అంతిమోపాయ నిష్ఠ – 11

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/06/19/anthimopaya-nishtai-10-telugu/), మనము శ్రీరామానుజుల శిష్యుల దివ్య మహిమలను గమనించితిమి. ఇప్పుడు మరికొన్ని సంఘటనలను (ప్రధానముగా ఎంబార్ యొక్క నిష్ఠ గురించి) తెలుసుకొందాము.

ఎంపెరుమానార్ – ఎంబార్

ఎంబార్ (గోవిందర్) వట్టమణి కులంలో (ఒక ప్రత్యేక కుటుంబ పరంపర) జన్మించిరి. వారు మంచి జ్ఞానులు, గొప్ప వైరాగ్యపరులు, యుక్త వయస్సు నుండే అనుష్టానములు సక్రమముగా చేసినవారు. ఆ కాలములో వారు శివ భక్తులుగా వుంటూ, శైవ ఆగమములో ప్రవేశించి, రుద్రాక్ష మాల ధరించి కాళహస్తిని చేరిరి. అక్కడ వారు ప్రధాన అర్చకులుగా వుంటూ, శివుని ఆలయమును నిర్వహించుచుండిరి. వారి హస్తములో దండములు/పత్రములు (శివునికి ప్రియమైనవి) ధరించి, తమిళ భాషలో వారికున్న పటుత్వము వలన సదా శివ కీర్తనలను ఆలపించెడివారు. ఆ సమయములో తిరుమల నుంచి పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణులు) ఒక ప్రత్యేక కార్యము (గోవిందర్ ను సంస్కరించుటకై) పై కాళహస్తిని చేరిరి. వారు వారి శిష్యులతో కలసి వృక్షముల చెంత (అడవి) కూర్చుని చర్చ ప్రారంభించిరి. అదే సమయంలో రుద్రునికి పుష్పములు కోయుటకై అచటికి ఎంబార్ వచ్చి, తిరుమలనంబి గారు కూర్చున్న ప్రక్కనే ఉన్న ఒక వృక్షమును ఎక్కనారంభించిరి. ఎంబార్ స్థితిని గమనించిన తిరుమల నంబి వారిపై బాధతో, “ఈ జీవాత్మ (ఎంబార్) ఒక మంచి విద్వాంసుడు, వైరాగ్యపరుడు. అల్పమైన వానిపై జీవాత్మకు ఉండకూడని భక్తిని వదిలించుకొని, జీవాత్మకు సముచిత గురువైన శ్రీమన్నారాయణునిపై భక్తి పట్ల మరలించిన, ఈ జగత్తునకు ఎంతో ప్రయోజనము చేకూరును” అని తలంచిరి. అప్పుడు వారు ఎంబార్ పుష్పములు కోయుచున్న వృక్షము వద్దకు వెళ్లి, శ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడు అని నిరూపించు వేదములలోని కొన్ని పద్యములను శిష్యులకు వివరించిరి. తిరుమల నంబిగారి దివ్య వివరణను ఆలకించిన ఎంబార్, తాను ఆలయములో చేయు సేవలను, పుష్పములను కోయుటను కూడ మరచి, అమిత పారవశ్యముతో అచ్చటనే చాలా సమయము గడిపిరి.

ఎంబార్ అనుకూల ప్రవర్తనను, ఆసక్తిని గమనించి, నంబి “నమ్మాళ్వార్ల దివ్య శ్రీ సూక్తుల నుండి ఒక పాశురమును వివరించుట ద్వారా వారి మనస్సును శుద్ధి చేయగలము” అని తలంచి, తిరువాయ్మొళి (2.2.4) పాశురమును విశ్లేషణాత్మకముగా వివరించుట ప్రారంభించిరి.

తేవుమ్ ఎప్పొరుళుమ్ ప్పడైక్క
పూవిల్ నాన్ముకనై ప్పడైత్త
తేవన్ ఎమ్బెరుమానుక్కల్లాల్
పూవుమ్ పుశనైయుమ్ తకుమే?

సాధారణ అనువాదము: వ్యష్ఠి సృష్టి అనగా అన్ని జీవులను మరియు ఇతర అంశాలను సృష్టించుటకై ఎంపెరుమాన్ బ్రహ్మను సృష్టించెను. (మొదటగా భగవానుడు తానే స్వయముగా సమిష్టి సృష్టి గావించెను – పంచభూతములను సృష్టించుట, పరోక్షముగా బ్రహ్మ ద్వారా వ్యష్ఠి సృష్టి గావించెను). కావున, ఎంపెరుమాన్ కాకుండా పుష్పములచే, పూజలచే ఆరాధనలను అందుకోగలిగిన యోగ్యులు వేరొకరెవరైనా ఉన్నారా? (ఇతరులెవరూ యోగ్యులు కాదు అని భావము).

