శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
ఎమ్పెరుమానారు ప్రపత్తి సూత్రాలను శరాణగతి గద్యం మరియు గీతా భాష్యం ద్వారా నమ్మాల్వారి పాసురాలను ఉపయోగించి విస్తృతంగా వివరించారు.
10. ప్రపత్తి నిష్ఠానుక్కు కర్మాధ్యుపాయంగళ్ విరోధి – ప్రపత్తిపై దృష్టి కేంద్రీకరించినవారికి కర్మ, జ్ఞాన, భక్తి మొదలైన ఉపాయాలు అడ్డంకులు.
11. ప్రపత్తి ఉపాయ నిష్ఠానుక్కు ఇతరోపాయంగళ్ విరోధి – ప్రపత్తిని నిర్వహిస్తున్నవారికి, ఇతర ఉపాయాలు (కర్మ, జ్ఞాన, భక్తి వంటివి) అడ్డంకులు.
ఈ సంసారంలో పునరావృతమయ్యే జన్మ / మరణం నుండి ఉపశమనం పొంది, పరంపదం చేరుకున్న తరువాత, భగవన్ కు నిత్య ఆనందకరమైన సేవలో పాల్గొనడాన్ని మోక్షం అంటారు. అటువంటి మోక్షాన్ని సాధించడానికి అనేక ఉపాయాలు (మాధ్యమాలు / విధానములు) ఉన్నాయి. మన శాస్త్రాలలో, ప్రధానంగా 4 ఉపాయాలు చెప్పబడ్డాయి – కర్మ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము మరియు ప్రపత్తి.
- కర్మ యోగము – శాస్త్రాదేశాలను అనుసరించుకుంటూ మూడు త్యాగాలు, ప్రత్యేకంగా కర్తృత్వ త్యాగం (నేనే కర్తను), మమతా త్యాగం (ఇది నా బాధ్యత) మరియు ఫల త్యాగం (ఫలితం నాది) వంటి కార్యాలు భగవంతునికి సేవగా బావించి చేయుడమే కర్మ యోగము.
- జ్ఞాన యోగము – కర్మ యోగాన్ని అనుసరించుట ద్వారా మనస్సు శుద్ధి పడి ఆత్మ యొక్క నిజమైన స్వభావం అర్థం చేసుకోవచ్చు (తమను తాము). అటువంటి స్థితిలో స్థిరంగా ధ్యానించుటయే జ్ఞాన యోగము అంటారు.
- భక్తి యోగము – నిరంతరం జీవాత్మలో పరమాత్మ ఉంటారన్న నిజాన్ని అర్థం చేసుకొని, నిరంతరం భగవానునికి ప్రేమ పూర్వకమైన భక్తిని చూపించడమే భక్తి యోగము అంటారు.
- ఇంకా, దివ్య దేశాలలో నివసిస్తూ, అర్చావతార రూపంలో ఉన్న ఎమ్పెరుమాన్ ని సేవిస్తూ, సన్నిధిలో దీపాలు వెలిగించి, పూల దండలు తయారు చేసి, వాటిని ప్రేమతో అర్పించడం, దేవాలయాలు శుద్ధి చేయడం మొదలగునవి మోక్ష సాధనాలు.
- తిరునామ సంకీర్తనం (భగవన్ యొక్క అనేక నామాలను కీర్తించడం) మోక్ష సాధనానికి అద్భుతమైన మార్గంగా చెప్పబడింది. ఇది కురుక్షేత్రంలో భీష్మ పితామహులచే యుధిష్ఠిరునికి వివరించబడింది.
కానీ ఇవన్నీ జీవాత్మ యొక్క స్వతంత్ర ప్రయత్నాలపై ఆధార పడి ఉంటాయి. ఈ మార్గాలను జీవాత్మ నిష్ఠగా ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. జీవాత్మ ఇటువంటి ప్రయత్నాలను అనుసరించి తద్వారా భగవనుని మెప్పించి చివరికి వారిచే మోక్షాన్ని పొందుతాడు. ఈ ప్రక్రియలన్నింటిలోను సుదీర్ఘమైన పరిశీలన ఉంటుంది అంటే మోక్షాన్ని పొందే ముందు అనేక జన్మలు పొందాల్సి వస్తుంది.
ప్రపత్తి – ఎమ్పెరుమాన్ ని ఆశ్రయించి వారినే ప్రార్థిస్తూ “ఓ భగవాన్! నాకు మోక్షాన్ని ప్రసాదించమని నిర్దేశిస్తూ, నాది ఏమీ లేదు, నేను ఏ ఇతరులను ఆశ్రయించను. నేను నిన్నే పూర్తి శరణు వేడుకుంటున్నాను. దయచేసి ఈ ఆత్మను స్వీకరించు”. నమ్మాల్వార్ తిరువాయ్మొళి 5.7.1 పాసురంలో “నోఱ్ఱ నోన్బిలేన్, నుణ్ణఱివిలేన్, ఆగిలుం ఇని ఉన్నై విట్టు ఒన్రుం ఆఱ్ఱగిన్రిలేన్ అరవినణై అమ్మాణే” మరియు తిరువాయ్మొళి 6.10.10 లో ” తిరువేంగటత్తానే! ఉన్నడిక్కీళమర్తు పుగుంతేనే“. స్తోత్రరత్నంలో ఆలవందార్ వివరిస్తూ ” త్వత్పాద మూలం చరణం ప్రపద్యే” అన్నారు.
“చరణం ప్రపద్యే” అంటే, “ఆశ్రయం తీసుకునే చర్య” అంటే మార్గమని అనుకోవచ్చు. కానీ ఇది నిజం కాదు. ప్రపత్తి స్థానంలో, స్వయంగా భగవనుడే ఉపాయము. శాస్త్రంలో శరణాగతిని ఇలా వివరించారు. “త్వమేవ ఉపాయ భూతోమే భవా’ ఇతి ప్రార్థనా మతి:” శరణాగతి అంటే – నీవు మాత్రమే నాకు ఉపాయం అను గాఢమైన విశ్వాసం ఉంచి ప్రార్థించడం”). భగవత్గీతలో, భగవాన్ ఇలా ఆదేశించారు, ” సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ” – పూర్తిగా అన్ని ఇతర ఉపాయాలను విడిచిపెట్టు నన్నే ఉపాయంగా స్వీకరించు. 10 వ సూత్ర వ్యాఖ్యానంలో, వాంగి పురత్తు నంబి వివరిస్తూ అన్నారు, “ప్రపత్తి అనే పదాన్ని సూచిస్తూ సూచించిన సర్వేశ్వరుడు మాత్రమే ఉపాయము” అని వ్యాఖ్యానించారు. సిద్ధం అంటే నిరూపించబడినది అని అర్థం – ఆహారం తయారుచేసి సమర్పించబడిన వంటిది. సాధ్యం అంటే “స్థాపించబడినది” – దాన్యం, కాయకూరలు మొదలైనవి. విడిగా వండి తినేవి. భగవానుని ఉపాయంగా అంగీకరించడం అనేది సిద్ధోపాయ వరణంగా పిలువబడుతుంది. దీనినే శరణాగతి, ప్రపత్తి అని పిలువబడుతుంది. అందువల్లనే భగవాన్ తనను తానూ ప్రపత్తి మరియు సిద్ధోపాయంగా 10 వ సూత్రానికి సంబంధించిన వ్యాఖ్యానంలో వివరించారు.
కర్మ, జ్ఞాన, భక్తి మొదలైన (స్వయంగా భగవనుడే ఉపాయంగా స్వీకరించే బదులుగా) ఇతర ఉపాయాలను ఉపాసించేవారిని ఉపాయాంతర నిష్టులు అని పిలువబాడతారు. భగవనుడే ఉపాయంగా గాఢ విశ్వాసం ఉన్నవారికి, ఇటువంటి అన్య ఉపాయాలలో పాల్గొనడం ఒక అడ్డంకిగా ఉంటుంది. సాధ్యం – స్వప్రయత్నం ద్వారా ఏదో సాధించడం.
ఇక్కడ మనము ఖచ్చితంగా ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. శాస్త్రప్రకారం నిర్దేశించిన కర్మానుష్టానాలను అనుసరించాలి. వాటిని అనుసరించక పోవడం పెద్ద తప్పుగా భావించబడుతుంది. అవి భగవానుని యొక్క సొంత ఆదేశాలను ఉల్లంఘన చేసినట్లు అవుతుంది. “భగవాన్ యొక్క ఆదేశాల ప్రకారం ఈ కర్మను కైంకర్యంగా భావించి చేయాలి. పిళ్ళై లోకాచార్య ముమ్ముక్షుపడి సుత్రం 271లో “కర్మం కైంకర్యత్తిల్ పుగుమ్” (ప్రపన్నులకు, శాస్త్ర ప్రకారం జరుపుతున్న అన్ని కార్యాలు భగవానునికి సేవగా పరిగణించబడతాయి).
- సిద్ధ సాధనం (సిద్దోపాయం) – సిద్దం అనగా ఇప్పటికే స్థాపించబడినది – అందుబాటుకి సిద్ధంగా ఉన్నది. ఉదాహరణకి ఆహారం వండి ఆరగించడానికి తయారుగా ఉన్నట్లుగా. ఆహారాన్ని కేవలం సునాయాసంగా ఆరగించడమే తడువు. భగవాన్ ఎల్లప్పుడూ జీవాత్మపై తన కరుణా వర్షాన్ని కురిపించేందుకు సిద్ధంగా ఉంటాడు (మనము సునాయాసంగా స్వీకరించడమే అవసరం). భగవాన్ యొక్క కరుణను స్వీకరించడం సిద్దోపాయ వరణం అని పిలుస్తారు. అందువల్ల భగవానుడిని ప్రపత్తి శబ్ద వాచ్యుడు (ప్రపత్తి అను పదమును సూచించేవాడు) మరియు సిద్ధ సాధన భూతుడు (ఇప్పటికే స్థాపించబడిన ఉపాయము) గా వివరించారు.
- సాధ్య సాధనం (సాద్యోపాయం) – సాధ్యం సాధించవలసినది అని అర్థం. ఉదాహరణకి బియ్యం, కాయకూరలు మొదలైనవి – తినదగినట్లుగా ఆహారాన్ని వండే అవసరం ఉంది . కర్మ, జ్ఞాన, భక్తి వంటి అన్ని ఉపాయాలు జీవాత్మ అనుసరించాల్సిన సూత్రాలు. జీవాత్మ సాధిస్తేనే ఈ ఉపాయాలు స్థాపించబడతాయి.
మరొక శ్రెష్టమైన వ్యత్యాసం – భగవానుడు పరమ చేతనుడు ( మహోన్నతమైన పరిజ్ఞానవంతుడు) – కనుక అంతిమ ఫలితం వారి తప్ప ఇంకెవ్వరు ప్రసాదించలేరు. ఇతర ఉపాయాలన్నీ అచిత్ (అచేతనమైనవి ఎటువంటి అవగాహన లేని జ్ఞానం వంటివి) – ఒక ప్రత్యేక ఉపాయాన్ని ఉపాసించడం ద్వారా – భగవానుడు ప్రసన్నుడై అంతిమ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
12. భగవత్కర్మనిష్ఠనుక్కు దేవతాంతర కర్మనిష్థై విరోధి – భగవాన్ కైంకర్యంపై నిష్ఠ ఉన్నవారికి, దేవతాంతర సేవ చేపట్టడం ఒక అడ్డంకి.
సర్వేశ్వరుడైన శ్రీవన్నారాయణుడు అందరికి సర్వోపరుడు, “దేవుడు” గా గుర్తించవచ్చు. బ్రహ్మా, శివ, ఇంద్రుడు మొదలైన వారిని దేవతలు గా భావిస్తారు. కానీ ఈ దేవతలు కూడా జీవత్మలే. సామాన్య ప్రజలు ఎలాగైతే సంపన్నమైన వ్యక్తులను సంప్రదించి వారిని ప్రశంసించి వారికి కావలసిన సంపదను పొందుతారు, అలాగే ఈ దేవతలు సామాన్య మానవులకన్నా ఉన్నత స్థానులు, మానవులు వారిని కోరి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ దేవతలు శ్రీవన్నారాయణుని చేత నియమించబడ్డారు, తొందరడిప్పొడి ఆళ్వార్ చేత రచించబడిన తిరుమాలైలో 10 వ పాసురం లో “ణాట్టినాన్ దైయ్వంగళాగ … అత్ దైవనాయగన్ తానే” – అన్ని దేవతల దేవుడు అయిన ఎమ్బెరుమాన్ ఈ దేవతలను ఇతరుల సంక్షేమం కోసం నియమించబడ్డారు. వారిని దేవతాంతరులు (ఇతర దేవతలు) అని పిలుస్తారు.
మనం మన నిత్య కార్యాలను భగవానుని కైంకర్యంగా భావించి నిర్వర్తించినప్పుడు, భగవానుని ముఖారవిందంలో సంతోషాన్ని గమనించ వచ్చు. మనకు ఇది సాధించదగిన ఆదర్శము. వారి ముఖంలో ఆనందం మన ఉనికికి ఏకైక ఉద్దేశ్యం. వీటి నుండి మనం సులభంగా అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే దేవతాంతర (భగవానుడు మరియు వారి భక్తులకు మినహాయించి) కార్యాలు భగవత్ కైంకర్యానికి అడ్డంకి.
అనువాదకుని గమనిక: ఈ సూత్రంలో, శాస్త్ర విహిత కర్మలు (శాస్త్రం ఏర్పరచిన కర్మలు) మరియు ఇతర కర్మల మధ్య వ్యత్యాసం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీనిని ఒక ఉదాహరణతో చూద్దాము.
మన (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) ప్రతి రోజు మూడుసార్లు సంధ్యావందనం చేస్తారు. అగ్ని, సూర్య, ఇంద్ర, వరుణ మొదలైన వారికి ప్రత్యేకమైన అర్పణలు ఉన్నాయి. అయితే ఈ దేవతల్లో అంతర్యామిగా శ్రీమన్నారాయణ ఉంటారని మనము గమనించాలి. మన పూర్వాచార్యులు ఈ పవిత్ర ఆచారాలను భగవానుడి కైంకర్యంగా భావించి ఈ తప్పనిసరి నిత్య కర్మలను వారి వర్ణం ప్రకారం ఆచరించేవారు. కాబట్టి, నిత్య కర్మ (సంధ్యావందనం మొదలైనవి) మరియు నైమిత్తిక కర్మలు (తర్పణం మొదలైనవి) ఆచరించాలి. కానీ దేవతాంతర దేవాలయాలలో ఏ కార్యాలలోనూ పాల్గొనకూడదు. ఇటువంటి సందర్భానికి నంపిళ్ళై ఒక శాస్త్రీయ వివరణ ఇస్తున్నారు. ఇది 6000 పడి గురుపరంపర ప్రభావంలో ప్రస్తావించబడింది. ఒకానొక సమయంలో, నంపిళ్ళై వద్దకు వెళ్లి కొందరు, “మీరు ఎమ్బెరుమార్ను మాత్రమే నిష్థగా ఆరాధిస్తారు. నిత్య / నైమిత్తిక కర్మలలో అగ్ని, సూర్య, ఇంద్ర, వరుణ తదితరులను పూజించేటప్పుడు, వారిని వారి దేవాలయాలలో ఎందుకు పూజించరు?” అని అడిగారు.
- నంపిళ్ళై వివరిస్తూ అన్నారు “వినండి! వ్యత్యాసం ఏమిటంటే అగ్ని హోత్రం నుండి అగ్నిని స్వీకరించటం మరియు ఒక స్మశానంలో దహనాగ్నిని తిరస్కరించడం వంటిది. రెండూ అగ్ని హోత్రలు ఉన్నప్పటికీ – యజ్ఞం నుండి వచ్చిన అగ్ని పవిత్రమైనదిగా భావించబడుతుంది, అయితే శవాన్ని దహించే అగ్నిను అపవిత్రమైనదిగా భావిస్తారు.
- వారు ఇంకా వివరిస్తూ అన్నారు “మన నిత్య కర్మలలో ఏది అనుసరిస్తామో, శాస్త్రంలో అవన్నీ ఎమ్బెరుమాన్ యొక్క ఆరాధనలో భాగంగా వివరించారు. కానీ దేవతాంతర దేవాలయాలలో ఈ లోపాలు కలిగి ఉన్నాయి – 1) ఈ ఆలయాలను స్థాపించినవారు తామస (అజ్ఞానులు) స్వభావం కలిగి ఉంటారు మరియు భగవానునికి మరియు ఇతర దేవతల మధ్య భేదం తెలియనివారు 2) వారు భగవత్ తత్వానికి విరుద్ధంగా ఆగమాలను ఉపయోగించి మరియు దేవతాంతరులను స్వతంత్ర శక్తులుగా ఏర్పరచారు “.
- ఇంకా వివరిస్తూ , “ఇతర దేవతలను (నిత్య / నైమిత్తిక కర్మలకు మినహా) పూజించుటకు శాస్త్రంలో ప్రత్యేకమైన నియమం లేదు – అందువల్ల పపన్నలకు అది సరియైనది కాదు, అంతేగాక, దేవతల అందరిలో రుద్రని యొక్క పూజ పూర్తిగా నిషేధించబడింది, ఎందుకనగా, అతను సత్వ గుణానికి పూర్తి వ్యతిరేకముగా ఉన్న తమోగుణంతో నిండి ఉన్నాడు – అందువలన, ఎమ్బెరుమాన్ చేత వారు కూడా సర్వవ్యాపి (అంతర్యామిగా) అని వారిని దేవాలయములలో సేవించలేము.
- చివరగా, వారు ఇలా చెప్పారు: “మన సత్వ గుణాన్ని అభివృద్ధి చేయడంలో సానుకూలంగా ఉన్న నిత్య / నైమిత్తిక కర్మలను ఎందుకు విడిచిపెట్టాలి మరియు భగవత్ కైంకర్యానికి ప్రతికూలమైన దేవతాంతర ఆరాధన ఎందుకు చేపట్టాలి?” దీనిని బట్టి దేవాలయాలలో దేవతాంతర ఆరాధన వేద ఆగమము ప్రకారం స్థాపించి నప్పటికీ కూడా పపన్నలకు అది సరికాదు.
ఈ రోజుల్లో ఈ కాలంలో, ప్రతి మూలలో ప్రతిరోజు కొత్త దేవతలు సృష్టించబడుతున్నారు. వేదాన్ని అంగీకరించకుండా ధిక్కరించి వారి వారి సొంత శైలితో గురువులు వారికి అనుకూలమైన తత్వాలను అనుకూలమైన రీతిలో బోధిస్తున్నారు. అజ్ఞానాంధకారంలో చిక్కుకోకుండా పెద్దలతో (పండితులతో) పరామర్శించి మన పూర్వాచార్యుల మార్గాన్ని అనుసరించుటయే పపన్నలకు ఉత్తమం.
13. భగవత్ కైంకర్య నిష్ఠనుక్కు దేవతాంతర భజనం విరోధి – భగవత్ కైంకర్యంపై దృష్టి పెట్టేవారికి, ఇతర దేవతల ఆరాధన అడ్డంకి.
వేదాంత సారమైన ప్రణవం, జీవాత్మ(అధీనుడు)ను సర్వరక్షకుడైన మరియు సర్వవ్యాపి అయిన కేవలం శ్రీమన్నారాయణుని కొరకే ఉణికితో ఉన్నాడని ఘోషిస్తుంది. అందువలన, భగవత్ కైంకర్యంలో నిమగ్నమై ఉండుట జీవాత్మకు సహజమైన గుణం. భగవత్ కైంకర్యంలో నిమగ్నమైన వ్యక్తులకు, దేవతాంతరముతో సంబంధం కలిగి ఉండుట ప్రధాన విరోధి.
అనువాదకుని గమనిక: వ్యఖానంలో, “పతిం విస్వస్య” ప్రమాణం తెలియజేస్తున్నారు. పతి అనగా సాధారణంగా “భర్త / యజమాని” అని అర్థం. ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న అనంతరం, ఆమె తన భర్తకు పూర్తిగా లొంగిఉండి ఇంకెవరిపై దృష్టి పెట్టదు. అదే విధంగా, జీవాత్మ భగావాన్ సేవకునిగా తన స్వరూపాన్ని తెలుసుకొని, అతను పూర్తిగా భగవానుడికి లొంగిఉండాలి. అందువలన, జీవాత్మ అటువంటి పరిపూర్ణత తర్వాత ఇతర దేవతాంతర సంభంధం అనవసరం. అంతేకాదు, తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళి 8.10.3 లో “మఱ్ఱుమోర్ దెయ్వం ఉళదెన్ఱు ఇరుప్పారోడు ఉఱ్ఱిలేన్” – శ్రీమన్నారాయణుడు కాక మరొక దేవుడు ఉన్నాడని నమ్ముతున్న ఎవరితోనూ అనుబంధించను – ప్రపన్నులు జాగ్రత్తగా దేవతాంతర నిష్టులకు దూరంగా ఉండాలి.
14. భగవతుపాయ నిష్ఠనుక్కు ప్రపత్తి విరోధి – భగవాన్ ఒక్కటే ఉపాయంగా అనుసరించే వారికి, శరణాగతి ఉపాయంగా భావించడం అడ్డంకి.
10 మరియు 11వ వ్యాఖ్యానములో చర్చించాము. ధృఢమైన విశ్వాసంతో ఎమ్బెరుమానుని ఉపేయం (లక్ష్యము) గా మరియు ఉపాయం (మాధ్యమం) గా భావించే వ్యక్తిని ఉత్తమ అధికారి (అత్యుత్తమ భక్తుడు)గా పిలుస్తారు. భగవాన్ స్వయంగా “తమేవ శరణం వ్రజేత్” – భగవానునికి మాత్రమే శరణాగతి చేయుట). అలాంటి వ్యక్తులకు, వారి శరణాగతి చర్య “ప్రపద్యే” లో చూపించబడినట్టుగా మాధ్యమం కాదు ( వారి సహజ స్వీకరణ స్థితి ). కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను అనుసరించే వ్యక్తులను మధ్యమ అధికారి అని పిలుస్తారు. (మధ్యస్థమైన భక్తుడు – నిరంతరం స్వయం కృషి ప్రాధాన్యత ఉన్న కారణంగా). వారి స్వయం ప్రపత్తిని ఉపాయంగా భావించేవారు మధ్యమ అధికారి వర్గంలోకి వస్తారు. ఇటువంటి చర్య ప్రపన్నులకు ఒక అడ్డంకి – కర్మ, జ్ఞాన, భక్తి యోగము మొదలైన వాటికి సమానమైనవి.
15. సాధ్యోపాయ నిష్ఠనుక్కు నివృత్తి విరోధి – కర్మ, జ్ఞాన, భక్తి యోగము మొదలైన వాటి పై దృష్టి పెట్టేవారికి సొంత ప్రయత్నాలు త్యజించుట ఒక అడ్డంకి.
16. సిద్ధోపాయ నిష్ఠనుక్కు ప్రవృత్తి విరోధి – భగవానుడిపై దృష్టి పెట్టేవారికి సొంత ప్రయత్నాలలో పాల్గొనడం ఒక అడ్డంకి.
10 మరియు 11వ వ్యాఖ్యానములో సిద్ధోపాయం మరియు సాధ్యపాయం గురించి వివరించి ఉంది.
- సొంత ప్రయత్నాలలో పాల్గొనుటను ప్రవృత్తి అంటారు.
- సొంత ప్రయత్నాల నుండి ఉపసంహరించుట నివృత్తి అంటారు.
- సాధ్యోపాయ నిష్ఠుడు – సొంత ప్రయత్నం ఆధారంగా తన లక్ష్యాన్ని సాధించాలని కోరుకునే వాడు.
- సిద్ధోపాయ నిష్ఠుడు – భగవానుని (ఉపాయంగా రుజువుచేయబడిన) మాధ్యమంగ స్వీకరించి మరియు అతనిని దుఃఖం (సంసారం) నుండి ఉపశమనం చేస్తాడని ఆశించేవాడు. నమ్మాల్వార్ తిరువాయ్మొళి 5.8.8 లో “కళైవాయ్ తున్బం కళైయా తొళివాయ్ కళైకణ్ మఱ్ఱిలేన్”. ఈ ప్రపన్నులు వారిని ఉపాయంగా పరిగణించే ఏ రకమైన కర్మలను చేయరు. నమ్మాల్వారి తిరువాయ్మొళి 5.7.5 లో “చైత వేళ్వియర్” అని పిలవబడింది. ఇది సంస్కృతంలో “కృత కృత్యన్” – ఇప్పటికే అన్ని అవసరమైన చర్యలను చేసిన వాడు అని సంస్కృతంలో వివరించబడింది. ప్రపత్తి అనగా, ప్రధాన నిర్వచనం “తమ సొంత ప్రయత్నాలను త్యజించుట”.
సాధ్యోపాయుడు (కర్మ యోగంలో మొదలగు వాటిపై నిమగ్నమై ఉన్న వ్యక్తి) సొంత – ప్రయత్నాలను త్యజించలేరు – వారు ఫలితాన్ని పొందే లక్ష్యంతో ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి . అతనికి, సొంత ప్రయత్నాలు త్యజించుట ఒక అడ్డంకి.
కానీ సిద్ధోపాయునికి – ఇది పూర్తి వ్యతిరేకం. అతను లక్ష్యాన్ని సాధించడానికి సొంత ప్రయత్నాలలో పాల్గొనలేడు. అలాంటి సొంత ప్రయత్నం అతనికి విరోధి.
ఈ ప్రపత్తి మరియు నివృత్తి సూత్రాలను పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 80 – 82 సూత్రంలో (తదుపరి సూత్రాలలో) “అధికారి కృత్యం – అధికారి నిష్ఠా క్రమం” వివరించారు. దయచేసి దాని గురించి స్పష్టముగా అవగాహన కలిగి ఉండండి.
అనువాదకుని గమనిక: శ్రీవాచన భూషణ దివ్య శాస్త్రంలో, ఇక్కడ పేర్కొన్న ప్రత్యేక విభాగంలో, కొన్ని మంచి ఉదాహరణలు పిళ్ళై లోకాచార్యుల ద్వారా ఉపాయం మరియు ఉపేయం గురించి అందించబడ్డాయి. మణవాళ మామునుల వారి వ్యాఖ్యానము ఈ సూత్రాలకు చాలా విలువైన వివరణ అందిస్తుంది. వాటిని క్లుప్తంగా చూద్దాము.
- ఉపాయానికి (అంటే భగవనుని మాధ్యమంగా స్వీకరించుట), సీతా పిరాట్టి, ద్రౌపది మరియు తిరుక్కణ్ణమంగై ఆండాన్ మంచి ఉదాహరణలు.
-
- సీతా పిరాట్టి తన సొంత శక్తిని త్యజించారు – ఆమె తనకు తాను శక్తివంతమైనది మరియు అతిసులభంగా లంకను మరియు రావణుడిని పతనం చేసి ఉండేది. కాని శ్రీరాముడు వచ్చి తనను కాపాడతాడని ఎదురు చూసింది.
-
- ద్రౌపది ఎమ్బెరుమాన్ చే రక్షించబడుతుందని పూర్తి విశ్వాసంతో జంకు సిగ్గును వదిలి తన రెండు చేతులు ఎత్తి శ్రీ కృష్ణుడిని ఆర్తితో పిలిచింది – ఖచ్చితంగా ఆమె రక్షించబడింది.
-
- తిరుక్కణ్ణమంగై ఆండాన్ సొంత ప్రయత్నాలు వదిలి పూర్తిగా తిరుక్కణ్ణమంగై భక్తవత్సలుడు ఎమ్బెరుమాన్ సేవ చేసాడు. అతను బయట రెండు కుక్కలు పోట్లాడటం గమనించాడు, అది చూచి ఆ కుక్కల యజమానులు కూడా పోట్లాడటం మొదలుపెట్టారు. ఇది గమనించి , “ఆ యజమాని తన కుక్కను రక్షించటానికి వచ్చాడంటే, నా యజమాని (భగవాన్) నన్ను రక్షించటానికి పోషించడానికి ఎందుకు రాడు? నేను బాహ్య కార్యకలాపాలలో ఎందుకు భాగస్వామిని కావాలి?” అని ఒక్కసారి అన్నీ విడిచిపెట్టాడు.
- ఉపేయానికి (భగవత్ కైంకర్యం లో పాల్గొనడం), ఇళైయ పెరుమాళ్ (లక్ష్మనుడు), పెరియ ఉడైయార్ (జటాయు), పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ మరియు చింతయంతి వంటి వారు మంచి ఉదాహరణలు.
- ఇళైయ పెరుమాళ్ శ్రీరామునికి నిరంతరం తోడుగా ఉండి కైంకర్యం చేశాడు, ఎందుకంటే ఎమ్బెరుమాన్ లేకుండా నిరంతరం వారి సేవ లేకుండా అతను ఉండలేడు కాబట్టి.
-
- పెరియ ఉడైయార్ (జటాయు మహరాజు) మరియు పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ సీతా పిరాట్టి మరియు అర్చావతార ఎమ్బెరుమాన్ను రక్షించేందుకు వారి బాహ్య శరీరాలను త్యాగం చేశారు.
-
- చింతయంతి ఒక గోపిక, కృష్ణుడిని చూడటానికి ఆమె తన నివాసాన్ని వదిలి వెళ్ళ లేకపోయింది. ఎమ్బెరుమాన్ వేణువాదం విని గొప్ప ఆనందాన్ని పొంది – కృష్ణుడిని చూసే ఆస్కారం లేక తీవ్రమైన బాధతో ఆమె శరీరం విడిచిపెట్టింది.
మరిన్ని వివరాలకోసం, దయచేసి ఒక అర్హత గల ఆచార్యులను సంప్రదించి ఈ క్లిష్టమైన సూత్రాలను నేర్చుకోండి.
తదుపరి విభాగాన్ని మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2013/12/virodhi-pariharangal-2/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org