శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
ఆళ్వాన్, భట్టర్, నాచ్చియార్ మరియు నంపేరుమాళ్
మునుపటి వ్యాసములో,
(https://granthams.koyil.org/2021/07/31/anthimopaya-nishtai-4-telugu/), మనము ఎంపెరుమానార్ల భగవద్ కృపను గమనించాము. మన పూర్వచార్యుల యొక్క అనేక సంఘటనలను గురించి ఈ వ్యాసములో తెలుసుకొందాము.
కూరత్తాళ్వాన్ కి పుత్రునిగా భట్టర్ జన్మించిరి. వారిని పెరియ పెరుమాళ్ స్వంత తనయునిగా దత్తత స్వీకరించి, వారిని పెరియ పిరాట్టితో కలిసి పెంచిరి. భట్టరు వారు మన సంప్రదాయమునకు ముఖ్యులు. ఒకసారి, ఒక బ్రాహ్మణ బాటసారి శ్రీరంగమునకు వచ్చి, భట్టరు వారి సభకు వెళ్ళిరి. వారితో “పశ్చిమ ప్రాంతమైన మేల్కొటే / తిరునారాయణ పురముకు చేరువలో, వేదాంతి అనే విద్వాన్ కలరు. వారి జ్ఞానము మరియు శిష్యులు మీకు సాటి అయినవారు” అని పలికిరి. “ఓహ్! అలాంటి విద్వాన్ వున్నారా?” అని భట్టర్ అడిగిరి. అవునని పలికి, ఆ బ్రాహ్మణుడు శ్రీరంగమును వీడి, వేదాంతి గారి పురమును చేరి, వారి సభకు చేరారు. వారు “వేదాంతి, ఇరు నదుల మధ్య ( శ్రీరంగము ) భట్టర్ అనే విద్వాన్ మీతో సరైన జ్ఞానము మరియు శిష్యులతో కలరు” అని తెలుపగా, వేదాంతి “భట్టర్ నాకు సమ ఉజ్జీలా? ” అని ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు “అవును, వారు శబ్ద, తర్క, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస మొ ॥లగు గ్రంధములలో దిట్ట”. అనిరి. దానికి వేదాంతి “ఇంతవరకు నా సమ ఉజ్జీలు లేరని భావించాను. అనేక మంది విద్వాంసులను ఓడించాను. ఆరు విజయ పలకలపై వున్నాను. అవి షడ్ దర్శనములు (ఆరు తాత్విక పాఠశాలలు – న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస).” కాని భట్టర్ నా కన్నా అన్నింటిలో దిట్ట అని ఈ బ్రాహ్మణుడు భావిస్తున్నాడే, అని వేదాంతి తలంచారు. ఆ బ్రాహ్మణుడు శ్రీరంగమునకు తిరిగి పయనమై, భట్టరును కలిసి, మీ గొప్పతనమును వేదాంతికి తెలియజేసానని చెప్పగా, “నా జ్ఞానము గురించి ఏమి తెలియజేసారు” అని అడిగిరి. దానికి ఆ బ్రాహ్మణుడు “మీరు శబ్దము, తర్కము మరియు వేదాంత సారముల యందు దిట్ట” అని తెలియజేసాను అనిరి. భట్టరు బదులిస్తూ, “ఓ బ్రాహ్మణవర్యా, మీరు అన్ని ప్రాంతాలకు పయనిస్తారు మరియు అనేక విద్వాంసులను కలుస్తారు కదా. నా విద్వత్తు మొత్తము మీకు తెలిసినను, నా వేదాంత జ్ఞానమును మాత్రమే తెలియజేసినారే” అనిరి. ఆ బ్రాహ్మణుడు “ఇంకను ఏమని చెప్పగలను, మీరు వేదాంత శాస్త్రము నందు నిష్ణాతులు గదా!” అనిరి. దానికి భట్టరు “నేను తిరు నెండుంతన్డగము (అనువాదకుని గమనిక: తిరుమంగై ఆళ్వార్ చే దివ్యముగా రచింపబడిన గ్రంధము. వేదాంత సారమును సుందరముగాను మరియు మన సంప్రదాయములోని అన్ని అంశములను బోధించిన రచన.) నందు నిష్ణాతుడనని” చెప్పవలసినది అని పలికిరి. వేదాంతిని శ్రీవైష్ణవము లోనికి రప్పించుటకై, భట్టరు తలంచారు. (అనువాదకుని గమనిక : గురుపరంపర ప్రాభవములోని 6000 వ పడి గుర్తించినటుల, ఎంపెరుమానారే స్వయముగా వేదాంతిని సంస్కరించాలని తలంచినను, వారి వయో భారముచే పయనించలేక, భట్టరును ఆ కార్యానికై ఆదేశించారు.) భట్టరు పెరియపెరుమాళ్ళని కలిసి “పశ్చిమ ప్రాంతములో వేదాంతి అను మహా విద్వాంసుడు కలరు. అక్కడికి వెళ్ళి వారిని సంస్కరించుటకు, మీ అనుమతిని, ఆ కార్యములో విజయుడగుటను మరియు వారిని రామానుజ సిద్దాంతము నందు నాయకుడిని చేయుటకై మీ ఆశీర్వాదము కావలెనని” వేడుకొనిరి. భట్టరు కోరికను మన్నించుతూ, పెరుమాళ్ పితృ బాంధవ్యము వలన, తన స్వంత కైంకర్యపరులను కూడా వారితో కలిసి పంపించిరి .
భట్టర్, నంజీయర్
అనేక మంది శ్రీవైష్ణవులతో కూడి భట్టరు, వేదాంతి వున్న ప్రాంతానికి చేరుకొనిరి. వారితో వచ్చిన కైంకర్యపరులు భట్టరును కీర్తిస్తూ, ‘పరాశర భట్టర్’ ‘వేదాచార్య భట్టర్’ విచ్చేసినారని, అనేక వాయిద్యములను మ్రోగిస్తూ, వైభవముగా చాటించారు. వారు భగవానుని అనేక ఆభరణములను మరియు అందమైన దుస్తులను (పెరియపెరుమాళ్ ధరించినవి, వారి తనయులైనందు వలన) ధరించి వున్నారు. ఆ సమయములో అచ్చటి కొందరు బ్రాహ్మణులు వీరితో “మీరు ఎవరు? ఎచ్చటి నుండి విచ్చేసారు? మీరు మెరిసిపోతున్నారు? ఇచ్చట పండుగ జరుగుతున్నదా? ఎచ్చటకు వెళ్ళుతున్నారు?” అని ప్రశ్నించిరి. “నేను భట్టరును. వేదాంతితో చర్చకు వెళ్ళుచున్నాను” అనిరి. దానికి ఆ బ్రాహ్మణులు “మీరు ఇంత ఆడంబరముగా, ఉత్సాహముగా వెళ్లినచో, వారిని కలువలేరు. వారు తమ నివాసములోనే వున్ననూ, వారి శిష్యులు మీతో ఒకరి తరువాత ఒకరు చర్చకు దిగి, అనేక మాసములు చర్చించగలరు. చివరకు మీరు వారితో చర్చను వదులుకోవాలి ” అనిరి. భట్టరు తరుణోపాయము ఏమిటి అని అడుగగా, ఆ బ్రాహ్మణులు “వేదాంతి మిక్కిలి ధనవంతుడు. పేద బ్రాహ్మణులకు తన నివాసమునందే అన్న సంతర్పణ నిత్యము చేయును. మీ హడావిడి వదులుకొని, పేద బ్రాహ్మణునిగా ఒక్కరే వెళ్ళుడు” అనిరి. భట్టరు అంగీకరించి, పేద బ్రాహ్మణునిగా ఒక కాషాయ వస్త్రమును పైన కప్పుకొని, కమండలము చేబూని, అన్న సంతర్పణ జరుగు స్థలమునకు, ఇతర బ్రాహ్మణులతో కూడి చేరుకున్నారు.
వేదాంతి ఆ మంటపములో ఉన్నత ఆసనముపై ఆసీనుడై, అన్నార్తులై వచ్చిన బ్రాహ్మణులను ఆనందముతో గమనిస్తున్నారు. వారందరి నుంచి విడివడి, భట్టరు వేదాంతిని కలుసుకొనుటకై వెళ్ళిరి. వేదాంతి “కుమారా! నీవేల ఇచ్చటకు వచ్చితివి?” అని అడుగగా, భట్టరు “నేను భిక్షకై వచ్చితిని” అని అనిరి. వేదాంతి “అయినచో అన్న సంతర్పణ జరుగు స్థలమునకు వెళ్ళుము” అనిరి. భట్టరు “నాకు బిక్ష వలదు” అనిరి. వేదాంతి ఇతను పేదవానిగానే వున్నను, విద్వాంసుడు కావచ్చునని తలంచి, “మీకు బిక్షగా ఏమి కావలెను” అనిరి. వెంటనే భట్టరు “తర్క బిక్ష” అనిరి. (మీతో చర్చ కావలెను). అప్పుడు వేదాంతికి బాటసారి బ్రాహ్మణుని మాటలు స్ఫురణకు రాగా, ఇతను భట్టరు కావచ్చును. ఆతనికి తప్ప నా ముందుకు వచ్చి చర్చకు ఆహ్వానించే సాహసము వేరెవరికి లేదు అని తలంచిరి.” “నాతో చర్చకు ఎవరు రాగలరు? మీరు భట్టారేనా?” అని ప్రశ్నించిరి. భట్టరు “అవున ” అని పలికి, కమండలమును, కాషాయ వస్త్రమును విసర్జించి, శాస్త్రసారమును గంభీరముగా చర్చించుటను ప్రారంభించిరి. వెంటనే వేదాంతి ఆసనము నుంచి క్రిందకు దిగి, భట్టరు పాదపద్మములపై వ్రాలి, తనను అంగీకరించి, శుద్ధునిగా చేయమని ప్రార్ధించిరి. భట్టరు తన ఆశయము ఇంత త్వరగా నెరవేరినందులకు సంతోషించి, వేదాంతిని స్వీకరించి, వారికి పంచ సంస్కారములను గావించిరి. భట్టరు “ప్రియ వేదాంతి! మీకు అన్ని శాస్త్రములు విదితములు. వాని గురించి మీకు వివరించనక్కర లేదు. విశిష్టాద్వైతమే నిజమైన సిద్దాంతము. మీరు మాయావాదము పూర్తిగా వీడి, శ్రీమన్నారాయణుని పరమాత్మునిగా అంగీకరించుము మరియు రామానుజ దర్శనమునకు మార్గదర్శకులుగా మొదలు పెట్టుడు” అని పలికిరి. భట్టరు తిరుగు ప్రయాణమునకు సిద్ధము కాగా, వారితో వచ్చిన అందరు కైంకర్యపరులు (ఇంతవరకు బయటనే వేచి వున్నారు) వైభవముగా రాగా, భట్టరును దివ్య ఆభరణములు, దుస్తులతో మరల అలంకరించి, పల్లకీని అధిరోహింపజేసిరి. వారికి అనేక మంది చామరములతో, వింజామరలతో వీస్తూ వుండగా తిరుగు ప్రయాణమైరి. వారి సంపదను, శిష్యులను, వైభవమును తిలకించిన వేదాంతి, గద్గద స్వరముతో “మీరు విశిష్ట వ్యక్తులు. నేను చాలా అల్పుడను (మాయావధము బోధిస్తూ, భౌతికవాదుల కంటే అల్పుడనైతిని). కాని మీరు అనేక అరణ్యములు, పర్వతములు దాటి, దయతో ఇచ్చటకు వచ్చి, నా దుస్థితిని గమనించి, మిక్కిలి దయతో నన్ను స్వీకరించిరి.” అని మరల భట్టరు గారి పాదపద్మములపై బడినారు.
తదుపరి వేదాంతి, “పెరియ పెరుమాళ్ళు మీరు వేరు కాదు. వారి సౌందర్యమును, సున్నితత్త్వమును మీ ద్వారా మాకు దర్శనము చేయించిరి. భగవానుని ఆపన్నహస్తములను నేను అనంత కాలముగా అనుభవించక తప్పించుకున్నాను. నా అసహాయ స్థితిని చూసి, మీరు పేద బ్రాహ్మణుని రూపము ధరించి, అహంకార పూరితుడనైన నన్ను అంగీకరించినారు. నాపై దయతో మీరు ధరించిన ఈ రూపము ఊహకందనిది మరియు గమనించుట దుర్లభము”, అని మరల విలపించిరి. తదుపరి భట్టరు, వేదాంతిని పైకి లేపి, “నీవు ఇచ్చటనే ఆనందముగా నివసింపుమని” ఓదార్చి, శ్రీరంగమునకు పయనమైరి.
కొంత కాలము పిదప, ఆచార్యుని ఎడబాటును భరించలేక, వేదాంతి శ్రీరంగమునకు వెళ్ళవలెనని నిశ్చయించుకున్నారు. కాని వారి భార్యలు అడ్డుకొనగా, తన ఆస్తిని వారికి పంచుటకు నిశ్చయించుకున్నారు. తన సంపద మొత్తమును మూడు భాగములుగా చేసి, తన ఇరువురి భార్యలకు ఒక్కొక్క భాగమును పంచి, మిగిలిన భాగమును తన ఆచార్యునకు (భట్టరు) ఇచ్చుటకు శ్రీరంగమునకు పయనమైరి. శ్రీరంగమును చేరి, తన వంతు ఆస్తి మొత్తమును, ఎట్టి సంకోచము లేకుండా, భట్టరునకు సమర్పించిరి. వేదాంతి యొక్క కృతజ్ఞతకు, దీక్షకు మిక్కిలి సంతోషించిన భట్టరు “నం జీయర్ వందార్”, “మన జీయర్ వచ్చిరి” అని ప్రకటించి, వారిని ఆలింగనము చేసికొనిరి. నంజీయర్ని సదా తమ సహచరునిగా చేసికొని, వారికి అన్ని ముఖ్యమైన బోధనలను భట్టరు అనుగ్రహించిరి. భట్టరును నంజీయర్ సంపూర్ణముగా అంగీకరించి / ఆరాధించుతూ, మరి ఏ అన్య దేవతలను ఆరాధనకై తలంచలేదు. అప్పటి నుంచి వేదాంతిని భట్టరు “నంజీయర్” అని సంబోధించగా, వారు నంజీయర్ గా పేరుగాంచారు. మన జీయర్ (మామునిగళ్) ” నంజీయర్ శతవత్సరములు జీవించినారని, తిరువాయ్మొళికి నూరు మార్లు అర్ధమును బోధించి, శతాభిషేకము (తిరువాయ్మొళికి 100 మార్లు బోధించుటచే) చేసినారని పలికిరి.
నిత్యము భట్టరు సేవలో వుంటూ, వారి అనుమతితో నంజీయర్ తిరువాయ్మొళికి 9000 పడి అను వ్యాఖ్యానము అనుగ్రహించిరి. వారు తమ శిష్యులతో మీలో ఎవరైనను, ఈ వ్యాఖ్యానమునకు చక్కని వివరణ వ్రాయగలరా అని అడిగిరి. శిష్యులు “ఇక్కడ వరదరాజన్ అని వున్నారు. వారు అన్ని ప్రసంగాలను ఆలకిస్తున్నారు. వారు చక్కగా వ్రాయగలరు” అనినారు. తదుపరి నంజీయర్, వరదరాజన్ వారిని పిలచి నీ చేతి వ్రాత నమూనాను చూపమనిరి. వరదరాజన్ అంగీకరించి, చేతి వ్రాత చూపగా, చాలా అందముగా వున్నదని నంజీయర్ తలంచిరి. అయినను, ఈ వ్యాఖ్యానము తిరువాయ్మొళిపై గనుక, దీనిని మంచి అర్హత కలిగిన శ్రీవైష్ణవునిచే వ్రాయించవలెను గాని, క్రొత్తగా పంచ సంస్కారము పొంది, శ్రీవైష్ణవుని భౌతిక రూపము గల వ్యక్తి వలన కాదని తలంచిరి. నంజీయర్ గారి దివ్య తలంపును గ్రహించిన వరదరాజన్, తనకై తాను వారి ముందు మోకరిల్లి, “కృపతో నన్ను మీకు తృప్తి కలుగునటుల శుద్ధి చేయుము. మీ సేవకై వున్నాను” అనిరి.
నంజీయర్, నంపిళ్ళై
నంజీయర్ ఆనందముతో, వరదరాజన్ ను గుర్తించి, ఆశీర్వదించిరి. వారికి 9000 పడి వ్యాఖ్యానమును పూర్తిగా వివరించి, వ్రాయమనిరి. వరరాజన్ అంగీకరించి, తన స్వస్థలమునకు వెళ్లి, పని ముగించుకొని, తిరిగి నంజీయర్ వద్దకు రాగలననిరి. దీనిని నంజీయర్ అంగీకరించిరి. వరదరాజన్ తన గ్రామమునకు వెళ్ళుటకు, కావేరి నదిని ఈదుతూ దాటవలసివున్నది. ఒక వస్త్రములో ఆ గ్రంధమును మూట చుట్టి, తన శిరస్సుపై ధరించి ఈదుచుండగా, ఒక పెద్ద అల వచ్చి ఆ గ్రంధము కొట్టుకు పోయినది. వరదరాజన్ మిక్కిలి బాధపడి, ఇప్పుడు ఏమి చేయవలెనని చింతించిరి. అప్పుడు నంజీయర్ చే తనకు దివ్యముగా అనుగ్రహింపబడిన ఆ గ్రంధమును స్ఫురణకు తెచ్చుకొని, మరల వ్రాయుట నారంభించిరి. తమిళ భాషలో దిట్ట అయిన వరదరాజన్, ఆ గ్రంధమును వ్రాయుచు, దానిపై తగిన వివరణలను, గూడార్ధములను పొందుపరిచిరి. తదుపరి వారు నంజీయర్ ను చేరి, ఈ నూతన గ్రంధమును వారి పాదపద్మములకు సమర్పించిరి. నంజీయర్ గ్రంధమును చూసి, తాను మొదట వ్రాసిన దానివలె వున్నను, కొన్ని ప్రత్యేక విశ్లేషణలు, అర్ధములు కలవని గ్రహించి, అమితానందము పడిరి. “ఇది చాలా అద్భుతముగా వున్నది, కాని నేను వివరించిన దానికన్నా కొంత వ్యత్యాసముగా వున్నది. ఏమి జరిగినదని” అడిగిరి. వరదరాజన్ భయముతో మౌనముగానుండగా, నంజీయర్ “చింత వలదు, ఏమి జరిగెనో తెలుపుము” అనిరి. దానికి వరదరాజన్ “కావేరి నదిలో నిండుగా నీరు ఉండుటచే, ఆ గ్రంధమును నా శిరస్సుపై ధరించి, ఈదుచుండగా, ఒక పెద్ద అల వచ్చి ఆ గ్రంధము నీటిలో కొట్టుకుపోయెను. కాని మీ యొక్క కృపచే గ్రంధమును స్ఫురణకు తెచ్చుకొని మరల రచించినాను” అని పలికిరి. వారి జ్ఞాపకశక్తికి, తెలివితేటలకు నంజీయర్ అమితానందముతో, వారిని ఆలింగనము చేసికొనిరి. వారు వరదరాజన్ ను “మా ప్రియ పిళ్ళై తిరుక్కళ్ళికన్ఱి” అని ప్రకటించిరి. వారిని సదా తమ సహచరులుగాను మరియు వారికి అన్ని లోతైన గూడార్ధములను వివరించిరి. మన జీయర్ (మామునిగళ్) “ఏ రోజు నుంచి నంజీయర్, వరదరాజన్ ను “నంపిళ్ళై” అని పిలిచినారో, అప్పటి నుండి వారు నంపిళ్ళై గా ప్రసిద్ధి చెందినారు” అని పేర్కొన్నారు.
మన జీయర్ ఈ సంఘటనలను ఉపదేశరత్తిన మాలై 50 వ పాశురములో వివరించిరి.
నమ్పెరుమాళ్ నమ్మాళ్వార్ నంజీయర్ నమ్పిళ్ళై ఎన్బర్
అవరవర్ తమ్ ఏఱ్ఱత్తాల్
అన్బుడైయోర్ శాఱ్ఱు
తిరునామన్గళ్ తాన్ ఎన్ఱు నన్నెన్జే!
ఏత్తదనై చ్చొల్లి నీ ఇన్ఱు
సాధారణ అనువాదము: నంపెరుమాళ్, నమ్మాళ్వార్, నంజీయర్, నంపిళ్ళై వీరందిరికి “నం – మన” అను ముందుగా వచ్చు పదముతో మొదలగుటకు కారణము వారి విశిష్టమైన కీర్తియే. (ఇంకను ఇలా వివరించిరి – నంపెరుమాళ్ శఠగోపన్ ను నమ్మాళ్వార్ గాను, నంజీయర్ వరదరాజన్ ను నంపిళ్ళై గాను కీర్తించిరి). వారికి మిక్కిలి ప్రియులైనవారు, ఇట్టి ప్రియమైన నామములను వారికి ఒసంగినారు. ఓ, ప్రియమైన మనసా! ఇట్టి సంఘటనలను వారి నామములను వల్లిస్తూ, కీర్తించుము.
నంపిళ్ళై మహిమలు ఎంత గొప్పవనగా, “ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, స్కంధుడు మొ ॥ పదములను ఇంక నుంచి ఈ జగత్తులో నేర్వవలసిన పని లేదు. నంబూరు వరదర్ (నంపిళ్ళై) భవంతి నుంచి కొన్ని పదములను పట్టుకొనినచో (అవి ముత్యముల వంటివి) వారందరు భాగ్యవంతులే.”
అనువాదకుని గమనిక: నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టరు జీవిత చరిత్ర నుంచి ఈ విషయములను సులభముగా గ్రహించవచ్చును. వారు నంపిళ్ళై ప్రవచనముల నుండి గ్రహించిన రామాయణ శ్లోకమును వివరించుటచే, వారిని మహారాజుగారు విశేష సంపదలచే సత్కరించిరి. ఈ మొత్తము సంఘటనను మనము క్రింది లింకు ద్వారా చూడవచ్చును.
https://acharyas.koyil.org/index.php/2013/0/4/20/naduvil-thiruvidhi-pillai-bhattar/.
అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము భట్టరు వారి భగవత్ కృపకు పాత్రులై, శుద్ధిగావింపబడిన నంజీయర్ ను మరియు వారికి భట్టరు పై గల సంపూర్ణ ఆధారత్వమును, శరణాగతిని చూచినాము. నంజీయర్ మరియు నంపిళ్ళైల మధ్య వున్న అనుబంధమును, తద్వారా ఆచార్య / శిష్య లక్షణములు ఎంత సుందరముగా వ్యక్తీకరించబడినవో గమనించినాము.
అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు, బొమ్మకంటి, రామానుజ దాసన్.
మూలము: https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-5/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org