విరోధి పరిహారాలు – 12

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/06/30/virodhi-pariharangal-11-telugu/ .

ఎమ్బెరుమాన్, ఆళ్వారులు, ఆచార్యులు – మన ధ్యానం మరియు చింతన యొక్క కేంద్ర బిందువులు
43. స్మరణ విరోధి – మన ఆలోచనలలో / ధ్యానంలో / చింతనలో అవరోధాలు.
స్మరణ అంటే ధ్యానం లేదా చింతన అని అర్థం. ఈ విభాగంలో, మనం దేని గురించి ధ్యానం/చింతన చేయాలి మరియు దేని గురించి ధ్యానం/చింతన చేయకూడదో వంటి అంశాలు వివరించబడ్డాయి.
  • శ్రీ విష్ణు పురాణంలో పేర్కొనబడినట్టుగా “అన్యే తు పురుషవ్యాగ్ర  చేతసా యేపి అపాస్రయః అసుద్ధాస్తే సమస్తాస్తూ దేవత్యాః కర్మయోనయః”  – దేవతాంతర అంశములైన రుద్ర, స్కంద, దుర్గ మొదలైన వారిపై ధ్యానం పెట్టరాదు. అత్యంత కళ్యాణ రూపమైన శ్రీమన్నారాయణునిపైన మన పూర్ణ దృష్టి ఉంచాలి. దేవతాంతరులపై చింతన పెట్టడం ఒక అడ్డంకి. పైగా రూపం లేని, పేరు లేనిదేదో వాటిపైన దృష్టి సాధించడం కష్టం. కాబట్టి, ఎమ్బెరుమాన్ అర్చావతార రూపాలపై మరియు వారి దివ్య నామాలపై సంపూర్ణ దృష్టి పెట్టాలి, ఇది చాలా పవిత్రమైనది మరియు ధ్యానం చేయట కూడా చాలా సులభమైనది.
  • మన ఆచార్యుల దివ్య స్వరూపంపై ధ్యానించక పోవుట ఒక  అడ్డంకి. అనువాదకుని గమనిక:  తిరుక్కోష్టియూర్ నంబి ఒకసారి ఉత్సవ సమయంలో శ్రీరంగానికి వెళతారు. ఉత్సవం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటారు. ఎమ్బెరుమానార్  నంబికి ఉత్సవ సమయమంతటా సేవ చేసుకుంటారు. నంబి వదిలి వెళుతుండగా, ఎమ్బెరుమానార్ “నేను ఆశ్రయం పొందేందుకు మంచి ఉపదేశాలను కొన్నిప్రసాదించండి” అని నంబిని అడుగుతారు. నంబి కొంతసేపు వారి కళ్ళు మూసుకొని, “మనము ఆలవందారుల ఆధ్వర్యంలో శిక్షణ (ఆధ్యాత్మిక విషయాల్లో) పొందుతున్నాము. ఆ సమయంలో, వారు నది స్నానం చేస్తూ తలక్రిందకు మునిగినపుడు, వారి వీపు పైభాగం మెరుస్తూ ఒక అందమైన రాగి పాత్ర లాగా అనిపించేది. నేను ఆ దివ్య రూపాన్ని శరణు వేడుకుంటాను. మీరు కూడా ఆ దివ్య దృశ్యాన్ని శరణు వేడుకోండి”. – ఈ సంఘటన చాలా ప్రసిద్దమైనది. ఈ సంఘటన 6000 పడి గురు పరంపరా ప్రభావంలో కూడా వివరించబడింది. ఈ సంఘటన మన యొక్క దృష్టి ఆచార్యుల యొక్క దివ్య స్వరూపంపైన దృష్టి ఉంచాలని సూచిస్తుంది. నంబి తిరుక్కోష్టియూర్ ఆలయం యొక్క ప్రధాన గోపురం మిద్దెపైన ఉండి ఆళవందారులపైన  ధ్యానం చేస్తూ, “యమునైతురైవర్” (యామునాచార్యులు) అన్న మంత్రంజపం చేసేవారని చెప్పబడింది. ఈ సంఘటన అంతిమోపాయ నిష్ఠలో వివరించబడింది.
  • భాగవతుల దివ్య సంఘం  మీద ధ్యానం చేయక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: నమ్మాళ్వారు తిరువాయ్మొళిలో ప్రత్యేకంగా పయిలుం చుడరొళి (2.7) మరియు నెడుమాఱ్కడిమై (8.10) పదిగంలో అనేక పాసురాలలో భాగవతులను కీర్తించారు. కుళశేఖర ఆళ్వారులు భాగవతుల పట్ల తమ ప్రేమ మరియు భక్తిని పెరుమాళ్ తిరుమోళి, తేత్తరుం తిఱల్ (2) పదిగంలో  పంచుకుంటాడు. ఇతర ఆళ్వారులు మరియు ఆచార్యలు కూడా భాగవతుల యొక్క దివ్య అంశాలపై ఎల్లప్పుడూ ధ్యానం మరియు చింతన చేయాలని చాటారు.
  • భౌతికంగా ఆలోచించే వ్యక్తుల యొక్క వివిధ అంశాలపై ధ్యానం చేయుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళి 2.6.1 “నణ్ణాద వాళ్ అవుణార్” పాశురంలో  “నేను ఒక క్షణం కూడా, చల్లని తిరుక్కడల్మల్లై దివ్య దేశంలో నివసిస్తున్న స్థలశయన ప్పెరుమాళ్ పైన  ధ్యానించని వారి గురించి ఆలోచించను”. సంసారులు (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ఆహారం, వస్త్రాలు, ఉండటానికి సౌకర్యవంతమైన ఇల్లు మొదలైన వాటిపైనే వారి దృష్టి ఉంటుంది కానీ ఆధ్యాత్మిక చింతనపై ఏ విధమైన ఆసక్తి పెట్టరు.
  • భగవాన్ మరియు భాగవతులకు ప్రియమైన దివ్య క్షేత్రాలపై ధ్యానం చేయకుండుట ఒక అడ్డంకి. అంతేకాకుండా, ఎమ్పెరుమాన్, ఆళ్వారులు మరియు ఆచార్యుల సంబంధం లేని ఇతర క్షేత్రాలపై ధ్యానం చేయుట  ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  ఎమ్పెరుమాన్ ప్రతి ఒక్కరి పట్లా కరుణాభావంతో వారిని ఉద్దరించడానికి అర్చావతార మూర్తిగా క్రిందకు దిగివస్తారు. వారు ఎన్నో దేవాలయాలు, మఠాలు, తిరుమాలిగలకు (గృహాలు)  గొప్ప కోరిక, ఉత్సాహంతో జీవాత్మకు సహాయ పడాలని వచ్చారు. ఈ క్షేత్రాల్లో, ఆళ్వార్లు పాసురాలు పాడిన వాటిని దివ్య దేశాలు అని పిలవబడ్డాయి. ఆచార్యాలకు ప్రియమైన వాటిని అభిమాన స్థలాలని అంటారు. సాధారణంగా ఇతర శ్రీవైష్ణవులు ప్రియమైన ఎన్నో క్షేత్రాలు  ఉన్నాయి. మన దృష్టి కేవలం భగవాన్, ఆళ్వారులు మరియు ఆచార్యులకు సంబంధం కలిగివున్న క్షేత్రాలపైనే ఉంచాలి.
  • భాగవతులకు ప్రియమైన అంశాలపై చింతన చేయకుండా, సంసారులకు (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ప్రియమైన అంశాలపై ధ్యానం చేయుట ఒక అడ్డంకి.  అనువాదకుని గమనిక: ఆళ్వారులు మరియు ఆచార్యాల దృష్టి ఎన్నో విధాలుగా ఎల్లప్పుడూ భగవత్ విషయంలో నిమగ్నమై ఉండేది. సంసారుల దృష్టి ఎప్పుడు సంపదను ఆర్జించడంలో, వినోదం, క్రీడలు, లౌకిక సంగీతం మొదలైనవి వంటి ప్రాపంచిక ఆనందాలపై దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. ప్రపన్నులుగా, మన ఆళ్వారులు, ఆచార్యాల అడుగుజాడల్లో నడవాలని ఆశించాలి కానీ , సంసారుల అడుగుజాడల్లో కాదు.
  • భగవాన్ మరియు భాగవతుల  యొక్క పవిత్రమైన గుణాలపై చింతన చేయకుండా,  అవైష్ణవుల యొక్క లౌకిక మహిమల గురించి ధ్యానం చేయడం అడ్డంకి.  అనువాదకుని గమనిక: ఉదాహరణకి, భగవాన్ మరియు వారి భక్తులపై దృష్టి కేంద్రీకరించిన ఒక శ్రీవైష్ణవుడిని చూసినప్పుడు, మనము వారి లక్షణాలపై చింతన పెట్టినపుడు, వారిలా పరివర్తనం పొందుతాము. అధిక హోదా వంటి విషయాన్ని, భారీ సంపద (శ్రీవైష్ణవులలో కూడా) వంటి విషయాల్ని మనము చూసినప్పుడు – వారి లౌకిక అభిలాషలకు మనం ప్రభావితం కాకుండా ఉండాలి, అవి మనలను ఈ సంసార బంధాన్ని పెంచుతుంది.
  • ఎమ్పెరుమాన్ అర్చావతార  దివ్య మంగళ విగ్రహము తయారికలో ముడి పదార్థాన్ని విశ్లేషించుట ఒక అడ్డంకి. ఉదాహరణకు, స్వర్ణ విగ్రహం గొప్పదని చెక్క విగ్రహం తక్కువని భావించుట చాలా తప్పు. అనువాదకుని గమనిక:  శాస్త్రంలో అర్చా విగ్రహం యొక్క ముడి పదార్థాన్ని విశ్లేషించడం అనేది సొంత తల్లి యొక్క పవిత్రతను  విశ్లేషించడం వంటిదని  చెప్పబడింది.
  • అదే విధంగా, ఒక శ్రీవైష్ణవుని (భక్తి జ్ఞానంలో పరిపక్వత ఉన్నవాడు)  జన్మ, సంపద, అనుష్ఠానం, మొదలైన వాటిని ప్రశ్నించుట ఒక అడ్డంకి. తిరుమాళైలో, తొండరడిప్పొడి ఆళ్వార్ భాగావతులను చివరిలో ప్రశంసించారు (మేంపొరుళ్ పాశురం తర్వాత).  భాగవతులతో గొప్ప భక్తి  గౌరవాలతో వ్యవహరించాలన్న ఈ పాశురాలను గుర్తుంచుకోవాలి. అనువాదకుని గమనిక: జన్మ ఆధారంగా ఒక శ్రీవైష్ణవుడిని విశ్లేషించుట అనేది ఎమ్పెరుమాన్ అర్చావతార  దివ్య మంగళ విగ్రహము తయారికలో ముడి పదార్థాన్ని విశ్లేషణతో పోల్చ బడినది (ఇది అంతకు ముందే వివరించబడింది) – కాబట్టి అలా చేయుట గొప్ప పాపంగా పరిగణించబడుతుంది .
  • అదేవిధంగా, తమ ఆచార్యులను (వాస్తవానికి వారు భగవాన్ యొక్క అవతారముగా ఉంటారు) కేవలం మానవుడిగా పరిగణనలోకి తీసుకొనుట ఒక అడ్డంకి. ప్రమాణ వాఖ్యం ప్రకారం, “ఆచార్య స్స హరి సాక్షాత్ – చరరూపి నసంశయః” – ఆచార్యులు నడయాడే భగవంతుడు (ఒక చోట స్థిరమైన అర్చావతార ఎమ్పెరుమాన్ లా కాకుండా). ఆచార్యులను ఒక సాధారణ మానవుడని ఎన్నడూ భావించకూడదు.
  • మన ఆచార్యుల పట్ల గొప్ప కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆ భావం కలిగి ఉండక పోవుట ఒక అడ్డంకి.  అనువాదకుని గమనిక:  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు, మనకు ఆచార్యుల  ద్వారా భగవాన్ లభిస్తారని,  భగవాన్ ద్వారా ఆచార్యులు లభిస్తారని తెలుపుతారు. కాబట్టి, ఆచార్యులు భగవంతునితో సరైన సంబంధాన్నికలిగించడం ద్వారా ఈ సంసారము నుండి ఉపశమనం పొందే గొప్ప సహాయం మనకు చేస్తున్నారు. కాబట్టి, ఎప్పటికీ ఈ విషయం గుర్తుంచుకోవాలి. వారి పట్ల  ఎప్పటికీ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి.
  • భాగవతులను (తమ సొంత ఆచార్యులకు సమానంగా పరిగణిస్తారు) తనకు సమానంగా భావించుట  ఒక గొప్ప అడ్డంకి. అనువాదకుని గమనిక: సాధారణంగా అందరి శ్రీవైష్ణవులను తమ సొంత ఆచార్యులకు సమానంగా భావించాలి. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో పిళ్ళై లోకాచార్యుల వారు వివరిస్తూ భగవంతుని, భాగవతులను, అసహ్యాపచారములను వివరిస్తూ, తమని తాము వేరొక శ్రీవైష్ణవునికి సమానంగా భావించుట పెద్ద భాగవత అపచారము అని అన్నారు. ఇతర శ్రీవైష్ణవులను తనకంటే, భగవానుడుకంటే  ఎక్కువగా భావించాలి  మరియు వారిని ఎప్పుడూ గౌరవించాలి.
  • ఆళ్వారులు పాసురాలను దివ్యప్రబంధము (దివ్య కీర్తనలు) అని పిలుస్తారు.  వాటిని ప్రసిద్ధంగా “అరుళిచెయళ్” అని పిలుస్తారు. అవి తమిళ్ భాషలో సంకలనం చేయబడ్డాయి. కొంతమంది సంస్కృతం దేవ భాష  (దేవతల భాష) అని  తమిళ్ భాషను తక్కువగా చూస్తారు.  కానీ తిరుముంగై ఆళ్వారు “చెన్నిఱత్త తమిళోసై వడచొల్లాగి” – అనగా “అందమైన తమిళ౦ ధ్వనులు సంస్కృతంగా మారాయి” అని అన్నారు. నాయనార్ ఆచార్య హృదయంలో  (ఆగస్త్యముం అనాది) – అగస్త్య ఋషి చేత బహిర్గతం చేయబడిన తమిళ్ భాష శాశ్వత (ఎప్పటికి) మైనది. ఇది అగస్త్య ఋషి చేత వెల్లడి చేయబడినప్పటికీ, ఇది పురాతనమైనది మరియు సంస్కృతానికి తక్కువగా పరిగణించకూడదు. అనువాదకుని గమనిక: అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో నమ్మాళ్వార్ మరియు వారి దివ్యప్రబంధము యొక్క కీర్తి గురించి వివరించారు. ఈ రచనలో, ఆళ్వార్ జన్మకు సంభంధం లేకుండా, వారు స్వయంగా ఎమ్బెరుమాన్ చేత ఆశీర్వదించబడడం వలన వారి గొప్పతనం అపరిమితమైనది. అదేవిధంగా, భాషకు (తమిళ్ భాష) సంభంధం లేకుండా దివ్యప్రబంధము  యొక్క గొప్పతనం కూడా అపరిమితమైనది. మనం ఏదైనా సాహిత్యాన్ని కేవలం సంస్కృతంలో వ్రాయబడిందని అంగీకరించ వలసి వస్తే , అప్పుడు మనం బౌద్ధ శాస్త్రాన్నిఅంగీకరించాలి. రచయిత యొక్క పుట్టుక  ఆధారంగా మనము తిరస్కరించ వలసి వస్తే , మహాభారతాన్ని (వ్యాస మహర్షి రాసిన) మరియు భగవత్గీత (శ్రీకృష్ణుడు ఉపదేశించిన) ను తిరస్కరించవలసి ఉంటుంది, ఎందుకంటే రచయితలు ఇద్దరూ ఆబ్రాహ్మణులు కాబట్టి. అందువలన, వారు చాలా అందంగా దృవీకరించినది ఏమిటంటే దివ్యప్రబంధము యొక్క కీర్తి  వ్రాసిన భాష లేదా రచయిత యొక్క పుట్టుక మీద ఆధారపడినది కాదు,  దివ్యప్రబంధములో ఉన్న గొప్ప విషయం వల్ల – అనగా,  శ్రీమన్నారాయణుని దృఢమైన భక్తితో (ఇతర దేవతాన్తరులపై దృష్తి లేకుండా) కీర్తిస్తున్నంత వరకు అది ఆమోదయోగ్యమైనది.
  • ఆత్మ యాత్ర (ఆత్మ కార్యాలు) యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయి  మరియు దేహ యాత్ర (శరీరం కార్యాలు) పై దృష్టి కేంద్రీకరించడం ఒక  అవరోధం. ఆత్మ యాత్ర జీవాత్మ యొక్క సంక్షేమం కోరి తదనుగుణంగా ప్రవర్తించుట. దేహ యాత్ర  శరీరము యొక్క సంక్షేమం కోరి తదనుగుణంగా ప్రవర్తించడం అని అర్థం. శారీరిక సౌకర్యవంతమైన జీవనంపై దృష్టి పెట్టి ఆత్మ యొక్క శ్రేయస్సును విస్మరించరాదు.
  • భగవత్ అనుభవానికి  సంభందించని గుణాల ఆలోచనలు అడ్డంకులు. భగవంతునికి దాసులుగా ఉండి వారికి ప్రీతి కలిగించే విధంగా వ్యవహరించుట జీవాత్మ యొక్క అసలైన స్వభావం – దానికి విరుద్ధంమైనది ఏదైనా జీవాత్మ యొక్క స్వభావానికి తగినది కాదు.
  • భగవంతుడే మన ఉపాయము అని వారిపైన ఆధార పడుటను మరచుట ఒక అడ్డంకి.  ఎమ్బెరుమానుని సిద్ధ సాధనం అని పిలుస్తారు – అనగా “ఫలించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న ఉపాయం” అని అర్థము. మనమెప్పుడూ ఆ అంశాన్ని మరచిపోకూడదు.
  • సాధ్య సాధనము (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు) లకు దారితీసే ఆలోచలు మన మనస్సులోకి రానించుట.  సాధ్య సాధనము అంటే “తమ సొంత ప్రయత్నం ద్వారా సాధించ వలసిన ఉపాయము”.
  • కేవలం భగవత్ కైంకర్యం పై దృష్టి పెట్టి భాగవత కైంకర్యాన్ని విస్మరించుట ఒక అడ్డంకి.
  • భగవంతునికి, భాగవతులకు (అహంకారంతో) చేసిన సేవల  గురించి గొప్పగా ఆలోచించి పైగా భగవంతునికి, భాగవతులకు మనం చేసిన అనేక ప్రతికూలమైన చర్యల గురించి ఆలోచించక పోవుట.
  •  ప్రత్యేకంగా ఆచార్యులు మనకు చేసిన గొప్ప అనుగ్రహానికి చాలా కృతజ్ఞులై ఉండాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • అంతిమ స్మృతి  (శరీరాన్నివిడిచి పెట్టే చివరి క్షణాల్లో భగవంతుని గుర్తుచేసుకోనుట) అవసరం అని భావించుట ఒక అడ్డంకి. కర్మ, జ్ఞాన, భక్తి యోగములను పాటించేవారు అనేక జన్మల తరువాత పరమపదం చేరుకుంటారు. అటువంటి వారికి, చివరి క్షణాలలో భగవంతుని స్మరణ ఖచ్చితంగా అవసరం. కానీ పపన్నులకు, అంతిమ స్మృతి అవసరం లేదు. “అహం స్మరిమి మత్ భక్తం” –  తన భక్తుని చివరి క్షణాల్లో నేను వారిని స్మరించి వారిని ఉద్ధరిస్తాను, ఒక పపన్నునికి మోక్షం ప్రసాదించి పరమపదానికి తీసుకువెళ్ళే బాధ్యత భాగావానునిది.  అనువాదకుని గమనిక:  మన పూర్వాచార్యుల యొక్క జీవితాలలో మనము గమనించగలము, వారి తిరుమేని (శరీరము) ని విడిచే సమయంలో, వారు ఎప్పుడూ వారి ఆచార్యుని (ఎమ్బెరుమాన్కి బదులుగా) పై చింతన ఉంచేవారు. కాబట్టి ఇక్కడ మనం నిర్ధారించవలసినది ఏమిటంటే, మన చివరి క్షణాల్లో స్థిరమైన మనస్సుతో ధ్యానం చేయగలిగితే, భగవంతునికి బదులుగా మన ఆచార్యునిపై ధ్యానం ఉంచాలి – శ్రీవైష్ణవులు ఆచార్యాభిమాన నిష్ఠులు (కేవలం ఆచార్యుని కృపాకటాక్షాలపై ఆధారపడి ఉన్న వారు) కాబట్టి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/02/virodhi-pariharangal-12/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment