శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
తిరువాయ్ మొళిపిళ్ళై ఆళ్వార్ తిరునగరి ఎలా పునర్నిర్మించారో క్రిందట అనుభవించాము. నమ్మాళ్వార్లకు, ఆదినాథ పెరుమాళ్ళకు, ఎంబెరుమానార్లకు నిత్య కైంకర్యాల ఏర్పాట్లను ఎలా చేశారో కూడా అనుభవించాము. ఆ రోజుల్లో తిరువాయ్ మొళిపిళ్ళై అనే ఆచార్యపురుషులు ఆళ్వార్ తిరునగరిలో సంప్రదాయ ప్రచారకులుగా ఉండేవారు.
కాలాంతరమున, ఆళ్వార్ తిరునగరిలో ఆశ్వీయుజమాస (ఐప్పశి) మూలానక్షత్రమున ఆదిశేషుని అవతారమైన రామానుజులే స్వయంగా తిరునావీఱుడైయపిరాన్ అనే స్వామికి పుత్రునిగా జన్మిస్తారు. ఆ బిడ్డ తేజస్సును చూసి పెద్దలు ఆ బిడ్డకు శ్రీరంగనాథుల తిరునామమైన ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్’ అని నామకరణం చేస్తారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ బాల్యలో తమ తాతగారి ఊరు ‘శిక్కిల్ కిడారం’ అనే గ్రామమున పెరుగుతారు. కాలానుగుణంగా తగిన వయసులో ఉపనయనాది వైదికసంస్కారాలు వీరికి జరిగాయి. తమ తండ్రి వద్దనే శాస్త్రఅధ్యయనం అధికరించారు. తరువాత వివాహం జరిగింది. తమ తండ్రిగారివద్దనే ‘అరుళిచ్చెయల్’ (నాలాయిర దివ్యప్రబంధం), రహస్యార్థాలను నేర్చుకొని జ్ఞానభక్తి వైరాగ్యాలకు నిధిగా రూపుదిద్దుకుంటారు. వీరి తండ్రిగారు పరమపదించిన తర్వాత తిరువాయ్ మొళిపిళ్ళై వైభవమును ఆలకించి, ఆళ్వార్ తిరునగరికి వచ్చి తిరువాయ్ మొళిపిళ్ళై దివ్యపాదాలను ఆశ్రయిస్తారు. నాయనార్ల కళ్యాణగుణాలను చూసి, తిరువాయ్ మొళి పిళ్ళై ఆనందించి సంప్రదాయార్థాలని వారికి అనుగ్రహిస్తారు. ‘ఎంబెరుమానార్ల తిరువడిగళే శరణం’ అని నాయనార్లకు ఉపదేశించి, వీరిని ఎంబెరుమానార్ల సన్నిధిలో నిత్యకైంకర్యం చేయమని నిర్దేశిస్తారు. నాయనార్లు కూడా ఎంబెరుమానార్ల పట్ల అపారమైన భక్తితో కైంకర్యం చేసి ‘యతీంద్రప్రవణులు’ (రామానుజుల యందు భక్తిప్రపత్తులు కలవారు) అనే తిరునామాన్ని సంపాదించుకొంటారు.
తిరువాయ్ మొళిపిళ్ళై తమ అవసానమున, “భవిష్యత్తులో సంప్రదాయ ప్రవర్తకులెవరు?”అనే విచారంలో ఉండగా , అంతట నాయనార్లు ఆ బాధ్యత తాను నిర్వహిస్తానని హామి ఇస్తారు. కేవలం మాటలతో సరిపోకుండా తిరువాయ్ మొళిపిళ్ళై, నాయనార్లతో ప్రమాణం చేయించుకొని , సంస్కృత శాస్త్రంపైనే ఎక్కువ దృష్ఠిపెట్టకుండా తిరువాయ్ మొళి తో పాటు ఇతర దివ్యప్రబంధాలు ప్రచారంచేయమని నాయనార్లను ఆదేశిస్తారు. కాలాంతరమున తిరువాయ్ మొళిపిళ్ళై పరమపదించగా నాయనార్లు వారికి చరమ కైంకర్యాలన్ని శ్రద్ధతో నిర్వహిస్తారు.
వానమామలై దివ్యదేశానికి చెందిన ‘అళగియ వరదర్’ అనే ఆచార్యపురుషులు నాయనార్లను ఆశ్రియిస్తారు. పిమ్మట వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వానామామలై మఠాధిపతిగా అవుతారు. జీయర్ అయిన తరువాత కూడా వీరు నాయనార్లను విడువకుండా కైంకర్యాలు చేసేవారు. జీయరు అనుసరించి, అనేక మంది శ్రీవైష్ణవాచార్యులు నాయనార్లను ఆశ్రయించి శిష్యులవతారు.
నాయనార్లు, శ్రీరంగంలో ఉండి సంప్రదాయాన్ని వృద్ధిపరచాలని సంకల్పించి ఆళ్వార్ తిరునగరిని నుండి శ్రీరంగానికి వెళ్ళుటకు నమ్మాళ్వార్లను అనుమతిని కోరుతారు. ఆళ్వార్ అనుమతించగా శ్రీరంగమునకు చేరుకుంటారు. నాయనార్ల రాకకు పెరియపెరుమాళ్ (శ్రీరంనాథుడు) సంతోషించి ఒక ఉత్సవంలా జరుపుకుని, శాశ్వతంగా శ్రీరంగంలోనే ఉండమని నాయనార్లను ఆదేశిస్తారు. నాయనార్లు శ్రీరంగంలోనే ఉండి లుప్తమైపోయిన రహస్య గ్రంథాలను తిరిగి తెచ్చి, తాళపత్రాలను సరిచేసి, కాలక్షేపాలను నిర్వహిస్తుండేవారు. నంపిళ్ళై కృపతో అనుగ్రహించిన ఈడు వ్యాఖ్యానాన్ని (తిరువాయ్ మొళికి వ్యాఖ్యానం) నాయనార్లు బాగాప్రచారం కావించారు కావున ‘ఈడు పెరుక్కర్’ (ఈడు ప్రచారంచేసినవారు) అనే దివ్యనామాన్ని పొందుతారు.
తిరువేంకటనాథునికి మంగళాశాసనం చేయాలని నిర్ణయించుకొని, ఆ మార్గమద్యంలో ఉన్నఅనేక దివ్యదేశ పెరుమాళ్ళను దర్శించుకొని, మంగళాశాసనాలు చేసి, తిరుమలకు చేరుకొని తిరువేంకటనాథునితో పాటు అనేక భాగవతుల మన్ననలను పొందుతారు. ఆ తర్వాత కాంచీపుర పెరుమాళ్ కోయిల్ (దేవ పెరుమాళ్ళ సన్నిధి) కు వెళ్లి దేవపెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి, అటు నుంచి ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ శ్రీపెరంబుదూర్ చేరుకొని అక్కడ ఎంబెరుమానార్లకు మంగళాశాసనం చేశారు. అటునుంచి తిరువెఃకా కు వెళ్లి ‘కిడాంబిఆచ్చాన్’ అనే ఆచార్యుల సన్నిధిన శ్రీభాష్యం సేవిస్తారు. నాయనార్ల తేజస్సుని సంప్రదాయ పరిజ్ఞానాన్ని పరికించిన కిడాంబి ఆచ్చాన్, తమ అసలు స్వరూపాన్ని వెల్లడించమని అడుగగా, నాయనార్లు తమ ఆదిశేషస్వరూపంతో దర్శనమిస్తారు. అనంతరం నాయనార్లు శ్రీరంగానికి తిరిగి చేరి సంప్రదాయాన్ని విస్తరించసాగారు.
ఇలా వీరు సంప్రదాయ కైంకర్యాలు నిర్విరామంగా కొనసాగిస్తున్న సమయంలో వీరి బంధువులలో ఒకరి మరణం వలన వీరికి అశౌచం ఏర్పడుతుంది. ఇక మీదట ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకుండ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకొంటారు. తన బాల్యసఖుడు,సహాధ్యాయి అయిన శఠకోప జీయర్ వద్ద నాయనార్లు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. పిదప, పెరియపెరుమాళ్ ను సేవించుకోగా పెరుమాళ్ వీరికి ‘అళగియ మణవాళ మామునులు’ అనే బిరుదునిచ్చి, పల్లవరాయమఠాన్ని బహూకరించి సత్కరిస్తారు. వానమామలై జీయర్ల సహకారంతో మామునులు పల్లవరాయ మఠాన్ని పునర్నిర్మించి, కాలక్షేపార్థం ‘తిరుమలై ఆళ్వార్ కూటం’ అనే పెద్దమండపాన్ని నిర్మించి సంప్రదాయాన్ని విశిష్టరీతిలో విస్తరింపజేస్తారు. శ్రీరంగం మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక విద్వాంనులు మామునుల వద్దకు వచ్చి, పంచ సంస్కారాలు పొంది, వీరి శిష్యులై తరించారు.
మామునులు అనేక రహస్య గ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాయడమే కాకుండా, అనేక సంస్కృత -తమిళ ప్రబంధాలను కూడా అనుగ్రహించారు. కారణాంతరాలవల్ల సంవత్సరాలుగా నిలిచిపోయిన కైంకర్యాలను, స్థలత్తార్లను, ఆస్థాన మర్యాదలను పునః స్థాపించారు. తమ శిష్యుల ద్వారా, అనేక దేవాలయాలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టం చేశారు. వానమామలై జీయర్ ను అఖండ భాతరదేశ సంచారం చేయమని ఆదేశించి, వారిద్వారా దేశమంతటా సంప్రదాయాన్ని స్థాపించారు. అలా శ్రీరంగంలో ఎంబెరుమానార్ వలె విశేష ఆదరణలను అందుకుంటూ కాలం గడపసాగారు.
మామునుల కీర్తిని ప్రకటించాలని పెరియపెరుమాళ్ శ్రీరంగంలో సంవత్సర కాలంపాటు తమ ఉత్సవాలన్ని నిలుపు చేస్కొని, ఈడు వ్యాఖ్యానము (నంపిళ్ళై వారి తిరువాయ్ మొళి ఉపన్యాసాల ఆధారంగా వడక్కు తిరువీధిపిళ్ళై అనుగ్రహించిన వ్యాఖ్యానం) చేయమని మామునులను ఆదేశిస్తారు. పెరుమాళ్ళ శాసనం మేరకు, ఉభయ దేవేరులతో నంపెరుమాళ్, ఆళ్వారాచార్యులు వేచేంసి ఉండగా, వారి సమక్షంలో మామునులు అందరు ఆనందించేలా తిరువాయ్ మొళి –ఈడు వ్యాఖ్యానమును కృపచేస్తారు. కాలక్షేపం చివరి రోజున, జేష్ఠ మాస(ఆణి) దివ్య మూలానక్షత్రంలో, పెరియ పెరుమాళ్ సన్నిధిఅర్చకుని కుమారుని రూపంతో వచ్చి “శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం। యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్!” అని తనియన్ ను మామునుల సన్నిధిన సమర్పించి, వారిని తమ ఆచార్యునిగా స్వీకరిస్తారు. అంతటితో ఆగకుండా, సంస్కృత-నాలాయరప్రబంధ సేవాకాల ఆరంభమున ఈ తనియన్ తప్పకుండా సేవించాలని నంపెరుమాళ్ నియమనం చేస్తారు.
అటువంటి వైభవం గల మణవాళమామునులు, వయస్సు పైబడడంతో తిరునాడుకు చేరుకుంటారు. వారి శిష్యులు మామునుల చరమ కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు.
మామునుల కొన్ని విశేషాలను ఇక్కడ అనుభవిద్దాము:
శిష్యులు:
అష్ట దిగ్గజములు (ఎనిమిది దిక్కులను కాపలాకాసే ఏనుగుల వంటి ప్రధానశిష్యులు): పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ కందాడై అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ జీయర్, ఎఱుంబియప్ప, అప్పిళ్ళై, అప్పిళ్ళార్, ప్రతివాది భయంకరం అణ్ణ.
నవరత్నాలు: సేనైముదలియాండాన్ నాయనార్, శఠకోపదాసర్ (నాలూర్ శిఱ్ఱాతాన్), కందాడై పోరేఱ్ఱు నాయన్, ఏట్టూరి శింగరాచార్యులు , కందాడై అణ్ణప్పన్, కందాడై తిరుక్కోబురత్తు నాయనార్, కందాడై నారణప్పై, కందాడై తోళప్పరప్పై, కందాడై అళైత్తు, వాళ్విత్త పెరుమాళ్. వీరే కాకుండా ఎంబెరుమానార్లు నియమించిన 74 సింహాసనాధిపతుల తిరుమాలిగల వాళ్ళు, తిరువంశస్థులు అనేక మంది వీరి శిష్యులుగా ఉండేవారు.
పరమపదం పొందిన చోటు: శ్రీరంగం
కృపతో వీరు అనుగ్రహించిన గ్రంథాలు: దేవరాజమంగళం, యతిరాజవింశతి, ఉపదేశరత్నమాల, తిరువాయ్ మొళి నూత్తాందాది మరియు ఆర్తిప్రబంధం.
వ్యాఖ్యానాలు: ముముక్షుప్పడి, తత్త్వత్రయం, శ్రీవచనభూషణం, ఆచార్య హృదయం, పెరియాళ్వార్ తిరుమొళి, మరియు ఇరామానుజ నూత్తందాది.
ప్రమాణ తిరట్టు: (అన్ని శ్లోకాలకు పదకోశం, శాస్త్రఉల్లేఖనాలు వీరి వ్యాఖ్యానాలలో కనిపిస్తాయి) ఈడు ముప్పత్తు ఆరాయిర ప్పడి, జ్ఞాన సారం, ప్రామేయసారం, తత్త్వ త్రయం, శ్రీవచనభూషణం.
మణవాళ మామునుల తనియన్:
శ్రీశైలేశ దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిమ్ ||
శ్రీ శైలేశులు (తిరువాయ్ మొళి పిళ్ళై) దయకు పాత్రులైన, యతీంద్రుల ప్రవణులనబడు, ఙ్ఞానము భక్తి మొదలైన కల్యాణ గుణములను కలిగిన రమ్య జామాతృలకు ( శ్రీ వరవరమునులకు) నమస్కరిస్తున్నాను.
మణవాళ మామునుల- వాళి తిరునామాలు
ఇప్పువియిల్ అరంగేశర్ క్కు ఈడళిత్తాన్ వాళియే
ఎళిల్ తిరువాయ్ మొళి పిళ్ళై ఇణైయడియోన్ వాళియే
ఐప్పశియిల్ తిరుమూలత్తు అవదరిత్తాన్ వాళియే
అరవరశ ప్పెరుంశోదియ అనందన్ ఎన్ఱుం వాళియే
ఎప్పుళుదుముం శ్రీశైలమేత్తవందోన్ వాళియే
ఏరారుం ఎతిరాశర్ ఎనఉదిత్తాన్ వాళియే
ముప్పిరినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాళియే
మూదఱియ మణవాళ మామునివన్ వాళియే
(తిరునాళ్ పాట్టు – తిరునక్షత్రం – మూలా నక్షత్రం రోజున సేవించేది)
శెందమిళ్ వేదియర్ శిందై తెళిందు శిఱందు మగిళ్ందిడు నాళ్
శీర్ ఉలగారియర్ శెయ్ దరుళ్ నఱ్కలై తేశుపొలిందిడు నాళ్
మంద మదిప్పువి మానిడర్ తంగళై వానిల్ ఉయర్ త్తిడు నాళ్
మాశఱు జ్ఞానియర్ శేర్ ఎదిరాశర్ తం వాళ్వు ముళైత్తిడు నాళ్
కందమలర్ ప్పొళిల్ శూళ్ కురుగాదిపన్ కలైగళ్ విళంగిడు నాళ్
కారమర్ మేని అరంగక్కు ఇఱైకంగళ్ కళిత్తిడు నాళ్
అందమిల్ శీర్ మణవాళముని ప్పరన్ అవతారం శెయ్ దుడునాళ్
అళగు తిగళందిడుం ఐప్పశియిల్ తిరుమూలం అదు ఎనునాళే
మూలం: https://granthams.koyil.org/2022/12/05/azhwarthirunagari-vaibhavam-4-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org