శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3
గత మూడు అధ్యాయాలలో జగదాచార్యులైన ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వమును అనుభవించి యున్నాము! ఇక ఇంత అద్భుతమైన గ్రంథము యొక్క ముగింపు చూద్దాము!
(గమనిక : ఈ ముగింపు భాగము తిరువరంగత్త అముదనార్లు రచించిన “ఇరామానుశ నూఱ్ఱందాది” అను ప్రబంధమును ఆధారముగా చేసుకొని చెప్పడం జరుగుతున్నది! అముదనార్లుకు ఉడయవర్లపై గల అసాధారణ మరియు నిరుపమాన భావానుభూతులు ఈ ప్రబంధము ద్వారా మనం తెలుసు కొనవచ్చును! ఈ ప్రబంధమును నాలాయిర ప్రబంధములలో చేర్చ వలెనని మరియు తిరు వీధులలో స్వామి పురప్పాడు (ఊరెరిగింపు) జరుగునపుడు ఈ ప్రబంధమును ఆచార్య పురుషులు అనుసంధించ వలెనని సాక్షాత్తు శ్రీ రంగనాధుడే (నమ్పెరుమాళ్) ఆజ్ఞ చేసాడు! దీని వలన భగవంతునికి కూడా ఈ ప్రబంధము పట్ల ఉన్న అభిమానము స్పష్ట మగుచున్నది! ఈ ప్రబంధమునకు “ప్రపన్న గాయత్రి” అని పేరు! ఈ ప్రబంధమును స్త్రీ పురుష వర్ణ వయో భేదములు లేక రామానుజ దాసులైన వారెల్లరూ గాయత్రి అనుష్టానము వలె దీన్ని అనుసంధించు కోవచ్చునని ఆర్యోక్తి !! అంటే గాయత్రి ఎంత జపిస్తే అంత శక్తిమంతమో ఈ ప్రబంధము కూడా ప్రపన్నులైన రామానుజ దాసులకు ఎంత పాడు కుంటే అంత రామానుజ కటాక్షము!!
గతములో తెలుసుకున్నట్లు ఎమ్బెరుమానార్లే జగదాచార్యులు, ఉత్తారకాచార్యులు! ఉడయవర్లు ఈ ఘోర కలిలో సామాన్య జనులకు సైతం మోక్షార్హత కల్పించి వారిని సంసారము నుండి కాపాడి సద్గతుల నిచ్చు ఒక ప్రత్యేక అవతారముగా వచ్చి నటువంటి పరమ ప్రేమైక మూర్తి! వారి శ్రీచరణాలే పరమమని నమ్మి జీవించెడి చరమపర్వనిష్ఠులైన శ్రీవైష్ణవులకు నిస్సందేహముగా వారే ఉపాయము మరియు ఉపేయమున్నూ!
- 105వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసనై తొళుమ్ పెరియోర్ ఎళుందిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కు ఇరుప్పిడమే – పెద్దలైన శ్రీ వైష్ణవులు ఎక్కడైతే రామానుజుల దివ్య వైభవాన్ని గానం చేస్తారో అక్కడే నాకు స్థానమ”, అని చెప్పినట్లు ప్రపన్నులు ఉండదగిన చోటు రామానుజ వైభవము కీర్తించెడి పెద్దల సాంగత్యములోనే.
- 94వ పాశురములో “ఉవందరుందేన్ అవన్ సీర్ అన్ఱి యానోన్ఱుమ్ ఉళ్ మగిళ్ న్దే – రామానుజుల వైభవ కీర్తనము తప్ప మరేదీ మనసులో నిలుపజాలను”, అని చెప్పినట్లు చేయవలసిన కార్యము నిరతము రామానుజ దివ్యగుణ కీర్తనమే! ఇదే అర్థము 2వ పాశురములో కూడా ధ్వనిస్తుంది, “ఇరామానుశన్ మిక్క సీలమల్లాల్ ఉళ్ళాదు ఎన్నెన్జు – రామానుజ తత్వముపై తప్ప తక్కిన విషయములపై నిలువదు నా మనసు ” ! కనుక చరమాధికారుల (ఆచార్య నిష్టులు) పరమ గమ్యము రామానుజుల దివ్యగుణ స్మరణమే!
- 15వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసన్ తన్ పిరంగియశీర్ సారా మనిసరై చ్చేరేన్ ఎనక్కెన్న తాళ్వినైయే – రామానుజుల దివ్యగుణములను అనుభవించని మనుష్యులతో చేరను! వారితో నాకేమి లాభము? “, అని చెప్పినట్లు రామానుజ గుణానుభవము చేయని వారి సాంగత్యమును విసర్జించవలెను! “అటువంటి వారితో చేరకపోవుట చేత నాకెటువంటి నష్టము లేదు!” అని అముదనార్లు పాశురములో చెప్పుటచే, “రామానుజ గుణానుభవత్యక్తుల సాంగత్యము మనకు నష్టమును కలిగించును”, అని అర్థము చేసుకొనవలెను! దీని వలన స్వరూప నాశనము జరుగునని రూఢి అగుచున్నది!
- 28వ పాశురములో, “ఇరామానుశన్ పుగళ్ అన్ఱి యెన్ వాయ్ కొంజిప్పరవగిల్లాదు – రామానుజుల గుణ వైభవ కీర్తనము తప్ప నా నోరు పక్క దారి పట్టి ఎగుర లేదు! ” అని చెప్పినట్లు ఎల్లప్పుడూ రామానుజుల గుణానుభవ కీర్తనమే జిహ్వకు ఉద్యోగముగా చేయవలెనని అర్థము!
- 35 వ పాశురములో చెప్పిన విధముగా, “ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ అయరేన్ – రామానుజుల దివ్యచరణ కమలాలను ఎన్నటికీ మరువను”, అనునట్లు సదా రామానుజుల చరణ సరోజములను ధ్యాన మందు నిలుపు కొనవలెనని అర్థము! ఎందు కంటే ఆ చరణములు సకల పాప హరణములు! అంతర్బాహ్య శుద్ధి కరణములు ! వాటిని ఎన్నటికీ మరువరాదు!
- 107 వ పాశురములో, “ఉన్ తొండర్గట్కె అన్బుత్తిరుక్కుమ్ బడి ఎన్నై యాక్కి అంగాట్పడుత్తే – నీ దాసుల యందు ప్రియము కల్గి ఉండునట్లు నను నీవే చేసి అనుగ్రహించుము”, అని చెప్పినట్లు చరమ పర్వ నిష్టుల కర్తవ్యము (స్వరూపము) రామానుజుల దాసులైన శ్రీ వైష్ణవుల పట్ల అభిమానము కలిగి వారి యెడల సేవాభావముతో జీవించుట!
- 104 వ పాశురములో చెప్పినట్లు, “ఉందన్ మెయ్యిల్ పిరంగియ శీర్అన్ఱి వేణ్డిలన్ యాన్….. ఇవ్వరుళ్ నీ సెయ్యిల్ తరిప్పన్ ఇరామానుశా – నీ దివ్య మంగళ విగ్రహ సందర్శనము తప్ప వేరేదీ కోరేవాడను కాను – అది నాకు అనుగ్రహిస్తే తరిస్తాను”, అని చెప్పినట్లు రామానుజుల దివ్య మంగళ విగ్రహమును సందర్శనమే మనస్సుకు పరమౌషధముగా భావించ వలెను!
- 80 వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామం నమ్బవల్లార్ తిరత్తై ….శైయ్వన్ సోర్విన్ఱియే – రామానుజుల తిరు నామము జపించెడి ఉత్తములైన శ్రీ వైష్ణవులను మనసా వాచా కర్మణా సేవిస్తాను”, అని చెప్పినట్లు రామానుజ ధ్యాన పరాయణులైన శ్రీ వైష్ణవ శిఖామణులను ఎల్లపుడు సేవిస్తూ వారికి మనసా వాచా కర్మణా సేవ చేయవలెను! మరియు 46 వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామమ్ నమ్బిక్కల్లార్ అకలిడత్తోర్ ఎదు పేరెన్ఱు కామిప్పరే – రామానుజుల తిరు నామము నమ్మని వారికి ఈ లోకములో ఏది గతియని చూపించండి చూద్దాం?”, అని చెప్పుటలో రామానుజులను నమ్మని మూఢులకు లోకములో మోక్షము కొరకు వేరు గతి ఉండదని తెలుసుకోవాలి!
కూరత్తాళ్వార్లను సేవించెడి తిరువరంత్త అముదనార్లు – అముదనార్లు కూరత్తాళ్వార్ల వద్ద సమాశ్రయణము రామానుజసంబంధమును పొందారు
అముదనార్లు ఈ అద్వితీయమైన ప్రబంధమును శ్రీ రామానుజులు వేంచేసి ఉన్న కాలములోనే రచించి గానము చేసినారు! శ్రీ రామానుజుల చేత మరియు నంబెరుమాళ్ళయిన శ్రీ రంగనాథుని చేత ఆమోదించబడిన ఈ గ్రంథములో చెప్పిన చరమ పర్వస్థ నియమాలు సూత్రాలు నిస్సందేహముగా పాటించదగినవని పూర్వాచార్యుల ఉవాచ! ఎందు కంటే :
సత్యం సత్యం పునస్సత్యం యతిరాజో జగద్గురుః !
స ఏవ సర్వలోకానామ్ ఉద్ధర్తా నాత్ర సంశయః !!
అర్థము : సత్యం! సత్యం! మరల సత్యం ! యతిరాజులే జగద్గురువులు ! వారే సర్వలోకులను ఉద్ధరించగలరు ! ఇందులో సందేహము లేదు!
ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ పొరుందానిలై యుడై ప్పున్మయిలోర్కు
ఒన్ఱుమ్ నన్మై శెయ్యా ప్పెరుందేవరై ప్పరవుమ్ పెరియోర్ తమ్ కళల్ పిడిత్తే – 62 వ పాశురము
అర్థము – రామానుజుల శ్రీ చరణాలను ఆశ్రయించని దుర్మార్గులకు కొంచెము కూడా సహాయపడని గొప్ప దేవతలైన పెద్దల శ్రీచరణాలను ఆశ్రయిస్తాను!
చరమోపాయ నిర్ణయము ముగిసినది !!
నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
ఆచార్య తిరువడిగళే శరణం
అడియేన్ శ్రీనివాస రామానుజదాసన్
మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-conclusion/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org
0 thoughts on “చరమోపాయ నిర్ణయం – ముగింపు”