విరోధి పరిహారాలు – 25

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://granthams.koyil.org/2020/01/06/virodhi-pariharangal-24-telugu/ .

57. ప్రసాద విరోధి  – ప్రసాధంలో అవరోధాలు (పవిత్రమైన ఆహార పదార్థాలు )

శ్రీ రంగనాథును ప్రసాదంతో ఆండాళ్, కూరత్తాళ్వారులకు జన్మించిన  పరాశర భట్టార్‌, వేదవ్యాస భట్టర్

ప్రసాదం అంటే మొదట భగవాన్కు సమర్పించిన ఆహార పదార్థం అని అర్థం.  వంటగదిలో (తిరుమడప్పళ్లి) వండిన ఆహారాన్ని, పచ్చి పాలు, పండ్లు, బెల్లం మొదలైనవి ఒకసారి భగవానుకి అర్పిస్తే దాన్ని ప్రసాదం అంటారు. భగవాన్కు సమర్పించడాన్ని “కండరుళప్ పణ్ణతల్” అని తమిళ్ళో వివరించబడింది – దీని అర్థం ఏమిటంటే  భగవానుకి అర్పించబడినది అని అర్థం, తద్వారా భగవాన్ దయతో తన దివ్య దృష్టితో  శుద్ధి చేయబడినది.  ప్రసాద స్వీకారం అంటే ప్రసాదాన్ని స్వీకరించి తినడం అని అర్థం.  అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులు తినడానికి కేవలం ప్రసాదం మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యం. భగవానుడికి అర్పించని ఆహారాన్ని తినడం అంటే కొన్ని పాపాలను తినడం లాంటిదని అర్థం – దీనిని భగవత్గీత 3.13 లో శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. తిరువారాదనాన్ని యాగం అని, తిరువారాదనంలో సమర్పించబడిన ప్రసాదాన్నితినే ప్రక్రియను అనుయాగం అని పిలుస్తారు. శ్రీవైష్ణవులకు ఈ రెండు అంశాలు చాలా ముఖ్యమైనవి. ప్రసాదాన్ని మన పూర్వాచార్యులు ఎంతో గౌరవించేవారు. భగవత్ ప్రసాదాన్ని కూరత్తాళ్వారుల నివాసానికి పంపబడినప్పుడు, ఎమ్పెరుమాన్ దానిని పెద్ద ఊరేగింపుగా ఉత్సాహంతో  పంపారు. సాధారణంగా ప్రసాదం ఉన్న బుట్టను / పాత్రను చాలా గౌరవంగా భక్తితో తలపై పెట్టుకొని తీసుకువెళతారు. చత్రం, చామరం, మేళతాళాలు మొదలైన వాటితో ఊరేగింపుగా తీసుకువెళతారు. మరొక సంఘటనలో, భట్టార్కు ప్రసాదం ఇచ్చినప్పుడు, వారు ఆనందంతో స్వీకరించి, “యాం పెఱు సన్మానం” – ఇది మనకు లభించిన గౌరవం అని అంటారు. కాబట్టి, ప్రసాదాన్ని సరిగా గౌరవించాలి.  ఈ రోజుల్లో, చాలా మంది (శ్రీవైష్ణవులు కూడా) ప్రసాదంతో అజాగ్రత్తగా నిర్లక్షంగా వ్యవహరించడం కనిపిస్తుంది. కొందరు ప్రసాదాన్ని తీసుకొని నిరాసక్తిగా ఇతరులకు ఇచ్చేస్తుంటారు. కొందరు ప్రసాదాన్ని తీసుకొని ఆలయంలోనే వదిలేస్తుంటారు. ఇలాంటి వైఖరికి మానుకోవడం మంచిది. ఈ విభాగంలో, ప్రసాదం గురించి చాలా సూక్ష్మమైన విషయాలు చక్కగా వివరించబడ్డాయి.

  • లౌకికంగా ఉన్న గ్రామాలు / నగరాల దేవాలయాల నుండి ఎమ్పెరుమాన్ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం మరియు తినడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ప్రసాదమైనా కూడా, భౌతిక వ్యక్తులు వండినప్పుడు, పంచినపుడు దానిని వదులుకోవాలి. భౌతికవాదులు వండి వడ్డించినపుడు, వారు దానిని భౌతిక ఆలోచనలతో చేస్తారు, అలాంటి ప్రసాదం తినే వారిపై కూడా  ప్రభావం చూపుతుంది. అలాంటి ప్రసాదానికి దూరంగా ఉండటం మంచిది. గమనిక: ఇక్కడ మనం భౌతికవాదులం, కామని భావిస్తున్నాము – మనం భౌతికవాదులమై లౌకిక వ్యవహారాలలో పాల్గొంటున్నపుడు,  లౌకిక వాదులచే వండి వంచబడిన ఎమ్పెరుమాన్  ప్రసాదాన్ని తిరస్కరించడంలో అర్థం లేదు.
  • దివ్య దేశ ఆలయాలలో ఇవ్వబడిన ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడకపోవడం (అభిమాన స్థలాలు, ఆళ్వారులు / ఆచార్యుల అవతార స్థలాలు కూడా) ఒక అడ్డంకి. పంచిన వెంటనే తినాలి. అనువాదకుల గమనిక: ప్రసాదం తీసుకున్నప్పుడల్లా అది ఒకేసారిలో తినాలని వివరించబడింది. “ప్రసాద ప్రాప్తి మాత్రేణ భోక్తవ్య”  అని వ్యాఖ్యానంలో కూడా ఉదహరించబడింది. శ్రీరంగంలో తిరువారాదనం ఆట ఆడుకుంటున్న పిల్లలు, వారి ఆటలో భాగంగా ఇచ్చిన ప్రసాదాన్ని ఎమ్పెరుమానార్ స్వీకరించడం మనం గుర్తుంచుకోవచ్చు.
  • దివ్య దేశ ప్రసాదాన్ని విశ్లేషించి తీసుకోవడం ఒక అడ్డంకి. ఇది ఎలా తయారు చేయబడింది, ఎవరు తయారుచేశారు, మొదలైనవి ఆరా తీయకుండా తినాలి.
  • ఉపవాసం కారణంగా ప్రసాదాన్ని తిరస్కరించడం ఒక అడ్డంకి. ఏకాదసి మొదలైనవి, శాస్త్రంలో సూచించినవి అయినప్పటికీ, దివ్య దేశ ఆలయాలల్లో ప్రసాదం ఇచ్చినప్పుడు, కనీసం కొంచెం తీసుకొని గౌరవించాలి. భగవత్ ప్రసాదాన్ని తిరస్కరించడం అంటే అవమానించడం అని అర్థం. అనువాదకుల గమనిక: శాస్త్రంలో నిర్దేశించినట్లుగా ఏకాదసి, పితృ తర్పణం, గ్రహణం మొదలైన కొన్ని రోజులలో / సమయాల్లో ఉపవాసం చేయాలి – అలాంటి ఉపవాసాలు తప్పనిసరి. కొన్ని సమయాల్లో, ఆ ఉపవాస సమయాల్లో మనకు భగవత్ ప్రసాదం ఇస్తున్నపుడు ప్రసాదాన్ని గౌరవించటానికి కొంచెం పరిమానంలో తీసుకోవాలి.
  • ప్రసాదం తిన్న తరువాత ఆచమనం మొదలైనవి చేసి శుద్ధి చేసుకోవాలనుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: సాధారణంగా మనం ఏదైనా తిన్న తరువాత చేతులు, కాళ్ళు కడుక్కోవడం, ఆచమనం (3 సార్లు నీటిని త్రాగి  అచ్యుత, అనంత, గోవింద అని భగవన్నామాలను జపిస్తాము) మొదలైనవి చేస్తాము. కాని ఆలయాల్లో ప్రసాదం తిన్నపుడు మన చేతులు ఎంగిలి కానంతవరకు, నోటికి పెదాలకు తాకనంతవరకు మనం కడుక్కోనవసరం లేదు. వాస్తవానికి, ప్రసాదం తిన్న తరువాత, మన చేతుల్లో కొంచం ఎమైనా ప్రసాదం అంటి ఉంటే తలపై రాసుకోవచ్చు. (నూనె రాసుకోవడం మాదిరిగా).
  • స్వచ్ఛమైన భాగవత ప్రసాదాన్ని కలుషితమైనదని భావించడం ఒక అడ్డంకి. తొండరడిప్పొడి ఆళ్వారులు రాసిన తిరుమాలై 41వ పాసురంలో వివరించినట్లుగా, “పోనకం చెయ్తా చేడం తరువరేల్ పునితమన్రే” – భాగవతులు ఎవరైనా వారి ఆహార అవశేషాలను ఇస్తే, అది మనలను వెంటనే శుద్ధి చేస్తుంది. సాధారణంగా,  ఇతరులు మిగిల్చిన ఆహారాన్ని కలుషితమైనవి అని చెప్పి మనం తీసుకోము. భాగవత ప్రసాద సందర్భంలో మనకు అలాంటి ఆలోచనలు ఉండకూడదు.
  • ఆచార్య ప్రసాదాన్ని సాధారణమైనదని భావించడం ఒక అడ్డంకి. ఎంతో భక్తితో స్వీకరించాలి.
  • బహిరంగంగా అందరి ముందు ఆచార్య ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడక పోవడం ఒక అడ్డంకి.
  • ఆచార్యుల నోటికి తగిలినందున ప్రసాదం కలుషితమైందని భావించడం అడ్డంకి.
  • ఆచార్య ప్రసాదాన్ని తినడానికి రోజంతా ఆకలితో ఉండకపోవడం ఒక అడ్డంకి. ప్రతిరోజూ ఆచార్య ప్రసాదాన్ని ఎంతో ఆత్రుతతో తినాలి. ఈ సందర్భంలో , “మోర్ మున్నార్ ఐయర్” గా ప్రసిద్ది చెందిన పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ (మాముణుల ప్రసాద కాలంలో పెరుగన్నంతో భోజనం పూర్తి చేసిన తరువాత వారు అదే అరటాకులో పెరుగన్నంతో మొదలుపెట్టి తినేవారు) విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. “చిరోపాసిత సత్ వృత్తర్” అని కూడా పిలుస్తారు – చాలా కాలం పాటు మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ, సత్ వృత్తి (మంచి ప్రవర్తన), అంటే మాముణులు యొక్క ప్రసాద కాలం (అరటి ఆకు) – మాముణులు ప్రతిరోజూ ప్రసాదం పూర్తి చేసిన తర్వాత అదే అరటి ఆకులో భోజనంచేయడం. అది కూడా, మాముణులు పెరుగన్నంతో తన భోజనాన్ని పూర్తిచేశారు కాబట్టి, అతను తమ ఆచార్య రుచి ఆ ఆహారంలో వస్తుందని పెరుగన్నంతో ప్రారంభించేవారు, తరువాత రసం  అన్నం, సాంబారన్నం తినేవారు. ఈ పట్టార్ పిరాన్ జీయర్ మనకు శ్రీవాచన భూషణ దివ్య మీమాంసా భ్యాష్యాన్ని (పిళ్ళై లోకాచార్యుల యొక్క శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం యొక్క చాలా విసృత సంస్కృత వ్యాఖ్యానం)  మనకు అందించి ఆశీర్వదించారు.
  • భోగం ఎమ్పెరుమాన్  చేత స్వీకరించబడిందన్న సూచనలు లేనప్పుడు, అటువంటి ప్రసాదం తినడంలో తక్కువ ఆనందం కలిగి ఉండటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: సాధారణంగా అర్చావతార ఎమ్పెరుమాన్ నోటికి బదులుగా తన కళ్ళతో (వారి దివ్య దృష్టితో) భోగాన్ని ప్రసాదంగా మారుస్తారు. కాబట్టి, స్పష్టమైన సూచనలు ప్రసాదంలో  ఉండకపోవచ్చు. కానీ భోగ్యత్వ ప్రతిపత్తి  (భగవత్ ప్రసాదం తినడం పట్ల ఆనందానుభూతి) ఉండకూడదని కాదు.
  • ఆచార్యులు దయతో ప్రసాదాన్ని మనలకు ఆశీర్వదించినప్పుడు అది వెంటనే తినాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. మన పూర్వాచార్యుల జీవితాలలో, ఆచార్యులు స్వయంగా తమ శిష్యులకు వారి ప్రసాదంతో ఆశీర్వదిస్తున్న సంఘటనలను మనం చూస్తాము, తిరువాయ్మొళి పిళ్ళై తమ శేష ప్రసాదాన్ని మణవాళ మాముణులకు మరియు భట్టర్ తమ ప్రసాదాన్ని నంజీయర్కి ఇచ్చేవారు.
  • ఆచార్యులతో పాటు ప్రసాదం తినడం ఒక అడ్డంకి. ఆచార్యులు మొదట తినడం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి, ఆ తరువాత మాత్రమే తినడం ప్రారంభించాలి.
  • తమ ఆచార్యులు తినేటపుడు ప్రత్యక్షంగా చూసి ఆనందించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • పెరుమాళ్ ప్రసాద పాత్రలో నుండి ప్రసాదం లాక్కోవడం ఒక అడ్డంకి. ప్రసాదం ఎప్పుడూ వేరేవారి చేత పండి/వడ్డించబడాలి.
  •  సంబంధిత అధికారుల అనుమతి తీసుకోకుండా ప్రసాదం తీసుకోవడం అడ్డంకి.
  • సమర్పించాల్సిన భోగాన్ని, సమర్పించిన ప్రసాదాన్ని కలుషితం చేయడం ఒక అడ్డంకి.
  • సబ్రహ్మచారులను (ఆ ఆచార్యుల నుండి శిక్షణ పొందుతున్న ఇతర శిష్యులు) చూసుకోకుండా ఒంటరిగా ప్రసాదం తినడం ఒక అడ్డంకి. ప్రసాదాన్ని ఇతర శిష్యులతో పంచుకొని కలిసి తినాలి.
  • ప్రసాద కాలం  (ప్రసాదం ఉంచబడిన పాత్ర లేదా అరటి ఆకు) ను వదిలివేయ కూడదు, తద్వారా దానిని సంసారులు (లౌకిక వ్యక్తులు), నాస్తికులు (వేదం యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించనివారు), కుక్కలు మొదలైన వారు తాకవచ్చు. అలా చేయడం ఒక అడ్డంకి.
  • భగవత్ / భాగవత ప్రసాదం తినేటప్పుడు సిస్టాచారం (నేర్చుకున్న పెద్దల అభ్యాసం – పూర్వాచార్యులు) తెలియకపోవడం ఒక అడ్డంకి. ప్రసాదాన్ని మన పూర్వాచార్యులు చాలా భక్తితో ఆదరించేవారు మరియు తీసుకునేవారు. అలాంటి సూత్రాలను తెలుసుకోకపోవడం / పాటించకపోవడం అడ్డంకి.
  • ప్రసాదం పట్ల భక్తి లేకుండా నేలపై పడవేయడం, దానిపై అడుగు పెట్టడం మొదలైనవి  అడ్డంకులు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/06/virodhi-pariharangal-25/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment