అనధ్యయన కాలం

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః 

అధ్యయనం అంటే చదవడం, నేర్చుకోవడం, పునఃపునః ఉచ్చరించడం / పఠించడం. వేదం ఆచార్యుల ద్వారా శ్రవణం చేస్తూ, అదే విధంగా అధ్యయనం చేయబడుతుంది. వేద మంత్రాలు నిత్య అనుష్ఠానాలలో భాగంగా క్రమం తప్పకుండా జపించబడతాయి. అనధ్యయనం అంటే అధ్యయనం చేయకుండా, పఠనం చేయకుండా విరమించటం అని అర్థం.

సంవత్సరంలో కొన్ని కాలాలలో వేద పఠనం చేయరాదు. ఆ కాలాన్ని స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు వంటి శాస్త్రంలోని ఇతర భాగాలను నేర్చుకోవడానికి వినియోగిస్తారు. అలాగే సంవత్సరం పొడవునా అమావాస్య, పౌర్ణమి, పాడ్యమి వంటి రోజులు వేదాధ్యయనానికి అనుకూలం కావు.
ద్రావిడ వేదముగా భావించబడే నాలాయిర దివ్య ప్రబంధాలు కూడా సంస్కృత వేదానికి సమానమని పరిగణించబడుట వలన, కొన్ని కాలాలలో దివ్య ప్రబంధాల అధ్యయనం / పఠనం చేయకూడదనే సంప్రదాయం ఉంది.

అనధ్యయన కాలం తిరుక్కార్తికై దీపోత్సవం తరువాతి రోజు ప్రారంభమవుతుంది. సాధారణంగా దేవాలయాలలో అధ్యయనోత్సవం ముగిసిన తరువాత ఈ కాలం ముగుస్తుంది. గృహాలలో మాత్రం తై హస్తం నాడు మళ్లీ దివ్య ప్రబంధ పఠనం ప్రారంభించే ఆచారం ఉంది.

ఈ అధ్యయనోత్సవం తొలిసారిగా తిరుమంగై ఆళ్వార్ శ్రీ రంగంలో వైకుంఠ ఏకాదశి నాడు నమ్మాళ్వార్ పరమపద ప్రాప్తిని స్మరిస్తూ తిరువాయ్ మొళి పఠనంతో నిర్వహించారు. అనంతరం శ్రీమన్నాథమునిగళ్ సమస్త ఆళ్వార్ల దివ్య ప్రబంధాల పఠనం జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ఎంపెరుమానార్ ఈ ఉత్సవం అన్ని దివ్యదేశాలలో నిర్వహించబడేలా ఏర్పాటు చేశారు. తరువాతి ఆచార్యులు ఈ సంప్రదాయాన్ని ఎంతో వైభవంగా కొనసాగించారు.

అనధ్యయన కాలంలో ఏమి నేర్చుకోవాలి, ఏమి పఠించాలి?

కింద కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వబడుతున్నాయి:

  • సాధారణంగా దేవాలయాలలో అనధ్యయన కాలంలో తిరుప్పావై స్థానంలో ఉపదేశ రత్తినమాలై పఠించబడుతుంది; కోయిల్ తిరువాయి మొళి / రామానుజ నూట్రన్దాది స్థానంలో తిరువాయ్ మొళి నూట్రన్దాది పఠించబడుతుంది.
  • మార్గళి మాసంలో తిరుప్పళ్ళియెళుచ్చి / తిరుప్పావై పఠనం మళ్లీ ప్రారంభమవుతుంది.
  • దేవాలయాలలో అధ్యయనోత్సవ సమయంలో నాలుగు వేల పాశురాలు ఒకసారి సంపూర్ణంగా పఠించబడతాయి.
  • గృహాలలో తిరువారాధన సమయంలో అనధ్యయన కాలంలో నాలుగు వేల దివ్య ప్రబంధాల పాశురాలు పఠించరు (మార్గళి మాసంలో దేవాలయాల మాదిరిగానే తిరుప్పావై, తిరుప్పళ్ళియెఴుచ్చి పఠించబడతాయి).
  • కోయిల్ ఆళ్వార్ తలుపు తెరుస్తూ సాధారణంగా పఠించే జితంతే స్తోత్రం (మొదటి రెండు శ్లోకాలు), “కౌసల్యా సుప్రజా రామ” శ్లోకం, “కూర్మాదీన్” శ్లోకాలు పఠించి తలుపు తెరుస్తారు. అనధ్యయన కాలంలో కూడా ఇదే విధానం. అయితే హృదయంలో ఆళ్వార్ పాశురాలను స్మరించడం పై ఎటువంటి నిషేధం లేదు.
  • తిరుమంజనం సమయంలో సూక్తాలు పఠించిన తరువాత సాధారణంగా “వెన్నై అళైంత కుణుంగుమ్” పదిగం మొదలైన పాశురాలు పఠిస్తారు; అనధ్యయన కాలంలో సూక్తాలతోనే ఆపుతారు.
  • మంత్ర పుష్పంలో సాధారణంగా “సెండ్రాల్ కుడైయామ్” పాశురం పఠిస్తారు; అనధ్యయన కాలంలో దాని స్థానంలో “ఎంపెరుమానార్ దర్శనం ఎన్ఱే” పాశురం పఠిస్తారు.
  • శాత్తుమురైలో సాధారణంగా “శిత్తుం శిరుకాలే”, “వంగ క్కడల్”, “పల్లాండు పల్లాండు” పాశురాలు, అనంతరం “సర్వ దేశ దశా కాలే…” విధానం మరియు వాళి తిరునామాలు పఠిస్తారు; అనధ్యయన కాలంలో వీటి స్థానంలో ఉపదేశ రత్తినమాలై మరియు తిరువాయి మొళి నూట్రన్దాది పాశురాలు పఠిస్తారు.

ఈ కాలం సంస్కృతంలో ఉన్న పూర్వాచార్య స్తోత్ర గ్రంథాలను (అనేకం ఉన్నాయి) మరియు జ్ఞాన సారం, ప్రమేయ సారం, సప్త గాథై, ఉపదేశ రత్తినమాలై, తిరువాయి మొళి నూట్రన్దాది వంటి తమిళ ప్రబంధాలను నేర్చుకోవడానికి అనుకూలమైనది. అలాగే మన ఆచార్యుల తనియన్లు, వాళి  తిరునామాలు ఈ సమయంలో నేర్చుకుని పఠించవచ్చు.
ఇంకా, ఈ కాలంలో రహస్య గ్రంథాల అధ్యయనం చేయడం మరియు అవి కంఠస్థం చేయ తగును. 

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్  

ఆంగ్లం లో: https://granthams.koyil.org/2023/05/18/anadhyayana-kalam-english/

పొందుపరిచిన స్థానం: https://granthams.koyil.org/  

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment