శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
- ముఖ్యప్రమాణ విరోధి – ప్రాధమిక ఆధారమును అర్ధం చేసుకోవడంలో అవరోధాలు. ప్రమా అంటే ధ్రువీకరించబడిన జ్ఞానం. ప్రమాణం అంటే ఒక ప్రత్యేక విషయం గురించి ధ్రువీకరనించబడిన జ్ఞానాన్ని అందిస్తుంన్నది. సాధారణంగా మూడు రకాల ప్రమాణాలు వైధికులు స్వీకరించారు.
- ప్రత్యక్షం (అవగాహన) – కళ్ళు, ముక్కు, చెవులు మొదలైన మన జ్ఞానేంద్రియాలు పరిశీలించదగినవి. ఇది సాధారణంగా సత్యమును బహిర్గతం చేస్తుందని భావించినప్పటికీ, దీనిలో పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు, ఆ వ్యక్తి దృష్టిలో లోపమున్నట్లయితే , అతనికి కనిపించేది సత్యము మరియు విశ్వసనీయమైనదిగ ఉండకపోవచ్చు. మరో ఉదాహరణ ఏమిటంటే, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, కంగార్లో స్థంభాన్ని మనిషిగా, పామును తాడుగా భావించడం సులభం. ఎండమావి కూడా ఒక కల్పన (నీరు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాస్తవానికి నీళ్లుండవు).
- అనుమానము – ముందు అవగాహన ఆధారంగా ఏర్పడినదానిని అనుమితి అంటారు. ఎక్కడ పొగ ఉంటే, అక్కడ మంట ఉంటుంది – ఇది అనుమానానికి ఒక మంచి ఉదాహరణ. కానీ ఇది కూడా పరిమితులతో నిండి ఉంది. ప్రత్యక్షం మరియు అనుమానము రెండు ప్రాధమిక ఆధారాలుగా పరిగణించబడలేదు.
శబ్దం (ప్రామాణిక గ్రంథాలు) – వేదం ధ్రువీకరించబడిన జ్ఞానం, అత్యంత విశ్వసనీయమైన మరియు నమ్మదగిన సాక్ష్యంగా పరిగణించబడుతుంది. ఆస్థికులు (వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వారు) వేదం అపౌరుషేయంగా (ఏ స్త్రీ లేదా పురుషునిచే సృష్టించనది కాదు), నిత్యం, నిర్దోషం అని అంగీకరించారు.
ఇప్పుడు ముఖ్య ప్రమాణాలను అర్థం చేసుకోవడంలో ఉన్న అవరోధాలను చూద్దాము.
- వేదాంతం మచ్చ లేని జ్ఞానాన్ని ఇస్తుంది. వేదాంతం అనగా వేదం యొక్క చివరి భాగమని అర్థం – ప్రధానంగా ఉపనిషత్తులు. వేదాంతాన్ని అత్యున్నత అధికారిగా పరిగణించకపోవడం ఒక అడ్డంకి.
- వేదాంతాన్ని ప్రత్యక్షానికి మరియు అనుమానానికి సమానంగా పరిగణనలోకి తీసుకొనుట ఒక అడ్డంకి. ఖచ్చితంగా వేదాంతం ఇతర ప్రమాణాల కన్నా గొప్పది. అనువాదకుని గమనిక: మహాభారతం నుండి ప్రముఖ ప్రమాణాన్ని గుర్తు చేసుకుందాము “సత్యం సత్యం పునః సత్యం వేదాత్ శాస్త్రం పరం నాస్థి న దైవం కేశవాత్పరమ్”.
- భగవత్గీత చివరలో శ్రీకృష్ణుడు “మా సుచః” (చింతించ కండి) అని ఆదేశించారు. భగవత్గీత లోని చరమ శ్లోకం అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం. భగవానుడు గీతాచార్యునిగా దివ్య రథంపై ఆసీనులై గీతోపదేశం చేస్తూ అన్నారు “అన్ని ఉపాయాలను విడిచిపెట్టి, నాకు సంపూర్ణ శరణాగతి చేయి. నేను అన్ని పాపాల నుండి ఉపశమనాన్ని ప్రసాదిస్తాను. నేను హామీ ఇస్తున్నాను, విచారించకు, సందేహించకు, శోకించకు”. దీనినే “మా సుచః” అని అంటారు. ఆండాళ్ నాచియార్ దీనిని కీర్తిస్తూ నాచియార్ తిరుమోళి 11.10 వ పాసురంలో “మేయ్మై పెరు వార్తై” అని కీర్తించారు. ఈ పదాలపై మనం పూర్తి నమ్మకం ఉంచాలి. అలాంటి విశ్వాసం ఉండకపోవడం అనేది ఒక అడ్డంకి.
- భగవంతుడుని నిరహేతుకమైన కృపతో ఆళ్వారులు నిష్కలంకమైన జ్ఞానాన్ని అనుగ్రహంగా పొందారు. వారు స్వచ్ఛమైన జ్ఞాన ఫలితం కాబట్టి, వారు సంపూర్ణమైన సత్యం. వారిని వేదానికి సమానంగా, ప్రాధమిక సాధనా జ్ఞానంగా భావించవచ్చు. అలా పరిగణించక పోవుట (అనగా, ఆళ్వారుల పాసురాలను తక్కువగా పరిగణించుట) ఒక అడ్డంకి.
- గురుపరంపర క్రమంలో నమ్మాల్వార్ నుండి మణవాళ మామునుల వరకు – పుర్వాచార్యులని పిలుస్తారు. మన సాంప్రదాయంలో జ్ఞానప్రసరణ గురువుల నుండి శిష్యులకు చేయబడింది. నమ్మాల్వార్ యొక్క ఆశీస్సులు ఆచార్యులు మరియు వారి శిష్యులందరికి ఉన్నాయి. వారి సూచనలు, ఆదేశాలు ప్రాధమిక జ్ఞానసాధనంగా పరిగణించబడుతున్నాయి. ఈ ఆదేశాలపై బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఆలవందారులు స్తోత్రరత్నం 20 “త్వదీయ గంబీర మనోనుసారిణః” – వేదం భగవానుడి భక్తుల యొక్క దివ్య హృదయాన్ని అనుసరిస్తుంది. సామాన్యంగా తెలిసిన ప్రమాణం “ధమగ్య సమయం ప్రమాణం వేదాస్చ” కూడా అదే నొక్కి చెబుతుంది – ధర్మం తెలిసిన వ్యక్తుల యొక్క క్రియలే ప్రధాన ప్రమాణం మరియు వేదం కూడా ప్రమాణం – పై వాక్యాలు ధర్మంలో నిత్యం స్థిరపడి ఉన్న ఆళ్వారులకు మరియు పుర్వాచార్యులకు మరింత ప్రాధాన్యతను ఇస్తుంది.
- యావధాత్మాభావి విరోధి – ఆత్మకు అవరోధాలు (ఉన్నంత కాలం – ఎప్పటికీ). యావధాత్మాభావి అంటే ఆత్మ ఉన్నంత కాలం అని అర్థం. ఆత్మా అనేది నిత్య (శాశ్వతమైనది) – ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేది. కానీ విరోధి కాదు – నిజమైన జ్ఞానం ఆత్మలో పూర్తిగా విస్తరించినప్పుడు విరోధం తీసివేయబడుతుంది. కాబట్టి, ఇది చాలాకాలం ఉనికిలో ఉన్న వాటిగా పరిగణించబడుతుంది.
భగవాన్ మరియు భాగవతుల యొక్క శాశ్వత సేవకుడుగా ఉండటమే జీవాత్మ యొక్క నిజమైన స్వభావం.
