తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://granthams.koyil.org/thathva-thrayam-telugu/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు, దివ్య వైభవము కలిగిన శ్రీ పిళ్ళై లోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.

ఎమ్బెరుమానార్, శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు – తిరుప్పవళ వణ్ణం దివ్య దేశం

“తత్వ త్రయము” అను ఈ గ్రంథము “చిన్న శ్రీ భాష్యము” గా మన సంప్రదాయములో ప్రసిద్ధి గాంచినది. శ్రీ భాష్యకార బిరుదాంకితులైన భగవద్రామానుజులు బ్రహ్మ సూత్రములకు అద్భుతమైన, సరళమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానమే “శ్రీ భాష్యము” గా సుప్రసిద్ధమైనది. విశిష్టాద్వైత సిద్ధాంతమునకు అవసరమైన అన్ని ప్రధాన ప్రమాణములు ఇందులో ఇమిడియున్నవి. అయితే శ్రీ భాష్యము సంస్కృతములో ఉండుట చేత సంస్కృత భాషాప్రవేశము లేనివారికి శ్రీ భాష్యము నందలి విషయములు తెలుసుకొనుటకు కష్టసాధ్యముగానుండెను. శ్రీ పిళ్ళై లోకాచార్యులవారు శ్రీభాష్యము యొక్క సారమును “తత్వ త్రయము” అను గ్రంథములో పొందు పరిచి ద్రావిడ భాషలో సామాన్యులకు సైతం సులభముగా అర్థమగు రీతిలో రచించారు. ఈ గ్రంథములో వేదాంతము నందలి ప్రాథమిక విషయములైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి విశదీకరించుట జరిగినది. తత్వ త్రయం గ్రంథము యొక్క సారాంశము ఈ లింకులో చదువుకొనవచ్చును.

https://granthams.koyil.org/2017/02/13/simple-guide-to-srivaishnavam-thathva-thrayam-in-short-telugu/

ఇక స్వామి మణవాళ మహాముణులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము.

“అనాది మాయయా సుప్తః” అనునట్లు, అనంతకోటి సంవత్సరాలుగా ఎడతెగని ఈ కాల చక్రములో జీవుడు పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి సంబంధము చేత కర్మలు ఆచరించుచూ వాటి వల్ల సంక్రమించే పుణ్య పాపముల ఫలితముగా జనన మరణ చక్రములో పడి అలమటిస్తున్నాడు. అజ్ఞానమనెడి అంధకారంలో చిక్కుకున్న జీవుడు తాను వేరు ప్రకృతి వేరు అన్న సత్యమును (తెలిసినచో కేవలము భగవత్కళ్యాణ గుణములనే స్మరిస్తూ భగవంతుని అనుభవిస్తూ ఈ ప్రకృతిని విస్మరించెడివాడు) మరచి తానూ ప్రకృతిలో ఒకనిగా భావించి ఈ ప్రకృతినే అనుభవిస్తూ కాలము గడుపుతున్నాడు. అటువంటి అజ్ఞానముతో జీవుడు.

  • “దేహోऽహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
  • “ఈశ్వరోऽహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
  • తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.

“యోऽన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్య కలాపము లందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మ ప్రదమైన ప్రాపంచిక సుఖములను భవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.

“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రము నందు విశ్వము గాఢాంధకారమై యుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని  ఆశీర్వదించెను.

శ్రీనమ్మాళ్వారులుశ్రీరంగనాథుని యందు జీవులను అనుక్షణం ప్రేమతో అనుగ్రహించెడి  “వ్యూహ సౌహార్ద్రత” అను కళ్యాణగుణమును బాగుగా అనుభవించియున్నారు.

తిరువాయ్మొళి  3.2.1 లో, “అన్నాళ్ నీ తంద అక్కైయిన్ వాళి ఉళల్వేన్” అని  చెప్పినట్టుగా, జీవుడు భగవదనుగ్రహము చేత పొందిన శరీరేంద్రియములను దుర్వినియోగ పరుచుచూ భౌతిక సుఖలోలుడై కాలము గడుపుచున్నాడు. నది దాటుటకు పడవను పొంది నది దాటకపోగా, ఆ పడవలో సముద్రములోనికి పోయి అలలాడినట్లు, ఈ జీవుడు పాంచ భౌతిక శరీరమును తానేయని భ్రమించి స్వార్థ పూరిత కర్మలు ఆచరించుచూ సంసార సాగరములో కొట్టుమిట్టాడు చున్నాడు. చేసిన కర్మల ఫలితముగా మరల మరల జన్మించుచూ తాపత్రయ గ్రస్థుడై గర్భస్థ, జన్మ, కౌమార, యవ్వన, మరణ అనెడి దశలను గడిపి చేసిన పాప కర్మల ఫలితముగా నరకముననుభవించి, పుణ్య కర్మల ఫలితముగా ఉత్తమ జన్మలెత్తుతూ అలా పడుతూ లేస్తూ ఈ జననమరణ చక్రములో తిరుగుచున్నాడు. “ఏవం సంస్మృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే కృపా కాపి ఉపజాయతే “, అనునట్లు భగవానుడైన శ్రీ మహా విష్ణువు జీవుల పట్ల తనకు గల నిర్హేతుక కృప చేత జీవులను సంసార సాగరము నుంచి ఉద్ధరించుటకు అనేక అవతారాల ఎత్తి ధర్మ రక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. “జాయమానమ్ యమ్ పశ్యేన్ మధుసూదనః సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చిన్తకః”, జీవుడు తల్లి గర్భములో జనించునపుడు తాను ఎటుల తరించవలెనో తెలుసుకుని సత్యమైన జ్ఞానమును పొంది సాత్వికుడై విష్ణువును ఆశ్రయించి మెలిగినపుడే ముముక్షుత్వము సాధించినవాడు అవుతాడు.   

సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )

శాస్త్రాధ్యయనము వలన కొన్ని ఇబ్బందులు కలవు.
  • “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం”, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించు కొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
  • ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్ర జ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నాః”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
  • చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.

అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్ర జ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్ర జ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగు నట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.

అందువలన పరమ కారుణికులైన శ్రీ పిళ్ళై లోకాచార్యులు వేదాంత శాస్త్రమును ఆసాంతం అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులైననూ జీవుల పట్ల గల నిర్హేతుక కృప చేత అందరికీ అర్థమగునట్లు లలితమైన భాషలో వేదాంతమునకు మూల వస్తువులైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి ఈ తత్వ త్రయమను గ్రంథమును రచించియున్నారు.

పూర్వాచార్యులైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వంటివారు కూడా క్లిష్టతరమైన వేదాంత శాస్త్రమును సులభ రీతిలో జనులకు అర్థమగునట్లు తమ గ్రంథములు ద్రావిడ భాషలో రచించుటకు కారణం జీవులపట్ల తమకు గల నిర్హేతుక కృప మాత్రమే. ఎందుకంటే మన పూర్వాచార్యులు

  • అహంకార రహితులు
  • జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
  • ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు

మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించ వచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహాముణులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:

  • ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరు వేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా.  అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
  •  ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.

ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయము గలవైయుండును.

శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహాముణులు – శ్రీపెరుంబుదూరు

ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహాముణుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమ కృపా పూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము : https://granthams.koyil.org/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

0 thoughts on “తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము”

  1. ధన్యవాదాలు🙏

    On 08-Jan-2018 7:07 PM, “SrIvaishNava granthams – Telugu” wrote:

    > sarathyt posted: ” శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః
    > శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః మనము ఇంతవరకు అయిప్పసి (తులా
    > మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము.
    > మరిన్ని వివరముల కొరకు https://ponnadi.blogspot
    >

    Reply

Leave a Comment