అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhV63nRcaHTfJ4iwK

మన శ్రీ వైష్ణవ సత్సాంప్రదాయము ఉభయ వేదాంత ఆధారితము. ఉభయ అనగా రెండు మరియు వేదాంతము అనగా శీర్ష భాగము. సంస్కృతమున వేదము (ఉ: ఋగ్, యజుర్, సామ, అథర్వణ) మరియు వేదాంతము (ఉపనిషత్తులు) అను రెండు భాగములు, ఇంకను ద్రావిడమున వేదము (దివ్య ప్రబంధము) మరియు వేదాంతము (వ్యాఖ్యానములు) అను రెండు భాగములు కలవు. ఈ రెండూ రెండు కనులుగా పరిగణింపబడి, ఒకే ప్రాముఖ్యము కలిగి ఉన్నవి. ఆయినను, ఆళ్వార్ల ద్వారా దివ్య ప్రబంధములు వెలువరింబడటము వలనను, వారు ఎమ్పెరుమాన్ల దివ్య కటాక్షముతో అకళంకిత జ్ఞానము పొందిన వారగుట చేత సంస్కృత వేద సారము అయిన నాలాయిర దివ్య ప్రబంధములను సకల జీవుల ఉజ్జీవనమునకై మాత్రమే వెలువరించడము వలన, మనకు వాటి యందు అధిక ప్రావణ్యము కలదు.

అధ్యయనము అనగా పఠనము, అభ్యసించడము, పునశ్చరణ మొదలుగునవి. వేదము ఆచార్యుల వద్ద శ్రవణము గావించి, దానిని మరల మరల మననము చేయడము ద్వారా అభ్యసింపబడుతుంది. వేద మంత్రములు నిత్యానుష్టానములో భాగముగా కూడా పఠింప బడతాయి. అనధ్యయనము అనగా వేద పఠనము నిలిపి వేయడము. సంవత్సరములో కొన్ని సమయములలో వేదము పఠింపబడదు. ఈ సమయము ఇతర శాస్త్ర భాగములు అయిన స్మృతి, ఇతిహాసములు, పురాణములు మొదలగు శాస్త్రములను పఠించడానికి ఉపయుక్తము. అధ్యయన కాలము నందును అమావాస్య, పౌర్ణమి మొదలగు దినములలొ వేద పఠనము నిషిద్ధము. ఈ సాంప్రదాయము సంస్కృత వేదముతో సమానముగా పరిగణింప బడే ద్రావిడ వేదమునకు కుడా కలదు. మనము ఇప్పుడు దివ్య ప్రబంధము అనధ్యయన కాలము యొక్క ప్రాశస్త్యమును తెలుసుకొందాము.

అధ్యయనోత్సవము అనధ్యయన కాలములో భాగము. అధ్యయనోత్సవము నమ్మాళ్వార్ల మోక్షమును స్తుతిస్తుంది. అధ్యయనోత్సవము మరియు అనధ్యయన కాలము మన సాంప్రదాయములో పరస్పరాన్వయములు. ఈ చరిత్ర అంతయు శ్రీ పెరియ వాచ్చాన్ పిళ్ళై స్వామి ప్రసాదించిన “కలియన్ అరుళ్ పాడు” (https://srivaishnava-literature.blogspot.in/p/kaliyan-arul-padu/)  అను గ్రంథమున వివరింపబడినది (శ్రీ పుత్తూర్ కృష్ణ స్వామి అయ్యంగార్లచే ప్రచురింపబడిన (పెరియ వాచ్చాన్ పిళ్ళై శ్రీ సూక్తమాల -1 లో భాగముగా).

ఇక ఈ గ్రంథములో పొందుపరచ బడిన ఐతిహ్యములను క్లుప్తముగా తెలుసు కొందాము.

  • శ్రీమన్నారాయణుడు, తమ నిర్హేతుక కరుణా కటాక్షములచే సకల జీవుల ఉజ్జీవనమునకై, ఈ సంసారములో కోయిల్ (శ్రీరంగం), తిరుమలై (తిరువేంకటమ్), పెరుమళ్ కోయిల్ (కాంచిపురమ్) మొదలగు పుణ్య క్షేత్రములలో అర్చారూపములో సర్వ సులభుడుగా, సర్వారాధ్యుడుగా వేంచేసారు.
    ఆళ్వారులలో చివరివారైన తిరుమంగయాళ్వార్, శ్రీమన్నారాయణుని నిర్హేతుక కృపచే అనుగ్రహింప బడి, ఎన్నో అర్చావతారములను సేవించిన పిమ్మట శ్రీ రంగము వేంచేసి, అచ్చటనే అనేక మహత్తర కైంకర్యములను సమర్పిస్తూ నివసించారు. తిరుమంగయాళ్వార్ తనను తాను “ఇరున్తమిళ్ నూల్ పులవన్ మంగయాళన్” గా (ఇరున్తమిళ్ నూల్ – తిరువాయ్మొళి, పులవన్ – కవి, తిరువాయ్మొళి ప్రబంధములో ప్రావణ్యము కలవారైన, మంగయాళన్ – తిరుమంగయాళ్వార్) అభివర్ణించుకొని, తిరువాయ్మొళి యందు మిక్కిలి ప్రావణ్యము కలిగి, ఆ పాశురములను నిత్యమూ అనుసంధిచు చుండెడివారు.

  • ఒకానొక తిరుక్కార్తె (కార్తీక మాసం, కృత్తిక నక్షత్రము, పౌర్ణమి తిధి) దినమున, నంపెరుమాళ్ మరియు దేవేరుల తిరుమంజనమ్ (దివ్య స్నానం) తరువాత వేంచేసి యుండగా, ఆ గొప్ప భక్త సందోహములొ, తిరుమంగయాళ్వార్, తిరునెడుందాండగమ్ అను దివ్య ప్రబంమును వ్యక్త పరచి ఎంపెరుమాన్ సమక్షములొ దివ్యముగా గానము చేశారు. తిరువాయ్మొళి పాశురములను కూడ దివ్యముగా గానము చేశారు.
  • నంపెరుమాళ్ ఆ దివ్య గానమునకు ఎంతో ఆనందించి, తిరుమంగైయాళ్వార్లను వరము కోరమనగా, ఆళ్వార్ రెండు వరములను కోరెను.
  • తిరుమంగై యాళ్వార్లకు రెండు కోరికలుండెడివి
      • అవి తిరువాయ్మొళికి సంస్కృత వేదముతో సామ్యము.
      • మరియు నంపెరుమాళ్ సమక్షములో మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి నాడు అధ్యయనోత్సవము (నమ్మాళ్వార్ మోక్షము) సందర్భములో తిరువాయ్మొళి దివ్య ప్రబంధము అనుసంధానము.
  • ఎంపెరుమాన్ సంతోషముగా ఆ వరములను ఆమోదించి, వెంటనే ఆ సభను, తన తిరుమేనికి అద్దగా మిగిలిన నూనెను, చాలా సమయము నుంచి దివ్య ప్రబంధమును గానము చేయుచున్న కలియన్ కు స్వరము చెడకుండ ఉండునట్లు ఈయ వలసినదిగా ఆజ్ఞాపించెను.
  • అనంతరమ్ ఆళ్వార్ తిరునగరిలో అర్చారూపములో వేంచేసి యున్న నమ్మాళ్వార్లకు వర్తమానము పంపగా, వెంటనే నమ్మాళ్వార్ అక్కడ నుంచి శ్రీ రంగమునకు చేరుకున్నారు.
  • తిరుమంగై ఆళ్వార్ వైకుంఠ ఏకదశి మొదలు 10 రోజులు తిరువాయ్మొళి అనుసంధానమునకు ఆదేశించారు. ఉదయమున వేద పారాయణము సాయం వేళల తిరువాయ్మొళి అనుసంధనము జరిగెడెది. చివరి రోజున, నమ్మాళ్వార్ నంపెరుమాళ్ దివ్య చరణములను తమ శిరస్సుతో తాకే ఘట్టము ఎంతో భక్తి పారవశ్యముతో అనుకరింపబడెడిది. ఉత్సవముల అనంతరము, నమ్మళ్వార్ తిరిగి అళ్వార్ తిరునగరి చేరుకొనేవారు. ఇలా ప్రతి సంవత్సరము సంభవించేది.
  • కొంత కాలము తరువాత, కలియుగ ప్రభావమున, సాంప్రదాయములు అడుగంటి, దివ్య ప్రబంధములు లుప్తములయి, నమ్మాళ్వార్ శ్రీ రంగమును దర్శించడము ఆగి పోయినది.
  • పిమ్మట శ్రీమన్ నాథమునులు అవతరించి, కాల క్రమమున శ్రీమన్నారాయణుని దయతో, ఆళ్వార్లు మరియు దివ్య ప్రబంధముల గురించి తెలుసుకొన్నారు. శ్రీమన్ నాథముని, ఆళ్వార్ తిరునగరి దర్శించి, మధురకవి ఆళ్వార్ల కణ్ణినుణ్ శిరుత్తాంబును అభ్యసించి, నమ్మాళ్వార్ల కరుణా ప్రభావముతో 4000 దివ్య ప్రబంధములను మరియు అందలి భావములను గ్రహించిరి.
  • శ్రీమన్ నాథమునులు తమ శిష్యులకు దివ్య ప్రబంధమును ఉపదేశించి, శ్రీ రంగమునకు వేం చేసి మరల అధ్యయనోత్సవమును ఉద్ధరించారు. అంతే గాక, ఆళ్వార్ల మరియు 4000 దివ్య ప్రబంధముల ప్రాశస్త్యమును నమ్మాళ్వార్ల ద్వారా గ్రహించి, నమ్మాళ్వార్ల మోక్షోత్సవమును కూడ పునరుద్ధరించి, వారి శ్రీ రంగ దర్శనమును తిరిగి ఏర్పాటు చేశారు.
  • ఎంపెరుమాన్ తిరువాయ్మొళి దివ్య ప్రబంధమునకు వేద సామ్యము ధ్రువీకరించి నందు వలన. శ్రీమన్ నాథమునులు వేదమునకు వలెనే తిరువాయ్మొళి మరియు ఇతర దివ్య ప్రబంధములకు అనధ్యయన కాలము నిర్ణయించిరి. ఈ అనధ్యయన కాలము తిరుక్కార్తె దినమున ప్రారంభమయి, కోవెలలో అధ్యయన ఉత్సవము ప్రారంభమయే ముందు ముగుస్తుంది. అలాగే అధ్యయన కాలము అధ్యయన ఉత్సవము మొదటి రోజున ప్రారంభమయి, తిరుక్కార్తె దినమున ముగుస్తుంది.
  • నమ్మాళ్వార్లకు ఆళ్వార్ తిరునగరి యందు ఆహ్వానము పంపే సాంప్రదాయమును మరల ఏర్పరచి, ఈ సమయములో నిత్య తిరువారాధనలో దివ్య ప్రబంధానుసంధానము నుండి శ్రీ వైష్ణవులందరికీ విరామమును ఏర్పాటు చేసారు (దివ్య ప్రబంధము యొక్క మననము, ధ్యానమునకు విరామము లేదు).
  • అంతేగాక ఎంపెరుమాన్లకు తిరుక్కార్తెనాడు అలంకరించిన శుద్ధ తైల శేషమును, నమ్మాళ్వార్లకు, కలియనుకు మరియు మిగిలిన ఆళ్వార్ల కంఠములకు కూడా అలంకరించి, ఆ శేషమును శ్రీ వైష్ణవులందరికీ ప్రసాదించ వలనదిగా అజ్ఞాపించారు.
  • నమ్మాళ్వార్ల తిరువిరుత్తమ్, తిరువాశిరియమ్ పెరియ తిరువన్తాది మరియు తిరువాయ్మొళిలకు నాలుగు వేదములతో సామ్యము. మిగిలిన ఆళ్వార్ల దివ్య ప్రబంధములకు వేదాంగములైన శీక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చంధస్సు మరియు జ్యోతిషములతో సామ్యము. ఈ దివ్య ప్రబంధములు తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకముల నిగూఢ భావములను విశదీకరిస్తాయి.
  • ఇంకను నాథమునుల ఆదేశానుసారము,
    • శ్రీ వైకుంఠ ఏకాదశి మునుపు అమావాస్య నుండి మొదటి పది రోజులు ముదలాయిరము (తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, నాచ్చియార్ తిరుమొళి, పెరుమాళ్ తిరుమొళి,  తిరుచ్ఛంద విఱుత్థం,  తిరుమాలై , తిరుప్పళ్లిఎళ్ళుచ్చి, అమలనాదిపిరాన్, కణ్ణినుణ్ శిరుత్తాంబు, పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండకం) అనుసంధింపబడుతుంది.
    • శ్రీ వైకుంఠ ఏకాదశి దినము తిరువాయ్మొళి తొడక్కము (ప్రారంభము) అనుసంధింపబడుతుంది.
    • శ్రీ వైకుంఠ ఏకాదశి దినము ఉదయము వేదపారాయణము, సాయమువేళలో తిరువాయ్మొళి దినమునకు ఒక పత్తు, 10 దినములు అనుసంధింపబడుతుంది. చివరిరోజున ఇ నమ్మాళ్వార్ తొళల్తో ఘనముగా శాత్త్ఱుమురై  నిర్వహింపబడుతుంది.
  • ఇరవై ఒకటో దినము ఇయర్పా (ముదల్ తిరువన్తాది, ఇరణ్డామ్ తిరువందాది, మూన్ఱామ్ తిరువన్తాది, నాన్ముగన్ తిరువన్తాది, తిరువిరుత్తమ్, తిరువాసిరియమ్, పెరియ తిరువందాది, తిరువెళుకూట్రిరుక్కై, శిఱియ తిరుమడల్, పెరియ తిరుమడల్) అనుసంధిప బడుతుంది. (గమనిక: ఎమ్పెరుమానార్ల కాలములో నంపెరుమాళ్ ఆజ్ఞతో ఇరవై ఒకటో దినము సాయంకాలము ఇయఱ్పా శాఱ్ఱుముఱై ముగిసిన పిమ్మట పెరుమాళ్ళ పురప్పాడు సమయములో రామానుజ నూఱ్ఱందాది అనుసంధిప బడుతోంది).
  • నాథమునుల ఆదేశానుసారము బ్రాహ్మణులకు వేదాధ్యయనము విధింప బడినటుల ప్రపన్నులయిన శ్రీ వైష్ణవులు విధిగా దివ్య ప్రభన్దమును అభ్యసించవలెను.
  • అనధ్యయన కాలము అయినను, మార్గశిర మాసములో వేకువ ఝామున, భగవంతుని మరియు భాగవతులకు సుప్రభాతము పాడుటకు ఉద్ద్యేశించిన పాశురములు కలిగిన తొణ్డరడిప్పొడి ఆళ్వార్ల తిరుప్పళ్ళియెళ్ళుచ్చి మరియు ఆణ్డాళ్ ప్రసాదించిన తిరుప్పావై అనుసంధింపబడతాయి.
  • ఈ సాంప్రదాయము ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియ నంబి మరియు ఎమ్పెరుమానార్ల కాలములో కొనసాగింది.
  • ఒకప్పుడు కారణాంతరముల వలన నమ్మాళ్వార్ శ్రీ రంగము చేరుకోలేకపోయారు. అప్పుడు ఎమ్పెరుమానార్ అన్ని దివ్య దేశములలో నమ్మాళ్వార్ అర్చా విగ్రహమును ప్రతిష్ఠింప వలసినదిగా అదేశించారు. తిరుమల పర్వత శ్రేణి అంతా శ్రీమన్నాయణుని శరీరముగా భావింప బడుట వలన, ఆళ్వారుల దివ్య విగ్రహమును ఆ తిరుమల పర్వత శ్రేణి క్రింది భాగములొ ప్రతిష్ఠింప బడింది. ఇంకా అన్ని దివ్య దేశములలో అధ్యయన ఉత్సవము వైభవముగా నిర్వహించ వలసినదిగా ఎమ్పెరుమానార్ ఆదేశించారు.
  • తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళై ఎమ్పెరుమానార్ అనుఙ్ఞతో తిరువాయ్మొళి వ్యాఖ్యానం సాయించారు. అంతట ఎమ్పెరుమానార్ ఆనందముతో ఆ వ్యాఖ్యానమును కూడా శ్రీ భాష్యముతో అనుసంధించ వలసినదిగా ఆజ్ఞ్యాపించారు.
  • ఎమ్పెరుమానార్ శ్రీ రంగంలో చాలా కాలం అసంఖ్యాకమైన శ్రీ వైష్ణవ సముదాయముతో నివసించారు. వారికి ఎంతో గహనము మరియు ముఖ్యములైన సంప్రదాయ రహస్యములను వివరిస్తూ సదా పెరియ పెరుమాళ్కు మంగళాశాసనం గావించారు.
  • స్వామి ఎమ్పెరుమానార్ పరమపదమును అలంకరించగా భట్టర్ (ఆళ్వాన్ వరపుత్రులు మరియు శ్రీ రంగనాథ శ్రీ రంగ నాచియర్ల దత్త పుత్రుడు) అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఎంబార్ కందాడై ఆండాన్ తదితరులు శ్రీ రంగంలో మరి ఇతర దివ్య దేశములలోను ఎమ్పెరుమానార్ విగ్రహమును సకల జీవుల ఉజ్జీవనమునకై ఎమ్పెరుమాన్ ఆజ్ఞ్యతో ప్రతిష్టించారు.
  • శ్రీమన్ నాథమునులు కణ్ణినుణ్ శిఱుతాంబు యొక్క నిగూఢమైన భగవద్భావములను గ్రహించి నాలాయిర దివ్య ప్రబంధమున చేర్చినట్టు, ఎమ్పెరుమాన్ అభిమతము మేరకు రామానుజ నూఱ్ఱందాది కూడ చేర్చడమైనది. సద్బ్రాహ్మణునకు ప్రతి నిత్యము గాయత్రి జపము విధింపడినటుల ప్రపన్నులయిన శ్రీ వైష్ణవులకు రామానుజ నూఱ్ఱందాది నిత్యానుసంధానము విధింపడినది.
  • తరువాతి ఆచార్యులందరు రామానుజులచే వెలువరింపబడిన సంప్రదాయ రహస్యములను సకలుర ఉజ్జీవనమునకై ప్రచారము చేయుచూ కాలక్షేపము చేసారు. కలియన్ అరుళ్ళప్పాడు ప్రబంధము సమాప్తము.

తదనంతరము పరాశర భట్టర్ తిరునారాయణ పురమునకు దిగ్విజయము చేసి వేదాంతిని వాదమున జయించి తన శిష్యునిగా స్వీకరించారు. వేదాంతి సన్న్యాసము స్వీకరించి నంజీయరుగా ప్రసిద్ధులయినారు. భట్టర్ వేదాంతిని వాదమున జయించి అధ్యయనోత్సవము ప్రారంభమునకు ముందు రోజు శ్రీ రంగమునకు వేంచేశారు. పెరియ పెరుమాళ్ళకు తిరుమంగై ఆళ్వారు సాయించిన తిరునెడుందాండకము నందలి రహస్యములను విశదీకరించి వాదమున వేదాంతిని జయించిన విధమును తెలియజేయగా, పెరియ పెరుమాళ్ మిగుల ఆనందించి, భట్టరులను బాగుగా ప్రశంశార్హులుగా ఆఙ్యాపించి, శ్రీ రంగములో అధ్యయనోత్సవము తిరునెడుందాండకముతో ప్రారంభము అగునట్లు శాసించారు. దీనితో మన సత్సంప్రాదాయమున అధ్యయనోత్సవము యొక్క పూర్వాపరాలను తెలిసికొన్నాము.

 

అధ్యయనోత్సవముల సందర్భములో అన్ని దివ్య దేశములలోనూ 21 దినములు జరిగే ఉత్సవములు ఇలా ఉంటాయి.

  • ఎమ్పెరుమాన్, నాచియార్లు, ఆళ్వార్లు మరియు ఆచార్యులు 21 దినములునూ ఒక పెద్ద సభలో ఆసీనులు అవుతారు. ఎమ్పెరుమాన్ మరియు నాచియార్లు సభ మధ్య భాగమునను, ఆళ్వారాచార్యాదులు వారికి రెండు వైపుల రెండు వరుసలలో ఆసీనులవుతారు ఎదురెదురుగా ఆసీనులవుతారు.
  • అనేక దివ్య దేశములలో నమ్మాళ్వార్ ఆళ్వార్ గోష్ఠికి తిరుమంగై ఆళ్వార్ మరియు ఎమ్పెరుమానార్లతో కలసి (శ్రీ వైష్ణవ సంప్రదాయమునకు వారు చేసిన కైంకర్యమునకు) నాయకత్వము వహిస్తూ, ఆళ్వారాచార్యాదులతో ఆసీనులవుతారు.
  • వానమామలై, తిరుక్కుఱుంగుడి మొదలగు దివ్య దేశములలో నమ్మాళ్వార్ అర్చా విగ్రహము లేకపోవడము వలన, తిరుమంగై ఆళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ల ఆధ్వర్యములో ఉత్సవములు జరుగుతాయి.
  • శ్రీ పెరుంబూదూర్ దివ్య దేశము ఎమ్పెరుమానార్ అవతార స్థలము అయినందు వలన మరియు ఆణ్డాళ్ నాచియార్ ఎమ్పెరుమానార్ను జ్యేష్ఠ సోదరునిగా భావించి నందు వలనను, ఆణ్డాళ్ నాచియార్ ఎమ్పెరుమాన్ మరియు నాచియార్లతో ఆసీనురాలు కాక, ఆళ్వార్ ఎమ్పెరుమానార్ గోష్ఠీని అలంకరిస్తారు.
  • వైకుంఠ ఏకాదశి మొదలుకొని సాయం సమయమున పరమపద ద్వారము తెరవబడుతుంది. నమ్మాళ్వార్, మరియు ఆ దివ్య దేశము ఆచారమును బట్టి మిగిలిన ఆళ్వారాచార్యాదులు, పరమపద ద్వారమునకు అభిముఖముగా నిలచి, ఎంపెరుమాన్లకు మంగళాశాసనములు చేస్తూ పురప్పాడులో పాల్గొంటారు.
  • పగల్పత్తు మొదట 10 దినములు తిరుమొళి తిరునాల్ అనగా మధ్యాహ్న సమయములో ముదలాయిరము మరియు పెరియ తిరుమొళి అనుసంధింపబడతాయి. పురప్పాడు జరుగు దివ్య దేశములలో ఆ సమయములో ఉపదేశరత్తిన మాలై అనుసంధింపడుతుంది.
  • వైకుంఠ ఏకాదశి మొదలు 10 దినములు తిరువాయ్మొళి తిరునాల్ అనగా సాయము సమయములో తిరువాయ్మొళి అనుసంధింపడుంది.
  • 20వ దినము తిరువడి తొళల్ మరియు తిరువాయ్మొళి శాఱ్ఱుమురైతో ముగుస్తుంది. తిరువడి తొళల్ సందర్భములో అర్చకులు నమ్మాళ్వార్లను తమ హస్తములతో తోడ్కొని వెళ్ళి ఆయన శిరమును ఎమ్పెరుమాన్ పాదములమీద ఉంచుతారు. ఆ పిమ్మట నమ్మాళ్వార్ తులసీదళములతో అలంకరింపబడతారు.
  • 21వ రోజు
    • సాయంకాలము – ఇయర్పా అనుసంధానము
    • రాత్రి – పురప్పాడు (ఊరేగింపు)లో రామానుజ నూఱ్ఱందాది గోష్ఠి మరియు ఇయల్ శాఱ్ఱు
  • 22వ రోజు – తిరుప్పల్లాణ్డు తొళక్కమ్ (ప్రారంభము) మరియు 4000 దివ్య ప్రబంధము అనుసంధానము మొదలు

ఇక ఆయా దివ్య దేశములలో జరిగే అధ్యయన ఉత్సవములలోని విశేషాంశాములను తెలుసు కొందాము ఇక ఆయా దివ్య దేశములలో జరిగే అధ్యయన ఉత్సవములలోని విశేషాంశాములను తెలుసుకొందాము.

  • శ్రీరంగము
    • 22 రోజులు ఉత్సవములు – అనగా ప్రారంభములో ఒక రోజు తిరునెడున్తాణ్డగమ్ అనుసంధానము, తరువాత 21 రోజులు ఉత్సవము.
    • అరయర్లు నమ్పెరుమాళ్, నాచియార్లు మరియు ఆళ్వారాచార్యాదుల ఎదుట పాశురములను అనుసంధింస్తూ వాటి అర్ధములకు, భావములకు అనుగుణముగా అభినయిస్తారు.
    • అరయర్ సేవ సమయములో నంపెరుమాళ్ మరియు నాచియార్లు ఎత్తైన మండపము మీద ఆసీనులవుతారు. ఆళ్వారాచార్యాదులు వారికి అభిముఖముగా ఆసీనులవుతారు.
  • ఆళ్వార్ తిరునగరి
    • అరయర్ సేవలో అభినయముతో పాశురనుసంధానము. అరయర్ స్వాములు అనుసంధించిన పాశురములను తరువాతి రోజు అధ్యాపక స్వాములు అనుసంధిస్తారు.
    • పగల్పత్తు 10వ రోజున (వైకుంఠ ఏకదశి ముందు దశమి) నమ్మాళ్వార్ ఎంపెరుమానార్ల ప్రత్యేక దర్శనము – శ్రీ రంగనాధ స్వామి వారి శయన భంగిమలో ఉన్న నమ్మాళ్వార్ శ్రీ పాదముల వద్ద శ్రీ రంగ నాచియార్ల భంగిమలో ఎంపెరుమానార్ దర్శనము ఇస్తారు.

                        నమ్మాళ్వార్ – ఎంపెరుమానార్

    • అన్ని దివ్య దేశములలోను పగల్పత్తు చివరి రోజైన 20వ రోజున తిరువడి తొళళ్ (నమ్మాళ్వార్ ఎంపెరుమాన్ పాద కమలములను చేరుకోవడము) జరుగుతుంది. కాని ఇక్కడ తిరుముడి తొళల్ అంటే అర్చకులు తమ శ్రీ హస్తములతో ఎంపెరుమాన్ను తీసుకువెళ్ళి ఎంపెరుమాన్ శ్రీ పాదములను స్వామి నమ్మాళ్వార్ శిరమున ఉంచుతారు. ఈ అద్భుత దృశ్యము కన్నుల పండుగై, పరగత స్వీకారమును ధృఢపరుస్తుంది (పరగత స్వీకారము అనగా స్వయముగా శ్రీమన్నారాయణుడే సకల జీవులను తన నిర్హేతుక కృపాకటాక్షములతో కరుణించి తన అధీనమునకు చేర్చుకోవడము).
    • 22 దినములు అధ్యయనోత్సవములు – చివరిలో మరి ఒక రోజు “వేడు పడై
      తిరుమంజనమ్” (విశేష స్నానోపచారము).
    • ఈ చివరి రోజున, పొలిందు నిన్ఱప్పిరాన్ ఎంపెరుమాన్ సర్వుల ఉజ్జీవనముకై నమ్మాళ్వర్లను తిరిగి లీల విభూతికి పంపుతారు.
    • తిరుప్పల్లాండు తొడక్కమ్ (మొదలు) తరువాత వచ్చే విశాఖ నక్షత్రమున (నమ్మాళ్వార్ తిరునక్షత్రమున) ప్రారంభము అవుతుంది.
  • తిరు తులైవిల్లిమంగలమ్
    • నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలో దేవ పిరాన్ ఎంపెరుమాన్లను తమ తల్లి దండ్రులుగా సంభావించారు. నమ్మాళ్వార్లకు దేవ పిరాన్ అనిన అమితమైన అభిమానము. అందువలన, పూర్వము, ఆళ్వార్ శ్రీ రంగము నుండి తిరిగి వచ్చునప్పుడు, తిరువిల్లి మంగలమ్ చేరి, అక్కడే మాసి విశాఖమువరకు వేంచేసి, ఆళ్వార్ తిరునగరికి చేసుకునేవారు.
    • ఈ వృత్తాంతము అనుసారము, ఆళ్వార్ తిరునగరిలో మాసి మాసములో జరిగే 13 రోజుల ఉత్సవముల చివరిలో మాసి విశాఖదినమున నమ్మాళ్వార్ తులైవిల్లిమంగల దివ్య దేశమునకు వేంచేసి, ఆ దినము అంతా తిరుమంజనము, గోష్ఠి మొదలగునవి సేవించి తిరిగి ఆళ్వార్ తిరునగరి చేరుకుంటారు.
    • తరువాతి దినము తిరుప్పల్లాండు తొడక్కమ్ (అప్పటి వరకు ఈ దివ్య దేశములో అనధ్యయన కాలము).
  • తిరువాలి / తిరునగరి మరియు తిరునాంగూర్ దివ్యదేశములు
    • సాధారణముగా తిరుక్కార్తె దీపము కలియన్ తిరు నక్షత్రము ఒకేసారి వస్తాయి. కానీ ఎప్పుడైనా ఒకే నెలలో రెండు కార్తీక నక్షత్రములు వచ్చి నపుడు, రెండవ కార్తీక నక్షత్రమును తిరుమంగై యాళ్వార్ తిరు నక్షత్రముగా నిర్ణయిస్తారు. అనధ్యయన కాలము మిగిలిన దివ్య దేశములలో తిరుక్కార్తె దీపము నుండి మొదలు అయినా, ఈ దివ్య దేశములలో మాత్రము తిరుమంగైయాళ్వార్ తిరువవతారము సందర్భములో 4000 దివ్య ప్రబంధము అనుసంధానము మరియు వైభవముగా ఉత్సవములు అయిన తరువాతే అనధ్యయనకాలము మొదలు అవుతుంది.
  •  తిరుమెయ్యమ్
    • 21 రోజుల అధ్యయనోత్సవములతో కలియన్ తిరువడి తొళల్ (కలియన్ శ్రీమన్నారాయణుని పాదారవిందములను సేవించడము) కూడ పగల్పత్తు చివరి రోజున వైభవముగా జరుగుతుంది.
  • శ్రీ పెరుంబూదూర్
  • మకర మాసం పుష్యమి నక్షత్రము వరకు 3 దినముల పాటు గురు పుష్యమి వైభవముగా జరుగుతుంది. శ్రీ పెరుంబూదూర్ దివ్య దేశములో ఎంపెరుమానార్ అర్చా విగ్రహము ప్రతిష్ఠింప బడి నందు వలన దీనికి అధికమైన ప్రశస్తి కలదు.
    అధ్యయనోత్సవము గురు పుష్యమి ఒకేసారి సంభవిస్తే అధ్యయనోత్సవము మొదట నిర్వహింప బడుతుంది.
  • తిరుచేఱై, తిరుమళిశై మొదలగు దివ్య దేశములలో కూడ బ్రహ్మోత్సవములు లేదా ఆళ్వార్ ఉత్సవములు మరియు అధ్యయనోత్సవములు ఒకేసారి వస్తే అధ్యయనోత్సవములు మొదట నిర్వహింప బడతాయి.

ఇయర్పా తరువాతి దినమున సాధారణముగా కోవెలలో దివ్య ప్రబంధానుసంధానము తిరుప్పల్లాండు అనుసంధానముతో యదా విధిగా తిరిగి మొదలు అవుతుంది. ఇలాగే ఆయా దివ్య దేశములకు మాత్రమే ప్రత్యేకములైన విశిష్ఠతలు ఉన్నాయి.

అనధ్యయన కాలము నందు గృహములలో దివ్య ప్రబంధము అనుసంధానము ఆయా దివ్య దేశములలో ఆచారములను బట్టి వివిధములుగా మారుతూ ఉంటుంది

  • అనేక దివ్య దేశములలోని స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము ఆ దివ్య దేశము యొక్క సంప్రదాయమును అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు, తిరుక్కార్తె దీపము లేదా అనధ్యయన కాలము మొదలు అయిన దినము నుండే స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానమునకు విరామము ఇవ్వ బడుతుంది. తిరిగి దివ్య దేశములలో తిరుప్పల్లాండు తొడక్కమ్ అనుసంధానము మొదలు అయినప్పటి నుంచి (సాధరణముగా ఇయర్పా శాఱ్ఱుమురై తరువాతి దినము నుండి) స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము మొదలు అవుతుంది.
  • ఒక సంప్రదాయము ప్రకారము దివ్య ప్రబంధానుసంధానము తాయ్ హస్తము (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము) నుండి తిరిగి మొదలు అవుతుంది. ఈ సంప్రదాయమునకు నాంది, పూర్వము శ్రీ వైష్ణవులు అధ్యయనోత్సవములను నంపెరుమాళ్ మరియు నమ్మాళ్వార్లతో సేవించడానికి గాను శ్రీ రంగమునకు విశేషముగా వెళ్ళేవారు. ఉత్సవములు పూర్తి అయిన తరువాత తిరిగి స్వగృహములను చేరుకునేందుకు చాల రోజులు అయ్యేది. దీని స్మృత్యర్ధముగాను, స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము తై హస్తము (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము) నుండి తిరిగి మొదలు అవుతుంది.
  • అన్ని సంప్రాదాయ రహస్యముల వలెనే, ఈ విషయములోను మన పెద్దల నుండి ఆయా దివ్య దేశములలోని శిష్ఠాచారములను గ్రహించి వాటినే పాటించాలి.

మరి అనధ్యయన కాలములో అభ్యసించి అనుసంధించి దగిన సంప్రదాయ రహస్యములు?

కొన్ని సూచనలు

  • సాధారణముగా దేవాలయములలో అనధ్యయన కాలము నందు తిరుప్పావై బదులు ఉపదేశరత్తిన మాలై మరియు కోఇల్ తిరువాయ్మొళి/రామానుజ నూఱ్ఱందాది బదులు తిరువాయ్మొళి నూఱ్ఱందాది అనుసంధానము జరుగుతుంది.
  • మార్గశిర మాసములో తిరుప్పళ్ళియెళ్ళుచ్చి / తిరుప్పావై అనుసంధానము తిరిగి మొదలు అవుతుంది.
  • కోవెలలో అధ్యయనోత్సవములో 4000 పాశురములను ఒకసారి అనుసంధిస్తారు.
  •  అనధ్యయనకాలములో స్వగృహములందు తిరువారాధనములో 4000 దివ్య ప్రబంధము అనుసంధింపబడదు (కానీ మార్గశిర మాసములో కోవెలలో వలెనె తిరుప్పావై మరియు తిరుప్పళ్ళియెళ్ళుచ్చి అనుసంధింప బడతాయి).
    • స్వగృహములలో పూజామందిర ద్వారములు తెరిచే సమయములో జితన్తే స్తోత్రము మొదటి 2 శ్లోకములను, కౌసల్యా సుప్రజా రామ శ్లోకమును, కూర్మాదీన్ శ్లోకమును అనుసంధిస్తాము, కానీ ఆళ్వార్ల పాశురములను ధ్యానించుట / మననము చేయుటకు ఏమీ ఆటంకము లేదు.
    • అలాగే తిరుమంజన సమయములో మనము నిత్యము పంచ సూక్తములను, వెణ్ణై అళైన్ద కుణున్గుమ్ పథికము మరియు కొన్ని ఇతర పాశురములను అనుసంధిస్తాము, కానీ, అనధ్యయన కాలమందు పంచ సూక్తములను మాత్రమే అనుసంధిస్తాము.
    • మంత్ర పుష్పముతో చెన్ఱాయ్ కుడైయమ్ పాశురమ్ అనుసంధిస్తాము, కానీ అనధ్యయన కాలములొ ఎమ్పెరుమానార్ దరిశనమ్ ఎన్ఱే పాశురమును అనుసంధిస్తాము.
    •  శాఱ్ఱుముఱై సమయములో మనము నిత్యమూ అనుసంధించే శిఱ్ఱమ్ శిరుకాలే, వంగక్కడల్ మరియు పల్లాండు పాశురముల బదులు ఉపదేశరత్తిన మాలై మరియు తిరువాయ్మొళి నూఱ్ఱందాది పాశురములను అనుసంధించి, సర్వ దేశ దశాకాలేషు… మరియు వాళి తిరునామములతో కొనసాగిస్తాము.
  • మన పూర్వాచార్య విరచితములయిన సంస్కృత స్తోత్త్ర గ్రంథములను, మరియు ఙానసారము, ప్రమేయసారము, సప్త కాదై, ఉపదేశరత్తిన మాలై, తిరువాయ్మొళి నూఱ్ఱందాది మొదలైన తమిళ ప్రబంధములను అభ్యసించుటకు ఇది మంచి సమయము. అలాగే మన పూర్వాచార్యుల తనియన్లను వాళి తిరునామములను అభ్యసించి అనుసంధించు కొనవచ్చును.
  • అలాగే, మన సంప్రదాయ రహస్య గ్రంథములను సేవించి మననము చేసికొనవచ్చును.

అనధ్యయన కాలములో దివ్య ప్రబంధము యొక్క అభ్యాసము కాని, అనుసంధానము లేకున్నను, వాస్తవమునకు ఈ సమయములో మనము ఆనందముగా సేవించుటకు చాలా సంప్రదాయ విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • మనము ఎంతో ఆతురతతో ఎదురు చూసే అద్భుతమైన అధ్యయన ఉత్సవము – శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రాముఖ్యము కలది – భగవదనుభవముతో నిండిన 20+ ఆహ్లాద భరితమైన దినములు.
  • ఆణ్డాళ్ నాచియార్ వరప్రసాదమైన అద్భుత ధనుర్మాస తిరుప్పావై అనుభవము.
  • మన పూర్వాచార్యులచే ఎంతొ సరళము దివ్యము అయిన సంస్కృతములోను అందిచ బడ్డ స్తోత్ర గ్రంథములు మరియు తమిళ ప్రబంధములను నేర్చుకొని తరించగలిగే మహత్తరమైన అవకాశము.

ఈ విధముగా మనము అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవములకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశములను ఈ శీర్షికలో గ్రహించాము.

మణవాళ మాముణుల తిరువావతారముతో తిరువాయ్మొళి మరియు నమ్మాళ్వార్ల వైభవము దశ దిశలా ప్రసరింపబడింది. వారు సకల మానవాళి ఉజ్జీవనమునకు దివ్య ప్రబంధము, అందలి రహస్యములను సర్వులకు అందజేయుటకు తమ యావజ్జీవనము కృషి చేశారు. అంతియేగాక మణవాళ మాముణులు తమ ప్రవృత్తి లోను ఆళ్వారాచార్యాదులచే ఉటంకింపబడిన సదాచారములను, గుణములను ఎల్లప్పుడూ వ్యక్తపరిచారు. వీరి సద్వృత్తి, సదాచారములకు నంపెరుమాళ్ ఎంతగానో ఆనందించి భగవద్విషయము (నంపిళ్ళై స్వామి వారి ఈడు వ్యాఖ్యానము మరియు ఇతర తిరువాయ్మొళి వ్యాఖ్యానముల ఆధారముగా) ఒక సంవత్సరము పాటు ప్రవచనము చేయ వలసినదిగా ఆదేశించారు. అంతట ప్రవచనము ముగింపులో ఆణి తిరుమూలా నక్షత్రమున శ్రీ రంగనాధులు ఒక చిన్న బాలుని రూపములో ఏతెంచి మణవాళ మాముణుల ను తమ ఆచార్యునిగా సంభావించి, వారి పట్ల కృతఙ్ఞతతో “శ్రీ శైలేశ దయాపాత్రమ్…….” శ్లోకమును సమర్పించారు.

 

మనమందరమూ కూడ ఇక ముందు రాబొయే ఈ ప్రశస్తమైన ఉత్సవములందు అన్వయించుకునేందుకు సంసిద్దులమవుదాము.

అడియేన్ అనంతరామన్ రామానుజదాసన్

మూలము: https://granthams.koyil.org/2013/11/anadhyayana-kalam-and-adhyayana-uthsavam/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

0 thoughts on “అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవము”

  1. srinivasstp752@gmail.com

    On 02-Mar-2018 4:44 AM, “SrIvaishNava granthams – Telugu” wrote:

    > anantramanujadasan posted: “శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ
    > నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః మన శ్రీవైష్ణవ
    > సత్సాంప్రదాయము ఉభయవేదాన్త ఆధారితము. ఉభయ అనగా రెండు మరియు వేదాన్తము అనగా
    > శీర్షభాగము. సంస్కృతమున వేదము(ఉ~: రుగ్, యజుర్, సామ, అథర్వణ ) మరియు వేదా”
    >

    Reply

Leave a Comment