విరోధి పరిహారాలు – 11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్” (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – – https://granthams.koyil.org/2019/06/05/విరోధి-పరిహారాలు-10 

42. లక్షణ విరోధి – మన వ్యక్తిత్వం, రూపము మరియు ప్రవర్తనలో వచ్చే అవరోధాలు.

అనేక అంశాలు ఈ భాగంలో చర్చించబడ్డాయి. లక్షణం అనగా ఆకారము, వ్యక్తిత్వం, రూపము అని అర్థాలు. అనువాదకుని గమనిక: మన సంస్కృత సాహిత్యంలో, లక్షణం  అంటే  సాధారణంగా ఒక తత్వము యొక్క గుణాలను మరొక తత్వము నుండి వేరుచేసే ప్రత్యేక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ శీర్షికలో  పంచ సంస్కారంలోని తాపం (తమ భుజాలపై శంఖ చక్రాలను ధరించుట, శరీరంలో 12 భాగాలలో ఊర్ధ్వ పుండ్రాలను ధరించుట), శారీరక రూపం, వస్త్రాధరణ – మొదలైన  కొన్ని అంశాలు వివరించబడ్డాయి . ఈ విభాగంలో చాలా ఆసక్తికరమైన మరియు సూక్ష్మమైన అంశాలు వివరింప బడ్డాయి .

నమ్మాళ్వార్, ఎమ్బెరుమానార్, పిళ్ళై లోకాచార్య, జీయర్ – ఆదర్శ శ్రీవైష్ణవులు

మొట్టమొదటిగా పంచ సంస్కారం (సమాశ్రయణం) లోని భాగమైన తప సంస్కారంపై లోతైన వివరణ చూద్దాము – అది శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశ ప్రక్రియ.

తప సంస్కారం నిర్వహిస్తున్న ఆచార్యులు 
  • తిరువిలచ్చినై   (భుజాలపై తప ముద్రలు ఉంటే ఆ వ్యక్తికి పంచ సంస్కారం అయ్యిందన్న సూచన) స్పష్టంగా కనిపించాలి.  వేడి చేసిన  శంఖం మరియు చక్రములను ప్రత్యేకమైన మంత్రాలతో భుజాల మీద ఆచార్యులు ముద్రలు వేస్తారు. మొదట్లో కాలిన గాయం లాగా కనిపించవచ్చు, కాని నయం అయ్యి౦తరువాత ఆ గుర్తులు ఎప్పటికీ భుజాలపై ఉండిపోతాయి. ఇంది సమాశ్రయణం (పంచ సంస్కారం) లోని మొదటి సంస్కారం – శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశమైయ్యే ప్రక్రియ. శ్రీవైష్ణవుల భుజాలపై ఆ ముద్రలు స్పష్టంగా కనిపించుట చాలా అవసరం. భుజాలపై ఆ ముద్రలు స్పష్టంగా కనిపించక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: అనేక ఆచార్య పీఠాలలో, శంఖ చక్రాలను ఒక మాదిరిగా వేడి చేసి భుజాలపై సున్నితంగా ముద్రలు వేస్తారు – అలా చేస్తే భుజాలపై ముద్రలు స్పష్టంగా ఏర్పడవు.  ఈ పద్ధతి అనేక ఆచార్య పీఠాలలో ఆచరణలగా కనిపిస్తున్నందున, ఈ పద్ధతిని షిష్ఠాచారం (మన పెద్దలచే చేయబడుతున్న) గా పరిగణించవచ్చు.
  • తప సంస్కారమును స్వీకరించడానికి మరొక మార్గం ఉంది – పుష్పాలను ఉపయోగించి – దీనిని పుష్ప సమాశ్రయణం / సంస్కారం అని పిలుస్తారు. ప్రస్తుతం మన సాంప్రదాయంలో ఇది అమల్లోలేదు. ఈ ఆచారమును అషిష్ఠులు (మన పూర్వాచార్యులు కాకుండా ఇతరులు) అనుసరిస్తారు,  అందుచే శ్రీవైష్ణవులు ఈ ఆచారమును అనుసరించడం లేదు.
  • వేడి శంఖ చక్రాలను ఉపయోగించి చేసే తప సంస్కారం మాత్రమే సరైన విధానం. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.
  • శారీరక వ్యాధులను నయం చేసేందుకు తప సంస్కారము (వేడి శంఖ మరియు చక్రం ఉపయోగించి) చేయించుకొనుట ఒక అడ్డంకి.
  • ఈ పంచ సంస్కారం యొక్క ప్రయోజనం మనలను అతిపెద్ద వ్యాధి అయిన ఈ సంసారము నుండి  (జననం మరియు మరణం యొక్క పునరావృత చక్రంలో ఉండటం) పరమపదంలో శాశ్వతమైన ఆనందకరమైన భగవానుని నిరంతర శాశ్వత సేవకై మనలను  ఉద్ధరించి మనలను ఉపశమనం కలిగిస్తుందని సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరం. ఈ అవగాహన లేకుండా ఈ పంచ సంస్కారం చేయించుకొనుట ఒక అడ్డంకి.
  • శంఖ చక్రములు భగవాన్ యొక్క శాశ్వత వ్యక్తిత్వ స్వరూపాలు. వారు తమ ప్రియమైన యజమాని యొక్క చిహ్నాలను ధరిస్తున్నామని  పరమానందముతో వాటిని ధరించాలి. ఆ ఆనందం లేకపోవడం ఒక అడ్డంకి.
  • ఒక శ్రీవైష్ణవునిగా మారిన తరువాత సంసారుల  (లౌకిక ప్రవ్రుత్తి కల మనుషులు) నుండి దూరంగా ఉండాలి. సంసారుల నుండి వేరైనందుకు సిగ్గుపడకూడదు.
  • ఒక శ్రీవైష్ణవునిగా మారిన తరువాత ఇతర శ్రీవైష్ణవులకు దగ్గరవ్వాలి, వారితో ప్రేమగా ఉండాలి. “ఇప్పుడు నన్ను శ్రీవైష్ణవులు స్వీకరిస్తారు” అని ఆలోచిస్తూ గొప్ప ఆనందం అనుభూతిని పొందాలి. అటువంటి ఆనందం కపోవుట ఒక అడ్డంకి.

తరువాత ఊర్ధ్వపుండ్రంపైన విస్తారంగా చర్చించబడింది.  ఈ విభాగంలో అనేక సూక్ష్మ విశేషాలను చర్చించ బడ్డాయి. మొదట ఈ అంశంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. తిరుముణ్ – పవిత్రమైన మట్టి. కాప్పు –  ధరించేవారికి రక్షణ. కాబట్టి, ఊర్ధ్వపుండ్రాన్ని తమిళంలో  తిరుముణ్ కాప్పు అని పిలుస్తారు. తిరుముణ్ కాప్పు  త్రిపుండ్రం (3 రేఖలు కలిగి ఉన్నందున) అని కూడా ప్రసిద్ది చెందింది – ఇది క్రింద నుండి పైకి నిలువుగా పెట్టుకుంటారు.  మన పెద్దలు శాస్త్రంలోని తగిన భాగాలు విశ్లేషించి ఊర్ధ్వపుండ్రం గురించి అనేక ముఖ్యమైన అంశాలను నిర్ణయించారు. ఊర్ధ్వపుండ్రం యొక్క గొప్పతనాన్ని శ్రీవైష్ణవులు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు మరియు సరిగ్గా ధరించట్లేదన్న వాస్తవం వారికి సిగ్గు చేటు.

తిరుముణ్ కాప్పు (ఊర్ధ్వపుండ్రం) సరైన పద్ధతిలో (సరైన మూల ఆధారము నుండి నేర్చుకున్న) ఒక స్వచ్ఛమైన మరియు సుందరమైన పద్ధతిలో ధరించాలి. ఈ విషయంలో ఒక సంఘటన గుర్తుకు చేసుకుందాము. చోళరాజు సభలో కూరత్తాళ్వారులు కనుచూపును కోల్పోయిన సంఘటన అందరికి తెలుసు.  శ్రీవైష్ణవులు ఈ సంఘటనతో చాలా భాద పడ్డారు. వారి చూపును కోల్పోయిన సంఘటన గురించి, వారు పడుతున్న పీఢను కూరత్తాళ్వార్ తో పంచుకుంటారు. ఆ సమయంలో, కూరత్తాళ్వార్ గొప్ప వినయపూర్వకంగా అంటారు, “ఇది భాగవత అపచారం యొక్క ఫలితం, నేను ఎవరిదో నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని చూసి సరిగ్గా పెట్టుకోలేదని మనస్సులో భావించుంటాను”. కాబట్టి, మన ఊర్ధ్వపుండ్రాన్ని సాధారణంగా / సరికాని రీతిలో పెట్టుకోకూడదు,  పెద్దలు దానిని చూసి బాధను అనుభవిస్తారు. మన పెద్దలకు మరియు ఇతర శ్రీవైష్ణవులకు ఇబ్బంది కలిగించేటట్టుగా మనము ప్రవర్తించ కూడదు. ఇది మన ప్రధాన కర్తవ్యము మరియు బాధ్యత.

తిరుమణ్ స్వచ్చమైన తెల్లని పొడితో తయారు చేస్తారు. దీనిని ధవళ ప్పొడి ( మెరిసే తెల్ల పొడి) అని కూడా పిలుస్తారు. పురాణాల నుండి మనకు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే పెరియ తిరువడి నాయనార్  (గరుడాళ్వారులు) శ్వేత ధ్వీపం నుండి ఈ పవిత్ర మట్టిని తెచ్చి భారత దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఉంచారు. ఈ కాలంలో తెల్లటి బంకమట్టి రూపంలో తిరునారాయణపురం, అయోధ్య వంటి కొన్ని ప్రదేశాలలో  కనిపిస్తుంది. ఈ తెల్లని బంకమట్టిని తొవ్వి, నీళ్ళల్లో కలిపి, వడకట్టి, ముద్దలుగా చేసి ఎండబెడతారు. అనేక దివ్య దేశాలలో ఇవి కొనుక్కోవచ్చు.

కొన్ని విబేధాలు ఉన్నప్పటికీ – నేను (డాక్టర్ వి. వి. రామానుజం స్వామి) పెద్దల నుండి నేర్చుకున్న మరియు మన సాంప్రదాయానికి సంబంధించిన అనేక సాహిత్యాలలో చదివిన వాటిని మీతో పంచుకున్తున్న్నాను.

పద్మ పీఠం, చెల్వ పిళ్ళై (తిరునారాయణపురం) యొక్క చరణ కమలాలు, చరణ కమలాల వద్ద తాయార్
హరి – పాద – ఆకృతి – పద్మ పీఠానికి ప్రతీక, ఎమ్బెరుమాన్ చరణ కమలాలు, చరణ కమల మధ్యలో తాయార్
  • ఒక పప్పన్నుడు (శ్రీవైష్ణవుడు) తన నుదుటిపై (ఇతర భాగాలతో సహా) శ్వేత మృత్తికా (శ్రీ చూర్ణం) అనే తెల్లని చూర్ణాన్ని ఉపయోగించి ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి.
  • ఊర్ధ్వపుండ్రాన్ని ధరించేటపుడు భగవాన్ యొక్క తిరునామాలను (దివ్య నామాలు) స్మరించుకోవాలి. ఈ కారణంగా తిరుముణ్ న్ని కూడా తిరునామం అని కూడా పిలుస్తారు (లేదా కొన్నిసార్లు కేవలం నామం అని పిలుస్తారు).
  • నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.7 పదిగంలో శ్రీమన్నారాయణుని యొక్క ద్వాదశ నామాలను కీర్తించారు. ఈ పదిగ వ్యాఖ్యానం యొక్క పరిచయ విభాగంలో “వైష్ణవత్వ చిన్హమిఱె తిరుద్వాదశ నామం” – పన్నెండు నామాలు / పుండ్రములు వైష్ణవానికి చిహ్నాలు –  శ్రీమన్నారాయణుని చెందినవని సూచన).
  • శరీరంపై ఈ క్రింది 12 భాగాలలో (క్రింది వరుసలో) 12 పుండ్రములను ధరించాలి అని శాస్త్రంలో వివరించబడింది.
  1. నుదుట
  2. కడుపు మధ్య భాగంలో
  3. ఛాతి మధ్య భాగంలో
  4. మెడ మధ్య భాగంలో
  5. కడుపు కుడి వైపున
  6. కుడి భుజము
  7. మెడ కుడి వైపున
  8. కడుపు ఎడమ వైపున
  9. ఎడమ భుజముపైన
  10. మెడ ఎడమ వైపున
  11. వీపులో నడుము పై భాగమున
  12. మెడ వెనక భాగమున
  • తిరువాయ్మొళి 4.4.7 లో, నమ్మాళ్వార్ అన్నారు, “నీరు చేవ్వేయిడక్కణిళ్ తిరుమాలడియార్ ఎన్రోడుం” – ఒక వేళ ఎవరైనా నిలువు తిలకం (ఊర్ధ్వపుండ్రం) ధరించిన వారిని నేను చూస్తే, వారిని శ్రీమన్నారాయణుని దాసులుగా భావించి మెచ్చుకుంటాను. కాబట్టి,  అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మనము నిలువుగా మాత్రమే తిలకం ధరించాలి. అనువాదకుడు యొక్క గమనిక: సాధారణంగా ఇప్పుడు శ్రీవైష్ణవులు కుంకుమ, గంధం, బూడిద అడ్డంగా కూడా పెట్టుకుంటున్నారు. అటువంటి వాటి నుండి దూరంగా ఉండాలి.
  • తిరుమణ్ పాదపీట  పద్మముతో (హరి పాదాలను పట్టుకున్న కమలం) హరి పాద ఆకృతి (శ్రీ హరి చరణకమలాల రూపంలో) గా ధరించాలి .  అనువాదకుని నోట్: నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 4.5.8 “తణ్ తామరై సుమక్కుం పాద ప్పెరుమాన్” (చల్లని తామర పాద పద్మాలను పట్టుకొని ఉన్న భగవాన్) అని వర్ణించారు.
  • నిలువు గీతలగా పెట్టుకోవాలి. రెండు తెలుపు రేఖలు (కుడి, ఎడమ) ఎమ్బెరుమాన్ యొక్క చరణాలను సూచిస్తు౦ది. మధ్యలో ఉన్న ఎరుపు రేఖ శ్రీమహాలక్ష్మిని సూచిస్తుంది, శ్రీ చూర్ణం అని పిలుస్తారు. శ్రీ చూర్ణం పసుపు పొడి నుండి తయారు చేస్తారు. దీనిని హరిద్రా చూర్ణం అని కూడా పిలుస్తారు. దానిని ఎరుపు రంగులో మారుస్తారు. పద్మ పీటం (దిగువన ఉన్న కమలం) ముక్కు మీద తిరుమణ్ తో మాత్రమే వ్రాయాలి. రెండు తెలుపు రేఖల మధ్య (ఇది ఎమ్బెరుమాన్ యొక్క చరణకమలాలను సూచిస్తు౦ది), కనీసం రెండు అంగుళాల దూరం ఉంచాలి. ప్రతి తెలుపు రేఖ ఒక అంగుళం వెడల్పు ఉండాలి.
  • నుదిటిలో మాత్రమే పద్మ పీటాన్ని పెట్టుకోవాలి. అన్ని ఇతర 11 ప్రదేశాలలో, చరణ కమలాలు పీఠం స్పష్టంగా లేకుండా తిరుమన్ని ధరించాలి.
  • శరీరం యొక్క ప్రతి భాగంలో తిరుమణ్ యొక్క పరిమాణానికి పరిమితులు ఉన్నాయి. ఈ అంశంపై దయచేసి పెద్దలను అడిగి మరింత తెలుసుకోండి.
ఇప్పుడు లక్షణ విరోధి ఉపభాగంలోని అడ్డంకులను చూద్దాము.
  • మన పెద్దలు ఆమోదించని ప్రదేశాల నుండి సేకరించిన తిరుమణ్ ని ఉపయోగించుట ఒక అడ్డంకి.
  • మన పెద్దలు ఆమోదించిన దివ్య దేశాల (తిరునారాయణపురం, శ్రీరంగం, అయోధ్య మొదలైన) నుండి తెచ్చిన తిరుమణ్ని ఉపయోగించక పోవుట ఒక అడ్డంకి.
  • తిరుమణ్ తెచ్చిన దివ్య దేశాల యొక్క మాహాత్మ్యమును అర్ధం చేసుకోకుండా తిరుమణ్ ధరించుట ఒక అడ్డంకి.   “ఓ! ఈ తిరుమణ్ అయోధ్య నుండి తెచ్చినది, అద్భుతం!”, అని మన మనస్సులో ఆలోచనతో  ధరించాలి.
  • ఒక ముముక్షువుగా తెల్ల తిరుమణ్  మాత్రమే ధారణ చేయాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • వివిధ లక్ష్యాలను సాధించడానికి వివిధ రంగుల తిరుమణ్లు (మరియు శ్రీచూర్ణం కూడా) ఉన్నాయి. అటువంటి పద్దతులను పాటించుట ఒక అడ్డంకి.
  • మన పూర్వాచార్యులు హరి పాదాకృతి (ఎమ్బెరుమాన్ యొక్క చరణ కమలాల రూపం) ధరించాలని నిర్దేశించారు. ఇతర రకాల పుండ్రాలు కూడా ఉన్నాయి – కాని మన పూర్వాచార్యులు శాస్త్రాన్ని పూర్తిగా విశ్లేషించిన తరువాత హరి పాదాకృతిని ధరించాలని నిర్దేశించారు.
  • చాలా చిన్నతిరుమణ్ (ఒక చిన్న చుక్క రూపంలో) ధరించుట అవరోధం. అనువాదకుడు యొక్క గమనిక: కొంత మంది తిరుమణ్ యొక్క నాలుగు మూలల్లో కేవలం 4 చుక్కలు మాత్రమే ధరిస్తారు – అలాంటి పద్ధతిని సూచిస్తుంది కాబోలు.
  • తిరుమణ్ చాలా సన్న రేఖలుగా పెట్టుకోకూడదు.  అనువాదకుడు యొక్క గమనిక: ముందు వివరించినట్లుగా రెండు నిలువు తెల్ల రేఖల మధ్య దూరం కనీసం 2 అంగుళాలు ఉండాలి.
  • మన పూర్వాచార్యులు నిర్దేశించిన తిరుమణ్ యొక్క సరైన కొలతలు తెలియకుండా తిలకం పెట్టుకొనుట ఒక అడ్డంకి.
  • తిరుమణ్ ని నిర్దేశించిన  12 శరీర భాగాలపై పెట్టుకోవాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుడు యొక్క గమనిక: మన పూర్వాచార్యులు గ్రంథాలలో ఎప్పుడూ తిరుమణ్ కాప్పును ధరించే వివరణ వచ్చినపుడు, ఎప్పుడూ వారు ద్వాదశ ఊర్ధ్వపుండ్రాల (12 తిరుమణ్ ధారణ) గురించి నిర్దేశించారు –  కాబట్టి రోజు శ్రీవైష్ణవులు 12 ఊర్ధ్వపుండ్రాలను పెట్టుకోవాలి.
  • అలాగే, 12 తిరుమణ్లు (ప్రతి భాగానికి తగిన విధంగా ఎమ్బెరుమాన్ నామాలతో) కేశవ నామం నుండి ప్రారంభించి సరైన క్రమంలో (ముందు వివరించిన విధంగా) ధారణ చేయాలి.
  • మొత్తం 12 తిరుమణ్లు శరీరం యొక్క సరైన భాగాలపై ధరించాలి.
  • తిరుమణ్ ధరించిన తర్వాత, వేళ్ళ గోర్లతో సరిచేయ కూడదు.
  • మధ్యలో శ్రీచూర్ణం లేకుండా తిరుమణ్ని ధరించకూడదు. అనువాదకుడు యొక్క గమనిక: ఒక్క చరమ కైంకర్యం (తుది ఆచారాలు), అశౌచ కాల (బంధువుల జన్మ / మరణ  కలుషిత సమయాల్లో) సమయాల్లో మాత్రమే – తిరుమణ్ మాత్రమే ధరించబడుతుంది – అన్ని ఇతర సమయాల్లో, తిరుమణ్ తో పాటు  శ్రీచూర్ణం కూడా పెట్టుకోవాలి. తిరుమణ్ ఎమ్బెరుమాన్ (చారణ కమలాలు) మరియు శ్రీచూర్ణం తాయారుకి ప్రతీక – వారిని ఒకరి నుండి ఒకరిని వేరు చేయకూడదు – అది పెద్ద అపచారం.
  • తిరుమణ్ని చేతిలో కలిపేటప్పుడు మనం శ్రీ శైలేశ దయాపాత్రం తనియన్, ఆచార్య తనియన్లు, రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకం) మొదలైనవి స్మరించుకోవాలి. ఇతర మంత్రములను తిరుమణ్ని కలిపేటప్పుడు స్మరించరాదు.
  • తిరుమణ్ని సొంత వేళ్లతో మాత్రమే ధారణ చేయాలి. ఏ ఇతర పరికరాలను వాడకూడదు.
  • లౌకిక ధోరణి వారు వాడిన జాలంతో కలిపిన తిరుమణ్ని వాడరాదు.
  • భాగవతలచే ఉపయోగించబడిన నీటితో కలపిన తిరుమణ్ని ధరించక పోవుట ఒక అడ్డంకి – అనగా,  తిరుమణ్ని సిద్ధం చేయటానికి భాగవతులు ఉపయోగించిన నీటిని వాడాలి.
  • ఆచార్యుల కొరకై తెచ్చిన జలాన్నిమన తిరుమణ్ని కలపడానికి వాడటం ఒక అడ్డంకి.
  • సంసారుల (లౌకికంగా ఆలోచించే మనుషులు) ముందు తిరుమణ్ ధారణ చేయకూడదు.
  • సంసారుల (లౌకికంగా ఆలోచించే మనుషులు) నుండి తిరుమణ్ని తీసుకోని వాడకూడదు.
  • తిరుమణ్ శ్రీవైష్ణవుల సరైన వ్యక్తిత్వము గుర్తింపుగా భావించి ధరించాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • కేవలం శాస్త్రంలో ఆదేశించినందున తిరుమణ్ని  ధరించుట ఒక అడ్డంకి  ఉంది. అనువాదకుని గమనిక: అంతకు ముందు వివరించిన విధంగా చాలా సంతోషంగా గర్వంగా పెట్టికోవాలి. 
  • భాగవతులకు చాలా ప్రియమైనదిగా పరిగణించి తిరుమణ్ను పెట్టుకోవాలి, తీసుకోవాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • తిరుమణ్ పెట్టుకునేటప్పుడు సరిగ్గా రాలేదని మల్లిమల్లి తుడిపి పెట్టరాదు. ఒకేసారి నిదానంగా సరిగ్గా పెట్టుకోవాలి, ఎప్పుడూ తుడపకూడదు.
  • ఆచార్యులు వాడిన  తిరుమణ్, శ్రీచూర్ణముల శేషమును వాడాలి.
  • తిరుమణ్ నేరుగా ఆచార్యుల నుండి కాకపోయినా, వారిని శేష ప్రసాదంగా మార్చామని ధ్యానించి, ప్రార్థన చేయాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • ఆచార్యుల ఉపయోగం కోసం ఉంచబడిన తిరుమణ్ని మనం వాడకూడదు  మరియు మనం వాడింది ఆచార్యులకై ఉంచకూడదు. అది మహా పాపం.
  • నుదుట తిలకం లేకుండా భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల ఎదుట ఉండకూడదు. అనువాదకుడు యొక్క గమనిక: తిరునారాయణపురంలో ఒక సారి నుదుట తిలకం పెట్టుకోవడానికి తిరుమణ్ లేకపోతే, ఎమ్బెరుమానార్ వారి ముఖాన్ని (ఒక వస్త్రంతో కప్పి) దాచిపెట్టిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఎమ్బెరుమాన్ తిరుమణ్  ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రదేశాన్నిఅతనికి చూపించగా, ఎమ్బెరుమానార్ సంతోషంగా అక్కడికి వెళ్లి తిరుమణ్ను సేకరించి వెంటనే ధరిస్తారు. 
తరువాత తుళసి / తామర కొమ్మల మాల (దండలు) మొదలైన వాటి ధారణ గురించి ఇక్కడ వివరణాత్మకంగా చర్చించబడింది.
  • విడి విడిగా తుళసి / తామర కొమ్మల (కాండం) మాలను  ధరించుట ఒక అడ్డంకి. తుళసి మరియు తామర కాండం పూర్తిగా ఎండబెట్టినప్పుడు, చిన్న పూసలుగా తయారు చేసి దండలు చేయడానికి ఉపయోగిస్తారు. వాటిని ఎప్పుడూ కలిపి ధరిస్తారు, విడిగా ధరించరాదు (అంటే ఒకటి లేదా మరొకటి). అనువాదకుడు యొక్క గమనిక: “యే కణ్ట లగ్న తుళసి  నలినాక్ష మాలా; యే బాహు మూల పరిచిన్నిత సంఖ చక్రా; యె వా లలాట ఫలకే లసద్ ఊర్ధ్వ పుండ్రా; తే వైష్ణవా  భువనం ఆసు పవిత్రయంతి” – తుళసి / తామర కాండపు దండలను ధరించే వారు, వారి భుజాలపై శంకచక్రాల చిహ్నములను ధరించిన వారు, నుదుట ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్న శ్రీవైష్ణవుల సమక్షంలో ఆ ప్రదేశం పరిశుద్ధమవుతుంది. తరచుగా ఒకటి లేదా ఇతర మాలను (తుళసి / తామర కొమ్మల (కాండం) మాలను) ధరించిన వ్యక్తులను చూస్తుంటాము.  ఇక్కడ వాటిని ఎల్లప్పుడూ కలిసి ధరిస్తారని చెప్పబడింది. శ్రీవైష్ణవులు ఎమ్బెరుమాన్ / ఆళ్వారులు / ఆచార్యులు ధరించిన పవిత్రమాలలను కూడా ధరిస్తారు.
  • నాభి వరకు ధరించక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  నాభి వరకు వేలాడేటట్టుగా ధరించాలి. ఇతర సాంప్రదాయాలలో, మెడ చుట్టూ బిగించి ధరిస్తారు. కానీ మన పూర్వాచార్యులు నాభి వరకు ధరించారు – ఇది ఇప్పటికీ వివిధ ఆలయాలలో పవిత్ర మాలలను ధరించే విధానాన్ని గమనించవచ్చు, వారు నాభి వరకు పొడుగ్గా ధరిస్తారు.
  • చుట్టిన మొలతాడు  ధరించుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: వైధీకులకు మొలతాడు చాలా తప్పనిసరి అయిన అంశం. అది లేకుండా ఎప్పుడూ ఉండకూడదు (తరువాత క్రింద వివరణ ఇవ్వబడింది). ఇక్కడ చుట్టబడిన మొలతాడును మాత్రం ధరించకూడదు అని చెప్పబడింది.
  • మొలతాడు లేకుండా ఉండటం అడ్డంకి. అరై నాణ్ కయిఱుగా అని తమిళంలో పిలుస్తారు – ఇది ఎప్పుడూ ధరించాల్సిన అవసరం ఉంది.
  • అంతరీయం(పంచ), ఉత్తరీయం(అంగవస్త్రం, పంచ పైన చుట్టుకునేది), కౌపీనం ధరించక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:ఎప్పుడూ అంతరీయం మరియు ఉత్తరీయంతో ఉండాలి. కొన్ని సందర్భాలలో  కర్మకండలు, తార్పనం చేస్తున్నప్పుడు మాత్రమే అంతరీయం ఒక్కటే ధరించాలి – అటువంటి పరిస్థితులలో ఉత్తరీయం ధరించరాదు. మిగిలిన అన్ని సమయాల్లో రెండు వస్త్రాలు ధరించాలి. ఈ మధ్య కాలంలో , అన్నీ తెలిసిన పండితులు కూడా ఒక పంచ వేసుకొని వెళుతున్నారు – అలా ఎప్పటికీ చేయకూడదు –  ఎల్లప్పుడూ అంతరీయంతో పాటు ఉత్తరీయం కూడా వేసుకొని ఉండాలి. కౌపీనం అనేది నడుము వస్త్రం – ఇది  కుట్టుపని లేని సహజమైన అంగ వస్త్రం. వైదీకులు కుట్టిన వస్త్రాలను ధరించకూడదు – కైంకర్య సమయంలో కేవలం నేసిన వస్త్రాలను మాత్రమే ధరిస్తారు.
  • నలుపు కంబళి/దుప్పటిని ఉపయోగించుట ఒక అడ్డంకి, వాడకూడదు.
  • చిరిగిన బట్టలు లేదా మాసిన బట్టలు ధరించుట ఒక అడ్డంకి.
  • పంచ కట్టుకునేటప్పుడు, పంచ చివరి భాగాలు క్రింది వేలాడేటట్టుగా ధరించరాదు.
  • అంచు లేని వస్త్రాలు (పంచ, చిర మొదలైనవి) ధరించుట ఒక అడ్డంకి.
  • పంచ క్రిందకు జారకుండా దారం/తాడును ధరించక పోవుట ఒక అడ్డంకి.
  • తలని క్షవరం (షేవ్) చేయకుండా శరీరాన్ని క్షవరం చేయుట ఒక అడ్డంకి. అనువాదకుని యొక్క గమనిక: బ్రహ్మచారులకు మరియు సన్యాసులకు, కేవలం తల/ముఖ క్షవరం మాత్రమే అనుమతించబడుతుంది (శరీరం యొక్క ఏ ఇతర భాగాల క్షవర అనుమతి లేదు). గృహస్తులు సర్వాంగ క్షవరం (శరీరంలోని అన్ని భాగాలను తల నుండి కాలి వరకు, వీపుపై భాగం మినహాయించి) ప్రతిసారి  చేయాలి – కేవలం ముఖ క్షవరం / జుట్టు కత్తిరించుకోవడం అనుమతించబడలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తల క్షవరం చేసినపుడు, మొత్తం జుట్టు తీసివేయకూడదు – కొంత శిఖ ఉంచాలి. ఈ రోజుల్లో పూర్తి క్షవరం చేస్తున్నారు, మన పెద్దలు ఈ విషయాన్ని అధీకృతం చేయ లేదు – సాధారణంగా, తల పూర్తి క్షవరం అవైధికంగా భావిస్తారు. ఆళ్వార్ల ఎన్నో పాసురాలలో పూర్తిగా క్షవరించన తలను అవైధిక సంప్రదాయములకు సంబంధించారు.
  • మీసం పెంచుకోనుట/కత్తిరించుకోనుట ఒక అడ్డంకి. అనువాదకుని  గమనిక: మన పెద్దలు ఎన్నడూ మీసము మాత్రమే ఉంచుకోలేదు – పూర్తిగా కత్తిరించుకునే వారు (వారి వర్ణాశ్రమం ప్రకారం) లేదా మీసంతో పాటు గడ్డం రెండు ఉంచుకునేవారు (కత్తిరించుకోకుండా). ఉదాహరణకు, దీక్షా  (భార్య గర్భవతి అయితే, తల్లిదండ్రులు పరమపదమైన మొదటి సంవత్సరం, etc) సమయంలో క్షవరం అనుమతిలేదు. కానీ ఒక్క మీసాలను ఉంచుతూ, దాన్ని కత్తిరించడం అనుమతిలేదు.
  • పొడుగ్గా గోర్లును పెంచుకొనుట ఒక అడ్డంకి.  సరిగ్గా కట్టిరించుకోవాలి.

అనువాదకుని గమనిక: పైన పేర్కొన్న కొన్ని అంశాలు వింతగా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇవన్నిటికీ కొన్ని వాస్తవిక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కైంకర్య సమయంలో గోర్లు పొడుగ్గా ఉంటే అవి వారికి మరియు ఇతరులకు కూడా హాని కలిగించవచ్చు.

తరువాతి చర్చ, సువాసనలు మొదలైనవి ధరించుట గురించి – ఎక్కువగా లౌకిక అనుభవాలకు ఆనందాలకు సంబంధించిన అంశాలు. సందేహం లేకుండా శ్రీవైష్ణవులు ఈ వాడకానికి దూరంగా ఉండాలని అర్ధం చేసుకోవాలి.

  • ముఖానికి అలంకరణ (మేకప్) మొదలైనవి శారీరిక అందంకోసం వేసుకొనుట.
  • ఎక్కువ గంధం (చందనం) మొదలైనవి  పెట్టుకొనుట. ఇక్కడ మితిమీరిన ప్రవ్రుత్తిపైన మన దృష్టి – వర్ణాశ్రమ ధర్మం ప్రకారం గృహస్తులు ఆలయాల్లో పెరుమాళ్ళ ప్రసాదంగా కొంచం గంధం పంచి నపుడు స్వీకరించ వచ్చు.
  • ఎమ్బెరుమానుకి అర్పించని చందనాన్ని ఉపయోగించడం మొదట అడ్డంకి. అనువాదకుని  గమనిక: భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు, మనం ఏమి తిన్నా, చేసిన మొదట ఎమ్బెరుమానుకి అర్పించిన తరువాత మాత్రమే మనం తీసుకోవాలి అని. పెరియాళ్వార్ తిరుప్పల్లాండులో  “ఉడుత్తు కళై౦తానిన్ పీతకవాడై ఉడుత్తు..” …) – మనం ఎమ్బెరుమానునికి అర్పించిన వస్త్రాలు / పంచ మాత్రమే ధరించాలి. ఇదే సూత్రం మనం వాడే, తినే అన్నింటినీ వర్తిస్తుంది – అన్ని పదార్థాలు మొదట ఎమ్బెరుమాన్ ఆరగించి / అనుగ్రహించిన తరువాతనే మనం వాటిని వినియోగించాలి / వాడాలి.
  • నంపెరుమాళ్ యొక్క అవశేషములైన  పరిమళం (పుష్పాలు) మరియు చందనాన్ని ప్రత్యేకంగా అడిగి  తీసుకోనుట.  అనువాదకుని గమనిక: భగవత్ ప్రసాదమైనా, భోగ్య బుద్ధితో (స్వార్థంతో) అతిగా  తీసుకోకూడదు. ఎంత అవసరమొ అంత మితంగా తీసుకోవాలి. 
  • శరీర సౌందర్యానికి ఎక్కువ గంధం (చందనం) వాడట. అనువాదకుని  గమనిక: ఒక వ్యక్తి తనను తాను ఆధ్యాత్మిక చింతనలో ఉంచి శారీరక కోరికలు మరియు అనుభవములకు దూరంగా ఉండాలి. ప్రపన్నులుగా మారిన తరువాత, శరీర అనుబంధాన్ని పెంచే చర్యలలో పాల్గొనడం అర్థరహితము. అందుకు  బదులుగా, వ్యక్తి యొక్క నిజమైన స్వభావంమైన భగవాన్ మరియు భాగవతుల సేవపై దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేయాలి.
  • ఎమ్బెరుమాన్కి సమర్పించని వక్క మరియు తమలపాకులను గ్రహించి ఆనందించుట. అనువాదకుని  గమనిక: కాని, ప్రసాద రూపంగా పంచినపుడు కొంచం తీసుకోవచ్చు.  ఆకూ వక్కలు కూడా గృహస్తులు మాత్రమే తినవచ్చు. చందనంగా కాకుండా, వీటిని బ్రహ్మచారులు మరియు సన్యాసులు స్వీకరించి ఇతరులకు ఇవ్వ వచ్చు/పంచవచ్చు. కానీ చందనాన్ని మాత్రం బ్రహ్మచారులు, సన్యాసులు స్వీకరించరాదు.
  • చెవులకు వేర్వేరు మరియు బరువైన చెవిరింగులు, పెద్ద పెద్ద పతకాలు ధరించుట. బరువైన దుద్దులతో చెవి రంధ్రాలు సాగిపోయే సంభావన ఉంటుంది. అలాంటి భారీ చెవిరింగులను ధరించుట మానుకోవడం మంచిది.
  • తుళసిని చెవిపైన పెట్టుకొనుట. కొన్ని సమయాల్లో తుళసిని కొంతమంది చెవిలో పెట్టుకొంటారు. అలా చేయకూడదు.

చివరిగా, ఇంకొన్ని అంశాలు ఇక్కడ వివరించ బడ్డాయి. 

  • శుక్రవారం రోజు పళ్ళు తోముకొనుట.  ఈ విషయం వెనక ఉన్న కారణంపై ఎక్కువ స్పష్టత లేదు.
  • కొన్ని రకాల నల్ల సిరా / రంగులు ఇతరులను సమ్మోహించి, నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా దేవతాంతరులను పూజించడం ద్వారా పొందబడతాయి. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి.
  • రక్షణ కోసం మెడలో, చేతిలో, కాళ్ళకు తాయత్తులు  ధరించుట. మన రక్షణ తిరుమణ్ కాప్పు (ఊర్ధ్వ పుండ్రం) మరియు భుజాల మీద శంఖ చక్రాలే మన  రక్షణ. అనువాదకుని  గమనిక: శ్రీవైష్ణవులు కుడా తరచూ రక్షణ కోసం ఎరుపు, నల్ల రంగు దారాలు కట్టుకుంటుంటారు. ఎమ్బెరుమాన్ మాత్రమే మన రక్షణ. అలాంటి దారాలు కట్టుకోకూడదు.  శ్రీవైష్ణవులు కేవలం తామర, తుళసి మరియు పవిత్ర మాలలు ధరించవచ్చు – ఇంకేవీ కాదు.
  • వేళ్ళల్లో వెండి ఉంగరాలు ధరించుట.
  • ఆయుధాల సంపర్కములో ఉండుట. మనము ఎమ్బెరుమాన్ ఆయుధాలపైన మాత్రమే ఆధారపడాలి.
  • భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల ముందు పురుషులు వారి శరీరంపై ఆంగ వస్త్రంతో కప్పుకోకూడదు.  అనువాదకుని  గమనిక: ధాస వర్గం (పనిచేసే వారి వర్గం) అంటే నడుము మీద ఆంగ వాస్త్రం కలిగి ఉండటం – అంటే శ్రీవైష్ణవులు ఎప్పుడూ వారి శరీరం మీద అంగ వస్త్రం ఉంచరాదు. కొన్ని దేశాచారాల (నిర్దిష్టమైన ప్రదేశాలకు ప్రత్యేక నియమాలు) ప్రకారం – శీతల ప్రదేశాలలో మనుషులు వారి శరీరాన్ని వస్త్రాలతో, శాలువలతో మొదలైన వాటిలో కప్పు కుంటారు. 
  • లౌకిక ప్రేరణతో సంభాషించుట మరియు అహంకారంతో ఉండుట.
  • కళ్ళల్లో కనికరం/జాలి లేకుండా ఉండుట ఒక అడ్డంకి. మన కళ్ళు ఎప్పుడూ శాంతిని మరియు దయను వెదజల్లుతూ ఉండాలి – ఆగ్రహం, కోపం కాదు. అనువాదకుని  గమనిక: శ్రీవైష్ణవులు సహజంగానే దయ, జాలి కలిగిఉంటారు. కాబట్టి, వారి కళ్ళు సహజంగానే ఆ గుణాలను బహిర్గతం చేస్తాయి. 
  • దివ్య ప్రబంధం (వ్యాఖ్యానములు, స్తోత్రములు, రహస్య గ్రంథాలు, మొదలైనవి) సరిహద్దుల బయట విషయాల గురించి చర్చించుట ఒక అడ్డంకి. అనువాదకుని  గమనిక: మనం ఏమి మాట్లాడినా / చర్చించినా అవి కేవలం పూర్వాచార్యుల శ్రీసుక్తులపై మీద ఆధారపడి ఉండాలి.
  • గట్టిగా మాట్లాడుట ఒక అడ్డంకి. శ్రీరాముని కీర్తించేటపుడు, “మృతు పూర్వంచ భాషతే” (నెమ్మదిగా మాట్లాడుట) – నెమ్మదిగా మాట్లాడటం చాలా మంచిది. 
  • ముచ్చట్లు, వ్యర్థ సంభాషణలు అడ్డంకులు.
  • గట్టిగా నవ్వుట.
  • అంజలితో ఉండకపోవుట ఒక అడ్డంకి. కైంకర్యంలో లేని సమయంలో మన చేతులను అంజలి (నమస్కారం) ముద్రలో ఉంచుకోవాలి.
  • చేతిలో భిక్ష పాత్ర పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. అనువాదకుని  గమనిక: ఆహార ధాన్యాలు కోసం భిక్షాటన చేయుట బ్రాహ్మణ ధర్మం యొక్క భాగం. మన సంప్రదాయంలోని అనేక గొప్ప పండితులు కూరత్తాళ్వార్, వేదాంతాచార్యులు తదితరులు ఉంజ వృత్తి (ఆహార ధాన్యాలు కోసం యాచించడం) చేశారు. 
  • అహంకారముతో ఎత్తైన ఛాతి కలిగిఉండుట – మన ప్రవర్తనలో వినయం ఉండాలి. తలకెక్కిన అహంకారము యొక్క అంశంలో వివరించబడిన దానిలాగానే.
  • కంగారుగా నడుచుట ఒక అడ్డంకి.  నెమ్మదిగా శాంతంగా నడవాలి.
  • పంచను పైకి మడిచి ధరించుట. ఇది అగౌరవప్రదంగా పరిగణించబడుతుంది.
  • భగవాన్ గురించి మనం శ్రవణం చేసినపుడు మరియు భాగవతులను చూసినపుడు సహజమైన అనురాగముతో గొప్ప భావోద్వేగాలను అనుభవించాలి మరియు మన రోమాలు నిక్కపొడుచుకోవాలి. అలాంటి భావం కలుగక పోవుట ఒక ఆటంకం. అనువాదకుని  గమనిక: ఎమ్బెరుమాన్ స్వయంగా వారే తన భక్తుల గురించి వివరించినపుడు ఎనిమిది లక్షణాలను వివరిస్తారు, వాటిలో ఒకటి వారి గురించి శ్రవణం చేసినపుడు  దివ్య అనుభూతులను అనుభవించడం.  భగవాన్ అన్నారు,  “నా భక్తాలు ముఖ్యంగా ఈ ఎనిమిది లక్షణాలు కలిగి ఉంటారు –   1)ఎమ్బెరుమాన్ యొక్క భక్తుల పట్ల నియమ నిరతలేని ప్రేమ,  2) ఎమ్బెరుమాన్ ఆరాధనలో ఆనందాన్ని అనుభవించుట  3) స్వయంగా ఆమెయే/ఆయనే ఎమ్బెరుమాన్ని ఆరాధించుట, 4) ఏ గర్వం లేకుండా ఉండుట, 5) ఎమ్బెరుమాన్ గురించి శ్రవణం / ఆలోచన / చర్చలో ఆసక్తి  చూపుట 6) శారీర స్పందన (రోమాలు నిక్కపొడుచుట) వంటివి (7) ఎల్లప్పుడూ ఎమ్బెరుమాన్ గురించి ఆలోచించుట 8) ఎమ్బెరుమాన్ ఆరాధనకై ప్రతిఫలంగా తిరిగి ఏ ప్రయోజనాలను ఆశించకపోవుట. అటువంటి భక్తులు మ్లేఛ్ఛులు అయినప్పటికీ, వారు బ్రాహ్మణొత్తములచే, కైన్కర్యార్థూలచే మరియు సన్యాసులచే మరియు పండితులచే ఆరాధ్యనీయులు. అటువంటి వారు విద్వాంసుల నుండి జ్ఞానం పొందేందుకు  అర్హులు, ఆ జ్ఞానం పంచిపెట్టేందుకు అర్హులు. అదేవిధంగా, ఒక శ్రీవైష్ణవుడిని చూసినప్పుడు, చంద్రుని (చంద్రునికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు) చూసిన అనుభూతి చెందాలి, చల్లని గాలిలా (చాలా హాయిగా ఉంటుంది), మంచి చందనాన్ని పెట్టుకున్న అనుభూతిని అనుభవించాలి.
  • భగవాన్ మరియు భాగవతులకు దూరమైనపుడు బాధ పడక పోవుట. నమ్మాళ్వార్ వారి విరహ వేదనను తిరువాయ్మొళి 8.2.1 “న౦గళ్ వరివళై” పదిగంలో పంచుకున్నారు . అనువాదకుని  గమనిక: మనము ఆళవందార్ మరియు వారి శిష్యులైన ధైవవారి ఆండాన్ యొక్క సంఘటనను గుర్తుకు తెచ్చుకోవచ్చు – ఆళవందారులు తిరువనంతపురం వెళ్లినప్పుడు, ఆండాన్ చాలా అనారోగ్యం చెందుతారు, మళ్లీ ఆళవందార్లను చూసిన తరువాత మాత్రమే తిరిగి కోలుకుంటారు.
  • ఒకరి జ్ఞానం, భక్తి, వైరాగ్యం వారి రూపంలో స్పష్టంగా వ్యక్తం కావాలి. ఆ వ్యక్తిని చూడగానే సులభంగా అర్థం కావాలి. అలా ఉండక పోవుట ఒక అడ్డంకి.  అనువాదకుని  గమనిక: కూరత్తాళ్వార్ యొక్కచరిత్ర కథనంలో, ఆళ్వార్ని చూసిన వారు ఎవరైనా పరిశుద్దులవుతారని చెప్తారు – అలాంటివి వారి లక్షణాలు, వారి భౌతిక రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి.
  • వైష్ణవత్వం సహజంగా ఒకరి రూపంలో వ్యక్తం కాక పోవుట ఒక అడ్డంకిగా చెప్పవచ్చు. మునుపు వివరణ మాదిరిగానే.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/02/virodhi-pariharangal-11/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment