శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/07/07/virodhi-pariharangal-12-telugu/.
44. సంకీర్తన విరోధి – మన గానంలో, వాక్కులో వచ్చే విరోధులు (భగవాన్ మరియు భాగవతులను కీర్తించే సమయంలో)
సంకీర్తనము అనగా పాడటం లేదా మాట్లాడటం లేదా చెప్పడం అని అర్థము. ఇది సాధారణంగా వాచిక (పదాలు) కైంకర్యాన్ని సూచిస్తుంది (అనువాదకుని గమనిక: కైంకర్యము మన మనస్సు, పదాలు / ప్రసంగం మరియు శరీరం ద్వారా చేయవచ్చు).
- భగవాన్ యొక్క సౌలభ్యాన్ని (సరళత) గురించి చర్చిస్తున్నపుడు వారి ఆధిపత్యము గురించి మాట్లడుట ఒక అడ్డంకి. గుణ కీర్తనం – ఎమ్పెరుమాన్ యొక్క అద్భుతమైన గుణాలను స్మరించుట మరియు వాటి గురించి చర్చించుట. ఎమ్పెరుమానునికి రెండు ప్రత్యేక లక్షణాలు (ఇంకెవరికీ లేనివి) ఉన్నాయి – సంపూర్ణ పవిత్రమైన లక్షణాలతో ఉండుట మరియు అపవిత్ర గుణాలు లేకుండుట. వారి పవిత్ర గుణాలు రెండు వర్గాలు – భగవానుని పరత్వాన్ని (ఆధిపత్యాన్ని) సూచించే గుణాలు మరియు భగవానుని సౌలభ్యాన్ని (సరళతను) సూచించే గుణాలు. మనం నమ్మాళ్వార్ తిరువాయ్మొళి పాశురం 1.3.4లో జ్ఞాపకము చేసుకోవచ్చు, “యారుమోర్ నిలైమైయనేన ఆఱివరియ ఎమ్పెరుమాన్ యారుమోర్ నిలైమైయనేన ఆఱివెళియ ఎమ్పెరుమాన్” – ఎమ్పెరుమాన్ ని సులభంగా అవగతం చేయలేమని (పరత్వం) చూపిస్తారు మరియు వారిని సులభంగా అవగతం చేయగలమని(సౌలభ్యం) కుడా చూపిస్తారు. వారి పరత్వానికి గరిష్ట పరిమితి లేదు, అలాగే వారి సౌలభ్యానికి కానిష్ట పరిమితి లేదు. వారి సరళత్వం రెండు లక్షణాలలో చూడవచ్చు: సౌలభ్యం (సులభంగా అందుబాటులో ఉండటం / చేరుకోవడం) మరియు సౌశీల్యం (తనకున్న ఆధిపత్య గుణాన్ని అలక్ష్యం చేసి ఇతరులతో కలసిపోవుట). వారు పవిత్రమైన మరియు సుప్రసిద్ధ లక్షణాలతో వివిధ అవతారాలలో దిగి వచ్చినప్పటికీ, వారి సరళత కారణంగా తెజోమయులై ప్రకాశించారు. వారి సరళత కారణంగా వారి భక్తుల హృదయాలను కరిగించివేస్తారు. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 1.3.2 లో “ఇళైవరుమియల్వినన్” అని అన్నారు. తిరువాయ్మొళి 1.3.1లో, ఆళ్వార్ వెన్న దొంగిలించి నందుకు యశోదాదేవి కట్టివేసిన కృష్ణుడిని గుర్తుచేసుకుంటున్నారు. “ఎత్తిఱం! ఊరాలినోడు ఇణైన్తిరుంతు ఏ౦గియ ఎళివే” (ఇది ఎలా సాధ్యం? ఇంత సులభంగా రోలుకి కట్టబడ్డాడు, వారి నిస్సహాయ స్వభావమును ప్రదర్శిస్తున్నారు (సర్వోపరి అయినప్పటికే కూడా) అని సుదీర్ఘకాలం వరకు మూర్ఛపోతుంది అని చెప్పబడింది. తిరుప్పావైలో, ఆండాళ్ నాచియార్ వివరిస్తూ అన్నారు గోవిందా (ఆవుల మంద – పశువులను కాపే పశుకాపరి) అన్న పేరు కృష్ణుడికి చాల ప్రియమైన పేరు, పెద్ద పేరు కుడా (ఇది అతని సరళత్వం వివరిస్తుంది). “నారాయణ” (వారి ఆధిపత్య గుణాన్ని తెలుపుతుంది) అనే పేరు చిన్నది. గోపికలు “చిఱుప్పేరళైత్తానవుం చీఱి అరుళతే ఎమిఱైవా” ఓ! స్వామి, చిన్న పేరుతో మేము మిమ్మల్ని పిలిస్తే, దయచేసి మాపై కోపగించుకోకండి. గుణవాన్ (వాల్మికీ రచించిన శ్రీ రామాయణంలో శ్రీ రాముని సుగుణాలలో ఒకటి) శ్రీ రాముడు సౌలభ్యానికి (సులభమైన సౌలభ్యం) మరియు సౌశీల్యానికి నిధి వంటి వారు అని వివరించబడింది (అందరితో కలిసిపోయే). కాబట్టి, సరళత మీద దృష్టి కేంద్రీకరించే లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు, తన ఆధిపత్యాన్ని చర్చించకూడదు – ఇది ఎప్పటికీ తగదు.
- భగవానుని స్వయం ప్రయోజనంగా భావించి కీర్తించ కూడదు (ఎమ్పెరుమాన్ని స్తుతించుటయే మన లక్ష్యం – భగవాన్ నుండి ప్రతిఫలం ఆశించి ప్రార్ధించరాదు). సంపద లేదా ఖ్యాతిని ఆశించి భగవానుని ప్రార్ధించట ఒక అడ్డంకి. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను చెప్పిన/పాడిన చెప్పేవారిని, వినేవారికి ఇద్దరికీ ఆనందకరమైన రీతిలో కీర్తించాలి.
- అసంపూర్ణమైన / లోపమున్న వ్యక్తిత్వాలను మహిమపరచుట అనేది ఒక అడ్డంకి. ఇది దేవతాన్తరములకు దూరంగా ఉండమనే సంకేతంగా మనం అర్థం చేసుకోవాలి. అనువాదకుని గమనిక: ఎమ్పెరుమాన్ అన్ని పవిత్రమైన గుణాలకు నివాసం, అపవిత్రమైన గుణాలకు విరుద్ధంగా ఉంటారు. పూర్తిగా భగవాన్, భగవతాలకు అంకితమై ఉన్న శ్రీవైష్ణవులు కూడా మనం స్తుతించేందుకు పూర్తి అర్హులు. కానీ రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, స్కందుడు, ధర్గ, తదితరులు వంటి ఇతర దేవతలు ఈ సంసార బంధంలో చిక్కుకున్న ఆత్మలుగా ఉంటారు. ఈ సంసారలో కొన్ని అంశాలపై భగవాన్ చేత అధికారం ఇవ్వబడినప్పటికీ, వారు పరిమితులై అనేక సార్లు రజస్సు తమస్సు గుణాల అధీనులై ఉన్నారు. కాబట్టి, వారు శ్రీవైష్ణవులచే కీర్తించబాడడానికి అర్హులు కారు.
- భగవాన్ యొక్క స్తుతిని కేవలం అవి సంస్కృతంలో లేవని తిరస్కరించుట. భగవంతుడిని ఏ భాషలోనైనా స్తుతించవచ్చు. అనువాదకుని గమనిక: సంస్కృతం దేవ భాషగా (దివ్య భాష) ప్రశంసించారు. వేదం సంస్కృత భాషలో ఉంది, పూర్తిగా ఎమ్పెరుమాన్ కీర్తి ప్రతిష్టలతో కూడి ఉంది. కానీ ఎన్నో ఇతర భాషల్లో ఎమ్పెరుమాన్ని మహిమపరిచే అనేక సాహిత్యాలు ఉన్నాయి. అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్ళై లోకాచార్యుల యొక్క దివ్య సోదరుడు) ఒక అద్భుత ప్రబంధ (గద్యం) మైన ఆచార్య హృదయం అనే గ్రంథం, అనేక సూత్రాల సమీకరణ, తమిళంలో రచించారు. ఈ ప్రబంధంలో, ఆళ్వారుల పుట్టుకకు సంబంధం లేకుండా, వారి కీర్తి అపరిమితమైనది అని చెప్పబడింది. ఎందుకంటే వారు స్వయంగా ఎమ్పెరుమాన్ చేత ఆశీర్వదించబడ్డారు, అందువలన ఆళ్వారులు పూర్ణ శరణాగతులు; వారు వ్రాసిన భాషతో సంబంధం లేకుండా (తమిళ్), 4000 దివ్యప్రబంధములు దివ్యమైనవి, ఎందుకంటే అవి కేవలం ఎమ్పెరుమాన్ని మాత్రమే స్తుతిస్తున్నాయి, ఎందుకంటే అవి నాలుగు వేదాల సారం కాబట్టి. అందువలన వారు ఆళ్వారులను మరియు వారి దివ్యప్రబంధముల యొక్క మహిమను స్థాపించి, ప్రతి శ్రీవైష్ణవుడు అభ్యాసం చేయాలని నిరూపించారు.
- లౌకిక ప్రవృత్తి కల వ్యక్తులను (శ్రీమంతులు, రాజకీయంగా శక్తివంతులు, మొదలైన వారిని ) పొగుడుట. భగవంతుడిని స్తుతించవలసిన నాలుక/నోరుతో ఇతర దేవతాంతరులను కీర్తించుట ఒక అడ్డంకి. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 3.9.1 లో అన్నారు ” ఎన్నావిళ్ ఇంకవి యాన్ ఒరువర్క్కుం కొడుక్కిలేన్, ఎన్నప్పన్ ఎమ్పెరుమాన్ ఉళనాగవే” – నా నాలుక ఎమ్పెరుమాన్ తప్ప ఇంకెవ్వరినీ స్తుతించదు, ఎమ్పెరుమాన్ నా తీయని స్తుతి కోసం వేచి ఉంటారు.
- సర్వాధికారాన్ని (అందరికీ అర్హతఉన్న) అధికృధాదికారంగా (యోగ్యమైన వ్యక్తులకు మాత్రమే అర్హత) భావించుట. ఉదాహరణకు, వేదం త్రైవర్ణికులు (మొదటి 3 వర్ణముల వారు – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) నేర్చుకోవచ్చు మరియు చదవవచ్చు. అయితే దివ్యప్రబంధము చదువుటకు, మంగళాశాసనం చేయుటకు ప్రతి ఒక్కరూ అర్హులు. అనువాదకుని గమనిక: అదే సూత్రాన్ని అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం చూర్ణిక 73 లో వివరించారు – మృత్ గతం పోలన్ఱే పొఱ్కుడం – ఒక మట్టి కుండ బంగారు కుండ వంటిది కాదు. బంగారం సహజంగా స్వచ్ఛమైనది. అది ఎప్పుడైనా ఎవరైనా ముట్టుకోవచ్చు. కాని మట్టి కుండకు అనేక నిబంధనలు ఉన్నాయి, కొంతమంది మాత్రమే కొన్ని సందర్భాలలో మాత్రమే తాక వచ్చు – అనధికారిక సమయంలో అనధికార వ్యక్తులు తాకినప్పుడు, అవి పవిత్ర కార్యలకు పనికిరావు. బంగారపు పాత్రలకు అలాంటి నిబంధనలు లేవు. అదేవిధంగా, ఆళ్వార్ల పాసురాలు పవిత్రమైనవి, ఏ వ్యక్తి అయినా అనుసంధానం చేయవచ్చు.
- ఒక శ్రీవైష్ణవునిగా మారిన (సత్ సాంప్రదాయ సూత్రాల సరైన అవగాహనతో) తరువాత, ఆళ్వారుల మరియు ఆచార్యులచే వ్రాయబడని పాసురాలను చదువుట ఒక అడ్డంకిగా చెప్పవచ్చు. అనువాదకుని గమనిక: ఆళ్వారులు ఎమ్పెరుమానునిచే కలుషితం లేని జ్ఞానంతో ఆశీర్వదించబడ్డారు. మన పూర్వాచార్యులు ఆళ్వారులచే ఆశీర్వదించబడ్డారు. వారు రాసినది ఏది కూడా సొంత స్వార్థం లేకుండా పూర్తిగా స్వచ్ఛమైనవి. కాబట్టి, మన ఆచార్యులు మరియు ఆళ్వారులచే వ్రాయబడిన వాటిని ఖచ్చితంగా చదవాలి మరియు పాటించాలి. ఇతర వ్యక్తుల స్థితిలో (ఎమ్పెరుమానుని భక్తులైనప్పటికీ, శుద్ధ సాంప్రదాయ ఆచార్య పరంపరను పాటించని వారు) వారి సొంత నిష్ఠపై, అవగాహనపై ఆధారపడతారు, ఆ సందర్భంలో కొంతవరకు ఉపాయాంతరములు (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు మొదలైన ఉపాయములుగా) , ప్రయోజనాంతరం (శ్రీమన్నారాయణకు నిస్వార్థ కైంకర్యమునకు బదులుగా ఇతర లాభాలను ఆశించుట) మరియు దేవతాంతరములు (ఇతర దేవతల స్తుతి) కలవచ్చు. కాబట్టి, అటువంటి సాహిత్యానికి దూరంగా ఉండటం ఉత్తమం, ఎందుకంటే, స్వచ్ఛమైన మరియు మిశ్రమ (కలిసిన) సాహిత్యానికి మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించలేని స్తితిలో ఉంటాము.
- ఇటువంటి ఆళ్వారుల, ఆచార్యుల సాహిత్యమును సరైన ఆచార్యుల ఆధ్వర్యం లో నేర్చుకోవాలి. మనం సొంతంగా వాటిని అధ్యయనం చేయుట లేదా అధికారం లేని వారి నుంచి నేర్చుకొనుట ఒక అడ్డంకి.
- భగవాన్ యొక్క నామ సంకీర్తనం పరిశుద్దీకరణ ప్రక్రియగా కాకుండా ఆనందకరమైన ప్రక్రియగా సంతోషంగా చేయాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. భగవాన్ నామాలను పలికితే స్వచ్ఛమైన బ్రహ్మానందానికి దారితీస్తుంది. మధురకవి ఆళ్వార్ వారి కణ్ణినుణ్ చిఱుతాంబు 1 లో “కురుగూర్ నంబి ఎన్ఱక్కాల్ అణ్ణిక్కుం అముదూఱుం ఎన్నావుక్కే” అని అన్నారు – నేను నమ్మాళ్వార్ నామమును పలికినప్పుడు నా నాలుకపై స్వచ్ఛమైన తేనె రుచి యొక్క అనుభవం కలుగుతుంది. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 7.9.11లో “ఎంగనే సొల్లిలుం ఇన్బం పయక్కుమే” – అయితే నేను ఎమ్పెరుమానుని ఎలా స్తుతించినా అది బ్రహ్మానందానికి దారితీస్తుంది అని అన్నారు. అనువాదకుని గమనిక: తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలైలో నామ సంకీర్తనం యొక్క పూర్తి మహిమలను తెలిపారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధం యొక్క అద్భుతమైన అర్థాన్ని వారి వ్యాఖ్యానంలో వ్రాసారు. మొదటి పాశురంలో, నామ సంకీర్తనం యొక్క పావనత్వాన్ని(వాటి పవిత్రతను మరియు కీర్తించువారిని పవిత్రం చేసే సామర్థ్యం గురించి) కీర్తించారు. రెండవ పాశురంలో, నామ సంకీర్తనం యొక్క భోగ్యత్వాన్ని(తీయనిది, పరమ భోగ్యమైనది) కీర్తించారు. రెండు అంశాలు ముఖ్యమైనవి. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు ముందు పావనత్వానికి తరువాత భోగ్యత్వాన్ని ఉంచడానికి కారణాన్ని అందంగా వివరిస్తున్నారు – నామ సంకీర్తనంతో పరిశుద్దులు అయిన తరువాత సంపూర్ణమైన బ్రహ్మానందము సరిగ్గా పొందగలము.
- భాగవతుల నామాలను పలుకకుండా భగవాన్ నామాలను కీర్తించుట ఒక అడ్డంకి. భగవాన్ నామ సంకీర్తనం మరియు భాగవత నామ సంకీర్తనం రెండూ సమానంగా ఘనమైనవి (వాస్తవానికి భగవాన్ నామ సంకీర్తనం కంటే భాగవత నామ సంకీర్తనం గొప్పది). కాబట్టి, రెండూ చేయాలి. మనము మునుపటి వివరణను గుర్తు తెచ్చుకోవచ్చు – మధురకవి ఆళ్వార్ వారి కణ్ణినుణ్ చిఱుతాంబు 1 లో “కురుగూర్ నంబి ఎన్ఱక్కాల్ అణ్ణిక్కుం అముదూఱుం ఎన్నావుక్కే” – నేను నమ్మాళ్వారి నామమును పలికినప్పుడు నా నాలుకలో స్వచ్ఛమైన తేనె రుచి యొక్క అనుభవం కలుగుతుంది అని అన్నారు.
- స్వతంత్రంగా ఆచార్యుల ముందు వారి అనుమతి లేకుండా మాట్లాడట /పఠి౦చుట మొదలు పెట్టడం, వారు అనుమతి ఇచ్చిన తరువాత పఠి౦చక పోవుట అడ్డంకి. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యుల వారి “అర్ధ పంచకం” చివరిలో వివరించారు, శ్రీవైష్ణవులు (ఐదు ముఖ్యమైన సూత్రాలను అర్ధం చేసుకున్నవాడు) కొంతమంది వ్యక్తుల ముందు కొన్ని లక్షణాలను స్పష్టంగా ప్రదర్శించాలి. అందులో, భగవాన్ ముందు వినయం / సాత్వికము ప్రదర్శించాలి. ఆచార్యుల ముందు అజ్ఞానం స్పష్టంగా ప్రదర్శించాలి (అంటే, తన స్వంత తెలివితేటలను ప్రదర్శించటానికి బదులుగా వారి నుండి ప్రతిదీ నేర్చుకోవాలని కోరుకోవాలి) మరియు భౌతికంగా ఆలోచించే వ్యక్తుల ముందు వాళ్ళకి భిన్న స్వభావం (ఒక శ్రీవైష్ణవుడని) ప్రదర్శించాలి. అంతేగాక, ఆచార్యుల భగవత్ /భాగవత విషయాల గురించి శిష్యులు మాట్లాడటం చూసి, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు – ఎప్పుడైనా ఆచార్యులు ఎవరినైనా మాట్లాడమని ఆదేశిస్తే ఆ సమయంలో తిరస్కరించకూడదు – ఆ సమయంలో భగవాన్ మరియు భాగవతుల యొక్క మహిమలను గురించి వినయంగా మాట్లాడాలి.
- గోష్టిలో (సామూహిక పారాయణం) లో ఉన్నప్పుడు, స్వతంత్రంగా మనము పారాయణం మొదలుపెడితే అడ్డంకి అవుతుంది. సాధారణంగా, గోష్తికి నాయకుడు “శాతిత్తరుళ” అంటే మొదలు పెడదాము అని ఉంటారు. ఆ తరువాత, మనం పారాయణం చేయుట ప్రారంభించాలి. ఇది సరైన మర్యాద.
- అధిపతులు ప్రారంభించిన తర్వాత మనం తరువాత భాగంతో ప్రారంభించక పోవుట. అనువాదకుని గమనిక: అహంకారంతో, వారు పైనాయకుడిగా ఉన్నామని చూపించడానికి కేవలం వాళ్ళు మాత్రమే ప్రారంభించవచ్చు. అలాంటి వ్యక్తులు, గోష్ఠిలో ఇతరులు మార్గనిర్దేశం చేస్తున్నపుడు దయచేసి వాళ్ళు నోరు మూసుకోవచ్చు. అది మంచి మర్యాద (ప్రవర్తన) కాదు.
- పాశురం యొక్క రెండవ భాగాన్నిపఠించుటకు సంకోచించుట. అనువాదకుని గమనిక: సాధారణంగా, పండితులు / పై స్థాయిలో ఉన్న అధ్యాపకులు పాశురం యొక్క మొదటి భాగాన్ని పఠించిన తరువాత ఇతరులు (క్రింద స్థాయిలో, మొదలైన వాళ్ళు) పాశురం యొక్క రెండవ భాగాన్ని పఠించాలి. ఈ పద్ధతిలో అంతరాయం లేకుండా పారాయణం కొనసాగించ వచ్చు మరియు పఠించేవారికి మధ్య మధ్య సరియైన విరామానికి అవకాశం కల్పించి ఎక్కువ సేపు పారాయాణ౦ చేయుటకు కూడా అవకాశం ఉంటుంది. ఇది దివ్యప్రబంధ సేవాకాలంలో ప్రామాణిక పద్ధతి. పరిస్థితిని బట్టి, ఏ సంకోచం లేకుండా రెండవ భాగాన్ని చదివేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి.
- వేగంగా పఠించి అక్షరాలను / పదాలను మ్రింగివేయుట/ తప్పుగా పలుకుట అనేది ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: దివ్యప్రబంధము అందరికీ అర్థం అయ్యి అందారూ చదవ గలిగేలా నెమ్మదిగా చదవాలి. వారి స్వంత సౌలభ్యము కోసం వేగంగా చదివేసి పదాలను మ్రింగి వేయకూడదు.
- గోష్ఠిలో ఎవరైనా శ్రీవైష్ణవుడు ఏదైనా తప్పుగా చదివినప్పుడు, వారిపైన నవ్వడంగానీ ఎగతాళి చేయడం కానీ చేయకూడదు. ఆ వ్యక్తిని బహిరంగంగా సరిదిద్దకూడదు. వినయముతో ఏకాంతముగా వారికి తెలియజేయాలి.
- ప్రతి ప్రబంధం యొక్క మొదటి మరియు చివరి పాశురం రెండుసార్లు పఠించాలి. అలా చదవక పోవుట ఒక అడ్డంకి. కొన్నిప్రత్యేక సంధర్భములున్నాయి. (అనువాదకుని గమనిక: చరమ కైంకర్యం సమయంలో, మొదలైన సమయాల్లో అన్ని పాసురాలు ఒక్కసారి మాత్రమే చదువుతారు) – మరింన్నివివరాలకు పెద్దలను సంప్రదించండి.
- శడకోపన్ అని విన్నప్పుడు అంజలి (రెండుచేతులు కలిపి నమస్కరించుట) జోడించక పోవుట ఒక అడ్డంకి. ప్రభంధం / పదిగం యొక్క చివరి పాసురంలో, సాధారణంగా నమ్మాళ్వారు యొక్క పేరును (పాసురంలో భాగంగా) పఠిస్తారు. ఆనవాయితీగా ఆ సమయంలో, మనము దక్షిణ దిశ వైపు తిరిగి (ఆళ్వార్ తిరునగరి భారత దేశం దక్షిణంలో ఉన్నందున) నమస్కరించాలి. అనువాదకుని గమనిక: ఇతర ఆళ్వారులకు కూడా ఇది వర్తిస్తుంది. అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఈ సూత్రాన్ని కణ్ణినుణ్ చిఱుతాంబు వ్యాఖ్యానంలో మరియు ఆచార్య హృదయములో వివరించారు – నమ్మాళ్వారు యొక్క పేరు వినగానే శ్రీవైష్ణవులు వారు మనకి చేసిన ఉపకారమునకు కృతజ్ఞత తెలుపుతూ తప్పనిసరిగా దక్షిణ దిశ వైపు అంజలి జోడించి నమస్కరించాలి. బాధాకరమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో గొప్ప నేర్పరులు కూడా సేవాకల సమయంలో నమ్మాళ్వారుల పేరు విన్నప్పుడు నమస్కారం చేయరు. ఇక్కడ ఈ సందర్భంగా నమ్మాళ్వారు గురించి చెప్పబడింది, ఇదే సూత్రం అందరూ ఆళ్వారులకు వర్తిస్తుంది.
- దివ్యప్రబంధ పఠనానికి సాఱ్ఱుమురై (సరైన పూర్తయింది) చేయక పోవుట. దివ్యప్రబంధ పారాయణం చేసేటపుడల్లా, సరైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. మనం సాధారణ౦గా తనియన్లతో మొదలుపెట్టి, ప్రత్యేక క్రమంలో ప్రత్యేకమైన ప్రబంధాలను పఠి౦చి చివర్లో ఆ ఆలయం, మఠం, తిరుమలైగై (నివాసము) పరిపాటి ప్రకారంగా సాఱ్ఱుమురై చేస్తాము. సరైన నియమం/క్రమం లేకుండా కేవలం దివ్యప్రబంధ౦ పఠి౦చుట సరి కాదు.
- ఇతరులకు దివ్యప్రబంధ౦ బోధించేటప్పుడు, ప్రతిఫలంగా వస్తువులు / ద్రవ్య లాభాలను ఆశించరాదు. అనువాదకుని గమనిక: దివ్యప్రబంధ యొక్క పూర్తి దృష్టి ఎమ్పెరుమాన్ కైంకర్యం మరియు మంగళాశాసనంపై పూర్తిగా దృష్టి ఉంటుంది. కాబట్టి, ఇతరులకు దివ్యప్రబంధ౦ బోధన యొక్క పూర్తి ఉద్దేశ్యము ఎమ్పెరుమానుకి మంగళాశాసనం చేయుటకై ఇతరులను ప్రేరేపించుట. అది మాత్రమే లక్ష్యం – ఏ ఇతర ఆకాంక్షలకు చోటు లేదు.
- డబ్బు కోసం దివ్యప్రబంధ౦ పారాయణం చేయకూడదు. వెల కట్టి ఆళ్వారుల దివ్యప్రబంధములను అమ్మడం లేదా దివ్యప్రబంధ పారాయణం ఉద్యోగంగా చేయుట గొప్ప పాపం. దివ్యప్రబంధ పారాయణం చేసినపుడు కొంత సంభావనం (సమర్పణలు) స్వీకరించ వచ్చు – కాని, పారాయణం చేసిన వారు హక్కుగా భావించి అడగకూడదు.
- దేవతా౦తర ఆరాధనలో నిమగ్నమై ఉన్న వారి ఇళ్ళలో దివ్యప్రబంధ౦ పారాయణం చేయకూడదు. అలా చేస్తే పారాయణం చేసేవారి స్వరూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది భౌతికంగా ఆలోచించే వ్యక్తులు స్నానం చేసే ఒక నదీతీరాన నిత్య కర్మానుష్టానం చేస్తున్నట్లుగా ఉంటుంది – స్వచ్ఛంగా ఉన్న వారి నిష్ఠను కలుషితం చేస్తుంది. దేవతా౦తర ఆలయ సమీపంలో ఉన్నపుడు నమ్మాళ్వారి పేరు విన్నప్పుడు కూడా, నమస్కారం చేయవలసిన అవసరం లేదు అని చెప్పబడింది (ఎందుకంటే పొరపాటుగా దేవతా౦తరులకు నమస్కారం చేసినట్లగును).
- విష్ణు సహస్రనామం, ఎళై ఎతలన్ (తిరువాయ్మొళి 5.8), ఆళియెళ (తిరువాయ్మొళి 7.4) పాసురాలను వ్యాధులు నయం కావాలన్న సంకల్పంతో పఠి౦చుట ఒక అడ్డంకి. ఇక్కడ చెప్పబడిన పాశురాలు మరియు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల వ్యాధుల నుండి విముక్తులౌతామని సాధారణంగా వివరించబడింది. కానీ మనం ఏ విధ౦గా కూడా శరీరాన్ని చూడకూడదు, ఇది సరికాదు. కాని ఇతరులను నయం చేయడానికి చదివి వినిపించడం సమంజసమే.
- ఆచార్యులను స్తుతించకుండా భగవానుని స్తుతించుట ఒక అడ్డంకి. సాధారణంగా ప్రబంధ౦ పారాయణమునకు ముందు తనియన్లు చదవబడతాయి. ముదలియాండాన్ వివరణను మనము గుర్తు చేసుకోవచ్చు “గురుపరంపరా మంత్రం చెప్పకుండా ద్వయమంత్రాన్ని పఠించడం దేవతాంతరులను ఆరాధించి నట్లు౦డును”. అనువాదకుని గమనిక: మనము అనేక పుర్వాచార్య స్తోత్ర గ్రంధాలలో, ఆళవందార్ యొక్క స్తోత్రరత్నం, ఆళ్వాన్ యొక్క స్తవములు, భట్టార్ యొక్క శ్రీరంగరాజ స్తవం మొదలైన వాటిలో గమనించవచ్చు, మొదటి అనేక శ్లోకాలు గురుపరంపర, ఆళ్వారులు మరియు ఆచార్యులను స్తుతించిన తరువాత అసలు స్తోత్రము ప్రారంభమవుతుంది. పిళ్ళై లోకాచార్యుల ఇదే సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సూత్రం 274లో “జప్తవ్యం గురుపరంపరైయుం ద్వాయముం – మనం నిరంతరం గురు పరమపరా మంత్రం (అస్మత్ గురుభ్యో నమః…..శ్రీధరాయ నమః) మరియు ద్వయ మహా మంత్ర జపం చేస్తూ ఉండాలని వివరించారు. మామునులు వారి వ్యాఖ్యానంలో వివరిస్తూ – గురుపరంపర అంటే వారి స్వంత ఆచార్యుల నుండి శ్రీమన్నారాయణ (ప్రతి ఒక్కరికి ప్రథమాచార్యులు) వరకు, ద్వయం ఇటువంటి గురుపరంపరాచార్యులు మనకు అనుగ్రహించిన ప్రసాదము అని అర్థం.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/02/virodhi-pariharangal-13/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org