అది విన్న ఎంబార్, తమిళములో మంచి ప్రతిభ కలిగి ఉండుటచే, ఒక్కసారిగా పుష్పముల బుట్టను జారవిడిచి, వృక్షముపై నుండి క్రిందకు దిగి, “లేదు! లేదు! ఇంతవరకు నేను, తమోగుణ పూరితుడైన ఈ దేవుని స్నానమునకై జలమును తెచ్చుట మొ || సేవలు ఒనరిస్తూ, నా జీవితమును వ్యర్ధము చేసుకొంటిని” అని పలుకుచూ తిరుమల నంబి పాద పద్మములపై బడిరి. నంబి, తమ లక్ష్యము నెరవేరినదని సంతసించి, ఎంబార్ కు స్నానమాచరించి, శుద్ధి పొందమని ఆదేశించిరి. ఎంబార్ తన రుద్రాక్షమాలను పారవేసి తమ పాషండ వేషమును తొలగించి, స్నానమొనరించి, తడి వస్త్రములతో నంబి వద్దకు, వారిని తమ ఆచార్యులుగా పొందు గొప్ప కోరికతో, చేరిరి. వారిని గాంచి మిక్కిలి సంతసించిన నంబి, వెను వెంటనే వారికి పంచ సంస్కారములు గావించి, త్యజించుట (ఏమి వదలి వేయవలెనో) మరియు ఉపాధ్యేయము (ఏమి అంగీకరించవలెనో) స్పష్టముగా వివరించి, “భగవానునితో సంబంధము తప్ప మిగిలిన ఇతర అన్ని విషయములను త్యజించమని, శ్రీమన్నారాయణుని వదలక ఆశ్రయింపుమని, మన కలయికపై విశ్వాసము వుంచమని” ఆదేశించిరి. ఎంబార్ కృతజ్ఞతతో అంగీకరించి, నంబితో కలిసి తిరుమలకు పయనమైరి.

అదే సమయమున, కాళహస్తిలోని అనేక పాషండులు అచటకు వచ్చి ఎంబారుతో “మీరు మా ప్రధానులు, కావున మీరు మమ్ములను వీడరాదు” అని ప్రార్థించిరి. కొంచెము దూరము నుంచే సమాధానమిచ్చుచు ఎంబార్ “మీ దండములు మరియు పత్రములు మీరే ఉంచుకొనుడు; ఇంక నేను ఈ స్మశానములో ఉండలేను” అనిరి. లంకపై ఎట్టి అనుబంధము లేకుండా వదిలి వేసిన సీతా పిరాట్టి వలె, పరమపదము చేరుటకై ముక్తాత్మలు అర్చిరాది మార్గము వైపు మనలోని అంతర్యామి సూచన వలన పయనమగునట్లు, తిరుమల నంబి మార్గ దర్శకత్వములో, భూలోక వైకుంఠముగా భావింపబడు తిరుమలకు, ఎంబార్ చేరి, తిరుమల నంబికి మిక్కిలి విశ్వాసపాత్రుడై, సదా సేవ చేయుచు అక్కడ నివసించసాగిరి.

ఉడయవర్ తిరుమలకు చేరి, తిరుమల నంబి వద్ద శ్రీ రామాయణములోని ప్రధాన సూత్రములను అభ్యసించి, శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమునకు సన్నద్దులైరి. శ్రీ రామానుజులను ఒక ప్రత్యేక అవతారముగా భావించి, వారిని ఆళవందార్ రూపముగా దర్శించిన తిరుమల నంబి, తమ కుమారులకు ఉడయవర్లను ఆశ్రయించమని తెలిపి, వారితో “నేను మీకు ఇంకా విలువైనది ఇవ్వదలచితిని” అనిరి. ఎంబార్ కు తమ ఆచార్యునిపై గల నిష్ఠను గమనించిన ఉడయవర్లు, ఎంబార్ ను తమతో శ్రీరంగమునకు పంపి, ఆశీర్వదించమని నంబిని కోరిరి. వారి అభ్యర్ధనను నంబి సంతోషముగా అంగీకరించి ఉదక తర్పణము (శుద్ధ జలమును దానమునకు వినియోగించి వ్యవహారమును పూర్తి చేయుట) గావించి, ఎంబార్ ను వారికి ధారపోసిరి. ఉడయవర్లతో కలిసి ఎంబార్ పయనమైరి. 4 / 5 రోజుల ప్రయాణము తరువాత, వారు తమ ఆచార్యులైన నంబిని వీడినందువలన, విచారవదనముతో నుండిరి. ఉడయవర్ వారితో “మీరు ఏల విచారముతో నున్నారని” అడిగిరి, “మీ ఆచార్యుని ఎడబాటు వల్లనైతే, మీరు తిరిగి తిరువేంగడమునకు వెళ్లవచ్చును” అనిరి. తిరుమలకు ఎంబార్ సంతోషముగా తిరుగు ప్రయాణమై, 4 / 5 రోజుల పిదప, తిరుమల నంబి తిరుమాళిగను (గృహము) చేరి వారి పాద పద్మములపై బడిరి. నంబి ఎంబార్ తో “నేను ఉదక తర్పణము గావించి, మిమ్ములను ఉడయవర్లకు ధారపోసితిని కదా! మీరు మరల ఏల ఇచటకు వచ్చిరి?” అని అడిగిరి. ఎంబార్ సమాధానముగా నేను మీ ఎడబాటును భరించలేక తిరిగి వచ్చితిని అనిరి. నంబి వారితో “ఇతరులకు అమ్మివేసిన గోవునకు మేము దాణ ఇవ్వలేము. మీరు ఉడయవర్లకు పూర్తిగా కట్టుబడి ఉండి వారి సేవయే చేయవలెను” అనిరి. ఎంబార్ కు ప్రసాదమును కూడా ఇవ్వక వారిని బయటకు త్రోసి వేసిరి. ఈ చర్యతో తమ ఆచార్యుల ఉద్దేశ్యమును అర్ధము చేసుకొనిన ఎంబార్ తమకు ఉడయవర్ల పాదపద్మములే శరణ్యమని గ్రహించి, శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమైరి. అప్పటి నుండి వారు అచటనే ఉండి, ఉడయవర్లకు సంతోషముగా సేవ చేయుచు ఉండిరి.

ఒకసారి, ఉడయవర్లు తమ శిష్యులతో ఉన్న ఒక గోష్ఠిలో, ఎంబార్ల జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మొ|| వాటి గురించి ఉడయవర్ల శిష్యులు కీర్తింప సాగిరి. ఎంబార్ తమ శిరస్సును అంగీకారముగా ఊపి “ఔను ! అది యదార్ధము” అనిరి, తనను తానే ఇతరుల కన్నా ఉత్తమునిగా కీర్తించుకొనిరి. ఇది గమనించిన ఉడయవర్ “ఇతరులు నిన్ను కీర్తించిన, నీవు చాల అణుకువతో మెలిగి, నేను ఆ పొగడ్తలకు అనర్హుడనని పలుకవలెను. కాని నిన్ను నీవే కీర్తించుకొనుట, మర్యాదకరమేనా?” అని ప్రశ్నించిరి. ఎంబార్ సమాధానమిచ్చుచు “స్వామి! ఈ శ్రీవైష్ణవులు నన్ను కీర్తించినది – నేను కాళహస్తిలో నున్నప్పుడు అల్పమైన దండములు మరియు మట్టిపాత్ర, మెడలో రుద్రాక్షమాల మొ|| వానిని ధరించినందువలన. వానిని చూచి కీర్తించినచో, దానికి నేను అర్హుడనే. కాని మీరు, మీ గొప్పదనముచే, ‘పీతగవాడైప్పిరానార్ బిరమగురువాయ్ వంతు’ (భగవాన్ తానే ప్రధమ గురువుగా దర్శనమిచ్చినటుల) అని చెప్పిన విధముగా, నన్ను శుద్ధి చేసిరి. నేను అతి అల్పుడను – నిత్య సంసారి కన్నా అల్పుడను – కాని నన్ను మీరు సంస్కారించుటచే ఈ శ్రీవైష్ణవులు నన్ను కీర్తించుచున్నారు. కావున, ప్రతిసారి నన్ను నేను గాని, లేక ఇతరులు గాని కీర్తించినచో, అది యధార్ధముగా మీ గొప్పతనమును కీర్తించుటయే అగును” అనిరి. ఉడయవర్ “ప్రియ గోవింద పెరుమాళ్! అద్భుతము! అద్భుతము!” అని పలికి ఎంబార్ యొక్క స్వామి నిష్ఠను గాంచి మిక్కిలి సంతసించిరి.

ఒక ఆచార్యుడు తమ శిష్యునికి, ఏమి గ్రహించవలెనో మరియు ఏమి త్యజించవలెనో స్పష్టముగా వివరించుచుండిరి. ఆ సూత్రములను శిష్యుడు అర్ధము చేసుకొనలేదు. ఆచార్యులు వాని లోపములను అక్కడే సరిచేయుచున్నారు (కాలిత్యే శాసితారంలో సూచించిన విధముగా). ఒక విద్వాంసుణ్ణి శిష్యుడు కలవగా, ఆచార్యుని శిక్షణ పొందుటకు ఆ శిష్యుడు ఇంకను సిద్ధముగా లేడని భావించి, దిగులుగా, ఆచార్యుని ఆదేశములను పాటించగల శిష్యులకు మాత్రమే ఆచార్యుడు శిక్షణనిచ్చును, కాని “నీ ఆచార్యులు నీకేల శిక్షణనిచ్చిరి?” అని అడిగిరి. ఈ విషయమును నా ఆచార్యులు (మాముణులు) వివరించిరి. ఆ విధముగా, పూర్ణ శరణాగతి అయిన శిష్యునికి ఆదేశములు/ మార్గదర్శనము ఆచార్యులు చేయవలెను, నిజమైన ఆచార్యుని అట్టి ఆదేశములు/ మార్గదర్శనము శిష్యుని అంతిమ ధ్యేయములో ఒక భాగమని నిరూపింపబడినది. మరియొక ప్రాంతములో నివసిస్తున్న నంజీయర్ శిష్యులు ఒకరు వారి వద్దకు వచ్చి, కొంత కాలము వారిని సేవించుకొని, తదుపరి వారు తిరుగు ప్రయాణమునకు సిద్ధమైరి. వారు తిరిగి వెళ్ళుటకు గమనించిన నంజీయర్ల మరియొక శిష్యుడు వారితో, “ఓహ్! జీయర్ పాదపద్మములను విడనాడి, మీ నివాసమునకు తిరిగి పయనమగుట దురదృష్టకరము” అని బాధ పడిరి. దానికి శ్రీవైష్ణవుడు జవాబుగా “నేను ఎక్కడ వున్నను, నాకు నా ఆచార్యుని కృప ఉండును” అని తమను తాము ఓదార్చుకొనిరి. ఈ సంభాషణను వినిన మరియొక శ్రీవైష్ణవుడు (నంజీయర్లకు సన్నిహితుడు), తమ గృహమునకు తిరుగు ప్రయాణమైన ఆ శ్రీవైష్ణవుడు తమ ఆచార్యుని నుండి ఎడబాటునకు సహితము బాధను కనపరచ లేదని “ఏనత్తు ఉరువాయ్ ఉలగిడంద ఊళియాన్ పాదమ్ మరువాదార్కు ఉండామో వాన్?” (మొదల్ తిరువందాది 91 – ఈ భూమిని కాపాడిన వరాహ పెరుమాళ్ పాదపద్మములను పూజించని వాడు, పరమపదమును ఎలా పొందగలరు? – విషయమేమనగా – ఎంపెరుమాన్ పాదపద్మములను గురించియే ఈ విధముగా భావించిన, ఇంక ఆచార్యుని పాదపద్మములను ప్రతిరోజు అర్చించనిచో, దానిని గురించి ఏమని అనగలము). ఈ సంఘటనను నా ఆచార్యులు (మాముణులు) తెలిపిరి. దీని వలన, శిష్యుడు తమ సదాచార్యుని ఎడబాసినచో, అతను ఏమి గ్రహించవలెనో, ఏమి త్యజించవలెనో తెలుసుకొనజాలడు అని విదితమగుచున్నది. తదుపరి, ఆ అజ్ఞానము వానిని నష్టపరుచుటయే కాక, పరమపదము పొందవలెనను అంతిమ లక్ష్యము కూడ నెరవేరనీయదు.

కొంగునాడు (కోయంబత్తూర్ ప్రాంతము) కరువుతో ప్రభావితమైన సమయములో, ఒక బ్రాహ్మణుడు, అతని పత్ని, శ్రీరంగములో నివసించుటకై పయనమైరి. ఆ రోజుల్లో ఎంపెరుమానార్ మధుకరము (ఆహారమునకై బిక్షాటన) చేయుటకై 7 గృహములకు వెళ్లెడివారు. అగళంగనాట్టాళ్వాన్ ప్రాకారమ్ (కోవెల చుట్టూ ఉన్న 7 ప్రాకారములలో ఒకటి) వీధిలో వున్నప్పుడు శ్రీవైష్ణవులు, ఎంపెరుమానార్ల పాదపద్మములకు ప్రణమిల్లెడివారు. ఆ దగ్గరలోనే ఉన్న ఒక మేడపై నున్న ఇంట్లో నివసిస్తున్న ఆ బ్రాహ్మణుడు, అతని పత్ని ఇది గమనించిరి. ఒకరోజు, ఎంపెరుమానార్ వారి నివాసము దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె మేడపై నుంచి క్రిందకు వచ్చి ఎంపెరుమానార్లతో “రాజులందరు మీ పాదపద్మములకు ప్రణమిల్లుచుండగా, మీరు మాత్రము ఆహారమునకై బిక్షాటన చేయు చున్నారు. కారణమేమి?” అని అడిగిరి. ఎంపెరుమానార్ సమాధానముగా “నేను వారికి చేయు మంచి ఆదేశముల వలన వారు నన్ను ఆరాధించుచున్నారు” అనిరి. ఆమె కూడ వారి పాదపద్మములకు ప్రణమిల్లి “నాకు కూడ దయతో మంచి ఆదేశములను ప్రసాదించగలరు” అని ప్రాధేయపడెను. వారు తమ దివ్య అనుగ్రహముచే ఆమెకు ద్వయ మంత్రమును ఉపదేశించిరి. తదుపరి కొంత కాలము పిదప, వారి ప్రాంతములో సాధారణ స్థితి నెలకొనెను. వారు శ్రీరంగమును వీడుటకు సిద్ధమైరి. తాము తిరిగి వెళ్ళు సమయమునకు ఎంపెరుమానార్లతో కలయిక జరుగదేమోనని ఆమె చింతించెను. ఆ సమయమునకే మధుకరమునకై ఎంపెరుమానార్ అచ్చటకు వెళ్ళిరి. వారిని గాంచి ఆమె “మేము మా స్వగ్రామమునకు తిరుగు ప్రయాణమగుచుంటిమి; మీరు దయతో మరియొక సారి దివ్య మంత్రమును ఉపదేశింపుమని, తద్వారా అది నా అంతరంగములో నిక్షిప్తమగునని” అని ప్రాధేయపడెను. ఎంపెరుమానార్ తమ అపార కరుణచే, మరల ఆమెకు దివ్య ఆదేశములను అనుగ్రహించిరి. ఆమె ఇంకను “నన్ను సదా కాపాడుటకై మరియొక ఆదేశమును ఇచ్చి అనుగ్రహించమని” వేడుకొనెను. వెంటనే ఉడయవర్ తమ పాదుకలను ఆమెకు ప్రసాదించి, ఆమెను పెరియ పిరాట్టి అని సంబోధించిరి. అప్పటి నుండి ఆమె ఆ పాదుకలను తన తిరువారాధనలో నుంచి, ప్రేమగా అర్చించసాగెను. ఈ సంఘటన వార్తామలై ద్వారా ప్రసిద్ధిచెందెను. దీని ద్వారా, ఈ సంసారములో ఎంపెరుమానుని కూడ విస్మరించి – ఆచార్యునిపై సంపూర్ణ భక్తిని పెంపొందించుకొని, ఆచార్య సంబంధమైన దానిని గ్రహించి (ఇచట పాదుకల వలె) పరిపూర్ణ శరణాగతి చేయవలెనని అవగతమగుచున్నది. ఆచార్యునిపై పూర్తి విశ్వాసము కలవారు, కొంగు దేశములోని పెరియ పిరాట్టి వంటివారు. ఆచార్య నిష్టాపరులైన పొన్ నాచ్చియార్ (పిళ్ళై వురంగ విల్లి దాసర్ పత్ని), తుంబి యార్కు కొండి, ఏకలవ్యుడు, విక్రమాదిత్యుడు మొ || వారి జీవితములను మనము గుర్తు పెట్టుకొనవలెను.

అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము ఎంబార్ నిష్ఠను, ఉడయవర్ల ఇతర శిష్యుల నిష్ఠను గమనించాము. వారు శ్రీ రామానుజునిపై ఎటుల సంపూర్ణముగా ఆధారపడిరో వ్యక్తమైనది.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-11/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment