శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/08/07/anthimopaya-nishtai-15-telugu/ ), మనము ఆచార్యులు, భాగవతుల ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను తెలుసుకొంటిమి. ఈ తదుపరి భాగములో మనము వారి జన్మతో సంబంధము లేని శ్రీవైష్ణవుల మరిన్ని మహిమలను చర్చించెదము.
పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్, మణవాళ మాముణులు
పిళ్ళై లోకాచార్యుల పిన్న దైవాంశ సోదరులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, ఆచార్య హృదయములో లోతైన రమణీయ అర్థాలను అనుగ్రహించి దీవించిరి.
చూర్ణిక 85 లో, శ్రీవైష్ణవుని జన్మ ఉత్తమమైనదా లేక అల్పమైనదా అను విషయము ఈ క్రింది సంఘటనల ద్వారా విశదీకరించిరి. (అనువాదకుని గమనిక: ఈ భాగములో, ఎవరినైనను వారి గొప్పదనము జన్మతః కాదని, వారికి భగవానునిపై మరియు భాగవతులపై గల భక్తిని బట్టి నిర్ణయించవలెనని నిరూపించిరి. ప్రతి విషయము భౌతిత దృష్టికోణంతో మాత్రమే ఎంచబడే నేటి యుగములో, మన పూర్వాచార్యుల సాహిత్యము, వారి నడవడిని మన ఆదర్శంగా చేసుకొని, ఈ భౌతిత భావన కంటే పైకి ఎదిగి జీవనము సాగించవచ్చును. చక్కదనమేమనగా – మన పూర్వాచార్యులు అన్ని వర్ణముల భాగవతులను గౌరవించే పరమ ఆస్తికులు (వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించేవారు).
- మ్లేచ్చనుమ్ భక్తనానాల్ చతుర్వేదికళనువర్తక్క అఱివుకొడుత్తుక్కులదైవ త్తొడొక్క పూజై కొణ్డు పావన తీర్థప్రసాదనామెన్గిఱ తిరుముఖ ప్పడియుమ్
తన నిజమైన భక్తులకు 8 లక్షణములు ఉండవలెనని ఎంపెరుమాన్ స్వయముగా తెలిపిరి. వారు మ్లేచ్చులైనను (వర్ణాశ్రమ ధర్మములలో భాగము కాని వారు), ఈ లక్షణములు కలిగి, 4 వేదములలో నిష్ణాతులైనచో, వారిని అంగీకరించి ఎంపెరుమాన్ తో సమానముగా పరిగణించ వచ్చును (యధార్ధముగా వారిని గౌరవించి / ఎంపెరుమాన్ కంటే ఉన్నతముగా పరిగణించ వచ్చును) – అనగా వారితో భగవద్విషయమును పంచుకొని, వారిని ఆరాధించి, వారి శ్రీపాద తీర్థమును, శేష ప్రసాదమును స్వీకరించినచో, అవి మనను శుద్ధి పరచును.
ఆ 8 లక్షణములు ఇవి:
-
- భగవత్ భక్తులతో నిబంధనలేని ప్రేమతో నుండుట,
- ఇతరుల భగదారాధనను ఆనందించుట,
- స్వయముగా తాను భగవానుని ఆరాధించుట,
- అహంకారరహితుడుగా నుండుట,
- భగవత్ విషయాలను శ్రద్ధగా ఆలకించుట,
- భగవత్ శ్రవణము / చింతన / భాషణము చేయునపుడు శరీరములో మార్పులు కలుగుట (అనగా ఒడలు పులకరించుట, మొ || ),
- సదా ఎంపెరుమాన్ గురించే తలంచుట,
- కామ్య ఫలాలను ఆశించకుండా భగవత్ ఆరాధన చేయుట.
- విశ్వామిత్ర – విష్ణుచిత్త – తుళసీ భృత్యరోడే ఉళ్ కలందు తొళుకులమానవన్ నిలైయార్ పాడలాలే బ్రాహ్మణ వేళ్విక్కుఱై ముడిత్తమైయుమ్
నంపాడువన్ (వీరు తిరుక్కురుంగుడిలో మలైనంబికి కైశికరాగ గానము చేసిరి. అందువలన వారిని విశ్వామిత్ర ఋషితోనూ, పెరియాళ్వార్ తోనూ, పెరుమాళ్ళ కోసం తిరుప్పళ్ళియెళుచ్చి (మేలుకొలుపు) ని గానము చేసిన తొండరప్పొడి ఆళ్వార్ తోనూ పోల్చిరి), అగ్ర కులములో జన్మించక పోయినను బ్రహ్మ రాక్షసుడుగా (ఒక యజ్ఞములో మంత్రోచ్చారణ లోపం వల్ల బ్రాహ్మణుడు రాక్షసుడయ్యెను) పొందిన శాపమును, వారి గానముచే, తొలగించుకొనిరి.
- కీళ్మగన్ తలైమకనుక్కు సమసఖావాయ్ , తంబిక్కు మున్ పిఱన్దు వేలుమ్ విల్లుమ్ కొణ్డు పిన్ పిఱన్దారై శోదిత్తు తమైయోన్ ఇళైయోన్ సద్భావమ్ శొల్లుమ్బడి ఏకకులమానమైయుమ్
బోయకులములో జన్మించిన గుహుడు పెరుమాళ్ళకు (శ్రీ రాముడికి) అత్యంత సన్నిహితుడు మరియు సోదరుడైనాడు, రాత్రి సమయములో పెరుమాళ్ నిద్రించునప్పుడు, ఇళయ పెరుమాళ్ (లక్ష్మణ స్వామి) ను శంకించెను. కావున, గుహుడు రాత్రి అంతయు మేల్కొని ఉండి లక్ష్మణుని గమనించెను. భరతుడు (శ్రీరామ లక్ష్మణుల గుణములను బాగుగా తెలిసినవాడు) గుహుని కలసినప్పుడు , లక్ష్మణుని గుణములు అతనికి తెలియవేమోనని, వానిని గుహుడు భరతునికి తెలిపినప్పుడు, భరతుడు అమితానందము పొందెను. ఈ విధముగా వారు ఐదుగురు (శ్రీరాముడు, గుహుడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు) ఒకే కుటుంబము వారైరి.
- తూతుమొళింతు వన్దవర్ కళుడైయ సమ్యక్సగుణ సహ భోజనముమ్
శబరి (బోయ వంశములో జన్మించినది) ని స్వీకరించి ఆమె ఒసంగిన ఫలములను ఆరగించిన శ్రీరాముడు; భీష్ముడు, ద్రోణుడు, మొ || వారి గృహముల నేగక, శ్రీవిదురుని గృహములో ఆరగించిన కణ్ణన్ ఎంపెరుమాన్; సీతా పిరాట్టిని కలిసిన ఉదంతమును ఆలకించిన శ్రీరాముడు హనుమంతుని (వానరము) ఆలింగనము చేసికొనుట
- ఒరుపిఱవియిలే యిరుపిఱవియానా రిరువర్ క్కు దర్మసూను స్వామిగళ్ అగ్రపూజై
కొడుత్తమైయుమ్
శ్రీ కృష్ణుడికి (బ్రాహ్మణ వంశములో జన్మించలేదు) ప్రధమ మర్యాదనిచ్చిన యుధిష్టిరుడు,
ఒక వడ్రంగిచే పెంచబడిన తిరుమళిశై ఆళ్వారుకి ప్రధమ మర్యాదనిచ్చిన పెరుంబులియూర్ అడిగళ్ – కృష్ణుడు, తిరుమళిశై ఆళ్వార్ వీరిరువురు ఒకే జీవితములో రెండు జన్మలు పొందిరి – కృష్ణుడు క్షత్రియ దంపతులకు జన్మించినను యాదవ కుటుంబమునకు, బ్రాహ్మణ దంపతులకు జన్మించిన ఆళ్వార్ వడ్రంగి కుటుంబమునకు తరలి వెళ్ళిరి.
- ఐవరిల్ నాల్వరిల్ మూవరిల్ ముఱ్పట్టవర్గళ్ సందేహియామల్ సహజరోడే పురోటాసమాక
చ్చైయ్త పుత్ర కృత్యముమ్
ఐదుగురు సోదరులలో జ్యేష్టుడైన యుధిష్టిరుడు శ్రీవిదురునికి (సేవకురాలికి జన్మించినవాడు) చరమ కైంకర్యము చేసెను. నలుగురు సోదరులలో జ్యేష్ఠుడైన శ్రీరాముడు జటాయువు (పక్షి) కి చరమ కైంకర్యము చేసెను. ముగ్గురు నంబిలలో (పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, తిరుమలై నంబి) పెద్దవాడైన పెరియ నంబి మాఱనేరి నంబికి చరమ కైంకర్యము చేసిరి.
- పుష్ప త్యాగ భోగ మండపంగళిల్ పణిప్పూవుమ్ ఆలవట్టముమ్ వీణైయుమ్ కైయుమాన అంతరంగరై ముడిమన్నవనుమ్ వైదికోత్తమరుమ్ మహామునియుమ్ అనువర్తిత్త క్రమముమ్
-
-
- పుష్ప మండపములో (తిరుమల) కురుమ్బురుత్త నంబిచే మట్టి పూలను స్వీకరించిన తిరువేంగడముడియాన్ ను ఆరాధించిన తొండమాన్ చక్రవర్తి
-
-
-
- త్యాగ మండపములో (కాంచీపురము) తిరుక్కచ్చి నంబిచే వింజామన సేవనందుకున్న పేరారుళాళన్ ను ఆరాధించిన ఎంపెరుమానార్
-
-
-
- భోగ మండపములో (శ్రీరంగము) తిరుప్పాణాళ్వార్ల వీణ కైంకర్యమును ఆలకించిన పెరుమాళ్ళను ఆరాధించిన లోకసారంగముని
-
- యాగానుయాగ ఉత్తర వీధికళిల్ కాయాన్న స్థల శుద్ది పణ్ణిన వృద్దాచారముమ్
తిరువారాధన సమయములో, పిళ్ళై వురంగా విల్లి దాసర్ను స్పృశించి, ఎంపెరుమానార్ శుద్ధి నొందిరి: ప్రసాదమును స్వీకరించుటకు ముందే దానిని స్పృశించమని పిళ్ళై ఏఱు తిరువుడైయార్ దాసర్ తో నంపిళ్ళై అనిరి; తమ నూతన గృహమును శుద్ధి చేయుటకై పిళ్ళై వానమామలై దాసర్ ను ప్రదక్షిణ చేయుమని నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనిరి;
‘అఱివార్ క్కిరే జన్మోత్కర్షాపకర్షఙ్గళ్ తెరివతు’ – పై సంఘటనలు అర్ధమైనచో, నిజమైన అధమ ఉన్నత జన్మల గురించి తెలియును. తమ అద్భుతమైన వ్యాఖ్యానములో, ఈ సూత్రమునే భాగవతుల (జన్మముతో సంబంధము లేకుండా) మహిమలను సులువుగా, మిక్కిలి ఉపయుక్తముగా మందమతులు కూడ అర్ధము చేసుకొనగలరని నయనార్ వివరించిరని, మాముణులు ముగించిరి.
86 వ చూర్ణికలో, దీనినే ఇంకను వివరించిరి :
అజ్ఞర్ భ్రమిక్కిఱ వర్ణాశ్రమ విద్యా వృత్తన్గళై గర్దభ జన్మమ్, శ్వపచాధమమ్, శిల్పనైపుణ్యమ్, భస్మాహుతి, శవవిధవాలన్కారమెన్ఱు కళిప్పర్కళ్
సాధారణ అనువాదము
- కేవలము బ్రాహ్మణ వర్ణములో (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) జన్మించుట అనగా కుంకుమ పువ్వును మోయు గాడిదగా (దాని విలువ తెలియక) తెలిపిరి.
- కేవలము సన్యాసాశ్రమమును (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) స్వీకరించుటను అత్యంత హేయమైన ఛండాలుడుగా (శునక మాంస భక్షకుడు) వివరించిరి,
- కేవలము వేద జ్ఞానము ఉండుట (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) అనగా పాద రక్షలు చేయు నైపుణ్యముతో మాత్రమే సమానముగా (ఉదరపోషణకు తప్ప మరి దేనికి నిరుపయోగము) భావించవచ్చును.
- కేవలము కర్మానుష్ఠానములు (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) కాలిన బూడిద వలె నిరుపయోగమనిరి.
- భగవానుని స్తుతించని మాటలు, చర్యలు ఒక మృతదేహమునకు చేయు అలంకరణముల వంటివి.
- ఎంపెరుమాన్ పై భక్తిలేని పైనవన్నియు, ఒక విధవరాలికి గల అందమైన ఆభరణముల వలె నిరుపయోగమగును. ఏలనన, ఆమెకు మంగళ సూత్రము ఉండదు (అది లేనందువల్ల ఆమెకు ఆ ఆభరణములు నిరూపయోగములు) కనుక. అదే విధముగా, కేవలము వర్ణము, ఆశ్రమము, జ్ఞానము మరియు మాటలు (భగవానునిపై భక్తిలో తడిసి ముద్ద కానివి) పామరులకు పరవశము కలుగజేయును గాని, జ్ఞానులైన పండితులు వానిని విస్మరించి, వానికి ఎట్టి విలువను ఆపాదించరు.
తదుపరి భాగములో, పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణమను దివ్య శాస్త్రము నుంచి అనేక సూత్రములను ఉటంకించి, జన్మ సంబంధము లేకుండా శ్రీవైష్ణవుల మహిమలను తెలిపిరి. ఆ సూత్రములలో, సూత్రము 212 వరకు వైష్ణవుని కీర్తిని ముఖ్యముగా ప్రస్తావించిరి.
సూత్రము – 212 – ఉత్కృష్టమాక భ్రమిత్త జన్మమ్ భ్రంశ సమ్భావనైయాలే “శరీరేచ” ఎన్గిఱపడియే భయ జనకమ్
-
- తమది ఉత్కృష్టమైన జన్మగా భ్రమించుటచే, వారు దిగ్భ్రాంతితో భీతిల్లి ఉపాయాంతరములకై (అనగా వారు మొదటి 3 వర్ణములలో జన్మించిన ఫలితముగా కర్మ, జ్ఞాన, భక్తి యోగములు నిర్వహించు అవకాశము / యోగ్యత వున్నది) చూచెదరు.
- జితంతే స్తోత్రము 1.9 “శరీరే చ” లో భయము కలుగు అనేక విషయములను ప్రస్తావించుతూ, వర్ణాశ్రమ ధర్మమును పాటించుటకు అర్హత కలిగిన మన శరీరమునే, భీతికి ప్రధాన కారణముగా తెలిపిరి.
సూత్రము 213 – అతుక్కు స్వరూప ప్రాప్తమాన నైచ్యమ్ భావిక్క వేణుమ్
అట్టి ఉత్కృష్ట జన్మనొందినవారు, జీవాత్మకు స్వాభావికమైన అణకువను, దానిని సక్రమముగా పాటించు ఇతరుల నుంచి చూచి సాధన చేయవలెను.
సూత్రము – 214 – అపకృష్టమాక భ్రమిత్త ఉత్కృష్ట జన్మత్తుక్కు ఇరణ్డు దోషముమిల్లై
నిజముగా ఉత్కృష్ట జన్మనొందిన వారికి (అది అల్ప జన్మమనే భ్రమచే) ఈ రెండు దోషములు వుండవు. అవి ఏమనగా,
-
- తాము జన్మించిన వర్ణము వలన ఏర్పడిన బాధ్యతలకు దిగ్బ్రాంతి నొంది తద్వారా తమ శరీరము చేయవలసిన చర్యలకు భీతిల్లి,
- తాము స్వాభావికముగ గాక, ఇతరులను చూచి అణకువను సాధన చేసి నేర్చుకొనవలెను.
సూత్రము – 215 – నైచ్యమ్ జన్మ సిద్దమ్
ఉత్కృష్ట జన్మ (అల్ప జన్మమనే భ్రమలో నుండుట) పొందిన వారికి వినయము సహజము.
సూత్రము – 216 – ఆకైయాలే ఉత్కృష్ట జన్మమే శ్రేష్ఠమ్
కావున ఉత్కృష్ట జన్మమే శ్రేష్ఠమైనది
సూత్రము 217 – శ్వపచోపి మహీపాల
స్వయముగా భగవానుడే పై శ్లోకములో తెలిపిన విధముగా, ఛండాలుడైనను తన భక్తుడైనచో, ద్విజుని కంటే గొప్పవాడు. అదే ప్రకారము, సన్యాసుడైనను, నా భక్తుడు కానిచో, ఛండాలుని కంటే అల్పుడు.
సూత్రము 218 – నికృష్ట జన్మత్తాల్ వంద దోశమ్ శమిప్పతు విలక్షణ సంబంధత్తాలే
నికృష్ట జన్మను నొందినవారు ఇతర ఉపాయాంతరములు, మొ || వానిలో నుండుటచే, వారి దోషములు తొలగుటకై, లోపరహితులైన శ్రీవైష్ణవులతో సంబంధము నేర్పరచుకొనవలెను.
సూత్రము 219 – సంబంధత్తుక్కు యోగ్యతైయుండా మ్బోతు జన్మక్కొత్తై పోకవేణుమ్
లోపరహితుడైన శ్రీవైష్ణవునితో అట్టి సంబంధమునకు యోగ్యత కలుగుటకు, తనది ఉత్కృష్ట జన్మమనే ఆభిజాత్యమును వీడవలెను.
సూత్రము 220 – జన్మత్తుక్కు కొత్తైయుమ్ అతుక్కుప్పరిహారముమ్ “పళుతిలా ఒళుకల్” ఎన్గిఱ పాట్టిలే అరుళిచ్చెయ్ తార్
తమ జన్మ సంబంధిత అపార్ధములను, వాటిని తొలగించు పరిష్కారమును దయతో మనకు తొండరప్పొడి ఆళ్వార్ “పళుతిలా ఒళుగల్ ” (తిరుమాలై 42) పాశురములో వివరించిరి. ఈ పాశురములో ఆళ్వార్ “జన్మ జన్మల నుండి బ్రాహ్మణ వంశములో జన్మించి, 4 వేదములలో నిష్ణాతులై, తమ అహంకారము మొ || వానిని పోగొట్టుటకై, అహంకార రహితులైన శ్రీమన్నారాయణుని భక్తులను ఆరాధించవలెను. తాము శుద్ధి పొందుటకు జ్ఞానమును వారి నుంచి స్వీకరింపవలెను / పొందవలెను” అని వివరించిరి.
సూత్రము 221 – వేదగప్పొన్బోలే ఇవర్ కళోట్టై సంబంధమ్
అట్టి మహిమగల భక్తులతో సంబంధము స్పర్శవేదితో (ఇనుమును బంగారముగా మార్చును) సంబంధము వంటిది.
సూత్రము 222 – ఇవర్గళ్ పక్కల్ సామ్య బుద్దియు మాధిక్య బుద్ధియుమ్ నడక్క వేణుమ్
అట్టి శ్రీవైష్ణవులను సమానులుగా పైగా అధికులుగా భావించవలెను.
సూత్రము 223 – అతావతు ఆచార్య తుల్యరెన్ఱుమ్ సంసారి కళిలుమ్ తన్నిలుమ్ ఈశ్వరనిలుమ్ అధికరెన్ఱుమ్ నినైక్కై
యధార్ధమునకు, వారిని తమ స్వయమాచార్యులతో సమమైన వారిగా పరిగణించి, సంసారులకంటే (విషయవాంఛలపై దృష్టి కలవారు), తమకంటే, స్వయం ఈశ్వరుని కంటే ఉన్నతులుగా పరిగణించవలెను.
సూత్రము 224 – ఆచార్య సామ్యత్తుక్కడి ఆచార్య వచనమ్
ఆచార్యుని పాదపద్మములను శరణాగతి చేయునపుడు, స్వయముగా ఆచార్యులే ఇచ్చిన ఆదేశము ప్రకారము, అట్టి శ్రీవైష్ణవులను తమ ఆచార్యునితో సములుగా పరిగణించ వచ్చును.
సూత్రము 225 – ఇప్పడి నినైయాతొళిగైయుం అపచారమ్
శ్రీ వైష్ణవుని జన్మ విశ్లేషణ చేయుట ఎంత పెద్ద నేరమో, వారికి సరియైన గౌరవమును (ఇంతకు మునుపు తెలిపిన సూత్రముల ప్రకారము) ఇవ్వక పోవుట కూడ అంతే పెద్ద నేరము / తప్పిదము అగును.
సూత్రము 226 – ఇవ్వర్ధమ్ ఇతిహాస పురాణఙ్గళిలుమ్, పయిలుమ్ శుడరొళి నెడుమాఱ్కడిమైయిలుమ్ కణ్ శోర వెఙ్గురుతియిలుమ్ వణ్ణాత వాళవుణరిలుమ్ తేట్టరుమ్ తిఱల్ త్తేనిలుమ్, మెమ్బురుళుక్కు మేలిఱ్పాట్టుక్కళిలుమ్ విచదమాక క్కాణలామ్
ఈ సూత్రమునే (జన్మతో సంబంధము లేని భాగవతుల యొక్క మహిమలు) మరింత వివరముగా క్రింది వానిలో తెలిపిరి :
- ఇతిహాసములు (శ్రీరామాయణము, మహాభారతము), పురాణములు
- పయిలుమ్ శుడరొళి పదిగము – తిరువాయ్మొళి 3.7
- నెడుమాఱ్కడిమై పదిగము – తిరువాయ్మొళి 8.10
- నణ్ణాద వాళ్ అవుణర్ పదిగము – పెరియ తిరుమొళి 2.6
- కణ్ శోర వెఙ్గురుది పదిగము – పెరియ తిరుమొళి 7.4
- తెట్టు అరుమ్ తిఱల్ తేన్ పదిగము – పెరుమాళ్ తిరుమొళి 2
- తిరుమాలై – 39 – 43 పాశురములు
సూత్రము 227 – క్షత్రియనాన విశ్వామిత్రన్ బ్రహ్మర్షి యానాన్
క్షత్రియ కుటుంబములో జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి (సాధారణముగా బ్రాహ్మణులకు వర్తించును) అయిరి.
సూత్రము 228 – శ్రీవిభీషణనై రావణన్ కులపాంసనమ్ ఎన్ఱాన్; పెరుమాళ్ ఇక్ష్వాకు వంశ్యనాగ నినైత్తు వార్తై యరుళిచ్చెయ్ తార్
శ్రీ విభీషణుని రావణాసురుడు ద్రోహిగా ప్రకటించెను; శ్రీరాముడు (పెరుమాళ్) శ్రీ విభీషణుని (రాక్షస వంశములో జన్మించినవాడు) తమ స్వంత ఇక్ష్వాకు వంశములో నుండి వచ్చిన సోదరునిగా భావించిరి, వారితో ప్రేమతో సంభాషించిరి.
సూత్రము 229 – పెరియ ఉడైయారుక్కు పెరుమాళ్ బ్రహ్మమేధ సంస్కారమ్ పణ్ణియరుళినార్
సాధారణముగా పుత్రులు / శిష్యులు తమ పితరులకు / ఆచార్యునికి జరుపు చరమ కైంకర్యములు (అంతిమ సంస్కారములు) శ్రీరాముడు అభిమానముతో జటాయు మహారాజుకు (పక్షి జన్మ నొందిన వానికి) నిర్వహించిరి.
సూత్రము 230 – ధర్మపుత్రర్ అశరీరి వాక్యత్తైయుమ్, జ్ఞానాధిక్యత్తైయుమ్ కొణ్డు శ్రీవిదురరై బ్రహ్మమేదత్తాలే సంస్కారిత్తార్
అశరీరవాణి ఆదేశముల ప్రకారము, శ్రీ విదురుని జ్ఞానాధిక్య స్వభావము వలనను, అతని అంతిమ సంస్కారములను (దాసి పుత్రునిగా జన్మించినను) యుధిష్ఠిరుడు (వర్ణాశ్రమ ధర్మములలో నున్నవాడు) నిర్వహించెను.
సూత్రము 231 – ఋషికళ్ ధర్మవ్యాదన్ వాశలిలే తువణ్డు ధర్మ సందేహంగళై శమిప్పిత్తుక్కొణ్డార్ కళ్
ఋషులు ధర్మవ్యాధుని (ఒక కటిక వాడు) వాకిట కాచియుండి, వారు తమ తల్లిదండ్రుల సేవ ముగించు వరకు వేచియుండి, తమ ధర్మ సందేహములను నివృత్తి చేసికొనిరి.
సూత్రము 232 – కృష్ణన్ భీష్మ ద్రోణాదిగళై విట్టు శ్రీవిదురర్ తిరుమాళికైయిలే అముతు శెయ్ తాన్
ఎంపెరుమాన్ కృష్ణుడు, భీష్మ, ద్రోణ, దుర్యోధనాదులను విస్మరించి, శ్రీవిదురుని గృహమున ఆహారమును ఆనందముగా స్వీకరించిరి.
సూత్రము 233 – పెరుమాళ్ శ్రీశబరి కైయాలే అముతు శెయ్తరుళినార్
బోయ కుటుంబములో జన్మించినను, తమ ఆచార్యునిపై అత్యంత భక్తిగల శ్రీశబరి ఇచ్చిన ఫలములను శ్రీరాముడు భుజించెను.
సూత్రము 234 – మాఱనేరి నంబి విషయమాక పెరియనంబి ఉడైయవర్ క్కరుళిచ్చెయ్ద వార్తైయై స్మరిప్పతు
మాఱనేరి నంబి అంతిమ సంస్కారములను చేసిన పిదప పెరియ నంబి (ఒక శ్రీవైష్ణవుని అవసరమును తీర్చుట మరియొక శ్రీవైష్ణవుని భాధ్యత అని అనేక ఉదాహరణములను వివరించుచు తెలిపిరి) శ్రీరామానుజునికి ఇచ్చిన వివరణమును గుర్తుంచుకొనవలెను.
ఈ సూత్రమునే యతిరాజ వింశతి 16 వ శ్లోకములో మన జీయర్ (మాముణులు) వివరించిరి
శబ్దాదిభోగ విషయా రుచిరస్మదీయా
నష్టా భవత్విహ భవద్దయయా యతీంద్ర!
త్వద్దాసదాసగణనాచరమావదౌ యః
తద్దాసతైకరసతావిరతా మమాస్తు
తిరువహీంద్రపురములో శ్రీవిల్లిపుత్తూరు పగవర్ అను ఒక సన్యాసి నివసించుచుండిరి. వారు ఒక వైపున తమ స్నాన అనుష్ఠానములను చేసెడివారు. ఇతరులు మరియొక వైపున తమ అనుష్ఠానములను చేసెడివారు. ఒకసారి వీరు తమ అనుష్ఠానములు ముంగించుకొని తిరుగు ప్రయాణములో నుండగా, ఒక బ్రాహ్మణుడు “మా అందరితో కలవక, మీరు అనుష్ఠానములు మరియొక స్థలములో చేయుటకు కారణమేమి?” అని అడిగిరి. దానికి వారు సమాధానముగా “మీరు బ్రాహ్మణులు, వర్ణాశ్రమముపై మాత్రమే దృష్టి కలవారు. కాని మేము దాసులము, కైంకర్యపరులము (భగవానునితో పాటు భాగవతులపై దాస్య భావమున్నవారము) – కావున మీతో కలిసిఉండ నవసరము లేదు” అని పలుకుచు, ఆ స్థలమును వీడి వెళ్ళిరి. ఈ సంఘటనను తిరునారాయణ పురత్తు అను వారు తమ ఆచార్య హృదయము వ్యాఖ్యానములో స్పష్టముగా వివరించిరి. శ్రీవిల్లిపుత్తూరు పగవర్ దీనినే సమర్థించుచు, ఈ క్రింది పురాణ శ్లోకమును ఉటంకించిరి.
విష్ణుదాసా వయమ్ యూయమ్ బ్రాహ్మణా వర్ణధర్మినః
అస్మాకమ్ దాస వృత్తీనామ్ యుష్మాకమ్ నాస్తి సంగతిః
సాధారణ అనువాదము : మేము విష్ణు సేవకులము, మీరు వర్ణాశ్రమ ధర్మమును మాత్రమే పాటించు బ్రాహ్మణులు. మేము దాస్య భావముతో నుందుము, కావున కలియుటకు కారణము లేదు.
తమ జ్ఞాన సారములోని క్రింది పాశురముల ద్వారా అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ ఈ సూత్రమునే నిరూపించిరి. కేవలము వర్ణాశ్రమ ధర్మమును పాటించుట మాత్రమే నిరుపయోగము, ప్రతి వారికి శ్రీమన్నారాయణుని పాద పద్మములే అంతిమ లక్ష్యము.
పాశురము 14
బూదంగళ్ ఐందుం పోరుందుడలినాఱ్పిఱంద
సాదంగళ్ నాన్గినోడుం సంగతమాం – బేధం కొండు
ఎన్న పయన్ పెఱువీర్ ఎవ్వుయిరుక్కుం ఇందిరై కోన్
తన్నడియే కాణుం శరణ్
సాధారణ అనువాదము : పంచ భూతములతో తయారైన ఈ శరీరమును వ్యక్తి యొక్క వర్ణముతో గుర్తించిన ఏమి ప్రయోజనము? ప్రతి వారికి శ్రీమన్నారాయణుని పాదపద్మములే శరణ్యము.
పాశురము 15
కుడియుమ్ కులముమ్ ఎల్లామ్
కోకనకై కేళ్వన్ అడియార్కు అవనడియే యాగుం
పడియిన్ మేల్ నీర్ కేళువుం ఆఱుగళిన్ పేరుం నిఱముమ్ ఎల్లామ్
ఆర్ కలియై శేన్ందిడ మాయన్ తఱ్ఱు
సాధారణ అనువాదము : సాగరములో కలియునప్పుడు నదుల రంగు, నామ రూపాలు మొ || నవి ఎట్లు అదృశ్యమగునో, అదే విధముగా శ్రీమన్నారాయణుని భక్తుల ఊరు, వంశ పారంపర్యము మొ || నవి అదృశ్యమై అతను కేవలం భగవానుని తిరువడి సంబంధముతోనే అతనిని గుర్తించవస్తారు.
దేహాత్మ జ్ఞాన కార్యేణ వర్ణభేదేన కిమ్ పలమ్
గతి సర్వాత్మనామ్ శ్రీమన్నారాయణ పదద్వయమ్
సాధారణ అనువాదము : శరీర ఆత్మల వ్యత్యాసము గుర్తించిన పిదప ఆ వ్యక్తిని వర్ణము ఆధారముగా గుర్తించినచో ఫలమేమి? ప్రతి ఒక్కరికి శ్రీమన్నారాయణుని పాదపద్మములే శరణ్యము.
ఏకాంతి వ్యపతేస్థవయః నైవ గ్రామకులాధిపిః
విష్ణునా వ్యపతేస్థవ్యస్ తస్య సర్వమ్ స ఎవ హి
సాధారణ అనువాదము : విష్ణుని నిజమైన భక్తుని అతని స్వగ్రామము, వంశపారంపర్యము మొ || వానిచే గుర్తించరాదు. అట్టి భక్తునకు, భగవానుడే సర్వస్వము.
శ్రీశుక బ్రహ్మర్షి ఎంత గొప్పవాడనగా, వారి తండ్రి వేద వ్యాసుని (4 వేదములను, 18 పురాణములను వర్గీకరించగల సామర్ధ్యుడు) శుకతాతర్ (శుకుని తండ్రి) గా గుర్తించెదరు. శాస్త్రము (భగవద్విషయము) పై వారికున్న పట్టు వలన, వారు భగవానునిపై తమకున్న జ్ఞానము / అనుబంధమును ప్రకటించుకొని, సంసారులకు భోగవిషయ ప్రీతిపై గల జ్ఞానము / అనుబంధము కారణముగా వారితో సంబంధమును తెగతెంపులు చేసుకొనిరి.
అద్య ప్రబృతి హే లోకా! యూయమ్ యూయమ్ వయమ్ వయమ్
అర్ధ కామ పర యూయమ్ నారాయణపరా వయమ్
నాస్తి సంగతిః అస్మాకమ్ యుష్మాకమ్ చ పరస్పరమ్
వయమ్ తు కింకరా విష్ణోః యూయుమ్ ఇంద్రియ కింకరః
సాధారణ అనువాదము : ఈ జగత్తులో నివసించుచున్న వారా! మీరు భౌతిక సంపదపై, భోగములపై ఆసక్తులై వున్నారు. మేము శ్రీమన్నారాయణుని సేవకై తపించుచున్నాము. మీరు మీ ఇంద్రియాలకు దాసులు. మేము శ్రీమన్నారాయణుడికి దాసులము. కావున మీతో పొత్తు కుదిరే అవకాశం లేదు.
తమ వర్ణాశ్రమముపై గాక, మన నిజమైన గుర్తింపు ఆత్మ ద్వారానే అని వారు తెలిపిరి.
నాహం విప్రో న చ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో నో వా వర్ణీ చ గృహపతిర్నో వనస్థో యతిర్వ
కింతు శ్రీమద్భువన భవనస్తిత్యపాయైక హేతోర్ లక్శ్మీభర్తుర్ నరహరితనోర్ దాసదాసస్య దాస
సాధారణ అనువాదము : నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, వైశ్యుడను, శూద్రుడను కాను. నేను బ్రహ్మచారిని, గృహస్థుడను, వాన ప్రస్థుడను, సన్యాసిని కాను. నేను శ్రీమహాలక్ష్మి పతియైన శ్రీనరసింహుని దాసానుదాసుడను.
శుక బ్రహ్మర్షి “వర్ణాశ్రమ ధర్మమును బట్టి నా గుర్తింపు కాదు. జ్ఞానము, పరమానందము ఆధారముగా గుర్తింపు పొందిన జీవాత్మ వలన కూడ కాదు. శ్రీలక్ష్మీ నరసింహుని భక్తులకు నేను చేయు దాస్యము వలన నాకు గుర్తింపు. ఇట్టి అవగాహన కలిగిన పిదప, మనము 2 రకముల వ్యక్తులను గమనింప వచ్చును – భాగవతులు (భక్తులు), అభాగవతులు (భక్తి లేనివారు) – మరి ఏ ఇతర వర్గము లేదు” అని పలికిరి. ఆ విధముగా వారు విషయలోలులైన వారందరి నుంచి సంబంధమును తెగతెంపులు చేసుకొనిరి, శ్రీలక్ష్మీ నరసింహ ఎంపెరుమాన్ భక్తులతో చేరిరి. ఈ చరిత్రము ప్రముఖము మరియు ప్రసిద్ధమైనది.
ఇంకను, అట్టి భాగవతుల స్వరూపమును వివరించిరి:
పంచాస్త్రాంగాః పంచ సంస్కారయుక్తాః పంచార్త్యాగ్యాః పంచమోపాయనిష్ఠాః
తేవర్ణానామ్ పంచమాశ్చాశ్చ్రామాణాం విష్ణోర్భక్తాః పంచ కాల ప్రపన్నాః
సాధారణ అనువాదము : పంచాయుధములు కలవారు (శంఖము, చక్రము, మొ || నవి భగవానుని నుంచి వారసత్వముగా పొందినవి), పంచ సంస్కారములు పొందినవారు, ఆచార్య నిష్ఠలో పూర్తిగా నిమగ్నులైనవారు, పంచకాల పారాయణము (దినమును 5 భాగములుగా విభజించి అభిగామనము / మేల్కొనుట, ఉపాదానము / తిరువారాధనకై సామాగ్రి సమీకరించుట, ఇజ్జా / తిరువారాధనము, స్వాధ్యానము / శాస్త్ర అభ్యాసము, యోగము / భగవద్ ధ్యానము – ఎంపెరుమాన్ సేవ కొరకై ) – వీటికి వర్ణాశ్రమముతో సంబంధము లేకుండా విష్ణు భక్తులుగా సంబోధించుదురు.
దేవర్షి భూతాప్త నృణామ్ పితృణామ్ న కింకరో నాయమ్ ఋణీ చ రాజన్
సర్వాత్మనా యశ్శరణమ్ శరణ్యమ్ నారాయణమ్ లోకగురుమ్ ప్రపన్నః
సాధారణ అనువాదము : విశ్వ గురువైన శ్రీమన్నారాయణునికి సంపూర్ణ శరణాగతి చేసిన వారు, ఋషులకు, దేవతలకు, ప్రజలకు, పితరులకు మరి ఏ ఇతరులకు ఋణగ్రస్తులు కారు.
కాబట్టి, పండితులైన జ్ఞానులు కేవలం వర్ణము, ఆశ్రమము, జ్ఞాన అనుష్ఠానములను (ఎంపెరుమాన్ పట్ల భక్తి లేకుండా అజ్ఞానులచే స్తుతింపబడేవారు) వరుసగా కుంకుమ పువ్వును మోసే గాడిదగా, చండాలుని కంటే తక్కువగా , కాలిన బూడిద వంటి పనికిరానిదిగా, మృతదేహము/వితంతువులకు చేయు అందమైన అలంకరణముల వంటివిగా భావిస్తారు. అటువంటి పండితులకు, వారు చేయు శరణాగతి వారి స్వంత నిష్ఠ / అర్హతపై ఆధారపడి ఉంటుంది. అనగా..
- బంధము / మోక్షము రెండింటికీ సామాన్యమైన ఈశ్వరుడు లేదా మోక్షమును మాత్రమే చూస్తున్న ఆచార్యుడు,
- ఈశ్వరునకు పూర్తిగా శరణాగతి చేసిన వారు గాని లేదా వారి స్వంత ఆచార్యుల పట్ల ఉన్న విపరీతమైన అనుబంధము కారణముగా అత్యంత అనుకూలమైన వారు గాని
అందుకే, ఆళ్వాన్ “న చేత్ రామానుజేత్ యేషా చతుర చతురాక్షరి; కామావస్థం ప్రపధ్యంతే జంతవో హంత మాదృశః” అనిరి. ఇక్కడ వారు “నారాయణ” మరియు “రామానుజ” అనే పదములను స్పష్టముగా గుర్తించిరి – ఇక్కడ నారాయణ అను పదము, బంధ మోక్షములు రెండింటికీ సాధారణము అయితే, రామానుజ అను పదము కేవలము మోక్షముపై మాత్రమే దృష్టి కలిగినది. అందుకే రామానుజులకు “చతుర చతురాక్షరి” అనే ప్రత్యేక విశేషణము కలదు, దీని అర్థం “ఇది అత్యంత వివేకవంతమైన నాలుగు అక్షరముల పదము” అని అర్థం.
అనువాదకుని గమనిక: ఈ విధంగా, శ్రీవైష్ణవుల పుట్టుకతో సంబంధము లేకుండా వారి దివ్య మహిమలను మనము గమనించాము.
సశేషం….
అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.
మూలము: https://granthams.koyil.org/2013/07/anthimopaya-nishtai-16/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org