చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

గత అధ్యాయములో (https://granthams.koyil.org/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1-telugu/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామి వారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల మూలముగా తెలుసుకొనెదము!!

ఒకానొకప్పుడు అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల శిష్యులైన అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలైనవారు ఉడయవర్లను ఆశ్రయించి ఒక సందేహమడిగినారు, “ఈ ఆత్మకు ఆచార్యుడు ఒకరా? పలువురా? ఇంతమంది ఎందులకు?”  దానికి ఉడయవర్లు ఆ శిష్యులను వెళ్లి పొన్నాచ్చియార్ అను వారిని అడుగ వలసిందిగా చెప్పారు! అప్పుడు వారందరు పొన్నాచ్చియార్ అమ్మగారి తిరుమాళిగకు చేరుకొని తమ సందేహాన్ని వారి వద్ద విన్నవించారు! అప్పుడు పొన్నాచ్చియార్ అమ్మగారు తమ శిరోజాలని ముడి విప్పి విదిలించి మరల ముడి వేసుకుని, “ఈ సందేహమును దాసురాలు తీర్చజాలదు! అబలయైన దాసురాలికి అంత జ్ఞానమేమున్నది? స్వామి వారే మీ సందేహము తీర్చగలరు? ” అని వారికి సమాధానము చెప్పి నేలపై పడియున్న ఒక నూలు పోగును తల మీద పెట్టుకుని లోపలి వెళ్లిపోయారు! శిష్యులు చేసేది లేక మరల ఉడయవర్ల వద్దకు వచ్చి నిలబడిరి! ఉడయవర్లు వారితో, “కార్యము నెరవేరినదా?”అని అడుగగా వారు లేదని బదులిచ్చిరి! అంతట ఉడయవర్లు వారితో, “మీరు వెళ్ళి నప్పుడు వారు ఏమి చేసినారు?” అని అడుగగా వారు పొన్నాచ్చియార్ తమ జుత్తు ముడిని విప్పి జుత్తు విదిలించి తిరిగి ముడి వేసుకున్నారని, నేలపై పడియున్న ఒక నూలు పోగు శిరస్సుపై వేసుకుని లోపలి వెళ్లిపోయారని బదులిచ్చారు! దానికి ఉడయవర్లు, “అయితే మీకు సమాధానం దొరికింది! ఆమె తన చేష్టల ద్వారా మీకు సమాధానం చెప్పారు! మీకు అర్థం కాలేదే?”, అనగా శిష్యులు వారికి సాష్టాంగ దండం సమర్పించి, “మా అజ్ఞానాన్ని మన్నించి సవివరంగా దేవరవారే తెలియజేవలసింది!” అని ప్రార్థించిరి! దానికి ఉడయవర్లు వారి పట్ల వాత్సల్యము గలవారై వారితో ఇటుల చెప్పిరి, “ఆమె తమ జుట్టు ముడి విప్పి జుత్తు విదిలించడమంటే – ఈ ఆత్మకు ఆచార్యులు పలువురు ఉండవచ్చును (తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు, ఈ ప్రకృతి ఇలా జీవుడికి రకరకాల గురువులు ఉండవచ్చును )! అయితే ఆత్మకు ప్రాప్యమును కలిగించే (అంటే మోక్షమును ఇచ్చు) ఆచార్యుడు మాత్రం ఒక్కరే! అదే ఆమె తిరిగి తన జుత్తు ముడి వేసుకొనుటకు అర్థము! నేలపై పడి ఉన్న కావినూలు తీసి శిరస్సుపై ధరించుటలో అర్థం ఆత్మకు ప్రాప్యమును కలిగించే ఆచార్యుడు చతుర్థాశ్రమమైన సన్యాసమును స్వీకరించి కాషాయ త్రిదండ ధారుడైన ఎమ్బెరుమానార్ అనగా మమ్ములను సూచించారు! అక్కడ ఉండ కుండా లోపలి వెళ్ళుటలో అంతరార్థం అటువంటి ఆచార్యుని గుట్టుగా మనస్సులో స్థిరంగా నిలుపుకుని ‘పేణి క్కొణర్న్దు పుహుదు వైత్తుక్కొండేన్’ (ఆదరించి తీసుకువచ్చి విశ్లేషించకుండా హృదయంలో నిలుపుకున్నాను) అనునట్లు ప్రేమతో ఆచార్యుని ఆరాధిస్తూ వారి నామస్మరణ చేయుటయే శిష్యునికి ఉపాయము అని పొన్నాచ్చియార్ మీకు చేసి చూపించారు! కనుక మీరందరు అదే విధమైన నిష్ఠను కలిగి జీవించండి! ” అని బదులిచ్చిరి!

ఒకనాడు ఉడయవర్లు ఏకాంతంలో ఉన్న సమయములో ఎంబార్, వడుగనంబి వారి వద్దకు వెళ్లి, “మధురకవియాళ్వార్ నమ్మాళ్వార్ల విషయములో ‘తేవు మత్తఱియేన్’ – నీవు తప్ప వేరు దైవమెరుగను – అని శేషత్వ – శరణ్యత్వ – ప్రాప్యత్వములు ఆళ్వార్లే అని నిశ్చయించుకుని ప్రథమ పర్వమును (భగవత్స్మరణం) సైతం విడిచి పెట్టి తదేక నిష్ఠులై ఉన్న అటువంటి శ్రద్ధ మాకు కూడా కలిగేలా దేవరవారు ఆశీర్వదించవలసింది!”, అని ప్రార్థించగా ఉడయవర్, “మధురకవులు నమ్మాళ్వార్ల వద్ద కలిగి ఉన్న నిష్ఠను మీకు ఇదివరకే అనుగ్రహించి యున్నాను కదా? ఇంకేమి సంశయము?”, అని అడుగగా వారు,”అటువంటి నిష్ఠ యావదాత్మభావిగా జీవితాంతం కలిగియుండేలా అనుగ్రహించ వలసింది! ” అని ప్రార్థించిరి! ఉడయవర్లు పరమ సంతోషముతో శిష్యులంటే ఇటులకదా ఉండవలెనని మనస్సులో భావించి, “‘ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్’ – ఉపాయము ఉపేయము నీవేనను భావముతో శరణు వేడవలెను – అను రీతిలో ఉపాయోపేయ రూపములు రెండునూ మా వద్ద ఉండుట చేత “తేవు మత్తఱియేన్ ” అను రీతిలో మాకు శరణు వేడిన మీకు లోటు ఉండదు! ఇది మీకే గాక మీ సంబంధి సంబంధులకు వర్తించగలదు” అని బదులిచ్చెను!

గమని : ఇక మిగిలిన వ్యాసంలో  ఆళవందార్లు మరియు నాథమునుల సంబంధమును నిశితంగా తెలియజేయడమైనది.

మనకు ఒక సందేహము కలుగవచ్చు , “మనము ఆశ్రయించెడి ఆచార్యునకు ఈ లీలా విభూతిలో ఉన్న రోజులలో ఉపాయత్వము మాత్రమే కాక, ప్రాప్య భూమి అనబడే పరమపదంలో కూడా ఉపాయత్వము కలదా?” అంటే ప్రాప్య భూమి యందు కూడా ఆచార్యునకు ఉపాయత్వము కలదు! దీనిని స్వామి ఆళవందార్లు స్తోత్ర రత్నములో ఈ విధముగా అనుగ్రహించారు :

తస్మై నమో మధుజిదంఘ్రి సరోజ తత్వ
జ్ఞానానురాగా మహిమాతిశయాంత శీమ్నే!
నాధాయ నాథమునయే అత్ర పరత్రచాపి
నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం !!

అర్థము – మధుమర్దియైన శ్రీమన్నారాయణుని శ్రీ చరణముల పట్ల అచంచలమైన ప్రేమ, భక్తి కలిగి నిజజ్ఞాన పూర్ణులైన నాథమునులే నాకు యజమాని! వారి దివ్య సన్నిధి ఈ భూలోక మందు మరియు పరమపద మందును నాకు ఆశ్రయము!

మరియు విష్ణుపురాణ సూక్తియగు, “సాధ్యభావే మహా బాహో! సాధనైః కిం ప్రయోజనం?” అనగా – సాధ్య భావం సిద్ధించినపుడు ఇక సాధనములతో ఏమి ప్రయోజనం ? (అంటే దక్కవలసింది దక్కి నపుడు ఇక సాధనాలతో ఏమి ప్రయోజనం?).
కానీ, భట్టర్ అనుగ్రహించిన శ్రీ రంగరాజ స్తవములో ఈ విధముగా తెలిపారు (87వ శ్లోకము – ఉత్తర శతకం)

ఉపాదత్తే సత్తాస్థితి స్వనియమానాద్యైశ్చిదచితౌ
స్వముద్దిశ్య శ్రీమానితి వదతి వాగుపనిషదీ !
ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం నతు గుణౌ
అతస్త్వామ్ శ్రీరంగేశయ! శరణమవ్యాజ్యమభజం !!

అర్థము – ఓ శ్రీ రంగేశ! శ్రీమన్నారాయణుడివై నీవు భూజాతులైన చిత్తులు (బుద్ధి జీవులు ) అచిత్తుల (బుద్ధి రహిత జీవులు) యొక్క సేవలను సృష్టి, స్థితి, నియమములనెడి పరికరముల ద్వారా స్వీకరించెదవని ఉపనిషత్తులు ఘోషించుట చేత చేతనులకు నీవే ఉపాయము మరియు ఉపేయము అనుట అతిశయోక్తి కాదు! అది సత్యము ! అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను!

అన్నందు వలన ఈ ఉపాయోపేయములు రెండు భగవానుడి స్వరూపములు! అయితే ఉపాయము బయటికి ప్రకాశిస్తుంది ఉపేయము అంతర్గతముగా  ఉండును! అయితే ఈ స్వరూపములు భగవానుడి విషయములోనే కదా? అంటే ఆచార్యుని విషయములో కూడా స్వీకరించ వచ్చును ! ఆళవందార్లు శాయించిన, “ఉపాయోపేయ భావేన…. ” అన్న విధముగా ఆచార్యునకు ఉపాయోపేయత్వములు రెండూ స్వరూపములై ఉండును! అందుకనే “అత్ర పరత్రాచాపి…” అని చెప్పబడింది ! మరియు “త్వమేవ..” అనుటలో భావం ఇటువంటి స్వరూపములు ఆచార్యుని యందు “మాత్రమే” ప్రకాశించును అని రూఢి చేసినట్లు ఉన్నది! కనుక చరమపర్వ మందు ఇతర సహాయ సంబంధములను సహించనిదై ఉండును! (అనగా చరమోపాయ నిష్టలో ఆచార్యుడు తప్ప ఇక వేరే ఇతర సహాయములు పనిచేయవు అని అర్థము)! కార్యకాలములో చరమపర్వము (చరమోపాయ నిష్ఠ) అన్నిటి కంటే ఉత్తమమై ఉండును! కనుక చరమపర్వము ప్రథమ పర్వము కన్నా ఏ విధముగా గొప్పదో క్లుప్తముగా చూద్దాం:

  •  భగవానుడు తనను ఆశ్రయించిన భక్తులను తన యొక్క సర్వతంత్ర స్వతంత్రత చేత మోక్షములోనో లేక తిరిగి సంసారములోనో ఉంచును! కనుక భగవానునిని ఆశ్రయించిన భక్తునికి మోక్షము తథ్యమని నమ్మరాదు (ఉడయవర్ల కాలములో సింహాచలంలో పరమ నృసింహ భక్తుడైన కృష్ణమాచార్యుని గాథ ద్వారా తెలియ వచ్చును)! కానీ ఆచార్యుడు తన శిష్యుడు ఏ విధంగానైనా తరించాలని తపనపడి తమ యొక్క నిర్హేతుక కృప చేత భగవానునికి పురుషకారము చేత మోక్షమును ఇప్పించును!
  • భగవానుడు ఆచార్య సంబంధము కలిగిన భక్తుని మాత్రమే స్వీకరించును ! కానీ కృపా పూర్ణుడైన ఆచార్యుడు ఎవరినైనా తన శిష్యునిగా స్వీకరించి భగవంతునితో సంబంధమును కలిగించును!
  • ఆచార్యుడు అజ్ఞాని అయిన తన శిష్యునికి భగవద్విషయమును తానే ఉపదేశించి భగవంతుని సేవించే విధమును నేర్పును కానీ శిష్యుని జ్ఞానార్జనలో ఒంటరిగా విడిచి పెట్టడు! కానీ భగవానుడు జ్ఞానవంతుడై ఆచార్య సంబంధము కలిగిన జీవుని మాత్రమే అనుగ్రహించును!
  • కనుక మోక్షము విషయములో మనలోని సంశయములు దూరం చేసి తనను ఆశ్రయించిన వారికి పరమపదము తథ్యమని ఉపదేశించిన ఉడయవర్ల చరణయుగళాన్ని ఆశ్రయించి మధురకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల కలిగియుండిన “తేవు మత్తఱియేన్…” అనెడి నిస్సంశయ, అన్యధా శరణ నాస్తి అనెడి నిర్దుష్టమైన భక్తి ప్రపత్తులు ఉడయవర్ల సన్నిధిలోనూ కలిగియుండుటలో ఎటువంటి ఆలోచన చేయనక్కరలేదు!

అయితే మనకు ఇంకొక సందేహము కలుగవచ్చు! పూర్వాచార్యులైన ఆచార్యులందిరికినీ ఉడయవర్లే ఉత్తారుకులని చెప్పుకున్నప్పుడు, మరి ఆళవందార్లు నాథమునుల విషయములో ఉపాయత్వమును నిశ్చయించుకున్నదెట్లు? దానికి సమాధానం – నాథమునులే కదా నమ్మాళ్వార్ల వద్ద రహస్యార్థములన్నీయును మరియు స్వప్నార్థములను భవిష్యదాచార్య విగ్రహముతో సహా పొంది తమ అంత్యకాలమందు వాటిని తమ శిష్యులైన ఉయ్యాక్కొండారుకు ఇచ్చి భవిష్యత్తులో అవతరించబోవు ఆళవందార్ల విషయమును వారికి చెప్పి, “ఈశ్వరమునులకు కలుగబోవు కుమారునికి రహస్యార్థములను ఉపదేశించ వలసింది! ” అని తెలిపినందువల్ల వారు అలాగే వేచియుండి తమ కాలమందు ఆళవందార్లు అవతరించక పోవుట చేత తమ శిష్యులైన మణక్కాల్ నంబికి ఆ బాధ్యతను అప్పజెప్పగా మణక్కాల్ నంబి ఆచార్య దివ్యాజ్ఞను అనుసరించి తమ కాలములో అవతరించిన ఆళవందార్లకు రహస్యార్థములను ఉపదేశించి మరియు భవిష్యదాచార్య విగ్రహమును వారికి అనుగ్రహించిరి! దానికి ఆళవందార్లు నాథమునుల వల్లనే కదా తమకు శ్రీ సంప్రదాయ విద్య అబ్బినదని సంతోషించి, “తాము పుట్టక మునుపే గర్భములోనే సంపదను పొందిన రీతిగా విశేష కటాక్షమును పొంది, సంప్రదాయ అర్థములను తెలియ పరచి, భవిష్యదాచార్య విగ్రహమును చూపి ఆ భవిష్యదాచార్యులైన ఉడయవర్లు తమకాలములోనే అవతరించగా వారిని దర్శించే భాగ్యాన్ని కలుగ చేసి సద్వారకముగా స్వప్న దర్శనమును అనుగ్రహించి ఇంత ఉపకారమును ఒనర్చిన నాథమునులకు నేనేమి ప్రత్యుపకారము చేయగలనని” చింతించి ఆళవందార్లు నాథమునుల పట్ల ఉండెడి ప్రత్యుపకార భావము యావదాత్మభావిగా ఉండునని తెలియ పరచ గోరి, “నాథమునులు నిశ్చయించిన విషయము వరకు ఎందుకు, నాకు ఇంత ఉపకారము చేసిన నాథమునులే నాకు సర్వస్వము కదా!”, అని పలికారు ఆళవందార్లు ! అదే దాని భావము! నిజానికి నాథమునుల మనోభావమే ఆళవందార్ల మనోభావము !

అలా ఆళవందార్లు నాథమునుల పట్ల ప్రాప్యమునకు తగిన ఉపాయత్వభావమును పొందుటయే కాక  నమ్మాళ్వార్ల పట్ల కూడా, “సర్వం యదేవ నియమేవ మదన్వయానాం! ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా!!” (స్తోత్ర రత్నం -5), (నా వంశమునకు చెందిన వారి కందరికిని శ్రీ శఠకోపుల పాదద్వయమే సమస్తమో ఆ శ్రీ చరణయుగళాన్నే ఆశ్రయిస్తున్నాను!) అని అందరికి, తమకు ఆళ్వార్ల శ్రీ చరణాలే ఉపాయముగా నిశ్చయించుకున్నట్లు అయినది! అక్కడే “మదీయ శరణం.. ” అన్నందు వలన తామొక్కరినే చెప్పి ఉపాయత్వమును చెప్పుటచే ఆళ్వార్లు తమకు చేసిన ఉపకారమునకు బద్ధులై తత్సమృద్ధి సూచకంగా చెప్పినట్లు స్పష్టమవుచున్నది !!

ఇక తరువాతి వ్యాసములలో ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును నిరూపించే మరి కొన్ని ఐతిహ్యములను చెప్పుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment