తత్త్వత్రయం – చిత్: నేను ఎవరు?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము

జ్ఞానుల ఉపదేశముల ద్వారా చిత్ (ఆత్మ) తత్వమును అర్థం చేసుకొనుట :

పరిచయము:

  • సామాన్య జనుల నుంచి శాస్త్రజ్ఞులు, జ్ఞానుల వరకు సమాధానము తెలియగోరే గొప్ప ప్రశ్న “నేను ఎవరిని?” అని. అలాగే ప్రకృతి అంటే ఏమిటి? దాని సృష్టి కర్త ఎవరు? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి!
  • తరతరాలుగా అనేక నాగరికతలలో జ్ఞానులు ఈ మూడు వస్తువుల గురించి కొత్త విషయములు తెలుసుకొనుటకు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు.
  • సనాతన ధర్మం వేదము, వేదాంగము, స్మృతి ఇతిహాస పురాణములపై ఆధారపడి యుండుట చేత పై మూడు (చిదచిదీశ్వరులు) విషయముల గూర్చి చక్కగా వివరిస్తుంది.
  • గీతాచార్యుడు (శ్రీమన్నారాయణుడు), నమ్మాళ్వార్లు, శ్రీ పిళ్ళై లోకాచార్యులు మరియు స్వామి మణవాళ మహాముణులు తమ తమ గ్రంథములలో చిదచిదీశ్వర తత్వములను అద్భుతముగా చెప్పియున్నారు.
  • ముఖ్యముగా శ్రీ పిళ్ళై లోకాచార్యులు రచించిన ఈ “తత్వ త్రయం” గ్రంథము మరియు స్వామి మణవాళ మహాముణులు రచించిన వ్యాఖ్యానము సామాన్యులు కూడా సులువుగా అర్థము చేసుకొను రీతిలో మలచబడియున్నవి.
  • ముముక్షువులు చిదచిదీశ్వర తత్వము గూర్చి తెలుసుకోకుండా సాధన చేయుట కష్ట సాధ్యమే అవుతుంది. కనుక ఆస్తికులు, ప్రపన్నులు తత్వ త్రయము గూర్చి తప్పక తెలుసుకొనవలెను.
ఆత్మ యొక్క నిజమైన తత్వము
  • ఆత్మ, పాంచ భౌతికమైన స్థూల శరీరము ఒకటి కాదు.
  • ఆత్మ యొక్క గుణములు:
    1. ప్రకాశవంతమైనది: తన అస్తిత్వమును పూర్తిగా తెలుసుకొన్నది మరియు స్వయం ప్రకాశమైనది.
    2. అమితానందమైనది: ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండునది.
    3. అక్షయమైనది: సృష్టి నాశనములు లేనిది.
    4. అగోచరమైనది: బాహ్య దృష్టికి కానరానిది.
    5. అణ్వాత్మకమైనది: స్థూల దృష్టితో దర్శించలేనంత అల్పమైనది.
    6. దురవగతమైనది: ఇంద్రియముల చేత గ్రహించనలవికానిది.
    7. అభేద్యమైనది: భాగించుటకు, విభజించుటకు సఖ్యము కానిది.
    8. మార్పులేనిది: మార్పు చెందే గుణము లేనిది.
    9. జ్ఞానపూర్ణమైనది.
    10. భగవానుని చేత నియంత్రించబడునది.
    11. భగవంతునికి దాస్యము  చేయుటయే ఆత్మకు  స్వాభావికము.

ఆత్మకు శరీరమునకు, ఇంద్రియములకు, బుద్ధికి, శ్వాసకు గల భేదములు :

  • శరీరేంద్రియములను “నా శరీరము”, “నా బుద్ధి”, “నా ఇంద్రియములు” అని వ్యవహరిస్తుంటాము. “నేను” అనునది ఆత్మ కాగా పైన చెప్పిన ఉదాహారణలలోని శరీరాదులు ఆత్మకు చెందిన వస్తువులుగా ఆపాదించవచ్చు.
  • ఆత్మ గూర్చి ఎరుక ఎల్లప్పుడూ ఏదోక రూపములో ఉండును కానీ శరీరాదుల ఎరుక ఎల్లప్పుడూ ఉండదు.
  • ఉదాహరణకు నిద్రావస్థయందు శరీరస్మృతి ఉండదు కానీ ఆత్మ యొక్క ఉనికి (జాగృతముగా) ఉండును. కనుకనే నిద్ర మేల్కొనగానే మనము ఎవరో తిరిగి తెలుసుకొనగలుగుతున్నాము. అలాగే చేతికి మత్తు మందు ఇస్తే చేయి స్పర్శ కోల్పోతుంది కానీ మిగిలిన శరీరము చైతన్యముతో ఉంటుంది. అదే ఆత్మయొక్క గుణము.
  •   అందుచేత ఆత్మ వేరు, శరీరాదులు వేరు.

పై గమనికల ద్వారా శరీరేంద్రియములు, ఆత్మ వేరు అన్న విషయము మనకు అర్థమవుతుంది.

  • పై గమనికలలో బేధములను ఇతరులు ఆక్షేపించవచ్చు. తర్కము ఎల్లప్పుడూ సాధ్యమే. అయితే మనకు శృతి స్మృతి పురాణాదులు ప్రమాణము కనుక పూర్వాచార్యుల సూక్తులు వాటిపై ఆధారపడినవి కనుక మనము పై గమనికలను ఒప్పు కొనవలెను. శాస్త్ర  ప్రమాణము దుర్బేధ్యమైనది, తర్కమునకు అందనిది కనుక దానినే ఒప్పుకొనవలెను.

అందుచేత శరీరము వేరు ఆత్మ వేరు. ఆ రెండు వస్తువులు వేరైనను ఒకదానికి మరొకటి సంబంధము కలిగి యుండి పరస్పరము ఆధారమైనవి. ఈ విషయము బాగా అర్థము చేసుకోగలిగితే మనకు శారీరిక సంబంధిత విషయములపై ఆసక్తి తగ్గనారంభిస్తుంది.

శరీరములోని మార్పు ఆత్మ యొక్క శరీర ప్రయాణము:
  • భగవానుడు భగద్గీతలోని రెండవ అధ్యాయములో ఆత్మ శరీరము గూర్చి చక్కగా వర్ణించాడు.
  • 13వ శ్లోకములో, “ఆత్మ శరీరములో ప్రవేశించిన పిదప శరీరమునకు జననము, బాల్యము, కౌమార్యము, యవ్వనము, వార్ధక్యం,మరణము అనెడి స్థితులు కలిగి ఆత్మ ఒక శరీరమును వదిలి మరొక శరీరమునకు ప్రయాణించును. ఈ విషయము తెలిసినచో శరీరము పట్ల మమకారము పట్టదు.”
  • 22వ శ్లోకములో, “పాడైపోయిన దుస్తులను విడిచి మనము కొత్త దుస్తులు ఎలా తొడుక్కుంటామో అలాగే ఆత్మ క్షిణించిన ఒక శరీరమును విడిచి మరొక శరీరమునకు ప్రయాణము చేయును”.

కనుక శరీరము క్షయమగును కానీ ఆత్మ క్షయమవదు.

కర్త కర్మ క్రియ ఆత్మయే:
  • ఆత్మ జ్ఞాన పూర్ణమైనది కనుక కర్త ఆత్మయే.
  • శాస్త్రము ఆత్మ జ్ఞాన పూర్ణమైనదిగా చెబుతున్నది.
  • జ్ఞానము కర్మకు హేతువు. కర్మ అనుభవమునకు హేతువు. కనుక కర్మ, అనుభవము అనునవి జ్ఞానము యొక్క రెండు దశలుగా చెప్పవచ్చు.
  • ఆత్మ శరీరాంతర్గతమై యుండి భూమిపై సత్వ రజస్తమో (ప్రశాంతత, ఆవేశము, నిర్లక్ష్యము) గుణ విరాజితమై యుండును కనుక దానికి అనుగుణముగా ప్రవర్తించును.
  • భగవానుడు ఆత్మకు స్వాతంత్య్రము నిచ్చి ఇష్టారీతిలో వర్తించుటకు అనుమతిచ్చిననూ భగవానుని నిరంకుశ గుణము చేత జీవుని నియంత్రించే అధికారము భగవానునికి కలదు.
  • జీవుడు ఆచరించే ప్రతీ కార్యములోనూ జీవునికి స్వాతంత్య్రము కలదు. భగవానుడు సాక్షిభూతుడై అది గమనించుచూ జీవుడు తన ఇష్టానుసారం చేయు చర్యలకు ఫలితమును అనుగ్రహించును.
  • జీవుడు చేయు కర్మలు శాస్త్రానుసారమా లేక శాస్త్రవిరుద్ధమా నిర్ణయించి భగవానుడు జీవునికి తగిన కర్మ ఫలమును ఇచ్చును. దీని వలన భగవానుడు పరోక్షముగా జీవుని నియంత్రించు చుండును. అయితే కర్మ ఇష్టానుసారముగా ఆచరించే స్వాతంత్య్రత జీవునికి భగవంతుడు ఇచ్చుట చేత తాను చేయు కర్మలకు తానే బాధ్యుడవుతాడు జీవుడు.
  • కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భగవానుడే జీవుని కర్మలను పూర్తిగా నియంత్రించి లోకోపకార రీతిలో జీవుని చేత కర్మలు ఆచరింపచేయును. అవి కారణ జన్ముల జీవితాలలో జరుగు సంఘటనలు, వారి కర్మలు మొదలగునవి.
భగవానుని చేత నియంత్రింప బడుట, ఉద్ధరింప బడుట – భగవానునికి దాస్యము చేయుట :

భగవానుని చేత పూర్తిగా నియంత్రించ బడిన జీవుని జీవితములోని కర్మలన్నీ భగవానుడే చేయించు చుండును. అటువంటి వారి జీవితములో వారు ఆచరించిన కర్మలకు బాధ్యులు వారు కాదు. భగవానుడే!

  • శరీరములోని అన్ని చర్యలను జీవుడు నియంత్రించినట్లు, జీవుని పూర్తిగా నియంత్రించు సర్వాంతరాత్మ ఆ భగవంతుడు.
  • భగవంతుడు సర్వజీవులను నియంత్రించువాడు అయిననూ వారి ఇష్టానుసారము జీవించుటకు, శాస్త్రమును అనుష్ఠించుట కొరకు జీవునికి స్వతంత్రత ఇచ్చెను.
  • అనుష్టానము లేనిచో శాస్త్రము అర్థరహితమగును.
  • అందుచేత జీవుడైన ఆత్మ భగవానునిచే నియంత్రించ బడి, ఉద్ధరించ బడుతుంది. జీవుని కర్తవ్యము భగవద్దాస్యము చేయుటయే.
  • కర్మలను ఎలా చేయవలెనో, ఏది విసర్జనీయమో తెలిపేది శాస్త్రము. కర్మ స్వాతంత్య్రము కలిగిన జీవుడు శాస్త్రాన్ని అధ్యయనము చేసి, అనుష్టించి శాస్త్రానుసారముగా జీవించవలెను.
  • జీవుడు కర్మలు ఆచరించునపుడు భగవంతుడు మూడు రూపములలో ఉండును, అవి
    • సాక్షి : జీవుడు ఆచరించు కర్మలను గమనిస్తూ పరోక్షముగానుండును.
    • అంగీకర్త : జీవుడు కర్మలను తాను అనుకున్న విధమున ఆచరించుటకు అంగీకరించును.
    • ప్రేరేపించువాడు : జీవుడు ఆచరించు కర్మలనుంచి పుట్టే మరిన్ని కర్మలను జీవుని చేత ఆచరింపజేయువాడు.
  • భగవంతుడే జీవుని ఉద్ధరించువాడు. జీవుడు భగవానుని గూర్చి అవగాహన కోల్పోయి నప్పుడు తాను అజ్ఞానావస్థలో ఉంటాడు. జీవునికి భగవానుని విషయములో తెలియవలసిన విషయములు:
    • జీవునికి భగవంతునికి సంబంధము ఎట్టిది?
    • భగవత్తత్వము ఎటువంటిది?
    • భగవంతుని కళ్యాణ గుణములు ఏవి?
  • విశ్వాంతరాత్ముడైన భగవంతునికి జీవుడు దాసుడు.
  • అనగా, జీవుడు తన స్వార్థమును విడిచి ఎల్ల వేళలా భగవంతుని సంతృప్తి పరుచుట కొరకు, భగవంతుని ఆనందింప చేయుట కొరకు నిస్వార్థముగా కర్మలు ఆచరించవలెను. జీవము లేని అచిత్తులైన చందనము, పుష్పములు ఎలా అయితే సుగంథములతో మనలను ఆనందింపజేయునో అటులనే జీవుడు భగవానుని సంతోషపరుచుటకు సత్కర్మలు ఆచరించవలెను.
  • చివరగా భగవానుడు వేరు , జీవుడు వేరు అయిననూ భగవంతునికంటే ఇతరమైన ఉనికి జీవునికి లేదు.

ఆత్మలు మూడు రకములు :

  • జీవులు అనంత కోటి కలవు. వాటిని స్థూలముగా మూడు విధములుగా విభజించ వచ్చును. అవి బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ
  • బద్ధాత్మ
    • ఇవి సంసార సాగర మందు బంధింపబడి అనాది కాలము నుంచి జనన మరణ చక్రములో తిరుగుచున్నవి.
    • తమ యొక్క నిజతత్వమును ఎరుగక సంసారము శాశ్వతమనుకునే జీవాత్మలు ఈ కోవకు చెందినవి.
    • పూర్తిగా అజ్ఞాన భూయిష్టులై శరీరము, తానూ ఒకటే అనే భ్రమలో జీవించే ఆత్మలను బద్ధాత్మలుగా పరిగణించవచ్చు.
    • సంసారము అశాశ్వతము అని తెలిసినా తాము స్వతంత్రులమని భ్రమించి ఎటువంటి నియంత్రణ లేక సంసారములో చరించే జీవాత్మలు కూడా ఒకరకమైన బద్ధాత్మలే.

  • ముక్తాత్మ
    • ముక్తాత్మలు ఒకకాలములో బద్ధాత్మలై సంసారమందుండి ముముక్షువులై మోక్షము కొరకు సాధన చేసి మోక్షము పొందినవి.
    • భక్తి, జ్ఞాన వైరాగ్యముల చేత సంసార శృంఖలాల నుంచి విముక్తి పొంది, భగవానుని యొక్క నిర్హేతుక కృప చేత మోక్షార్హత పొంది కైవల్య సామ్రాజ్యమును పొందినవి ముక్తాత్మలు.
    • ఇవి మోక్ష సాధన పరిపక్వమైనపుడు అర్చిరాది మార్గాన పయనించి విరజా నదిలో తీర్థమాడి దివ్య శరీరమును పొంది సారూప్య ముక్తిని పొందుతాయి.
    • శ్రీ వైకుంఠము నందు నిత్యసూరులు మరియు ముక్తాత్మల చేత ఆహ్వానించబడి శ్రీ పరమపదనాథుని సన్నిధానములో శాశ్వతానంద స్థితిలో పరమపదంలో పెరుమాళ్ళకు పల్లాండు పాడుతూ అనంత కాలము శ్రీ కైంకర్యములో అన్వయింపబడతాయి.

  • నిత్యాత్మ
    • నిత్యాత్మలు సంసార గంథము ఎన్నడూ అంటనివారు.
    • వారు అహర్నిశలు క్షణక్షణము భగవానుని యందే నిమగ్నులై ఉండును. అది పరమపదమైనా సరే, సంసారమైనా సరే.
    • పరమపదములో నిత్య సూరులు భగవానుని ఆజ్ఞ చేత జీవోద్ధరణకు సంసారలోక మందు అవతరించెడి వారు నిత్యాత్మలు. సంసార మందు ఉండిననూ సంసార వాసనలు వారికి అంటవు.
    • అటులనే పరమపదములో స్వామికి నిత్య కైంకర్యము అన్వయించెడి నిత్య సూరులు ఈ నిత్యాత్మల కోవకు వస్తారు. వారు అనంత, గరుడ విశ్వక్సేనాదులు.
    • పరమపద నాథుడు ఎల్లప్పుడూ నిత్యాత్మలైన నిత్యసూరుల చేత కైంకర్యములను స్వీకరించుచుండును.

  •   అనంత కోటి జీవాత్మలు – వాటి గుణములు
    • చల్లటి నీరు పాత్రలో వేసి నిప్పుపై పెడితే వేడిపడి నట్లు భగవద్దాసులైన జీవాత్మలు సంసారవాసన తగలగానే అజ్ఞానమును, కర్మలు వాటి ఫలితాలకు బద్ధులవుతారు. ఇది బద్ధాత్మల లక్షణము.
    • విషయ ప్రావణ్యము తరుగుతున్న కొద్దీ అజ్ఞానము పోవనారంభిస్తుంది.
    • అనంత కోటి జీవాత్మలు మూడు రకములు – అవి బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ – ఇవి ఒక్కొక్కటి అనంత కోటి.
    • శాస్త్రమును సరిగా అర్థం చేసుకోనివారు అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని భ్రమిస్తారు (అద్వైతము కూడా దీన్ని ఒప్పు కోదు). కానీ అది శాస్త్ర విరుద్ధము, తర్క దూరము.
    • అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయితే ఒకరు సంతోషముగా నుంటే మరొకరు బాధగా ఉండ కూడదు. అంతే తర్కము. కనుక ఒక శరీరాన్ని ధరించిన జీవాత్మ ఆ శరీరానికే బద్ధమైయుండును.
    • శాస్త్రానుసారము, కొన్ని నిత్యాత్మలు, కొన్ని ముక్తాత్మలు మరి కొన్ని జీవాత్మలు అనే వేర్పాటు ఉండుట చేత ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క జ్ఞాన దశలో ఉండుట చేత కొన్ని ఆచార్యత్వము వహిస్తే కొన్ని శిష్యత్వము వహిస్తాయి.
    • మోక్షము పొందిన ముక్తాత్మలు కూడా అనంత కోటి ఉంటాయి.
    • మోక్ష మందు కూడా అన్ని ముక్తాత్మలు ఒకే జ్ఞాన స్థితిలో ఉంటాయా అంటే అవును అని చెప్పడం కుదరదు. ఒకే పరిమాణములో, ఒక కుమ్మరి చేత చేయబడి ఒకే ఆకారములో ఉన్న కుండలు కూడా ఒకదానితో మరొకటి వేరుగా ఉంటాయి. ఆ సామ్యాన్ని ఇక్కడ ఉపయోగించుకొని కొన్ని ముక్తాత్మలు భగవంతుని దర్బారులో  భగవద్గుణానుభవము చేస్తుంటే కొన్ని ముక్తాత్మలు పెరుమాళ్ళ ఆజ్ఞ చేత మరల సంసారములో జన్మిస్తూ జనోద్ధరణ చేస్తుంటాయి. ఒకే స్థితిలో కూడా వేరు పాటు గమనించవచ్చు.
    • కనుక సంసారలోక మందు, పరమపద మందు కూడా అనంత కోటి జీవాత్మలు కలవని మనం గమనించవచ్చు.
ధర్మి జ్ఞానం – ధర్మ భూత జ్ఞానం

ఇక జ్ఞానము యొక్క విధములను తెలుసుకుందాము ! జ్ఞానము రెండు రకములు ధర్మి జ్ఞానము – ధర్మము పట్ల ఎరుక

ధర్మ భూత జ్ఞానము – ధర్మమును గూర్చి తెలుసుకొనుట వలన లభించిన జ్ఞానము.

ఆత్మ తత్వము (బద్ధ, ముక్త, నిత్య అను వైవిధ్యముతో సంబంధము లేక) యొక్క నిజ రూపములో రెండు గుణములు కలిగియుండును! అవి,

శేషత్వము : భగవంతునికి శేషునిగా అనగా సేవకుని వలె ఉండుట.

జ్ఞాతృత్వము: భగవద్గుణానుభవ ప్రభావిత జ్ఞానము కలిగియుండుట

  • రెండు గుణములు ఆత్మకు అత్యావశ్యక లక్షణములు
  • ఆత్మ జ్ఞానియై ఉండుట చేత అచిత్తు నుంచి వేరగు చుండును
  • భగవంతునికి శేషుడై ఉండుట చేత భగవానుని నుంచి వేరగు చుండును
  • ధర్మి జ్ఞాన ప్రభావము చేత ఆత్మ స్వాభావిక జ్ఞాన స్వరూపమై ఉండిననూ ధర్మ భూత జ్ఞానమును ఆవశ్యక విశేషముగా పొందవలెను
  • అంటే, ధర్మి జ్ఞానము ఆత్మ యొక్క అనంతమైన, నాశనము లేనట్టి, ఎటువంటి మార్పు లేనట్టి అస్తిత్వ గుణమును సూచిస్తుంది
  • ధర్మ భూత జ్ఞానము ప్రకృతిని, బాహ్య ప్రపంచమును గమనించుట చేత ఆత్మకు అలవడును. అది ఆత్మ యొక్క బుద్ధి పరిపక్వ స్థితిని బట్టి మారుతూ ఉండును
  • నిత్యాత్మలకు ధర్మ భూత జ్ఞానము అనంతమై పూర్తి జ్ఞాన భూత స్థితి కలిగియుండును
  • ముక్తాత్మలకు  ఒకప్పడు పరిమిత స్థితిలో యుండి, ముక్తి పొందిన పిమ్మట పూర్తి వ్యాకోచమై నిత్యులవలె అనంతమై ఉండును
  • ప్రకృతిపై ఆధారపడి జీవించే బద్ధాత్మలకు చాలా పరిమితముగా ధర్మ భూత జ్ఞానము ఉండును
  • నిజమైన జ్ఞానము సత్యమై శాశ్వతమై అనంతమై ఉన్ననూ, సత్త్వరజస్తమో గుణముల వలన జ్ఞానము గ్రహించు ఇంద్రియముల యొక్క పరిమితుల చేత జ్ఞానము పరిమితముగా ఆత్మకు అందును.
  • ఎందుకనగా ఇంద్రియములు సత్త్వరజస్తమో గుణముల వలన అన్ని వేళలా జ్ఞాన గ్రహణకు సిద్ధముగా ఉండవు. కనుక, ధర్మ భూత జ్ఞానము కొన్ని సార్లు పెరగవచ్చు, కొన్నిసార్లు తరగవచ్చు.

ముగింపు :

  • పరిపూర్ణ జ్ఞాన స్థితి పొందు ఆత్మ యొక్క గుణములను గూర్చి చెప్పుట జరిగినది
  • భౌతిక శరీరమును హింసించెడి వస్తువుల (విషం, శస్త్రములు) వలన దుఃఖము ఏర్పడుచున్నది .
    • ఎందుకనగా, ఆత్మ, శరీరము ఒకటే అన్న భ్రాంతి కలుగుట చేత.
    • దానికి కారణము మనము చేయు కర్మలు ఆత్మను శరీరమునకు కట్టి వేసి శరీరాత్మ  భ్రాంతి కలుగజేయుచున్నవి.
    • మనకు పాంచ భౌతికమైన ప్రకృతి గూర్చి పూర్తి అవగాహన లేకపోవుట చేత శస్త్రములు, రోగములు అంటే భయము కలుగుతున్నది. నిజానికి విశ్వవ్యాపకుడగు పరమాత్మ అన్ని పదార్థముల యందు కలడన్న జ్ఞానము పొందిన రోజు శరీరము ఆత్మ వేరనే ఎరుక కలిగి అన్ని భయములు పటాపంచలు అయిపోతాయి. ప్రహ్లాదునికి తనను చంపటానికి సిద్ధం చేసిన విషమో, కౄర మృగములో, మారణాస్త్రములో తనను ఏమీ చేయలేకపోవుటకు కారణము ఇదియే. “ఇందుగలడందు లేడను…. ” చందమున ప్రహ్లాదుడు అన్నిటి యందు ఆ హరిని దర్శించ గలిగెను.
  • భయము కేవలం మన అజ్ఞానము (పరమాత్మ విశ్వ వ్యాపకుడను సత్యమును నమ్మక పోవుట చేత) వలన కలుగు చున్నది
  • కేవలం పరమాత్మ తప్ప మరే వస్తువు ఆత్మకు పడదు. ఒకరికి ఈనాడు ఇష్టమైన వస్తువు రేపు ఇష్టము లేకపోవచ్చును. నేడు హితమైనది రేపు వర్జనీయమగును. కానీ పరమాత్మ మాత్రమే ఆత్మకు శాశ్వతముగా ఉపాయమగు వస్తువు. అందులో సందేహము అవసరము లేదు.
  • ప్రకృతిలోని ప్రతి మార్పుని (శారీరిక మార్పులు సైతం) పరమాత్మకు అనుసంధానము చేసి చూస్తే మనస్సులో మార్పు జరగదు. ఒక నిశ్చలమైన భావన ఏర్పడుతుంది. తద్వారా అశాశ్వతమైన వాటిపై మమకారము తగ్గి శాశ్వతమైన మోక్షము కొరకు మనసు తపిస్తుంది.

చిత్ ప్రకరణము ఇంతటితో ముగిసినది. ఈ అద్వితీయమగు మోక్ష శాస్త్రము ఒక ఆచార్యుని సముఖమున నేర్చినచో మరింత గొప్పగా అవగతపడుతుంది.

శ్రీమతే రమ్యజామాతృ మునీన్ద్రాయ మహాత్మనే |
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళమ్ ||
మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: |

సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ ||

ఇక తర్వాతి అధ్యాయములో అచిత్తు యొక్క తత్వమును తెలుసుకుందాము

మూలము: https://granthams.koyil.org/2013/03/06/thathva-thrayam-chith-who-am-i/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment