అంతిమోపాయ నిష్ఠ – 12

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/07/06/anthimopaya-nishtai-11-telugu/ ), మనము ఎంబార్ల దివ్య ప్రవృత్తిని, ఇతర సంఘటనలను గమనించాము. ఈ వ్యాసములో, ఆచార్యుడు భగవానుని అవతారమని, ఆచార్యుడిని భగవానునితో సమానంగా భావించాలని స్థాపించారు.

ఆచార్యులు భగవానుని అవతారము

పురుషార్ధము (జీవాత్మ సాధించవలసిన లక్ష్యాలు) నాలుగు రకాలు:

  1. సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము (అంతరంగములో) – ఇది భగవానుని అర్ధము చేసుకొనే ప్రత్యేక జ్ఞానము.
  2. విభూతి సాక్షాత్కారము – సాకార రూపములో సాక్షాత్కరించే భగవానుని దివ్య దర్శనము – ఈ స్థితిలో ఒక ప్రత్యేక జ్ఞానము ద్వారా మనము నిజమైన అడ్డంకులను (ఈ భౌతిక శరీరము మరియు భౌతిక ప్రపంచము) గ్రహించగలము.
  3. ఉభయవిభూతి సాక్షాత్కారము – ఆధ్యాత్మిక మరియు ఆదిభౌతిక రూపములలో భగవానుని దివ్య దర్శనము – ఈ స్థితిలో ఒక ప్రత్యేక జ్ఞానము ద్వారా కైంకర్యము యొక్క యధార్ధ లక్ష్యమును మనము గ్రహించవచ్చును.
  4. ప్రత్యక్ష సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము మన కనులారా వీక్షించుట – ఈ స్థితిలో
    • మన లక్ష్యము మరియు సాధనం రెండూ ఒకటే అని గుర్తించగలము, అనగా, రెండూ భగవానుడే
    • భగవానునికి చేయు కైంకర్యము (ప్రేమతో చేయు సేవ) మన అంతిమ లక్ష్యము
    • దానికి ఉపాయము (విధానము) కూడ కైంకర్యమే

మొదటి మూడు విధములు పురుషార్ధములో (అంతిమ లక్ష్యము) భాగము అని భావించినను, ప్రత్యక్ష సాక్షాత్కారము పొందనిచో, ఆ మూడు నిరుపయోగమే. అంతిమ లక్ష్యమును మాత్రమే మనము ప్రత్యక్షముగా దర్శించినచో, ఆ ఇతర మూడు కూడ సాధించలేము.

ఈ క్రింది ఆరు రూపములలో భగవానుని ప్రత్యక్ష దర్శనమును సాధించగలము :

  • పరత్వము – పరమపదములో నున్న భగవానుని దివ్య స్వరూపము – ఇది నిత్యులకు మరియు ముక్తులకు
  • వ్యూహము – క్షీరాబ్దిలో దర్శనమిచ్చు భగవానుని దివ్య స్వరూపము – ఇది సనకసనందనాదులకు (బ్రహ్మ మానస పుత్రులు), దేవతలకు, మొ ||
  • విభవము – భగవానుని అవతారములైన శ్రీరామ, శ్రీకృష్ణ, ఇత్యాదులు – ఇవి శ్రీరామ, శ్రీకృష్ణ మొ || వారి కాలములో జీవించివున్న వారికి, దశరధుడు, వాసుదేవుడు, నందగోపాలుడు, ఇత్యాదులు
  • అంతర్యామిత్వము – ప్రతి జీవుని అంతరంగములో నివసించు భగవానుని స్వరూపము – ఇది యోగులకు మరియు ఉపాసకులకు
  • అర్చావతారము – కోవెలలో, మఠములలో, గృహములలో వున్న స్వరూపము – ఈ రూపము ప్రతి ఒక్కరికి
  • ఆచార్యావతారము – జ్ఞానమును ప్రసాదించు ఆచార్యునిగా దర్శనమిచ్చు భగవానుని స్వరూపము – ఇది వారిని ఆశ్రయించిన (శరణాగతి) వారికి.

పై వానిలో, వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా మొదటి నాలుగు చేరలేము – అనగా

  • దేశము – ప్రాంతము – పరమపదము, క్షీరాబ్ది సర్వులకు అందుబాటులో లేవు
  • కాలము – సమయము – విభవ అవతారములు వేరు వేరు యుగములలో జరిగినవి – ఆ కాలములో లేనివారు వానిని కోల్పోయిరి.
  • కరణము – స్పందన – మనస్సును పూర్తిగా నియంత్రించగల యోగులు మాత్రమే తమ జ్ఞానము ద్వారా అంతర్యామి ఎంపెరుమాన్ ను దర్శించగలరు.

పై వానిలో చివరి రెండు, అర్చావతారములోని ఎంపెరుమాన్లు, ప్రతి ఒక్కరితో స్వయముగా సంబంధము కలిగి వుండరు. కావున, అర్చావతారమును కూడ ఎంపెరుమానుని ఇతర అవతారములతో పోల్చవచ్చును. అన్ని శాస్త్రములను పరిశీలించిన పిదప, ఒక జీవాత్మ ముక్తుడగుటకు, తమ ఆచార్యుని దివ్య జ్ఞానము పొందవలెనని స్పష్టముగా నిర్ణయమైనది. కావున, దేనివలన జ్ఞానము లభించునో అది అంతిమ లక్ష్యము కూడ అగును. దేనివలన అంతిమ లక్ష్యము లభించునో, అది ఉపాయం (సాధనము) అగును. కావున, ఆచార్యునికి చేయు కైంకర్యమే అత్యున్నత లక్ష్యము. స్వయముగా భగవానుడే నమ్మాళ్వార్లను మచ్చలేని జ్ఞానముతో అనుగ్రహించుటచే, తనకు మచ్చలేని జ్ఞానము నొసంగిన భగవానుడే, తన ఆరాధ్యుడు అని వారు ప్రకటించిరి. దివ్య జ్ఞానమును ఇచ్చి దీవించే ఆచార్యులే  శిష్యునికి ఏకైక సాధనము. ఇతర ఉపాయములన్ని కూడ ఉపాయాంతరముల వంటివి (వదలి వేయ తగిన ఇతర సాధనములు). ఈ విషయమును నంపిళ్ళై కు తిరుముడిక్కుఱై రహస్యములో, నంజీయర్ వివరించిరి. ఇట్టి ప్రత్యక్ష సాక్షాత్కారము లేనిచో (ఆచార్యుని ప్రత్యక్ష దివ్య దర్శనము), మోక్షమును పొందు అవకాశము లేదు, కావున, ఆచార్యావతారము అంతిమ ఉపాయమగును.

ఆచార్య అభిమానము యొక్క గొప్పతనమును పిళ్ళై లోకాచార్యులు తమ అర్థ పంచకము (రహస్య గ్రంధము) లో ఈ క్రింది విధముగా స్పష్టముగా వివరించిరి.

ఆచార్య అభిమానమావతు ఇవైయొన్ఱుక్కుమ్ సక్తనన్ఱిక్కే ఇరుప్పానొరు ఉవనైక్ కుఱిత్తు ఇవనుడైయ ఇళావైయుమ్, ఇవనైప్పెఱ్ఱాల్ ఈశ్వరనుక్కు ఉణ్డాన ప్రీతియైయుమ్ అనుసందిత్తు, స్తనందయప్రజైక్కు వ్యాతి ఉణ్డానాల్ తన్ కుఱైయాగ నినైత్తుత్ తాన్ ఔషధ సేవై పణ్ణి రక్శిక్కుమ్ మాతావైప్పోలే ఇవనుక్కుత్తాన్ ఉపాయానుష్టానమ్ పణ్ణి రక్శిక్క వల్ల పరమదయాళువాన మహాభాగవత అభిమానత్తిలే ఒదుంగి, “వల్లపరిసు వరువిప్పరేల్ అతు కాణ్డుమే” ఎన్గిఱపడియే సకల నివృత్తి ప్రవృత్తిగళుమ్ అవనిట్ట వళక్కాయ్.

ఆండాళ్ తిరుక్కళ్యాణము

సాధారణ అనువాదము : ఆచార్య అభిమానము అనగా – మరి ఇతర ఉపాయములు (కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి) నిర్వహించు సామర్ధ్యము లేని, జీవాత్మకు, అతని అసహాయతను గుర్తించిన ఆచార్యులు (ఎంపెరుమానుతో గల సంబంధమును జీవాత్మ గుర్తించనందు వల్ల) మరియు జీవాత్మను పొందిన ఈశ్వరుని (తన నిజమైన సేవకునిగా) సంతోషమును గమనించినట్లు, తన పసిపాప అనారోగ్యమును గమనించిన తల్లి తాను అనారోగ్యమును పొందినట్లు భావించి తాను ఔషధమును స్వీకరించి, తన స్తన్యము ద్వారా దానిని పసిపాపకు నయమగుటకు ఇచ్చినట్లు, ఒక ఆచార్యుడు తన శిష్యుని కొరకు తానే స్వయముగా ఎంపెరుమాన్ ను శరణాగతి చేయుదురు. అట్టి కరుణా స్వరూపులైన సిసలైన భాగవతునికి, శిష్యుడు సదా అందుబాటులో వుంటూ, వారి ఆశీర్వాదమునకై వేచి ఉండి, “భగవానుడు ఆచార్యునికి కట్టుబడి వున్న విధముగా వారు వచ్చి నన్ను దీవించగలరు” (నాచ్చియార్ తిరుమొళిలో ఆండాళ్ నాచ్చియార్ గుర్తించిన ప్రకారముగా) అని భావింతురు.

మణఱ్పాక్కత్తు నంబి ప్రత్యక్షముగా దర్శించినట్లు మన పిళ్ళై లోకాచార్యులు సాక్షాత్తు పేరరుళాళన్ (కంచి దేవ పెరుమాళ్) అవతారమని స్పష్టమగుచున్నది. ఈ సంఘటనను (దేవ పెరుమాళ్ళ అవతారము పిళ్ళై లోకాచార్యులని) మన జీయర్ (మాముణులు) శ్రీ వచన భూషణము వ్యాఖ్యానములో (అవతారిక) చక్కగా వివరించిరి. ఇవియేగాక, ఇంకను సదాచార్య – సత్శిష్య లక్షణము గురించి అనేక సొగసైన వ్యాఖ్యానములను మన జీయర్ (మాముణులు) వివరించిరి. వానిని ఇది పెద్ద గ్రంధమగుననే భయముచే నేను వివరించుటలేదు.

ఈ విధముగా, “శ్రీమన్నారాయణుడే (శ్రీమహాలక్ష్మి పతి) మిక్కిలి దయతో ఆచార్యునిగా దర్శనమిచ్చును” అని ఘోషించుచున్నాయి. అవి

  • వేదములు
  • వేదములను వివరించు – స్మృతి, ఇతిహాసములు, పురాణములు
  • పరాశర, పారాశర్య (వ్యాసుడు), బోధాయనుడు, శుకుడు, మొ || ఋషులు వాని సారాంశమును దర్శించిరి.
  • ఆళ్వారులైన ప్రపన్న జన కూటస్థర్ పరాంకుశ (నమ్మాళ్వార్) పరకాల (తిరుమంగై ఆళ్వార్), భట్టనాధుడు (పెరియాళ్వార్), మొ ||ఆళ్వార్లు భగవానుని ఆధ్యాత్మిక ఆది భౌతిక జగత్తులను సంపూర్ణముగా వీక్షించగలుగుటచే, వారు ద్రావిడ బ్రహ్మ విద్య ద్వారా సమస్త వేదముల వేదాంతముల సారాంశమును వెల్లడించి, పుట్టుక వయస్సులతో నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులోనుంచిరి.
  • సర్వము తెలిసిన ఆచార్యులైన నాథమునులు, యామూనాచార్యులు, యతిరాజులు, మొ || వారు ఆళ్వార్ల అడుగుజాడలను కొనసాగించిరి.

ముముక్షుపడి ప్రారంభములో పిళ్ళైలోకాచార్యులు వివరించిన విధముగా – జీవాత్మలు ఈ సంసారములో  అనాదిగా వుంటూ తమ యధార్ధ స్వరూపము, భగవానుని యధార్ధ స్వరూపము, జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధము తెలుసుకొనక, భగవత్ కైంకర్యములో నిమగ్నమగు అద్భుత అవకాశమును జారవిడుచు కొనుచున్నారని కూడ గుర్తించలేక పోవుచున్నారు. బదులుగా, అనాది కాలము నుండి సంసార సాగరములో మునిగి సంసారులు బాధలను అనుభవించుచున్నారు. అయిదు భిన్న రూపములు కల భగవానుడు (పరత్వాది పంచకము – https://granthams.koyil.org/2012/10/archavathara-anubhavam-parathvadhi/) మిక్కిలి దయతో తిరుమంత్రము ద్వారా ఈ సంసారులను శుద్ధి చేయవలెనని భావించిరి. వారిని అర్చిరాది గతి (మోక్షమునకు పయనమగు మార్గము) ద్వారా మార్గనిర్దేశనము చేయుట, సూర్య మండలమును చేధించుకొనుచు, విరజా నదిని దాటుటకు సహాయమొనరించుచు, అమానవన్ (ఎంపెరుమాన్ యొక్క మరొక స్వరూపము) హస్త స్పర్శచే ఆధ్యాత్మిక శరీరమును ఆశీర్వదించుచు, ఆ జీవాత్మను సదా కైంకర్య సేవకు వినియోగపడుట చేయును. దీనిని సాధించుటకు, బదరికాశ్రమములో నర నారాయణులుగా సాక్షాత్కరించిన పరమాత్మ, జీవాత్మలను సంసార బంధము నుండి విముక్తి చేయుటకు ఇప్పుడు ఈ సంసారములో కూడ సాక్షాత్కారమును ఇచ్చిరి. ఆ విధముగా, భగవానుడే స్వయముగా (ప్రధమ పర్వము – మొదటి వేదిక) ఆచార్యునిగా దర్శనమిచ్చున్నారని (చరమ పర్వము – అంతిమ వేదిక) మనము అంగీకరించ వలెను. దీనినే ఈ క్రింది శ్లోకములో వివరించిరి :

సాక్షాన్ నారాయణో దేవ:
కృత్వామర్త్యమయీమ్ తనుమ్
మగ్నానుద్దరతే లోకాన్
కారుణ్యాచ్చాస్త్ర పాణినా

సాధారణ అనువాదము: మహోన్నత భగవానుడైన శ్రీమన్నారాయణుడే, తమ అపార కరుణచే మనుష్య రూపు ధరించి, తమ హస్తములోనున్న శాస్త్ర సహాయముతో, ఈ జగత్తు లోని జీవాత్మలను ఉద్దరించుచున్నారు (ఆచార్యునిగా).

ఇప్పటి వరకు మనము, నిజమైన శిష్యుడు భగవానుని విశిష్ఠ అవతారము దాల్చిన నిజమైన ఆచార్యుని ఆరాదించవలెనని అనేక ప్రమాణముల (సాక్షములు) ద్వారా దర్శించితిమి. ఇప్పుడు, మనము ఆచార్యుని సాధారణ పురుషునిగా భావించరాదని మరికొన్ని ప్రమాణముల ద్వారా దర్శించెదము. పైన పేర్కొనిన రెండింటి ద్వారా, ఆచార్యుని సాధారణ పురుషునిగా భావించిన వారు నరక లోకములో పడుదురని, ఆచార్యుని భగవంతునిగా ఆరాధన చేయువారు పరమపద ప్రాప్తి నొందుదురని విదితమైనది. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ జ్ఞాన సారము 32 పాశురములో “ఎక్కాలుమ్ నణ్ణిడువర్ కీళాం నరగు” (ఆచార్యుని సామాన్య మానవునిగా భావించినవారు, శాశ్వతముగా నరక లోకములో పడుదురు). ఈ విధమైన ఆలోచనలను పూర్తిగా వదలివేయవలెను, మనము “పీతకవాడై ప్పిరానార్ బిరమగురువాగివందు” (భగవానుడే స్వయముగా ఆచార్యునిగా సాక్షాత్కరించుట) అని పెరియాళ్వార్ తెలిపిన విధముగా భావింపవలెను. ఈ సూత్రము శాస్త్రమును పూర్తిగా విశ్వసించిన, సదా ప్రమాణములను పాటించిన వారి హృదయ లోతులలో ఉండును.

అందువలన, “యత్సార భూతం తదుపాసితవ్యం” (సారాంశము/మూలమును ఆరాధించిచాలి/అనుసరించాలి), “భజేత్ సార తమం శాస్త్రం” (శాస్త్రంలో మూలసారాన్ని అనుసరించాలి, మొ॥., “ఉపాయ ఉపేయ భావెన త్వమేవ శరణం వ్రజేత్” అని చెప్పినట్లుగా జీవాత్మ మోక్షంపైనే ఏకైక దృష్టి ఉన్న ఆచార్యుని (ఆచార్య అభిమానం) పై ఆధారపడే బదులు, ఆచార్యుని చరణ కమల యందు శరణాగతి చేసి అదియే ఉపాయం/ఉపేయం భావించుట), “పేరొన్ఱు మాఱ్ఱిళ్ళై నిన్ శరణన్ఱి” (నీ తిరువడి తప్పా నాకు ఇంకొక ధ్యేయం లేదు – ఇరామానుశ నూఱ్ఱందాది 45 పాశురములో అముదనారులు), మొ॥. ఈ ఆచార్యత్వం

  • అన్ని శాస్త్రాముల సారము
  • శ్రీ మధురకవి, నాథమునులు మొదలైన ప్రారంభించి మన పూర్వాచార్యులు మన గురుపరంపరలో బోధించారు.
  • మనం అరాధించ తగిన ప్రత్యక్ష స్వరూపం
  • అణు మాత్రం స్వాతంత్ర్యం లేని పరమ దయామయుడు
  • అతి చేరువలో ఉన్న అత్యంత సులభుడు

కాని మనను ఉద్దరించు ఆచార్యుని సంపూర్ణ శరణాగతి చేయుటకు బదులు, పూర్ణ స్వతంత్రుడు, అత్యుత్తముడైన భగవానుని ఉపాయ ఉపేయములుగా పట్టుకొనుట, మన కన్నుల ముందరే దర్శనమిచ్చు ఆచార్యుని విస్మరించి భగవానునికై ప్రయత్నించుట, చాలా మూర్ఖత్వమగును (మన దోసలిలో ఉన్న నీటిని జారవిడచి, నిజముగా దాహార్తితో నున్నవాడు వర్షపు నీటికై ఆకాశము వంక చూచినట్లు). భగవానుని ఇట్లు వివరించారు.

  • తైత్తరీయ ఉపనిషత్తు – “యతో వాచో నివర్తంతే అప్రాప్య మానసా సహ – భగవానుని ఒక్క గుణమే కూడ మనస్సుకు అర్ధము కాదు మరియు అత్యంత వివేకవంతుడు కూడా దానిని మాటలలో చెప్పలేడు.
  • “సులభమ్ స్వగురుమ్ త్యక్త్వా దుర్లభమ్ యా ఉపాసతే” – సులభముగా లభ్యమగు గురువును వదలి భగవానునికై క్లిష్టమగు ఆరాధన చేయుట మూర్ఖత్వమగును.
  • స్తోత్ర రత్నము – విధి శివ సనకాద్యైర్ ధ్యాతుం అత్యంత దూరం – మహా యోగులైన బ్రహ్మ, శివ, సనక కుమారులకు కూడా నీ సేవ చేయుట వారి గ్రహణ శక్తికి అతీతమైనది.
  • తిరుమాలై 44 – ‘పెణ్ణులామ్ శడైయినానుమ్ పిరమునుమ్ ఉన్నైక్కాణ్బాన్ ఎణ్ ఇలా ఊళిఊళి త్తవం శెయ్దార్ వెళ్గి నిఱ్ప’ – జటా జూటములో గంగను దాల్చిన శివుడు అనేక వర్షములు తపమొనరించినను బ్రహ్మాదులకు కూడా నీ సాక్షాత్కారము లభింపక సిగ్గుతో తలదించుకొనిరి.
  • సిద్ధిర్ భవతి వా నేతి సంసయోచ్యుత సేవినామ్ – అచ్యుతుని సేవించిన వారికి కూడ అతడు లభ్యమగుట అనుమానస్పదమే.
  • తిరుచ్చంద విరుత్తమ్ 85 – ‘వైత్త శిందై వాంగు విత్తు నీంగు విక్క – నీవు సర్వ స్వతంత్రుడవు, నా మనస్సును నీ నుండి తొలగించి, భౌతిక విషయముల వైపు మళ్ళించగలవు.
  • క్షిపామి న క్షమామి – నేను వారిని శిక్షించెదను, నేను వారిని క్షమించను

ఆచార్యుని అంత దయాశాలి ఎంపెరుమాన్ కాదని, ఆచార్యులు సదా క్షమిస్తూ మరియు మోక్షమార్గమునకు మనను మరల్చగలరని తెలిపిరి.

పరమాత్మ గురించి వివరించుచు, అతనిని జేరుట చాలా కష్టమని, సంసారములో జీవాత్మను బంధించుటకైనను, సంసారము నుండి జీవాత్మను విముక్తి చేయుట కైనను, తనను శరణాగతి చేసిన భరతుని కూడ నిర్దయగా నిరాకరించుట, పెరుమాళ్ళనే అంటిపెట్టుకొని వున్న సీత పిరాట్టిని ఎడబాసి జీవించుటకు అరణ్యమునకు పంపుట, అర్జునునికి ప్రపత్తిని బోధించుట, ఇత్యాది వన్నియు అతని లీలలను ప్రదర్శించు చున్నవి.

నమ్మాళ్వార్ ను పూర్తిగా శరణాగతి చేసిన మధురకవి ఆళ్వార్

కావున, శిష్యుడు ఆచార్యుని ఉపాయము (సాధనము) మరియు ఉపేయము (లక్ష్యము) గా అంగీకరించుట “ఉత్తారయతి సంసారాత్ తదుపాయ ప్లవేనతు; గురుమూర్తి స్థిత స్సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః” (భగవానుడు ఆచార్య రూపమును ధరించి తగిన సాధనముల ద్వారా జీవాత్మలను సంసారము నుండి ఉద్దరించుటకు అవతరించును) అని వివరించిరి.
స్తోత్ర రత్నములో ఆళవందార్లు “సర్వం యదేవ నియమేన” (ఆళ్వారుని పాదపద్మములే నాకు సదా సర్వస్వము) అని తెలిపిరి. శిష్యుడు తన ఆచార్యుని గురువుగాను, రక్షకుడుగాను, మిక్కిలి ఆనందముగా అనుభవించు వానిగాను స్వీకరించవలెను. దీనికి బదులుగా, కొందరు ఆచార్యుని సామాన్య ఉపకారకునిగా (ఎంపెరుమాన్ దగ్గరకు చేర్చు సహాయకునిగా) మాత్రమే భావించుటను, ఉపదేశ రత్న మాల 71 పాశురములో “మున్నోర్ మొళింద ముఱై తప్పామల్ కేట్టు! పిన్నోర్ందు  తామతనై ప్పేశాదే! తన్నేఞ్జిల్ తొఱ్ఱినతే శొల్లి ఇదు శుద్ధ ఉపదేశ వరవాఱ్ఱతెన్బర్ మూర్కరావార్!” అని తెలిపిరి. పూర్వాచార్యుల నుంచి విని నది, వారి దివ్య సిద్ధాంతములు, అంతర్యామి తెలియజేసినది అనుసరించకయే, వారు భావించిన సిద్ధాంతమునే బోధించుచు” ఈ సూత్రము మన పూర్వాచార్యుల నుండి వచ్చినది” అని తెలుపుచు, కొందరు తమను తామే స్వతంత్రులుగా తలంచుచు, ఆ దౌర్భాగ్యులు తమ ఆచార్యునిపై అంకితము లేకుండా కఠిన హృదయులైనారు.
మన సంప్రదాయములోని లోతైన సూత్రములపై అవగాహన లేకపోవుటచే వారి ఉపదేశములు ఉనికిని కోల్పోయి, నకిలీ అలంకారముల వలె అదృశ్యమగును. నా ఆచార్యులు (మాముణులు) వివరించుచు, ప్రమాణములకు అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసముగలిగి ఉండవలెనని తెలిపిరి. అవి..

  • ‘ఆచార్యాయాహరే ధర్తాన్ ఆత్మానంచ నివేధయేత్ : తదధీనశ్చ వర్తేత సాక్షాన్ నారాయణో హి సః’ – తనను తాను, తన సంపదను, ఆచార్యుని అధీనములో ఉండి  తమ ఆచార్యునికి ఎవరు సమర్పించుదురో, వారు తప్పక శ్రీమన్నారాయణుని దివ్య ధామానికి చేరగలరు.
  • ‘యస్య సాక్షాత్ భగవతి జ్ఞాన దీపప్రదే గురౌ’ – ఆచార్యులు జ్ఞానజ్యోతి వెలిగించి, శిష్యునికి జ్ఞానమోసగుటచే, వారిని సాక్షాత్ భగవానునిగా భావించవచ్చు.
  • ‘ఆచార్యస్స హరి సాక్షాత్ చరరూపి న సంశయః’ –  ఆచార్యులు స్వయముగా శ్రీహరియే – నిస్సంశయముగా, కాని వారు భగవానునిలా (కోవెలలో ఒకే చోట నిశ్చలముగా వుంటారు) కాక, మన చుట్టూ దర్శనమిచ్చెదరు
  • ‘గురురేవ పరంబ్రహ్మ’ – గురువే పరంబ్రహ్మ
  • ‘గురుమూర్తి స్థితస్ సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః’ – భగవానే స్వయముగా గురువు రూపమును ధరిస్తారు, మొ ||

పిళ్ళై లోకాచార్యులు, శ్రీవచన భూషణము 443 సూత్రములో ఈ విషయమునే వివరించిరి:
‘స్వాభిమానత్తాలే ఈశ్వరాభిమానత్తై కులైత్తుకొణ్డ ఇవనుక్కు, ఆచార్యాభిమానమొళియ గతియిల్లై ఎన్ఱు పిళ్ళై పలకాలుం అరుళిచ్చెయ్య క్కేట్టిరుక్కైయాయిరుక్కుమ్’.

సాధారణ అనువాదము: జీవాత్మ తన స్వతంత్రత కారణముగా ఈశ్వరుని కృపను కోల్పోయిరని, వారికి ఆచార్యుని కృపయే శరణ్యము అని వడక్కు తిరువీధి పిళ్ళై పదే పదే తెలిపిరని నేను వింటిని.

ఈ సూత్రము (ఆచార్యుని కృపను ఉపాయముగా స్వీకరించుట) సత్సంప్రదాయము యొక్క ఫలితము. అందరూ

  • తమ ఆచార్యుని శ్రీమన్నారాయణుని (శ్రీమహాలక్ష్మి పతి) రూపముగా భావించాలి
  • వారి పాదపద్మములను ఉపాయ ఉపేయములుగా తలంచాలి
  • ఆ పాదపద్మముల సేవయే అంతిమ లక్ష్యముగా చేసుకొనాలి
  • వారి తిరుమాలిగ (లేదా వారి మఠం) అత్యున్న నివాసముగా యోచించాలి
  • వారి దివ్య స్వరూపమునే రక్షకునిగా, పోషకునిగా, ఆనందము నొసంగునదిగా భావించి సేవించవలెనని నమ్మాళ్వార్లు ఉణ్ణుం చోఱు అను పాశురములో వివరించిరి
  • ‘ఉత్తారయతి సంసారాత్’ శ్లోకములో వివరించిన ప్రకారము వారిని ఉధ్ధారకునిగా భావింపవలెను
  • ఆర్తి ప్రబంధములో మాముణులు ఆరాధించిన విధముగా వారిని ఆరాధించవలెను “యతిరాజ ఎన్నై ఇని క్కడుక ఇప్పవత్తినిన్ఱుమ్ ఎడుత్తఱుళే ” – యతిరాజా నన్ను దయతో ఈ క్రూర సంసారము నుండి వెంటనే విముక్తుడిని చేయుము.
  • ” ఆచార్య అభిమానమే ఉత్తారకము ” – శ్రీవచన భూషణము 447 – ఆచార్యుని కృపయే ఉద్ధరింపబడుటకు శరణ్యము.
  • రామానుజ నూఱ్ఱందాది 93వ పాశురము “ఎన్ పెరువినైయై క్కిట్టిక్కిళంగొడు తన్నరుళ్ ఎన్నుం ఒళ్ వాళురువి వెట్టి కలైన్ద, ఇరామానుశన్”, కణ్ణినుణ్ శిఱుత్తాంబు 7వ పాశురము “కండు కొండెన్నై, కారి మాఱ ప్పిరాన్ పణ్డై వల్వినై, పాఱ్ఱి యరుళినాన్” – మనము మునుపు చేసిన పాపములను తొలగించువాడు ఆచార్యులే అని భావించుము.

ఈ విధముగా చరమ పర్వము (అంత్య స్థితి) లో నున్న శిష్యులు, ఆచార్యులు తాము ఆశించిన ఫలితము నిచ్చువారిని, తమ లక్ష్య సాధనలో నున్న అడ్డంకులను తొలగించు వారని, తమను ఉద్ధరించు ఆచార్యునకు విధేయులని, స్వగత స్వీకారము (ఆచార్యుని అనుసరించు శిష్యుడు), పరగత స్వీకారము (ఆచార్యులు తమ దివ్య కృపచే శిష్యుని అనుగ్రహించుట), ఈ రెండును అంతిమ ఫలితమును ప్రసాదించును. కాని, శిష్యునికి ఆచార్యుని సమీపించుట / అనుసరించుట తామే స్వయముగా / అహంకార పూరితముగా చేయుచున్నామను భావనలో నుండుట, కాలుడు (యముడు) దీవించి ఇచ్చిన ఉంగరమును ధరించినటు వంటిది అగును, కావున జీవాత్మ స్వభావమునకు స్వగత స్వీకారము సరిపోదు. కావున శిష్యుడు దానిని వదలి, ఆచార్యుని అపార కరుణ (పరగత స్వీకారము) పైననే సంపూర్ణముగా ఆధారపడి ఆనందముగా జీవించవలెను.

  • “సంసారావర్త వేగ ప్రశమన శుభదృక్ దేశిక ప్రేక్షి – తోహం” – సంసారము వల్ల ఏర్పడు శక్తివంతమైన ఫలితములను అణచి వేయుటకై నా ఆచార్యుని సహాయమునకై ఆధారపడుట వల్ల నేను సుఖముగా నున్నాను.
  • ‘నిర్భయో నిర్భరోస్మి’ – భయము మరియు సంసారములో కష్టములు లేకుండుట.
  • ‘ఆచార్యస్య ప్రసాదేన మమ సర్వమభీష్టితం’; ప్రప్నుయామీతి విశ్వాసో యస్యాస్తి స సుఖీభవేత్’ – ఆచార్యుని కృపచే తమ సమస్త వాంఛలు నెరవేరునని నమ్మకము / విశ్వాసము కలిగిన వారు సుఖముగా నుండగలరు.
  • తిరువాయ్మొళి తనియన్ – ‘తనత్తాలుమ్ ఏదుమ్ కుఱై విలేన్ ఎందై శడకోపన్ పాదంగల్ యాముడైయ పత్తు’ – నేను నమ్మాళ్వార్లను శరణు చేయుటచే, నా సంపద (భౌతిక, ఆధ్యాత్మిక) పై సంతుష్టి కలిగి వున్నాను.

ఇంకను, పుణ్య పాపములు రెంటిని త్యజించుటచే, నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (సంసారము) ల మధ్య అడ్డంకులు తొలగిపోవుటచే, ఈ సంసారములో ఆనందముగా వశించ వచ్చునని ఈ క్రింద పేర్కొనిన వానిలో వివరించిరి :

  • ప్రమేయ సారము 1 – ‘ఇవ్వాఱు కేట్టిరుపాఱ్కు ఆళెన్ఱు కణ్డిరుప్పార్ మీట్చియిల్లా నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుప్పన్ నాన్’ – ఎవరైతే ఆచార్యుని ద్వారా తిరుమంత్ర అర్ధములను వినిరో, ఆచార్య శేషత్వమును గ్రహించిరో, వారి సేవ గావించిరో, వారు నిశ్చయముగా తిరిగి రాని ఉత్తమ లోకము పరమపదమును చేరెదరు.
  • ప్రమేయ సారము 9 – ‘తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై వైత్త అవరై’ – ఎవరైతే తమ ఆచార్యుని భగవదవతారముగా భావించి, ఆరాధించెదరో వారు తప్పక పరమపదమును చేరగలరు.
  • ఉపదేశ రత్త మాల 72 – ‘ఇరుళ్ తరుమా జ్ఞాలత్తే ఇన్బ ముఱ్ఱు వాళుం, తెరుళ్ దరుమా దేశిగనై చ్చేర్ న్దు’ – పూర్వాచార్యుల దివ్య ఆదేశములను, వారి జీవితములను శ్రవణము గావించి, ఆచరించి, వాటి దివ్య జ్ఞానమును ఆచార్యుని ద్వారా పొందిన శిష్యుడు, అంధకారమయమైన ఈ సంసారములో కూడ ఆనందముగా జీవించగలడు.

ఈ కారణముగానే పెరియ వాచ్చన్ పిళ్ళై, ఆచార్యుని పాదపద్మములే భౌతిక / ఆధ్యాత్మిక జగత్తులని భావించుట, గోచరమైన / అగోచరమైన లక్ష్యమని అంగీకరించుట కన్నా ఇతర గొప్ప విషయమేది లేదని తేల్చిరి. అయితే, అట్టి శిష్యులకు (తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసము కలవారికి) ఈ సంసారమే పరమపదమగునా? ఒకసారి, నంబి తిరువళుది వళనాడు దాసర్, కణ్ణినుణ్ శిఱుత్తాంబు పఠించుచూ “మధురకవి శొన్నశొల్ నంబువార్ పది వైకుందం కాణ్మనే” (మధురకవి ఆళ్వార్ల దివ్య పలుకులను విశ్వసించినవారు, వారు ఎక్కడ వున్నను అదియే వైకుంఠమగును) అని ముగించిరి. ఆ సమయములో అక్కడ నున్న శ్రీవైష్ణవులు “ఈ సంసారములో (లీలా విభూతి) నున్న శ్రీవైష్ణవులు దానిని విశ్వాసముతో చదివిన, ఆ స్థలము వైకుంఠముగా (నిత్య విభూతి) ఎట్లగును?” అనగా, వారు జవాబుగా ఎట్లగునో నేను వివరించెదను, వినుము. దైవాంశతో జన్మించిన కూరత్తాళ్వాన్ పుత్రుడు (భట్టర్) అవతరించిన పిదప, ఆ రెండు జగత్తుల మధ్య ఉన్న హద్దులు తొలగిపోయి, రెండును ఏకమైనవి” అనిరి. ఈ సంఘటనను కణ్ణినుణ్ శిఱుత్తాంబు వ్యాఖ్యానములో వివరించిరి.

అనువాదకుని గమనిక: ఈ విధముగా, మనము భగవానుని స్వయం అవతారముగా అపార కరుణా స్వరూపునిగా ఆచార్యుని దర్శించితిమి, శిష్యునికి వారి సేవయే అత్యంత ఆవశ్యకము.

దీనిలోని అనేక సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహాయ మొనర్చిన శ్రీ రంగనాథన్ స్వామికి కృతఙ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-12/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment