శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/12/01/virodhi-pariharangal-22-telugu/ .
55. భోజ్య విరోధి – ఆహారం / భోజనం తినడంలో అవరోధాలుఎమ్పెరుమానార్ దేవ పెరుమాళ్ యొక్క రహస్య సేవకుడైన తిరుక్కచ్చి నంబి యొక్క అవశేషాలను తినాలని కోరారు
భోజ్యం అంటే భుజించేది అని అర్థం. ఈ విభాగంలో, మనం ఎక్కడ భుజించాలో ఎక్కడ భుజించకూడదో వివరంగా చర్చించబడింది. అనువాదకుల గమనిక: ఆహారాన్ని తీసుకోవడం లేదా తినడం విషయానికి వస్తే, చాలా పరిమితులు, నియమాలు ఉన్నాయి. ముందుకాలంలో, చాలా మంది వైధికులు (వేదాన్ని అనుసరించేవారు) “పరాన్న నియమాన్ని” అనుసరించేవారు – అనగా, వేరొకరి/బయట నుండి స్వీకరించేవారు కాదు (స్వయంగా వంట చేసుకొని మాత్రమే భుజించేవారు), అది కాకుండా గుళ్ళు, మఠాల సన్నిధుల్లో ప్రసాదాన్ని తీసుకునేవారు. కానీ ఈ రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది – చాలా మందికి వంట రాకపోవడం వల్ల బయటి ఆహారం (ప్రసాదం కూడా కానిది) మీద ఆధారపడి ఉంటున్నారు . సాధారణంగా, శ్రీవైష్ణవులు సాత్విక ఆహార పదార్థాలను ఎంపెరుమాన్‌కి సమర్పించి ఆ తరువాత భుజించవచ్చు. మనం తినే ఆహారాన్ని తినే ముందు బాగా విశ్లేషించాలి – దానిని శ్రీవైష్ణవులు వండి ఉండాలి, భగవత్ ప్రసాదం అయిఉండాలి మరియు ఆ వ్యక్తికి ఆ నిర్దిష్ట సమయంలో తినడానికి సరై ఉండాలి. ఉదాహరణకు, అద్భుతమైన భోజనం శ్రీవైష్ణవులు వండి ఉండవచ్చు, ఎంపెరుమాన్‌కు కూడా సమర్పించి ఉండవచ్చు – కాని ఏకాదశి లాంటి రోజున అటువంటి ఆహార పదార్థాలు తినలేము. ఆహార పదార్థాల విషయానికి వస్తే, వాటిని తినడంలో 3 రకాల పరిమితులు తలెత్తుతాయి – జాతి దుష్టం (అనర్హమైన ఆహార పదార్థాలు – ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి), ఆశ్రయ దుష్టం (అవైష్ణవుల సంబంధంలోకి వచ్చిన ఆహార పదార్థాలు, సాత్వికమైనవి కూడా) మరియు నిమిత్త దుష్టం (చెడిపోయిన ఆహార పదార్థాలు మొదలైనవి). ఈ సందర్భాలలో, అలాంటి ఆహార పదార్థాలు మనకు సరైనవి కాదు. అలాగే, భగవద్గిత 17.8 నుండి 17.10 వరకు, శ్రీ కృష్ణ భగవానుడు క్లుప్తంగా వివరించారు, కొన్ని గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన ఆహారం, దాని సహజ రుచిని కోల్పోయిన ఆహారం, పాడైన ఆహారం మొదలైనవి పనికిరావు. ఆహారానికి సంబంధించిన వివిధ విషయాలపై పెద్దల నుండి నేర్చుకోవడం మరియు ఆ వ్యక్తికి తగిన వాటిని మాత్రమే తీసుకోవడం మంచిది. దయచేసి అహార నియమాలపై వివరణాత్మక చర్చను ఈ క్రింద చూడండి.
https://granthams.koyil.org/2012/07/srivaishnava-aahaara-niyamam_28/ ఇంకా https://granthams.koyil.org/2012/08/srivaishnava-ahara-niyamam-q-a/.
- సంసారుల (భౌతిక దృష్టి కలిగిన వ్యక్తులు) ఇళ్లలో ఆహారం తినడం ఒక అడ్డంకి. సంసారులు ఎవరు అన్న విషయాన్ని గురించి ఇప్పటికే చర్చించాము – ఆత్మ జ్ఞానం (ఆత్మ గురించి జ్ఞానం) మరియు భగవత్ జ్ఞానం (భగవంతుని గురించి జ్ఞానం) లేని వారు.
- కేవలం రక్త సంబంధం ఆధారంగా బంధువుల ఇంట్లో ఆహారం తినడం ఒక అడ్డంకి. శ్రీవైష్ణవులు మధ్య కూడా, కనీసం కొన్ని శ్రీవైష్ణవ లక్షణాలు కలిగి ఉండాలి, ప్రవర్తన (కార్యాచరణ, ఆచారం – ప్రాథమిక నియమాలు / నిబంధనలు అనుసరించి) ఉండాలి.
- లౌకిక సుఖాలు మరియు ఇతర ప్రయోజనాలు కోసం చూస్తున్నవ్యక్తులు తయారుచేసిన భగవత్ ప్రసాదం తినడం ఒక అడ్డంకి . కొంత మంది తమ లౌకిక కోరికలు (పరీక్షలలో ఉత్తీర్ణత, వివాహం, మొదలైనవి) నెరవేరినప్పుడు ప్రత్యేక ప్రసాదాలు సమర్పించుకుంటామని కోరుకుంటారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత, వారు ప్రత్యేక భోగం తయారుచేసి ఎంపెరుమానుకి సమర్పించమని అభ్యర్థించవచ్చు. భగవత్ ప్రసాదమైనప్పటికీ, వారి కోరిక ఉద్దేశం ఉన్నందున, అటువంటి ప్రసాదానికి దూరంగా ఉండాలి.
- దివ్య దేశం యొక్క మహిమలను పూర్తిగా అర్థం చేసుకోకుండా భగవత్ ప్రసాదం తినడం ఒక అడ్డంకి. ఆళ్వార్లు పాడటం వలన దివ్య దేశం గొప్పగా మహిమాన్వితమైనాయి. ఆ మహిమలను బాగా అర్థం చేసుకోవాలి.
- భగవానునికి మాత్రమే అంకితమైన వ్యక్తుల వద్ద ఆహారం తినడం ఒక అడ్డంకి. అలాంటి వారికి ఆచార్యలు, భాగవతులు మొదలైనవారి మహిమలు తెలియవు, అందువల్ల వారి ఇళ్లలో ఆహారాన్ని తినకూడదు.
- శ్రీవైష్ణవుల గృహాలలో సొంతంగా వండిన ఆహారాన్ని తినడం – ఈ విషయం గురించి స్పష్టత లేదు. తమ సంతృప్తి కొరకు ఆహారాన్ని వండి మొదట ఎంపెరుమాన్‌కు సమర్పించకపోవడం అని అర్థం చేసుకోవచ్చు. భగవాన్ స్వయంగా భగవద్గిత 3.13 లో ” తేత్వకం భుంజతే పాపా యే పచంతి ఆత్మ కారణాత్” – తమ సంతృప్తి కోసం ఆహారాన్ని తయారు చేసుకునేవారు కేవలం పిడికిలితో పాపాలను తింటున్నారు.
- ఆతిథ్యం వహించే వారు, తదీయారాదనం కోసం ఎంత ఖర్చు చేశారనే దానిపై దృష్టి పెట్టేవారి ఇళ్లలో ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి.
- తమ కీర్తి, ప్రతిష్టలు మొదలైనవాటిని పెంచడానికి ఇచ్చిన ఆహారాన్ని భుజించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొందరు వ్యక్తులు దాతృత్వంలో తాము చాలా గొప్పవారని చూపించడానికి భోజనం పెడతారు. అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది.
- వివాహాలలో / పండుగలలో భోజనం చేయడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: సరైన మఠం / తిరుమాలిగ మొదలైన వాటిలో సరైన తదీయారాదనంగా చేయకపోతే, వివాహాలలో తినడం ఖచ్చితంగా మానుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో, ఆహారాన్ని తయారుచేసే సూత్రాలను చాలా సులువుగా తీసుకుంటున్నారు, అవైష్ణవులు మొదలైన వారు కూడా పాల్గొంటున్నారు. అలాంటి ప్రదేశాలలో తినకుండా ఉండటమే మంచిదని సూచిన.
- కర్మ కాండల వేడుకలలో ఆహారం తినడం ఒక అడ్డంకి. మునుపటి వివరణ మాదిరిగానే.
- డబ్బులిచ్చి ఆహార పదార్థాలు కొనడం మరియు తినడం ఒక అడ్డంకి. హోటళ్ళు మరియు దేవాలయాలలో విక్రయించే ఆహారాన్ని కూడా మానుకోవాలి. అనువాదకుల గమనిక: ఎవరైనా తదీయారాదనం చేస్తుంటే, భోంచేసిన తరువాత, తదీయారాదనం నిర్వహిస్తున్న వ్యక్తికి సహాయపడటానికి కొంత ద్రవ్యం సమర్పించుకోవచ్చు. అమ్మకం కోసం ఉద్దేశించిన ఆహారాన్ని కొనడం పూర్తిగా అనారోగ్యకరమైనది, ఎందుకంటే దానిని విక్రయించే వ్యక్తి డబ్బు సంపాదించే ఆసక్తి కలిగి ఉంటాడు మరియు అలాంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం కూడా అలాంటి వైఖరితో ప్రభావితమవుతాము.
- ఆహార అవశేషాలు తినడం (ఇతరులు నోటికి తగలడం ద్వారా కలుషితమైన ఆహారం… ఎంగిలి) ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇక్కడ సామాన్యుల అవశేషాలను నివారించాలని అర్థం చేసుకోవాలి. భగవద్గితలో, భగవాన్ ఈ సూత్రాన్ని కూడా వివరించారు. ఉచ్చిష్తం (అవశేషాలు) తినకూడదని చెప్పారు. వ్యాఖ్యానంలో, ఎంపెరుమానార్ ఆచార్యులు మొదలైన వారి అవశేషాలు స్వీకరించడానికి సరైనవని వివరించారు. వేదాంతాచార్యులు తమ వ్యాఖ్యానంలో, తండ్రి, అన్నయ్య, భర్త (భార్య కోసం) మొదలైనవారి అవశేషాలు తినడానికి తగినవని వివరించారు. తొండరడిప్పొడి ఆళ్వారులు తిరుమాలై పాసురం 41లో (మునుపటి వ్యాసంలో చర్చించబడింది) చెప్పినట్లుగా, అర్హతగల శ్రీవైష్ణవుల అవశేషాలు తినడానికి తగినవని మనం అర్థం చేసుకోవాలి.
- ప్రతిఫలంగా ఇచ్చే ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణం సూత్రం 286 మరియు 287 లోని ముఖ్యాంశాలలో శ్రీ విదురుడు, శ్రీ మాలాకార (పూలదండలు అమ్మేవాడు) మరియు కూని (త్రివక్రా/గూని) వంటి వారి లాగా కైంకర్యం చేస్తే భగవాన్ దాసులన్న మన నిజమైన స్వభావం నెరవేరినట్టవుతుంది. అనువాదకుల గమనిక: ఈ సుత్రాలకు మాముణులు వివరణ చాలా అందంగా ఇచ్చారు. ఎవరైనా సాధారణంగా కైంకర్యం చేసినప్పుడు ప్రతిఫలం ఆశించడం సర్వసాధారణం అని వారు అంటున్నారు. ఈ అన్ని సందర్భాల్లో, వాళ్ళు ఎటువంటి ఆశ లేకుండా కైంకర్యం చేశారు. శ్రీ విదురుడు శ్రీ కృష్ణునికి అరటి తొక్కలను ఎంతో ప్రేమతో ఇచ్చారు, వాటిని ఎంపెరుమాన్ గొప్ప ప్రేమతో స్వీకరించారు. శ్రీ మాలాకారుడు ఎటువంటి సంకోచం లేకుండా అడిగిన వెంటనే శ్రీ కృష్ణునికి పుష్పాలు అర్పించారు – ఆ పూలదండలు అతనికి జీవనోపాధిని సంపాదిస్తాయి, అయినప్పటికీ అతను వాటిని కృష్ణునికి ఇవ్వడానికి వెనుకాడలేదు. గూని ప్రతిఫలం ఆశించకుండా శ్రీ కృష్ణునికి స్వచ్ఛమైన గంధాన్ని సమర్పించింది. ఈ ముగ్గురు వ్యక్తులు మరియు ఈ సంఘటనలు గొప్ప జ్ఞానం ఉన్న పండితులచే గొప్పగా మహిమపరచబడుతున్నాయని మాముణులు కీర్తించారు. కాబట్టి ఇవి మనకు అనుసరించాల్సిన ఉదాహరణలు.
- కొన్ని ప్రయోజనాల కోసం అర్పణ చేసిన ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. కొన్ని వైదీక కర్మలలో, కొన్ని మంత్రాల ద్వారా దేవతలకు అర్పణ చేసే ప్రక్రియ కనిపిస్తుంది. ఉదాహరణకు శ్రాద్దం. అలాంటి ఆహారాన్ని భుజించడం ఒక అడ్డంకి.
- తాను ఇచ్చేవాడిని అని చాలా గర్వంగా ఉన్న ఎవరైనా ఇచ్చిన ఆహారాన్ని భుజించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: గతంలో చర్చించారు.
తరువాత వివరణలతో మరింత ముందుకు వెళ్ళే ముందు, ఈ అంశంపై వివిధ సాహిత్యాలను చదవడం నుండి మొదలుపెట్టి, పెద్దల నుండి నేను విన్నదానిని, పెద్దల నుండి విని నేను నేర్చుకున్నదానిని, పెద్దల నుండి నేను గమనించినవి (శ్రీ యు. వె. వి.వి రామానుజం స్వామి) వివరిస్తాను. ప్రస్తుత కాలంలో, ఈ సూత్రాలను తెలిసిన వారు చాలా తక్కువ ఉన్నారు మరియు అలాంటి సూత్రాలను అనుసరించేవారు కూడా చాలా తక్కువ. ఆహార పదార్థాలు (మరియు ముడి పదార్థాలు) దాని లక్షణాల ఆధారంగా వర్గీకరించబడతాయి. రాజస మరియు తామస ఆహార పదార్థాలను శ్రీవైష్ణవులకు నిషేధించబడ్డాయి. వివరణలు భగవద్గిత 17 వ అధ్యాయంలో ఉన్నాయి (పైభాగంలో వివరించబడ్డాయి). ఈ రోజుల్లో, ప్రజలు బాహ్య పరిశుభ్రత మరియు స్వచ్ఛతపై మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారు. అంతర్గత పరిశుభ్రత మరియు స్వచ్ఛత గురించి పూర్తి అవగాహన లేకకుండాపోయింది. మనకు తెలిసిన మంచి హృదయస్థులచే ముడి పదార్థాలు పెంచబడాలి – వారు మంచి ఉద్దేశ్యంతో వ్యవసాయం చేసి ఇవ్వాలి. వంట చేసేవారికి అచారం మరియు అనుష్టానం రెండూ ఉండాలి – ప్రవర్తనా నియమాల్ని అనుసరించి, ఆ పైన వారు కూడా స్వరూప జ్ఞానం కలిగి ఉండాలి (వారు భగవాన్ దాసుడైన జీవాత్మ అని). వారికి శ్రీవైష్ణవ సాంప్రాదాయ గ్రంథాలతో కూడా పరిచయం ఉండి ఉండాలి. పిళ్ళై లోకం జీయర్ రాసిన యతింద్ర ప్రవణ ప్రభావం నుండి ఒక సంఘటనను వివరిస్తాను. గొప్ప ఆచార్యులైన నంపిళ్ళైకి ఇద్దరు భార్యలు. అతను ఒకసారి తన భార్యలతో విడివిడిగా ఒక ప్రశ్న అడుగుతారు. మొదట తన మొదటి భార్యను “నా గురించి నీకున్న అభిప్రాయమేమిటి?” అని అడుగుతారు. దానికి ఆవిడ స్పందిస్తూ “నేను మిమ్మల్ని నంపెరుమాళ్కి సమానంగా మరియు నాకు ఆచార్యునిగా భావిస్తాను”. అతను చాలా సంతోషించి తనకు తిరువారాదనం మరియు వంట చేసే పనిని పురమాయిస్తారు. రెండవ భార్యను ఇదే ప్రశ్న అడుగుతారు, ఆమె “నేను మిమ్మల్ని నా భర్తగా భావిస్తాను” అని జవాబు ఇస్తుంది. అతను తన మొదటి భార్యకి వంటలో సహాయం చేయమని పనిని పురమాయిస్తారు. మొదటి భార్య తన నెలవారీ సమయంలో వంట చేయలేనప్పుడు, వారు తన రెండవ భార్యను వంట చేయమనే వారు. కాని ఆ ప్రసాదాన్ని వారి ప్రియమైన శిష్యుల స్పర్ష తరువాత మాత్రమే వారు భుజించేవారు. ఈ విధంగా అతను శ్రీవైష్ణవంలో నిజమైన వైఖరిని పెంపొందించుకోవాలని ఆచరణ ద్వారా చూపించారు, తద్వారా భగవాన్ మరియు భాగవతుల కోసం వంట/వడ్డించే కైంకర్యానికి తగినవారు అవుతారు. (అనువాదకుల గమనిక: వి.వి.రామానుజం స్వామి ఈ సంఘటన గురించి క్లుప్త వివరణ మాత్రమే ఇచ్చినందున అసలు సంఘటనకు సరిపోయేలా ఈ నంపిల్లై సంఘటనను ఆంగ్లంలో తిరిగి వ్రాశారు). ఎంపెరుమానార్ కాలంలో, అతని మఠంలో, అతని ప్రతి శిష్యులు చాలా గొప్పవారు, ఆచార్యులుగా ఉండగల సామర్థ్యం కలిగి ఉండేవారు. చాలా మంది సామాన్యులు, భౌతిక వ్యక్తులు, లౌకిక దృష్టిగల వ్యక్తులు వారి సేవల నుండి తొలగించబడ్డారు. ఇది వారి పుట్టుక ఆధారంగా కాదు. ఇది పూర్తిగా భగవత్ విషయంలో వారి మానసిక పరిపక్వత లేనందున. మనం తినే ఆహారం భగవత్ ప్రసాదం అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భగవత్ ప్రసాదం లేనిది ఏదైనా తినకూడదు. భోజన వీరోధి (54) మరియు భోజ్య వీరోధి (55) రెండూ స్వచ్ఛమైన హృదయం మరియు సాత్విక వైఖరిపై కేంద్రీకృతమై ఉన్నాయని మనం చూడవచ్చు.
- అర్హత లేని వ్యక్తులు (ప్రధానంగా అవైష్ణవులు) తాకిన ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి.
- అర్హత లేని వ్యక్తుల యాజమాన్యంలో / ఉపయోగించే పాత్రలలో ఉంచిన ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి.
- వంట చేసేవారు (శ్రీవైష్ణవులు కూడా) భగవత్ విషయం కాకుండా ఇతర విషయాలను గుర్తుచేసుకుంటూ / ఆలోచిస్తూ వండిన ఆహారాన్ని తినుట. భగవత్ విషయం కాకుండా ఇతర విషయాలలో దేవతాంతర భజనం, ముచ్చట్లు మొదలైనటువంటివి.
- దివ్య ప్రబందం గుర్తుచేసుకోకూండా వండిన ఆహారాన్ని తినుట. అనువాదకుల గమనిక: ఈ రెండు అంశాలు ఒకటికొకటి సంబంధించినవి. సాంప్రదాయకంగా, వంట చేసేటప్పుడు, శ్రీవైష్ణవులు (పురుషులు మరియు మహిళలు) తిరుపల్లండు, తిరుప్పావై మొదలైనవాటిని పఠించడం ప్రారంభిస్తారు మరియు అలాంటి సమయంలో భగవానుని దివ్య లీలలు కూడా గుర్తుచేసుకుంటారు. అటువంటి విషయాలను చర్చించడం / సంబంధం కలిగి ఉండటం ద్వారా, తయారుచేసిన ఆహారం సహజంగానే ఎంపెరుమాన్ యొక్క ఆనందం కోసం చాలా రుచికరంగా మారుతుంది. మాముణుల కాలంలో తిరుమలలో జరిగిన ఒక సంఘటనను మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రతివాది భయంకరం అణ్ణా తిరుమల వేంకటేశుని తిరుమంజనం మొదలైన వాటి కొరకై నీటిని తీసుకువచ్చే సేవను చేస్తుండేవారు. వారు నీళ్ళను తెచ్చి ఆ నీటిలో పరిమళాలను (ఏలకులు, మొదలైనవి) కలిపి అర్చకులకు అందిచేవారు. ఒక రోజు, శ్రీరంగం నుండి ఒక శ్రీవైష్ణవుడు తిరుమలకు వచ్చినపుడు మాముణుల యొక్క కీర్తి మరియు శ్రీ రంగంలో అతని జీవితం గురించి కొంత మంది మాముణుల శిష్యుల మధ్యలో ఉన్నపుడు అణ్ణాతో చర్చించటం మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో, అణ్ణా తీసుకువచ్చిన నీటిలో సుగంధ ద్రవ్యాలను కలపడం మరచిపోయి, ఆ నీటిని అర్చకులకు అలాగే అందిస్తారు. కొంత సమయం తరువాత, అతను సుగంధ ద్రవ్యాలను కలపడం మర్చిపోయారని తెలుసుకొని అతను తిరిగి అర్చకుల వద్దకు వెళ్లి తాను మరిచిన సంగతి వారికి తెలియజేస్తారు. అప్పటికే కైంకర్యంలో ఆ నీటిని ఉపయోగించడం ప్రారంభించిన అర్చకులు, రోజూకన్నా ఈ రోజు నీళ్ళల్లో సువాసన ఎక్కువగా ఉందని సమాధానమిస్తారు. అది విన్న అణ్ణా చాలా ఆశ్చర్యపోతారు, శ్రీరంగం నుండి వచ్చిన శ్రీవైష్ణవునితో మాముణుల గురించి వారు చేసిన దివ్య సమ్భాషణ వల్ల, నీళ్ళు సువాసనను పొందాయని తనను తాను సమర్ధించుకుంటారు. తదనంతరం వారు శ్రీరంగానికి వెళ్లి మాముణుల ప్రియమైన శిష్యులవుతారు.
- భగవాన్ మరియు భాగవతులకు భోజ్యం ఇవ్వడానికి బదులు సొంత సంతృప్తి కోసం వండి తినడం ఒక అడ్డంకి. ఇప్పటికే మునుపటి భాగంలో దీని గురించి చర్చించాము.
- భగవాన్ యొక్క ఊర్ద్వ పుండ్ర చిహ్నాలు లేని పాత్రలలో ఉంచిన ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. వంట, వడ్డింపు మొదలైన వాటిలో ఉపయోగించే పాత్రలపై తిరుమన్ (తిలకం – భగవాన్ చిహ్నాలు) తో చిత్రించాలి.
- ఎంపెరుమాన్‌కి అర్పించని ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. ఇది ఇప్పటికే వివరంగా చూసాము.
- భౌతిక వ్యక్తులు అర్పించిన భోగాన్ని మరియు అందరి దృష్టిలో ఉన్నపుడు అర్పించిన భోగాన్ని తినడం అడ్డంకులు. ఎంపెరుమాన్‌కు భోగాన్ని అర్పించినప్పుడల్లా, ఆ ప్రదేశాన్ని తెరతో కప్పాలి లేదా తలుపు మూసివేయాలి. అనువాదకుల గమనిక: ఆహారాన్ని ఎప్పుడూ కప్పి ఉంచాలి (సమర్పణకు ముందు మరియు తరువాత రెండు సమయాల్లో). ప్రసాదం వడ్డించే సమయంలో మాత్రమే మూత తీయాలి / తెరవాలి.
- భగవాన్‌కు మాత్రమే అర్పించి, ఆదిశేషునికి, విష్వక్సేనులకు మొదలైన వారికి, మరియు ఆళ్వారులకు ఆచార్యులకు అర్పించని ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. మనం భోగాన్ని ఎంపెరుమాన్‌కి అర్పించినప్పుడు, మనం ఈ పద్ధతిలో చేస్తాము. మొదట మనం “సర్వ మంగళ విగ్రహాయ సమస్థ పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః” (తన అందమైన రూపాలతో మరియు సహచరులతో ఇక్కడకు వచ్చిన శ్రీమాన్నారాయణా నా కైంకార్యాన్ని స్వీకరించగలరు). “అడియేన్ మేవి అమర్గిన్రా అముదే! అముదు సెయ్ తరుళ వేణ్డుం”- నేను ఈ భోగాన్ని ఎంతో భక్తితో సమర్పింస్తున్నాను, దయచేసి స్వీకరించండి. ఈ విధంగా మనం మొదట ఎంపెరుమాన్‌కు సమర్పిస్తాము. తరువాత శ్రీ దేవి, భూదేవి, నీళాదేవి మొదలైనవారికి (ఇతర నాచియార్లకు) ” శ్రీ భూ నీళాదిభ్యో నమః” అని చెప్పి సమర్పిస్తాము. తరువాత పాంచజన్యాళ్వారులకు (శంఖం) , సుదర్శనాళ్వారులకు (చక్రం), అనంతునికి , గరుడ విశ్వాక్సేనులకు మొదలైన వారికి సమర్పిస్తాము. ఆ తరువాత ఆళ్వార్లకి, ఆచార్యులకు “పరాంగుస పరకాల యతిర్వరాదిభ్యో నమః” (నమ్మాళ్వారులు, తిరుమంగై ఆళ్వార్, ఎంపెరుమానార్ ఇంకా ఇతర ఆచార్యులను ప్రసాదాన్ని స్వీకరించమని) అని చెప్పు అర్పిస్తాము. చివరగా, “అస్మత్ గురుభ్యో నమః” అని చెప్పి మన స్వంత ఆచార్యులకు సమర్పిస్తాము. ఈ విధంగా మనం భోగంను ఎంపెరుమాన్ , తాయార్లు, నిత్యసూరులు, ఆళ్వార్లకు మరియు ఆచార్యులకు సమర్పిస్తాము.
- పుట్టుక / ఉద్భవం నుంచి లోపం ఉన్న ఆహారం పదార్థాలను తినడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, మునక్కాయ మొదలైన కాయకూరలు ఈ శాఖలోకి వస్తాయి. తినడానికి అనర్హమైనవి. అటువంటి వస్తువులను మనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
- కీటకాలు, వెంట్రుకలు, సూక్ష్మ జీవులు/ బూజుపట్టిన, పురుగులు మొదలైన వాటితో సంపర్కం ఉన్న ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి.
- అభాగవతుల (అవైష్ణవులు) మధ్య కూర్చొని ఆహారం తినడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: మనం తినేటప్పుడు, ఎప్పుడూ ఎవరు ఉన్నారో మనం చూడాలి, ఆ వ్యక్తుల ముందు మనం తినగలమా అని చూడాలి.
- పనికిరాని విషయాలపై చర్చిస్తూ ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. తినడానికి ముందు, మనం పరిశేషణం (మొదట అంతర్యామి భగవానునికి అందించడం) చేయాలి, తనియన్లు, శ్లోకాలు మొదలైనవాటిని పఠించాలి. కేవలం ముచ్చట్లు మరియు వ్యర్థ చర్చలు చేస్తూ తినడం పూర్తిగా మానుకోవాలి.
- ద్వయ మహా మంత్రాన్ని నిరంతర స్మరణ చేయకుండా ఆహారం తినడం ఒక అడ్డంకి.
- ఆహారాన్ని ఆస్వాదించాలనే వైఖరితో తినడం ఒక అడ్డంకి. భౌతిక ఆనందంపై (రుచి మొదలైనవి) మనం దృష్టి పెట్టకూడదు. బదులుగా మనం ప్రసాదం యొక్క పవిత్రతపై దృష్టి పెట్టాలి. పెద్దలు రుచిని యిష్టపడినట్టు చూపించినా, వారు రుచిని మాత్రమే పొగడడానికి బదులుగా “ఎంపెరుమాన్ ఈ ప్రసాదన్ని నిజంగా ఆస్వాదించి వారి అవశేషాలను మనకిచ్చారు” అని చెబుతారు.
- భగవత్ ప్రసాదాన్ని ఎంతో గౌరవించాలి, అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
- భగతారాధనం (విగ్రహారాధన) యొక్క భాగంగా (చివరి) ప్రసాదం తీసుకోవాలి – అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: తిరువారాదనంలో భాగంగా మనం ఎంపెరుమాన్, ఆళ్వారులు మరియు ఆచార్యులకు భోగం సమర్పిస్తాము. ఇప్పుడు ఆ భోగం ప్రసాదంగా మారింది. మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించి తిరువారాదన ప్రక్రియను పూర్తి చేయాలి. తిరువారాదనను యాగం అని, తదీయారాదనాన్ని అనుయాగం అంటారు. మనం ప్రసాదం తినడం కూడా ఎంపెరుమానుకి చేసే కైంకర్యంలో భాగంగా భావించాలి (తద్వారా మనకు ఎక్కువ కైంకర్యం చేయటానికి శక్తి లభిస్తుంది) కాని వ్యక్తిగత ఆనందం కోసం కాదు. ఈ సూత్రాన్ని శ్రీవచన భూషణం యొక్క ప్రపన్న దినచర్య విభాగం (సుత్రం 243) లో వివరించారు. పిళ్ళై లోకాచార్యులు ప్రసాదం మన దేహ ధారణ (మన శరీర పోషణ) కోసం తీసుకోవాలి మరియు తిరువారాధన ప్రక్రియను పరిపూర్ణం చేయడానికి తీసుకోవాలని కీర్తించారు.
- భాగవతులకు (ఆచార్యలు, శ్రీవైష్ణవులు) ఇవ్వకుండా ఆహారం తినడం ఒక అడ్డంకి.
- తమ సొంత సదాచార్యునికి (నిజమైన ఆచార్య) సమర్పించకుండా ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి.
- కేవలం వేర్వేరు ప్రాణ వాయువులకు ఆహారాన్ని సమర్పించి తినడం ఒక అడ్డంకి. పారిసేశనంలో భాగంగా మనం వివిధ వాయువుల ద్వారా ఆహారాన్ని అందిస్తాము, ప్రాణ, అపాన, వ్యాన, ఉధాన, సమాన. కేవలం ఆ మంత్రాలను చెప్తే సమర్పణ సరిపోదు. ముందు చర్చించినట్లుగా, మనం ఆచార్య తనియన్లు మొదలైనవాటిని పఠించాలి.
- గొప్ప శ్రీవైష్ణవుల చేత శుద్ధి చేయబడని / పవిత్రం చేయని ఆహారాన్ని తినడం ఒక అడ్డంకి. శ్రీవైష్ణవుల దృష్టి, స్పర్శ ద్వారా ప్రసాదం శుద్ధి అవుతుంది.
- పెద్ద సమూహాన్ని శుద్ధి చేయగల గొప్ప శ్రీవైష్ణవులు పాల్గొనడాన్ని చూసిన తరువాత కూడా తదీయారాదనంలో పాల్గొనడానికి సంకోచించడం. ఎఱుంబి అప్పా యొక్క వరవరముని దినచర్య వ్యాఖ్యానంలో, తిరుమళిసై అణ్ణావప్పంగార్, మాముణుల ఉనికి శ్రీవైష్ణవ తదీయారాదన గొష్ఠికే కళ (పవిత్రత) వస్తుందని వారి దివ్య వ్యక్తిత్వాన్ని కీర్తించారు. అందుకే ప్రసాదం తీసుకునే ముందు వరవరముని దినచర్య పఠిస్తారు.
- పరిమిత / నిరోధించబడిన మరిమానం / రకం ఆహారాన్ని మన ఇంట్లో తినడం.
- శ్రీవైష్ణవుల (సొంతం ఆచార్యులంతటి వారు) తిరుమాలిగ వద్ద కొంచం పరిమానంలో ఆహారం తినడం. అనువాదకుల గమనిక: తైత్రియ ఉపనిషద్ లో “అన్నం బహు కుర్వీయాత్” (పెద్ద మొత్తంలో వండి పంచాలి) అని చెప్పారు. మనం కూడా పెద్ద మొత్తంలో ఆహారాన్ని (అనుమతించబడినవి) తయారుచేయవచ్చు, శ్రీవైష్ణవులకు పంచి మరియు అవసరమైనంత వరకు తినవచ్చు, తద్వారా కైంకర్యాలు ఇబ్బంది లేకుండా జరుగుతాయి.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/05/virodhi-pariharangal-23/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org