ఆళ్వార్ తిరునగరి వైభవము – ఆళ్వార్ యాత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< నమ్మాళ్వర్ల చరిత్ర, వైభవము

నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వా రునగరి దివ్య దేశం ఊరేగింపుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మ

నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వార్ తిరునగరి దివ్యదేశ యాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనం ఆ ప్రాధాన్యత గురించి కొంతవరకు ఇక్కడ అనుభవిద్దాం.

క్రిందటి వ్యాసంలో రామానుజుల అవతార రహస్యాన్ని నమ్మాళ్వార్,   మధురకవిఆళ్వార్లకు భవిష్యదాచార్యుల అర్చామూర్తి  ద్వారా ప్రకాశింపచేయడం గురించి తెలుసుకున్నాము. నమ్మాళ్వార్ల- రామానుజుల అవతారానికి మధ్యకాలంలో నాథమునులు మొదలైన పూర్వాచార్యులు ఎందరో ఈ లీలావిభూతిలో   అవతరించి మన శ్రీవైష్ణవసంప్రదాయాన్ని విస్తరింపచేశారు. శ్రీమన్నాథమునులు,  నమ్మాళ్వార్ల పాశురవైభవం విని ఆ పాశురాలను తెలుసుకోవాలనే ఆర్తితో ఆళ్వార్ తిరునగరికి చేరి తమ  యోగదృష్ఠిచే నమ్మాళ్వార్ల దర్శన భాగ్యం పొందుతారు. నమ్మాళ్వార్ల అనుగ్రహంతో శ్రీమన్నాథమునులకు వారి నాలుగు ప్రబంధాలతో పాటు ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు, వాటి అర్థాలు కూడా ప్రసాదంలా పొందే భాగ్యం కలుగుతుంది. ఆచార్య పరంపరలో నమ్మాళ్వార్ల తర్వాతి స్థానాన్ని అలంకరించారు శ్రీమన్నాథమునులు.

శ్రీమన్నాథమునుల తరువాత కాలంలో కురుగైక్కావలప్పన్ , ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియనంబి వంటి మహానుభావుల ద్వారా సంప్రదాయ వైభవం , ఆచార్యపరంపర  వృద్ధిచెందింది. ఆ తరువాత, ఆదిశేషుని అవతారమైన శ్రీరామానుజులు ఈ లీలావిభూతిపై అవతరించి, మోక్షాసక్తి ఉన్నవారందరికీ మోక్షం లభిస్తుందని నిరూపించారు. ఎంబెరుమానార్  (రామానుజులు) తమను తాము ‘మాఱన్ అడిపణిందు ఉయ్ న్దవన్’ అని భావించేవారు. అంటే ‘నమ్మాళ్వార్ల దివ్య తిరువడి అనుగ్రహంతో ఉజ్జీవింపబడ్డాను’ అని అర్థం. తమయందు  రామానుజులకు ఉన్న అపారమైన భక్తి ప్రపత్తులను చూసి ఆళ్వార్, రామానుజులకు తమ ‘తిరువడినిలై ‘(పాదుకలు) స్థానాన్ని ప్రసాదించారు. ఇతర దివ్యదేశాల సన్నిధులలో నమ్మాళ్వార్ల తిరువడినిలైని ‘మధురకవి ఆళ్వార్’గా పిలుస్తారు. కాని   ఆళ్వార్ తిరునగరిలో మాత్రం నమ్మాళ్వార్ల శ్రీశఠారిని/ తిరువడిని ‘శ్రీరామానుజులు’ అని భక్తుల శిరస్సుపైన అనుగ్రహిస్తారు. స్వయంగా నమ్మాళ్వార్లే ఇలా నియమనం చేశారు.

ఎంబెరుమానార్ల కాలం తరువాత, మన సంప్రదాయాన్ని ఎంబార్, భట్టర్, నంజీయర్, నంపిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యుల వంటి ఆచార్యమహానుభావులెందరో ‘ఓరణ్‌ వళి’ని (ఆచార్యుని తరువాత శిష్యుడు ఆ పరంపరఙ్ఞానాన్ని తరువాతి వారికి వరకు అందించడం) వృద్ధిపరిచారు. పిళ్ళైలోకాచార్యుల అవసానములో, విదేశీయుల దాడులతో దక్షిణభారతం అనేక ఉపద్రవాలకు లోనైనది. మన సంప్రదాయానికి మూలకేంద్రమైన శ్రీరంగంలో పలుదాడులు జరిగాయి. అప్పుడు పిళ్ళైలోకాచార్యులు పెరియపెరుమాళ్ళ (శ్రీ రంగనాథ మూలవర్లు ) ఎదుట ఒక గోడను కట్టి నంపెరుమాళ్ళను (ఉత్సవ విగ్రహం) రక్షణ కై దక్షిణం వైపుకు తీసుకువెళతారు. వీరు నంపెరుమాళ్ళతో మధురై ప్రాంతంలో ఉన్న జ్యోతిష్కుడికి (ప్రస్తుతం – కొడిక్కుళం) చేరుకున్నారు. వయోవృద్ధులు కావడంతో అనారోగ్యం పాలయ్యారు. తమ శిష్యుడైన తిరుమలై ఆళ్వార్ ని  నియమించి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించి వారు పరమపదానికి చేరుకుంటారు.

ఆ తరువాత, నంపెరుమాళ్  కేరళలోని కోళిక్కోడుకి చేరుకోగా, అదే సమయంలో  ఈ ఉపద్రవాలను తప్పించుకోడానికి నమ్మాళ్వార్లు కూడా ఆళ్వార్ తిరునగరి నుండి బయలుదేరి కోళిక్కోడుకి చేరుకుంటారు. ఆళ్వార్ తిరునగరిని వదిలి నమ్మాళ్వార్లు ఎంతోకాలం దూరంగా ఉండవలసి వస్తుంది. ఆళ్వార్ కోళిక్కోడుకి రాగానే నంపెరుమాళ్ ఆనందించి ఎంతో ఆశతో నమ్మాళ్వర్లని తమ దివ్యాసనముపై స్థానమిస్తారు. పోత్తిమార్లు, నంబూద్రి అర్చకులు నంపెరుమాళ్ తో పాటు నమ్మాళ్వార్లకు ఎంతో భక్తితో కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక కోళిక్కోడు నుండి బయలుదేరి తిరుక్కనాంబికి చేరుకుంటారు. అక్కడ కొంత కాలం గడిపిన తర్వాత నంపెరుమాళ్  తమ యాత్రను ముందుకు సాగిస్తారు. నమ్మాళ్వార్ల కైంకర్యపరులు మాత్రం సురక్షిత ప్రాంతాన్ని వెదుక్కుంటూ పశ్చిమం వైపు వెళుతూ ఎత్తుగా నిటారుగా ఉన్న ఒక కొండ దగ్గరకు చేరుకొంటారు.వారు  ఆళ్వార్ ను  అక్కడే దాచి ఉంచాలని నిశ్చయించుకొని ఆళ్వార్ ను  పెట్టెలో ఉంచి కొండ లోయలోకి దించుతారు.

ఇలా ఆళ్వార్ అర్చామూర్తిని భద్రపరచి తిరిగి వస్తుండగా, దొంగలు వారి దగ్గర నుండి అమూల్యమైన తిరువాభరణాలను దోచుకుంటారు. ఆ కైంకర్యపరులలో ఒకరైన తోళప్పర్ మధురైకి వెళ్ళి రాజాస్థానంలో మంత్రిగా ఉన్న తిరుమలైఆళ్వార్ ని సహాయం కోసం అభ్యర్థిస్తారు. వీరు పిళ్ళైలోకాచార్యుల ప్రధాన శిష్యులు. పిళ్ళైలోకాచార్యులు తమ తర్వాత వీరినే సంప్రదాయ పరంపరాధిపతిగా నియమించి పరమపదం చేరుకుంటారు. ఆళ్వార్ అర్చామూర్తిని తిరిగి పొందడానికి తిరుమలై ఆళ్వార్ తమ ఆంతరంగిక  సేవకులతో కేరళరాజు వద్దకు ఒక సందేశం పంపిస్తారు. సందేశం అందగానే కేరళరాజు ఆళ్వార్ ని  తిరిగి తీసుకురావడానికి తన సైన్యాన్ని పంపుతారు. తోళప్పర్ నాయకత్వంలో వీరందరు  బయలుదేరుతారు. ఆళ్వార్ ఉన్న చోటును వీరికి ఒక గరుడపక్షి సూచిస్తుంది. తోళప్పర్ ఇనుప గొలుసుతో కట్టిన  చెక్కపలకపై కూర్చొని ఆ ఏటవాలుగా ఉన్న కొండలోయలోకి దిగి, ఆళ్వార్ల అర్చామూర్తి ఉన్న పెట్టెను గైకొని ఆ చెక్కపలకపై ఆళ్వార్ ను ఉంచి పైకి పంపిస్తారు. తోళప్పర్ ని పైకితీసుకరావడానికి పైనున్నవారు మళ్ళీ పలకను దించుతారు. అలా వారు పైకివస్తుండగా అదుపును తప్పి లోయలోపడి పరమపదిస్తారు. ఇది తెలిసిన  తోళప్పర్ పుత్రుడు శోకిస్తారు. ఆళ్వార్  వారికి  ఇకమీదట తోళప్పర్  వంశస్థులకు ఆలయంలో గౌరవమర్యాదలు ఇవ్వబడతాయని ఓదార్చి నియమనంచేశారు . తరువాత, నమాళ్వార్లు మళ్లీ తిరుక్కనాంబికి చేరుకున్నారు. దొంగలు తమ తప్పిదమును  గ్రహించి, దోచుకున్న తిరువాభరణాలను తిరిగి ఆళ్వార్ కి సమర్పించుకుంటారు. పిమ్మట తిరుమలై ఆళ్వార్ తిరుక్కనాంబిలో ఆళ్వార్  ని సేవించుకుంటారు.

తిరుమలైఆళ్వార్లు మధురకి వచ్చి, పిళ్ళైలోకాచార్యుల శిష్యులలో ఒకరైన కూరకులోత్తమదాసులను కలుసుకొని  వారికి ఆచార్యులతో ఉన్న అనుబంధాన్ని స్మృతి చేసుకుంటారు. కూరకులోత్తమ దాసులు వీరికి సంప్రదాయ విషయాలను ఉపదేశించి, తమ మంత్రి పదవికి రాజీనామాచేసి, కేవలం నమ్మాళ్వార్లకు మాత్రమే దాసుడిగా ఉండమంటారు. తిరుమలైఆళ్వార్ సంప్రదాయార్థాలను కూరకులోత్తమదాసులు, విళంజోలై పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై మొదలైన ఆచార్యుల ద్వారా పొంది  పిళ్ళైలోకాచార్యుల దివ్యసంకల్పానికి అనుగుణంగా సంప్రదాయాన్ని వృద్ధిపరుస్తారు. వీరి కారణంగానే ఆళ్వార్ తిరిగి ఆళ్వార్ తిరునగరిని చేరుకున్నారు. తిరుమలైఆళ్వార్లు ఆళ్వార్ తిరునగరికి వచ్చినపుడు ఆ ప్రదేశమంతా కలుపు మొక్కలతో అడవిలా ఉండటం చూసి, దానిని శుభ్రపరచి ఆదినాథ- ఆళ్వార్ల మందిరాన్ని పునర్నిర్మితం కావిస్తారు. తిరుప్పుళి ఆళ్వార్ల (దివ్య చింతచెట్టు) క్రింద తొవ్వి భవిష్యదాచార్యుల దివ్యఅర్చామూర్తిని వెలికితీస్తారు. ఆళ్వార్ తిరునగరికి పశ్చిమంలో రామానుజ-చతుర్వేదిమంగళవీధిని నిర్మింపజేసి, భవిష్యదాచార్యులకు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపచేసి ఆదినాథ-ఆళ్వార్-ఎంబెరుమానార్లకు నిత్యం కైంకర్యాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. నమ్మాళ్వార్ల యందు, తిరువాయ్ మొళి యందు వీరికున్న ఆర్తి, ఎనలేని భక్తి కారణంగా వీరిని ‘శఠగోపదాసుల’ని ‘తిరువాయ్ మొళిపిళ్ళై’ అనే తిరునామాలతో వ్యవహరించేవారు. ఇప్పటికిని వీరి వంశస్థులు ఈ క్షేత్రంలోనే కాకుండా పరిసర దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహిస్తున్నారు.మన పూర్వాచార్యులు ఈ చరిత్రను “నమ్మాళ్వార్ల -యాత్ర” అని వ్యవహరిస్తారు.

తరువాత కాలంలో ఈ దివ్యదేశంలో అవతరించి స్వయంగా శ్రీరంగనాథునికే ఆచార్యులై, ఆచార్యునిగా తిరువాయ్ మొళిపిళ్ళైవారిని స్వీకరించి, ప్రప్రధమంగా ఆళ్వార్ తిరునగరిలో కైంకర్యం చేసిన మణవాళ మామునుల చరిత్రను తర్వాతి వ్యాసంలో అనుభవిద్దాం.

మూలము: https://granthams.koyil.org/2021/12/08/azhwarthirunagari-vaibhavam-3-tamil/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment