అంతిమోపాయ నిష్ఠ – 18

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవర మునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ముగింపు – ఆచార్య నిష్ఠ మహిమలు

మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/09/27/anthimopaya-nishtai-17/), మనము ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యుల మాటలలో శ్రీవైష్ణవుల మహిమలను గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై ఎనలేని దయను చూపుటను గమనించితిమి. ఇప్పుడు, మనము ఈ దివ్య గ్రంధము యొక్క ముగింపు భాగమును దర్శించెదము.

ఈ విధముగా, “స్తావరాణ్యాపి ముచ్యంతే” (వైష్ణవ స్పర్శచే మొక్కలు కూడ ముక్తి పొందును), “పశుర్ మనుష్యః పక్షివా (జంతువులు, మనుష్యులు, పక్షులు అన్నియును వైష్ణవ సంబంధముచే ముక్తి నొందును) అని తెలిపిన ప్రకారము, ఈ జగత్తునంతయు ఉద్ధరించు మిక్కిలి దయా స్వరూపులైన తమ ఆచార్యులను మన పూర్వాచార్యులు శరణు చేసిరి. మన పూర్వాచార్యులు సర్వఙ్జులు, పండితులలో వారు అగ్రగణ్యులు, విషయ సారాంశమునకు, అన్య ఇతర విషయముల మధ్య గల అంతరమును గుర్తించ గలవారు, తమ అన్ని బాధ్యతలను పూర్తి చేసిన వారు (సదాచార్యుల ఆశ్రయమును పొందినవారు), సదా మంగళాశాసనముపై దృష్టి కలవారు (భగవత్ భాగవతుల శ్రేయస్సుకై ప్రార్ధించుట). ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళిలో “నానుమ్ పిఱన్దమై పొయ్యన్ఱే” అని తెలిపిన విధముగా (నాచ్చియార్ తిరుమొళి 10.4 – ఎంపెరుమాన్ వచ్చి నాకు దర్శనమివ్వనిచో, నేను పెరియాళ్వార్ పుత్రికనగుట వ్యర్థము), “వల్లపరిశు వరువిప్పరేల్ అదు కాణ్డుమే (నాచ్చియార్ తిరుమొళి 10.10 – ఎంపెరుమాన్ వచ్చునట్లు పెరియాళ్వార్ చేసిన, నేను వారిని దర్శించెదను), సదా ఎంపెరుమాన్ ను కీర్తించు శ్రీవైష్ణవులను ఆశ్రయించు సుగమమైన మార్గమును వారు అభ్యసించిరి. తదుపరి, నిస్సంశయమైన సంపూర్ణ జ్ఞానముతో, అట్టి ఆచార్యులే ఆరాధనకు / సేవకు అర్హులని, వారికి బరువు బాధ్యతలు ఉండవని, మండు వేసవిలో కూడ చల్లని గాలిలో విశ్రమించు వంటి వారని, వారిపై దృష్టి నిలిపెదరు. వారు అంతిమ లక్ష్యముపై ఆందోళనను వీడి “శిర్ట్రవేణ్డా” (తిరువాయ్మొళి 9.1.7 – ఆందోళన లేకుండుట), గురుపరంపరను పాటిస్తూ తేవు మత్తఱియేన్ (కణ్ణినుణ్ శిఱుత్తాంబు 2 – నేను నమ్మాళ్వార్ ను తప్ప అన్య దైవము నెఱుంగను). ఇట్టి ఉదాతమైన గుణములను క్రింద గమనించగలము:

  • పెరియాళ్వార్ల దివ్య సుపుత్రి ఆండాళ్ తన తండ్రి / ఆచార్యుని పై

  • నమ్మాళ్వార్ల పాద పద్మముల యందు మధురకవి ఆళ్వార్

  • నాధమునుల పాద పద్మముల యందు కురుగై కావలప్పన్

  • ఆళవందార్ పాద పద్మముల యందు దెయ్వవారియాండన్

  • ఎంపెరుమానార్ పాద పద్మముల యందు వడుగ నంబి

  • నంపిళ్ళై పాదపద్మములపై పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీరంగములో నంపిళ్ళై పాదపద్మముల యందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్
  • వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యుల పాద పద్మముల యందు కూరకులోత్తమ దాసర్

  • తిరువాయ్మొళి పిళ్ళై, మణల్పాక్కత్తు నంబి పాద పద్మములపై మన జీయర్ (మాముణులు)

శ్రీరామానుజ (ఆళ్వార్ తిరునగరి), తిరువాయ్ మొళి పిళ్ళై (కొంతగై), మాముణులు (ఆళ్వార్ తిరునగరి)

ఇట్టి ఉదాత్త మనస్కులు ఇంకను అనేకులు మన పూర్వాచార్యులను ఆశ్రయించిరని గమనించగలము.

గొప్ప ఆచార్య నిష్ఠ గల ఇట్టి పెక్కు శ్రీవైష్ణవులు మన జీయర్ (మాముణులు) పాద పద్మముల వద్ద నున్నారు. నేటికి (పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ గారి కాలము), పరిపూర్ణ యోగ్యులైన ఆచార్య, శిష్య సంబంధము ఉన్నచోట దీనిని మనము గమనించవచ్చును. భవిష్యత్తులో కూడ, ఎక్కడ రామానుజ సిద్ధాంతము వికసించునో, అచ్చట సదా యోగ్యులను చూడగలము. దీనినే “కలియుమ్ కెడుమ్ కాండు కొణ్మిన్” (కలియుగములోని దుష్పరిణామములు నశించును) లో తెలిపిరి. అట్టి యోగ్యులైన వారు యధాలాపముగా మాటలాడినాను, అవి మిక్కిలి పవిత్రమగును. వారి దివ్య వాక్కులు వేదాంత సారమైన తిరుమంత్రార్ధమును బోధించును.

వేద శాస్త్రారూఢాః జ్ఞానఖడ్గతరాద్విజాః
క్రీడార్ధమపి యద్ బ్రూయుస్స దర్మః పరమో మతః

సాధారణ అనువాదము: వేద గ్రంథములలోని సూత్రముల యందు నమ్మకము కలవారు, ఆ జ్ఞానమునందించు ద్విజులైన వారు, మాటవరసకు పలికినను, అది న్యాయము మరియు మహత్తును పొందును.

అదిగంతవ్యాస్సన్తో యద్యపి కుర్వంతి నైకముపదేశమ్
యస్తేశామ్ స్వైరకతాస్తా ఏవ భవంతి శాస్త్రార్ధాః

సాధారణ అనువాదము : ఉదాత్త పురుషుల బోధనలే కాక, వారి చర్యలను కూడ నిశితముగా పరిశీలించ వలెను. (కారణము) ఆ గ్రంథముల యధార్ధ తాత్పర్యమే వారి వ్యక్తిగత క్రమ శిక్షణకు రూపమగును.

జ్ఞాన సారము 40

అల్లి మలర్ పావైకు అన్బర్ అడిక్కు అన్బర్
సొల్లుమ్ అవిడు సురుదియాం
నల్ల పడియామ్ మను నూఱ్కవర్ సరిదై
పార్వై శెడియార్ వినై తొగైక్కుత్ తీ

సాధారణ అనువాదము : శ్రీయః పతి పాద పద్మములను ఎవరు ఆశ్రయించెదరో, వారి మాటలు వేదముతో సమానము, మను స్మృతికి వారి జీవితము మూలాధారము, వారి దృష్టే సర్వ పాపహరణము.

తదుక్తి మంత్రం మంత్రాగ్ర్యము

సాధారణ అనువాదము : వారి మాటలే ఉత్తమ మంత్రములు

అట్టి భక్తులు పొరపాటున కూడ వ్యర్థమైన మాటలు పలుకరని ప్రతీతి, వారి దివ్య పలుకులు వేదసారమైన తిరుమంత్రార్ధమును ప్రతిబింబించును.

అన్ని ప్రమాణముల ముఖ్య సూత్రములు తిరుమంత్రములో కలవని, దానిని తెలుసుకొనవలెనని, ఈ క్రింది శ్లోకములో తెలిపిరి.

రుచో యజుంషి సామాని తతైవతర్వణాని చ
సర్వమష్టాక్షరాన్తస్తమ్ యచ్చాన్యదపి వాజ్ఞమయం

సాధారణ అనువాదము: ఈ అష్టాక్షరీ మంత్రములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదముల, వేదాంతము, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు, మొ || వానిలోని అర్ధములు ఇమిడి వున్నవి.

ఇట్టి మహిమాన్వితమైన తిరుమంత్రము 3 ప్రధాన లక్షణములను 3 పదముల ద్వారా వివరించుచున్నది – ఓం (శేషత్వము – శిష్యత్వము), నమః (పరాంతరీయము – పరిపూర్ణ ఆశ్రయము), నారాయణాయ (కైంకర్యము – భగవానుని మాత్రమే పరవశింపజేయు నిరంతర సేవ). ఈ సూత్రములు భగవానునికి పాక్షికముగాను మరియు భాగవతులకు సంపూర్ణముగాను వర్తించును. ఈ కారణముచే, మన పూర్వాచార్యులు, ప్రధాన సూత్రముల సారమును సంగ్రహించి, వానిని సంస్కృత, ద్రావిడ, మణిప్రవాళ భాషలలో సమముగా (ఏకగ్రీవముగా) వివరించిరి. ఒక శిష్యుడు నిరంతర సాధన చేయుచు ఆచార్య అభిమానమే (ఆచార్యుని దయ / ఆదరణ) అంతిమ నిష్ఠగా కలిగి ఉండవలెను. ఆచార్యుని తన గురువుగాను, శరణ్యుడుగాను ఆనంద హేతువుగాను, అన్ని విధముల బాంధవ్యమును కలిగి ఉండునటుల భావించవలెను.
ఆళవందార్ స్తోత్రరత్నము – 5 – మాతా పితా యువతయాః – మనకు నమ్మాళ్వారే తల్లి, తండ్రి, పత్ని, సంతానము మొ || కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 4 : అన్నైయామ్, అత్తనాయ్ – నమ్మాళ్వారే నాకు తల్లి, తండ్రి. మాముణుల ఆర్తి ప్రబంధము – 3: తందై నఱ్ఱాయ్ తారం తనయర్ పెరున్జెల్వం ఎన్ఱనక్కు నీయే యతిరాజా – ఓ యతిరాజా నీవే నాకు తండ్రివి, తల్లివి, పత్నివి, సంపదవు మొ || నవి

  • కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు 1: త్తెన్గురు గూర్, నంబి యెన్ఱక్కాల్, అణ్ణిక్కుం అముదూఱుం, ఎన్నావుక్కే – మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల దివ్య నామములను పలికినంతనే నా నాలుకపై అమృతమైన రుచి కలుగును.
  • కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు  2 – నావినాల్ నవిత్తు, ఇన్బమెయ్ దినేన్ – నమ్మాళ్వార్ల నామమును / కీర్తిని పలికినంతనే, నేను అత్యంత పరవశత్వమును పొందుదును.
  • రామానుజ నూఱ్ఱందాది 102 – ఎన్నా విరున్దెమ్ ఇరామానుశన్ ఎన్ఱజైక్కుమ్ – నీతో నాకు గల నిర్హేతుకమైన దివ్య బాంధవ్యమును, నీ దివ్య నామములను నా నాలుక సదా ఉచ్ఛరించును.
  • రామానుజ నూఱ్ఱందాది 1 – ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వళ నెన్జే శొల్లువోమ్ అవన్ నామఙ్గ్ ళే – ప్రియ మనసా! శ్రీరామానుజుని పాదపద్మముల వద్ద జీవితాంతము కొనసాగుటకై, వారి అనేక దివ్య నామములను పారాయణము చేయుదుము.
  • రామానుజ నూఱ్ఱందాది తనియన్ – ఉన్నామ మెల్లామ్ ఎన్ఱన్ నావినుళ్ళే అల్లుమ్ పకలు మమరుమ్పడి నల్ కు అఱుశమయ వెల్లుమ్ పరమ ఇరామానుశ – ఓ రామానుజ, అప్రమాణమైన ఆరు మతాలను ఖండించి, గెలుపు నొంది మరియు వేదాంత సూత్రములను నెలకొల్పితివి! నీ దివ్య నామములు నా నాలుకపై సదా ఉండున్నట్లు చేయుట కూడ నీదే బాధ్యత.
  • గురోవార్తశ్చ కథయేత్ – గురోర్నామ శబ్ధ జపేత్ – సదా ఆచార్యుని మాటలను / ఆదేశములను గురించి చర్చించుము, ఆచార్యుని నామములను సదా జపించుము.

సరియైన ఆచార్యునితో కల అట్టి బాంధవ్యముచే, శిష్యుడు ఈ క్రింది తీరునవలంబించ వలెను:

  • ఆచార్యునితో ప్రధమముగా చేసిన శరణాగతిపై నిరంతర ధ్యానము మరియు “నమః” అను మంత్రము కలిగి ఉండవలెను (అనువాదకుని గమనిక: జపతవ్యం గురు పరంపరాయుమ్ ధ్వయముమ్ అని పిళ్ళై లోకాచార్యులు తెలిపిరి – ఇక్కడ ద్వయ మంత్రము కన్నా ముందు ప్రధాన మంత్రముగా అస్మద్ గురుభ్యోనమః…. శ్రీధరాయనమః : అని పఠించ వలెను)
  • ఆచార్యుని పరమ దైవముగా భావించాలని ఈ క్రింద తెలిపిరి: 
      • గురేవ పరమ బ్రహ్మ – గురువే పరమ దైవము
      • జ్ఞాన సారం 38 – తేనార్కమలత్ తిరుమామగళ్కొళునన్ తానే గురువాగి – శ్రీయఃపతియే స్వయముగా తానే ఆచార్యుడగును
      • యస్య సాక్షాత్ భగవతి జ్ఞానాధిపప్రధే గురౌ – జ్ఞానజ్యోతి ద్వారా తన శిష్యునికి వికాసము కల్పించు ఆచార్యుని భగవానునిగా భావించాలి.
      • పితాగవాడైప్పిరానార్ బిరమగురువాయ్ వందు – ప్రధమ గురువుగా వచ్చిన భగవానుడు.
  • ఆచార్యుని గృహమే అంతిమ నివాసముగా – పరమపదముగా భావించవలెను. దీనినే ఈ క్రింద పేర్కొనిరి
      • యేనైవ గురుణా యస్య న్యాసవిద్యా ప్రధీయతే; తస్య వైకుంఠదుగ్ధాబ్ది ద్వారకాశ సర్వ ఏవ స: తమ శిష్యునకు శరణాగతి అను జ్ఞానమును ప్రసాదించిన ఆచార్యుడు ఎక్కడ నివసించునో, అదియే అతనికి శ్రీవైకుంఠము, క్షీరాబ్ది మరియు భగవానుని అన్ని నివాసములు.
      • జ్ఞానసారము 36 – విల్లార్మణి కొళిక్కుం వేంగడ పొఱ్కున్ఱు ముదల్ సొల్లార్పొళిల్సూళ్తిరుప్పడి గళ్ ఎల్లాం మరుళాం ఇరుళోడ మతగతు త్తనాళ్ అరుళాలే వైత్త అవర్ – అపారమైన కరుణచే ఆచార్యుడు తన శిష్యుని అజ్ఞానమును తొలగించిన కారణముగా, నిజమైన శిష్యునికి, తన ఆచార్యునిలోనే భగవానుని అన్ని నివాసములు, తిరువేంగడము మొదలుకొని (పరమపదము, క్షీరాబ్ది మొ ||) దర్శించవలెను.
      • కణ్ణినుణ్ శిరుత్తాంబు 11 – నమ్బువార్ పది వైగున్ధమ్ కాణ్మినే – మధురకవి ఆళ్వార్ దివ్య పలుకులను విశ్వసించిన వారికి, వారు ఉన్న నివాసమే వైకుంఠము.
  • ఆచార్యుని పాదపద్మములే మూలాధారము, ఎంపెరుమానార్ ను కీర్తిస్తూ, యోనిత్య మచ్యుత… రామానుజ చరణం శరణం ప్రపద్యే శ్లోకములో తెలిపిరి – రామానుజుని పాదపద్మములే మనకు సదా శరణ్యము.
      • రామానుజ నూఱ్ఱందాది 45 – ‘పేఱొన్ఱు మత్తిల్లై నిన్ శరణన్ఱి, అప్పేఱళిత్తఱ్కు
        ఆఱొన్ఱుమిల్లై మత్ చరణన్ఱి’ – అముదనార్ ఎంపెరుమాన్ ను స్మరిస్తూ – నా జీవిత ధ్యేయము నీ శ్రీచరణాలను సేవించుట మరియు దానిని సాధించుటకు కూడ నీ శ్రీచరణములే మార్గము అనిరి.
      • ఉపాయ ఉపేయ భావేన తమేవ శరణం వ్రజేత్ – ఆచార్యుని పాదపద్మములనే ఉపాయముగా మరియు ఉపేయముగా / లక్ష్యముగా శరణాగతి చేయుట.
  • మనసా వాచా కర్మణా వారి సేవ చేయుట అంతిమ లక్ష్యముగా తెలిపిరి.
      • సుందర బాహు స్తవము 129 – రామానుజార్య వాచక : పరివర్తిష్య – శ్రీరంగములో తమ ఆచార్యుని సేవించుటకై, వారితో తమను తిరిగి కలుపుమని సుందరబాహు పెరుమాళ్ ను అభ్యర్థించిన ఆళ్వాన్
      • యతిరాజ వింశతి 4 – నిత్యం యతీంద్ర తవ దివ్యవపు స్మృతౌ మే, సక్తం మనో భవతు వాక్ గుణ కీర్తనేసౌ, కృత్యం చ దాస్య కరణే తు కరద్వయస్య, వృత్త్యంతరేస్తు విముఖం కరణత్రయం చ – శ్రీరామానుజునితో మామునిగళ్ – ఓ యతీంద్రా! నా మనస్సు నీ దివ్య రూపాన్ని స్మరించుటలో ఆసక్తమై ఉండుగాక! నా వాక్కు నీ కల్యాణ గుణములను పాడటములో లగ్నమై ఉండుగాక: నా కరములు నీ కైంకర్యము చేయు గాక: ఈ మూడును ఇతర ప్రవృత్తులు లేనివగును గాక.
      • శ్రీవచన భూషణము 299 – శక్తిక్కిలక్కు ఆచార్య కైంకర్యము – ఆచార్యునికి చేయు కైంకర్యము పైననే శిష్యుడు తన శక్తి సామర్ధ్యములను నిలిపి / వినియోగించవలెను.
  • శిష్యుని కైంకర్యమును చూసిన ఆచార్యునికి కలిగిన సంతోషమే అతిపెద్ద ఫలితముగా పేర్కొనిరి: 
      • శ్రీవచనభూషణము 321 – శిష్యనెన్బత్తు సాధ్యాంతర నివృత్తియుమ్ ఫల సాధన శుశ్రూషైయుమ్ – ఆచార్యుడే అంతిమ ధ్యేయముగా మరియు ఆచార్యుని సదా ఆనందపరచు సేవయే నిజమైన శిష్యుని లక్షణముగా భావించవలెను. అట్టి అధికారులు (యోగ్యలైన శిష్యులు) ఆచార్య నిష్ఠలో నిమగ్నులై, అన్ని విషయ సుఖములు మరియు భౌతిక వాంఛలు విసర్జించవలెను. వారు ఆచార్యుని పవిత్రమైన దివ్య స్వరూపమును అనుభవింపవలెను. ” సదా పశ్యంతి… ” అను శ్లోకములో చెప్పిన విధముగా – పరమపదములో భగవానుని నిత్య దర్శనముచే జీవాత్మలు ఆనందమును అనుభవించెదరు.

ఇంకను, ” అత్ర పరత్ర చాపి ” (స్తోత్రరత్నము 2) లో తెలిపిన విధముగా, వారు తమ ఆచార్యునికి ఈ జగత్తులోను మరియు పరమపదములోను కైంకర్యము చేయుచు, పరమపదము (అపరిమిత ఆనందమునకు నెలవు) లో ఏకమనస్కులతో కలసి, అమృతతుల్యమైన ఆనంద సాగరములో మునిగి మరియు సదా మంగళాశాసనము చేయుచుందురు.

నాధముని – ఆళవందార్, కాట్టు మన్నార్ కోవెల

ఈ క్రింది దివ్య శ్రీసూక్తులను మనము అంతిమోపాయ నిష్ఠ కు ప్రమాణముగా (ప్రబల ఋజువు) సదా స్మరించగలము.

  • రామానుజ నూత్తందాది 104 – కైయిల్ కనియెన్న కణ్ణనైక్కాట్టిత్తరిలుమ్ ఉన్ తన్ మెయ్యిల్ పిఱఙియ శీరన్ఱి వేణ్డిలన్ యాన్ – నాకు మీరు కణ్ణన్ ఎంపెరుమాన్ ను (అతను సొగసుకు మరియు భక్తులకు అందుబాటులో నుండుటకు ప్రతీక) దర్శింపజేసినను, నేను మీ దివ్య తిరుమేనిని, దాని లక్షణములపై మాత్రమే దృష్టి సారించి తదితరములను విస్మరించెదను.
  • కణ్ణినుణ్ శిరుత్తాంబు 2 – నావినాల్ నవిత్తు ఇన్బ మెయ్ దినేన్ – నమ్మాళ్వార్ల మహిమలను కీర్తించి ధన్యుడనైతిని
  • నాచ్చియార్ తిరుమొళి 10.10 – నల్ల ఎన్ తోళి…. విట్టు శిత్తర్ తఙ్గళ్ తేవరై వల్లపరిశు వరువిప్పరేల్ అదు కాణ్డుమే – ఆండాళ్ పలికిరి – పెరియాళ్వార్ కణ్ణన్ ను ఆహ్వానించి, వారు దర్శనమిచ్చునట్లు చెసినచో, నేను వారిని అప్పుడు దర్శించెదను.
  • ఈ సూత్రమును పరమాచార్యులు ఆళవందార్లు నమ్మాళ్వార్లపై “మాతా పితా యువ తయా” అను శ్లోకములో వివరించిరి. నమ్మాళ్వార్ ను వైష్ణవ కులపతి (వైష్ణవులకు నాయకుడు) గా నిరూపించి, తన సర్వస్వము నమ్మాళ్వారే నని.
  • పశుర్ మానుష్య పక్షివ అను శ్లోకములో – ఒక జంతువు, మనిషి, పక్షి – పుట్టకతో సంబంధము లేకుండా (అట్టి యోగ్యత, జ్ఞాన సముపార్జనకు, శాస్త్రము లేక తత్సమానములను అభ్యసించుటకు అవసరమా), వైష్ణవునితో సంబంధము సులువుగా పరమపదమునకు చేరువ చేయును.
  • బాల మూగ జాత అంధశ్చ శ్లోకములో – బాలుడు, చెవిటి, మూగ, అంధుడు, మూర్ఖుడు, మొ || ఒక నిజమైన ఆచార్యుని శరణు పొందినచో, వారు తమ అంతిమ గమ్యమైన పరమపదమును తప్పక జేరగలరు.
  • ఆచార్యస్య ప్రసాదేనా మమ సర్వమభీష్టదం; ప్రపుణ్యామితి విశ్వాసో యస్యస్తి స సుఖీభవేత్ –
    తమ అపార కోరికలు ఆచార్యుని కరుణచే నెరవేరునని విశ్వాసము / నమ్మకము గల వారు ఆనందముగా నుందురు.
  • మాణిక్కమాలై నందు పెరియ వాచ్చన్ పిళ్ళై యొక్క దివ్య పలుకులు – ఇహ లోక పరలోకంగల్ ఇరణ్డుమ్ ఆచార్యన్ తిరువడిగళే ఎన్ఱుమ్, దృష్టా దృష్టంగళిరణ్డుమ్ అవనే ఎన్ఱుమ్ విశ్వసిత్తిరుక్కిఱతుక్కు మేలిల్లై – పరమపదము మరియు ఈ జగత్తులోనిదేదైనను ఆచార్యుని శ్రీచరణముల కన్నను అధికము కానేరదు మరియు ప్రత్యక్ష మరియు అగోచరమైన ప్రయోజనములు ఆచార్య స్వరూపములే.
  • శ్రీవచనభూషణము 322 లోని పిళ్ళై లోకాచార్యుల దివ్య శ్రీసూక్తి – మంత్రముమ్, దేవతైయుమ్, ఫలముమ్, ఫలానుబన్ధికళుమ్, ఫలసాధనముమ్, ఐహికభోగముమ్, ఎల్లాం ఆచార్యేనెన్ఱు నిన్నైక్కక్ కడవన్ – ఒక శిష్యుడు తన ఆచార్యునే మంత్రముగా తలంచి – అది వల్లించుటచే తన సంసారములోని బాధలు తొలగునని భావించవలెను.
      • పరదేవత – భగవాన్ – ఆ మంత్రము యొక్క లక్ష్యము
      • ఫలము – కైంకర్య రూపముగా ఫలితమును ఇచ్చి దీవించిన భగవానుడు
      • ఫలానుభూతి – సంపూర్ణ ఆత్మజ్ఞానము మరియు పరమపద నివాసము వంటి అనుబంధ ప్రయోజనములు కలుగుట
      • ఫల సాధనము – ప్రయోజనములు నెరవేరుటకు తోడ్పడు సాధనములు
      • ఐహిక భోగము – పరమపదమును జేరుటకు ముందు ఈ జగత్తులో ఇంకను ఇతర ఇంద్రియ సుఖములు అనుభవించ వలెనను కోరిక.

పిళ్ళై లోకాచార్యులు, మాముణులు, పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్

శ్రీసౌమ్యజామాతృమునేః ప్రసాదప్బావ సాక్షాత్కృత సర్వతత్వమ్
అజ్ఞానతామిశ్ర సహస్రభానుమ్ శ్రీ భట్టనాధమ్ మునిమాశ్రయామి

సాధారణ అనువాదము: నేను శ్రీభట్టనాధ మునిని శరణాగతి చేసెదను, వారు శ్రీసౌమ్యజామాతృ ముని దయచే యధార్ధములను వీక్షించిరి. వారు అజ్ఞానాంధకారమును రూపుమాపు సహస్ర కిరణముల ఆదిత్యుని వంటి వారు.

ఈ విధముగా పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ రచించిన అంతిమోపాయనిష్ఠ ముగిసెను.

అనువాదకుని గమనిక: ఈ చివరి భాగములో మనము ఆచార్య నిష్ఠ యొక్క అన్ని మహిమలను వీక్షించితిమి. కొన్ని సంస్కృత ప్రమాణములకు అనువాదము చేకూర్చిన శ్రీరంగనాధ స్వామికి కృతఙ్ఞతలు.

అన్ని భాగములను ఈ క్రింద వీక్షించగలరు: https://granthams.koyil.org/anthimopaya-nishtai-telugu/

అడియేన్ గోపీకృష్ణమాచార్యులు బొమ్మకంటి, రామానుజ దాసన్ .

మూలము: https://granthams.koyil.org/2013/07/anthimopaya-nishtai18/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment