శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
41. అనుష్ఠాన విరోధి – రోజువారి పనులలో అడ్డంకులు
అనువాదకుని గమనిక: అసలు అవరోధాలు / అడ్డంకుల అంశంలోకి ప్రవేశించే ముందు ఈ విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ఈ అంశంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్న సందేహాలు, అపార్థములు చాలా ఉన్నాయి.
- మన అనుష్ఠాన ప్రక్రియలో అనేక అంశాలు ఉన్నాయి. మన సాంప్రదాయ ప్రధాన సూత్రాల ప్రకారం మన నడవడి ఎలా ఉండాలో ఇక్కడ చర్చించబడింది.
- అంటే, కర్మము మరియు కైంకర్యం మధ్య ఆంతర్యాన్ని అర్ధం చేసుకొనుట. కర్మము సామాన్య (వర్ణాశ్రమం – శరీర ధర్మం) ధర్మం అయినప్పటికీ, అనుసరించాల్సిన అవసరం చాలా ఉంది, కైంకర్యం విశేష (స్వరూప – ఆత్మ కోసం) ధర్మం, సామాన్య ధర్మం కంటే చాలా ముఖ్యమైన ధర్మం.
- కర్మము 3 రకాలు
- నిత్య కర్మ – సంధ్యావందనం వంటి దినచర్యలు మొదలైనవి
- నైమిత్తిక కర్మ – తర్పణం మొదలైనవి వంటి చర్యలు
- కామ్య కర్మ – ప్రాపంచిక / భౌతిక ప్రయోజనాల కోసం చేసే చర్యలు
- కైంకర్యం కూడా 3 రకాలు
- భగవత కైంకర్యం – భగవానునికి చేసే సేవ (నిత్య మరియు నైమిత్తిక కర్మములు భగవత కైంకర్యంలోని భాగములే, ఎందుకంటే ఈ కర్మములు భగవానుడు స్వయంగా అందరికి ఆదేశించిన కాబట్టి)
- భాగవత కైంకర్యం – భాగవతులకు చేసే సేవ
- ఆచార్య కైంకర్యం – ఆచార్యులకు చేసే సేవ
- మనము అర్థం చేసుకొని అనుసరించాల్సిన ఈ సూత్రం చాలా ముఖ్యమైనది. వర్ణాశ్రమ ధర్మాన్ని ఎన్నటికీ విడువలేము. ముమ్ముక్షుప్పడి సూత్రం 270 మరియు 271 లో ఈ అంశాన్ని అద్భుతంగా వివరించారు – 270 అవతారిక లో మణవాళ మాముణులు అన్నారు “కర్మ, జ్ఞాన, భక్తి యోగము యొక్క స్వరూప త్యాగం ఖచ్చితంగా లేదు” (అంటే అది ఉపాయ బుద్ధి త్యాగము మాత్రమే – అనగా, కర్మ చేయుటయే కానీ అది భగవానుని సాధించటానికి ఉపాయంగా/ మధ్యమంగా పరిగణించరాదు, అది కైంకర్యముగా పరిగణించవచ్చు) – మనము ఏదో ఫలమును ఆశించి ఉపాయ స్వరూపంగా ఎదో చేసి భగవానుని మెప్పించము. అన్ని నిత్య (రోజువారీ – సంధ్యావందనం మొదలైనవి) మరియు నైమిత్తిక (తర్పణం మొదలైనవి) కర్మములు కైంకర్యం లాగా చేయాలి. ఇది తరువాతి సుత్రం “కర్మం కైంకర్యత్తిలే పుగుమ్ …” (కర్మం కైంకర్యలోకి వస్తుంది) – ఇది అందంగా పిళ్ళై లోకాచార్యులు మరియు మణవాళ మాముణులు తప్పా ఇంకెవరు వివరించగలరు!
- కానీ అలాంటి సామాన్య కైంకర్యం అప్రథామంగా ఎప్పుడూ మారుతుంది? మణవాళ మాముణులు దీనిని అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన ఆచార్య హృదయం వ్యాఖ్యానిస్తూ చూర్ణిక 31లో – “అత్తాణి చేవగత్తిల్ పొదువానథు నళువుం” అని వివరించారు. మణవాళ మాముణులు వ్యాఖ్యానంలో వివరిస్తూ భగవత్ / భాగవత కైంకర్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు, సామాన్య కైంకర్యము యొక్క ప్రాధాన్యం తగ్గి ఆ కర్మలను వాయుదా / దాటివేయవచ్చు.
- సామాన్యముగా ఈ రోజుల్లో, అనేక శ్రీవైష్ణవులు ప్రాథమిక అనుష్ఠానాలను “ఇది శ్రీవైష్ణవులకు అవసరం లేదు” అని చెప్పి నిర్వహించుట లేదు.
- కానీ మన పూర్వాచార్యులు సామాన్య కైంకర్యములు (కర్మానుష్టానం) నిర్వహించాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు మరియు వారు క్రమం తప్పకుండా ఆ కర్మలను నిర్వహించారు – ఎందుకంటే వారు ఖచ్చితంగా శాస్త్రానికి కట్టుబడి ఉండేవారు కాబట్టి. భగవత్ కైంకర్య విషయం వచ్చినపుడు మాత్రమే, తాత్కాలికంగా సామాన్య కైంకర్యం వాయుదా / దాటి వేశారు .
- 6000 పడి గురు పరంపరా ప్రభావంలో, మనం దేవతాంతర ఆరాధన చేయనపుడు నిత్య / నైమిత్తిక కర్మలను ఎందుకు నిర్వహించాలని నంపిళ్ళై ప్రశ్నించబడ్డారు. నంపిళ్ళై గారు నిత్య / నైమిత్తిక కర్మలు వైదిక అనుష్టానాలు (వేదంలో భాగం), మనము నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టంగా వివరిస్తారు.
- పెరియ వాచ్చాన్ పిళ్ళై పరంత రహస్యం చరమ శ్లోక ప్రకరణంలో వివరిస్తూ “నమ్మాచార్యర్గళ్ ఇవఱ్రై అనుష్టిప్పారుం అనుష్టియాథారుమాయ్పోరుగిఱతు” – మన ఆచార్యులు కొందరు వర్ణాశ్రమ విధులను నిర్వర్తించాలని సూచించారు (కైంకర్యంతో సంఘర్షణ లేనప్పుడు) ఇతరులు వర్ణాశ్రమ విధులను దాటవేయవచ్చు అని చూపారు (కైంకర్యం విరుద్ధంగా ఉన్నప్పుడు). ఈ సూత్రాన్ని ఈ క్రింది సూత్రాల నుండి అర్ధం చేసుకోవచ్చు: ఎమ్బెరుమానార్ సంద్యావందనం నిర్వహించేవారు మరియు 120 సంవత్సరాల వయస్సులో కూడా అర్ఘ్యం నిలబడి (శాస్త్ర ఆదేశం ప్రకారం) ఇచ్చేవారు. భట్టార్ నంబెరుమాళ్ళకి వింజామర కైంకర్యాన్ని చేస్తూ తమ సంద్యావందన విధిని దాటేసేవారు. కాబట్టి, సామాన్య కైంకర్యం నిర్వహించాలా లేదా అన్నది మనము భాగావత / భగవత్ కైంకర్యంలో నిమగ్నమై ఉన్నామా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. (నేను సామాన్య ధర్మము చేయాలనుకుంటున్నాను/చేయకూడదు అనుకుంటున్నాను అన్న దానిపైన కాదు).
- ఈ సిద్ధాంతాన్ని పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణం దివ్య శాస్త్రంలో సూత్రం 276 నుండి 278 వరకు వివరించారు. దీనిని మరింత అందంగా మణవాళ మాముణులు వివరించారు.
- సూత్రం 276 – కైంకర్యము రెండు రకాలు.
- సూత్రం 277 – మనము తగిన విధులను నిర్వహించుట మరియు తగని విధులను నిర్వహించక పోవుట రెండు రకాలుగా ఉంటాయి.
- సూత్రం 278 – నిర్వహించాల్సిన మరియు నిర్వహించకూడని విధులు, వర్ణాశ్రమము మరియు వారి ఆత్మ స్వరూపముపై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న సుత్రంపై, మణవాళ మాముణులు వివిధ అంశాలను విశ్లేషించి సుదీర్ఘ సమగ్ర వ్యాఖ్యానం వ్రాశారు. వేర్వేరు కోణాల నుండి సూత్రాన్ని వివరిస్తూ, చివరకు ” వర్ణాశ్రమ ధర్మాన్ని త్యజించుట అవసరమని భావించి నట్లయితే, అది నేరుగా భగవాన్ (మరియు పిరాట్టి) కోరికకు విరుద్ధమవుతుంది. అందువల్ల అది సమంజసం కాదు. ఇతరుల పట్ల కరుణాభావంతో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నము అన్నట్టుగా పరిగణించాలి. (అలా చేయుట వలన అందారూ సమిష్టిగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి లాభం పొందుతారు మరియు శ్రీవైష్ణవులు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించుట వలన ప్రతి ఒక్కరిని పురోగతిని అందజేసి మేలు చేకూరుస్తారు).
- చివరిగా, మన పూర్వాచార్యులు పూర్తిగా శస్త్ర ఆదేశాలను అనుసరిస్తూ, నిత్య (రోజువారీ) మరియు నైమిత్తిక (కాలానుగుణంగా) కర్మలను నిర్వహించారు, వారు ఎప్పుడూ కామ్య కర్మలను (లౌకిక ప్రయోజనాలు) చేయలేదు. నిత్య మరియు నైమిత్తిక కర్మలు తప్పనిసరి – వాటిని అనుసరించక పోవుట శాస్త్ర విరుద్ధం. కానీ కామ్య కర్మలు ఐచ్ఛికమైనవి – లౌకికమైన సంపదను ఆశించేవారు కామ్యమైన చర్యలలో పాల్గొంటారు.
- అందువల్ల మనం మన పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించి, వారు చూపించిన సూత్రాలను పాటించాలి.
ఈ విషయంలో వచ్చే అడ్డంకులను ఇప్పుడు చూద్దాం.
- ఆచార్య కైంకర్యం, భగవత్ కైంకర్యం మరియు భాగవత కైంకర్యం పరిధిలోకి రాని పనులను చేయుట. ఈ మూడిట్లో మనము సహజ స్వరూపంగా పాల్గొనాలి. ఈ మూడు కైంకర్యాల యొక్క సరిహద్దుల లోకి రాని క్రియలన్నీ అడ్డంకులు.
- ఇంతకు ముందు పేర్కొన్న 3 కైంకర్యంలో భగవత్ కైంకర్యం మాత్రమే సహజమని, ఆచార్య (భాగవత) కైంకర్యం అదనమైనడని అనుకోకూడదు. భగవత్ కైంకర్యం నిరుపాధికం (సహజమైన- స్పష్టమైన కారణం ఆధారంగా కాదు) మాదిరిగానే, ఆచార్య కైంకర్యం కూడా సహజమైనది. ప్రణవంలో వివరించినట్లుగా జీవాత్మ సహజంగా భగవానుని దాసుడు. ఆచార్యులు/ భాగవతులు ఎమ్బెరుమానునికి చాలా ప్రియమైన వారు, వారికి కైంకర్యం చేయుట కూడా జీవాత్మకు సహజమైనదే. అనువాదకుని గమనిక: పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వారు స్వయంగా ఎమ్బెరుమానుకి తిరుమంత్రం (అష్టాక్షరి) యొక్క సారాంశం వివరించారు, “తిరువెట్టెళుత్తుం కఱ్ఱుణాన్ ఉఱ్ఱతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే ” – తిరుక్కణ్ణపురం ప్రియమైన భగవాన్! తిరుమంత్రం యొక్క సారాంశాన్ని తెలుసుకున్న తరువాత నేను మీ భక్తులకు దాసుడనని. దీని నుండి సులభంగా అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, ఆచార్యులు మరియు భాగవతులకు దాసులుగా ఉండుట అన్న సూత్రం భగవాన్ కన్నా ముఖ్యమైనది.
- అనృసంస్యం – కారుణ్య౦. లోక సంగ్రహం – లోక సంక్షేమం (శాస్త్రాన్ని అనుసరించడం ద్వారా). శ్రీవైష్ణవులు సామాన్య కైంకర్యములు (సాధారణ వర్ణాశ్రమ ధర్మము) అనృసంస్యార్థ౦ (సాటి ప్రజల పట్ల గొప్ప కారుణ్య౦తో) వల్ల కాని లోక సంగ్రహార్థ౦ (ప్రపంచ సంక్షేమం కోసం శాస్త్ర సూత్రాలను నిర్వహించడానికి) కాదు. భగవద్గీత 3.22 శ్రీకృష్ణుడు అన్నారు, నాకు ఏ విధమైన విధులు సూచించబడి లేవు, అయినప్పటికీ వారు తన వివిధ అవతారాల సమయాల్లో శాస్త్రానికి కట్టుబడి ఉన్న చర్యలలో పాల్గొంటారు. అనువాదకుని గమనిక: మునుపటి శ్లోకం 3.21 లో, సమాజంలో గొప్ప పురుషులు చేసే చర్యలను సామాన్య పురుషులు కూడా వాటినే అనుసరిస్తారని భగవాన్ అన్నారు. కాబట్టి, గొప్ప కరుణాభావంతో సామాన్య కైంకర్యంలో (వర్ణా శ్రమ ధర్మం) మన పూర్వాచార్యులు నిమగ్నమై ఉండేవారు. అనృసంస్యం మరియు లోక సంగ్రహం మధ్య సూక్ష్మ వ్యత్యాసం, మన ఉద్దేశ్యము మరియు వైఖరిలో ఉంది. కరుణాభావంతో చేయుట (అది భగవత్ ప్రీతి మరియు ఆజ్ఞ కొరకై, వర్ణాశ్రమము లౌకిక ప్రపంచ అవసరానికి తప్పనిసరి అని, నాయకులు వాటిని అనుసరిస్తే క్రమేణా అందరూ అనుసరించి ఆధ్యాత్మిక పురోగతిని చెందుతారు), ఆదర్శంప్రాయం కావాలని చేయుట (ఇతరుల అనుసరించి అభివృద్ధి చెందడానికి నేను సంపూర్ణంగా అనుసరిస్తున్నానని, చిన్న రవ్వంత అహంకారంతో).
- కొన్ని సందర్భాలలో కరుణాభావంతో చేసిన పని జీవాత్మ యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది, ఆ చర్యలు కైంకర్యంగా పరిగణించబడవు. కైంకర్యంగా భావించుట అడ్డంకి అవుతుంది. అనువాదకుని గమనిక: జీవాత్మ యొక్క నిజమైన స్వభావం భగవాన్ / భాగవతులు నిరంతర సేవ చేయుట – ఆ సరిహద్దులు దాటి కేవలం కరుణాభావంతో (శాస్త్రానుసారంగా కాకుండా) చేసిన పనులను కైంకర్యంగా పరిగణించరాదు.
- ఎమ్బెరుమాన్ మన ముందు ఉన్నపుడు (ఊరేగింపులో భాగంగా లేదా వారి సన్నిధిలో), వారి సమక్షంలో వారిని నిర్లక్ష్యం చేసి సామాన్య ధర్మము (సంధ్యావందనం మొదలైన వంటివి) చేయకూడదు. ఆ ప్రవర్తన, భగవాన్ కన్నా ఇతరుల పట్ల మన భావనను సూచిస్తుంది. ఎమ్బెరుమాన్ వారి సన్నిధికి తిరిగి చేరుకున్న తరువాత మాత్రమే, మనము వారిని వదిలి, మన నిత్య చర్యకై తిరిగి వెళ్లాలి. అనువాదకుని గమనిక: ఇది పరమ సంహితం లో వివరించబడింది “యేన యేన ధాతా గచ్చతి తేన సహ గచ్చతి” – ఎక్కడెక్కడికి ఎమ్బెరుమాన్ వెళితే అక్కడక్కడికి వారి భక్తులు (ఈ విషయంలో ముక్తాత్మలు) వారిని అనుసరించాలి. ముందు చెప్పినట్లుగా ఇది భట్టార్ జీవితాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఒక సందర్భంలో వారు ఎమ్బెరుమానుకి వింజామర సేవ చేస్తుండగా వారి సంద్యావందన సమయమయ్యి౦ది, ఒక శ్రీవైష్ణవుడు భట్టారుకి ఆ విషయం జ్ఞాపకం చేస్తారు. భట్టార్ ప్రత్యుత్తరంగా “నేను ఎమ్బెరుమానుని వింజామర సేవ చేస్తుండగా , సంద్యావందనము వదిలి వేస్తే, చిత్ర గుప్తుడు (యమ ధర్మరాజు అనుచరుడు) పాపంగా పరిగణించడు” అని అంటారు. ఎమ్బెరుమాన్ ఉత్సవ ఊరేగింపుగా వెళ్ళినప్పుడు, ప్రతి ఒక్కరూ వారి రక్షింణకై తోడువెళ్ళాలి, వారి సన్నిధికి తిరిగి చేరుకునే వరకు వారికి తోడుగా ఉండాలి. కాబట్టి, మన పూర్వాచార్యుల ప్రకారం, కైంకర్యంలో నిమగ్నమై ఉన్నపుడు, మన కర్మానుష్టానములను కొంత ఆలస్యం చేయవచ్చు.
- శ్రీవైష్ణవులు భగవాన్ యొక్క దివ్య గుణాలను చర్చిస్తూ / కీర్తిస్తున్నపుడు, సంద్యావందనం మొదలైనవి చేయాలని చెప్తూ గోష్టిని మధ్యలో వదిలివేయలేరు. ఇతరుల ఉద్ధరణ కొరకై కరుణభావంతో చేస్తున్నప్పటికీ, ఆ చర్య భగవత్ / భాగావత అనుభవం కంటే ఎక్కువ కాదు.
- ప్రపన్నులకు భగవాన్ మాత్రమే ఉపాయం. కాబట్టి, అనేక కార్యాలు చేసేటప్పుడు, వాటిని ఉపాయంగా పరిగణలోకి తీసుకోకూడదు, అయితే వాటిని కైంకర్యంగా చేయాలి . ఫలమాశించకుండా చేయాలి మరియు ఈ క్రింది అంశాలలో జీవాత్మ సహజంగా పాల్గొనాలి. ఆ అంశాలు:
- ఊర్ధ్వ పుండ్రము పెట్టుకొనుట (తిరుమణ్/శ్రీచూర్ణం)
- తీర్థం, ప్రసాదం మొదలైనవి స్వీకరించుట
- ఎమ్బెరుమానుని చరణ కమలాలకు తిరుమంజనం చేయుట (తిరువారాధనంలోని భాగము)
- దివ్యప్రబంధ పాసురాలను చదువుట
- దీపాలు వెలిగించుట (గుడిలో, ఇంట్లో పెరుమాళ్ సన్నిధిలో మొదలైన)
- పూల దండలు, మాలలు చేసి ఎమ్బెరుమానునికి అర్పించుట
- భగవత్ కైంకర్యముకై పూల తోటను పెంచుట
- శ్రీవైష్ణవులకు సేవ చేయుట
- దివ్యప్రబంధము, రహస్య గ్రంథాలను నేర్చుకొని ఇతరులకు నేర్పించుట.
- మన పూర్వాచార్యులు అనుసరించని చర్యలలో పాల్గొనుట. ఆండాళ్ నాచియార్ తిరుప్పావై 2వ పాసురంలో “చెయ్యాతన చెయ్యోం” అని అన్నారు.
- కైంకర్యం ఎమ్బెరుమాన్ ఆనందం కోసం సహజంగా చేయాలి, ఇతర ఏ ప్రత్యేక ప్రయోజనం కోసం చేయరాదు.
- భగవంతుని ఆనందం కోసం కైంకర్యం చేయాలి కాని మన సొంత ఆనందం కోసం కాదు. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 2.9.4 లో అన్నారు “తనక్కేయాగ ఎనై క్కొళ్ళుం ఈధే” – మీ ప్రీతి కొరకై మీ సేవలో నన్ను పూర్తిగా నిమగ్నం చేసుకోండి (భగవన్ యొక్క ఆనందానికి పనికిరానిది ఏదైనా నాకూ వద్దు – కైంకర్యం చేసేటపుడు రవ్వంత మాత్రం స్వార్థం కూడా ఉండకూడదు). శ్రీరాముడు మరియు సీతా పిరాట్టి ప్రత్యేకంగా ఇష్టపడే సేవలను తనకు ఆదేశించామని లక్ష్మనుడు (ఇళయ పెరుమాళ్) విన్నపించుకుంటారు. ఆండాళ్ నాచియార్ కూడా తిరుప్పావై చివరిలో అదే విన్నపించుకుంటుంది “మఱ్రై నం కామంగళ్ మాఱ్ఱు”.
ఈ విధంగా ఈ భాగంలో, కేవలం భగవత్ ప్రీత్యర్థంపై దృష్టి పెట్టి అన్ని కైంకర్యాలు (భగవత్ ఆగ్యా కైంకర్యాలతో సహా, అంటే నిత్య / నైమిత్తిక కర్మానుష్టానములు) చేసే ప్రాముఖ్యతను మనము చూశాము. ప్రతిఫలం ఆశిస్తూ కైంకర్యం చేయకోడదని – కైంకర్యం ఎమ్బెరుమాన్ ప్రీత్యర్థం కొరకై మాత్రమే చేయాలని, శ్రీవైష్ణవులు చాల సహజంగా కైంకర్యాలలో పాల్గొనవచ్చు అని కూడా చూశాము.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
హిందీలో : https://granthams.koyil.org/2014/01/virodhi-pariharangal-10/
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org