నాలాయిర దివ్యప్రబంధం

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః 

శ్రీమన్నారాయణుడు కొన్ని శుద్ధ ఆత్మలను ఎంపిక చేసికొని వారికి తనపై అపారమైన భక్తిని, దివ్య జ్ఞానాన్ని,ప్రసాదించారు. వారు భగవంతుని భక్తిలో మునిగిన వారై ఆళ్వారులుగా తెలియబడ్డారు. ఆళ్వారులు శ్రీమన్నారాయణుని మహిమలను కీర్తిస్తూ అనేక పాశురాలను (పద్యాలను) రచించారు. ఈ పాశురాల సంఖ్య సుమారు నాలుగు వేలుగా ఉండటంతో వీటిని నాలాయిర దివ్య ప్రబంధం అని పిలుస్తారు. ఇక్కడ దివ్య అంటే దైవసంబంధమైనది, ప్రబంధం అంటే సాహిత్యం (భగవానుని స్వరూపాన్నే ఆవిష్కరించేది, భగవానునే ఆకట్టుకినేవి).

ఆళ్వారులు భగవానుడు అర్చా రూపంలో వేంచేసి ఉన్న వివిధ క్షేత్రాలను స్తుతించినందున, ఆ క్షేత్రాలు దివ్యదేశాలుగా ప్రసిద్ధి చెందాయి. మొత్తం దివ్యదేశాలు 108గా చెప్పబడుతున్నాయి. వాటిలో 106 దివ్యదేశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మరియు నేపాల్ (ముక్తినాథ్) లో ఉన్నాయి. క్షీరాబ్ధి (పాల సముద్రం) లీల విభూతిలోనే ఉన్నప్పటికీ మనకు చేరుకోలేనంత దూరంలో ఉంది. పరమపదం విముక్తి అనంతరం చేరుకునే ఆధ్యాత్మిక లోకం. ఈ దివ్య డేశాలలో, శ్రీరంగం ప్రధాన దివ్యదేశంగా భావించబడుతుంది. తిరుమల, కాంచీపురం, తిరువల్లిక్కేణి, ఆళ్వార్ తిరునగరి మొదలైనవి మరికొన్ని ముఖ్యమైన దివ్యదేశాలు.

భగవానునికి ఐదు విధాల అవతార స్వరూపాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతాయి—

పరమపదంలో వేంచేసి ఉన్న పరమాత్మ స్వరూపం,

క్షీరాబ్ధిలో వ్యూహ స్వరూపం,

ప్రతి జీవిలో నివసించే అంతర్యామి స్వరూపం,

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఈ ధరణిపై అవతరించిన విభవావతారాలు (శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైనవి),

మరియు చివరిగా అర్చా స్వరూపం (దేవాలయాలలో ఉన్న విగ్రహ రూపం).

ఈ అన్ని స్వరూపాలలో అర్చా స్వరూపం భగవానుని అత్యంత కరుణామయమైన స్వరూపంగా భావించబడుతుంది, ఎందుకంటే అది ఎవరైనా, ఎప్పుడైనా సులభంగా చేరుకోగలిగేది. మన పూర్వాచార్యులు దివ్యదేశాలను తమ ప్రాణాలుగా భావించి, ఆ దివ్యదేశాలలో భగవానుని మరియు భాగవతులను సేవించడానికే తమ జీవితాన్ని అంకితం చేశారు. మరిన్ని వివరాల కోసం దయచేసి www.koyil.org సందర్శించండి.

వేదం మరియు వేదాంతాల సారం సరళమైన, శుద్ధమైన తమిళ భాషలో దివ్యప్రబంధం గా పాడబడినది. ఈ దివ్య ప్రబంధాల ప్రధాన ఉద్దేశ్యం సత్యమైన జ్ఞానాన్ని అందించి జీవాత్మలను ఉద్ధరించడం. ఆళ్వారుల కాలం అనంతరం అనేక శతాబ్దాల తర్వాత నాథమునిగళ్‌ ఆదిగా, శ్రీరామానుజులు మధ్యములుగా, మామునిగళ్‌ వరకు అనేకమంది ఆచార్యులు అవతరించి, ఆళ్వారుల దివ్య సందేశాన్ని ప్రచారం చేశారు.

ఎక్కువ వివేచన లేని వారు ఆళ్వారుల పాశురాలను సాధారణ తమిళ గీతాలుగా భావించినప్పటికీ, మహావిద్వాంసులైన ఆచార్యులు ఈ పాశురాలు, శ్రీమన్ నారాయణుడే ఉపాయం (ఈ భౌతిక లోకం నుంచి విముక్తి పొందేందుకు మార్గం) మరియు ఉపేయం (పరమపదంలో శ్రీమన్ నారాయణునికి శాశ్వత కైంకర్యం చేయడం అనే స్వరూప స్థితి) అని ప్రతిపాదించే పరమ తత్త్వాన్ని వెల్లడిస్తున్నాయని స్థాపించారు. మన పూర్వాచార్యులు దివ్య ప్రబంధాలను సంపూర్ణంగా ఆస్వాదించి, వాటిని అధ్యయనం చేయడం, బోధించడం, ఆ పాశురాలలో ఉపదేశించిన ప్రకారం జీవించడమే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రబంధంరచయితపాశురాల సంఖ్య
ముదలాయిరం
తిరుప్పల్లాండుపెరియాళ్వార్12
పెరియాళ్వార్ తిరుమొళి పెరియాళ్వార్461
తిరుప్పావైఆండాళ్30
నాచ్చియార్ తిరుమొళి ఆండాళ్143
కణ్ణినుణ్ చిరుత్తాంబుమధురకవి ఆళ్వార్11
పెరుమాళ్ తిరుమొళి కులశేఖరాళ్వార్105
తిరుచ్చంద విరుత్తంతిరుమళిసై పిరాన్120
తిరుమాలైతొండరడిప్పొడి ఆళ్వార్45
తిరుప్పళ్ళియెఴుచ్చితొండరడిప్పొడి ఆళ్వార్10
అమలనాదిపిరాన్తిరుప్పాణాళ్వార్10
ఇరండాం ఆయిరం
పెరియ తిరుమొళి తిరుమంగై ఆళ్వార్1084
తిరుక్కురుందాండగంతిరుమంగై ఆళ్వార్20
తిరునెడుందాండగంతిరుమంగై ఆళ్వార్30
ఇయర్పా
ముదల తిరువందాదిపొయ్గై ఆళ్వార్100
ఇరండాం తిరువందాదిభూతత్తాళ్వార్100
మూన్రాం తిరువందాదిపేయాళ్వార్100
నాన్ముగన్ తిరువందాదితిరుమళిసై ఆళ్వార్96
తిరువిరుత్తంనమ్మాళ్వార్100
తిరువాసిరియంనమ్మాళ్వార్7
పెరియ తిరువందాదినమ్మాళ్వార్87
తిరువెఴుకూర్ట్రిరుక్కైతిరుమంగై ఆళ్వార్1
సిరియ తిరుమడల్తిరుమంగై ఆళ్వార్1
పెరియ తిరుమడల్తిరుమంగై ఆళ్వార్1
రామానుజ నూట్రందాదితిరువరంగత్తు అముదనార్108
నాల్గాం ఆయిరం
తిరువాయ్ మొళి నమ్మాళ్వార్1102

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజదాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్ 

ఆంగ్లం లో: https://granthams.koyil.org/2023/05/18/4000-dhivyaprabandham-english/

పొందుపరిచిన స్థానం: https://granthams.koyil.org/  ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment