అంతిమోపాయ నిష్ఠ – 10

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/06/09/anthimopaya-nishtai-9-telugu/) నంపిళ్ళైల దివ్య మహిమల గురించి మనము తెలుసుకొన్నాము. ఈ వ్యాసములో మనము మరిన్ని సంఘటనలను ఎంపెరుమానార్ల వివిధ శిష్యుల ద్వారా తెలుసుకొందాము.

ఉడయవర్ల కాలములో ఒకసారి, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ అస్వస్థులైరి. కూరత్తాళ్వాన్ వారిని పరామర్శించుటకై వెంటనే వెళ్ళ లేదు. కాని 4 రోజుల తరువాత వెళ్లి పరామర్శిస్తూ “మీరు ఇన్ని రోజులు అనారోగ్యముతో ఎలా వున్నారు?” అని అడిగిరి. అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ “మన ఇరువురి మధ్య గల మిత్రత్వ స్థాయి తలంచి, నా అనారోగ్యము గురించి తెలిసిన వెంటనే మీరు వచ్చి నన్ను కలసి ఆశీర్వదించ గలరని భావించాను. కాని మీరు నన్ను పూర్తిగా విస్మరించుట, నన్ను అమిత బాధకు గురిచేసెను. నేను ఆళవందార్ల పాద పద్మములను ఆరాధించిస్తేగానీ నాకు స్వస్థత చేకూరదు” అని తెలిపిరి. ఈ సంఘటనను ‘పొన్ ఉలగు ఆళిరో’ (తిరువాయ్మొళి 6.8.1) అను పాశురము వ్యాఖ్యానములో స్పష్టముగా వివరించిరి. (అనువాదకుని గమనిక: ఇచట సందర్భము, ‘పొన్ ఉలగు ఆళిరో’ పాశురములో, నమ్మాళ్వార్ ఒక పక్షిపై పరిపూర్ణ విశ్వాసముతో ఎంపెరుమాన్ వద్దకు దూతగా పంపుటకు కారణము, ఆ పక్షికి ఎంపెరుమాన్ తో ఉన్న సాన్నిత్యము మరియు సమర్థత. కాని ఆ పక్షి వెంటనే ఆళ్వార్ కు సహకరించలేదు. అదే విధముగా, ఆళ్వాన్ కు ఎంపెరుమానునితో ఉన్న సాన్నిత్యము ద్వారా, తమను వెంటనే పరమపదమునకు పంపగలిగే సమర్థత ఉన్ననూ వారు తనను కలియుటకు జాప్యము చేసిరని, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ భావించిరి. ఇట్టి తమ భావన నయము కావలెననిన, తాము ఇప్పటికే పరమపదములో నున్న ఆళవందార్ల ముందు మోకరిల్లిన గాని తొలగదని అనిరి).

ఉడయవర్లు పరమపదము పొందిన తరువాత, వడుగనంబి కొంతకాలము సజీవులుగానే వున్నారు. కాని తరువాత వారు కూడా పరమపద ప్రాప్తి పొందారు. ఒక శ్రీవైష్ణవుడు భట్టరు వద్దకు వెళ్లి “వడుగనంబి పరమపదము నొందిరి” అని తెలిపిరి. భట్టరు “నీవు వడుగనంబి గురించి ఆ విధముగా అనరాదు” అనిరి. ఆ శ్రీవైష్ణవుడు “ఎందులకనరాదు? వారు పరమపదమును చేరినారు అనిన దోషమేమి?” అని అడిగిరి. భట్టరు వారు అద్భుతముగా సమాధానమిస్తూ, పరమపదము ప్రపన్నులకి మరియు ఉపాసకులకి (భక్తి యోగమును అవలంబించిన వారికి, వారి కృషిచే పరమపదము పొంద గలరు) సాధారణమైనది – కాని వడుగనంబి లక్ష్యం అది కాదు అనిరి. ఆ శ్రీవైష్ణవుడు “అయితే వడుగనంబి మనస్సులో వేరే ఇతర స్థానము ఉన్నదా?” అని అడిగిరి. జవాబుగా భట్టరు వారు “అవును, నీవు, వడుగనంబి ఎంపెరుమానార్ పాదపద్మములను చేరిరి, అని పలుకవలెను” అనిరి. మా ఆచార్యులైన (మాముణులు) దీనిని వివరించిరి. స్తోత్ర రత్నము ప్రారంభములో ఆళవందార్లు ఈ విధముగా ప్రకటించిరి ” త్ర పరత్ర చాపి నిత్యం యదీయా చరణం శరణం మదీయం” – (సంసారము మరియు పరమపదము రెంటిలో కూడా నేను నాధమునుల పాదపద్మములనే సేవించవలెను). రామానుజ నూఱ్ఱందాది 95 వ పాశురములో, తిరువరంగత్తు అముదనార్ ఈ విధముగా సాయించారు “విణ్ణిణ్ తలై నిన్ఱు విడలిప్పన్ ఎమ్మిరామానుజన్ మణ్ణిణ్ తలత్తుధిత్తు మరైనాళుమ్ వలరత్తననే” (పరమపదము నుంచి జీవాత్మలను మన రామానుజులు పరమపద కైంకర్యమే అంతిమ లక్ష్యము అని దీవించెదరు, ఈ సంసారములో జన్మించినపుడు, సంసారములోని దోషములు అంటకుండా, సరైన వేద శాస్త్రమును నిరూపించెదరు).

సర్వజ్ఞులైన అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్, కూరత్తాళ్వాన్ కుమారులైన భట్టరు, పరమాచార్యులైన ఆళవందార్లు, ఉడయవర్ల దివ్యమహిమలను సంపూర్ణముగా తెలిపిన తిరువరంగత్తు అముదనార్, కూరత్తాళ్వాన్ మొ ||, వీరందరూ ఆచార్య నిష్ఠ యొక్క మహిమలను స్పష్టముగా వివరించినవారు. ఈ సంసారము మరియు పరమపదము రెంటిలో కూడా సాటిలేని ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించుటయే శిష్యునికి అత్యావశ్యకము అని నిరూపింపబడినది, భగవానుని పాదపద్మములను ఆశ్రయించుట కంటే ఉత్తమమైనది. జితంతె స్తోత్రములో కూడా ఈ రెండు సమానమని ఈ విధముగా తెలిపిరి “దేవానాం ధనవాంఛ సామాన్యం అధిదైవతం” (అన్ని జీవులకు భగవానుడు ఒక్కడే). అందులకే మాముణులు, ఎంపెరుమానార్లతో “నీ పాదపద్మములను నేను ఎప్పుడు పొందగలను?”, “యతిరాజా! దయతో నాకు సదా మీ సేవ చేసే భాగ్యము పొందజేయుడు” అనిరి.

మన జీయర్ ఈ క్రింది సంఘటనను వివరించిరి. ఒకసారి ఒక శ్రీవైష్ణవుడు ప్రసాదమును స్వీకరిస్తుండగా కిడాంబి ఆచ్చన్ జలాన్ని వడ్డించుతున్నారు. కాని వారు ఎదురుగా ఉండి అందించకుండా, ప్రక్కన నిలబడి ఇచ్చుట వలన, ఆ శ్రీవైష్ణవుడు తన కంఠమును ప్రక్కకు తిప్పి అందుకొన్నారు. ఇది గమనించిన ఉడయవర్లు, కిడాంబి ఆచ్చన్ ను వెనుక నుంచి తట్టి “మనము శ్రీవైష్ణవులకి అత్యంత శ్రద్దతో సేవ చేయవలెను” అనిరి. ఆ మాటలు వినిన కిడాంబి ఆచ్చన్ హర్షాతిరేకముతో “మీరు నాలోని లోపాలను తొలగించుచున్నారు, ఇంకను అధిక సేవ చేయుటకై ప్రోత్సహించుచున్నారు. నేను మీకు సదా కృతజ్ఞుడను” అని తమ కృతజ్ఞతను తెలియ జేసిరి.

మాణిక్క మాలైలో, పెరియ వాచ్చాన్ పిళ్ళై ఈ క్రింది సంఘటనను తెలిపిరి. ఒకసారి ఆళ్వాన్ పై ఆగ్రహం చెందిరి. అక్కడ వున్న కొందరు ఆళ్వాన్ తో “ఉడయవర్లు మిమ్ములను విస్మరించి పక్కన పెట్టినారు కదా. మరి మీరు ఇప్పుడు ఏమి తలంచుచున్నారు?” అని అడిగిరి. సమాధానముగా ఆళ్వాన్ “నేను శ్రీభాష్యకారులకు పరిపూర్ణ విధేయుడను, వారి ఆజ్ఞ మేరకు ఉండగలను – చింతింపనవసరము లేదు” అని బదులుచ్చెను.

ఈ క్రింది సంఘటన వార్తామలైలో వివరించబడినది. ఒకసారి పిళ్ళై ఉరంగవిల్లి దాసర్, ముదలిఆణ్డాన్ వద్దకు వెళ్లి వారి పాదపద్మములకు ప్రణమిల్లి “ఆచార్యుని వద్ద శిష్యుని ప్రవర్తన ఏ విధముగా ఉండవలెను?” అని అడిగిరి. ఆణ్డాన్ “ఆచార్యుని కొరకై శిష్యుడు పత్నివలె, శరీరము వలె, ఒక విశిష్ట గుణము వలె నుండవలెను – అనగా పతి ఆజ్ఞ పాలించు పత్నిలాగా, శరీరము ఆత్మకు అవసరమైనవి సమకూర్చునట్లు, లక్ష్య సాధనే ధ్యేయంగా గల గుణము” అని అనిరి. తదుపరి, పిళ్ళై ఉరంగవిల్లి దాసర్ ఆళ్వాన్ వద్దకు వెళ్లి” ఒక ఆచార్యులు తమ శిష్యులతో ఏ విధముగా ఉండవలెను?” అని అడిగిరి. జవాబుగా ఆళ్వాన్, శిష్యుని కొరకై ఆచార్యులు ఒక పతి వలె, ఆత్మ వలె మరియు లక్ష్యము వలె – అనగా పత్నికి స్పష్టమైన ఆదేశములు ఇచ్చు పతివలె, శరీరమును నియంత్రించగల ఆత్మ వలె, లక్ష్యమును సాధించు గుణము వలె” నుండవలెను అనిరి.

ఒకసారి కూరత్తాళ్వాన్ మరియు ముదలియాణ్డాన్ మధ్య దైవ సంబంధ విషయములపై సాగుచున్న చర్చలో “సానువృత్తి ప్రసన్నాచార్యులు (శిష్యులను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసి, తదుపరి వారికి దివ్య జ్ఞానమును ప్రసాదించువారు) లేక కృపామాత్ర ప్రసన్నాచార్యులు (శిష్యుల నిష్కామమైన కోరిక ఆధారముగా, దివ్య జ్ఞానమును ప్రసాదించు ఆచార్యులు), వీరిలో అంతిమ ధ్యేయమైన మోక్షము ఎవరి వలన లభించును” అని చర్చించిరి. ఆణ్డాన్ “సానువృత్తి ప్రసన్నాచార్యుల వలననే మోక్షము లభించును” అనిరి. కాని ఆళ్వాన్ “మనకు మోక్షము కృపామాత్ర ప్రసన్నాచార్యుల ద్వారానే లభించును” అనిరి. ఆణ్డాన్ వివరిస్తూ, పెరియాళ్వార్ “కుఱ్ఱమిన్ఱి గుణం పెరుక్క గురుక్కలుక్కు అనుకూలరే (మనలోని లోపములను తొలగించుకొని, ఆచార్యునికి అనుకూలముగా ప్రవర్తించ వలెను) అని తెలిపారు, మనము కూడా ఆ విధముగానే చేయవలెను, అనిరి. ఆళ్వాన్ “అది సరి కాదు”, కారణము మధురకవి ఆళ్వార్ ఈ విధముగా తెలియజేసిరి, “పయనన్ఱాగిలుం, పాఙ్గల్ల రాగిలుమ్, శెయల్ నన్ఱాగ, త్తిరుత్తిప్పణి కొళ్వాన్, కుయిల్ నిన్ఱార్ పొళిల్ శూళ్, కురుగూర్ నమ్బి” (చుట్టూ ఉద్యానవనములతో కూడి ఉన్న ఆళ్వార్ తిరునగరిలో నివసించుచున్న నమ్మాళ్వార్, మనకు యోగ్యత లేకపోయినను, సరియైన జ్ఞానము లేకపోయినను కూడా, మనను శుద్ధిచేసి, వారి సేవలో వినియోగించగలరు). ఈ ప్రయత్నమును మనము స్వయముగా చేయరాదు, అంతిమ లక్ష్యమైన మోక్షమును పొందుటకై ఆచార్యుని కృపపైననే ఆధారపడవలెను. ఇది వినిన ఆండాన్ మిక్కిలి సంతసించిరి. ఈ సంఘటనను మా ఆచార్యులు (మాముణులు) వివరించిరి.

కిరుమికండన్ (ఒక శైవ రాజు) కారణమును ఉదహరిస్తూ, తమ దివ్య కృపచే ఉడయవర్లు తిరునారాయణపురమునకు పయనమైరి. ఆ కారణముగా, అక్కడ (శ్రీరంగము) కోవెల కైంకర్యపరులు ఆవేదన చెందుతూ, “మాకు వచ్చిన ఇక్కట్లకు ఉడయవర్లే కారణమని భావించి, ఉడయవర్లతో సంబంధమున్న వారెవరికీ, ఈ కోవెలకు ప్రవేశము లేదు” అను ఆదేశమును ప్రకటన చేసిరి. కూరత్తాళ్వాన్ మన సిద్ధాంతమును నిలబెట్టుటకై కిరుమికండన్ సభకు వెళ్లి, అచ్చట తమ నేత్రములను కోల్పోయిరి. తిరిగి శ్రీరంగమును చేరిరి. కోవెలలో జరిగిన పై సంఘటన వారికి తెలియనందువల్ల, పెరియ పెరుమాళ్ ఆరాధనకై, వారు కోవెలకు వెళ్లిరి. ఆళ్వాన్ను అక్కడ ఒక ద్వారపాలకుడు అనుమతించలేదు. కాని మరియొక ద్వారపాలకుడు ఆళ్వాన్ను మీరు కోవెలకు వెళ్లవచ్చుననిరి. వీరిరువురి భిన్న అభిప్రాయములను ఆలకించిన ఆళ్వాన్ ఆశ్చర్యముగా “ఇక్కడ ఏమి జరుగు చున్నది?” అని అడిగిరి. దానికి వారు “ఎంపెరుమానార్లతో సంబంధము ఉన్న వారెవరిని కోవెలలోనికి ప్రవేశింప జేయరాదని మాకు ఆదేశము ఇచ్చిరి” అనిరి. ఆళ్వాన్ “అయినచో నన్ను కోవెలలోనికి ఏల అనుమతించుచున్నారు” అని అడిగిరి. వారు “మీరు ఇతరుల వలె కాదు, మంచి సహృదయులు మరియు ఆత్మ గుణవంతులు. కావున అనుమతించుచున్నాము” అనిరి. ఇది విన్న ఆళ్వాన్ ఉలిక్కిపడి నీటిలో కనిపించు చంద్రుని వలె (సదా కదులుతూ ఉండును కదా) వణికిరి. వారు కొంత వెనుకంజ వేసి “శాస్త్రము ప్రకారము ఆత్మ గుణములు ఆచార్యుని సంబంధమును వృద్ధి చేయును; కాని ఇక్కడ నా విషయములో ఆత్మ గుణములు ఎంపెరుమానార్లతో నాకు గల సంబంధమును వదలి వేయునట్లుగా చేయుచున్నది” అని మిక్కిలి బాధతో పలికిరి. ఇంకను వారు “నా వరకు, ఎంపెరుమానార్ల పాదపద్మములే నా అంతిమ లక్ష్యము చేరుటకు సరిపోవును; ఎంపెరుమానార్లతో సంబంధమును వదులుకొని నేను పెరుమాళ్ళను ఆరాధించలేను” అని పలుకుచూ ఎంపెరుమాన్ ఆరాధన చేయకుండా తమ తిరుమాళిగైకు (నివాసము) వెడలిరి. ఈ సంఘటనను మన జీయర్ వివరించిరి.

తిరువిరుత్తమ్ వ్యాఖ్యానములో ఆళవందార్లు, ఎంపెరుమాన్ తమ అపార కరుణచే వారే స్వయముగా నమ్మాళ్వార్లుగా దర్శనమిచ్చిరి అని పేర్కొనిరి. అళగియ మణవాళ నయనార్ తమ ఆచార్య హృదయములో నమ్మాళ్వార్లే కలియుగము చతుర్ధ వర్ణములో అవతారము దాల్చిరా, వీరే పూర్వము అత్రి, జమదగ్ని, దశరధుడు, వాసుదేవుడు / నందగోపాలుడు మొ || వారి కుమారులుగా, బ్రాహ్మణ / క్షత్రియ / వైశ్య వర్ణములలో పూర్వపు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర యుగములు) జన్మించినారా అని ఆశ్చర్యచకితులైరి. (అనువాదకుని గమనిక: ఆళ్వార్ల మహిమలు మనకు వారు ఎంపెరుమానుని అవతారమా అను భావన కలుగజేయును, కాని పూర్వాచార్యులు వివరించినట్లు వారు అలా కాదు. కాని ఇక్కడ విషయము ఎంపెరుమాన్ తానే స్వయముగా ఆచార్యుని రూపముగా, అదియే అన్నిటికన్నా అత్యున్నత స్థితి అని ఋజువు చేయుచున్నారు.

అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము శ్రీరామానుజుల వివిధ శిష్యుల నిష్టను గమనించితిమి. వారు ఏ విధముగా శ్రీరామానుజులపై సంపూర్ణముగా ఆధారపడినారో వ్యక్తమైనది.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-10/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment