ఆళ్వార్ తిరునగరిని శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు, చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి దర్శనం పొంది అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ సమయంలో, భగవానుడు బ్రహ్మతో ఒక రహస్యం చెబుతాడు. భూలోకంలో భరతదేశం దక్షిణభాగంలో మలయమలై అనే పర్వతాలు ఉన్నాయని, ఆ మలయమలై పర్వతాల నుండి తామ్రపర్ణినది ఉద్భవించిందని, దానికి దక్షిణ భాగములో ఆదిక్షేత్రం ఉందని, తాను ఆదినాథుడిగా అందమైన స్వరూపాన్ని ధరించి ఎవరికీ కనిపించకుండా శ్రీమహాలక్ష్మితో ఆనందంగా కొలువై ఉన్నానని తెలుపుతాడు. బ్రహ్మను ఆ క్షేత్రానికి వెళ్ళి తనను ఆరాధించమని నిర్దేశిస్తాడు. ఈ క్షేత్రమహిమను తెలుసుకున్న బ్రహ్మ సంతోషించి ఆ క్షేత్రాన్ని ‘కురుగా క్షేత్రం’ అని పిలవాలని కోరతాడు. పిదప బ్రహ్మ ఆదిక్షేత్రం చేరుకుని చాలాకాలం పెరుమాళ్ళను ఆరాధిస్తాడు. ఈ క్షేత్రం, ఇక్కడ ప్రవహించే తామ్రపర్ణినది భగవానుడికి అత్యంత ప్రియమైనవని మన పూర్వాచార్యులు స్తుతించారు.
అంతేకాకుండా, భృగుమార్కండేయ మహర్షులకు, కార్తవీర్యార్జునునికి, పంచపాండవులలో అర్జునునికి ఈ దివ్యదేశంలో భగవత్ దర్శనప్రాప్తి కలిగింది.
కురుగాపురి మహాత్మ్యంలో వేదవ్యాసుడు తన పుత్రుడైన శ్రీశుకుడికి, బ్రహ్మవశిష్టులకు ఈ ఆదిక్షేత్ర మహిమను తెలిపారని స్పష్టంగా వివరించబడి ఉంది.
ఇలా ఈ క్షేత్ర చరిత్రవైభవమును అనుభవించాము.
మూలం – కురుగాపురి క్షేత్ర వైభవం పై ఆదినాథ ఆళ్వార్ దేవస్థానం ప్రచురించిన పుస్తకం.