అంతిమోపాయ నిష్ఠ – 14

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, https://granthams.koyil.org/2022/07/18/anthimopaya-nishtai-13-telugu/, మనము ఆచార్య అపచారము, వాని యొక్క దుష్పరిణామముల గురించి వివరముగా గమనించాము. ఈ భాగములో మనము భాగవత అపచారము గురించి అవగాహన చేసుకొందాము.

ఇప్పుడు మనము భాగవత అపచారమును తిలకించెదము .

శ్రీ వచన భూషణము 307 వ సూత్రం – ‘ఇవై యొన్ఱుక్కొన్ఱు క్రూరన్గళుమాయ్, ఉపాయ విరోధిగళుమాయ్, ఉపేయ విరోధిగళుమాయ్ యిరుక్కుమ్’

సాధారణ అనువాదము: ఇవి (అకృత్య కరణము – శాస్త్రవిరుద్ధమైనవి చేయుట,
భగవత్ అపచారము – భగవానుని పట్ల తప్పు చేయుట, భాగవత అపచారము – భాగవతుల పట్ల తప్పు చేయుట, అసహ్యాపచారము – అకారణముగా భగవత్ / భాగవతుల పట్ల అపచారము చేయుట) అన్నియు మునుపు దాని కంటే అతి క్రూరమైనవి. అనగా, భగవత్ అపచారము అకృత్య కరణము కన్నా క్రూరమైనది, భాగవత అపచారము భగవత్ అపచారము కంటే క్రూరమైనది, అసహ్యాపచారము భాగవత అపచారము కంటే క్రూరమైనది. ఇవన్నీ మన సాధనములకు, మన అంతిమ లక్ష్యము పొందుటకు అవరోధములు.

కూరత్తాళ్వాన్ శిష్యులైన వీర సుందర బ్రహ్మ రాయన్ (ఆ ప్రాంతపు రాజు) ఒకసారి ఆళ్వాన్ కుమారులైన పరాశరభట్టర్ పై శత్రుత్వమును పెంచుకొనిరి. వారు భట్టర్ ను వేధించగా, ఆ బాధను భరించేక శ్రీరంగమును వీడి, తిరుక్కోష్ఠియూర్ చేరిరి. భట్టరే స్వయముగా ఈ విషయమును తమ శ్రీరంగరాజ స్తోత్రము 5 వ శ్లోకములో వెల్లడించిరి.

పూగీ కణ్ఠద్వయస సరస స్నిగ్ధ నీరోపకణ్ఠాం
ఆవిర్మోద స్తిమిత శకునానూదిత బ్రహ్మఘోషామ్
మార్గే మార్గే పధికనివహై రుంజ్య మానాపవర్గాం
పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రఙ్గధామ్నః

సాధారణ అనువాదము: పచ్చని చేట్లు నీటి వనరులతో, దివ్య సంపద సౌందర్యాలతో అలరారుతూ, మనస్సునకు ఆహ్లాదమును చేకూర్చే శ్రీరంగ దివ్య దేశమును మరలా ఎప్పుడు చూస్తానో?  అక్కడి పక్షులు నిరంతరము చేయు వీనులవిందైన శబ్దాలు, వేద ఘోషను పోలి ఉండును. ఆ దివ్య దేశం దారి మోక్ష సాధకుల సమూహముతో నిండి వుంటుంది.

తిరుక్కోష్ఠియూర్లో సౌమ్య శ్రీనారాయణ ఎంపెరుమాన్ పాదపద్మముల చెంత నంజీయర్ తో పాటు భట్టర్ – కాని వారి మనస్సు శ్రీరంగం లోనే

పై శ్లోకము ద్వారా, భట్టర్ తాను శ్రీరంగము, శ్రీరంగనాధుని నుండి దూరమగుట వలన కలిగిన వేదనను వెల్లడించిరి. ఆ సమయములో ఒక శ్రీవైష్ణవుడు భట్టరు వద్దకు వచ్చి, వారిని సేవించి, తనకు తిరువిరుత్తము బోధించమని అభ్యర్థించిరి. భట్టరు తన శిష్యుడైన నంజీయర్ వంకకు తిరిగి “జీయ! శ్రీరంగానికి,  రంగనాధునికి దూరమైన నేను, ఏ విషయము గురించి మాట్లాడలేను. తిరువిరుత్తం అర్థాలను నీవు ఈ శ్రీవైష్ణవునికి వివరించుము” అని పలికి, ఆ శ్రీవైష్ణవునికి నంజీయర్ పాదపద్మములను చూపిరి. తదుపరి కొంత కాలము గడచిన పిదప, భట్టర్ ను కష్టముల పాలు చేసిన వీర సుందర బ్రహ్మ రాయన్ గతించిరి. భట్టర్ తల్లి ఆండాళ్ ను కొందరు శ్రీవైష్ణవులు కాపాడుచు, వారి ఉపదేశములను పాటించుచుండిరి, ఈ వార్తను ఆలకించి, తమ ఉత్తరీయమును గాలిలోనికి ఎగురవేసి సంబరములు జరుపుకొనిరి. దీనిని గమనించి ఆండాళ్ తమ తీరుమాళిగకు వెనువెంటనే చేరి, ద్వారములు మూసి, బిగ్గరగా రోదించసాగిరి. గొప్పగా సంబరములలో నున్న ఆ శ్రీవైష్ణవులు, ఆండాళ్ వైపునకు తిరిగి “భట్టర్ వారి శత్రువు గతించినందులకు మీరు సంతోషముగా లేరా, భట్టర్ ఇచ్చటకు తిరిగి వచ్చెదరు కదా! మనమంతా కలిసి గొప్ప సత్సంగము చేయమా? ” అని అడిగిరి.

ఆండాళ్ సమాధానముగా “మీకు తెలియదు. వీర సుందర బ్రహ్మ రాయన్ ఆళ్వాన్ శిష్యులు. కాని వారు భట్టర్ను మిక్కిలి కష్టపెట్టి మహాపరాధమును ఒడిగట్టుకొనిరి. దీనికి తోడు అతను భట్టర్ వారిని మరల కలువలేదు, నేను అపరాధము చేసితినని, దయతో నన్ను క్షమించమని వారి పాదపద్మములపై శిరస్సు వంచి క్షమాభిక్షను కూడా కోరలేదు. ఇప్పుడు వారు గతించిరి కూడా. వారు తమ తనువును వీడిన వెంటనే యమధర్మరాజు భటులు వారిని తీసుకొని వెళ్ళిరి. వారి చేతులలో, వారు అనుభవించు బాధలను నేను తట్టుకోలేను. మీరు, నా ఈ భావనను గ్రహించలేరు” అనిరి. ఈ విధముగా నా ఆచార్యులు (మాముణులు), భాగవత అపచార ఫలము క్రూరముగా నుండునని తెలిపిరి.

భట్టర్ శిష్యులైన కడక్కత్తు ప్పిళ్ళై చోళ మండలము (ఒక ప్రాంతము) లో నివసించుచుండగా, ఉడయవర్లచే సంపూర్ణ శిక్షణ పొందిన సోమాసియాండన్ గురించి వినిరి. సోమాసియాండన్ తిరునారాయణపురంలో నివసించుచు అనేకులకి శ్రీభాష్యముపై శిక్షణనిచ్చెడి వారు. పిళ్ళై, తిరునారాయణపురము జేరిరి. వారిని దర్శించిన సోమాసియాండన్ అమితానందమును పొంది తమ తీరుమాళిగలో బస చేయమని వారిని ఆహ్వానించిరి. తదుపరి పిళ్ళై ఒక సంవత్సర కాలము శ్రీభాష్యము, భగవద్విషయము ఇత్యాదులపై ఆండాన్ ఉపదేశమును శ్రవణము చేసిరి. శాత్తుముఱై (చివరి సమావేశము) పిదప, పిళ్ళై తమ తిరుగు ప్రయాణము ప్రారంభించిరి. పిళ్ళైకు తోడుగా ఆండాన్ తిరునారాయణపురం సరిహద్దుల వరకు వెళ్ళిరి (అనువాదకుని గమనిక: సందర్శకులుగా వచ్చిన శ్రీవైష్ణవులను గ్రామ సరిహద్దు వరకు లేక నీటి వసతి వరకు కలిసి వెళ్లి, ఘనముగా సాగనంపుట శ్రీవైష్ణవుల యొక్క ఆచారము), “మీరు ఇచ్చట ఒక సంవత్సర కాలము నివసించుట నాకు గర్వకారణము; ఇప్పుడు మీ ఎడబాటు నాకు మిక్కిలి విచారకరముగా ఉంది: నేను దేనిని ఆశ్రయించాలి  అను విలువైన ఆదేశమును ఇచ్చి దీవించుడు” అని పలికిరి. పిళ్ళై “సోమాసియాండన్! మీరు గొప్ప జ్ఞానులు, శ్రీభాష్యము మరియు భగవద్విషయము రెంటిపై నిష్ణాతులు. అయినను, మీరు భాగవత అపచారము చేయరాదని సదా జ్ఞప్తికి వచ్చుటకై, మీ ఉత్తరీయమునకు ఒక ముడిని బిగించిరి” అని సమాధానమిచ్చిరి. ఈ సంఘటనను నా ఆచార్యులు (మాముణులు) వెల్లడించిరి. (అనువాదకుని గమనిక : పై ఉత్తరీయమునకు ముడి బిగించుట ఒక ఆచారము, దానిని చూచినంతనే మరచిన విషయము స్ఫురణకు రాగలదు).

ప్రాతుర్భావై స్సురనరసమో దేవదేవస్తదీయాః జాత్యా వృత్తేర్ అపి చ గుణతః తాదృశో నాత్ర గర్హా
కింతు శ్రీమద్బువనభవన త్రాణతోన్యేషు విద్యావృత్తప్రాయో భవతి విధవాకల్పకల్పః ప్రకర్శః

సాధారణ అనువాదము : పరమాత్మ భక్తులు, వారి జన్మ , కులము, చర్యలు లేక గుణముల వలన మానవులను కాని దేవతలను కాని పోలి ఉండుటచే, వారు యధార్ధముగా స్వయముగా పరమాత్మకు సమానులు. వారిని నిందించరాదు. వారు పెరుమాళ్ళ ఆలయములను, వాటి భూములను కాపాడుచుందురు. వారు జ్ఞాన అనుష్ఠానములలో ప్రవీణులు. వారు పండితులలో ఆభరణముల వలె అద్భుత కాంతి కలిగి ఉందురు.

అర్చావతారోపాదానమ్ వైష్ణవోత్పత్తి చింతనమ్
మాతృయోని పరీక్ష్యాస్తుల్యమాహూర్ మనీషిణః

సాధారణ అనువాదము : పండితవర్యులు గుర్తించినట్లు, ఎంపెరుమానుని దివ్య అర్చా రూపమును, దాని ముడి పదార్ధము ఆధారముగా యోగ్యత నిర్ణయించుట, ఒక వైష్ణవుని అతని జన్మ ఆధారముగా అర్హత నిర్ణయించుట అనేది తమ స్వంత తల్లి శీలమును అనుమానించుటతో సమానము.

అర్చాయామేవ మామ్ పస్యన్ మద్భక్తేషుచ మామ్ దృహన్
విషదగ్దైర్ అగ్నిదగ్దైర్ ఆయుదైర్హన్తిమామసౌ

సాధారణ అనువాదము : నన్ను నా భక్తులలో కాక, ఒక అర్చావతారములో మాత్రమే దర్శించుట, నన్ను తీవ్రమైన విషము, అగ్ని మరియు ఆయుధములతో గాయపరచుటతో వంటిది.

యా ప్రీతిర్మయి సంవృత్తా మద్భక్తేషు సదాస్తు తే
అవమానక్రియా తేశామ్ సంహరతి అఖిలమ్ జగత్

సాధారణ అనువాదము : భక్తులపై నాకు గల ప్రేమ సదా పెరుగుచూ నుండును. ఎంతనగా అనగా వారికి అవమానము జరిగినచో ఈ జగత్తునంతను అంతము చేయు వరకు కూడ వెళ్లును.

మద్భక్తమ్ స్వపచమవాపి నిందామ్ కుర్వంతి యే నరాః
పద్మకోటి శతేనాపి న క్షమామి కథాచన

సాధారణ అనువాదము : నా భక్తునిపై నిందారోపణలు చేయు వారిని, వారు ఛండాలుడైనను, కొన్ని లక్షల సంవత్సరములు గడచినను, నేను వారిని క్షమించను.

చండాలమపి మద్భక్తమ్ నావమన్యేత బుద్దిమాన్
అవమానాత్ పదత్యేవ రౌరవే నరకే నరః

సాధారణ అనువాదము : నా భక్తుని, అతను ఛండాలుడైనా సరే, ఒక తెలివైన వ్యక్తి అవమానము చేయరాదు, కారణము అతను నా భక్తుని అవమానపరిస్తే నిశ్చయముగా రౌరవాది నరకములో పడును.

అశ్వమేధ సహస్రాణి వాజపేయ సతానిచ
నిష్కృతిర్ నాస్తి నాస్త్యేవ వైష్ణవ ద్వేషినామ్ నృణామ్

సాధారణ అనువాదము : వైష్ణవులపై ద్వేషము కల వారు, ఒక సహస్ర అశ్వమేధ యాగములు లేక నూరు వాజపేయ యాగములు జరిపినను నిష్కృతి లేదు.

శూద్రమ్ వా భగవత్ భక్తమ్ నిషాదమ్ స్వపచమ్ తథా
ఈశతే జాతి సామాన్యాన్ స యాతి నరకమ్ దృవమ్

సాధారణ అనువాదము : భగవత్ భక్తుడిని జన్మతః శూద్రుడు, నిషాదుడు లేక స్వపచ అనే దృష్టితో వివక్షగా ఎవరైతే చూచెదరో, వారు ఘోరమైన నరకమును జేరెదరు.

అనాచారాన్ దురాచారాన్ అజ్ఞ్యాతౄన్ హీనజన్మనః
మద్భక్తాన్ శ్రోత్రియో నిందన్ సత్యాస్ చండాలతాం వ్రజేత్

సాధారణ అనువాదము : వేదములలో పండితుడైన వ్యక్తి, నా భక్తులకు నిబద్ధత, న్యాయము, జ్ఞానము లేదని నిందను మోపితే, అతను నిశ్చయముగా ఛండాల గుణమును పొందును.

అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ స మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః

సాధారణ అనువాదము : అత్యంత ఘోరమైన కార్యములు చేసినను, నా భక్తుడైనచో, అతనిని పవిత్రునిగా భావించాలి.

సర్వైశ్ఛ లక్షణైర్యుక్తో నియతశ్చ స్వకర్మసు
యస్తు భాగవతాన్ ద్వేష్టి సుదూరమ్ ప్రచ్యుతో హి సః

సాధారణ అనువాదము : ఎవరైతే అన్ని సుగుణములు కలిగి ధర్మ బద్ధమైన కార్యములలో నిబద్ధతో నున్నను, అతను భగవానుని భక్తులపై ద్వేషముగా వున్నచో సుదూర ప్రాంతములకు బహిష్కృతుడగును.

తిరుమాలై 43

అమర ఓర్ అంగమాఱుం వేదమోర్ నాన్గుమోది
తమర్గళిల్ తలైవరాయ శాది అంతణర్గళేలుమ్
నుమర్గళై ప్పళిప్పరాగిల్ నొడిప్పదోర్ అళవిల్
ఆంగే అవర్గళ్ తామ్ పులైయర్ పోలుమ్ అరంగమానగరుళానే

సాధారణ అనువాదము : ప్రియ శ్రీరంగనాధ! నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలలో నిష్ణాతులై, వైష్ణవులలో అగ్రగణ్యులైన బ్రాహ్మణులైనను, నీ భక్తులకు మనస్తాపము కలిగించినచో వెంటనే, అక్కడే, వారు అత్యల్పులగుదురు.

శ్రీవచన భూషణము 192వ సూత్రం –  “ఈశ్వరనవతరిత్తు ప్పణ్ణిన ఆనైతొళిల్ కళెల్లామ్ భాగవతాపచారమ్ పొఱామై” ఎన్ఱు జీయర్ అరుళిచ్చెయ్వర్

సాధారణ అనువాదము : తన భక్తులకు మనస్తాపము కలిగినచో భరించలేడు కనుక భగవానుడు ప్రత్యక్షమై అనేక క్లిష్ట కార్యములను జరిపినట్లు నంజీయర్ ప్రముఖముగా తెలిపిరి.

శ్రీవచన భూషణము 194 – 197 వ సూత్రం – ‘భాగవతాపచారం తాన్ అనేక విధమ్; అతిలే యొన్ఱు అవర్గళ్ పక్కల్ జన్మ నిరూపణమ్;  ఇతుతాన్ అర్చావతారత్తిల్ ఉపాదానస్మృతియులుమ్ కాట్టిల్ క్రూరమ్; ఆత్తై మాతృ యోని పరీక్షై యోడోక్కుమ్ ఎన్ఱు శాస్త్రమ్ శొల్లుమ్.’

సాధారణ అనువాదము : భాగవతాపచారము పలు విధములు. జన్మ ఆధారముగా అర్హతను నిర్ణయించుట వానిలో ఒక విధము. దివ్య అర్చామూర్తిగా వున్న ఎంపెరుమానుని ముడి పదార్ధము ఆధారముగా అర్హత నిర్ణయించుట కంటే ఇది క్రూరమైనది. శాస్త్రము ప్రకారము, దివ్య అర్చామూర్తిగా నున్న ఎంపెరుమాన్ అర్హతను నిరూపించుట అనగా తన స్వంత తల్లి శీలమును అనుమానించుటతో పోల్చవచ్చును.

శ్రీవచన భూషణము 198 వ సూత్రం –  ‘త్రిశంకువైప్పోలే కర్మ చండాలనాయ్ మార్విలిట్ట యజ్ఞోపవీతమ్ తానే వారాయ్విడుమ్’

సాధారణ అనువాదము : భాగవతాపచారము చేసిన వారు, త్రిశంకు వలె కర్మ ఛండాలుడు (తన చర్యల ద్వారా ఈ జన్మలోనే ఛండాలుడగుట ) అగుట, తన యజ్ఞోపవీతమే ఉరితాడు అయి, కంఠమును బిగించి నులిమి వేయును.

శ్రీవచన భూషణము 199 – 200 వ సూత్రం – జాతి చండాలనుక్కు క్కాలాన్తరత్తిలే భాగవతనాకైక్కు యోగ్యతై యుణ్డు. అతువుమిల్లై యివనుక్కు; ఆరూఢ పతితనాకైయాలే.

సాధారణ అనువాదము : జన్మతః చండాలునికి, ఏదో ఒక సమయములో, భాగవతుడగు అవకాశము కలదు. కాని కర్మ ఛండాలునికి అట్టి ఆశ మృగ్యము ఏలనన అతను అత్యున్నత స్థానము నుంచి దిగజారుటచే.

మన సమాజమునకు నాయకులైన ఆళ్వార్లు, శ్రీవైష్ణవులని గొప్పగా కీర్తించెదరు, ఒక శ్రీవైష్ణవుడు మరియొక శ్రీవైష్ణవుడు తమతో సమానుడనే భావన కూడ భాగవతాపచారమే అగును.

ఆళ్వార్లు శ్రీవైష్ణవులని వివిధ మార్గములలో కీర్తించెదరు :

  • తిరువుడైమన్నార్ – అమితమైన కైంకర్యశ్రీ కలిగినవారు (రాజులు)
  • శెజుమామణిగళ్ – సుందరమైన పెద్ద ముత్యములు
  • నిలత్తేవర్ – ఈ జగత్తులోని దేవతలు
  • పెరుమక్కళ్ – ఉన్నతమైన వారు
  • తెళ్ళియార్ – గొప్ప మేధావులు
  • పెరుంత్తవత్తార్ – మిక్కిలి నిరాడంబరులు
  • ఉరువుడైయార్ – సుందరులు
  • ఇళైయార్ – యవ్వనులు (మరియు సుందరులు)
  • వళ్లార్ – జ్ఞానులు
  • ఒత్తువళ్లార్ – వేద నిష్ణాతులు
  • తక్కార్ – మిక్కిలి తగిన వారు (కీర్తించుటకు)
  • మిక్కార్ – మన కన్నా మేలైనవారు
  • వేదవిమలర్ – స్వచ్ఛమైన వైదికులు
  • శిఱుమామనిసర్ – రూపములో చిన్నవారు కాని గుణాలలో గొప్పవారు
  • ఎంపిరాన్తన చిన్నన్గళ్ – నా పరమాత్మ యొక్క ప్రతినిధులు

భాగవతాపచార దుష్పరిణామములపై మరికొన్ని ముఖ్య ప్రమాణములు

తస్య బ్రహ్మవిధాగసః 

సాధారణ అనువాదము : బ్రహ్మ జ్ఞానము చేరువలో నున్న వారిని కీర్తించుట (స్పష్టమైన భావము లేదు)

నాహమ్ విసంగే సురరాజవజ్రాంత త్ర్యక్ష శూలాన్ న యమస్య దండాత్
నాజ్ఞోర్కసోమానిల విత్తహస్తాత్ శంగే బృశం భాగవతాపచారాత్

సాధారణ అనువాదము: నేను ఇంద్రుని వజ్రాయుధము యొక్క ఆగ్రహమునకు గాని, యముని భటులకు గాని లేక అగ్ని, చంద్రుడు, ఇతర దేవతల కోపమునకు గాని భీతిల్లను. కాని భాగవతాపచారమునకు మిక్కిలిగా భయపడెదను.

బ్రహ్మవిధోపమానాత్

సాధారణ అనువాదము : బ్రహ్మ జ్ఞానము కల వానితో పోల్చుట (భావము అస్పష్ఠముగా నున్నది).

ఆయుశ్రియమ్ యశో ధర్మమ్ లోకానాశిష ఏవ చ
హన్తి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః

సాధారణ అనువాదము : దీర్ఘాయువు, సంపద, నైపుణము, గౌరవము, శ్రేష్ఠత మరియు అతనికి అనుకూలమైన ప్రతీది కూడ అతని అతిక్రమణచే నాశనము చెందును (భాగవతాపచారము చే)

నిందంతియే భాగవత్చరణారవింద చింతావధూత సకలాఖిలకల్మషౌకాన్
తేశామ్ యశోదనసుకాయుర పత్యబందు మిత్రాణి చ స్తిరతరాణ్యపి యాంతి నాశమ్

సాధారణ అనువాదము : భగవానుని పాదపద్మములే అన్ని కల్మషములు హరించుటకు ఆధారామని భావించు భక్తులను నిందించు వారు తమ కీర్తిని, సంపదను, దీర్ఘాయుశ్శును, సంతానమును, బంధువులను, మిత్రులను, తమ స్వాధీనములోనివన్నీ కోల్పోవును.

అప్యర్చయిత్వా గోవిందమ్ తదీయాన్ నార్చయింత్యే
న తే విష్ణోః ప్రసాదస్య భాజనమ్ డాంబికాజనాః 

సాధారణ అనువాదము : పరమాత్మను మాత్రమే అర్చించి, వాని భక్తులను పూజించని కపటులు భగవానుని కృపకు పాత్రులు కారు.

శ్రీవచన భూషణము 204 వ సూత్రం –  ‘..ఇళవుక్కు అవర్గళ్ పక్కల్ అపచారమే పోరుమ్’

ఎట్లు స్వచ్చమైన భాగవతునితో గల అనుబంధము (మనకు జ్ఞాన అనుష్టానము లేకున్నను) ఒక ఆహ్లాదకరమైన ఫలితము నిచ్చునో, అటులనే మనకు సంపూర్ణ జ్ఞానము మరియు అనుష్టానము వున్నను, అట్టి భాగవతులకు ఒనర్చు అపచారమే, మనను దానికి దూరము చేయును.

వైష్ణవానామ్ పరీవాదమ్ యో మహాన్ శృణుతే నరః
శంకు పిస్తస్య నారాచైః కుర్యాత్ కర్ణస్య పూరణమ్

సాధారణ అనువాదము : వైష్ణవుని పై దూషణలను ఆలకించిన వారి చెవులు బల్లెములతో, బాణములతో నిండి పోవును.

శ్రీవచన భూషణము 203 వ సూత్రం –ఇవ్విడత్తిలే వైనతేయ వృత్తాన్తత్తైయుమ్, పిళ్ళైప్పిళ్ళైయాళ్వానుక్కు ఆళ్వాను పణిత్త వార్ త్తైయైయుమ్ స్మరిప్పతు

అపచారమొనర్చిన గరుడాళ్వార్ల రెక్కలను దహించివేస్తున్న అగ్ని

సాధారణ అనువాదము : ఇది అర్ధము కావలెననిన (భాగవతాపచారము యొక్క క్రూరత్వము) వైనతేయుని సంఘటనను (శాండిలిని దివ్యదేశమునకు బదులుగా దూరముగా ఏల నివసించుచున్నదని తలంచిన మాత్రమే గరుడుని రెక్కలు ఆహుతి అయినవి), పిళ్ళై పిళ్ళై కు భాగవతపచారము వీడుటపై ఆళ్వాన్ ఆదేశములపై ధ్యానమొనర్చుట.

ఈ విధముగా ఆచార్యాపచారము, భాగవతాపచారము అతి క్రూర ప్రవృత్తి కలవని వేదశాస్త్రము, పురాణములు, శాస్త్రసారము తెలిసిన జ్ఞానులు, ఆళ్వార్లు, మన ఆచార్యులు అనేక మార్లు వివరించిరి. ఇది అర్ధము అయిన ఆస్తికుడు (శాస్త్రమును నమ్మినవారు), సంసార బంధము నుండి ఉపశమనముపై దృష్టి కలవాడు, సరియైన గురువులు మరియు మనను సదా కాపాడువారైన భాగవతులపై ఎట్టి పరిస్థితులలోనూ అపచారమొనర్చరాదు. (స్వప్నములో నైనను). మా జీయర్ (మాముముణులు) ఈ విషయములను విస్మరించి చిన్న అపచారము చేసినను దానినుండి కోలుకోలేము, భూమి బ్రద్ధలైనచో దానిని కలపలేము, సాగరము భూమి పైకి వచ్చిన ఆ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు, ఒక పర్వతము శిరస్సున పడినచో దానిని భరించలేము – భాగవతాపచారము సరిదిద్దుకోలేని భాద్యతారాహిత్యమైన నేరమగును. ఇట్లు, తమ సదాచార్యునితో సమానులైన భాగవతుల పట్ల జాగరూకతతో ఉండి, పై సూత్రములను మరువకుండగ, ఎట్టి అపచారములను చేయరాదు. ఇదియేగాక, తమ ఆచార్యులు మరియు అట్టి భాగవతులపై సత్శిష్యుల ప్రవర్తనను గురించి తదుపరి వివరించిరి.

అనువాదకుని గమనిక : ఇట్లు, భాగవతాపచారము చెసినచో కలుగు దుష్పరిణామములను చూచితిమి. తదుపరి భాగములో, నిజమైన శిష్యుడు ఆచార్యునికి మరియు గొప్ప భాగవతులకు ఏమి చేయవలెనో గమనించెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారమునిచ్చిన శ్రీరంగనాథన్ స్వామికి కృతజ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: https://granthams.koyil.org/2013/07/anthimopaya-nishtai-14/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment