శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఆచార్య – గురుపరంపర

paramapadhanathanపరమపదమున శ్రీ దేవి (శ్రీ మహాలక్ష్మి) భూదేవి, నీళా దేవి సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో

కిందటి సంచికలో మనం గురుపరంపర ప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్య దేశములు మరియు దివ్య ప్రబంధ వైభవమును తెలుసుకుందాము.

శ్రీ మన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణ గుణములతో కూడు కొని ఉన్న సర్వోన్నత పరతత్త్వం. తన విశేష నిర్హేతుక కృపా కటాక్షములచే కొంత మంది జీవాత్మలపై కృప చూపడం వల్ల ఆ జీవాత్మలు ఆళ్వార్లు  (శ్రీమన్నారాయణుని గురించి ప్రబోధించిన వైభవం కలిగిన యోగులు) అయ్యారు. తాను నిత్యసూరుల (నిత్యాత్మలు) కు, ముక్తుల (ముక్తి చెందిన జీవాత్మలు) కు కూడా సర్వతంత్ర స్వతంత్ర నియామకుడు అయినా, ఎల్ల వేళలా ఒక వేదనలో ఉండేవారు.

ఆ ఆవేదన అంతా లౌకిక సంసారమున బంధింప బడిన జీవాత్మల కొరకై, ఎందు వలెననగా, పరమాత్మ సమస్త జీవులకు తండ్రిలాంటి వాడు, తన సంతానం ఈ సంసారమున  జరా మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటే చూసి భరించనివాడు. సరే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది – సర్వ శక్తిమంతుడైన భగవానునకు వేదన / బాధ ఉంటుందా? అనుకుంటే, మరి భగవానుడు సత్యకాముడు (అన్నీ కోరికలు తీరినవాడు) మరియు సత్య సంకల్పుడు (తన సంకల్ప మాత్రముచే అన్నింటిని నెరవేర్చుకొనువాడు) కదా – దీనికి మన పూర్వాచార్యులు ఇలా తెలిపారు – ఈ జీవాత్మల ఉజ్జీవనము కొరకై ఉండు ఆవేదన కూడ అతని కళ్యాణ గుణమే. ఎలాగనగా  సర్వతంత్ర స్వాతంత్ర్యము కలిగిన తండ్రి తన సమీపాన ఉన్న సంతానంతో సంతోషంగా ఉన్నను తన బాధ అంతా తన నుండి దూరంగా ఉండి కష్ట పడుతున్న సంతానం పైనే ఉండును కదా. భగవానుడు కూడ సర్వతంత్ర స్వాతంత్ర్యము కలిగి నప్పటికి తన బాధ అంతా ఈ సంసారంలో అనాదిగా అఙ్ఞానం మరియు అవిధ్యచే ఆవరించ బడిన జీవాత్మల దురవస్థ గురించియే.

ఈ జీవాత్మలు ఉజ్జీవించడానికి భగవానుడు ఈ జీవాత్మలకు సృష్ఠి సమయాన దేహాన్ని మరియు ఇంద్రియాలను, శాస్త్రములను అనుగ్రహిస్తాడు. శ్రీ రామ శ్రీ కృష్ణుడిగా తానే అవతరిస్తాడు. ఇనన్నీ అనుగ్రహించినప్పటికి ఈ జీవుడు భగవానుని యొక్క పరత్వమును అంగీకరించక అఙ్ఞానముతో ఉంటాడు. ఒక వేటగాడు ఒక జింక పట్టు కొనుటకు ఇంకొక జింకను ఎలాగైతే ఎరవేస్తాడో ఆమాదిరి ఈ జీవాత్మలను ఉద్ధరించుటకు వేరొక జీవాత్మలను ఉద్భవింప చేస్తాడు. వారే ఆళ్వార్లుగా పరిగణిస్తాము. ఆళ్వార్లు  అనగా భగవంతుని విషయ మందు మాత్రమే మునిగిన వారని అర్థం. భారతావనిలో దక్షిణ దేశమున పవిత్ర స్థలముల యందు ఈ ఆళ్వార్లు అవతరిస్తారని శ్రీ వేద వ్యాసులు శ్రీమద్భాగవతమున తెలిపినారు.

Azhwars

ఆళ్వార్లు  శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తు పాశురాలను (పద్యాలను) కృప చేశారు. ఇవన్నీ కలసి సుమారు 4 వేల పాశురాలు, కావున వీటిని  నాలాయిర దివ్య ప్రబంధముగా పేర్కొంటారు. దివ్య మనగా విశేషమైనది అని ప్రబంధమనగా పద్యముల కృతి (కేవలం భగవానున్ని కీర్తించునవి) అని అర్థవివరణ. ఆళ్వార్లు  అర్చారూపమున భగవానుడు వేంచేసి ఉన్నస్థలములను కీర్తించారు వాటినే దివ్య దేశములుగా పిలుస్తారు. మొత్తం 108 దివ్యదేశములున్నవి.106 దివ్య దేశములు భారతావనిలో వివిధ ప్రదేశముల యందు ఉన్నవి (నేపాల్తో కూడుకొని). క్షీరాబ్ధి (పాల సముద్రం) ఈ లీలా విభూతికి దూరంగా ఎవరు చేరుకోలేని ప్రదేశం. మోక్షం పొందిన జీవులు చేరుకొను పరమపవిత్ర స్థలం పరమపదం. ఈ 106 దివ్య దేశముల యందు శ్రీరంగం ప్రథానమైనది, ఆ తరువాత తిరుమల, కాంచీపురం, ఆళ్వార్ తిరునగరితిరువల్లిక్కేణి మొదలైనవి కొన్ని ముఖ్య దివ్య దేశములు. భగవానుడు ఐదు రూపములందు ఉంటాడు. అవి పరత్వముగా పరమపదమున, వ్యూహ రూపమున క్షీరాబ్ధిలో, అంతర్యామిగా జీవుల హృదయములందు, రామ కృష్ణాదిగా విభవ రూపమున, చివరిదైన రూపముగా అర్చావతారం (విగ్రహ రూపం) దివ్య స్థలములందు వేంచేసి ఉంటాడు. ఈ అర్చావతారం సర్వ సులభుడిగా అందరికి సదా చేరువలో ఉండే భగవానుని రూపముగా చెప్పబడుతుంది. మన పూర్వాచార్యులందరు దివ్య దేశమున నిత్య నివాసం చేస్తు భగవానునికి, భాగవతులకు కైంకర్యం చేస్తు తమ జీవనాన్ని గడిపారు.

వేదం / వేదాంతము యొక్క సారం సరళంగా తమిళ దివ్య ప్రబంధములో కూర్చబడింది. ఈ దివ్య ప్రబంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యం  ఙ్ఞాన ప్రసారం వలన  జీవాత్మలను ఉజ్జీవింప చేయడం. ఆళ్వారుల ఈ దివ్య ప్రబంధం వేల సంవత్సరముల నుండి ఆచార్యుల ద్వారా నాథమునుల నుండి ప్రారంభించ బడి శ్రీ రామానుజలు మాధ్యముగా కొనసాగుతూ శ్రీ మణవాళ మాముణుల వరకు పరంంపరగా వస్తున్నది. అఙ్ఞానులు ఈ ఆళ్వారుల పాశురములను సాధారణ తమిళ పద్యములుగా భావిస్తున్నారు కాని ఙ్ఞానాధికులైన ఆచార్యులు ఈ పాశురాలు శ్రీమన్నారాయణుని దివ్య తత్త్వమును (భవ బంధ విమోచాకాలు) ప్రబోధిస్తున్నాయని, శ్రీమన్నారాయణునికి మనం చేయ వలసిన కైంకర్యం ఈ దివ్య ప్రబంధం ద్వారా అవగతమగు చున్నదని విశద పరిచారు. మన పూర్వాచార్యులు తమ జీవితాన్నంతటిని ఈ ప్రబంధ అభ్యాసమునకై మరియు ఉపదేశించుటకే వెచ్చించారు.

azhwar-madhurakavi-nathamuni

ఆళ్వారుల అనంతరం దివ్య ప్రబంధమునకు కొంత కాలం గడ్డు పరిస్థితి ఏర్పడింది. క్రమంగా నమ్మాళ్వారుల అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి యందు నాథమునులు బహు శ్రమకోర్చి నాలాయిర దివ్య ప్రబంధమును అర్థానుసంధానముగా నమ్మాళ్వార్ కృపతో వారి వద్ద నుండి పొందారు. ఈ దివ్య ప్రబంధమును నాథమునులు నాలుగు విభాగాలుగా చేశారు. ఇది అందరికి సుపరిచితమే.  నాథమునులు ఈ ప్రబంధమును తమ శిష్యులకు నేర్పించి ప్రచారం గావించారు. అలాగే నమ్మాళ్వార్ విషయమున మధురకవి ఆళ్వార్ పరమ భక్తితో అనుగ్రహించిన కణ్ణినుణ్ శిరుత్తాంబును  నాథమునులు వారి గౌరవార్థం నాలాయిర దివ్య ప్రబంధమున చేర్చారు.

Ramanuja_Sriperumbudur

ఆదిశేషుల అవతారమైన శ్రీరామానుజులు గురుపరంపర ద్వారా వస్తున్న ఈ విశేషమును యామునాచార్యుల కృపచే వివిధ ఆచార్యుల ద్వారా అభ్యసించారు. ఆళ్వారుల వైభవమును మరియు వారి కృతులను  శ్రీరామానుజులు సమాజంలోని వివిధ స్థాయిలలో ఉన్న ప్రజలందరికి  ప్రచారం గావించి శ్రీవైష్ణవ సంప్రదాయమును ప్రబల పరిచారు.  శ్రీరామానుజుల విశేష కృషి ఫలితంగా ఈ సంప్రదాయమునకు ‘శ్రీరామానుజ దర్శనం’ అని స్వయంగా శ్రీ రంగనాథునిచే స్థాపించ బడింది. అలాగే శ్రీ రామానుజుల విషయంగా శ్రీ తిరువరంగత్త అముదనారు అనుగ్రహించిన రామానుజ నూఱ్ఱందాదిని నాలాయిర దివ్య ప్రబంధమున మన పూర్వాచార్యులచే చేర్చబడింది. ఈ శ్రీరామానుజ నూఱ్ఱందాది ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి చెందినది – ఎలాగైతే బ్రాహ్మణులు గాయత్రిని ప్రతి రోజు పఠిస్తారో అలాగే ప్రతి  ప్రపన్నులు (పంచ సంస్కారము పొందినవారు ) ప్రతి రోజు విధిగా దీనిని పఠించాలి.

nampillai-goshti1
 నంపిళ్ళై కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళైగారు ఆ కాలమున (శ్రీ రామానుజులుఎంబార్, భట్టర్ మరియు నంజీయర్ పరంపర తరువాత) గొప్ప ఆచార్యులుగా విరాజిల్లుతుండేవారు. వీరు శ్రీ రంగమున నిత్యవాసం చేయుచు ఆకాలమున శ్రీవైష్ణవ సంప్రదాయమునకు అధికారిగా వెలుగొందేవారు. వీరి కాలమున శ్రీ రంగమున  నాలాయిర దివ్య ప్రబంధమునకు అతి ప్రాధాన్యం ఇవ్వబడేది.  పెరియ పెరుమాళ్-శ్రీ రంగనాథుని సన్నిధిన వీరు కాల క్షేపమున సదా నిమగ్నమై ఉండేవారు. పెరియ పెరుమాళ్ నిలబడి గవాక్షం / కిటికి గుండా వీరి ప్రవచనమును శ్రవణం చేసేవారట. అలాగే నంపిళ్ళై శిష్యులు కూడా దివ్య ప్రబంధ అర్థమును ప్రచారం గావించారు. నంపిళ్ళై  ప్రధాన శిష్యులు వ్యాఖ్యాన చక్రవర్తి (వ్యాఖ్యాతలలో శ్రేష్ఠులు) అను బిరుదాంకితులైన పెరియ వాచ్చాన్ పిళ్ళై  నాలాయిర దివ్య ప్రబంధమునకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి పూర్వాచార్యులచే బహు ప్రశంసించ బడ్డారు.  నంపిళ్ళై  మరొక ప్రధాన శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై, నంపిళ్ళై యొక్క నాలాయిర దివ్య ప్రబంధ ప్రవచనములను గ్రంథస్థ పరిచారు. తిరువాయ్మొళికి ఉన్నవీరి  వ్యాఖ్యానము ‘ఈడు’ (ఈడు ముపత్తు ఆరాయిరప్పడి) గా ప్రసిద్ధి చెందినది.

pillailokacharya-goshtiపిళ్ళై లోకాచార్యుల కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళై అనంతరం ఈ సత్సాంప్రదాయమున పిళ్ళై లోకాచార్యులు ఉత్తరాధికారిగా ఉండి దివ్య ప్రబంధ రహస్యార్థములను తమ రహస్య త్రయ గ్రంథములో పొందుపరచారు. ఈ రహస్యార్థములు వివిధ ఆచార్యులచే వివిధ గ్రంథములలో వివరింప బడ్డాయి.   పిళ్ళై లోకాచార్యులు ఈ రహస్యార్థాలను తమ అష్ఠాదశ రహస్య గ్రంథములలో పొందు పరిచారు. కాని వారి చరమ దశలో శ్రీరంగం మొఘల్ ఆక్రమణ దారులచే బంధింపబడి అన్ని నాశానం చేయబడ్డాయి.  పిళ్ళై లోకాచార్యులు  ఆక్రమణదారుల నుండి తాము  నంపెరుమాళ్ (శ్రీ రంగనాథుని ఉత్సవ మూర్తి) తో తప్పించుకున్నారు. కాని ప్రమాదవశాత్తు వారు అటవీ ప్రయాణ క్లిష్ఠముల నుండి తప్పించు కోలేక పరమపదమును చేరుకున్నారు. చాలా కాలం ఈ విపత్తును శ్రీరంగ ప్రజలు అనుభవించారు. కొన్ని దశాబ్ధముల తర్వాత ఆక్రమణదారులు నిష్క్రమించి ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత నంపెరుమాళ్ శ్రీ రంగం తిరిగి చేరుకొన్నారు.

srisailesa-thanian-small

ఆ శ్రీరామానుజుల పునరవతారమైన మణవాళ మాముణులు  ఆళ్వార్ తిరునగరిలో అవతరించారు. మాముణులుతిరువాయ్మొళి పిళ్ళై గారి శిష్యులయి వారి వద్ద మరియు తమ తండ్రిగారి వద్ద వేద వేదాంతములను మరియు దివ్య ప్రబంధములను అధికరించారు. వారి ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై గారి ఆఙ్ఞ మేరకు శ్రీరంగం చేరి తమ జీవితాన్నంతటిని సత్సాంప్రదాయ అభివృద్ధికి అంకితమిచ్చారు.  మాముణులు తాము స్వయముగా లుప్తమైన సాంప్రదాయ సాహిత్యాన్ని వెదకి దానిని పఠనం చేసి ముందు తరాలవారికి అందేలా వాటిని తాటాకులపై లిఖింప చేసి భద్రపరిచారు. సాంప్రదాయ వైభవము కాపాడుటకు మరియు దానిని విస్తరింప జేయుటకు వీరు చేసిన అవిరళ కృషి మరియు అకుంఠిత దీక్షను లోకానికి తెలియ పరచుటకు, స్వయంగా శ్రీరంగనాథుడు మాముణులను వద్ద తిరువాయ్మొళి కాలక్షేపాన్ని శ్రవణం చేసి, కాలక్షేపం చివరి రోజున ఓ చిన్ని బాలుని వలె వచ్చి, వీరిని ఆచార్యులుగా భావించి అత్యంత వైభవము గల ‘శ్రీ శైలేశ దయా పాత్రం’ అను తనియను శిష్య భావనతో వారికి  సమర్పించారు. కాల క్రమేణ వివిధ ఆచార్య పురుష వంశముల నుండి పరంపరగా వచ్చిన ఆచార్యులు దివ్య ప్రబంధమును తరువాతి వారికి బోధించ సాగారు.

భగవానునుని  ఆవేదనను తీర్చి మరియు జీవాత్మ ఉజ్జీవించడము మాత్రమే అవతార ప్రయోజనముగా కల  ఆళ్వారుల దివ్య ప్రబంధములను మన పూర్వాచార్యులు  భద్ర పరిచారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. శ్రీవైష్ణవులందరు ఈ నాలాయిర దివ్య ప్రబంధమును అర్థయుక్తంగా నేర్చుకొని దీనితోనే మన జీవితకాలాన్ని వెళ్ళదీయాలి అని పూర్వాచార్యుల అభిమతం.

ఈ క్రింది వాటిని పరిశీలించిన ఆళ్వారుల మరియు దివ్య ప్రబంధము యొక్క వైభవం తెలుసుకొనవచ్చు.

దివ్య ప్రబంధము యొక్క అనువాదమును వివిధ భాషలలో చదవాలని ఆశించినవారు, ఇక్కడ చూడవచ్చు https://divyaprabandham.koyil.org

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: https://granthams.koyil.org/2015/12/simple-guide-to-srivaishnavam-dhivya-prabandham-dhesam/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment