తారు. ఈ వార్త విన్న అనంతాళ్వాన్లు మరియు అనేకమంది వచ్చి ఉడయవర్లని స్వాగతించి, తిరువేంకటముడయానుడికి మంగళాశాసనం చేయడానికి కొండపైకి రమ్మని ప్రార్థిస్తారు. అతి పవిత్రమైన ఆ కొండపైకి ఆళ్వార్లు కూడా అడుపెట్టలేదు, నేనెలా కాలు పెట్టగలను అని నిరాకరిస్తారు. కానీ శిష్యులు బ్రతిమాలగా, కొండ క్రింద స్నానమాచరించి తమను తాము శుద్ధి చేసుకొని,  పరమపదంలో ఎంపెరుమానుడి దివ్య  సింహాసనాన్ని భక్తితో అధిరోహిస్తున్నంత వినయముతో తిరుమల కొండపైకి ఎక్కడం ప్రారంభిస్తారు.

రాగానే, తిరుమల నంబి వారు ఆ తిరుమల వేంకటనాధుని తరపున నుండి స్వాగతం పలుకుతారు. ఉడయవర్లకి తమ ఆచార్యులు అయిన తిరుమలై నంబి వారు స్వాగతం పలకడం చూసి ఇబ్బందికరముగా అనిపించి, “నన్ను ఆహ్వానించడానికి మీ అంతటి వారు కాని, మామూలు మనిషి ఎవరూ కనిపించలేదా?” అని ప్రశ్నించగా, నంబి వినయంగా సమాధానమిస్తూ “నేను చుట్టూ వెతికాను కానీ నాకు నాకంటే తక్కువైన వ్యక్తి ఎవరూ కనిపించలేదు” అని అంటారు. అది విన్న ఉడయవర్లు మరియు వారి శిష్యులు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత, జీయర్లు, ఏకాంగులు, ఆలయ కైంకర్యపరర్లు అందరూ వచ్చి ఉడయవర్లని స్వాగతిస్తారు. ఉడయవర్లు ఆలయం చుట్టూ ప్రదక్షణగా వెళ్ళి, స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి, ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలను ధరించి, వరాహ పెరుమాళ్ళని సేవించుకొని, ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడ విశ్వక్సేనులను సేవించి, ఆ తిరువేంకటనాధునికి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. తిరుమల నిత్యసూరులకు నివాసము కాబట్టి రాత్రికి అక్కడ ఉండలేమని, వారు తిరుపతికి (కొండ క్రిందకి) తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ నంబితో పాటు అందరూ వారిని 3 రోజులు అక్కడే ఉండమని ప్రార్థించి ఒప్పిస్తారు. ఉడయవర్లు ఎటువంటి ప్రసాదం తీసుకోకుండా ఆ తిరువేంకటనాధుని దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించుచూ అక్కడే 3 రోజులు ఉండిపోతారు. ఆ తరువాత, ఆ తిరువేంకటనాధుని వద్ద సెలవు తీసుకుంటానని అనుమతి కోరగా, ఆ సమయంలో ఆ తిరువేంకటనాధుడు ఉడయవర్లను నిత్య విభూతి మరియు లీలా విభూతి రెండింటికి స్వామిగా ప్రకటించి వారికి వీడ్కోలు పలుకుతారు.

వారు తిరుమలకి వీడ్కోలు పలికి, క్రింద తిరుపతిలో ఒక సంవత్సరం పాటు ఉంటారు. ఈ సమయంలో వారు తిరుమలై నంబి నుండి శ్రీ రామాయణాన్ని, వాటి నిగూఢ అర్థాలను నేర్చుకుంటారు. ఉపన్యాసాలు ముగిసిన పిదప, వారు శ్రీరంగానికి తిరిగి వేళ్ళడానికి నంబి నుండి అనుమతి కోరుతారు. నంబి ఉడయవర్లకి బహుమతి ఇవ్వాలని అనుకున్నప్పుడు, సంప్రదాయ స్థాపించే ప్రయత్నాలలో తనకి సహాయంగా గోవింద పెరుమాళ్ళని (తిరుమలై నంబి ప్రియ శిష్యుడు) తనతో పాటు పంపించమని ఉడయవర్లు ప్రార్థిస్తారు. నంబీ సంతోషంగా ఉడయవర్లతో  గోవింద పెరుమాళ్ళని పంపుతారు. ఉడయవర్లు  శ్రీరంగానికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు.

ఉడయవర్లు  గోవింద పెరుమాళ్ళతో గడికాచలం (షోలింగూర్) చేరుకుని అక్కరక్కని  ఎంపెరుమాన్లకి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. తరువాత తిరుప్పుట్కుళి చేరుకుని జటాయు మహారాజుకి, మరగాతవల్లి తాయర్లని, విజయరాఘవ ఎంపెరుమానుడికి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. ఆపై వారు కంచి చుట్టూ ఉన్న వివిధ దివ్య దేశాలను  దర్శించుకొని, తిరుక్కచ్చి నంబి వద్దకి చేరుకుంటారు. ఈ సమయంలో, గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్యులైన పెరియ తిరుమలై నంబి నుండి దూరమైన బాధ కారణంగా నిర్జీవముగా ఉంటారు.  అతని దుఃఖాన్ని అర్థం చేసుకున్న ఉడయవర్లు, గోవింద పెరుమాళ్ళని వెళ్లి  తమ ఆచార్యుల దర్శనము చేసుకోమని కొందరు శ్రీవైష్ణవులను తోడుగా పంపుతారు. వారు కంచిలోనే ఉండి, తిరుక్కచ్చి నంబితో పాటు దేవ పెరుమాళ్ళని సేవించుకుంటారు. గోవింద పెరుమాళ్ళు తిరుమలై నంబి నివాసానికి చేరుకుని తలుపులు మూసి ఉన్నందున ద్వారం వద్దనే వేచి ఉంటారు. ఆ ఊరి వాసులు గోవింద పెరుమాళ్ళ రాక గురించి తిరుమల నంబికి సమాచారం అందించినప్పుడు, వారు తలుపు తెరవడానికి నిరాకరించి,  ఉడయవర్ల వద్దకి తిరిగి వెళ్లి వారినే ఏకైక శరణుగా భావించమని ఆదేశిస్తారు. గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్యుల దివ్య సంకల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఉడయవర్ల వద్దకి తిరిగి చేరుకుంటారు.  గోవింద పెరుమాళ్ళ వెంట తోడుగా వెళ్లిన శ్రీవైష్ణవులు ఉడయవర్లకి జరిగిన సంఘటన గురించి వివరిస్తారు. తిరుమలై నంబి వారి ఆదేశాలను విని ఉడయవర్లు చాలా సంతోషిస్తారు.

తిరిగి శ్రీరంగంలో

తరువాత, వారు కాంచీపురం నుండి బయలుదేరి శ్రీరంగం చేరుకుంటారు. స్థానిక శ్రీవైష్ణవులు వారిని ఉత్సాహంగా స్వాగతిస్తారు,  ఉడయవర్లు సరైన క్రమంలో (సన్నిధుల) వెళ్లి పెరియ పెరుమాళ్ళ సన్నిధికి చేరుకుంటారు. పెరియ పెరుమాళ్ళు వారిని ఎంతో ప్రేమతో స్వాగతించి, ప్రయాణం విషయాల గురించి ఆరా తీసి, తీర్థం, శ్రీ శఠగోపము మొదలైన గౌరవాలను అందిస్తారు.  ఉడయవర్లు శ్రీరంగంలో  సంప్రదాయ బోధనలను కొనసాగిస్తారు.

గోవింద పెరుమాళ్ళు కూడా చాలా సంతోషంగా కాళక్షేపాలు (ఉపన్యాసాలు) మరియు కైంకర్యాలలో పాల్గొనసాగారు. అది చూసి కొందరు శ్రీవైష్ణవులు గోవింద పెరుమాళ్ళను ప్రశంసించగా, వారు స్వీకరించి సంతోషపడతారు. అది చూసి, ఉడయవర్లు అతనితో “ఎవరైనా ప్రశంసిస్తే, ఆ ప్రశంసలను నేరుగా స్వీకరించ కూడదు. అందుకు బదులుగా, ప్రశంసలు అందుకునే అర్హత నాకు లేదని చెప్పాలి” అని వివరిస్తారు. ఇది విన్న గోవింద పెరుమాళ్ళు ఇలా సమాధానమిచ్చాడు – “నేను కాళహస్తిలో అల్ప స్థితిలో ఉండేవాడిని. ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రశంసిస్తే, అది కేవలము మీ గొప్ప కృప కారణంగా నేను సంస్కరించబడి ప్రశంసలు అందుకునే స్థితికి తీసుకువచ్చింది – కాబట్టి వాస్థవానికి ఈ ప్రశంసలన్నీ మీకు మాత్రమే చెందుతాయి ”. ఇది విని ఎంబెరుమానార్లు గోవింద పెరుమాళ్ళకి గొప్ప నిష్ఠని అనుగ్రహిస్తారు. వారు గోవింద పెరుమాళ్ళని ఆలింగనం చేసుకొని, “నీ మంచి గుణాలను నాకు కూడా ఇవ్వుము” అని అంటారు.  ప్రాపంచిక సుఖాల పట్ల గోవింద పెరుమాళ్ళ నిర్లిప్తత గమనించిన ఎంబెరుమానార్లు వారిని సన్యాసాశ్రమ స్వీకారము చేపట్టమని ఆదేశించారు. వారు సన్యాసాశ్రమ స్వీకారము చేసి ఎంబెరుమానార్లు నుండి ‘ఎంబార్’ అన్న నామాన్ని పొందుతారు.

అనంతరం, అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు మన సంప్రదాయంలోని సారాన్ని వెలికి తీసి జ్ఞాన సారము మరియు ప్రమేయ సారము అనే రెండు గ్రంథాల రచన గావించారు.

కాశ్మీర్ యాత్ర మరియు శ్రీ భాష్యము

ఎంపెరుమానార్లు వేదాంత సూత్రాలను స్పష్టంగా స్థాపించాలన్న సంకల్పముతో, కూరత్తాళ్వాన్ మరియు ఇతర శిష్యులతో కలిసి భోదాయన వృత్తి గ్రంథాన్ని (బ్రహ్మ సూత్రానికి వ్యాఖ్యానం) పొందడానికి కాశ్మీర్కి వెళతారు. ఆ గ్రంథాన్ని సేకరించి శ్రీరంగం వైపు తిరుగు ప్రయాణము ప్రారంభం చేస్తారు. దారిలో, కశ్మీర్ నుండి కొంతమంది దుండగులు గ్రంథాన్ని లాక్కొని పారిపోతారు. ఎంపెరుమానార్లు గ్రంథాన్ని పూర్తిగా చదవను కూడా లేదు అని విచారపడుతుండగా,  కూరత్తాళ్వాన్లు వారిని ఓదార్చి,  ఎంపెరుమానార్లు విశ్రమిస్తుండగా తాను ఆ గ్రంథాన్ని చదివానని తెలుపుతారు. శ్రీరంగం తిరిగి వచ్చిన అనంతరం, ఎంపెరుమానార్లు బ్రహ్మా సూత్రము యొక్క వ్యాఖ్యానాన్ని తాను చెబుతుండగా కూరత్తాళ్వాన్లని వ్రాయమని ఆదేశిస్తారు. వివరించిన సూత్రాలలో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, అక్కడే వ్రాయడం ఆపివేయమని ఆదేశిస్తారు. ఒకసారి, ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఎంపెరుమానార్లు వివరిస్తున్నప్పుడు, వారు శేషత్వం (సేవకు) గురించి నొక్కిచెప్పకుండా దానిని జ్ఞాతృత్వము (జ్ఞాన నివాసం) అని వివరిస్తారు. ఆళ్వాన్లు వెంటనే వ్రాయడం ఆపివేస్తారు, ఎందుకంటే ఆత్మకి అతి ముఖ్యమైన స్వభావం శేషత్వ జ్ఞానం కాబట్టి. ఎంపెరుమానార్లు కోపంతో ఆళ్వాన్లకి తాను చెప్పింది వ్రాయమని ఆగ్రహిస్తారు.  ఆదేశిస్తారు. ఆళ్వాన్ అప్పటికీ నిరాకరించగా ఎంపెరుమానార్లు తన క్రోధాన్ని అణచుకోలేకపోతారు. ఎంపెరుమానార్ల ఈ చర్య గురించి ఏమనుకుంటున్నారో తన సహచరులు అడిగినప్పుడు, ఆళ్వాన్ కేవలం “వారు యజమాని, నేను వారి యాజమాన్యాన్ని. వారికి నాపై పూర్తి హక్కులు ఉన్నాయి” అని తెలుపుతారు. కొంత సమయము తర్వాత, ఎంపెరుమానార్లు పరిస్థితిని విశ్లేషించి, తన తప్పును గ్రహించి, ఆళ్వాన్లకి క్షమాపణ కోరి, సరైన అర్థాలను వ్యాఖ్యానిస్తారు. ఈ విధంగా శ్రీభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, వేదాంత సంగ్రహం, గీతా భాష్యముని ఎంపెరుమానార్లు అనుగ్రహించారు. ఈ విధంగా,  ఈ సూత్రాలకు స్పష్టమైన  వ్యాఖ్యానము చేసి ఆళవందార్ల దుఃఖాన్ని తొలగించారు.

దివ్య దేశ యాత్ర

శ్రీవైష్ణవులు ఉడయవర్ల వద్దకి వెళ్లి, “యతిరాజులు మీరు ఇతర సిద్దాంతులను ఓడించి మన సిద్దాంతాన్ని స్థాపించారు. ఇక దయచేసి తీర్థయాత్రకు వెళ్లి వివిధ దివ్య దేశాలను కూడా సేవించండి.” అని విన్నపించుకుంటారు. వారితో ఏకీభవిస్తూ, ఉడయవర్లు వారితో పాటు నంపెరుమాళ్ళ వద్దకి వెళ్లి తన తీర్థయాత్రను ఆరంభించుటకు వారి అనుమతి కోరతారు. నంపెరుమాళ్ళు వారిని అనుమతిస్తారు.

ఎందరో శ్రీవైష్ణవులతో కలిసి ఉడయవర్లు తమ తీర్థయాత్రను ప్రారంభించి, భారత దేశములోని అనేక దివ్య దేశాలను క్షేత్రాలను సేవిస్తారు. వారు చోళ నాడుతో ప్రారంభించి, ఆ ప్రాంతంలో ఉన్న తిరుక్కుడందైతో పాటు అనేక దివ్యదేశాలను దర్శిస్తారు. ఆ తరువాత తిరుమాలిరుంజోళై, ఆ ప్రాంతంలో దివ్యదేశాలను సేవించి, తిరుప్పుల్లాణికి వెళ్లి సేతు సముద్రాన్ని దర్శించుకొని, ఆళ్వార్ తిరునగరికి చేరుకుంటారు. వారు నమ్మాళ్వార్ ‘పొలిందు నిన్ఱ పిరాన్’ కి మంగళాశాసనాలు సమర్పించుకుంటారు. నమ్మాళ్వార్లు ఎంపెరుమానార్లని చూసి సంతోషించి, వారికి సకల మర్యాదాలు ఇస్తారు. ఉడయవర్లు నవ తిరుపతిలోని అన్ని దేవాలయాలను సేవిస్తారు. అంతటా వారు అనేక వ్యతిరేక తత్వవేత్తలను ఓడించి, విశిష్ట అధ్వైత తత్వాన్ని దృఢంగా స్థాపిస్తారు.

తర్వాత వారు తిరుక్కుఱుంగుడికి చేరుకుంటారు. నంబి ఉడయవర్లని స్వాగతించి అర్చక ముఖేన వారితో సంభాషిస్తారు. తాను “వివిధ రూపాలలో అవతారము దాల్చిన తర్వాత కూడా నేను ఇంత మంది శిష్యులను సంగ్రహించలేకపోయాను, ఇంత మందిని నీవు ఎలా సంస్కరించగలుగుతున్నావు?” అని నంబి ప్రశ్నిస్తారు. “నీవు శిష్యుడిగా అడిగితే మాత్రమే నేను నీకు జవాబు ఇస్తాను” అని ఉడయవర్లు చెబుతారు. నంబి (తిరుక్కురుంగుడి పెరుమాళ్) వెంటనే ఉడయవర్లకి సింహాసనాన్ని అందించి వినయంగా పక్కన నిలుచుంటారు. ఉడయవర్లు తమ ఆచార్యులైన పెరియ నంబిని సింహాసనంపై ధ్యానిస్తూ, తాను సింహాసనం పక్కన ఆసీనమై ఉండి, ద్వయ మహా మంత్ర విశిష్ఠతని నంబికి వివరిస్తూ, ఈ ద్వయ మహా మంత్ర శక్తితోనే ఈ పవిత్ర మార్గాన్ని అందరినీ స్వీకరించమని ప్రేరేపిస్తాను అని వివరిస్తారు. నంబి సంతోషించి, శ్రీరామనుజులను తమ ఆచార్యులుగా స్వీకరించి, పరమానందముతో వారికి “శ్రీవైష్ణవ నంబి” అన్న నామధేయాన్ని ప్రసాదిస్తారు.

అనంతరం, ఉడయవర్లు తిరువణ్పరిసారం, తిరువాట్టాఱు, తిరువనంతపురాన్ని సేవిస్తారు.  వారు తిరువనంతపురంలో ఒక మఠాన్ని స్థాపించి, ఆ ప్రాంతంలో అనేక తత్వవేత్తలపై గెలుపుని సాదిస్తారు. ఆ తర్వాత వారు ఈ ప్రాంతంలోని ఇతర దివ్యదేశాల పెరుమాళ్ళని సేవించుకొని పశ్చిమ తీరం గుండా వెళ్లి ఉత్తర భారతదేశములోకి ప్రవేశిస్తారు. వారు మథుర, శాలగ్రామం, ద్వారక, అయోధ్య, భద్రికాశ్రమం, నైమిశారణ్యం, పుష్కరం, అలాగే గోకులం, గోవర్ధనం, బృందావనం మొదలైన చోట్ల తమ మంగళశాసనాలు సమర్పిస్తారు, ఎందరో అన్య తత్వశాస్త్ర పండితులను ఓడిస్తారు.

వారు కాశ్మీర్‌ కి చేరుకుని సరస్వతీదేవి స్వయంగా అధ్యక్షత వహించే సరస్వతి భండారానికి (సాహిత్య కేంద్రం) వెళ్తారు. ఆమె స్వయంగా ఉదయవర్లని స్వాగతించి, ఛాందోగ్య ఉపనిషత్తు శ్లోకమైన  “తస్య యతా కప్యాసం” అర్ధాన్ని వివరించమని అడుగుతుంది (బాల్యంలో  శ్రీరామానుజులకు వారి గురువులు యాదవ ప్రకాశులకు మధ్య ఈ శ్లోకము కారణాగానే విభేదాలు తలెత్తుతాయి). ఉడయవర్లు దానికి లోతైన వివరణ ఇచ్చి సరైన అర్థాన్ని స్థాపిస్తారు. సరస్వతి దేవి ఆ వివరణతో ఎంతో సంతోషించి, శ్రీభాష్యాన్ని (బ్రహ్మ సూత్ర వ్యాఖ్యానం) తన శిరస్సుపై ఉంచి వారిని స్తుతిస్తుంది. వారికి “శ్రీ భాష్యకారర్” అనే బిరుదుతో కీర్తించి, శ్రీ హయగ్రీవ భగవానుడి అర్చామూర్తిని వారికి అందజేస్తుంది. తాను ఎందుకు అంత సంతోషించారని ఉడయవర్లు అడిగినప్పుడు, సరస్వతి దేవి బదులిస్తూ – గతంలో శంకరుడు ఆమెను దర్శించాలని  వచ్చినపుడు అదే శ్లోకానికి అర్థాన్ని అడుగగా, వారు దానిని ఖచ్చితమైన వివరణ ఇవ్వలేక అసంబద్ధమైన వివరణ ఇచ్చారు. ఆమె “నాకు నచ్చిన సరైన అర్థాన్ని నీవు వివరించినందున, నేను సంతోషిస్తున్నాను” అని తెలుపుతుంది. ఇది చూసిన పండితులు ఉత్తేజితులై ఉడయవర్లతో వివాదానికి దిగుతారు. ఉడయవర్లు వాళ్ళందరినీ చర్చలో ఓడించి సిద్దాంతాన్ని పునః స్థాపిస్తారు. ఇది చూసిన ఆ ప్రాంతపు రాజు దిగ్భ్రాంతులై ఉడయవర్లకి శిష్యులౌతారు. చర్చలో ఓడిన పండితులు కోపంతో ఉడయవర్లకి చేతబడి చేసి చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అది వారిపై తిరగబడి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభిస్తారు. రాజు వచ్చి అందరినీ కాపాడమని ఉడయవర్లని అభ్యర్థించగా, వాళ్ళని చివరకు వారు శాంతపరచుతారు. వారందరూ ఉడయవర్ల శిష్యులుగా మారతారు.

తరువాత వారు వారణాసికి వెళ్లి గంగలో పవిత్ర స్నానం గావించుకొని కణ్డమెన్నుం కడి నగరం దివ్య దేశ పెరుమాళ్ళని దర్శించుకుంటారు. తరువాత పురుషోత్తమ ధామన్ (జగన్నాథ పురి) కి చేరుకుని జగన్నాధ ఎంపెరుమానుడికి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. మాయావాద సిద్దాంత వేత్తలను ఓడించి అక్కడ ఒక మఠాన్ని స్థాపిస్తారు. ఆపై వారు శ్రీ కూర్మము, సింహాద్రి, అహోబిలం మొదలైన క్షేత్రలను దర్శిస్తారు.

వారు చివరికి తిరుమలకి చేరుకుంటారు. ఆ సమయంలో, కొంతమంది శైవులు మూలవర్లైన తిరువేంకటేశ్వరులు రుద్ర స్వరూపులని ఒక సమస్య తలెత్తుతారు. ఉడయవర్లు అప్పుడు ఇలా అంటారు – “మీరు మీ స్వామి ధరించే విశేష ఆయుధాలు/చిహ్నాలను వారి ముందు ఉంచండి, మేము వారి ముందు శంఖ చక్రాలని ఉంచుతాము. వారికి నచ్చిన ఆయుధాలని ఎంచుకొని తన స్వరూపాన్ని వారినే స్వయంగా నిర్ణయించుకోనివ్వండి.” అని అంటారు. అందరినీ సన్నిధిలో నుండి బయటకు పంపించి, తాళం వేసి ఆ రాత్రికి అందరూ వెళ్లిపోతారు. వాళ్ళు ఉదయాన్నే తిరిగి వచ్చి తలుపు తెరిచి చూచి నపుడు, ఉడయవర్లు మరియు ఇతర శ్రీవైష్ణవులు సంతోషపడేలా భగవానుడు శంఖ చక్రాలతో అలంకృతులై ఉంటారు. ఆ తర్వాత ఉడయవర్లు తిరుపతికి దిగి వచ్చి అక్కడి నుండి ముందుకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

ఆ తరువాత వారు ఆ ప్రాంతములోని కాంచీపురం, తిరువల్లిక్కేణి, తిరునీర్మలై మొదలైన ఇతర దివ్య దేశాలను సేవిస్తారు. ఆపై వారు మధురాంతకము చేరుకొని తొండై మండలములోని అనేక పండితులను జయించుతారు. తరువాత తిరువహీంద్రపురం మరియు కాట్టుమన్నార్కోయిల్ దివ్య దేశాలను దర్శిచారు.

ఈ విధంగా, వారు అనేక దివ్య దేశాలను సేవించి తమ యాత్రని పూర్తి చేసుకొని తిరిగి శ్రీరంగానికి చేరుకుంటారు. శ్రీ రంగములో అమలనాదిపిరాన్ ని పఠించి పెరియ పెరుమాళ్ళని సేవిస్తారు. పెరియ పెరుమాళ్ళు వారి క్షేమాన్ని అడగగా, “నిత్యము నీ చింతన చేసే మాకు, చింతలు ఉండవు” అని ఉడయవర్లు బదులిస్తారు. వారు శ్రీ రంగములోనే ఉంటూ వారి నిత్య కైంకర్యాలను నిర్వహించసాగుతారు.

భట్టర్ల జననం

శ్రీరంగంలో ఈ సమయంలో, ఒక రోజు కూరత్తాళ్వాన్  వర్షం కారణంగా తన భిక్షాటన కోసం బయటకు వెళ్లలేకపోయారు. వారు తన సాయంత్రం అనుష్టానాలను పూర్తి చేసుకొని, ఆ పూటకి ప్రసాదాన్ని తీసుకోలేదు. రాత్రి అయ్యింది, నంపెరుమాళ్ళ ఆలయములో నైవేధ్య ఘంటానాదము మ్రోగిస్తున్నారు. వారి ధర్మ పత్ని ఆండాళ్, తన భర్త యొక్క ఈ స్థితికి దుఃఖిస్తూ, “మీ భక్తుడు ఇక్కడ ఉపవాసం ఉన్నాడు, నీవు అక్కడ విందు భోజనము చేస్తున్నావు” అని నంపెరుమాళ్ళతో ఆమె మొరపెట్టుకుంది. ఆమె మనోభావన అర్థం చేసుకున్న నంపెరుమాళ్ళు వెంటనే తన సేవకులతో ప్రసాదాన్ని ఆళ్వాన్ తిరుమాలిగకి పంపుతాడు. వారి రాకతో ఆళ్వాన్ ఆశ్చర్యపోయి అతని భార్య వైపు చూడగా, ఆమె జరిగిన విషయం వెల్లడిచేసింది. తన దుస్థితిని ఎంపెరుమానుడిపై మోపడం ఆళ్వాన్ కి నచ్చలేదు. అయినా కనీ వారు 2 గుప్పిళ్ళ ప్రసాదము తీసుకొని, కొంత తాను తిని మిగిలినది తన భార్యకు ఇచ్చారు. ఈ రెండు గుప్పిళ్ళ ప్రసాదముతో  ఆండాళ్ ఇద్దరు అందమైన శిషువులకు జన్మనిస్తుంది. 11 రోజుల అశౌచం తరువాత, 12 వ రోజున, ఎంబార్ మరియు ఇతర శ్రీవైష్ణవులతో కలిసి ఎంపెరుమానార్లు ఆ శిశువులను ఆశీర్వదించడానికి ఆళ్వాన్ నివాసానికి ఆసక్తిగా వెళ్ళారు. ఎంబార్ని పిల్లలను తన వద్దకు తీసుకురమ్మని ఎంపెరుమానార్లు చెప్పాగా, ఎంబార్ భట్టర్ని తన చేతిలో తీసుకుని వస్తారు. ఎంపెరుమానార్లు  పిల్లలను ప్రేమగా తన చేతిలో తీసుకొని ఆశీర్వదిస్తారు. వారు ఎంబార్‌తో ఇలా అంటారు “ఈ బిడ్డలో ఒక దివ్యమైన కాంతిని నేను చూస్తున్నాను, ఒక దివ్య సుగంధము వెదజల్లుతున్నాడు. నీవు ఏమైనా చేశావా?” అని అడుగుతారు. ఎంబార్ సమాధానమిస్తూ “నేను ఈ పిల్లలకు రక్షణగా ద్వయ మహా మంత్రాన్ని పఠించాను” అని అంటారు. “ఓ, నీవు నాకంటే ఒక అడుగు ముందే ఉన్నావు. నీవే ఈ పిల్లలకి ఆచార్యునిగా ఉండు” అని ఎంపెరుమానార్లు ఎంబార్ని ఆదేశిస్తారు. ఆపై వారు పరాశర మహర్షి, వేదవ్యాస మహర్షి జ్ఞాపకార్థం ఆ పిల్లలకి “పరాశర భట్టర్” , వేదవ్యాస భట్టర్  , అని నామకరణం చేసి ఆళవందార్లకు తాను చేసిన రెండవ ప్రతిజ్ఞని నెరవేరుస్తారు. తమ పర్యవేక్షణలో ఎంబార్ల తో పిల్లలకి  సమాశ్రయణం చేస్తారు. వారు పరాశర భట్టర్ని పెరియ పెరుమాళ్ (శ్రీ రంగనాథుడు) పెరియ పిరాట్టి (శ్రీ రంగనాయకి) వారికి దత్తతు ఇవ్వమని ఆళ్వాన్ని ఆజ్ఞాపించారు. ఆళ్వాన్ అంగీకరిస్తారు. పరాశర భట్టర్ పసితనమంతా పెరియ పిరాట్టి చూసుకున్నది, పెరియ పెరుమాళ్ళ ముందు నైవేద్యము ఉంచినప్పుడు, పెరుమాళ్ళకు ముందే నేరుగా భట్టర్ తన చేతిని కుండలో పెట్టి తినేవారు, పెరియ పెరుమాళ్ళు సంతోషంగా ఆ తర్వాత భోగాన్ని స్వీకరించేవారు. భట్టర్ అతి చిన్న వయస్సులోనే అత్యంత తెలివైన వ్యక్తిగా ఎదిగి, ఎంపెరుమానార్లు మరియు ఎంబార్ల కాలము తర్వాత మన సంప్రదాయానికి నాయకుడు అవుతారు.
ఎంబార్ల పూర్వాశ్రమ సోదరుడు, శిరియ గోవింద ప్పెరుమాళ్ళ భార్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది,  ఎంపెరుమానార్లు అతనికి “శ్రీ పరాంకుశ” అని నామకరణం చేసి, ఆళవందార్లకి తాను ఇచ్చిన మూడవ ప్రతిజ్ఞని నెరవేర్చుతారు.
ముదలియాండాన్ ఎంపెరుమానార్ల పట్ల ఎంతో భక్తి భావముతో ఉండేవారు. ఎంపెరుమానార్లు కూడా అతని పట్ల ఎంతో ప్రేమతో ఉండేవారు. పెరియ నంబి కుమార్తె అయిన అత్తుళాయ్ ఇంట్లో పని మనిషిగా వెళ్లమని ఆదేశించినప్పుడు, సంశయం లేకుండా, వారు ఎంపెరుమానార్ల ఆదేశాలను పాటిస్తారు.
ఎంపెరుమానార్ల ఆచార్యులైన పెరియనంబి, ఆళవందార్ల ప్రియ శిష్యుడు మాఱనేర్ నంబి యొక్క చరమ సంస్కారాలు చేసినప్పుడు, స్థానిక శ్రీవైష్ణవులు వారిని విరోధిస్తారు. ఎందుకంటే పెరియ నంబి ఒక బ్రాహ్మణుడు,  మాఱనేర్ నంబి ఒక నీచ జాతికి  చెందినవాడు. వాళ్ళు వెళ్లి ఎంపెరుమానార్లకి ఫిర్యాదు చేస్తారు. ఎంపెరుమానార్లు పెరియ నంబిని పిలిచి వివరణ అడుగగా, పెరియ నంబి మాఱనేర్ నంబి యొక్క గొప్పతనాన్ని వివరించి తాను చేసినది సబబేనని సమర్థిస్తారు.  ఎంపెరుమానార్లు సంతోషించి, అక్కడ ఉన్న అందరితో, తాను పెరియనంబితో ఎల్లప్పుడూ ఏకీభవిస్తానని, కానీ అందరికీ తెలియజెప్పుడానికి మాత్రమే వారి నుండి ఈ వివరణ కోరారని తెలియజేస్తారు.

తిరునారాయణపురం యాత్ర

ఈ సమయంలో, అందరూ శ్రీరంగంలో ఎమ్పెరుమానార్ల మార్గదర్శకత్వంలో సంతోషంగా జీవిస్తున్నప్పుడు, శైవ సిద్దాంత సంబంధం ఉన్న దుష్ట రాజు శివుడి ఆధిపత్యాన్ని స్థాపించాలని ఆశిస్తారు. పండితులందరినీ పిలిచి, శివ ఆధిపత్యాన్ని స్వీకరించి హస్థాక్షేపము చేయమని బలవంతం చేసేవారు. ఆళ్వాన్‌ శిష్యుడైన నాలురాన్ రాజుతో ఇలా అన్నాడు: “అజ్ఞానుల అంగీకారం వల్ల ఏమి లాభము? మీరు శ్రీరామనుజులు మరియు ఆళ్వాన్ని  అంగీకరింప గలిగితే మాత్రమే అది నిజం అవుతుంది. అది విన్న రాజు శ్రీరామనుజులను రాజభవనానికి తీసుకురమ్మని వారి మఠానికి తన సైనికులను పంపుతారు. ఆ సమయంలో శ్రీరామనుజులు వారి స్నానం కోసం వెళ్ళగా, మఠం ఉన్న ఆళ్వాన్ రాజు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారు. శ్రీరామనుజుల వలె కాషాయ వస్త్రాలు ధరించి, వారి త్రిదండం చేతపట్టుకొని రాజ బటులతో రాజ భవనానికి వెళతారు. తరువాత మఠానికి తిరిగి వచ్చిన శ్రీరామనుజులు జరిగిన విషయం గురించి తెలుసుకుంటారు. రానున్న ఆపద కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోమని హెచ్చరించబడతారు. వారు ఆళ్వన్ వారి శ్వేత వస్త్రాలను ధరించి తమ శిష్యులతో కలిసి శ్రీరంగం నుండి వెళ్లిపోతారు. వారు తప్పించుకున్న విషయం తెలుసుకున్న కొందరు సైనికులు వారిని వెంబడించడం ప్రారంభించారు. కానీ శ్రీరామనుజులు కొంత ఇసుకను చేతిలోకి తీసుకొని పవిత్రం చేసి వారి శిష్యులకు అందించి సైనికులు వచ్చే దారిలో చల్లమని ఆదేశిస్తారు. సైనికులు ఆ ఇసుక మీద అడుగుపెట్టగానే తీవ్ర నొప్పిని అనుభవించి వారిని వెంటాడటం మానుకుంటారు. 
అప్పుడు ఎమ్పెరుమానార్లు సురక్షిత ప్రదేశంగా భావించి మేల్కోటె (తిరునారాయణపురం) వైపు ప్రయాణం మొదలుపెడతారు. అడవి మార్గంలో, వారు నల్లాన్ చక్రవర్తిచే (ఎమ్పెరుమానార్ల శిష్యుడు) నిర్దేశించబడిన కొందరు వేటగాళ్ళని కలుస్తారు. అప్పటికి 6 రోజులు కాలినడకన ప్రయాణిస్తూ ఆకలితో ఉన్న వీరిని  వాళ్ళు స్వాగతిస్తారు. వారు ఎమ్పెరుమానార్ల యోగ క్షేమాలను అడిగి, వారు ఆ శ్రీవైష్ణవులతో ఉన్నారని తెలుకొని,  ఎమ్పెరుమానార్ల దర్శనము పొంది పునీతులౌతారు. వాళ్ళు కొంచం తేనె మరియు ధాన్యం అందించగా, వాటిని ఎమ్పెరుమానార్ల మినహా అందరూ స్వీకరిస్తారు. వాళ్ళని సమీప గ్రామంలో బ్రాహ్మణ కుటుంబం ఉండే చోటికి తీసుకొనివెళ్లి వారి భోజనము కోసం ముడి పదార్థాలను వారికి అందేలా చేస్తారు.
అక్కడ ఉన్న బ్రాహ్మణుడి (కొంగిలాచ్చాన్) భార్య అందరికీ తన ప్రణామాలను అందించి,  వండిన ప్రసాదాన్ని స్వీకరించమని ప్రార్థించింది. తాము అందరి నుండి స్వీకరించలేమని చెప్పి శ్రీవైష్ణవులు ఆహారాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. వెంటనే ఆమె తాను ఎమ్పెరుమానార్ల శిష్యురాలని, కొంతకాలం క్రితం శ్రీరంగంలో ఉన్నప్పుడు తాను ఎమ్పెరుమానార్ల చేత సమాశ్రయణం పొందానని వివరించింది. నేను శ్రీరంగంలో ఉండే ఆ రోజుల్లో రాజులు, వారి మంత్రులు వచ్చి ఎమ్పెరుమానార్ల  ఆశీర్వాదాలు తీసుకునేవారు. కానీ వారు ప్రతి రోజూ భిక్షాటనకి వెళ్లేవారు. “ఎందుకు ఈ వ్యత్యాసము?” అని నేను వారిని అడిగినప్పుడు వారు, “వారికి నేను భగవత్ జ్ఞానం ప్రసాదిస్తాను” అని తెలిపారు. అదే జ్ఞానము నాకు కూడా ప్రసాదించమని నేను వారిని ప్రార్థించగా వారు నన్ను సంప్రదాయంలోకి ప్రవేశపెట్టారు. మేము మా స్వస్థలానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు, వారి ఆశీర్వాదాలు కోరగా, వారు నాకు తమ దివ్య పాదుకలను అనుగ్రహించారు. తరువాత మేము ఇక్కడే ఉండిపోయాము. ఇదంతా విన్న ఎమ్పెరుమానార్లు (తను ఎవరో వెల్లడి చేయకుండా), తన వెంట వచ్చిన శ్రీవైష్ణవులను ఆమె తయారు చేసిన ప్రసాదాన్ని  స్వీకరించమని ఆదేశిస్తారు. కానీ ఆమె కదలికని గమనించమని వారు ఒక శ్రీవైష్ణవుడిని నియమిస్తారు. ఆమె వంట పూర్తి చేసి, పుజ గదిలోకి వెళ్లి, కోయిళ్ ఆళ్వాన్ (పూజ గది) ఎదుట ధ్యానం చేసింది. అర్చామూర్తి భిన్నంగా ఉన్నట్టు ఆ శ్రీవైష్ణవుడు గమనించి ఎమ్పెరుమానార్లకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. లోపల ఏమి చేశావని ఎమ్పెరుమానార్లు ఆమెను ప్రశ్నించగా ఆమె సమాధానమిస్తూ “ఎమ్పెరుమానార్లు నాకు ఇచ్చిన దివ్య పాదుకలకు నా ప్రార్థనలు సమర్పించాను, వారికి నైవేధ్యాన్ని అర్పించాను” అని తెలుపుతుంది. వాటిని బయటకు తీసుకురమ్మని అడుగగా, ఆమె తెచ్చిన పాదుకలని గమనించి అవి తనవేనని వారు గుర్తిస్తారు. అప్పుడు వారు ఆమెను “ఎమ్పెరుమానార్లు ఇక్కడ ఉన్నారని నీకు తెలుసా?” అని అడుగగా ఆమె దీపం వెలిగించి అందరి పాదాలను పరిశీలిస్తుంది. ఆమె ఎమ్పెరుమానార్ల దివ్య చరణాలను చూసి పరమానందంతో “ఇవి ఎమ్పెరుమానార్ల దివ్య తిరువడి లాగా ఉంది, కానీ మీరు తెల్ల వస్త్రాలు ధరించి ఉన్నందున నేను గుర్తించలేకపోతున్నాను” అని తెలుపుతుంది. ఎమ్పెరుమానార్లు తమ  గుర్తింపు ఆమెకు వెల్లడి చేసి తాను ఉపదేశించిన సూచనలను తిరిగి చెప్పమంటారు. ఆమె సంతోషంగా వారికి చెప్పగా,  వారు అందరినీ ప్రసాదం తీసుకోమని అనుమతిస్తారు. స్వయంగా వారు మాత్రం భగవానుడికి అర్పించలేదని స్వీకరించరు. అప్పుడు ఆమె కొన్ని పండ్లు, పాలు, బెల్లము వారికి అందించగా వారు వాటిని తమ పెరుమాళ్ళకి సమర్పించిన తరువాత వారు భుజిస్తారు. ఆమె ఆ భాగవతులందరి శేషాన్ని తీసుకొని తన భర్తకు అందజేస్తుంది, కానీ ఆమె తినదు. ఆమె భర్త ఎందుకు అని అడిగినప్పుడు,  “మీరు  ఎమ్పెరుమానార్లను మీ ఆచార్యగా ఇంకా స్వీకరించలేదు. వారు ఎంతో దూరము నుండి మన ఇంటికి వేంచేశారు. మీరు వారిని ఆచార్యులుగా స్వీకరిస్తానని హామీ ఇస్తేనే నేను ప్రసాదం తీసుకుంటాను” అని ఆమె చెప్పగా వారు ఒప్పుకున్న తరువాత ఆమె ప్రసాదం స్వీకరిస్తుంది. మర్నాడు ఉదయం, వారు ఎమ్పెరుమానార్ల వద్దకు వెళ్లి వారికి శరణాగతులౌతారు. ఎమ్పెరుమానార్లు అతనికి మంత్రం ఉపదేశించి శిష్యుడిగా స్వీకరిస్తారు. ఎమ్పెరుమానార్లకు కాషాయ వస్త్రం మరియు త్రిదండం లభిస్తుంది, అక్కడ కొన్ని రోజులు ఉండి, తరువాత పశ్చిమం వైపు ముందుకి తమ ప్రయాణం ప్రారంభిస్తారు.
వారు శాలగ్రామం చేరుకున్నారు. ఆ రోజుల్లో ఆ ప్రదేశము బౌద్ధులు మరియు జైనులతో నిండి ఉండేది. వాళ్ళు శ్రీరామనుజులను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అక్కడ ఉన్న చెరువులో తమ దివ్య పాదాలను కడగమని వారు ముదలియాండాన్ ని ఆదేశిస్తారు. ఎమ్పెరుమానార్ల పాద తీర్థముతో పవిత్రమైన ఆ చెరువు నీటిని తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎమ్పెరుమానార్ల వైపు ఆకర్షితులయ్యారు. వడుగ నంబి, ఎమ్పెరుమానార్లు తన సర్వస్వంగా భావించి ఆచార్య భక్తికి గొప్ప నిదర్శనమౌతారు. ఆ తర్వాత వారు తొండనూర్ చేరుకొని అక్కడ విఠ్ఠల దేవరాయుల (ఆ ప్రాంతపు రాజు) కుమార్తెని పట్టి పీడుస్తున్న దెయ్యం నుండి ఆమెను విముక్తులను చేస్తారు. ఆ రాజు తమ సపరివార సమేతంగా ఎమ్పెరుమానార్ల శిష్యులౌతారు, ఆ రాజుకి విష్ణు వర్ధన రాయ అన్న నామాన్ని అనుగ్రహిస్తారు. ఇది విన్న 12000 మంది జైన సిద్దాంత వేత్తలు ఎమ్పెరుమానార్లతో వాద్వివాద చర్చకు దిగి వస్తారు, ఎమ్పెరుమానార్లు తమకి వారికి మధ్య ఒక తెర ఉంచి వారందరితో ఒకేసారి చర్చించారు. తెర వెనుక, తమ వేయి పడగల ఆదిశేష రూపాన్ని దాల్చి వారి ప్రశ్నలన్నింటికీ ఒకేసారి సమాధానం ఇస్తారు. ఓడిపోయిన అనేక పండితులు వారి శిష్యులుగా మారతారు. రాజు కూడా ఎమ్పెరుమానార్లని కీర్తిస్తారు.
ఈ విధంగా, ఎమ్పెరుమానార్లు తొండనూర్లో ఉండ సాగారు, వారి తిరుమణ్ నిండుకుందని విచారించ సాగారు. వారు నిద్రిస్తుండగా తిరునారాయణపురం పెరుమాళ్ళు తన కలలో కనిపించి, “తిరునారాయణపురంలో నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ తిరుమణ్ కూడా ఉంది” అని అంటారు. రాజు సహాయంతో, ఎమ్పెరుమానార్లు తిరునారాయణపురానికి చేరుకుని పెరుమాళ్ళని సేవించడానికి వెళ్తారు. కానీ ఆశ్చర్యంగా అక్కడ దేవాలయం లేదని గమనిస్తారు. అలసట తీర్చుకోడానికి కాసేపు విశ్రమించగా, ఎంపెరుమాన్ మళ్లీ తన కలలో కనిపించి తాను భూస్థాపితమైన అసలు స్థానాన్ని చూపుతారు. ఎమ్పెరుమానార్లు తవ్వి పెరుమాళ్ళని వెలికితీసి, నమ్మాళ్వార్లు తమ తిరువాయ్మొళిలో  తిరునారణన్ ఎంపెరుమాన్ ని కీర్తిస్తూ సమర్పించిన “ఒరు నాయగమాయ్” పదిగాన్ని అర్పిస్తారు. వారికి  తిరుమణ్ కూడా లభిస్తుంది, తమ శరీరంపై పన్నెండు చోట్ల ఆ తిరుమణ్ ని ధరిస్తారు. పిదప ఆ పట్టణాన్ని ఖాలీ చేయించి, దేవాలయాన్ని పునః నిర్మించి, అక్కడ పెరుమాళ్ళ సేవకై అనేక అర్చకులను ఏర్పాటు చేస్తారు.
ఉత్సవ విగ్రహం లేకపోవడం వలన, ఉత్సవాల నిర్వహణకి అవకాశం లేనందున ఎమ్పెరుమానార్లు విచారిస్తుండగా, పెరుమాళ్ళు మళ్లీ వారి కలలో కనిపించి, “ఢిల్లీ బాద్ షా రాజ భవనంలో రామప్రియుడు (ఉత్సవ మూర్తి) ఉన్నాడని” వెల్లడి చేస్తారు. వెంటనే ఎమ్పెరుమానార్లు ఢిల్లీక్ఇ వెళ్లి, విగ్రహాన్ని తిరిగి ఇవ్వమని రాజును కోరతారు. రాజు వారిని తన కుమార్తె యొక్క అంతఃపురానికి తీసుకువెళ్లి విగ్రహాన్ని చూపిస్తారు. ఆ రాజ కుమార్తె ఆ విగ్రహాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పెరుమాళ్ళని చూసి సంతోషించిన ఎమ్పెరుమానార్లు “చెల్లప్పిళ్ళై ఇటురా” అని పిలుస్తారు. పెరుమాళ్ళు ఒక్కసారిగా బయటకు దూకి ఎమ్పెరుమానార్ల ఒడిలోకి వచ్చి కూర్చుంటారు. బాద్ షా ఆశ్చర్యపోతారు, అనేక ఆభరణాలు మొదలైన వాటిని పెరుమాళ్ళకి సమర్పించి, వారిని ఎమ్పెరుమానార్లతో పాటు పంపుతారు. పెరుమాళ్ళ నుండి వీడి ఆ రాజ కుమారి విరహ వేదనని భరించలేక  ఎమ్పెరుమానార్ల గోష్టిని అనుసరించడం ప్రారంభిస్తుంది. తిరునారాయణపురం సరిహద్దులో, పెరుమాళ్ళు ఆమెను ఆండాళ్ని స్వీకరించినట్లుగా ఈ రాజ కుమారిని తనలోకి స్వీకరిస్తారు. ఎమ్పెరుమానార్లు ఆమెకి తుళుక్క నాచియార్ అన్న నామాన్ని ఇచ్చి పెరుమాళ్ళ దివ్య తిరువడి వద్ద ఆమె ప్రతిష్ఠ చేస్తారు. ఉత్సవ విగ్రహాన్ని ఆలయం లోపల పునః ప్రతిష్ఠాపన చేసి అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు.

శ్రీరంగానికి తిరిగి వచ్చుట

ఈ విధంగా, వారు పన్నెండు సంవత్సరాలు తిరునారాయణపురంలో ఉండి అనేక కైంకర్యాలలో పాల్గొని మన సంప్రదాయ అభివృద్ధి కోసం అనేక శ్రీవైష్ణవులను పోషించారు. శైవరాజు మరణించాడని శ్రీరంగంలోని మారుతి శిఱియాండాన్ ద్వారా విని వారు సంతోషిస్తారు. వారు శ్రీరంగానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. వారి శ్రీరంగ ప్రయాణం గురించి విన్న తిరునారాయణపుర శిష్యులు దుఃఖ సాగరంలో మునిగిపోతారు. ఎమ్పెరుమానార్లు వారిని ఓదార్చి వారి కోరిక తీర్చడానికి, అక్కడ తమ విగ్రహం ప్రతిష్టాపనకి ఆమోదము పలుకుతారు. ఈ విగ్రహాన్ని “తమర్ ఉగంద తిరుమేని” అని కీర్తిస్తారు. అనంతరం వారు తిరునారాయణపురం నుండి బయలుదేరి శ్రీరంగం చేరుకొని పెరియ పిరాట్టి మరియు పెరియ పెరుమాళ్ళకి మంగళశాసనం చేసి, మన సంప్రదాయ పోషణ శ్రీరంగం నుండి కొనసాగిస్తారు.
శ్రీరంగంలో, పెరియ పెరుమాళ్ళకి మంగళశాసనం చేసి, ఆలయ ప్రదక్షిణ చేస్తూ తమను తాము పునరుజ్జీవనం చేసుకుంటూ, అన్య శ్రీవైష్ణవులతో పాటు ఉడయవర్లు కూరత్తాళ్వాన్ల తిరుమాలిగకి వెళతారు. ఆళ్వాన్ ఎంతో భక్తితో, ఉడయవర్ల దివ్య పాదాలపై పడి, పట్టుకుని అక్కడే మైమరచి పడుంటారు. ఉడయవర్లు వారిని పైకి లేపి భావపూరులై వారిని ఆలింగనం చేసుకుంటారు, వారి నేత్రములు కోల్పోయిన కూరత్తాళ్వాన్లని చూస్తూ బాధతో మూగబోతారు. వారి కళ్ళ నిండా నీళ్ళు మరియు వణుకుతున్న కంఠ స్వరంతో, వారు ఆళ్వాన్తో “మన దర్శనం (సంప్రదాయం) కోసం, నీవు నీ  దర్శనం (కళ్ళు) కోల్పోయావు” అని బాధతో అంటారు. “నా అపచారాల పరిణామమే ఇది” అని ఆళ్వాన్ వినయంగా అంటారు. ఉడయవర్లు వారిని ఓదార్చుచూ “నీవు ఎలా అపచారానికి పాల్పడగలవు? దీనికి కారణము నా అపచారమే ఉండాలి” అని అంటారు. చివరికి అందరూ తమను తాము కుదుటపరచుకుంటారు,  ఉడయవర్లు తమ మఠానికి తిరిగి వస్తారు.
ఈ సమయంలో, కొంతమంది శ్రీవైష్ణవులు ఉడయవర్ల వద్దకు వచ్చి, తిరుచిత్రకూటం (ఇప్పుడు చిదంబరం అని ప్రసిద్ధి చెందింది) ఆలయాన్ని కొందరు దుర్మార్గులు [శైవులు] ధ్వంసం చేశారని కబురందిస్తారు. పెరుమాళ్ళ ఉత్సవ మూర్తిని సురక్షితంగా తిరుపతికి చేర్చారని వారు తెలుసుకుంటారు. వెంటనే వారు తిరుపతికి బయలుదేరి, శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళ మందిర నిర్మాణానికి ఆదేశిస్తారు, గోవిందరాజ పెరుమాళ్ళని పోలి ఉండే నూతన మూల మూర్తిని ప్రతిష్ఠిస్తారు. తిరుమలలో తిరువెంకటేశ్వరునికి మంగళశాసనాలు అందించి, శ్రీరంగానికి బయలుదేరుతారు. మార్గంలో కాంచీపురంలో ఆగి, దేవ పెరుమాళ్ళకి  మంగళశాసనాలు అందించి తిరిగి శ్రీరంగం చేరుకుంటారు. మన సంప్రదాయ పోషణ శ్రీరంగం నుండి కొనసాగిస్తారు.
అనంతరం, ఉడయవర్లు ఆళ్వాన్ని పిలిచి, సమస్థ కోరికలను నెరవేర్చగల దేవ పెరుమాళ్ళని సేవించి తాను కోల్పోయిన దృష్టిని తిరిగి ప్రసాదించమని దేవ పెరుమాళ్ళని ప్రార్థించమని ఆదేశిస్తారు. ఆళ్వాన్ సంకోచిస్తారు కానీ ఉడయవర్లు వారిని అలా చేయమని బలవంతం చేయగా, ఆళ్వాన్ వరదరాజ స్థవం అనుసందానము చేసి, చివరికి తన అంతరంగ నేత్రాలతో పెరుమాళ్ళని చూడాలని ప్రార్థిస్తారు. పెరుమాళ్ళు సంతోషంగా వారికి ఆ వరాన్ని ప్రసాదిస్తారు, ఈ విషయాన్ని ఆళ్వాన్  ఉడయవర్లకి వివరిస్తారు. ఉడయవర్లు దానితో సంతృప్తి చెందకుండా, ఆళ్వాన్ని కాంచీపురానికి తీసుకువచ్చి దేవ పెరుమాళ్ళ ఎదుట  వరదరాజ స్థవం పూర్తిగా పఠించమని ఆళ్వాన్ని కోరుతారు. ఉడయవర్లు మరొక కార్య పూర్తికై వేరొక చోటికి వెళ్ళగా, ఆ సమయంలో ఆళ్వాన్ తన  పారాయణం పూర్తి చేస్తారు. దేవ పెరుమాళ్ళు తన కోరిక ఏమిటో అడగమంటారు. “నేను పొందిన ఫలము నాలూరాన్ కూడా పొందాలి” అని అంటారు. దేవ పెరుమాళ్ అనుగ్రహిస్తారు. ఉడయవర్లు తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తెలుకొని తన కోరికను పాటించనందుకు పెరుమాళ్ళు మరియు ఆళ్వాన్ ఇద్దరినీ ఆగ్రహిస్తారు. దేవ పెరుమాళ్ళు అప్పుడు దేవ పెరుమాళ్ళని మరియు ఉడయవర్లను ఇరువురినీ చూసేలా దృష్టిని ఆళ్వాన్ కి ప్రసాదిస్తారు. ఆళ్వాన్ పునీతులై దేవ పెరుమాళ్ళ దివ్య అలంకరణ, ఆభరణాలు మొదలైనవి దర్శిస్తారు.  ఉడయవర్లు సంతృప్తి చెందుతారు.

కోయిల్ అణ్ణర్

ఉడయవర్లు నాచియార్ తిరుమొళి అర్థాల ఉపన్యాసమిస్తున్నప్పుడు, వారు “నాఱు నఱుం పొళిల్” పాశుర అర్ధాన్ని వివరించడం ప్రారంభించారు. ఇది తిరుమాలిరుంజోలై ఎంపెరుమానుడికి 100 ఆండల పాయసము మరియు 100 ఆండల వెన్నను సమర్పిస్తానని ఆండాళ్ కోరికకు సంబంధించిన పాశురమిది. వెంటనే ఉడయవర్లు తిరుమాలిరుంజోలై దివ్య దేశానికి బయలుదేరి ఆండాళ్ తరపున వారు సమర్పిస్తారు. ఆ తర్వాత వారు శ్రీవిల్లిపుత్తూర్కి వెళ్లి ఆండాళ్ రంగమన్నార్ ఎంపెరుమన్ లకి తమ మంగళాశాసనాము సమర్పింస్తారు. ఒక సోదరుడిలా ఉడయవర్లు తన కోరికను నెరవేర్చినందుకు సంతోషించి వారిని”నం కోయిల్ అణ్ణర్” (శ్రీరంగం నుండి వచ్చిన నా అన్న) అని పిలుస్తుంది. ఆ తర్వాత వారు ఆళ్వార్తిరునగరికి వెళ్లి ఆళ్వార్కి మరియు ఆదినాతర్లకి తమ మంగళాశాసనాలు సమర్పించుకొని తిరిగి శ్రీరంగానికి వచ్చి  మన సంప్రదాయ పోషణ శ్రీరంగం నుండి కొనసాగిస్తారు.

వారి శిష్యులు

వారికి ఉన్న అనేక శిష్యులతో పాటు 74 సింహాసనాధిపతులను కూడా వారు స్థాపించారు (సంప్రదాయానికి నాయకత్వం వహించి అందరికీ ఉపదేశాలు ఇచ్చే ఆచార్యులు). వారి కాలంలో, అనేక శ్రీవైష్ణవులు వివిధ కైంకర్యాలలో నిమగ్నమై ఉండేవారు:
  • కూరత్తాళ్వాన్, ముదలియాండాన్, నడాదూర్ ఆళ్వన్, భట్టర్ మొదలైనవారు వారికి శ్రీభాష్య ప్రచారములో సహకరించేవారు. 
  • అరుళాళ ప్పెరుమాళ్ ఎంపెరుమానార్ ఎంపెరుమానార్ల పెరుమాళ్ళకి తిరువారాధనము చేసేవారు. 
  • కిడంబి ప్పెరుమాళ్ మరియు కిడంబి ఆచ్చాన్ తిరుమడప్పళ్ళిని (వంట గది) చూసుకునేవారు. 
  • ఉడయర్ల కోసము తైల తయారీ వడుగ నంబి చూసుకునేవారు. 
  • గోమడత్తాళ్వాన్ ఉడయర్ల పాత్రలు, పాదులను ఎత్తుకెళ్లేవారు. 
  • పిళ్ళై ఉఱంగా విల్లి దాసర్ కరువూలం (ఆభరణాలు మొదలైనవి) చూసుకునేవారు.
  • అమ్మంగి పాలు తయారు చేస్తే ఉక్కలాళ్వాన్ ప్రసాదము పంచిపెట్టేవారు. 
  • ఉక్కలమ్మాళ్ తిరువాలవట్ట (వింజామర) కైంకర్యము చేసేవారు. 
  • మారుతి ప్పెరియాణ్డాన్ ఉడయర్లు ఉపయోగించే చిన్న చిన్న పాత్రలను ఎత్తుకునేవారు.
  • మారుతి చ్చిఱియాణ్డాన్ మఠము కోసము సరుకులు చూసుకునేవారు. 
  • తూయ ముని వేళం పవిత్ర జలాలు తెచ్చేవారు. 
  • తిరువరంగమాళిగైయార్ శ్రీ బండారం చూసుకునేవారు. 
  • వండర్ మరియు సెండర్ (పిళ్ళై ఉఱంగా విల్లి దాసర్ల అల్లుళ్ళు) రాజు వద్ద ఉద్యోగము చేసి ఆ పెద్ద మొత్తాన్ని మఠంలో ఇచ్చేవారు. 
  • ఇరామానుశవేళైక్కారర్ ఉడయవర్లకి అంగ రక్షకుడిగా ఉండేవారు. 
  • అగళంగ నాట్టాళ్వాన్ ఇతర సిద్దాంతపు పండితులతో చర్చలలో పల్గొనేవారు.

వారి కీర్తిని వెల్లడిచేసినవారు

ఉడయవర్ల గొప్పతనాన్ని పెరియ పెరుమాళ్, తిరువేంకటముడైయాన్, పేరరుళాళన్, తిరునారాయణ ప్పెరుమాళ్, ఆళగర్, తిరుక్కుఱుంగుడి నంబి, నమ్మాళ్వార్, శ్రీమన్ నాథమునిగళ్, ఆళవందార్, పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్, ఆళ్వార్ తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, వారి అనేక శిష్యులు, బ్రహ్మ రాక్షసి మరియు మూగ వ్యక్తి అందరూ కొనియాడారు. సంక్షేపముగా చూద్దాము.
  • పెరియ పెరుమాళ్ళు ఉడయవర్లకి ఉభయ విభూతులను అనుగ్రహించి వారి అనుచరులకు విరివిగా పంచమని అనుమతించారు. 
  • పెరియ పెరుమాళ్ళు ఉడయవర్లకి అనుగ్రహించిన బిరుదుని పునః దృవీకరిస్తూ  తిరువేంకటముడైయాన్ (తిరుమల తిరుపతి) వారిని “ఉడయవర్” అని స్థాపించారు. వారు ఉడయవర్లకి మాట ఇచ్చినందుకు తుంబైయూ క్కొండి అనే పెరుగు అమ్మే స్త్రీకి మోక్షాన్ని అనుగ్రహించారు. 
  • పేరరుళాళన్ (కాంచీపురం) యజ్ఞమూర్తుల చర్చలో ఓడించేందుకు ఉడయవర్లకి సహాయం చేస్తారు. యాదవ ప్రకాశులకు సమాశ్రయణం చేసి తమ శిష్యులుగా స్వీకరించమని ఆదేశిస్తారు. 
  • తిరునారాయణన్ (మేల్కోటె) ఉడైయవర్లచే ఆ దివ్య క్షేత్రాన్ని పునః నిర్మితం చేయించి, సెల్వ పిళ్ళైని (ఉత్సవర్లు) ఎత్తుకొని ఆలింగనం చేయించుకొని ఉడైయవర్లకి ప్రియ పుత్రుడైనారు.
  • యవర్ల గొప్పతనాన్ని అళగర్ (తిరుమాలిరుంజోలై) రెండు సంఘటనలలో తెలిపారు – ఉయవర్ల ఆచార్య పరంపరలో వస్తున్నారని పెరియ నంబి వారసులను ఉడైయవర్ల శిష్యుల బృందంలో చేరమని ఆదేశించడం, ఉడైయవర్లకి శరణాగతులైన వారు ఎన్నడూ అనాధులు కారు అని కిడంబి ఆచ్చాన్ కి తెలుపుతారు.
  • తిరుక్కుఱుంగుడి నంబి ఉడైయవర్లని తమ ఆచార్యులుగా స్వీకరించి, శ్రీవైష్ణవ నంబిగా ప్రసిద్ధికెక్కారు
  • నమ్మాళ్వార్లు ఈ ప్రపంచంలో బాధపడుతున్న ఆత్మల గురించి చింతించారు, కానీ తర్వాత ఎంపెరుమానార్లు అవతరించబోతున్నారని చూసి సంతోషంగా “పొలిగ! పోలిగ! పోలిగ!” అని పాడారు.
  • శ్రీమన్ నాథమునులు ఇలా అన్నారు – “మనం బోధిస్తే కొద్దిమంది ఆత్మలకు మాత్రమే సహాయపడతాము, కానీ శ్రీరామానుజులు బోధించినట్లయితే, అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, వీర నారాయణపురం సరస్సు పట్టణంలోని అందరికీ ఉపయోగకరంగా ఉన్నట్లు”.
  • ఆళవందార్లు ఉడయవర్లని “ఆం ముదల్వన్ము”(మన సంప్రదాయానికి తగిన నాయకుడు) అని కీర్తించారు.
  • పెరియ నంబి శ్రీరామానుజుల మధ్య ఆచార్య శిష్యుల సంబంధం ఉన్నప్పటికీ వారి గొప్పతనాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు నమస్కారం చేశారు.
  • తిరుక్కోష్టియూర్ నంబి ఉడయవర్లకి “ఎంపెరుమానార్” (ఎంపెరుమాన్ కంటే గొప్పైనవాడు) అనే బిరుదును ప్రదానం చేశారు.
  • తిరుమలై ఆండాన్ కి  ఉడయవర్లతో కొన్ని విభేదాలు ఉండేవి. వారు ఉడయవర్ల గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత, వారిని గొప్పగా కొనియాడి తన కుమారుడిని ఉడయవర్ల శిష్యుడిగా మారమని ఆదేశించారు.
  • తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్ “ఆచార్య అభిమానం” అనే అతి గోప్యమైన బోధనలను ఉడయవర్లకి వివరిస్తారు, వారి కుమారుడిని ఉడయవర్ల శిష్యుడిగా మారమని ఆదేశించారు.
  • ఉడయవర్ల శిష్యులు వారి దివ్య తిరువడి యందు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి, వారినే ఉపాయము మరియు ఉపేయముగా భావించారు.
  • అముదనార్లు ఇరామానుశ నూఱ్ఱందాది రచించారు. క్రమేణా ఈ ప్రబందము నాలాయిర దివ్య ప్రబంధంలో భాగమైంది.
  • బ్రహ్మ రాక్షసుడు (స్థానిక రాజు యొక్క కుమార్తెని ఆవహించిన రాక్షసుడు) యాదవ ప్రకాశులను కాదని శ్రీ రామానుజులను నిత్యసూరులకు నాయకుడని కీర్తించాడు.
  • యవర్ల అనుగ్రహముతో ఒక మూగ వ్యక్తి కొన్ని సంవత్సరాలు అదృశ్యమయ్యాడు, మళ్లీ కనిపించి “ఉయవర్లు మరెవరో కాదు, విశ్వేశ్వరుడు” అని తెలిపి మళ్లీ అదృశ్యమవుతాడు.
  • ఈ విధంగా అనేక మంది ఉయవర్ల గొప్పతనాన్ని చాటారు. శ్రీమన్ నాథమునుల నుండి మొదలు పెట్టి అనేక ఆచార్యులు ఉండగా, ఉయవర్లకి ప్రత్యేక గొప్పతనం ఎందుకు అంటే? ఇది దేని వలన అంటే –భగవానుడు అనేక అవతారాలు ధరించినా, గీతను బోధించడం, శరణగతులకు ఆశ్రయం మొదలైన విశేష లీలల కారణంగా. శ్రీ రాముడు మరియు శ్రీ కృష్ణుడు విశేషంగా కీర్తింపబడ్డారు.
  • అనేక దివ్యదేశాలు ఉన్నప్పటికీ, కోయిల్ (శ్రీరంగం), తిరుమల (తిరుపతి), పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం) మరియు తిరునారాయణపురం వంటి క్షేత్రాలకు ఆచార్యుల ప్రత్యేక సంబంధము ఉన్న కారణంగా వారిని విశేషంగా కీర్తించారు.
  • ఎంతో మంది ఋషులు ఉన్నప్పటికీ, వేద వ్యాస భగవాన్, పరాశర భగవాన్, శౌనక భగవాన్, సుఖ భగవాన్, నారద భగవాన్ మొదలగు వారు వేదం, వేదాంతం, పురాణ మరియు ఇతిహాసంలో వారి సహకారం కారణంగా వారిని విశేషంగా కీర్తించారు.
  • అనేక మంది ఆళ్వార్లు ఉన్నప్పటికీ, వాస్థవాలు, సిద్ధాంతాలు మొదలైన వాటిని స్పష్టంగా వెల్లడిచేసినందుకు నమ్మాళ్వార్లని వవిశేషంగా కీర్తించారు.
  • అదేవిధంగా, ఉడయవర్లు ఈ అంశాలన్నింటిలో ముఖ్యమైన సహకారం అందించి మన సిద్ధాంతం మరియు సంప్రదాయానికి బలమైన రహదారి వేసి మన సంప్రదాయానికి విశేషంగా పోషణ అందించారు.

వారి చివరి రోజులు

ఉడయవర్ల శిష్యులందరూ వారి ఆచార్య నిష్ఠ కారణంగా, ఎంపెరుమానార్లు నమ్మాళ్వార్ల తిరువడి కావడం చేత, నమ్మాళ్వార్లు స్వయంగా తమ తిరువాయ్మొళి “పొలిగ పొలిగ పొలిగ” పదిగములో ఎంపెరుమానార్ల అవతార కాలజ్ఞానము చేసినందున ఎంపెరుమానార్ల దివ్య చరణాలకు సంపూర్ణ శరణాగతులై ఉండేవారు. అలాగే, ఆళ్వార్ల తిరువాయ్మొళి ఆధారంగా మన సంప్రదాయాన్ని స్థాపించినందున, ఉడయవర్లను నమ్మాళ్వార్ల విశేష శిష్యుడిగా కీర్తించారు. వారిని ఆళవందార్ల  ప్రియ శిష్యుడిగా కూడా భావిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు కలుసుకోక పోయినప్పటికీ వారు ఆళవందార్ల  దివ్య హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వారి కోరికలను నెరవేర్చారు.

శ్రీ రామాయణం, విభీషణ శరణాగతి ఘట్టం ద్వారా శరణాగతి సూత్రాన్ని ఉడయవర్లు వివరిస్తున్నప్పుడు, పిళ్ళై ఉఱంగా విల్లి దాసర్ కలవరపడ్డారు. ఉడయవర్లు గమనించి, దాసర్ని కారణమేమిటో అడిగారు. దాసర్లు, ” తన సమస్థం విడిచిపెట్టి శ్రీరాముడికి శరణాగతి చేయాలని వచ్చిన విభీషణుడితో అంత నిరీక్షణ చేయిస్తే, మన స్థితి ఏమిటి? మనకి మోక్షం లభిస్తుందా?” అని అడిగారు. ఉడయవర్ల “నా తనయా విను! నాకు మోక్షం లభిస్తే నీకు మోక్షం లభిస్తుంది; పెరియ నంబి లభిస్తే నాకు లభిస్తుంది; ఆళవందార్లు పొందితే, పెరియ నంబి పొందుతారు, అలా నమ్మాళ్వార్ల వరకు ఇది వర్తిస్తుంది. నమ్మాళ్వార్లు తమకి ముక్తి లభించిందని అప్పుడే తమ తిరువాయ్మొళిలో చాటారు; కాబట్టి నీకు ఖచ్చితంగా మోక్షము లభిస్తుంది ” అని చెప్పి దాసర్లని ఓదార్చారు.

మనకి మోక్ష సాధనము ఎంపెరుమానార్లని, వారిని వారి భక్తులని సేవించుటయే మన లక్ష్యమని రామానుశ నూఱ్ఱందాది దివ్య ప్రబంధంలో అముదనార్లు స్థాపించారు.

భవిష్యత్తులో అందరు కొలిచి పూజించేలా ఎంపెరుమానార్ల అర్చా మూర్తిని చేసి, వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్లో ప్రతిష్టించడానికి తనకి అనుమతి ఇవ్వమని ముదలియాండాన్ ఎంపెరుమానార్ల కోరుతారు. ఎంపెరుమానార్ల ఆదేశాల మేరకు ఒక అందమైన అర్చా మూర్తిని ఒక భక్తుడైన శిల్పి తయారు చేస్తాడు.  ఎంపెరుమానార్లు సంతృప్తి పడేల శ్రీరంగంలో తయారు చేయబడిన ఆ అర్చా మూర్తిని వారు ఆలింగనము చేసుకొని శ్రీపెరుంబుదూర్కి పంపి గురు పుష్యమి నాడు (తై పూసం) అక్కడ ప్రతిష్ఠాపన చేయిస్తారు.

ఈ విధంగా ఉడయవర్లు 120 సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారు ఇక ఈ భౌతిక జగతిని వీడి, నిత్యసూరులతో ఆధ్యాత్మిక లోకానికి చేరుకోవాలనే తపనను అనుభవిస్తుంటారు. వారు గద్య త్రయం పఠించి పెరియ పిరాట్టి ద్వారా పెరియ పెరుమాళ్ళని ఆశ్రయించి తనని వెంటనే ఈ భౌతిక కంకెళ్ళ నుండి విడుదల చేయమని పెరియ పెరుమాళ్ళని ప్రార్థింస్తారు. ఆ రోజు నుండి 7 రోజున ఎంపెరుమానార్లను విముక్తులను చేయాలని పెరియ పెరుమాళ్ళు నిర్ణయించుకొని ఆ విషయాన్ని వారికి తెలియజేస్తారు. అప్పుడు ఎంపెరుమానార్ల “నాతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న వారందరూ నాలాగే అదే ఫలము పొందాలి” అని పెరుమాళ్ళని ప్రార్థించగా ఆతడు సంతోషంగా అంగీకరిస్తాడు. పెరియ పెరుమాళ్ళకి వీడ్కోలు పలికి ఉడయవర్లు గంభీరముగా బయటకు వచ్చి తమ మఠానికి చేరుకుంటారు. తరువాత 3 రోజులు వారు తమ శిష్యులకు అద్భుతమైన ఉపదేశార్థాలను కురిపిస్తుంటారు. శిష్యులందరూ “ఆచార్యులు అకస్మాత్తుగా ఎందుకు ఇన్ని  అద్భుతమైన ఉపదేశార్థాలను మనకి బోధిస్తున్నారు?” అని ఆశ్చర్యపోతారు. ఇక వారితో విషయాన్ని దాచలేక ఎంపెరుమానార్లు – “నేను ఈ రోజు నుండి మొదలు నాలుగవ రోజున పరమపదానికి అధిరోహించాలనుకుంటున్నాను, పెరుమాళ్ళు కూడా అందుకు సమ్మతించారు” అని దయతో వెల్లడి చేశారు. అది విన్న శిష్యుల గుండెలు పగిలి, ఉడయవర్లు వారిని విడిచిపెట్టిన వెంటనే వారందరూ తమ ప్రాణ త్యాగము చేస్తామని అంటారు. అది విన్న ఉడయవర్లు “మీరు అలా చేస్తే, మీరు నా సంబంధులు కారని భావిస్తాను, కాబట్టి మీరు అలా చేయవద్దు ” అని వారిని ఓదార్చారు.

అనంతరం ఎంపెరుమానార్లు అందరికీ విలువైన ఉపదేశాలను ఇస్తూనే ఉన్నారు, తన శిష్యులకు వివిధ బాధ్యతలను అప్పగిస్తారు. కూరతాళ్వాన్ల ప్రియమైన కుమారుడైన పరాశర భట్టర్ పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావముతో ఉండాలని వారు ఆదేశిస్తారు. తాను ఎవరిపట్లైనా అమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమాపణ కోరి మళ్లీ తమ తుది ఉపదేశాలను అనుగ్రహిస్తారు.  వారు ప్రధానంగా, అందరూ ప్రతి ఒక్కరి గుణాలను ప్రశంసిస్తూ సహోదరుల వలె సహరిస్తూ  పనిచేయాలని అందరినీ సూచిస్తారు. ప్రతి ఒక్కరూ ఫలమాశించకుండా కైంకర్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తారు. శ్రీవైష్ణవులను ఎప్పుడూ ద్వేషించకపోవడం, లౌకిక వ్యక్తులను కీర్తించకపోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా వారు నొక్కి చెబుతారు.

తర్వాత వారు భట్టర్ని పెరియ పెరుమాళ్ళ సన్నిధికి తీసుకువచ్చి, అతని తీర్థ గౌరవాలను స్వీకరించిన తరువాత ఇకపై సంప్రదాయానికి భట్టర్ నాయకత్వం వహిస్తారని ప్రకటిస్తారు. ఎంపెరుమానార్లు భట్టర్ని మేల్కోటెకి వెళ్లి వేదాంతిని (భవిష్యత్తులో వారిని నంజీయర్ అని పిలువబడతారు) సంస్కరించమని ఆదేశిస్తారు. ఎంబార్ వరిష్ఠ ఆచార్యులైనందున వారున్నంత కాలము తమ శిష్యుడైన భట్టర్కి మార్గనిర్దేశం చేస్తారు. పరమపదాన్ని అధిరోహించే రోజున, వారు తమ నిత్య అనుష్టాన క్రమాలు –  స్నానము చేయడం, 12 పుండ్రాములు (తిలకం) ధరించడం, సంద్యావందనం మొదలైనవి చేసి, గురుపరంపరను ధ్యానిస్తూ, పద్మాసనములో కూర్చుని తమ తిరువాధన పెరుమాళ్ళకి తిరువారాధన చేసి, పరవాససుదేవునిని తమ మనస్సులో ఉంచుకొని, ఆళవందార్ల దివ్య స్వరూపాన్ని ధ్యానిస్తూ, తమ విశాల నేత్రాలను తెరిచి, తమ శిరస్సుని ఎంబార్ ఒడిలో ఉంచి, తమ దివ్య పాదాలను వడుగ నంబి ఒడిలో ఉంచి, దివ్య తేజముతో ఆదిశేషుని రూపములో పరమపదానికి అధిరోహిస్తారు. అది వీక్షించిన వారి శిష్యులందరూ వేరు లేని చెట్టులా నేల మీద పడి వారి హృదయం పగిలేలా విలపిస్తారు. కొంతసేపు తర్వాత వారు తమను తాము ఓదార్చుకుంటారు. పెరియ పెరుమాళ్ళు తనకి కలిగిన నష్టాన్ని గ్రహించి నిరాశకు గురై తాంబూలము తీసుకోకుండ నిరాకరిస్తారు. అప్పుడు వారు తమ సామాగ్రిని ఉత్తమ నంబి ద్వారా పంపుతారు. మఠంలో, ఎంపెరుమానార్ల విమల చరమ తిరుమేనికి స్నానము గావించి, 12 పుండ్రాలను ధరింపజేసి ధూప దీప ఉపచారములు అందిస్తారు. పిళ్ళాన్ వారి అభిమన పుత్రుడు అయినందున ఎంపెరుమానార్ల పవిత్ర చరమ కైంకర్య ఉపచారాలను వారు నిర్వహిస్తారు. శ్రీరంగంలోని శ్రీవైష్ణవులు ఉపనిషత్తులు, దివ్య ప్రబంధ సేవాకలములు గొప్ప ఆర్భాటంగా ఏర్పాటు చేస్తారు. వారుని తీసుకువెళ్లే వీధులలో బాజా బజంత్రీలు, మేళ తాళాలు, అరైయర్ల సేవ, స్తోత్ర పఠనము, పుష్పాలు, బియ్యంతో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తారు. పెరియ పెరుమాళ్ళ ఆదేశాల మేరకు, నంపెరుమాళ్ళ వసంత మండపం క్రింద త్రవ్వి యతి సంస్కార విధి ప్రకారం ఎంపెరుమానార్లని భూమిలో ఉంచుతారు. అనంతరం, పెరియ పెరుమాళ్ళ ఆదేశాల మేరకు వారి దివ్య చరమ తిరుమేనిని ఉంచిన మండపము పైన ముదలియాండాన్లు ఎంపెరుమానార్ల ఒక ప్రత్యేక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు .

క్రమంగా, ఎంపెరుమానార్లు పరమదానికి చేరుకున్నారన్న వార్త అనేక శ్రీవైష్ణవుల వరకు చేరుకుంటుంది. వారు తీవ్ర వేదనకు గురౌతారు. వారి నుండి వీడినందుకు విరహాన్ని భరించలేక కొందరు తక్షణమే తమ జీవితాన్ని త్యాగము చేస్తారు. శ్రీరంగం చేరుకున్నవారు భట్టర్ని తమ ఎదుట చూసి తమను తాము ఓదార్చుకొని సంతోషిస్తారు.

ఈ విధంగా ఎంపెరుమానార్లు ప్రతి ఒక్కరి అభ్యున్నతి కొరకై పరిపూర్ణ జీవితాన్ని గడిపారు. పెరుమాళ్ళ మహిమలను వివరించవచ్చు కానీ ఎంపెరుమానార్ల మహిమలను ఎవరూ వివరించలేరు. ఎంపెరుమానార్ల సహస్రాబ్ధి (1000 వ సంవత్సర వేడుకలు) వరకు, మనము వారి జీవితం మహిమలను ఆస్వాదించాము. ఆ అనుభవం మన హృదయంలో శాశ్వతంగా ఉంచుకొని మన ఆళ్వార్లు మరియు ఆచార్యుల ఆకాంక్షలకు తగినట్లుగా నిజమైన రామనుజ దాసులుగా జీవిద్దాము.

శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వనః |
కంతిమద్యాం ప్రసూదాయ యతిరాజాయ మంగళం ||

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్య మంగళం ||

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

గమనిక :  https://granthams.koyil.org/2017/04/sri-ramanuja-vaibhavam/

మూలము : https://granthams.koyil.org

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment