శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
కిందటి సంచికలో మనం పంచ సంస్కారముల ప్రాధాన్యతను తెలుసుకున్నాము. దీనిలో మనం ఆచార్య శిష్య సంబంధ ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. ఈ సంబంధమునకు మన సంప్రదాయంలో చాలా వైశిష్ఠత ఉన్నది. దీని విశేషతను మనం పూర్వాచార్యుల శ్రీ సూక్తులలో పరిశీలిద్దాము.
ఈ శబ్ధమునకు వ్యుత్పత్తి – శాస్త్రములను అభ్యసించి, వాటిని అనుష్ఠానమున ఉంచి, శిష్యులకు ఉపదేశించువాడు, శాస్త్ర వచనానుసారం ‘సన్యాసాశ్రమములో ఉన్నను విష్ణు పరతత్త్వమును అంగీరించక పోయినచో వాడు చండాలుడే’.
కావున శ్రీమన్నారాయణుని సర్వదా స్మరించు శ్రీవైష్ణవునికి ఆచార్యుడు అత్యావశ్యకం అని తెలుస్తుంది. పంచ సంస్కార సమయాన తిరు మంత్రమును ఉపదేశించు (ద్వయం మరియు చరమ శ్లోకంతో కలుపుకొని) ఆచార్యుడు ప్రత్యక్ష (ఉపకారకాచార్యుడు) ఆచార్యుడు అని పూర్వాచార్యులు నిర్ధేశించారు. శిష్యుడనగా శిక్షను పొందువాడని అర్థం. అనగా ఆచార్యుని సమక్షమున ఉద్ధరింపబడువాడు శిష్యుడు.
మన పూర్వాచార్యులు ఈ ఆచార్య శిష్య సంబంధం గురించి చాలా లోతుగా విశదీకరించారు. ఈ ఆచార్య శిష్య సంబంధం తండ్రి తనయునికి ఉన్న సంబంధమువలె విశేషమైనది శాస్త్రపరంగా నిరూపించారు. ఎలాగైతే తనయుడు తండ్రికి దాస్యమును చేస్తాడో ఆమాదిరి శిష్యుడు కూడ ఆచార్యునికి దాస్యము చేయవలెను.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, “తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ్య, ఉపదీక్షన్తితే ఙ్ఞానం ఙ్ఞానినా తత్త్వదర్శినః” – ఇది ఆచార్య శిష్య లక్షణాలను తెలుపుతుంది. మొదటి వాక్యంలో – ‘ఆచార్యున్ని వినయపూర్వకంగా దరిచేరి, సేవలు చేసి మర్యాద పూర్వకంగా ప్రశ్నించాలి’, రెండవ వాక్యములో – ‘ఆచార్యుడు నిజమైన పరతత్త్వమును (భగవానుడు) ఉపదేశిస్తాడు’.
ఆచార్యునికి ఉండ వలసిన లక్షణాలు:
- ఆచార్యుడు సాధారణంగా పిరాట్టి / అమ్మవారు (శ్రీ మహాలక్ష్మి) తో పోల్చబడతారు – వీరి ప్రధానపాత్ర భగవానునికి పురుషాకారం (సిఫారిస్) చేయడం.
- పిరాట్టి మాదిరి, భగవానునికి పూర్తిగా పరతంత్రుడై ఉండును. కేవలం భగవానున్ని మాత్రమే ఉపాయంగా స్వీకరించును. తన సమస్త వ్యాపారములు అతని ఆనందానుభవమునకే.
- కృపా పరిపూర్ణులు – శిష్యున్ని ప్రేమగా స్వీకరించి, ఆత్మ ఙ్ఞానమును మరియు వైరాగ్యము అందించి భగవత్ భాగవత్కైంకర్యము నందు నిమగ్న పరచును.
- మాముణుల శ్రీ సూక్తానుసారం, ఆచార్యుడు పూర్తిగా శిష్యుని ఆత్మ రక్షణకై పాటు పడాలి.
- పిళ్ళై లోకాచార్యులు, ‘ఆచార్యుడు తనయందు, శిష్యుని యందు మరియు ఉపేయం యందు అవగాహన కలిగి ఉండాలి’ అని వివరించారు.
- తాను తన శిష్యునకు ఆచార్యుడను కాను అని తన స్వాచార్యులే తన శిష్యునకు ఆచార్యుడని భావించాలి.
- తన శిష్యుడు కూడ తన శిష్యుడు కాడని ఈ శిష్యుడు తన ఆచార్యునకు శిష్యుడని భావించాలి.
- తాను తన శిష్యున్ని అన్యదా కాక కేవలం భగవానునికి మంగళాశాసనము చేయువానిగా తయారు చేశానని భావించాలి.
- వార్తామాలై అను గ్రంథము మరియు శిష్ఠాచారం (పెద్దల ఆచరణ) అను గ్రంథముల అనుసారం – ఆచార్యుడు శిష్యున్ని మర్యాదానుసారంగా ఆదరించాలి – శిష్యుడు శాస్త్ర ఙ్ఞానుసారం ఆచార్యున్ని తన ఆత్మ సంరక్షణార్థం ఆశ్రయించు చున్నాను అని భావించాలి.
- పూర్వాచార్యుల అభిప్రాయానుసారం – భగవానుడు కూడా ఆచార్యున్ని అపేక్షిస్తాడు. కావుననే మన ఓరాణ్ వళి గురుపరంపరలో ప్రథమాచార్యునిగా ఉన్నాడు భగవానుడు. తనకు కూడా ఒక ఆచార్యుడు ఉండాలని అభిలషించాడు, కావుననే అళిగియ మణవాళ మాముణులను తమ ఆచార్యునిగా స్వీకరించాడు.
శిష్యునికి ఉండ వలసిన లక్షణాలు:
- పిళ్ళై లోకాచార్యుల వచనానుసారం:
- శిష్యుడు భగవానుని నుండి మరియు ఆచార్యుని నుండి తప్ప మిగితా విషయాల యందు (ఐశ్వర్యం మరియు ఆత్మానుభవం) వైరాగ్యం కలిగి ఉండాలి.
- సర్వకాల సర్వావస్థల యందు శిష్యుడు ఆచార్య కైంకర్యమునకు సిద్ధంగా ఉండాలి.
- శిష్యుడు ప్రాపంచిక విషయాల యందు సదా ఏవగింపు కలిగి ఉండాలి.
- శిష్యుడు భగవద్విషయము నందు మరియు ఆచార్య కైంకర్య మందు ఆసక్తి కలిగి ఉండాలి.
- భగవద్భాగవత వైభవం అభ్యసించు నప్పుడు శిష్యుడు అసూయ రహితుడై ఉండాలి.
- శిష్యుడు తన సంపదంతా ఆచార్యుని కృపగా భావించాలి. తన దేహ యాత్రకు కావలసినంత మాత్రమే అనుభవించాలి.
- ఆళవందార్ “మాతా పితా యువతయః” అను శ్లోకములో చెప్పినటుల ఆచార్యుడే తన సర్వస్వమని భావించాలి శిష్యుడు.
- ఆచార్యుని పోషణ అంతా శిష్యునిదే.
- ఉపదేశ రత్నమాలలో మాముణులు, “ఈ లోకములో ఆచార్యుడు వేంచేసి ఉన్నంత వరకు క్షణ కాలమును కూడ అతనిని వీడకుండా ఉండాలి” అని అనుగ్రహించిరి.
- ఆచార్యుడు తనకు ఇచ్చిన ఙ్ఞానమునకు ఉపకారముగా శిష్యుడు సదా ఆచార్యుని వైభవమును కీర్తించాలి.
ఆచార్యుని ఆత్మ సంరక్షణ చేయుట శిష్యునికి అనుచితం /తగదు (అనగా శిష్యుడు తన ఆచార్యుని విషయమందు స్వరూప విరుద్ధ కార్యమును చేయరాదు) మరియు ఆచార్యుడు తన శిష్యుని దేహ రక్షణమును చేయరాదు. (అనగా శిష్యుడు తన ఆచార్యుడు తన దేహ పోషణ చేస్తాడని భావించడం దోషం)
పిళ్ళై లోకాచార్యుల వచనానుసారం: శిష్యుడవడం కూడ చాలా దుర్లభమే (శిష్యునికి ఉండ వలసిన లక్షణాలుండుట అతి దుర్లభం). కావుననే భగవానుడు తానే నరునిగా అవతరించి తన ఆచార్యునిగా నారాయణునిగా తానే అవతరించి తిరు మంత్రమును ఉపదేశం పొంది, ఉత్తమ శిష్యుడు ఎలా ఉండాలో అనుష్ఠించి చూపాడు.
ఈ ఆధారాలను అనుసరించి భిన్న భిన్న ఆచార్యుల వర్గీకరణను తెలుసుకొందాం.
అనువృత్తి ప్రసన్నాచార్య మరియు కృపా మాత్ర ప్రసన్నాచార్యులు
అనువృత్తి ప్రసన్నాచార్య
భగవద్రామానుజులకు పూర్వం ఉన్న ఆచార్యులు తాము శిష్యులను ఎన్నుకొనేటప్పుడు వారి సామర్ధ్యమును మరియు అంకిత భావమును పరిశీలించి తీసుకొనేవారు. ఆచార్యుని గృహములో నివసించడం ఒక సాంప్రదాయంగా ఉండేది. ఆచార్యునితో సహవాసం చేస్తు అతనికి సపర్యలు చేస్తు ఒక సంవత్సరం కాలం గడపవలసి వచ్చేది.
కృపా మాత్ర ప్రసన్నాచార్యులు
ఈ కలియుగమున ఆచార్యులు ఇలా పరీక్షించి శిష్యులను తీసు కోవడం అను సంప్రదాయం వలన శిష్యులు ఆచార్యుల షరతులను అంగీరించ లేకపోయేవారు. కృపా సముద్రులగు భగవద్రామానుజులు దీనిని గ్రహించి సంప్రదాయ నిబంధనలను కొద్దిగా సడలించి ఎవరికైతే భగవద్విషయమందు ఆర్తి ఉన్నదో వారికి ఙ్ఞానమును అందించాలని నిర్ణయించారు. కావున శిష్యుల అర్హతలను “వీరు అర్హమైన వారు” నుండి “వీరు ఆర్తికలవారు” అనే దానికి మార్పు చేశారు. అలాగే తమ కరుణా స్వభావం వలన స్వామి కొన్ని నిబంధనలను ఏర్పరచి తమ శిష్యులకు అనుకరింప చేసి కొన్ని వేల మంది శిష్యులను శ్రీవైష్ణవ సిద్ధాంతమునకు తీసుకువచ్చారు. కావున భగవద్రామానుజులను ఆరంభించి వచ్చిన ఆచార్య పరంపరను కృపా మాత్ర ప్రసన్నాచార్యులని వ్యవహరిస్తాము మన సంప్రదాయంలో.
దీనిని మాముణులు తమ ఉపదేశ రత్నమాలై (పాశురం 37) లో ఇలా కీర్తిస్తారు – ఓరాణ్ వళియాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్| ఏరార్ ఎతిరాశర్ ఇన్నరుళాల్ | పారులగిల్ ఆశైయుడై యోర్కెల్లామ్ ఆరియర్గాళ్ కూఱుమెన్ఱు|పేశి వరంబఱుత్తార్ పిన్|
ఉత్తారకాచార్య మరియు ఉపకారకాచార్య
నాయనారాచ్చాన్ పిళ్ళై తమ “చరమోపాయ నిర్ణయం” అను గ్రంథములో ఈ ఆచార్యులను ఉదహరిస్తారు. ఈ గ్రంథం భగవద్రామానుజుల వైభవమును అతి వైభవముగా కీర్తిస్తుంది.
ఉత్తారకాచార్య
ఉత్తారకాచార్యులనగా సమాశ్రయనములను పొందిన వారికి పరమపదమును లభించేలా చేయు ఆచార్యులు. శ్రీమన్నారాయణుడు, నమ్మాళ్వార్ మరియు భగవద్రామానుజులు ఈ ముగ్గురు మాత్రమే ఉత్తారకాచార్యులు (వాస్తమున యతీంద్ర ప్రవణులగు మణవాళ మామునులు కూడ ఉత్తారకాచార్యులుగా “వరవరముని శతకం” లో ఎరుంబి అప్పాచే నిర్ణయించబడిరి).
- శ్రీమన్నారాయణుడు ప్రథమాచార్యులు, సర్వఙ్ఞుడు మరియు సర్వ శక్తిమంతుడు కావున మోక్షమును సులభంగా అనుగ్రహించగలడు ఎవరికైనను.
- నమ్మాళ్వార్, శ్రీమన్నారాయణు నిచే ఎన్నుకోబడి సంసారులను సరిదిద్ది వారికి ఙ్ఞానమును ప్రసాదించి మోక్షమును ప్రసాదించు సామర్థ్యమును కలిగినవారు. దీనిని వారిచే కృప చేయబడ్డ తిరువాయ్మొళిలో“పొన్నులగు ఆళీరో, భువని ముళుత్తు ఆళీరో” నుంచి గ్రహించవచ్చు – శ్రీమన్నారాయణునికి దూతగా పక్షులను పంపుతు, ‘ఎప్పుడైతే నా మాటలను స్వామికి అందచేస్తారో మీకు లీలా విభూతిని మరియు నిత్య విభూతిని సంభావనగా అనుగ్రహిస్తాను’.
- భగవద్రామానుజులు నిత్య విభూతికి మరియు లీలా విభూతికి నాయకుడిగా “ఉడయవర్” అను నామధేయంతో శ్రీరంగనాథునిచే మరియు తిరువేంగడముడయాన్ (తిరుమల శ్రీనివాసుడు) చే నిర్ణయించ బడ్డారు.కేవలం భగవత్ అనుభవమందే మునగక, లీలా విభూతిలో 120 సంవత్సరములు వేంచేసి ఉండి భగవత్కైంకర్యమును చేశారు. ఆలయాల వ్యవస్థను సరిదిద్ది, వేల మంది శిష్యులను కలిగి, 74 మంది సింహసనాథి పతులను సంప్రదాయ విస్తరణకై ఏర్పాటు చేశారు.
శ్రీమన్నారాయణుడు శాస్త్రానుసారం ప్రవర్తిస్తు జీవుల కర్మానుసారం జీవాత్మలకు మోక్షమును ఇవ్వగలడు లేదా ఈ సంసారమున ఉంచ గలడు. నాయనారాచ్చాన్ పిళ్ళై ఉత్తారకత్వమును భగవద్రామానుజుల యందే ఉన్నదని సిద్ధాంతరీకరిస్తారు.
నమ్మాళ్వార్ ఙ్ఞానమును పొంది పరోప దేశమును చేస్తు పూర్తిగా భగవదనుభవం నందు మునిగి భగవంతుని యందున్న ఆర్తిచే పిన్న వయసులో ఈ సాంసారిక లోకమును వీడుతారు.
పరమ కృపాళువులైన భగవద్రామానుజుల భగవదనుభం ఉన్న వారందరికి తమ ఆశ్వీరచనమును అనుగ్రహించారు.
నాయనారాచ్చాన్ పిళ్ళై మాత్రం భగవద్రామానుజులే ఉత్తారక సంపూర్ణత్వం కలవారిని ధృడంగా నిర్ణయించారు.
ఉపకారకాచార్య
వీరు ఉత్తారకాచార్యులను చేర్చు ఆచార్యులు. మన సంప్రదాయములో భగవద్రామానుజులను అనుసరించుచు వచ్చు ఆచార్యపరంపరలన్నియు ఉపకారకాచార్యులుగా నిర్ణయించబడ్దారు. మనకు పంచసంస్కారములను అనుగ్రహించు ఆచార్యులు, తమ గురుపరంపరాధారంగా ఈ జీవాత్మను భగవంతునికి ఆధీనపరచి ఈ సంసార బాధలనుండి విముక్తిని కలిగించి మోక్షము నిమ్మని భగవద్రామానుజులను ప్రార్థిస్తారు.
ఉత్తారక మరియు ఉపకారక ఆచార్యులు ఇరువురు సమాన ఆదరణీయులే కాని భగవద్రామానుజులకు ఒక ప్రత్యేక స్థానమున్నది మన సంప్రదాయమున. మాముణులు తమ ఉపదేశ రత్నమాలైలో తమ గురుపరంపరను తమ స్వాచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళైతో ఆరంభించి భగవద్రామానుజులతో ముగించి మనకు సరైన పద్ధతిని తెలుపుతారు.
సమాశ్రయణ ఆచార్య మరియు ఙ్ఞాన ఆచార్య
- సమాశ్రయణ ఆచార్య – మనకు పంచ సంస్కారములను అనుగ్రహించు ఆచార్యులు.
- ఙ్ఞాన ఆచార్య – మన అత్మ ఙ్ఞానమునకు పెంపొందించుటకు గ్రంథ కాలక్షేపములను మొదలైనవి అనుగ్రహించువారు.
సాధారణంగా మనం సమాశ్రయణం అనుగ్రహించిన ఆచార్యునికే కైంకర్యం చేస్తాము, అలాగే ఙ్ఞానాన్ని అనుగ్రహించిన ఆచార్యుడు కూడా వీరితో సమాన ఆదరణీయులే. ఇద్దరు సములే. ప్రతి శ్రీవైష్ణవుడు తమ స్వాచార్యులను విధిగా గౌరవించాలని శ్రీ వచన భూషణం పేర్కొంటుంది.
సంగ్రహముగా చెప్పాలంటే శిష్యుని సర్వస్వం అంతా ఆచార్యుదే. ఆచార్యుని జీవన యాత్ర కొనసాగించుటకు అతని పోషణ అంతా శిష్యునిదే. శిష్యుడు తన జీవితమంతా ఆచార్యునితో ఎల్లప్పుడు సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి.
ఆచార్య శిష్యుల మధ్య సంభవించిన విశేషమైన సంఘటలను పరిశీలిద్దాం:
- మణక్కాల్ నంబి సర్వ విధ సేవలను వారి ఆచార్యులకు (ఉయ్యక్కొండార్) చేసే వారు.
- శ్రీవైష్ణవ సంప్రదాయంలోనికి ఆళవందార్ను తీసుకరావడానికి మణక్కాల్ నంబి ఎంతో శ్రమించారు.
- భగవద్రామానుజులు తాము కూరత్తాళ్వానుకు ఆచార్యులైనప్పటికి వారికి అత్యంత గౌరవమును ఇచ్చేవారు.
- భగవద్రామానుజులు, కూరత్తాళ్వాను విషయమున కలత చెందినప్పుడు, ఆళ్వాన్ , ‘స్వామి దాసుడు దేవరవారి వస్తువు, తాము తమకు ఇష్ఠం వచ్చినట్లుగా వినియోగించు కొనవచ్చును’ అని విన్నవించారు.
- ఎంబార్ వారి ఆచార్యశయ్యపై ముందుగా శయనించేవారు, ఆచార్య తల్పం ఎక్కడం పాపం కదా! అయినప్పటికి ఆచార్యులు సుఖంగా శయనించాలి కదా దానికై ఎంబార్ తాము ఒక సారి శయనించి ఏదైన కుచ్చుకొనే పదార్థాలు ఉన్నాయా అని పరిక్షించేవారు. తనకు పాపం అంటినాసరే ఆచార్యులు సుఖంగా శయనించాలని వారి సదుద్దేశం.
- భగవద్రామానుజులు తమను ఆదరించిన మాదిరే పరాశరభట్టర్ను ఆదరించమని అనం తాళ్వాన్ కు చెప్పేవారు.
- పరాశర భట్టర్ మరియు నంజీయర్ మధ్యన విశేషమైన సంప్రదాయ సంభాషణలు జరిగేవి. పిమ్మట నంజీయర్ సర్వం వదిలి వేసి సన్యాసాశ్రమమును స్వీకరించారు. అయినను తమ ఆచార్యుల సేవకు ఈ ఆశ్రమం అడ్డు వస్తే తమ త్రిదండమును వదిలి వేస్తాననేవారు.
- నంపిళ్ళై కొన్ని పాశురాలకు భిన్న అభిప్రాయం చెప్పినప్పటికి నంజీయర్ వారిని ప్రోత్సహించేవారు.
- పిన్బళిగియ పెరుమాళ్ జీయర్ తమ ఆచార్యులగు నంపిళ్ళై కావేరినం చేసి తిరిగి వస్తున్నపుడు వారి వీపును దర్శించాలనే కోరికతో ఈ లీలా విభూతిలో ఉండాలని కోరుకొనేవారు.
- తిరువాయ్మొళి పిళ్ళైని శ్రీవైష్ణవ సంప్రదాయమునకు తీసుకరావాలని కూరుకులోత్తమ దాసులు చాలా శ్రమించారు.
- మణవాళ మాముణులు, తమ ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై ఆఙ్ఞను తమ లక్ష్యంగా శిరసావహించారు. తమ ఆచార్యుల నుండి శ్రీ భాష్యమును విన్నప్పటికి తమ జీవిత కాలమంతా అరుళిచ్చెయళ్ (ఆళ్వారులు అనుగ్రహించిన ద్రావిడ ప్రబంధములు) మరియు రహస్య గ్రంథములపైననే దృష్ఠిని కేంద్రీకరించిరి.
- శ్రీరంగనాథుడు తమ దేవేరులైన శ్రీదేవి భూదేవితో కలసి ఒక సంవత్సరమంతా తమ ఉత్సవాలన్నింటిని ఆపి వేసుకొని తమ సన్నిధిన శ్రీ మణవాళ మాముణులచే ‘ఈడు’ కాల క్షేపమును శ్రవణం చేసి మాముణుల యందు ఆచార్య భావనతో ఆచార్య సంభావనగా తమ శేషపర్యంకమును మరియు ప్రతి పారాయణకు ముందు అనుసంధానం చేయు “శ్రీశైలేశ దయాపాత్రం” అనే శ్లోకాన్ని విన్నవించారు.
- మాముణులు తమ ఆసనాన్ని మరియు పంచ సంస్కారములు చేయు తమ శంఖ చక్రముద్రలను పొన్నడిక్కాళ్ జీయరుకు ఇచ్చి అప్పాచ్చి ఆణ్ణన్కు పంచ సంస్కారములు చేయమని చెప్పారు.
ఇలా చాలా సంఘటనలు మన సంప్రదాయమున ఉన్నవి. కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తుతించ బడ్డాయి. మన సంప్రదాయమంతా ఆచార్య శిష్య సంబంధముతో ముడి పడి ఉన్నది.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: https://granthams.koyil.org/2015/12/simple-guide-to-srivaishnavam-acharya-sishya/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
0 thoughts on “శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఆచార్య – శిష్య సంబంధం”