విరోధి పరిహారాలు – 19

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2019/09/19/virodhi-pariharangal-18-telugu/

నంపిళ్ళై కాలక్షేప గోష్టి – ఎమ్పెరుమాన్ యొక్క కీర్తిని వినేందుకు తమ తిరువాయ్మొళి ఉపన్యాసాల ద్వారా ఎంతో మంది సమర్థులను చేర్చిన మహా పండితుడు.
50. కాలక్షేప విరోధి  – మన సమయాన్ని గడపడంలో అవరోధాలు

కాలక్షేపం అంటే  సమయం గడపడం అని అర్థం. మనం సమయాన్ని వృథా చేయకూడదు. సమయం గడపడంలో రెండు అంశాలు ఉన్నాయి – దేహ యాత్ర (శరీర ప్రయోజనం కోసం గడిపిన సమయం) మరియు ఆత్మ యాత్ర (ఆత్మ ప్రయోజనం కోసం గడిపిన సమయం). దేహ యాత్ర అంటే శరీరాన్ని మరియు శరీర బంధువుల పోషణకై గడిపిన సమయం. ఆత్మ యాత్ర అంటే ఆత్మను, దాని శ్రేయస్సును పెంపొందించడానికి గడిపిన సమయం. జీవాత్మ (స్వయం) తన యొక్క అభ్యున్నతిపై దృష్టి పెట్టాలి. శరీర అవసరాలను ధర్మబద్ధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది – దీనిని తిరస్కరించలేము, అయినప్పటికీ ఆహారం, ఇల్లు, బట్టలు మరియు శారీరక విలాసాలపై మాత్రమే దృష్టి పెట్టకూడదు. తిరుమళిసై ఆళ్వార్ మరియు మాముణులు  సమయం ఎలా గడపాలి అనే దానిని వివరించారు – వీటిని అర్థం చేసుకోవాలి, కీర్తించాలి మరియు సాధన చేయాలి.

తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాది 63వ పాసురంలో ఇలా అన్నారు: “తెరిత్తు ఎళుతి వాచిత్తు వణంగి వళిపట్టుం పూచిత్తుం పోక్కినేన్ పోతు” – నేను ఎమ్పెరుమాన్ గురించి ఆలోచించడం / ధ్యానం చేయడం, వారి గురించి రాయడం, వారి గురించి చదవడం, ఇతరుల నుండి వారి గురించి వినడం, అహంకారం లేకుండా ఆరాధించడం, వారి  తిరువారాదనం చేయడం ద్వారా నా సమయాన్ని గడుపుతాను.

మాముణులు ఆర్తి ప్రబందం 26వ పాసురంలో ఇలా అన్నారు:“పండు పల ఆరియరుం పారులగోర్ ఉయ్యప్ పరివుడనే చెయ్దు అరుళుం పల్కలైగళ్ తమ్మైక్ కణ్డతెల్లాం ఎళుది అవై కఱ్ఱు ఇరున్తుం పిరార్క్కు కథలుడన్ కార్పిత్తుం కాలత్తైక్ కళిత్తేన్”

‘ముస్లిం దండయాత్రలలో కోల్పోయిన అన్ని పూర్వాచార్యుల గ్రంథములను నేను శోధించి వెతికి సేకరించాను. భవిష్యత్ తరాల వారందరి హితం (శ్రేయస్సు) కోసం మన పూర్వాచార్యులు అపార కారుణ్యం (గొప్ప దయ)తో వ్రాయబడినవి. నేను వెతికి తీసిన గ్రంథాలన్నిటినీ స్వయంగా తాటి పత్రాలపైన వ్రాసాను, నా ఆచార్యులు (తిరువాయ్మొళి పిళ్ళై మొదలైన) వారి నుండి అవి నేర్చుకున్నాను, ఆ గ్రంథాలలోని సూచనల ప్రకారం జీవించాను మరియు నా శిష్యులకు నేర్పించాను’.

కాలక్షేపం సాధారణంగా “సమయాన్ని గడపడం ” అని అర్ధం అయినప్పటికీ, పూర్వాచార్యుల గ్రంథాలను పదాల వారీగా నేర్చుకోవడం మరియు ఉపన్యాసాల ద్వారా ఇతరులకు బోధించడం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.  అనువాదకుల గమనిక: ఈ క్రింది వ్యాసాలలో శ్రీవైష్ణవ దినచర్యలో (రోజువారీ దినచర్య) వివరంగా వివరించబడింది:  https://granthams.koyil.org/2012/08/srivaishnava-lakshanam-10/ and https://granthams.koyil.org/2012/08/srivaishnava-lakshanam-11/.

  •  కాలక్షేపం వింటున్నప్పుడు తమోగుణ ప్రభావంతో నిద్రపోవడం ఒక అడ్డంకి. తొండరడిప్పొడి ఆళ్వార్ తమ తిరుమాలై 3వ పాసురంలో ఇలా అన్నారు  “వేద నూల్ పిరాయం నూఱు మనిచార్ధామ్ పుగువరేలుం పాదియుం ఉఱంగిప్పోగుం” – జీవాత్మ 100 సంవత్సరాల ఈ శరీరాన్ని స్వీకరిస్తాడు, అందులో  సగం సమయం నిద్రలో గడిపుతాడు. ఈ నిద్ర తమోగుణ (అజ్ఞానం) యొక్క ఫలితం అని చెప్ప బడింది. సమంజసమైన నిద్ర అవసరం (మనకున్న 24 గంటలలో 6 గంటల నిద్ర సరిపోతుంది), ఎక్కువ నిద్రపోవడం మంచిది కాదు. అనువాదకుల గమనిక: కాలక్షేపం విన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి,  ఉపన్యాసంలో వివరించిన సూత్రాలపై దృష్టి పెట్టాలి.
  • ఉదయం  మేల్కొన్న తరువాత, ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేయడం ఒక అడ్డంకి. మనం మేల్కొని ఉన్నప్పుడు, సమయాన్ని ఉపయోగకరంగా వాడుకోవాలి. ఇతరుల చెడును ఆలోచించడం / కోరుకోవడం గొప్ప పాపం. అనువాదకుల గమనిక: శ్రీ భాగవతంలో, ఒక భాగవతుడు అనేక కార్యాలలో పాల్గొనవచ్చని చెప్పబడింది. ఉదాహరణకి, శ్రవణం (ఎమ్పెరుమాన్ గురించి వినడం), కీర్తనం (ఎమ్పెరుమాన్ యొక్క మహిమలను పాడటం), విష్ణోః  స్మరణం (వారి లీలలను గుర్తుచేసుకోవడం), పాద సేవనం(వారి పాద పద్మాలను సేవించడం), అర్చనం (వారిని ఆరాధించడం), వందనం (వారిని కీర్తించడం), దాస్యం (వారిని సేవ చేయడం), సక్యం (వారినితో స్నేహం చేయడం) మరియు ఆత్మ నివేదనం (తనను తాను పూర్తిగా అర్పించుకోవడం) లాంటివి. నిమగ్నమవ్వడానికి ఇన్ని శుభ కార్యకలాపాలు ఉన్నప్పుడు, అశుభమైన కార్యాలలో మన సమయాన్ని వృథా చేయకూడదు. పెరియ తిరువంతాదిలో, నమ్మాళ్వార్  “కార్ కలంద మేనియాన్ కై కలంద ఆళియాన్ పార్ కలంద వల్వయిఱ్ఱఆన్ పాంబణైయాన్ సీర్ కలంద సొల్ నినైందు పోక్కారేల్ సూళ్ వినైయిన్ ఆళ్తుయరై ఎన్ నినైన్దు పోక్కువర్ ఇప్పోదు?”- మేఘ వర్ణంలో నల్లటి రంగుతో ఉన్న భగవాన్, చేతిలో సుదర్శన చక్రం కలిగి ఉన్నవాడు, లయ సమయంలో తన కడుపులో బ్రహ్మాండాన్ని రక్షించేవాడు, శేష శయ్యపైన పవళించి ఉన్న వాడు, ఇన్ని దివ్య లక్షణాల గురించి మాట్లాడేందుకు ఇన్ని అద్భుతమైన విషయాలు ఉన్నప్పుడు ఎమ్పెరుమాన్ గురించి ఆలోచించకుండా ఎలా గడపగలరు? ఆళ్వార్ తమ కోణం నుండి ఆలోచిస్తున్నారు, ఎమ్పెరుమాన్ గురించి చింతన చేయకుండా సమయాన్ని ఎలా గడపాలనేది వారికి తెలియదు.
  • స్త్రీలతో ఆనందం గురించి ఆలోచిస్తూ సమయం గడపడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భౌతికవాదానికి అంతిమ లక్ష్యం శృంగారాన్ని ఆస్వాదించడమే. యువావస్త ప్రారంభం నుండి, పురుషులు మరియు మహిళలు ఎలా ఆనందించాలన్న దానిపైనే దృష్టి ఉంటుంది. దీనిని మన పూర్వాచార్యులు “విషయాంతర ప్రావణ్యం” – ప్రాపంచిక ఆనందాలను అనుభవించుట అని వివరించారు. పేయాళ్వార్ ఇటువంటి ఇంద్రియ కోరికలను మనస్సు నుండి తొలగించడానికి ఒక సాధారణ పరిష్కారాన్ని వివరించారు. వారు మూన్రాం తిరువంతాది పాసురం 14లో ఇలా అన్నారు – “మాఱ్ప అల్ మనం చుళిప్ప మంగైయర్ తోళ్ కై విట్టు” – మన మనస్సు మరియు కోరికలను ఎమ్పెరుమాన్ పైన కేంద్రీకరించినప్పుడు, ప్రాపంచిక సుఖాలపట్ల అనురాగము కనుమరుగైపోతుంది. భగవాన్ “శుభాశ్రయం” గా వివరించబడ్డారు – దృష్టి పెట్టదగిన పవిత్రమైన నివాసం – మనం భగవాన్పై దృష్టి పెట్టినప్పుడు, స్వయంచాలకంగా అన్ని శుభాలు మనలో కూడా కనిపిస్తాయి, ఇంకన్ని అశుభాలు అంతరించిపోతాయి.
  • కరియాన్ కళల్ (నల్లని వర్ణంలో ఉన్న ఎమ్బెరుమాన్ చరణ కమలాలు) యొక్క పాద పద్మాలపై చింతన చేయకుండా సమయం గడపడం. భగవానుడిని నీల మేఘ శ్యామళ (నల్లని మేఘాలను పోలి ఉన్నరూపం) అని వర్ణించారు.  తిరువాయ్మొళి 3.6.10 లో నమ్మాళ్వార్ చెప్పినట్లుగా మనం ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మాలపై దృష్టి పెట్టాలి “అంఱృ తేర్ కతవియ పెరుమాన్ కనై కళల్ కాణ్బతెన్రుకొల్ కణ్గళే” – నేను రథాన్ని నడిపిన (అర్జునుడి కోసం) ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మాలను ఎప్పుడు చూస్తానో?  అలాగే, తిరువాయ్మొళి 3.8.4లో, నమ్మాళ్వార్  “ఉన్నై మెయ్కొళ్ళక్ కాణ విరుంబుమెన్ కణ్గళే” – నా కళ్ళు మీ దివ్య రూపాన్ని చూడాలని తపించిపోతుంది. నమ్మాళ్వార్  తిరువాయ్మొళి ఇంకొక పాసురం 8.5.1 లో కూడా ఇలా అన్నారు “ఒరు నాళ్ కాణా వారాయే” – దయచేసి ఒక్కసారి రండి నేను మిమ్మల్ని దర్శించుకుంటాను.
  • వర్ణాశ్రమ ధర్మం ప్రకారం సూచించబడిన సామాన్య కర్మలు చేయుటలో సమయం గడుపుట. ఇక్కడ వైధిక కర్మల ఖండన చేయుటంలేదు. వాటిని భగవత్ ఆగ్య కైంకర్యంగా చేయాలి (భగవానుడు కైంకర్యంగా చేయమని ఆదేశించినవి). వీటిని “సామాన్య ధర్మం” (ప్రాథమిక నియమాలు) అని అంటారు. కొన్నినిత్య కర్మలు (సంద్యావందనం మొదలైనవి), నైమిత్తిక కర్మలు (తర్పణం మొదలైనవి) “అకరణే ప్రత్యవాయం” గా గుర్తించబడతాయి – అలాంటి కర్మలు చేయనప్పుడు, అవి పాపాలను మూటకట్టుకునేందుకు దారితీస్తాయి. ఈ కర్మలను తప్పనిసరిగా చేయాలి. కానీ కేవలం అలాంటి కర్మలపై మాత్రమే దృష్టి పెట్టకూడదు. మనల్ని తొణ్డక్కులం (దాస కులం – భగవాన్ మరియు భాగవతుల సేవకుల వంశం) అని కూడా పిలుస్తారు. ప్రధానంగా మన చర్యలు ఈ దాస కుల అంశంపై కేంద్రీకరించాలి మరియు భగవాన్, భాగవతుల సేవలో మన సమయాన్ని గడపాలి.
  • ద్వయ మహామంత్ర చింతన చేయకుండా సమయం గడపడం ఒక అడ్డంకి. మన సమయాన్ని గడపడానికి ఉత్తమమైన మార్గం నిరంతరం ద్యయ మహమంత్రాన్ని పఠించడం మరియు దాని యొక్క దివ్య పరమార్థాలను ధ్యానించడం. శరణాగతి గద్యంలో, శ్రీ రంగనాథుడు ఎమ్బెరుమానార్కి ఆదేశిస్తారు –  “ద్వయమార్తానుసంధానేన సహ యావచ్ చరీరపాదం అత్రైవ స్రిరంగే సుకమాస్వ” – నీవు నీ జీవితాంతము వరకు శ్రీరంగంలోనే ఉండి నిరంతరం ద్వయ మహామంత్రం దివ్య అర్ధాలను ధ్యానం చేయి. వరవరముని దినచర్యలో, దేవరాజ గురువు (ఎరంబి అప్పా) మణవాళ మాముణుల దివ్య కార్యాలను వ్రాసి నమోదు చేశారు. 9వ శ్లోకంలో, వారు “మంత్ర రత్నానుసన్ధాన సంతత స్పురితాదరం; తదర్త్త తత్వ నిద్యాన సన్నద్ద పులకోద్గమం”  అని కీర్తించారు – మాముణుల పెదాలు నిరంతరం ద్వయ మహామంత్రాన్ని (మంత్ర రత్నం అంటారు – మంత్రాలలో రత్నం) జపిస్తూ ఉంటాయి. ద్వయం (అది తిరువాయ్మొళి తప్ప మరొకటి కాదు) యొక్క అర్ధాలను నిరంతరం ధ్యానం చేయడం వల్ల వారి శరీరం దివ్య స్పందన వ్యక్తం చేసేది . అనువాదకుల గమనిక: ద్వయ మహామంత్రం ఎప్పుడూ స్వతంత్రంగా పఠించబడదని గుర్తుంచుకోవాలి – మనం ఎప్పుడూ గురు పరంపర మంత్రాన్ని పఠించి ఆ తరువాత ద్వయ మహామంత్రాన్నిపఠించాలి. మునుపటి వివరణలో దీనిని గురించి చెప్పుకున్నాము.
  • దేవతాంతర భజనం చేయడంలో మన సమయాన్నిగడపడం, అన్ని సమయాలలో భగవాన్ ధ్యానించక పోవడం ఒక అడ్డంకి. మన సమయాన్ని పూర్తిగా ఎమ్పెరుమాన్ ఆరాధనలోనే గడపాలి. తిరుమళిసై ఆళ్వార్  శ్రీవైష్ణవులను వర్ణిస్తూ ఇలా అన్నారు “మఱంతుం పుఱం తొళా మాన్తర్” –  ఏ సంధర్భంలోనైనా అన్య దేవతలను పూజించని వారు. మన పంచ సంస్కారం (సమాస్రయణం) చేయించుకున్నప్పుడు, భగవాన్‌తో మన నిజమైన సంబంధాన్ని ఆచార్యులు పూర్తిగా గ్రహించేలా చేస్తారు. భార్య పూర్తిగా తన భర్తపై మాత్రమే ఆధారపడి ఉండి మరెవరితోనూ అనుబంధం పెట్టుకోదు, అలాగే శ్రీవైష్ణవులు పూర్తిగా భగవాన్ పైన మాత్రమే ఆధారపడతారు, మరెవరిపైన  కాదు.
  • సామాన్య శాస్త్రంలో సమయం గడపడం (వేదం ఆధారంగా సాధారణ మార్గదర్శకాలు), తాత్పర్య శాస్త్రం (వేదం యొక్క సారాంశమయిన తిరుమంత్రం మొదలైనవి) వినడంలో / ధ్యానం చేయడానికి సమయం కేటాయించకపోవడం అవరోధాలు. సామాన్య శాస్త్రం సత్యం వధ (నిజం మాత్రమే మాట్లాడాలి), ధర్మ చరా (ధర్మబద్ధంగా ఉండాలి), స్నాత్వా బుంజీత (తినడానికి ముందు స్నానం చేయాలి), నిత్య కర్మానుష్టాలు మొదలైనవి చేయాలి. ఇవి ఖచ్చితంగా అవసరం కాని అంతిమ లక్ష్యంగా కాదు. అత్యున్నతమైన లక్ష్యం నిర్దిష్ట వైష్ణవ ధర్మాన్ని అర్థం చేసుకొని దానిని అనుసరించడం. ఈ గ్రాంథంలో ఇలాంటి అనేక అంశాలను మనం ఇప్పటికే చూశాము. అనువాదకుల గమనిక:  అళగియ మణవాల పెరుమళ్ నాయనార్ వారి ఆచార్య హృదయంలో ఎన్నో చూర్ణికలలో, వర్ణ ధర్మి (వర్ణశ్రమ ధర్మంపైన మాత్రమే దృష్టి కేంద్రీకరించినవాడు) మరియు దాస వృత్తి (భగవాన్ మరియు భాగవతుల కైంకర్యముపై దృష్టి కేంద్రీకరించినవాడు) మధ్య భేదమును వివరించారు. వర్ణ ధర్మి వేదంపై మాత్రమే కేంద్రీకృతమై ఉండి శాస్త్రం యొక్క అత్యున్నత సూత్రాలను అర్థం చేసుకోడు. దాస వృత్తి పూర్తిగా తిరుమంత్రంపై (ద్వయం, చరమస్లోకం కూడా)  కేంద్రీకృతమై ఉండి, శాస్త్రం యొక్క అత్యున్నతమైన  సూత్రం  భగవాన్ మరియు భాగవతుల సేవయని అర్థం చేసుకొని అన్ని సమయాలలో సేవిస్తాడు. నాయనార్ దాస వృత్తిని సారాగ్య (సారాంశాన్ని గ్రహించినవాడు) అని , అడియార్/ తొణ్డర్ (సేవకుడు), మణ్డినార్ (దివ్య దేశాలను ఇష్టపడేవాడు), మిక్క వేదియర్ (శాస్త్రం జ్ఞానము కలవాడు) అని పిలిచారు . వర్ణ ధర్మిని శాస్త్రి (సామాన్య శాస్త్రంపై మక్కువ చూపేవాడు), అంతణార్ / మఱైాయోర్ (బ్రాహ్మణ / వైదీక), మఱ్ఱఐయార్ (దివ్య దేశాలను ఎక్కువ మక్కువ లేనివారు), వేదవిత్ (సామాన్య శాస్త్రంలో ప్రావిణ్యం ఉన్నవారు) అని పిలిచారు .
  • లౌకిక సుఖాల కోసం సంపాదనలో సమయాన్ని గడపడం మరియు పనికిరాని విషయాలను నేర్చుకోవడంలో సమయాన్ని గడపడం అవరోదం. అలాగే, ఆత్మ యొక్క అంతిమ అభ్యున్నతికి దారితీసే విషయాలను నేర్చుకోవడానికి సమయం కేటాయించకపోవడం ఒక అడ్డంకి. భౌతిక సంపదపై మన జీవితాలను కేంద్రీకరించడం ఆత్మ యొక్క స్వభావానికి వినాశకరమైనది, భగవాన్ మరియు భగవతల సేవపై మన దృష్టి ఉండాలి. h
  • ఇతరులను బాధపెట్టడంలో సమయం గడపడం, ఇతరులకు సహాయపడటంలో సమయం గడపక పోవడం. “న హింస్యాత్ సర్వభూతాని” – ఎవరికీ ఇబ్బంది పెట్టకపోవడం అనేది శాస్త్రం యొక్క సాధారణ ఉత్తర్వు. మన జీవితాన్ని మనం ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా ఏర్పాటు చేసుకోవాలి. “పరోపకారార్థం ఇదం శరీరం” – ఈ శరీరం ఉన్నది ఇతరులకు సహాయం చేయుటకే. శ్రీ రామయణంలో విభీషణశరణాగతి సమయంలో శ్రీరాముడు వివరించిన కపోత ఉపాక్యానం (పావురం కథ) ను మనం గుర్తు చేసుకోవచ్చు.     అనువాదకుల గమనిక: శ్రీరామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినప్పుడు, సుగ్రీవుడు ఇంకా ఇతరులందరూ విభీషణుడిని తిరస్కరించమని  శ్రీరామునికి విన్నపించుకుంటారు.  ఆ సమయంలో శ్రీరాముడు, ఒకవేల  తనను బాధపెట్టే దుష్ట ఉద్దేశ్యాలతో  విభీషణుడు వస్తున్నప్పటికీ తాను విభీషణుడిని స్వీకరిస్తానని స్థాపించడానికి ఒక సంఘటనను వివరిస్తారు. ఒక అడవిలో, ఒక చెట్టు మీద పావురాల జంట ఉండేవి. ఒక వర్షపు రోజున, వారు ఉంటున్న చెట్టు క్రింద ఒక వేటగాడు వస్తాడు. భారీ వర్షం కారణంగా అతను చెట్టు కింద చాలాసేపు ఇరుక్కుపోతాడు. అతను ఆకలితో అటూ ఇటూ చుట్టూ చూస్తాడు, చెట్టు మీద పక్షుల జంటను చూస్తాడు. అతను ఆడ-పావురాన్ని బాణంతో కొట్టి, ఒక మంట తయారు చేసి, ఆడ-పావురాన్ని కాల్చి తింటాడు. అతను ఇంకా కొంత సేపు అక్కడే ఇరుక్కుపోయి ఆ ప్రదేశం నుండి బయటికి వెళ్ళలేకపోతాడు. తన సహచరుడిని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్న మగ-పావురం, పైనుండి చూస్తూ, “ఇక్కడ ఇప్పుడు ఒక అతిథి వచ్చాడు, అతను ఆకలితో బాధపడుతున్నాడు, నేను అతనిని స్వాగతించి ఎలాగైనా అతనికి ఏదైనా తినిపించాలి” అని అనుకుంటుంది.  కొన్ని పొడి ఆకులు మొదలైనవాటిని తెచ్చి, వేటగాడు వేడి కాపుకోడానికి ఒక మంటను తయారు చేస్తుంది, ఆ మంటలోనే దూకి తనను తాను వేటగాడికి  అర్పిస్తుంది. తన అతిథిగా భావించి వేటగాడి ఆకలిని తీర్చడానికి, పావురం తనను తాను త్యాగం చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. “నేను విభీషణుడిని ఆశ్రయం ఇవ్వకపోతే, వేటగాడు తన సహచరుడిని చంపిన తరువాత కూడా తన అతిథి కోసం తనను తాను త్యాగం చేసిన మగ-పావురం కంటే తక్కువగా ప్రపంచం నన్ను పరిగణించదా?” అని శ్రీరాముడంటారు. సుగ్రివుడు మరియు ఇతరులు శ్రీ రాముని యొక్క వివరణతో పూర్తిగా సంతృప్తి చెందుతారు. చివరికి వారిని స్వాగతిస్తారు.
  • ఇతరుల ఇళ్లలో తినడంలో సమయాన్ని గడిపి, వాళ్ళ సొంత ఇంట్లో తినకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: బయట తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో చాలా జాగ్రత్తగా ఎమ్పెరుమాన్ , ఆళ్వారులకు మరియు ఆచార్యలకు అర్పించిన ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నామని మనకు తెలుసు. కానీ బయటి ఆహార పదార్థాలను నిర్ధారించడం సాధ్యం కాదు. కాబట్టి, మన పెద్దలు ఎప్పుడూ పరాన్న నియమాన్ని పాటించేవారు – ఇతరులు వండిన ఆహారాన్ని స్వీకరించేవారు కాదు.   సాధారణంగా దేవాలయలో, మఠాలలో, ఆచార్య తిరుమాలిగలు మొదలైన వాటిలో సరైన వంట సూత్రాలను పాటించి చేసిన ప్రసాదాలకు మినహా ఇంకేవి తినేవారు కాదు.
  • ఇతర స్త్రీల గురించి ఆలోచించడంలో సమయాన్ని గడిపడం, ఇతర మహిళలపై అలాంటి ఆసక్తి కారణంగా సొంత భార్యను నిర్లక్ష్యం చేయడం ఒక అడ్డంకి. నీతివంతమైన సంతానం పొందాలనే ఉద్దేశ్యంతో సొంత భార్యతో సహవాసాన్ని సామాన్య శాస్త్రం (వేదం)  వివరించింది మరియు అంగీకరిస్తుంది (సొంత భార్యతో అటువంటి సహవాసానికి కూడా శాస్త్రంలో చాలా నియమాలు, నిబంధనలు ఉన్నాయి). కానీ ఇతర స్త్రీల సహవాసాన్ని శాస్త్రాంలో తీవ్రంగా ఖండించబడింది. అయినప్పటికీ,  శ్రీ వచన భూషణం వంటి సత్సాంప్రదాయ రచనలలో , సొంత భార్యను అనుభవించుటను కూడా తిరస్కరించబడింది – ఎందుకంటే ప్రాపంచిక భోగాలను (ఏ రూపంలోనైనా) అనుభవించుట జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి ప్రత్యక్షంగా వ్యతిరేకమైనది.   భగవాన్ ప్రీత్యర్థంపైన మాత్రమే మన దృష్టి ఉంచాలి.
  • ఇతరుల ఆస్తులను దొంగిలించడంలో సమయం గడపడం, సొంత ఆస్తులను దానం చేయకపోవడం ఒక అడ్డంకి. పేదలకు సహాయం చేయడం వంటి కొన్ని  కనీస దానధర్మాలలో పాల్గొనాలి.
  • జూదం ఆడటంలో సమయం గడపడం ఒక అడ్డంకి.
  • భగవాన్ గురించి కుతూహలంగా వివరాలు తెలుసుకోవడం , వారి మహిమలను రాయడం, వారి గురించి చదవడం, వారి గురించి వినడం, ఆరాధించడం మొదలైన వాటిలో సమయం గడపక పోవడం ఒక అడ్డంకి.
  • సరైన అనుష్టానాలతో ఇంట్లో ఉన్న ఎమ్పెరుమాన్ను ఆరాధించడంలో సమయం గడపక పోవడం, సాధ్యమైనప్పుడల్లా శ్రీవైష్ణవులకు సేవ చేయక పోవడం మరియు ఇతరుల ఇళ్లకు కేవలం ముచ్చట్లాడటంలో పాల్గొనడం మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
  • జీవనోపాధి కోసం తోటలు, పొలాలు  మొదలైనవాటిని నిర్మించి చూసుకోవడం, తద్వారా మన సమయాన్ని మరియు ప్రాథమిక అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం, వాటి పైన దృష్టి ఉంచాలి.
  • తోటలను సాగుచేసి చూసుకోవడం మొదలైనవి ఆచార్యులకు కైంకర్యంగా చేయాలి.  ఆచార్య కైంకార్యము అంటే ఆచార్యులను సంతోషపెట్టే భగవత్ కైంకర్యం అని మనం పరిగణించవచ్చు. ఉదాహరణకు, అనంతాళ్వారులు తమ ఆచార్యులైన ఎమ్బెరుమానార్ కోరిక మేరకు ఒక అందమైన ఉద్యానవనాన్ని నిర్మించి, కాపాడారు,  తిరువెంకటేశ్వర స్వామికి క్రమం తప్పకుండా పూలదండలు తయారుచేసి అర్పించేవారు. ఆచార్య తిరుమలిగకి కూడా పువ్వులు మొదలైనవి అర్పించాలి. అనువాదకుల గమనిక: భట్టార్ యొక్క శిష్యులైన నంజీయర్ ఒక తోటను నిర్మించారు. ఒకసారి భట్టార్ కుటుంబానికి చెందిన ఒకరు నంజీయర్ లేని సమయంలో తోటకి వచ్చి కొన్ని పువ్వులివ్వమని అడుగుతారు. తోట కాపలావాడు, తోట ఎమ్పెరుమాన్ కోసమని చెప్పి పువ్వులు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. నంజీయర్ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని ఆ వ్యక్తిని శిక్షిస్తాడు, తోట వారి ఆచార్యులైన భట్టర్ యొక్క ఆనందం కోసం మాత్రమే నిర్మించబడిందని, వారి (మరియు వారి కుటుంబం) నిత్యావసారాల కోసమని చెప్తారు. ఈ సంఘటన పిన్బళగియ పెరుమాళ్ జీయర్ యొక్క 6000 పడి గురుపరంప ప్రభావంలో కీర్తించబడింది.
  • ఆచార్య మరియు అచార్యుల తిరుమలిగై (నివాసం) యొక్క అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి – అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అచార్యుల శారీరక అవసరాలను చూసుకోవడం శిష్యుని బాధ్యత. ఆచార్యులను వారి అవసరాల కోసం పరుగులు తీయనివ్వకూడదు – ఆచార్యలు ఆధ్యాత్మిక అవసరాలపై దృష్టి పెట్టేలా శిష్యుడు పూర్తి సదుపాయాలు కల్పించాలి. అనువాదకుల గమనిక: ఈ సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు  శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రంలో వివరంగా చర్చించారు, మాముణులు తమ ఉపదేశ రత్నమాలలో ఆ యొక్క సారాన్ని వివరించారు.
  • సొంత కుటుంబాన్ని పోషించుకోవడంలో సమయం గడిపి, ఆచార్యుల కుటుంబాన్ని చూసుకోకపోవడం ఒక అడ్డంకి. ఆచార్యుల కుటుంబాన్ని మన సొంత కుటుంబంగా భావించి వారి అవసరాలను అందుకోవాలి.
  • సొంత శరీరాన్ని చూసుకోవడంలో సమయాన్ని గడిపి,  ఆచార్యుల తిరుమేనిని జాగ్రత్తగా చూసుకోకపోవడం. మాముణులు శిష్య లక్షణం గురించి వివరిస్తూ వారి ఉపదేశ రత్న మాల పాసురం 65లో ఇలా అన్నారు “తేసారుం సిచ్చన్ అవన్ సీర్వడివై ఆసైయుడన్ నోక్కుమవన్” – ఆధ్యాత్మిక అవగాహన ఉన్న శిష్యుడు వారి ఆచార్యుల తిరుమేనిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు.
  • కేవలం మన స్నానం చేయడంలో / శుభ్రతలో సమయాన్ని గడిపి శ్రీవైష్ణవుల స్నానంలో సహాయ పడకపోవడం మొదలైనవి. ఇది శ్రీవైష్ణవులకు అనేక విధాలుగా సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
  • ఖరీదైన ఆహారం (అధిక ఖరీదుగల పాలు, నెయ్యి మొదలైనవి) తిని, శ్రీవైష్ణవులకు అటువంటి ఖరీదైన ఆహారం అందించకపోవడం. మునుపటి వివరణకు సమానమైనది.
  • అధిక నాణ్యత గల బట్టలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటితో తనను తాను అలంకరించుకోవడంలో సమయాన్ని గడిపడం మరియు భగవాన్కు అర్పించిన చందనంతో తమను అలంకరించుకోకపోవడం, భగవాన్ ధరించిన పువ్వులు ధరించకపోవడం, భగవాన్ ధరించిన బట్టలు ధరించకపోవడం మొదలైనవి అడ్డంకులు. మనం  ఏది ఉపయోగించినా / వినియోగించినా, వాటిని మొదట భగవాన్ మరియు ఆచార్యలు వాడాలి / వినియోగించాలి – వారి ప్రసాదంగా మాత్రమే తీసుకోవాలి తినాలి.
  • ప్రాపంచిక వినోదాన్ని చూచుటలో సమయం గడపడం, భగవాన్ యొక్క దివ్య లీలలను ఆస్వాదించడంలో సమయం గడపకపోవడం ఒక అవరోదం. భగవాన్ని మాయన్ (అతి దివ్యమైన) అని పిలుస్తారు – వారి లీలలు (దివ్య  కార్యకలాపాలు) మన హృదయాలలో ఎంతో ఆస్వాదించదగినవి. ప్రాపంచిక సుఖాలలో సమయాన్ని వృథా చేయకుండా, భగవాన్ యొక్క అద్భుతమైన దివ్య లీలల గురించి చదవడంలో / వినడంలో మన సమయాన్ని గడపాలి.
  • దేవతాంతరాలను మహిమపరచడంలో  మరియు అర్ధంలేని మాటలు మాట్లాడటంలో సమయాన్ని గడపడం, ఆళ్వారుల (మరియు ఆచార్యల) దివ్య పాసురముల ద్వారా ఎమ్పెరుమాన్ని మహిమపరచడంలో సమయం గడపకపోవడం ఒక  అడ్డంకి.
  • పవిత్ర నదులలో స్నానానికై ప్రయాణం చేయడంలో సమయం గడపి, శ్రీవైష్ణవుల  శ్రీపాద తీర్థం (చరణామృతం – పాద పద్మాలను కడిగిన జలం) కోసం వెళ్ళకపోవడం అడ్డంకి. ఇక్కడ సాధారణ పవిత్ర నదులు గంగ మొదలైనవి. ఇవి చాలా మహిమగల నదులు. కానీ శ్రీవైష్ణ శ్రీపాద తీర్థం అతి పవిత్రమైనది. తిరువాయ్మొళిని కూడా తీర్థంగా కీర్తింస్తారు.  తిరువాయ్మొళి పాసురం 7.10.11 లోనే “తిరువాయ్మొళిలో బాగా ప్రావీణ్యం ఉన్నవారిని దేవతల చేత కూడా ఆరాధించబడతారు” అని చెప్పబడింది. ఈ వివరణతో ప్రారంభించి, ఈ క్రింద సామాన్య (ధర్మ) శాస్త్రం మరియు విశేష (భగవత్) శాస్త్రం  మధ్య వ్యత్యాసం నొక్కి చెప్పబడింది. సామాన్య శాస్త్రం అనుసరించాల్సిన అవసరం ఉంది. కానీ విశేష శాస్త్రం  మరింత సూక్ష్మమైనది. మన పెద్దల నుండి గ్రంథాల అధ్యయనం చేయడం ద్వారా, వారి పద్ధతులను గమనించడం ద్వారా దీన్ని సరిగ్గా నేర్చుకోగలుగుతాము.  ఇక్కడ కొన్ని సమయాల్లో సామాన్య శాస్త్రం  / అనుష్టానం యొక్క ప్రాముఖ్యత తగ్గినట్లు కనిపిస్తుంది. కానీ వాటిని పూర్తిగా వదులుకోవాలని కాదు. విశేష ధర్మం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చేసి చెప్పడమే దీని ఉద్దేశ్యం.
  • పుణ్య క్షేత్రాలను (కాశి, గయా మొదలైన) సందర్శించడం మరియు భగవత్ క్షేత్రాలని సందర్శించకపోవడం ఒక అడ్డంకి. కోయిల్ (శ్రీ రంగం), తిరుమల (తిరువేంకటం), పెరుమాళ్ కోయిల్ (కంచీపురం), తిరునారాయణపురం మొదలైనవి ఆళ్వారులకు మరియు ఆచార్యలకు ప్రియమైన ప్రత్యేక క్షేత్రాలు. ఈ సంధర్భంగా శ్రీరంగనాథుడు స్వయంగా ఎమ్పెరుమానార్ని జీవితాంతం శ్రీరంగంలో ఉండాలని ఆదేశించడాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు.
  • సాధారణ కావ్యం (కవిత్వం), నాటకం మొదలైన వాటిలో సమయం గడపడం, ఇవి సామాన్య వ్యాకరణం / చరిత్రలు మాత్రమే. భగవత్ కావ్యం (దివ్య కవిత్వం) అయిన శ్రీరామాయణంలో సమయం గడపకపోవడం ఒక అడ్డంకి. సాధారణంగా, సామాన్య కావ్యాలు జ్ఞానం పొందడానికి అధ్యయనం చేస్తారు. కానీ, శ్రీరామాయణం ఆది కావ్యం (మొదటి కవితా చరిత్ర) అంటారు. వాల్మీకీ ఋషి శ్రీరాముని జీవిత రచన  చేయడానికి దివ్య అనుగ్రహం/ఆశీర్వాదం పొందిన వారు. శ్రీరామాయణం విశేష శాస్త్రం (ప్రత్యేక గ్రంథం) గా కూడా మహిమపరచబడింది. అనువాదకుల గమనిక: శ్రీరామాయణం శారణాగతి శాస్త్రంగా కీర్తింపబడింది – ఇందులో అనేక శారణాగతులను వివరంగా చర్చించబడ్డాయి. మన పూర్వాచార్యులు అనేక సూత్రాలను స్థాపించడానికి వారి వ్యాఖ్యానాలలో శ్రీరామాయణాన్ని విస్తృతంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా నంపిళ్ళై శ్రీ రామాయణం యొక్క గొప్ప పండితులు. పెరియవాచాన్ పిళ్ళై శ్రీరామాయణంలోని అనేక ముఖ్యమైన శ్లోకాలకు సుదీర్ఘమైన/లోతైన వ్యాఖ్యానాలను వ్రాసారు. ఈ వ్యాఖ్యానాన్ని శ్రీ రామాయణ తనిశ్లోకం అంటారు.
  • ఇతిహాసాలు మరియు పురణాలను చదవడం / చర్చించడం మరియు అరుళిచెయల్ను (దివ్య ప్రబంధం) చదవడం / చర్చించకపోవడం. ఇతిహాసాలు (శ్రీ రామాయణం, మహాభారతం) మరియు పురణాలు (విష్ణు పురణం, శ్రీ భాగవతం మొదలైనవి) అధ్యయనం చేయాలి, కానీ అక్కడితో  ఆగకూడదు. ఆళ్వారులు మరియు వారి దివ్య ప్రబందాల మహిమలను అర్థం చేసుకోవాలి. వారి పూర్తి సమయాన్ని అందులో గడపాలి.  అనువాదకుల గమనిక: నంపిళ్ళై యొక్క కీర్తి అపరిమితమైనది. పెరియవాచాన్ పిళ్ళై (వీరిని వ్యాఖ్యాన చక్రవర్తి అని పిలుస్తారు), పెరియ తిరుమొళి 5.8.7 వ్యాఖ్యానంలో “ఓతువాయ్మైయుం”  పాసురంలో నంపిళ్ళై యొక్క కీర్తిని చాలా అందంగా వర్ణించారు. పెరియవాచాన్ పిళ్ళై వారి సొంత పదాలు ఇలా ఉన్నాయి: ముఱ్పడ ద్వయత్తైక్ కేట్టు, ఇతిహాస పురాణంగళైయుం అధికరిత్తు, పరపక్ష – ప్రతిక్షేపత్తుక్కుడలాగ న్యాయ మీమాంసైగళై అధికరిత్తు, పోతు పోక్కుం అరుళిచ్చెయలిలేయాంపడి పిళ్ళైయైప్పోలే అధికరిప్పిక్క వల్లనైయిరే ‘ఒరుత్తన్’ ఎన్బతుః. ఇక్కడ ఈ పాసురంలో, తిరుమంగై ఆళ్వార్  శ్రీక్రిష్ణుని ఆచార్యులైన సాందీపనిని కీర్తిస్తున్నారు. ఒక అచార్యుడు ఎలా ఉండాలో వివరించడానికి, పెరియవాచాన్ పిళ్ళై నంపిళ్ళై యొక్క లక్షణాలను కీర్తిస్తూ, వారు అనుసరించాల్సిన సరైన ఆచార్యులని చూపిస్తున్నారు. ఒక నిజమైన అచార్యుడు తన శిష్యులను పూర్తిగా విద్యావంతులను చేయగల నంపిళ్ళై లాగా ఉండాలని – మొదట ద్వయ మహామంత్రం యొక్క అర్ధాలను వినడం, తరువాత ఇతిహాసాలు మరియు పురణాలను, న్యాయ, మీమాంసాలు మొదలైనవి నేర్చుకొని తరువాత ఇతర సిద్ధాంతాలను అర్థం చేసుకొని మన స్వంత సిద్ధాంతమును స్థాపించడం. ఆళ్వారుల యొక్క దివ్య ప్రభాబంధాలను మరియు వాటి అర్ధాలను చర్చించడంలో ఎల్లప్పుడూ వారి సమయాన్ని గడపడం. అదేవిధంగా, తిరువాయ్మొళి పిళ్ళై, శ్రీ భాష్యంను నేర్చుకోవాలని ఒకసారి మాముణులను ఆదేశిస్తారు, కానీ తిరువాయ్మొళి మరియు వాటి వ్యాఖ్యానాల ప్రచారంలో తన పూర్తి జీవితాన్ని గడిపారు. మాముణులు తమ ఆచార్యుల ఆదేశాలను వెంటనే పాటించి,  చివరికి “ఈట్టు పెరుక్కర్” అనే పేరును పొందారు – తిరువాయ్మొళి కోసం నాంపిళ్ళై యొక్క ఈడు వ్యాఖానము విశదపరచినవారు.
  • పూర్వ పక్ష గ్రంథాలను విశ్లేషించడంలో సమయాన్ని గడిపి, సిద్ధాంత గ్రంథాలపై (తత్వశాస్త్రంపై)  తగినంత సమయం గడపకపోవడం అడ్డంకి. పూర్వ పక్ష గ్రంథాలు అంటే ఇతర తాత్విక పాఠశాలల సాహిత్యం. వాటిని నేర్చుకోవడం మరియు ఇతరుల వాదనల ముఖ్యాంశాలను అర్థం చేసుకోవడం అవసరం, తద్వారా మన సొంత సిద్ధాంతాన్ని స్పష్టంగా స్థాపించవచ్చు. కానీ నిరంతరం ఇతర సిద్ధాంత సాహిత్యాలను అధ్యయనం చేసి మన సాంప్రదాయ సిద్ధాంతాలను విస్మరించడం గొప్ప తప్పు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఘోషించే మన ఎమ్పెరుమానార్ దర్షనంలో మనం మునిగిపోవాలి. అనువాదకుల గమనిక: శ్రీ రామానుజులు యదవ ప్రకాశుల వారి దగ్గర  పూర్వ పక్ష అధ్యయనం చేసారని మనం చూశాము – కాని చివరికి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి, యదవ ప్రకాశులను ఒప్పించి తమ శిష్యులుగా స్వీకరిస్తారు. కూరతాళ్వారులు (వారి బాల్యంలో) బాహ్య (వేదాన్ని ప్రమాణంగా అంగీకరించని వారు) గ్రంథ ఉపన్యాసం విని ఆ కారణంగా ఇంటికి ఆలస్యంగా చేరుకుంటారు, వారి తండ్రిగారు ఆళ్వానుకి శ్రీపాద తీర్థాన్ని ఇచ్చి వారిని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
  • సదాచార్యు (నిజమైన ఆచార్యులు) లను సేవించకుండా కేవలం భగవాన్నిసేవించడంలో సమయం గడపడం ఒక అడ్డంకి. భగవాన్ పట్ల భక్తి మరియు కైంకర్యం (సేవ) ప్రారంభ స్థాయి. అదే ఆచార్యుల పట్లచేయుట అత్యున్నత స్థాయి. దీనిని మధురకవి నిష్ట (నమ్మాళ్వారుకి  పూర్తి శరణాగతులైన మధురకవి ఆళ్వారుల స్థితి) మరియు వడుగ నంబి పడి (నిరంతరం ఎమ్బెరుమానార్లను సేవించిన వడుగ నంబి యొక్క స్థితి) గా కీర్తింపబడింది. దీనిని ఉపదేశ రత్న మాల పాసురం 60 నుండి 66 లో మాముణులు అందంగా వివరించారు. అనువాదకుల గమనిక: దయచేసి ఆచార్యనిష్టను క్లుప్తంగా అర్థం చేసుకోడానికి,   అంతిమోపాయ నిష్ట (https://granthams.koyil.org/anthimopaya-nishtai-english/, చరమోపాయ నిర్ణయాన్ని (https://granthams.koyil.org/charamopaya-nirnayam-english/) ఈ సూచికలలో చూడండి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/03/virodhi-pariharangal-19/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment