విరోధి పరిహారాలు – 14

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://granthams.koyil.org/2019/07/08/virodhi-pariharangal-13-telugu/ .

ఎమ్బెరుమానార్ వారి కాలక్షేప గోష్టి

45.  శ్రవణ విరోధి  – వినడంలో అవరోధాలు (భగవాన్ మరియు  భాగవతుల యొక్క మహిమలు) 

శ్రవణ౦ అనగా వినడం. ఈ విభాగంలో, మనం ఏమి వినాలి, ఏమి వినకూడదో వివరించబడింది. అనువాదకుని గమనిక: శ్రీ భాగవతంలో, ప్రహ్లాదుడు తొమ్మిది విధాల  భక్తిని వివరించారు – శ్రవణ౦ కిర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనమ్ వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం – శ్రీమన్నారాయణుడిని గురించి వినాలి, స్మరించాలి, గానం చేయాలి, వారి చరణ కమలాల సేవ చేయాలి, వారిని ఆరాధించాలి, వారిని కీర్తించాలి, వారిని సేవించాలి, వారితో స్నేహం చేయాలి మరియు వారికి తమను అర్పించాలి వంటివి ఎమ్పెరుమాన్ పట్ల భక్తిలో పాల్గొనడానికి  తొమ్మిది మార్గాలు. వీటిలో, శ్రవణ౦ మొదట వివరించబడింది, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి. దాని గురించి ఇప్పుడు చూద్దాం.

  •  భగవత్ చర్చా సమయంలో వ్యర్థపు మాటలాడుటను ఖండించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ఎవరైనా సంపూర్ణ భగవత్ విషయంలో (ఎమ్పెరుమాన్ సంబంధించిన విషయాలు) మునిగి ఉన్నప్పుడు, వారు సంభాషించేది ఏదైనా సహజంగా భగవత్ విషయంగా మారుతుంది. జ్ఞాన సారం పాసురం 40 లో, “అన్బర్ చోల్లుమవిడు చురుతియాం”  (భగవాన్ యొక్క ప్రియమైన భక్తుల సాధారణ సంభాషణలు కూడా ప్రమాణాలుగా (ప్రామాణికమైనవి) మారతాయి. అనువాదకుని గమనిక: వరవరముని వారి ఉత్తర దినచర్యలో, ఎరుంబి అప్పా మాముణులను ప్రార్థిస్తూ “ప్రియమైన స్వామీ! దయచేసి నా ఆలోచనలన్నీ మీపైనే కేంద్రీకృతమై ఉండేలా ఆశీర్వదించండి, నా పలుకులన్నీ మీ మహిమకై పలకాలి, నా శారీరిక చర్యలన్నీ మీ సేవ / మహిమకై చేయాలి, ఇంకా నేను ఇక్కడ ప్రస్తావించనవి ఏవైనా ఉంటే అవి కూడా మీ ఆనందం కోసం చేయనివ్వండి” – ఇది నిజమైన శ్రీవైష్ణవుడు యొక్క స్థితి – వాళ్ళు  ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ మరియు ఆచార్యల ఆనందాన్నిచూస్తారు – కాబట్టి వారు సహజంగా ఏమి చేసినా ఎమ్పెరుమాన్ మరియు ఆచార్యులను ప్రసన్నులను చేస్తుంది.
  • వినేటప్పుడు ఆ విషయంపై పూర్తి ఏకాగ్రత లేకపోవడం అడ్డంకి. మనస్సు యొక్క ఏకాగ్రత పూర్తిగా నిర్దిష్ట విషయాలపై ఉంచాలి. ఇది ఒక సామాన్య విషయమని వినకూడదు, పూర్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా తరువాత “నేను కూడా భగవత్ విషయం విన్నాను” అని ప్రగల్బాలు పలుకకూడదు.
  • భగవత్ విషయం వింటున్నప్పుడు, వేరే వాటిపై దృష్టి పెట్టడం గొప్ప అడ్డంకి.
  • మనకు తెలియని ఒక అంశం గురించి విన్నప్పుడు, జాగ్రత్తగా విని మరియు దానిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన తలను ఊపుతూ “అవును, సరైనదే” నని, అది తెలిసిందేనని నటించకూడదు.
  • జ్ఞానులైన పండితులు కొన్ని సూత్రాలను చక్కగా వివరిస్తున్నప్పుడు, మనం తమ స్వంత జ్ఞానాన్ని చూపుతూ ప్రగల్భాలతో అంతరాయం కలిగించకూడదు. సరిగ్గా వివరించబడుతున్న విషయాలలో లోపాలు చూపడం కూడా సరైనది కాదు.
  • భగవత్ విషయం గురించి చక్కనైన వివరణ ఎవరైనా చెప్పడం విన్నప్పుడు వారిపై అసూయపడటం ఒక అడ్డంకి. భగవత్ విషయంలొ ఇతరుల వికాసాన్ని చూసి అసూయ పడకూడదు. అనువాదకుని గమనిక: ఆర్తి ప్రభాంధంలో, మాముణులు వారి గురించి పాసురం 55లో వివరిస్తూ “పిఱార్ మినుక్కమ్ పొఱామై ఇల్లాప్పెరుమైయుమ్ పెఱ్ఱ ఓమే” – ఖచ్చితంగా ఇతరుల పెరుగుదల చూసి నేను అసూయపడను.  ఇది ఒక గొప్ప గుణం, సాధించడం చాలా కష్టం. శ్రీ వైష్ణవులు అందరు ఇతర శ్రీవైష్ణవులు కీర్తించబడినపుడు సహజంగా సంతోషంగా ఉండాలి.
  • భగవత్ విషయం యొక్క మంచి మాటలను విన్నప్పుడు మెచ్చుకోకపోవడం ఒక అడ్డంకి. కొన్ని మంచి మాటలు చెప్పబడినప్పుడు మరియు మంచి పనులు చేయబడినప్పుడు మర్యాదపూర్వకంగా  వ్యవహరించడం మరియు హృదయపూర్వకంగా వారిని అభినందించడం మంచిది.
  • తనకన్నా ఎక్కువ తెలివిగల సబ్రాహ్మచారుల పట్ల అసూయపడటం, ఆ అసూయను వ్యక్తం చేయుట ఒక అడ్డంకి.  అనువాదకుని గమనిక:  సాటి శ్రీవైష్ణవుల వికాసానికి ఒక శ్రీవైష్ణవుడు సహజంగా ఆనందించాలి,  సాటి శ్రీవైష్ణవులు బాధపడుతున్నప్పుడు బాధ అనుభవించాలి. అవగాహన ఉన్న వ్యక్తి యొక్క నిజమైన గుణం ఇది. సాటి శ్రీవైష్ణవులకు మంచి జరిగినప్పుడు మన స్వంత పిల్లలకు మంచి జరిగినట్లుగా భావించి మనం ఆనందపడాలి (సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ప్రకాశిస్తూ సంతోషంగా ఉండటం చూసి ఆనందిస్తారు).
  • భగవాన్ యొక్క దివ్య గుణాలైన సౌలభ్యం (సులువుగా లభించుట), సౌశీల్యం (అందరితో స్వేచ్ఛగా కలవడం) మొదలైనవి విన్నప్పుడు మన హృదయం కరిగిపొవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. రోలుకి కట్టిన  నిస్సహాయ స్తితిలో ఉన్న శ్రీక్రిష్ణుడిని జ్ఞాపకం చేసుకున్న తరువాత 6 నెలలు నమ్మాళ్ల్వారు స్పృహ కోల్పోయిన సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు.
  • భగవత్ విషయాన్ని  (ఎమ్పెరుమాన్ కు సంబంధించిన విషయాలు) గొప్ప భక్తితో హృదయపుర్వకంగా శ్రవణం చెయాలి. నిరాసక్తితో భక్తి లేకుండా వినడం ఒక అడ్డంకి.
  • దైవసంబంధమైన భావనలతో శారీరికంగా స్పందించక పొవుట ఒక అడ్డంకి. “ఆహ్లాధస్తీత నేత్రాంబు:  పులకీకృత గాత్రవాన్” – ఎమ్పెరుమాన్  నామాలను విన్నప్పుడు ఆనంద బాష్పాలతో భావోద్వేగముతో శారీరక మార్పులను (రోమాలు నిక్కరపొడుచుకొని నిలబడుట మొదలైనవి) అనుభవించుట. అనువాదకుల గమనిక: ఈ అంశాలను భగవాన్ స్వయంగా గరుడ పురాణంలో తన భక్తి యొక్క ఎనిమిది లక్షణాలను వివరిస్తూ , వారి దివ్య గుణాల గురించి వినేటప్పుడు దివ్య భావాలను అనుభవించుట కూడా ఒక లక్షణం అని వివరిస్తారు. వారు “నా భక్తులు తప్పనిసరిగా ఈ క్రింది ఎనిమిది లక్షణాలు కలిగి ఉంటారు – 1) ఎమ్పెరుమాన్  యొక్క భక్తులపై అమితమైన ప్రేమ కలిగి ఉండుట, 2)  ఎమ్పెరుమాన్ ఆరాధనను ఆనందించట, 3) ఎమ్పెరుమాన్ ను  తాను ఆరాధించుట, 4) అహంకారం లేకుండా ఉండుటం, 5) ఎమ్పెరుమాన్ గురించి వినడంలో ఆసక్తి చూపుట , 6) ఎమ్పెరుమాన్ గురించి విన్నప్పుడు / ఆలోచించేటప్పుడు / మాట్లాడేటప్పుడు శారీరక మార్పులు (రోమాలు నిక్కరపొడుచుకొని నిలబడుట వంటివి) చెందుట 7) ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ గురించి ఆలోచించుట, 8) ఎమ్పెరుమాన్ ఆరాధనకు ప్రతిఫలంగా భౌతిక ప్రయోజనాలు ఆశించకపోవుట. అలాంటి భక్తులు మ్లేచులు అయినప్పటికీ, వారు బ్రాహ్మణ పండితులచే, కైంకర్యపరారులచే మరియు సంసారులచే ఆరాధనీయులు. అలాంటి వారు పండితుల నుండి జ్ఞానాన్ని పొందుటకు, జ్ఞానాన్ని పంచుటకు కూడా అర్హులు “.
  • మన సత్ సాంప్రదాయ సూత్రాలను విన్న తరువాత, వాటిని పూర్తిగా పాటించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ఆండాళ్ నాచియార్ నాచియార్ తిరుమొళి 11.10లో  “మెయ్మై ప్పెరువార్తై విట్టుచిత్తర్ కీట్టిరుప్పర్” – పెరియాళ్వార్ (మా నాన్నగారు) చరమ శ్లోక శ్రవణం చేసిన తరువాత అదే ప్రకారంగా వారి జీవితం సాగించారు. ఇది ఆస్తీక లక్షణం (శాస్త్రాన్ని నమ్మినవాడు అనే దానికి అసలు అర్ధం). సూత్రాలను పాటించకపోవడం నిజంగా తమ స్వభావానికి హాని కలిగిస్తుంది.
  • సదాచార్యుల (నిజమైన ఆచార్య) నుండి వినకపోవడం ఒక అడ్డంకి. సదాచార్యులు అంటే పెద్దల నుండి (ప్రామాణికమైన ఆచార్యలు) ప్రామాణికంగా జ్ఞానాన్ని పొందిన వారు, ఆలోచించి ఇతరులకు వివరించేవారు. మన పూర్వాచార్యుల  ఆచార వ్యవహారములను నేర్చుకునేవారు. అలాంటి గొప్ప వ్యక్తులను మాత్రమే సదాచార్యులు అంటారు. ఈ విషయాన్ని మాముణులు ఉపదేశ రత్నమాల పాసురం  61 లో ” జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్ ఱాగవే ఉడైయనాన గురు” – జ్ఞానమును పూర్తిగా ఇమిడ్చుకొని వాటిని సమర్థవంతంగా అనుసరించే వారు ఆచార్యులు.
  • సదాచార్యుల నుండి విలువైన జ్ఞానాన్ని నేర్చుకున్న తరువాత, అర్హత లేని వ్యక్తులకు బోధించడం ఒక అడ్డంకి. నిజమైన అర్హత – నేర్చుకోవాలనే కోరిక, ఆ జ్ఞానంపై  విశ్వాసం కలిగి ఉండటం.
  • అవైష్ణవుల నుండి భగవత్ విషయం వినడం ఒక అడ్డంకి. అవైష్ణవులు అనగా దేవతాంతర సంభంధం ఉన్న వ్యక్తి – రుద్రుడు , దుర్గ, బ్రహ్మ, ఇంద్రుడు, స్కందుడు, వంటి ఇతర దేవతలతో సంబంధం. అనువాదకుని గమనిక: తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళిలో వివరిస్తూ అన్నారు, దేవతాంతర సంభంధం ఉన్న వారితో మనకు ఏ సంబంధం ఉండకూడదు. పెరియ తిరుమోళి 8.10.3లో – మఱ్ఱ మోర్ దెయ్వం ఉళదెన్ఱు ఇరుప్పారోడు ఉఱ్ఱఇలేన్ – ఇతర దేవతల సంబంధం ఉన్న వారితో నేను ఏ సంబంధం పెట్టుకోను, వారు భగవత్ విషయమును అందిస్తున్నప్పటికీ, వారి అభిమాన దేవతలకు సంబంధించిన వారి వ్యక్తిగత ప్రయోజనాల రంగు ఉండవచ్చు – అందువల్ల వారి నుండి వినకుండా ఉండటం మంచిది. వారు భాహ్యులు  (వైధిక వ్యవస్థకు వెలుపల ఉన్న వ్యక్తులు) కావొచ్చు లేదా కుదృష్ఠులు (వైధిక వ్యవస్థను స్వీకరించినవారు కాని వాటి అర్థాలను తప్పుగా అర్థం చేసుకునేవారు) కావొచ్చు – వారి వివరణ ఏదైనా ఎల్లప్పుడూ సత్ సాంప్రదాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయి – కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి దూరంగా ఉండాలి. 
  • సత్ సాంప్రదాయ విషయాలకు మినహా ఏమీ వినకూడదు. సత్ సాంప్రదాయలో సరిగ్గా శిక్షణ పొందిన పండితుల నుండి మాత్రమే శ్రవణం చేయాలి. అనువాదకుని గమనిక: మునుపటి సూత్రం మాదిరిగానే – సరైన సూత్రాలపై శిక్షణ లేని పండితుల నుండి మనం విన్నప్పుడు, గందరగోళంతో, వాస్తవమైన సూత్రాలను తప్పుగా గ్రహించే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై 7 వ పాసురంలో “కలైయఱక్ కఱ్ఱ మాన్తర్ కాణ్బరో కెట్పరో తామ్” – నేర్పరులైన పండితులు అవైధిక విషయాల శ్రవణం చేయరు.  పెరియ వాచాన్ పిళ్ళై వారి వ్యాఖ్యానంలో ఒక సంఘటన వివరించారు. కూరత్తాళ్వాన్ తన చిన్న వయస్సులో ఒక సంధర్భంలో బౌద్ధ వచనాల్ని కొన్ని విని ఇంటికి ఆలస్యంగా వస్తారు. వారి తండ్రి ఈ ప్రవర్తనతో కలత చెంది, ఆళ్వానుకి శ్రీపాద తీర్థాన్ని ఇచ్చి శుద్ధి చెసిన తరువాత అతన్ని ఇంటి లోపలికి రానిస్తారు.
  • భగవాన్ మరియు  భాగవతుల మహిమల గురించి విన్నప్పుడు బ్రహ్మానందాన్ని పొందాలి. అలాగే భగవాన్ మరియు  భాగవతులను అవమానించినప్పుడు (శిశుపాలుడు చేసినట్లు) కూడా టక్కున చెవులు మూసుకొని ఆ ప్రదేశాన్ని వదిలివేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • తిరుమంత్రం, ద్వయం మరియు చరమ శ్లోకం వంటి చరమార్థం (అత్యున్నతమైన సూత్రాలు) బాగా అర్థం చేసుకోవాలి మరియు రోజువారీ జీవితంలో అమలు చేయాలి. చరమార్థం అంటే చరమ శ్లోకం అని కూడా అర్ధం. అనువాదకుని గమనిక: చరమార్థం అంటే తుదకు ఆచార్యులను సాధనంగా మరియు లక్ష్యంగా స్వీకరించుట. అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ అదే సూత్రాన్ని జ్ఞాన సారం మరియు ప్రమేయ సారం ప్రభంధములలో వివరించారు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాంలో, పిళ్ళై  లోకాచార్యులు మనలను ఉద్ధరించడానికి ఆచార్యుల అనుగ్రహమే  అంతిమ మార్గమని తెలియ చెప్పారు. విళాంచోలై పిళ్ళై అదే సూత్రాన్ని తమ  సప్త గాధయ్ లో ఏడు పాసురములుగా వివరించారు. మాముణులు అదే సూత్రాన్ని ఉపదేశ రత్నమాల చివర్న అద్భుత రీతిలో వివరించారు.
  • భగవత్ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు రుద్రుడు  బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన ఇతర దేవతలకు సంబంధించిన విషయాలను తీసుకురాకూడదు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/02/virodhi-pariharangal-14/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment