శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక
శ్రీవైష్ణవుల దినచర్యలో ఈ క్రింది అంశములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి మరియు చాలా ప్రయోజనకరమైనవి.
- వర్ణ-ఆశ్రమ-ఙ్ఞాన భేధం చూడకుండ శ్రీవైష్ణవులను గౌరవించాలి. భగవంతుడు తాను మొదటగా ఆకాంక్షించేది భాగవతులను(భక్తులను) గౌరవించడం.
- అహం మరియు స్వార్థచింతనారహిత జీవితాన్ని గడపాలి. ఆత్మస్వరూపం మరియు భగవానుని వైభవం తెలిసినప్పుడు మనం మన స్వార్థచింతనను మానివేస్తాము.
- క్రమం తప్పకుండ ఆచార్యున్ని దర్శించడం శిష్యుని ప్రధానలక్షణం. ఆచార్యుని భౌతికజీవనం గడపడానికి అవసరమైన వస్తువులను మరియు ఆర్ధికావసరాలను ఏర్పాటుచేయడం శిష్యుని విధి.
- .నిత్యకర్మానుష్ఠానములైన స్నాన-ఊర్ధ్వపుండ్రధారణ-సంధ్యావందనములను వారివారి వర్ణాశ్రమధర్మాలనుబట్టి ఆచరించాలి. ఈ ధర్మాలను ఆచరించువారు బాహ్యాంతరశుద్ధులను పొంది ఙ్ఞానసముపార్జనకు సంసిద్ధులవుతారు.
- సదా శ్రీచూర్ణతిరుమణ్లను ధరించాలి. ఇది భగవద్దాసులమని తెలుపు ప్రాథమికస్వరూపం. కావున ఈ స్వరూపమును నిత్యము నిర్భయముగా మరియు లజ్జారహితముగా ధరించాలి.
- వర్ణ-ఆశ్రమ-లింగధర్మములను అనుకరిస్తు సాంప్రదాయ వస్త్రములను ధరించాలి. మగవారైతే పంచకజ్జమును(గోచి పెట్టిన ధోవతి) ఆడవారయితే మడిసార్(గోచి పెట్టిన చీరకట్టు)ను ధరించాలి. దీనికి సిగ్గుపడనవసరం లేదు. మన సాంప్రదాయ పరంపరావైశిష్ఠ్యమును మనం గ్రహించాలి.
- ఆళ్వారులందరు శ్రీమన్నారాయణున్ని సదా సేవించడంలో నిమగ్నులై ఉంటారు. ఆళ్వార్లు మరియు మన పూర్వాచార్యులందరు దేవతాంతర (రుద్ర, ఇంద్ర, వరుణ, అగ్ని మరియు నవగ్రహములు మొదలైనవారు) ఆరాధనను నిరసించారు. మన పూర్వాచార్యులు ఈ విషయానికి అధికప్రాధాన్యతను ఇచ్చారు. భగవానునికి మరియు ఈ జీవాత్మకు మధ్యన ఉండు నవవిధ సంబంధములలో భర్తృభార్యాసంబంధం విశేషమైనది. ప్రాయశముగా అన్ని జీవాత్మలు స్త్రీప్రాయములే. భగవానుడు మాత్రమే పరమపురుషుడు. కావున ఈ సంబంధం భగవానుని యందు విశ్వాస్యతను మనయందు ఏర్పరుస్తుంది. ఇది మిగితా దేవతాంతరములతో సంబంధం నెరపుటను నిరోధిస్తుంది.
- శ్రీవైష్ణవుని నిత్యవిధులలో గృహతిరువారాధన చాలా ప్రధానమైనది. మన గృహములందు తనను ఆరాధించుకోవడానికి భగవానుడు పరమకృపతో అర్చారూపమున దిగివచ్చాడు. దీనిని విస్మరించుట భగవానున్ని అవమానపరచడమే. భగవానుని మరచిపోవడం మన ఆధ్యాత్మికప్రగతిని నష్ఠపరచుకోవడమే. ప్రయాణంలో కూడ మన తిరువారాధన భగవానునిమోసుకపోవచ్చు. ఒకవేళ అది వీలుకాకపోతే ఇతర శ్రీవైష్ణవులు మన గృహమునకు వచ్చి ఆరాధనచేయుటను ఏర్పరచాలి అలాగే దానికి తగిన ఏర్పాటును కూడా చేయాలి లేదా ఇతర శ్రీవైష్ణవగృహములయందు ఉంచి వెళ్ళవచ్చు. ఆరాధన లేకుండ గృహమునకు తాళంవేసిఉంచడం భగవానుని అగౌరవపరచడమే. తిరువారాధన వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు . https://granthams.koyil.org/2012/07/srivaishnava-thiruvaaraadhanam/.
- వారి వారి వర్ణాశ్రమధర్మాలను ఆధారంగా శాస్త్రం ఏర్పరచిన ఆహారనియమములను పాటించాలి. మొదట ఆహారపదార్థాలను భగవానునికి , ఆళ్వారాచార్యులకు నివేదన చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. భగవానుని నివేదనకు నిషిద్ధమైన పదార్థములను సమర్పించరాదు. ఆహారనియమ వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు https://granthams.koyil.org/2012/07/srivaishnava-aahaara-niyamam_28/ and https://granthams.koyil.org/2012/08/srivaishnava-ahara-niyamam-q-a/.
- శ్రీవైష్ణవుల సాంగత్యమును ఆశించాలి. ఈ సాంగత్యం వలన ఆధ్యాత్మికభావనాప్రవాహం వృద్ధిచెంది ఉజ్జీవనమునకు దారితీయును.
- మన జీవితంలో దివ్యదేశములు, ఆళ్వారుల మరియు ఆచార్యుల అవతారస్థలములు మరియు అభిమానస్థలముల దర్శనమునకు ప్రాధాన్యతనివ్వాలి. దివ్యదేశములయందు కైంకర్యమును చేయవలెను. ఒకవేళ ప్రస్తుతం కైంకర్యము చేయవీలుకాకపోతే కనీసం దివ్యదేశయాత్రనైన తరచుగా చేయాలి. భవిష్యత్తులోనైన ఈ కైంకర్యం చేయాలని ప్రయత్నించాలి.
- శ్రీవైష్ణవులకు దివ్యప్రబంధము చాలాముఖ్యమైన అంశం. పాశురములను అభ్యసించి, పూర్వాచార్యుల వ్యాఖ్యానముననుసరించి వాటి అర్థములను తెలుసుకొని అనుష్ఠానమున పెట్టవలెను. ఈ మూడు విషయములు శ్రీవైష్ణవత్వమును పెంపొందిస్తాయి. దివ్యప్రబంధఙ్ఞానం ప్రాపంచిక సుఖములయందు అశ్రద్ధను, భగవంతుని మరియు భాగవతులయందు శ్రద్ధను నిలుపుటకు తోడ్పడతాయి.
- పూర్వాచార్యుల జీవన అనుష్ఠానం మనకు ఙ్ఞానార్జనకు మరియు ప్రేరణకు తోడ్పడతాయి. ఈ రోజు మనమందరం విషమ పరిస్థిలను/ సంధిగ్ధావస్థలను దాటి నిలబడ్డామంటే అది పూర్వాచార్యులు తమ జీవన అనుష్ఠానములో ప్రదర్శించిన కరుణ మరియు సౌలభ్యమే .
- పూర్వాచార్యుల సాహిత్యపఠనం చాలా విశేషం. ప్రతిఒక్కరు ప్రతిదినమునందు కొంత సమయమును ఈ లభిస్తున్న సాహిత్యనిధిని పఠించుటకు కేటాయించాలి. ఈ సాహిత్యం మనకు వేదాంతం,దివ్యప్రబంధం , స్తోత్రగ్రంథములు ,వ్యాఖ్యానములు మరియు చారిత్రాత్మక సంఘటనలు అనే రూపములో లభిస్తున్నాయి. ఈ విషయపరిఙ్ఞానము ఈ వెబ్ సైట్ నందు లభించును https://koyil.org/index.php/portal/
- ఆవశ్యకమైన సూత్రములను విద్వాంసుల నుండి కాలక్షేపముగా శ్రవణం( మూలమును అనుసరించి చెప్పు వ్యాఖ్యాన ప్రవచనం)చేయడం చాలా అవసరం. ప్రస్తుత కాలములో చాలా ప్రవచనములు CD మరియు websites నందు విరివిగా లభిస్తున్నాయి. ప్రవచనములను ప్రత్యక్షముగా విననివారు ఈ లభిస్తున్న వాటిని ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు సమయానుకూలతను బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.
- కైంకర్యమునందు సదా నిమగ్నమై ఉండాలి. “ కైంకర్యము చేయకుంటే శేషత్వం లోపించును” అనేది శాస్త్రవచనం. కావున శ్రీమన్నారాయణునియందు,ఆళ్వారాచార్యులయందు దాసత్వం ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమును విధిగా చెయ్యాలి. అది భౌతిక, మానసిక , ఙ్ఞానసంబంధిత కైంకర్యము కావచ్చును. ఇలా కైంకర్యమునందు చాలా విధములున్నవి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమునందు నిమగ్నమై ఉండాలి. ఇది భగవంతుని యందు భాగవతులయందు స్థిరమైన కైంకర్యబుద్ధిని ఉండేలా చేస్తుంది.
- భగవానుని యందు మరియు ఆళ్వారాచార్యులయందు కైంకర్యఙ్ఞానం ఉన్న భాగవతులకు మరియు ఇతరులకు సహాయం చెయ్యవలెను. ఇలాంటి స్థిరమైన(విచ్చిత్తిలేని కైంకర్యఙ్ఞానం)ఙ్ఞానం కలవారితో సంపర్కం వలన పరస్పరం ప్రయోజనం ఉంటుంది, అనగా చెప్పేవారు వినేవారు ఇద్దరు గుణానుభవం చేస్తారు. ప్రతిఒక్కరు ఉజ్జీవించాలనే ఏకైక పరమప్రయోజనముగా ఈ ఙ్ఞానమును మన పూర్వాచార్యులు పరంపరగా అందించారు. కావున మనమందరం ఈ ఙ్ఞానమును సరైన మార్గదర్శకత్వములో జాగ్రత్తగా చదివి మన కుటుంబసభ్యులకు, బంధువులకు,మిత్రులకు మరియు అభిలాష ఉన్న వారందరికి అందించాలి. ఇదే మన కర్తవ్యం.
- ఆత్మస్వరూపగుణమగు నిత్యానందమును పొందడానికి ప్రయత్నంచేయవలెను. నిజమైన శ్రీవైష్ణవుడు మృత్యువుకు భయపడడు, కారణం శ్రీవైకుంఠమునందు భగవానుని నిత్యకైంకర్యము చేయు భాగ్యంలభిస్తుంది దీనివల్లనే. మన ఆళ్వారులు మరియు ఆచార్యులందరు నిత్యవిభూతి యందు ఉన్నప్పుడు భగవద్భాగవత కైంకర్యమును చేసేవారు, ఆ తర్వాత పరమపదమునకు వెళ్ళినను భగవద్భాగవత కైంకర్యమునే ఆశించేవారు.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు
మూలం : https://granthams.koyil.org/2016/01/simple-guide-to-srivaishnavam-important-points/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం – https://pillai.koyil.org
Intamanchi Post hesina meeku dhanyavadamulu