శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/06/23/virodhi-pariharangal-32-telugu/ .
67. ఆశ్రమ విరోధి – మన ఆశ్రమంలో అవరోధాలు (జీవితంలోని భాగాలు/దశలు)
ఆశ్రమం అంటే జీవితంలోని దశ/భాగం. వైధిక సాంప్రదాయం ప్రకారం, జీవితాన్ని నాలుగు దశలుగా విభజించారు – బ్రహ్మచర్యం (ఉపనయనం తరువాత మరియు వివాహానికి ముందు), గార్హస్పత్యం (గృహస్తాశ్రమం – వివాహిత / కుటుంబ జీవితం), వానప్రస్థం (భార్యతో అడవిలో ఏకాంత / వైరాగ్య జీవితం) మరియు సన్యాసం (దీనిని ఉత్తమాశ్రమం – పూర్తి వైరాగ్యంలో ఒంటరిగా జీవించడం). ప్రతి ఆశ్రమంలో అయా ఆశ్రమంలోని వారు పాటించవలసిన నియమాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. అతను ఉన్న ఆ ఆశ్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను నేర్చుకోవాలి, వాటిని తప్పకుండా అనుసరించాలి కూడా. ఆశ్రమ నియమాలకు విరుద్ధంగా జీవించడం మహా పాపం. ప్రతి ఆశ్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇక్కడ చర్చించడం లేదు.
అనువాదకుల గమనిక: ధర్మశాస్త్రంలో చూపిన విధంగా మనిషి జీవితం ప్రధానంగా నాలుగు దశలుగా విభజించబడింది.
- మొట్ట మొదటి దశ బ్రహ్మచర్యం (విద్యార్థి / బ్రహ్మచారి జీవితం). ఇది బాలుడు యజ్ఞోపవీతం(ఉపనయనం) ధరించి బ్రహ్మోపదేశం (ఆచార్యుని నుంచి పవిత్ర మంత్రాన్ని స్వీకరించడం) పొందడంతో మొదలవుతుంది. కేవలం బ్రాహ్మణ, క్షత్రీయ మరియు వైశ్య వర్ణం వాళ్ళు మాత్రమే యగ్యోపవీతం ధరించి, బ్రహ్మోపదేశం స్వీకరిస్తారు. వారి వారి వర్ణం ప్రకారం బ్రాహ్మణులు 8 సంవత్సరాల వయస్సులో, క్షత్రీయులు 11 సంవత్సరాల వయస్సులో, వైష్యులు 12 సంవత్సరాల వయస్సులో ధరిస్తారు. తల్లి గర్భంలో గర్భధారణ సమయం నుండి వయస్సును లెక్కించవలసి ఉంటుంది. బ్రహ్మోపదేశం స్వీకరించిన తర్వాత, ఆ బాలుడు గురుకులంలో ఆచార్యుని నీడలో వేదం నేర్చుకోవడానికి అర్హత పొందుతాడు. సాధారణంగా, పిల్లలు ఆచార్యుని నివాసంలో వారితో కలిసి ఉంటారు. వాళ్ళు మూల గ్రంథాలతో పాటు వేదం, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు మొదలైన వాటి యొక్క అర్ధాలను అవసరమైనంతవరకు నేర్చుకుంటారు. క్షత్రియ బాలలు ధనుర్వేదం – యుద్దం, ఆయుధాల శాస్త్రం నేర్చుకుంటారు. వారి అధ్యయన సమయంలో, విద్యార్థులు గురువు యొక్క శారీరక అవసరాలను చూసుకోవలసి ఉంటుంది. బయటకు వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురావడం, భిక్షాటనకు వెళ్లి ధాన్యం సేకరించడం మొదలైన పనులు చేయవలసి ఉంటుంది. సేకరించిన పదార్థాలను గురువులకు సమర్పించ బడతాయి, ఆపైన గురువు వాటిని సక్రమంగా ఉపయోగించుకోమని విద్యార్థులను నిర్దేశిస్తారు. విద్యార్థులు గురువుకి సేవ చేస్తూ వారు సుఖమయంగా ఉండేలా చూసుకుంటారు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ విద్య (అత్యున్నత జ్ఞానం) పై దృష్టి పెట్టి అతి సాధారణమైన జీవితాన్ని గడపడం అని అర్థం. భౌతిక సుఖాలకు స్థలం లేదు – నేలపైన పడుకోవాలి, చందనలేపనం, తమలపాకుల సేవనం వంటి శారీరక సుఖాలకు లోనవకూడదు. జీవితం యొక్క ఈ దశలో, సరైన శిక్షణ ఇస్తే, ఆ బాలుడు ఆధ్యాత్మిక జీవితం పట్ల సరైన వైఖరితో బాగా పరిణతి చెందిన వ్యక్తిగా అభివృద్ధి చెందుతాడు.
- ఆ తరువాత, వారు గురుకులం నుండి బయటకు వచ్చినప్పుడు, ఎదిగిన ఆ వ్యక్తి గృహస్తాశ్రమంలోకి (కుటుంబ జీవితం) ప్రవేశించడానికి అర్హుడవుతాడు. గృహస్తాశ్రమం అనగా వివాహ జీవితం. వైధిక వివాహం ఆధారంగా వివాహ జీవితంలోకి ప్రవేశించినప్పుడు, అతను వారి భార్యను రక్షించే ప్రతిజ్ఞ చేస్తాడు. వైధిక ధర్మంలో సరిగా శిక్షణ పొందే సంతానోత్పత్తికి కూడా అతను శపథం చేస్తాడు. శ్రీ భగవతంలో ఋషభ దేవుడు (భగవాన్ అవతారం) ఇలా అన్నారు, అతనిపై ఆధారపడిన వారిని మోక్షదారిలో నడిపించగల సామర్థ్యం ఉంటేనే దేవుడు, భర్త, ఆచార్యులు (గురువు), పిత (తండ్రి) స్థానాలను స్వీకరించాలి. బ్రహ్మచారులు, సన్యాసుల సంరక్షణ గ్రుహస్థుల యొక్క ప్రధాన కర్తవ్యం. వారు ఊహించని అతిథులు తమ ఇంటికి వస్తే కూడా ఎంతో భక్తితో స్వాగతించి వారి పట్ల శ్రద్ధ వహించాలి. తిరువాయ్మొళి 8.10.11 లో సరైన గృహస్తాశ్రమ జీవితాన్ని ఇలా వివరించారు – “నల్ల కోట్పాత్తులగంగళ్… నల్ల పతత్తాల్ మనై వాళ్వార్ కొణ్డ పెణ్డిర్ మక్కళే”. ఈ “నెడుమార్కడిమై” పదిగం (దశాబ్దం) భాగవతులకు చేసే కైంకర్య ప్రాముఖ్యతను కీర్తిని స్థాపిస్తుంది. ఈ పదిగం చివరలో, శ్రీమన్నారాయణుడి భక్తులకు సేవ చేయడంపై దృష్టి కేంద్రీకరించిన వారు, వారి యొక్క (భాగవతుల) కైంకార్యంపై దృష్టి కేంద్రీకరించిన వారికి అద్భుతమైన గ్రుహస్థాశ్రమ జీవితం కలిగి ఉంటారని, తద్వారా ఈ భౌతిక ప్రపంచంలోనే అద్భుతమైన జీవితాన్ని గడుపుతారని నమ్మాళ్వరులు చెప్పారు. ఇక్కడ, నంపిళ్ళై ఒక ముఖ్యమైన సూత్రాన్ని అందంగా గుర్తిస్తున్నారు – ఆదర్శవంతమైన కుటుంబం అంటే, ప్రతి ఒక్కరికి స్వయం-కేంద్రీకృతమైన ఇచ్ఛలకు, ఆసక్తులకు బదులుగా, భర్త శ్రీవైష్ణవులకు సేవ చేయాలనుకున్నప్పుడు, భార్యాపిల్లలు కూడా ఆ ఆలోచనను అనుసరించడం. సెల్వ నంబి జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా నంపిళ్ళై వివరిస్తున్నారు. పెరియాళ్వార్ చేత ఎంతో భక్తితో ఆరాధించబడిన సెల్వనంబిని మన పుర్వాచార్యులు ఆదర్శవంతమైన గ్రుహస్థునిగా వ్యాఖ్యానాలలో వివరించారు. ఒకసారి, అతను ఊర్లో లేని సమయంలో, కొంతమంది శ్రీవైష్ణవులు వారింటికి వచ్చినపుడు అతని భార్య వారిని స్వాగతిస్తుంది. కానీ వారికి ప్రసాదం సిద్ధం చేయాలని చూస్తే బియ్యం నిండుకున్నాయని ఆమె గ్రహించి, వచ్చే ఏడాది పంట కోసం భద్రపరచబడిన ఒడ్లను (వచ్చే సంవత్సర జీవనాధారం మొత్తం దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది చాలా విలువైనది) బయటకు తీసి దంచి బియ్యం తీసి వచ్చిన వారికి పెద్ద విందు భోజనం ఏర్పాటు చేస్తుంది. సెల్వనంబి తిరిగి వచ్చి ఒడ్లబస్తాను ఖాళీగా చూసి భార్యను అడుగుతాడు. అప్పుడు ఆమె “నేను ఇప్పుడు ఆ విత్తనాలను నాటాను ఆ పంట శ్రీవైకుంటంలో చేతికివస్తుంది.” అంటే “నేను వాటిని శ్రీవైష్ణవులకిచ్చాను, అది అత్యంత సముచితమైన కైంకర్యం”అని జవాబిస్తుంది. ఇది విన్న సెల్వనంబి అమితానందాన్ని పొందుతాడు – సెల్వనంబి, అతని భార్య యొక్క అంకితభావం అలాంటిది. భాగవతులకు ఎప్పటికప్పుడు సేవలందించే సరైన కుటుంబ జీవితాన్ని గడపిన తొణ్డనూర్ నంబి, ఎచ్చాన్ మొదలైనవారిని అనువైన ఉదాహరణలుగా కూడా నంపిళ్ళై కీర్తించారు.
- ఆ తరువాత వానప్రస్థం (దంపతులు ఒంటిగా అడవిలో నివసించుట). ఒక ఫలానా వయస్సులో (50+), గ్రామం / పట్టణం / నగరంలో గానీ దంపతులు వారి సాధారణ జీవితాన్ని విరమించి ఏకాంతంగా అడవిలో నివసించడం ప్రారంభిస్తారు. ఇది ఎందుకు అవసరం? ఎందుకంటే, మనం కుటుంబం, పిల్లలు, బంధువులు మొదలైన వారితో నిత్యం నిమగ్నమైనప్పుడు, మనం మొత్తానికి భగవాన్ పై దృష్టి కోల్పోవచ్చు. భగవాన్ గురించి నిరంతర చింతన చేయడం జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. మన అవసరాలను తగ్గించుకొని ఏకాంతంగా జీవించడంతో ఇది సులభతరం అవుతుంది. ఈ దశలో, ఒక మామూలు గుడిసెలో నివసిస్తూ, అడవిలో దొరికే ముడి పదార్థాలను ఉపయోగించి అతి సాధారణమైన భోజనం తింటూ, సాధారణ దుస్తులతో జీవిస్తూ మిగిలిన సమయానికి భగవత్ ధ్యానంలో గడుపుతారు. ఇది అడవిలో నివసిస్తున్న ఋషులకు సేవ చేయడానికి కూడా అవకాశం లభిస్తుంది. కానీ శ్రీవైష్ణవంలో, వాళ్ళ జీవితం అప్పటికే అతి సాధారణంగా ఉన్నందున, అప్పటికే అర్చావతార ఎమ్పెరుమాన్, భాగవతుల కైంకర్యం చుట్టూ కేంద్రీకృతమైనందున ఉపన్యాసాలు మొదలైన వాటి ద్వారా భగవత్ విషయాలను వినడానికి వాటిని ధ్యానించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వానప్రస్థాన్ని ప్రత్యేకంగా వేరే ఎప్పుడూ పాటించలేదు.
- చివరి జీవిత భాగం సన్యాసం. ఈ దశలో, మనిషి తన అన్ని బంధాలను వదులుకొని వైరాగ్యం జీవితాన్ని గడుపుతాడు. సన్యాసం అంటే తన ఆస్థులు, కుటుంబం, బంధువులు మొదలైనవాటిని త్యజించడం, భగవత్ విషయంలో పూర్తిగా సమయాన్ని గడపడం. శ్రీవైష్ణవ సన్యాసులను పరమహంస పరివ్రజాక ఆచార్యులు అని అంటారు. పరమహంస అంటే పాలను / నీళ్ళను (సారం, అసారం) వేరు చేయగల హంస వంటి అత్యంత బుద్దిశాలులు అని అర్థం. అలాగే, హంసలు బురదలో నివసిస్తూ కూడా ప్రభావితం కాకుండా ఉంటాయి – అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తూ కూడా సన్యాసులు ప్రాపంచిక సుఖాలకు ప్రభావితం కారు. బ్రహ్మచర్యం మాదిరిగానే, బ్రహ్మ విధ్య నియమాలను సరిగ్గా పాటించాలి. పరివ్రజాక ఆచర్యులు అనగా నిరంతరం ప్రయాణిస్తూ, ప్రతి వారికీ అత్యున్నత జ్ఞానాన్ని బోధించేవారు. వారు బోధించడమే కాక, అటువంటి ఉన్నత సూత్రాలకు సజీవ ఉదాహరణలుగా కూడా మనం వారిని చూడవచ్చు. అలాగే, శ్రీవైష్ణవ సన్యాసులు (ఇతరులకు భిన్నంగా) త్రిదండం (మూడు దండాలు), కమండలం, శిఖ, యజ్ఞోపవీతం మొదలైనవి ఉంచుకుంటారు – ఇతర సన్యాసులు వీటిలో కొన్నింటిని పాటించక పోవచ్చు. యాదవ ప్రకాశులు (శ్రీ రామానుజుల ఒకనాటి ఉపాధ్యాయులు) చివరికి శ్రీ రామానుజులను తమ ఆచార్యులుగా స్వీకరించి, వారి నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందాచార్య అనే పేరును పొందుతారు. ఎమ్పెరుమానార్ అప్పుడు గోవిందాచార్యులను శాస్త్రంలో వివరించిన విధంగా సన్యాస సూత్రాలను పత్రాలపై నమోదు చేయమని ఆదేశిస్తారు, “యతి ధర్మ సముచ్చయం” దాని ఫలితం. సాధారణంగా సన్యాసులు 3 రోజులకు మించి ఒకే స్థలంలో ఉండరు అయినప్పటికీ, శ్రీవైష్ణవ సన్యాసులు సాధారణంగా ఒక మఠంలో (సాధారణంగా దివ్యదేశ ఆలయంతో సంబంధం కలిగి ఉన్న) ఉండి అక్కడ నుండి అత్యున్నత సూత్రాలను బోధిస్తారు. అయినప్పటికీ, చాలా సన్యాసులు జ్ఞానాన్ని బోధించడానికి సుదూర ప్రాంతాలకు యాత్ర (తీర్థయాత్ర) రూపంగా వెళతారు.
ఆశ్రమ వ్యవస్థ గురించి మనం కొంచెం చూశాము. పురుషుడి కోసం ఆశ్రమం అయితే, స్త్రీ జీవితం పురుషుడి జీవితదశలను అనుసరిస్తుంది. సాధారణంగా, స్త్రీని పెళ్లి చేసుకునే వరకు తండ్రి చూసుకుంటాడు. వివాహం తరువాత, ఆమెను తన భర్త చూసుకుంటాడు. చివరికి భర్త తరువాత తన పిల్లలు చూసుకుంటారు. ఇది వైధిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో స్త్రీలు బాగా చూసుకోబడతారు. వారు ఇంట్లో, సమాజంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళు సాధారణంగా ఉన్నత సూత్రాలను వాళ్ళ తల్లిదండ్రుల నుండి మరియు భర్త నుండి సులువుగా నేర్చేసుకుంటారు. అలాగే వాళ్ళ పిల్లలను కూడా చిన్న వయస్సు నుండే మలచడం ప్రారంభించి వారి భవిష్యత్తుకై సిద్ధం చేస్తారు. భార్యగా, వారు తమ భర్తకు కైంకర్యంలో సహాయం చేస్తారు. అది తిరువారాధనం అయినా సరే, అతిథి సత్కారం అయినా సరే, ఆమె ఎప్పుడూ భర్తతో కలిసి కైంకర్యాలలో పాలుపంచుకుంటుంది. సహజంగానే, నిర్మలమైన వాతావరణంలో ఉండటం వల్ల వాళ్ళు గొప్ప మేధస్సుతో శాస్త్రంపై అవగాహన పెంచుకుంటారు. మన ఆచార అనుష్ఠానాలు మొదలైన వాటిలో ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు, కుటుంబంలోని వృద్ధ మహిళలను అడిగి స్పష్టత పొందాలి అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది – వైధిక కుటుంబాల మహిళల ప్రాముఖ్యత, స్థాయి అలాంటిది. కూరత్తాళ్వానుల ధర్మ పత్ని ఆండాళ్, పిళ్ళై ఉఱంగా విల్లి దాసుల యొక్క ధర్మ పత్ని పొన్నాచియార్, కొంగిళాచాన్ యొక్క ధర్మ పత్ని కొంగిల్ పిరాట్టి మొదలైనవారు ప్రసిద్ధ శ్రీవైష్ణవులలో కొందరు వారి జ్ఞానము, అనుష్ఠానము ఇంకా కైంకర్యాలకు ప్రసిద్ధులు. ఇంకా బహు స్థ్రీలు ఉన్నారు. ఈ పరిచయంతో ఇప్పుడు అసలు విభాగానికి వెళ్దాం.
- మనల్ని మనం నిరంతర భగవత్ దాసులమని భావించడానికి బదులుగా ఒక విషేశ ఆశ్రమానికి చెందిన వ్యక్తిగా భావించడం ఒక అడ్డంకి. వ్యక్తి ఏ ఆశ్రమంలో ఉన్న వాడైనా, శేషత్వం (దాస్యం), పారతంత్రియం (సర్వాధారం) జీవాత్మ యొక్క స్వరూపాలు. “దాస భూతస్ స్వతస్ సర్వే” అనేది ఒక సాధారణ ప్రమాణం – జీవాత్మలందరు భగవత్ అధీనులుగా ఉంటారు అని అర్థం. ఈ దాస్యం ప్రారంభం లేనిది శాశ్వతమైనది. అనువాదకుల గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, సామాన్య కర్మానుష్ఠానము కంటే కైంకర్య ప్రాముఖ్యతను అందంగా వివరించారు. చూర్ణిక 31లో, “జాత్యాశ్రమ దీక్షైకళిల్ భేదిక్కుం ధర్మంగళ్పోలే అత్తాణిచ్చేవగత్తిల్ పొదువానతు నళువుం” – ఎలాగైతే కొన్ని ధర్మ అంశాలు వారి వర్ణం, ఆశ్రమాన్ని బట్టి దాటివేయవచ్చో అలాగే భగవత్ / భాగవతులకు రహస్యమైన కైంకార్యాలలో (సేవలలో) ఉన్నాప్పుడు , సాధారణ వర్ణాశ్రమ ధర్మానుష్ఠానములను కైంకర్య సమయంలో దాటివేయవచ్చు. ఈ చూర్ణికకు మాముణుల యొక్క వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది. వారు వర్ణం, ఆశ్రమం, దీక్షల గురించి అందంగా వివరించారు. తరువాత అటువంటి సామన్య ధర్మ అనుష్ఠానాలు (వారి స్వంత వర్ణం, ఆశ్రమాధారమైన సాధారణ అనుష్ఠానాలు), సత్యాన్ని గ్రహించిన వ్యక్తికి ఎలా ఇవి ముఖ్యమైనవి కావు అని వివరించారు. చివరకు వారు, మన పూర్వాచార్యులు వర్ణ / ఆశ్రమ అనుష్ఠానాలు అనుసరించకపోతే సమాజాన్ని తప్పుదోవ పట్టించినట్లగునని మన పూర్వాచార్యులు ఇతరులపై గొప్ప కరుణాభావంతో వర్ణ / ఆశ్రమ అనుష్ఠానాలను అనుసరించారని వారు ముగించారు. కాబట్టి, కైంకర్యంలో ఉన్నప్పుడు మనం స్పష్టంగా కర్మ అనుష్ఠానాలను దాటవేయవచ్చు / ఆలస్యం చేయవచ్చని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పరాశర భట్టర్ దీనిని ఆచరణాత్మకంగా ప్రదర్శించారు – ఒకసారి వారు సాయంత్ర సమయంలో నమ్పెరుమాళ్కు కైంకర్యం చేస్తున్నప్పుడు, ఒకతను వారికి సంధ్యావందనం గురించి గుర్తుచేసినప్పుడు, మనం కైంకర్యంలో ఉన్నందున ఆ క్షణంలో దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అంటారు.
- ఉత్తామాశ్రమి (సన్యాసి ) అని గర్వపడటం ఒక అడ్డంకి. సన్యాసిగా మారినప్పుడు, చాలామంది వారి పాదాల వద్ద పడతారు, వారిని ఆరాధిస్తారు, వారిని “యతి”, “జీయర్ స్వామి” (మహాత్మా) మొదలైనవారని కీర్తిస్తారు. ఎందుకంటే సన్యాసులు కఠినమైన జీవనాన్ని గడుపుతారు కాబట్టి. కానీ అలాంటి మహిమలు విన్నప్పుడు గర్వపడకూడదు – వారు భగవాన్ / భాగవత దాసులమని నిరంతరం తలచుకొని తదనుగుణంగా వ్యవహరించాలి.
- స్వపచ కంటే అవైష్ణవ ఆశ్రమి (సన్యాసి ) తక్కువ అని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఇక్కడ ఆశ్రమి సన్యాసికి సూచన. అవైష్ణవ సన్యాసులు వారి శిఖ, యజ్ఞోపవీతం, సంధ్యావందనం వంటి నిత్య కర్మలను వదులుకుంటారు మరియు ముఖ్యంగా వారు శ్రీమన్నారాయణ యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించరు. అందువల్ల వాళ్ళను చాలా దిగజారిన వాళ్ళుగా పరిగణించాలి. స్వపచ అంటే కుక్కలను వండి తినేవాడు – చాలా నీచమైనవాడు. ఇటువంటి అవైష్ణవ సన్యాసులను పాషండులు అంటారు. అనువాదకుల గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ భాగవతుల మహిమలను చాలా లోతుగా వివరించారు. అటువంటి వర్ణాశ్రమ ధర్మం శ్రీమన్నారాయణుడి పట్ల భక్తి పొందడం కోసమని అర్థం చేసుకోవడానికి బదులుగా కేవలం వర్ణం, ఆశ్రమం మీద దృష్టి కేంద్రీకరించిన వ్యక్తులను వారు అపహాస్యం చేశారు. భగవాన్ పై కేంద్రీకృతం కాని వర్ణం, ఆశ్రమం, జ్ఞానము, అనుష్ఠానాలు పనికిరానివని 86వ చూర్ణికలో వారు వివరించారు. ఇందులో, భక్తి లేని సన్యాసి స్వపచ కన్నా తక్కువైన వాడని అన్నారు. మాముణులు ప్రతి అంశాన్ని శాస్త్రంలోని ప్రమాణాలతో అందంగా వివరించారు. అతను “స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాతికః విష్ణు భక్తి విహీనస్తు యతిచ్చ స్వపచాధమ” – ఒక స్వపచ విష్ణుభక్తుడైతే అతన్ని ద్విజన్ముని కన్నా (బ్రాహ్మణుడికన్నా) ఎక్కువగా పరిగణించాలి. ఒకరు విష్ణుభక్తుడు కాకపోతే అతన్ని స్వపచ కంటే తక్కువగా పరిగణించాలి. అదే సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు చేత శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో సుత్రం 217 లో వివరించబడింది.
- మన ఆశ్రమంలో దాస్య ప్రతిపత్తి (సేవ / కైంకర్య వైఖరి) ఉండకపోవడం ఒక అడ్డంకి. మొదటి వివరణ మాదిరిగానే. అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులకు ఏ కర్మ చేసినా అవి కైంకర్యంలో భాగమవుతుంది. పిళ్ళై లోకాచార్యులు దీనిని ముముక్షుప్పడి సూత్రం 271 లో “కర్మం కైంకార్యత్తిలే పుగుం” – ప్రపన్నులు శాస్త్ర ప్రకారం జరిపే కార్యక్రమాలన్నీ భగవత్ సేవగా పరిగణించబడుతుంది. కాబట్టి, మన కర్మలు అలాంటి సేవా వైఖరితో చేయాలి.
- వారి ఆశ్రమానికి విరుద్ధంగా ఇతరులతో ప్రవర్తించడం / వ్యవహరించడం ఒక అడ్డంకి. చేతులు, కాళ్ళు మొదలైనవాటిని కడుక్కోవడానికి నీళ్ళని అందించడం మొదలైనవి అందరు శ్రీవైష్ణవులకు చేయాలి. కానీ చందన లేపం, పువ్వులు, తమలపాకులు / వక్క మొదలైనవి బ్రహ్మచారులకు, సన్యాసులకు ఇవ్వకూడదు. ప్రతి ఆశ్రమానికి సంబంధించి ఇలాంటి ఇతర సూత్రాలు కూడా పరిగణించాల్సిన అవసరం చాలా ఉంది. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు, తన శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాంలో, భగవత్ అపాచారం గురించి సూత్రం 303, 304 లో వివరించారు. అలాంటి అపచారాలలో ఒకటి ఇక్కడ వివరించారు “వర్ణాశ్రమ విపరీతమాన ఉపచారం” – ఇతరులను వర్ణాశ్రమ ధర్మానికి విరిద్ధంగా సత్కరించకూడదు. వర్ణాశ్రమం శాస్త్రం చేత స్థాపించబడినది, శ్రీమన్నారాయణకి చాలా ప్రియమైనది కాబట్టి, అందులోని మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. మాముణులు అటువంటి కార్యాలకు కొన్ని మంచి ఉదాహరణలను ఇచ్చారు – సూద్రులు ఇతరులను సత్కరిండానికి వేద మంత్రాలను పఠించడం (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే పఠించవచ్చు), సన్యాసులు ఇతరులకు తమలపాకులు / వక్క (తామూ స్వీకరించడం) సమర్పించడం మొదలైనవి. కాబట్టి, జాగ్రత్తగా వారి ప్రత్యేకమైన వర్ణం మరియు ఆశ్రమానికి నిషేధించబడిన కార్యాలలో పాల్గొనకుండా ఉండాలి.
- అత్యున్నత సూత్రాలను అర్థం చేసుకున్న తరువాత కూడా, సామాన్య ధర్మాన్ని త్యజించేందుకు భయపడటం ఒక అడ్డంకి. మనము ఇంతకు ముందే దీని గురించి వివరంగా చర్చించాము. నిరంతర/శాశ్వత దాసుడని జీవాత్మ అసలు స్వభావాన్ని మనము అర్థం చేసుకున్న తర్వాత, కైంకర్యం కర్మానుష్ఠానము కంటే ప్రధానమవుతుంది.
- మన సొంత ఆశ్రమానికి విరుద్ధమైన కార్యాలు చేయడం ఒక అడ్డంకి. మన ఆశ్రమానికి విరుద్ధమైన కార్యాలో పాల్గొనకుండా ఉండాలి. ఉదాహరణకు, సన్యాసులు అగ్నికి సంబంధించిన వాటికి దూరంగా ఉండాలి, అందువల్ల వారు హోమాలు, యజ్ఞాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి అనర్హులు అవుతారు. వారు అగ్నితో కూడిన కార్యమైన వంటలో కూడా పాల్గొనకూడదు. వారు తమ తిరువారాధన పెరుమాళ్‌కు కూడా తమలపాకులు / వక్క మొదలైనవి సమర్పించకూడదు. అనువాదకుల గమనిక: ప్రతి ఆశ్రమానికి, అనేక ఆంక్షలు ఉన్నాయి – బ్రహ్మచారులు, సన్యాసులు కఠినదీక్షా జీవితాన్ని గడపాలి. బ్రహ్మచారులు జ్ఞానాన్ని పొందడం, వారి ఆచార్యులకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలి – దీనికి విరుద్ధమైనదేదైనా మానుకోవాలి. గృహస్తులు భగవత్ / భాగవత / ఆచార్య కైంకర్యాలు చేయడం, సన్యాసులకు సహాయపడటం మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి – దీనికి విరుద్ధంమైనదేదైనా మానుకోవాలి. ప్రతి ఒక్కరికీ దివ్యజ్ఞాన ప్రచారం చేయడం, అందరికీ ఆధ్యాత్మికంగా సహాయం చేయడంపై సన్యాసులు దృష్టి పెట్టాలి – దీనికి విరుద్ధంగా ఏదైనా మానుకోవాలి. సహజంగానే, అందరు భాగవతులు (వర్ణం / ఆశ్రమంతో సంబంధం లేకుండా) భగవత్ / భాగవత / ఆచార్య కైంకార్యంలో నిమగ్నమై ఉండాలి – దీనికి విరుద్ధమైనది ఏదైనా మానుకోవాలి.
- వారి ఆశ్రమానికి విరుద్ధమైన అలాంటి అడ్డంకులను త్యజించకపోవడం ఒక అడ్డంకి. ఇప్పటికే వివరంగా చూసాము.
- తాను ఒక సన్యాసినని గొప్పగా భావించి ఆచార్య కైంకార్యానికి దూరంగా ఉండటం ఒక అడ్డంకి. నంజీయర్ సన్యాసి అయినా గృహస్థుడైన పరాశర భట్టర్లకు సేవచేశారు. అదేవిధంగా, పిన్బళగియ పెరుమాళ్ జీయర్ నాంపిళ్ళైకి సేవలు అందించారు. పొన్నడిగళ్ జీయర్, అళగియ మణవాలన్ (సన్యాసం స్వీకరించే ముందు కాలంలో మనవాళ మాముణులు) ను సేవించారు. ఈ సంఘటనలు ఆశ్రమంతో సంబంధం లేకుండా శిష్యులు ఆచార్యలకు సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను చూపుతాయి. అనువాదకుల గమనిక: నంజీయర్ సన్యాసి అయి కూడా భట్టర్‌కు ఎంతో భక్తితో సేవలందించారు. ఒకసారి వారు భట్టార్ ఆసీనులైన పల్లకీని తీసుకువెళుతున్నారు. ఆ సమయంలో వారి త్రిదండం అడ్డం వస్తుంటే, నా సేవ మార్గంలో ఈ త్రిదండం వస్తే, నేను దీనిని విరిచి పారేస్తాను అని అంటారు. పిన్బళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళైతో ఎంతో అనురాగంతో ఉండేవారు, వారికి ఎన్నో కైంకర్యాలను అందించారు. పొన్నడిగళ్ జీయర్ అళగియ మణవాలన్ (తమ పూర్వాశ్రమంలో మాముణులు) యొక్క శిష్యులయ్యారు – వారు మాముణులకు ముందే సన్యాసం స్వీకరించారు – అయినప్పటికీ వారు మాముణులకు చాలా ఆనందంతో సేవ చేశారు. ఈ సంఘటనలు శిష్యులు సన్యాసులు అయినప్పటికీ, ఆచార్యుడు ఒక గృహస్థుడు అయినప్పటికీ వారి ఆచార్యునికి సేవ చేయాలి.
- మన ఆశ్రమానికి సంబంధించిన ఆశ్రమ సరిహద్దులను అర్థంచేసుకొని తాము వ్యవహరించాలి. ఇప్పటికే వివరంగా చర్చించారు.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/07/virodhi-pariharangal-33/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org