- ఆలవందారులు ఉదాహరించి నట్లుగా “దేహేంద్రియ మనః ప్రాణ దీప్యో అన్యః”. ఆత్మ – శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనవాటికి భిన్నమైనది అని సూచిస్తుంది. సామాన్యంగా మానవులు ఆత్మ, శరీరం ఒకటేనని భావించి ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంటారు. కానీ అది నిజం కాదు – అది ఒక భ్రమ మాత్రమే. శరీరం పుట్టి, పెరిగి, క్షీణించి (వ్రుధాప్యంతో), వ్యాధి తో భాదపడి మరణిస్తాడు. కానీ అత్మ నిర్వికార (మార్పులేనిది). ఆత్మ, శరీరం ఒకటేనని బ్రమించడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: తత్వ త్రయంలో పిళ్ళై లోకాచార్యులు ఆత్మను శరీరానికి, ఇంద్రియం, మనస్సు, బుద్ధి, ప్రాణ (ప్రాణ వాయువు) మొదలైన వాటికి విభిన్నమని వివరించారు,
- ఆత్మ స్వతంత్రమని పరిగణించడం తప్పు. ఆత్మ సర్వేశ్వరుని ఆధీనము, ఎల్లప్పుడూ వారు నియంత్రిస్తుంటారు. భగవదాధీనుడై ఉండుట జీవాత్మ యొక్క నిజమైన వ్యక్తిత్వము. ఆత్మ తన సొంతమని పరిగణించుట భగవాన్ ఆస్తి దొంగిలించినట్లవును. ఇది ఒక పెద్ద అడ్డంకి.
- ఈశ్వరుడు అన్ని విధాలుగా సంపూర్ణుడు. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అవాప్త సమస్త కాముడు (అన్ని కోరికలు నెరవేరిన వాడు) మరియు అపహత పాప్మా (ఏ లోపాలతోనూ ప్రభావితం కానివాడు). అటువంటి ఈశ్వరుడుని అపూర్ణుడు గా (అసంపూర్ణుడు) పరిగణించటం ఒక అడ్డంకి.
- బ్రహ్మా, రుద్రుల వంటి వారిని నియంత్రకులుగా భావించుట – బ్రహ్మా,రుద్రుడు మొదలైన దేవతాంతరులతో సహా అందరిని నియంత్రించువాడు శ్రీమన్నారాయణుడు. ఈ కారణంగా ఆది శంకర భగవత్ పాదులు వారి సహస్రనామ భాష్యంలో “ఈశానశీలః నారాయణ ఏవ” (నారాయణుడు మాత్రమే నియంత్రించువాడు) అని కీర్తించారు. ఉపనిషత్తులు కూడా “నారాయణ: పరభ్రమ” అని ఘోషిస్తున్నాయి. అందుచేత నారాయణుడు కాకుండా ఇంకే ఇతరులను ఈశ్వరునిగా పరిగణనలోకి తీసుకొనుట ఒక అడ్డంకి.
- చక్రవర్తి (రక్షకుడు) గా ఎమ్బెరుమాన్ కాకుండా మరొకరిని రక్షకునిగా పరిగణలోకి తీసుకొనుట ఒక అడ్డంకి – ఎమ్బెరుమానుడే ప్రతి ఒక్కరికి రక్షకుడు. ఇది ప్రణవం యొక్క భావం, వేదం యొక్క సారాంశం. బ్రహ్మా, రుద్రులు తదితరులు జీవాత్మలు, కావున వారు నారాయణుడి వలె నియంత్రికులు కాదు. వారిని ఆ విధంగా పరిగణనలోకి తీసుకోవడం ఒక అడ్డంకి అవుతుంది. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యులు “ప్రపన్న పరిత్రాణం” అనే ఒక గ్రంథంలో శ్రీమన్నారాయణుడు మాత్రమే నిజమైన రక్షకుడు అని స్పష్టంగా తెలిపారు. వారు తన ముమ్ముక్షుప్పడి సుత్రంలో 39లో “‘ఈశ్వరనై ఒళింతవర్గళ్ రగళ రక్షకరల్లర్, ఎన్నుమిదం ప్రపన్న పరిత్రాణత్తిలే చోన్నోం” అని ఉల్లేఖించారు.
- భాగవత అపచారం, ఆచార్య అపచారం మరియు ఆచార్య భక్తులకు అపచారాలు (ఆచార్యునికి శరణాగతి చేసినవారు) పెద్ద అడ్డంకులు. భాగవత అపచారం చేసిన వారిని భగవాన్ క్షమించడు. ఎమ్పెరుమాన్ భూమి పిరాట్టితో ” క్షిపామి, నక్షమామి వసుంధరే” అని అన్నారు – “భూదేవి! వారిని నేను క్రిందకి తోసేస్తాను, ఎన్నటికీ క్షమించను” అని అన్నారు. పురుణాలలో పలు సంఘటనల నుండి ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. ఎమ్పెరుమాన్ భగవత్ అపచారం (భగవానుని పట్ల అపరాధం) చేసిన వారిని క్షమిస్తారు. కానీ భాగవత అపచారం, ఆచార్య అపచారం చేసినవారిని క్షమించడు. తిరువరంగత్తముదనార్ ఏమ్బెరుమానార్ని ప్రార్థిస్తూ రామానుజ నూఱ్ఱ౦దాది 107 “ఇరామానుజ! ఉన్ తొండర్ కట్కే అన్బుఱ్ఱ ఇరుక్కుం పడి ఎన్నైయాక్కి అంగాట్పడుత్తే” శ్రీ రామానుజ! నేను ఎల్లప్పుడూ మీ సేవకులను ఆదరించేటట్లుగా సంస్కరించమని కోరుతున్నాను. అదే మనందరం కోరుకోవలసినది.
- నిత్య విరోధి – నిరంతర అవరోధాలు (మనతో ఎల్లప్పుడూ ఉండే ఇంద్రియాలకు సంబంధించినది) ఆత్మతో ఇంద్రియాలు ఎల్లప్పుడూ ఉంటాయి. 10 ఇంద్రియాలు ఉన్నాయి:
- పంచ జ్ఞానేంద్రియాలు – జ్ఞానం యొక్క 5 ఇంద్రియాలు – స్రోత్ర (చెవులు), త్వక్ (చర్మం), చక్షుర్ (కళ్ళు), జిహ్వా (నాలుక), గ్రాహ్ణ (ముక్కు)
- పంచ కర్మేంద్రియాలు – క్రియల యొక్క 5 ఇంద్రియాలు – వాక్ (నోరు), పాణి (చేతులు), పాద (కాళ్ళు), పాయు (విసర్జక అవయవాలు), ఉపస్థ (పునరుత్పత్తి అవయవాలు)
భగవానుడు జీవాత్మకు ఇంద్రియాలను ప్రసాదించాడు, తద్వారా వాటి సహాయంతో వారిని సేవించవచ్చు. ఇంద్రియాలు చాలా బలమైనవి మరియు శక్తివంతమైనవి. తిరువాయ్మొళి 7.1.6 లో నమ్మాల్వారు వివరిస్తూ, “విణ్ణుళార్ పెరుమాఱ్కు ఆడిమై చెయివారైయుం చెఱుం ఐంపులనివై” – ఈ ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవి అంటే నిత్యసూరుల (భగవానుని నిత్య సహచరులు) నిష్ఠను కూడా కదిలించగలవు. ఈ అంశంలో అడ్డంకులను చూద్దాము.
- తిరువాయ్మొళి 3.2.1 లో నమ్మాల్వారు వివరిస్తూ “అన్నాళ్ తంత ఆక్కైయిన్ వాళి ఉళల్వేన్” నీవిచ్చిన ఈ శరీరం, ఇంద్రియాలు నన్ను వేధిస్తున్నాయి. కాబట్టి, మనం అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే ఇంద్రియాలు, వాటి సుఖానుభవములు ప్రధాన అడ్డంకులు అని అర్థం.
- ఇంద్రియాలకు దాసులై మరియు వాటికి సంబంధించిన కోరికలను నెరవేర్చుకొనుట ఒక అడ్డంకి.
- కొంతమంది “నాకు అన్నీ తెలుసు, నా ఇంద్రియాలు నా నియంత్రణలో ఉన్నాయి” అని చాటుకుంటారు. ఇది ఒక పెద్ద అడ్డంకి. విశ్వామిత్రుల వంటి గొప్ప ఋషులు కూడా ఇంద్రియ లోలుడై వారి మహిమను కోల్పోయారు. అనువాదకుని గమనిక: ఆళ్వారులు మరియు ఆచార్యులు వారి పాసురాలలో క్రూరమైన ఇంద్రియ సుఖాల పట్ల వారి భయాన్ని వ్యక్తం చేశారు. అటువంటిది ఇంద్రియాల ఆనందం యొక్క శక్తి. కాబట్టి ఇలాంటి ఉహించని ఆపదల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- మన భావాలను పూర్తిగా భగవత్ సౌందర్యం (భగవనుని అందం) పైన పెట్టి భాగవత కైంకర్యాన్ని విస్మరించుట ఒక అవరోధం. ఇంద్రియాల సుఖం ఒక రకమైన ఆపద అయితే, పూర్తిగా భగవత్ సౌందర్యంలో మునిగి తేలుట ఇంకొక రకాలైన ఆపద అని నమ్మాళ్వారు గుర్తించినట్లుగా పెరియ తిరువంతాధి 34 లో “కాలాళు౦, నెంజళియుం, కణ్సుళలుం” ఎమ్బెరుమానుని సౌందర్యాన్ని చూసి, తక్షణం తడబడి పోయి నిలబడలేక, గుండె కరిగి తీవ్రమైన అనుభవం కారణంగా మూర్ఛ ప్రారంభమవుతుంది. అట్లాంటి స్థితిలో భగవత్ కైంకర్యం మరియు భాగవతా కైంకర్యం విస్మరించే అవకాశం ఉంది. శ్రీ రామాయణం అయోధ్య కాండం 1.1లో చెప్పినట్లుగా “సత్రుగ్నో నిత్య సత్రుగ్నః” – శత్రుగ్నుడు శాశ్వత శత్రువును జయించాడు. పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ వాఖ్యాన్ని వివరిస్తూ ” శత్రుగ్నుడు శ్రీ రాముడు యొక్క సౌందర్యాన్ని జయించి (మరియు నిర్లక్ష్యం) నిరంతరం భరతుని సేవచేశాడు” అందుచేత భాగవతా కైంకర్యమార్గంలో వచ్చిన ఏదైనా అడ్డంకిగా పరిగణించబడుతుంది.
- అనిత్య విరోధి – తాత్కాలిక అడ్డంకులు (శారీరక సుఖాలు మరియు అసుఖాలకు సంబంధించినది). అనిత్యం అంటే తాత్కాలికమైనది అని అర్థం – శరీర సుఖ దుఃఖాలు. ఇది ఈ శరీరాన్ని తానుగా భావించి సుఖాలు / దుఃఖాలను అనుభవించే వాటి చుట్టూ తిరుగుతుంది. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.
- గంధం (సువాసనలు), పుష్పాలు మొదలైన వాటి నుండి ఆనందాన్ని పొంది, అదే నిజమైన సుఖంగా భావించుట ఒక అడ్డంకి.
- ఆయుధాల దాడి లేదా విషం దాడి మొదలైన వాటి ద్వారా కలిగే బాధను, నిజమైన దుఃఖంగా భావించుట ఒక అడ్డంకి.
- లౌకిక లాభాలను పొందినపుడు సంతోషించి, అలాంటి లాభాలను పొందనపుడు దుఃఖించుట కూడా ఒక అడ్డంకి.
అందువల్ల శారీరక సుఖ దుఃఖముతో కలవరపడకుండా ఎప్పుడూ సమతుల్యంగా ఉండాలి. అనువాదకుని గమనిక: భగవత్ గీత యొక్క రెండవ అధ్యాయం లో, శ్రీకృష్ణుడు ఆత్మ మరియు శరీరానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి వివరించారు. మనం ఎప్పుడూ ఆ అవగాహన కలిగి ఉండి శరీర సౌకర్యాలు / అసౌకర్యాలను ఒక సమిష్టి పద్ధతిలో ప్రవర్తించాలి.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
హిందీలో : https://granthams.koyil.org/2013/12/virodhi-pariharangal-4/
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org