అంతిమోపాయ నిష్ఠ – 17

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/08/25/anthimopaya-nishtai-16-telugu/), మనము జన్మతో సంబంధము లేకుండా, శ్రీవైష్ణవుల కీర్తిని గమనించాము. తదుపరి, ఈ భాగములో, మనము భగవానునిచే, ఆళ్వార్లచే, ఆచార్యులచే శ్రీవైష్ణవులు కీర్తింపబడుటను మరియు దీనినే నిరూపించు మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనలను గమనించెదము.

శ్రీవైష్ణవుల కీర్తిని అనేక సందర్భములలో స్వయముగా భగవానుడే కీర్తించిరి.

లోకే కేచన మద్భక్తాస్ సద్ధర్మామృతవర్షిణః
సమయంత్యగమత్యుగ్రం మేఘా ఇవ తవానలమ్

సాధారణ అనువాదము : వర్షపు మేఘములు ఏ విధముగా అగ్ని వేడిని అణచి వేయునో, అదే విధముగా రాబోయే ప్రమాదములను నా భక్తులు కొందరు దూరము చేయుదురు.

తన బాల్య మిత్రుడైన సుధాముని కృష్ణుడు కలిసెను

జ్ఞాని త్వాత్మైవ మే మతం

సాధారణ అనువాదము : నా పరిపూర్ణ భక్తుడైన జ్ఞాని నా ఆత్మ – ఇది నా అభిప్రాయము

ప్రియోహి జ్ఞానినోత్యర్ధం అహం స చ మమ

సాధారణ అనువాదము : నా భక్తుడైన జ్ఞానికి నా పై మిక్కిలి అనుబంధము – నాకు కూడ అతనిపై అంతే (యధార్ధమునకు ఇంకను అధికము) అనుబంధము కలదు.

మహాభారత యుద్ధములో అర్జునుని రధసారధిగా కృష్ణుడు

మమ ప్రాణా హి పాండవాః

సాధారణ అనువాదము : పాండవులు నా ప్రాణవాయువు వంటి వారు.

నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం
అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యన్గ్రిరేణుపిః

సాధారణ అనువాదము : యతులను నేను సదా అనుసరించి, వారి పాదపద్మముల ధూళిని స్వీకరించెదను, వారు స్వార్ధ ప్రయోజనములకు అతీతులుగా, శాంతియుతులుగా, విరోధ రహితులుగా, అందరి ఆత్మలయందు సమదృష్టి కలవారుగా వుందురు.

మాముణులను తమ ఆచార్యునిగా స్వీకరించిన శ్రీరంగనాధుడు – పెరియ జీయర్ పై తమ అత్యంత అనుబంధము / ఆదరణను వెల్లడించిరి

మమ మద్భక్తేషు ప్రీతిరభ్యధికా నృప
తస్మాన్ మత్ భక్తభక్తాశ్చ పూజనీయా విశేషతః

సాధారణ అనువాదము : నా భక్తులపై నా ప్రేమ అత్యంత గొప్పది, నా భక్తులు పూజింపబడి నప్పుడు అది ఇంకను ప్రత్యేకమైనది, నాకు ప్రియమైనది

కృష్ణుడు మరియు నమ్మాళ్వార్ – వీరిరువురి దివ్య ప్రేమానుబంధమును బహిర్గతము చేయుట

అన్నాధ్యమ్ పురతో న్యస్తమ్ దర్శనాత్ గృహ్యతే మయా
రసాన్ దాసస్య జిహ్వాయామస్నామి కమలోద్భవ

సాధారణ అనువాదము : ఓ కమలోధ్భవ (బ్రహ్మ – తామర పుష్పము నుంచి జన్మించిన) ముందుగా నాకొసగిన ప్రసాదమును దృష్టి ద్వారా స్వీకరించి, నా భక్తుల జిహ్వ ద్వారా నేను ఆస్వాదించెదను.

మద్భక్త జన వాత్సల్యమ్ పూజాయాంచ అనుమోదనమ్
స్వయమభ్యర్చనమ్ చైవ మదర్ధే డంబవర్జనమ్
మత్కధా శ్రవణే భక్తిసర్వనేత్రాంగ విక్రియా
మమానుస్మరణమ్ నిత్యమ్ యచ్చ మామ్ నోపజీవతి
భక్తిరష్ట విధా హ్యేషా యస్మిన్ మ్లేచ్చేపి వర్తతే
స విప్రేంద్రో మునిశ్రీమాన్ స యతిశ్శ చ పణ్డితః
తస్మై ధ్యేయమ్ తతో గ్రాహ్యమ్ స చ పూజ్యో యతా హ్యహమ్

సాధారణ అనువాదము : నా భక్తులకు ఈ క్రింది 8 లక్షణములు ముఖ్యముగా నుండును –

  • ఎంపెరుమాన్ భక్తులపై నిర్హేతుకమైన ప్రేమ
  • ఎంపెరుమాన్ ఆరాధనను (ఇతరుల) ఆస్వాదించుట
  • తాను స్వయముగా ఎంపెరుమాన్ ఆరాధన చేయుట
  • అహంకార రహితుడుగా నుండుట
  • ఎంపెరుమాన్ గురించిన విషయములను ఆసక్తిగా శ్రవణము చేయుట
  • ఎంపెరుమాన్ గురించి శ్రవణము / భావన / భాషణము చేయునపుడు శరీరము మార్పులకు లోనగుట ( ఒడలు పులకరించుట, మొ || )
  • సదా ఎంపెరుమాన్ నే తలంచుట
  • ఎంపెరుమాన్ ను ఆరాధించునపుడు భౌతిక ప్రయోజనములను ఆశించకుండుట.
    అట్టి భక్తులు, వారు మ్లేఛ్చులైనను, వారిని నాతో సమానముగా బ్రాహ్మణ పెద్దలు, మధ్యవర్తులు, కైంకర్యపరులు, యతులు, పండితులు ఆరాధించగలరు. వారు అట్టి పండితులకు జ్ఞానమును ఇచ్చుటకు మరియు స్వీకరించుటకు యోగ్యులు.

ఈ విధముగా, భగవానుడు తానే స్వయముగా తన భక్తుల గురించి వారు ఈ సర్వ జగత్తును శుద్ధి చేయు సమర్థులు, వారు నా ఆత్మ వంటివారు, వారు నాకు ప్రాణ వాయువు వంటి వారు, వారిని నేనే స్వయముగా అనుసరించెదను, వారి పాదపద్మముల ధూళిని కాంక్షించెదను, వారిని ఆదరించి / సేవించిన వారు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు, వారితో జరుపు వ్యవహారముల ద్వారా లభించు ఆహారమును నేను ఆస్వాదించెదను, వారు మ్లెచ్చులుగా జన్మించినను, నాతో సమానముగా ఆరాధ్యయోగ్యులు అని ప్రకటించిరి.

భూమి పిరాట్టి (భూదేవి తాయారు) తమ అంతిమ లక్ష్యముగా మహా భాగవతులను దర్శించుట, స్పృశించుట, వారితో ముచ్చటించుట అని ప్రకటించిరి; వారి యొక్క దివ్య మంగళకరమైన లక్షణములను వర్ణించుటకు తాను అశక్తురాలనని, వారి మహిమలను పూర్తిగా వివరింపజాలనని తెలిపెను. దీనినే ఈ క్రింది శ్లోకములలో వివరించిరి :

అక్ష్ణోః ఫలమ్ తాద్రుసదర్శనమ్ హి తన్వాః ఫలమ్ తాద్రుసగాత్రసంగమ్
జిహ్వాఫలమ్ తాద్రుసకీర్తనంచ సుధుర్లబా భాగవతా హి లోకే

సాధారణ అనువాదము : నేత్రముల లక్ష్యము గొప్ప భాగవతుల దర్శనము; మన శరీర లక్షణము గొప్ప భాగవతుల యొక్క స్పర్శనము; మన నాలుక లక్షణము గొప్ప భాగవతులను కీర్తించుట; ఈ జగత్తులో అట్టి భాగవతులు అరుదుగా లభించెదరు.

నాహమ్ సమర్ధో భగవత్ ప్రియాణామ్ వక్తుమ్ గుణాన్ పద్మ భువోప్యగణ్యాన్
భవత్రభావమ్ భగవాన్ హి వేత్తి తధా భవన్తో భగవత్ ప్రభావమ్

సాధారణ అనువాదము : భగవానుని భక్తిలో లీనమైన అట్టి భాగవతుల ఔన్నత్యమును గురించి వచించుటకు నేనర్హుడను. ఆ పరమాత్మకే వారి ఔన్నత్యము తెలియును, వారికి మాత్రమే ‘అతని’ ఔన్నత్యము తెలియును.

ఆళ్వార్లు కూడ భాగవతులను కీర్తించిరి, యమ భటులకు (యమధర్మ రాజుగారి సేవకులు) వారిపై నియంత్రణ లేదని గుర్తించిరి.

యమభటుల హస్తములనుంచి అజామిళుని విష్ణుదూతలు కాపాడిరి

తిరుమళిశై ఆళ్వార్ – నాన్ముగన్ తిరువందాది 68

తిఱమ్బేన్మిన్ కణ్డీర్
తిరువడి తన్నామమ్ మఱన్దుమ్ పుఱన్దోళా మాన్దర్
ఇఱైఞ్జియుమ్ శాదువరాయ్ ప్పోదుమిన్గళెన్ఱాన్
నమనుంతన్ తూదువరై క్కూవిచ్చెవిక్కు

సాధారణ అనువాదము : యముడు తమ దూతలతో “ఈ ఆదేశమును విస్మరించరాదు. భగవానుని నామములను కూడ మరచినను అన్య దేవతారాధనను చేయని శ్రీవైష్ణవులను మీరు ఆరాధించుడు, వారిని మిక్కిలి ఆదరించుడు, శుద్ధి పొందుడు” అని పలికిరి. (అనువాదకుని గమనిక: దీనికి విలక్షణమైన ఉదాహరణగా – భార్యా భర్తల మధ్య మనస్ఫర్ధలు ఏర్పడినప్పుడు, భర్తతో మాటలాడక భార్య వున్నచో అది అర్ధము చేసికొనవచ్చును గాని, ఆమె వేరొక పురుషునికై చూచుట, పూర్తిగా అనంగీకారయోగ్యమగును).

పోయిగై ఆళ్వార్ – ముదల్ తిరువందాది 55

అవన్ తమర్ ఎవ్వినైయర్ ఆకిలుమ్
ఎమ్ కోన్ అవన్ తమరే యెన్ఱు ఒళివతల్లాల్
నమన్ తమరాల్ ఆరాయప్పట్టు అఱియార్ కణ్డీర్
అరవణై మేల్ పేరాయఱ్కు ఆళ్ పట్టార్ పేర్

సాధారణ అనువాదము : శ్రీమన్నారాయణునికే అంకితులైన శ్రీవైష్ణవులు నాకు గురువులు, వారి చర్యలు ఏమైనను. ఆదిశేషునిపై పవళించి, గోపాల బాలునిగా దర్శనమిచ్చిన భగవానునికి సంపూర్ణ శరణాగతులైన శ్రీవైష్ణవుల దోషములను విశ్లేషించుటకు యమభటులు కూడ అనర్హులు.

నమ్మాళ్వార్ – తిరువాయ్మొళి 5.2.1

ఎంపెరుమానార్లకు ఘనమైన ఊరేగింపు – వారి ప్రత్యక్షము సమస్త జగత్తుకు శుభసూచకము

పొలిక పొలిక పొలిక పోయిఱ్ఱు వల్ ఉయిర్ చ్చాపమ్
నలియుమ్ నరకముమ్ నైన్ద నమనుక్కు ఇఙ్గుయాతొన్ఱుమ్ ఇల్లై
కలియుమ్ కెడుమ్ కణ్డు కొణ్మిన్
కడల్వణ్ణన్ పూదఙ్గళ్ మణ్మేల్ మలియప్పుకున్దు ఇశైపాడి ఆడి ఉళి తరక్కణ్డోమ్

సాధారణ అనువాదము : సాగరము (ముత్యములతో మొ || వానితో నిండి వున్నది) వలె శక్తివంతుడు, నీలి వర్ణము గలిగి మిక్కిలి సుందరుడైన భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసిన అనేక భాగవతుల ఆట పాటలను నేను వీక్షించితిని. ఇట్టి భాగవతుల వలన, ప్రజల మనస్సులలో నున్న అజ్ఞానము నశించును. అజ్ఞానము తొలగినందుచే, వీరిని నరక లోకములో పడవేయు యమునికి, యమ కింకరులకు పని లేకుండా పోయెను. కలియుగ దోషములు అనే అంతర్లీన కారణము కూడ తొలగెను. ఇట్టి శుభ సూచకము కలకాలము ఉండగలదు.

తిరుమంగై ఆళ్వార్ – పెరియ తిరుమొళి 8.10.7

వెళ్ళై నీర్ వెళ్ళత్తు అణైన్ద అరవణై మేల్
తుళ్ళు నీర్ మెళ్ళత్తుయిన్ఱ పెరుమానే!
వళ్ళలే! ఉన్ తమర్కెన్ఱుమ్ నమన్ తమర్
కళ్ళర్ పోల్ కణ్ణపురత్తుఱై అమ్మానే!

సాధారణ అనువాదము : క్షీరాబ్ధిలో (పాల సముద్రము) ఆదిశేషునిపై శయనించియున్న ఓ పరమాత్మ! తిరుక్కణ్ణపురములో ఓ స్వామి (నా ముందరనే వున్నారు)! చోరులు ఇతరుల నుంచి ఏ విధముగా దాగెదరో, నీ భక్తులను చూచిన యమభటులు కూడ అదేవిధముగా దాగు కొనెదరు.

ఆళ్వార్లు (తొండరప్పొడి ఆళ్వార్) “నావలిట్టు ఉళి తరుగిన్ఱోమ్ నమన్తమర్ తలైగళ్ మీతే” (మేము జయధ్వానము చేయుచు, యమభటుల శిరములపై నుండి నడచెదము).

శ్రీవైష్ణవులను నియంత్రించుటపై యమభటులు దృష్టి సారించుటను, అట్టి చర్యలు గైకొనినచో వారు మిక్కిలి బాధ పడుదురని ఆళ్వార్లు పేర్కొనిరి. శ్రీవైష్ణవుల మహిమలు అంత గొప్పవి.

“న కలు భాగవతా యమ విషయం గచ్ఛంతి” (భాగవతులు, యమునకు పరస్పర చర్యలకు ఏమియును లేదు) భాగవతుల మహిమలను కూడ వివరించిరి. ఈ విషయములో, భాగవతులతో యముని చర్యలు, ఇత్యాదులను ఈ క్రింది శ్లోకములో వివరించిరి.

స్వ పురుషమ్ అపి వీక్ష్య పాచహస్తమ్ వతతి యమః కిల తస్య కర్ణమూలే
పరిహర మధుసూధన ప్రపన్నాన్ ప్రభురహమ్ అన్యనృణామ్ న వైష్ణవానామ్

కమలనయన వాసుదేవ విష్ణో ధరణిధరాచ్యుత శంఖ చక్రపాణే
భవ శరణమితీరయన్తి యే వై త్యజ భటదూరతరేణ ధనపాపాన్

సాధారణ అనువాదము: యముడు తన కింకరులను దగ్గరకు రమ్మని, వారితో మధుసూధనుని శరణాగతి చేసిన శ్రీవైష్ణవులకు తాను స్వామిని కానని, కాని తదితరులు తన నియంత్రణలో నుందురని వివరించిరి. శ్రీవైష్ణవులతో తటస్థముగా నుండగలరని, కమలనేత్రుడు, వాసుదేవుడు, విష్ణువు, ధరణీ ధరుడు (భూమిని చేత ధరించిన వాడు), శంఖ చక్రములు తన హస్తములలో ధరించిన వాడైన భగవానునికి వారు శరణాగతి చేసినందులకు, వారికి దూరముగా నుండమని తెలిపిరి.

ఈ విధముగా, యమ ధర్మరాజు తన కింకరులతో, మీరు శ్రీవైష్ణవులని అదుపు చేయజాలరని ఆదేశించిరి, భగవానుని క్రోధము నుంచి కాపాడ బడుటకై శ్రీవైష్ణవులకు దూరముగా ఉండుమని అనిరి. భాగవతుల ఇట్టి మహిమలను శ్రీవిష్ణుపురాణము, ఇత్యాదులలో వివరించిరి.

అభాగవతులతో కలిసి ఉండుట అనగా భాగవతులతో మరియు భగవానునితో ఎడబాటుకు దారి చూపును. భాగవతులతో కలియుట, భగవానునితో కలయికకు మార్గము, అభాగవతులను వీడివుండుట మోక్షమునకు దారి చూపును. నిజమైన ఆచార్యుని పర్యవేక్షణలో నున్నవారు సంసారము వలన కలత చెందరు. అట్టి పర్యవేక్షణను శిష్యుడు వదలి వేసినచో, అతడు ఈ సంసారములో సదా బాధలను అనుభవించును. దీనినే ఆచ్చాన్ పిళ్ళై మాణ్ణిక్కమాలైలో వివరించిరి.

కావున, శిష్యుని ప్రతి అంశము ఆచార్యుని అధీనములో నుండ వలెను. కాని, తన కలవరపాటుచే, ఆచార్యునితో సంబంధమును మరచినను, తన స్వబుద్ధిచే అకృత్యకరణము (శాస్త్రము నిషేధించన కార్యములు) లలో జోక్యము చేసుకొనినను, భగవదపచారము (భగవానుని నిందించుట), భాగవతాపచారము (భాగవతులను నిందించుట), అసహ్యపచారము (భగవంతుని – భాగవతులను అకారణముగా నిందించుట) ఇత్యాదులను గావించిన ఫలితముగా రౌరవాది నరక కూపములలో బాధలను అనుభవించుటకు యోగ్యుడగును. నిజమైన ఆచార్యుడు, తమ శిష్యులు, ఇట్లు దిగజారినచో, వారనుభవించు బాధలను ముందుగనే పసిగట్టి, తమ నిర్హేతుక దయచే, వారిని శుద్ధి చేయగలరని, ” పయనన్ఱాగిలుమ్ పాఙ్గల్ల రాగిలుమ్ శెయల్ నన్ఱాగ త్తిరుత్తిప్పణి కొళ్వాన్” కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 10 లో గుర్తించిరి (నేను అప్రయోజకుడను, మిక్కిలి అయోగ్యుడ నైనను, నమ్మాళ్వార్ నన్ను సంస్కరించి, తన దాసుని చేసుకొనిరని, మధురకవి ఆళ్వార్ తెలిపిరి) ఇదియే నిజమైన ఆచార్యుల లక్షణము.

ఆచార్యుల నిర్హేతుక దయ అను ఈ లక్షణమును మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనల ద్వారా వివరించిరి.

ఎంపెరుమానార్ ఆదేశములననుసరించి, ఆళ్వాన్ వరదరాజస్తవమును గానము చేయుచు, నాలూరన్ కు కూడ పరమపదమును ప్రసాదించగలరని దేవ పెరుమాళ్ళను చివరలో అభ్యర్థించిరి.

కూరత్తాళ్వాన్ శిష్యుడైన నాలూరన్ క్రిమికంఠునితో కలిసి ఆళ్వాన్ పై (నాలూరన్ యొక్క ఆచార్యులు) అత్యంత క్రూరమైన దోషమును గావించగా, పెరుమాళ్ వారిపై మిక్కిలి కలత చెంది “న క్షమామి” (నేను ఎన్నటికి నిన్ను క్షమించను) అని పలికిరి. కాని, ఆళ్వాన్ తమ నిర్హేతుక దయ చూపుచు, పెరుమాళ్ తో అంగీకరించక, “నాలూరన్ కూడ తమ వలనే పరమపదము పొందవలెను” అని పెరుమాళ్ ను అభ్యర్థించిరి.

అనుచిత సహవాసముతో కలిగిన కలవరపాటుచే, భట్టరు శిష్యులలో ఒకరు, ప్రాపంచిక విషయ సంబంధముచే, వారితో ” భట్టర్! ఇక మన మధ్య ఎట్టి సంబంధము లేదు ” అని పలికి, వారి పాదపద్మములను వీడు ప్రయత్నము చేసిరి. భట్టరు, అతనితో ” ప్రియ కుమారా! నీవలా తలంచవచ్చు. నీవు నాతో సంబంధమును వీడినను, నేను వీడను” అనిరి మరియు అతనిని మరల సంస్కరించిరి.

నంజీయర్ అయిన వేదాంతికి గల ఒక ప్రియ శిష్యుడు, మిక్కిలి వైరాగ్యము కలిగి, పుణ్య ప్రవృత్తితో నిండి వుండిరి. కాని అసాత్విక ఆహారమును స్వీకరించిన కారణముచే అతనిలో అహంకారము, ఇత్యాదులు పెరిగి, నంజీయర్ ను శరణు చేయుటకు ముందు వినియోగించిన గొడ్డలిని మరల చేత ధరించి, తమ రాజుగారి సేవకై తిరిగి ప్రయాణమైరి. నంజీయర్ అతనిని ఏదో విధముగా పట్టుకొని, ఒక ఏకాంత గదిలో నుంచి, అతనికి సరియగు ఆదేశముల నిచ్చుటకై తలుపులు మూసి వేసిరి. నంజీయర్ పాద పద్మములను ఆశ్రయించిన శ్రీవైష్ణవులు కలత చెంది, వారితో “ఓహ్! ఇది మంచిది కాదు. అతని చేతనున్న గొడ్డలితో మీపై అఘాయిత్యము చేయగలడు, కావున మీరు వెంటనే గదిని వదిలి బయటకు రాగలరు” అనిరి. నంజీయర్ సమాధానముగా “అతను శుద్ధి పొందు వరకు నేను బయటకు రాను. తన ఆత్మ స్వరూపమును గ్రహించి ఉజ్జీవుడైనను కావలెను లేదా అతని చేతిలో గొడ్డలిచే నేను హతుడనగుదును” అనిరి.

పిళ్ళై లోకాచార్యులు – అన్ని మంగళకర లక్షణములకు నిధి

శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు ఈ విధముగా తెలిపిరి. తమపై తామే అపరాధమును చేసికొనిన వారిపై, పోఱై (జాలి), కృప (దయ), చిరిప్పు (చిరునవ్వు), ఉగప్పు (ఆనందము), ఉపకార స్మృతి (కృతజ్ఞత) ఉండాలి. ఇంతేకాక, అతను వ్యక్తిగతంగా మరింత గౌరవముగా ప్రవర్తించగలుగుట, శ్రీవైష్ణవుని నడవడికకు అంతిమ ఉదాహరణ అగును.

స్వీకరోతి సదాచార్యాస్ సర్వానప్య విశేషతః
యత్పునస్తేశు వైషమ్యమ్ తేషామ్ చిన్ జ్ఞానవృత్తయోః

సాధారణ అనువాదము : సదాచార్యుడు అందరిని శిష్యులుగా అంగీకరించగలరు వారికి మంచితనము లేకపోయినను. తదుపరి అట్టి లోపభూయిష్ఠమైన వారికి ఆత్మ జ్ఞానమును,  తదనుగుణమైన అనుష్ఠానమును (శిష్యుని తో నిబద్ధత గల ఆచరణ) బోధించి, వారి దోషములను తొలగించెదరు.

తేషామేవ హి దోషోయమ్ న చాశ్యేతి వినిశ్చితమ్
అపక్వ పద్మకోశానామ్ అవికాసో రవేర్యతా

సాధారణ అనువాదము : సూర్య కిరణములు సోకినను, అపక్వమైన పద్మముల రేకలు వికసించనట్లు, శిష్యుల లోపములు వారి అపరిణిత వికాసము వలన మాత్రమే గలవని, తమ వలన కాదని భావించెదరు (శిష్యుడు జ్ఞానములోను, క్రమ శిక్షణ లోను పరిణతి పొందువరకు ఆచార్యులు సంస్కరించెదరు కాని అతనిని నిరాకరించరు).

పై శ్లోకములు గుర్తించినట్లు, ఒక శిష్యుడు ఆచార్యుని శరణు చేసినను, అతని అజ్ఞానము / దోషము వలన మరల దుశ్చర్యలు గావించి తన వ్యక్తిత్వము కోల్పోయినను, ఆచార్యుడు అతనిని సంస్కరించి మరియు రక్షించెదరు, “స్కాలిత్యే శాస్త్రము” లోని ఆదేశముల ద్వారా (తప్పు దారిలో నడచు శిష్యునికి సక్రమ ఆదేశముల నొసంగి సరి చేయుదురు), తమ అపార కరుణచే “దేషికో మే దయాళు” లో చెప్పిన విధముగా (నా పై ఆచార్యులు అపార కరుణ చూపిరి).

వాసుదేవమ్ ప్రపన్నానామ్ యాన్యేవ చరితాని వై
తాన్యేవ దర్మశాస్త్రాని త్యేవమ్ వేద విధో విధుః

సాధారణ అనువాదము : వేదములలో నిష్ణాతులైన వారు వాసుదేవునికి ప్రపన్నులైన (సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు) వారి జీవితమును ధర్మ శాస్త్రముగా పరిగణించెదరు.

మన పూర్వాచార్యుల యొక్క ఇట్టి విశిష్ఠ లక్షణములను మన ఆచార్యులు (మాముణులు) విశదీకరించిరి. వారు ఆళ్వార్ తిరునగరి లోని ఓలమిచ్చాన్ మఠములో (ఒక పూరి గుడిశె) విశ్రాంతి తీసుకొను సమయములో, క్రూర స్వభావులైన కొందరు (ఎంపెరుమాన్ కు ఇచ్చు ఆహారమును విషపూరితము చేసిన ఛండాలురు), మాముణులపై అసూయతో అర్ధరాత్రి సమయములో ఆ మఠమును అగ్నికి ఆహుతి గావించిరి. (అనువాదకుని గమనిక: ఆ మఠము లోని మంటల నుంచి మాముణులు ఆదిశేషుని రూపములో బయటకు దూరి వచ్చి, అగ్నికి ఆహుతి అగుచున్న ఆ మఠమును తిలకించుచు నిలబడిరి). ఆ స్థానీయ నిర్వాహకులు అట్టి ఘోర నేరము చేసిన పాపులను శిక్షించుటకు వారికై అన్వేషించసాగిరి. కాని, ఈ క్రింది ప్రమాణముల ద్వారా మాముణులు, వారి చర్యలను వ్యతిరేకించి, ఆ దుర్మార్గులను క్షమించమని మరియు వారిని వదిలి వేయమని కోరిరి. (అనువాదకుని గమనిక : మాముణులను ఇచట సీతా పిరాట్టితో పోల్చిరి – ఆమె కూడ తనపై హాని చేసిన వారిపై మిక్కిలి దయతో కనికరించెను. అదే విధముగా మాముణులు కూడ తమను అంతము చేయదలచిన వారిపై మిక్కిలి దయను కృపజేసి, వారిని చివరకు సంస్కరించిరి.

మిక్కిలి దయా స్వభావము గల సీతా పిరాట్టి మరియు మాముణులు (ఆళ్వార్ తిరునగరి)

పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమ
కార్యమ్ కరుణ మార్యేణ న కశ్చి న్నా పరాద్యతి

సాధారణ అనువాదము : హనుమాన్ తో సీతా పిరాట్టి – ఓ హనుమా! ఉదార స్వభావము కలవారు పాపాత్ములపై, పుణ్యాత్ములపై, మరణార్హులు అయిన వారిపై కూడ దయను చూపవలెను, ఏలనన, దోషములు చేయని వారు ఎవరూ వుండరు.

భావేయం శరణం హి వాః

సాధారణ అనువాదము : రాక్షస స్త్రీలతో సీతా పిరాట్టి – ఎట్టి పరిస్థితులలో నైనా మీకు నా అభయము

కః కుప్యేధ్ వానరోత్తమః

సాధారణ అనువాదము : హనుమానునితో సీతా పిరాట్టి – తమ యజమానుల ఆదేశములను పాటించు సేవకురాండ్రతో ఎవరు ఆగ్రహించెదరు?

ఈ విధముగా అత్యంత దయా స్వరూపులైన ఆచార్యులు మాముణులు, మిక్కిలి పాపులైన వారిని కూడ నిర్వాహకులు శిక్షింపకుండా చేసిరి. ఈ సంఘటన అన్ని ప్రాంతములలో ప్రాచుర్యము పొందెను. ఇంకను, మన ఆచార్యుని అత్యంత దయా స్వభావము, వారి అవతార విశేషమును (ఆదిశేషుని అవతారము, శ్రీ రామానుజులుగా మరల ఆగమనము) మనము ముంగిస మరియు చిలుక, వృక్షము (మాముణులు తింత్రిణీ వృక్షమునకు మోక్షమును ఇచ్చుట), విశిష్ఠ వ్యక్తుల స్వప్నములు (కోయిల్ అణ్ణాణ్, తిరుపతి లోని సాధు శ్రీవైష్ణవులు, మొ ||, మాముణుల గొప్పదనమును ముందుగానే దర్శించిరి) వంటి సంఘటనల ద్వారా గమనించగలము.

అనువాదకుని గమనిక : ఈ విధముగా, మనము శ్రీవైష్ణవుల దివ్య కీర్తిని, ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యులు గుర్తించినారని, అవి ప్రతిబింబించిన కొన్ని సంఘటనలను
గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై చూపిన షరతులులేని దయను గమనించితిమి. ఇప్పుడు మనము ఈ దివ్య గ్రంధము యొక్క అంతిమ భాగమును దర్శించెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములకు తగిన అనువాదమును ఒసంగిన శ్రీరంగనాథ స్వామికి ధన్యవాదములు.

తదుపరి భాగములో, ఈ అద్భుత గ్రంధము యొక్క కడపటి విశేషములను మనము దర్శించెదము.

సశేషము…

అడియేన్ గోపీకృష్ణమాచార్యులు బొమ్మకంటి, రామానుజ దాసన్ .

మూలము: https://granthams.koyil.org/2013/07/anthimopaya-nishtai-17/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment