విరోధి పరిహారాలు – 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 4

24. స్వరూప విరోధి – జీవాత్మ  యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహించడంలో అవరోధాలు.

భాగవత శేషత్వం – జీవాత్మ యొక్క అంతర్లీన స్వభావం

స్వరూపము అనగా జీవాత్మ యొక్క నిజమైన స్వభావం. జీవాత్మ జ్ఞానంతో కూడిన వాడు, జ్ఞానం , శేషత్వం మరియు పారతంత్రియం (పూర్తి నియంత్రణ) కల వాడు.  జ్ఞానం ఉన్న వ్యక్తి  ప్రతి దానిని యథా తథంగా గ్రహించి అర్థం చేసుకోవాలి. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  • ఏ వస్తువు అయినా, జ్ఞానం (నిజమైన జ్ఞానం), జ్ఞాన అనుదయం (అజ్ఞాన స్థితి), అన్యథా జ్ఞానం (వస్తువు యొక్క గుణాన్నితప్పుగా అర్థం చేసుకోవడం – శంఖం పసుపు రంగులో ఉందని అర్థం చేసుకొనుట) మరియు విపరీత జ్ఞానం (వస్తువునే అపార్ధం చేసుకొనుట –  ఒక స్థంభాన్ని మనిషిగా అనుకోవడం). ఇందులో జ్ఞాన అనుదయం,  అన్యథా  జ్ఞానం మరియు విపరీత జ్ఞానం అడ్డంకులు. అనువాదకుని గమనిక: సాధారణ ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకుంటాము.
    • జ్ఞాన అనుదయం – ఆత్మా జ్ఞాన (పరిజ్ఞానం) తత్వమని, శరీరానికి భిన్నమైనదని తెలియకపోవుట పూర్తి అజ్ఞాన స్థితి.
    • అన్యథా జ్ఞానం – ఆత్మ శ్రీమన్నారాయణుడికి కాకుండా ఇతర దేవతల అధీనం అనుకొనుట ఆత్మ యొక్క శేశాత్వాన్ని అపార్ధం చేసుకున్నట్లవును.
    • విపరీత జ్ఞానం – జీవాత్మ స్వతంతృడు అన్న భావన  జీవాత్మ స్వభావాన్ని అపార్ధం చేసుకున్నట్లవుతుంది. 
  •  ఎమ్బెరుమాన్ జీవాత్మను ఆస్వాదిస్తుండగా, వారు జీవాత్మ యొక్క శేశాత్వాన్ని జయించి, అంటే, వారు జీవాత్మను ఉన్నత స్థానంలో ఉంచి, వారు తక్కువ స్థానములో ఉండి, జీవాత్మను సేవించే ప్రయత్నంచేసినపుడు, జీవాత్మ తాను నిత్యం భగవానుని శేషుడని వారి ఆధీనుడని వ్యతిరేకించకూడదు. ఇటువంటి వ్యతిరేకత ఒక అడ్డంకి మరియు ఇది భగవానుని  ఆనందానికి ఒక ఆటంకం అవుతుంది. శేశత్వం అనగా భగవానుని ఆధీనుడై ఉండుట లేదా భగవానుని సేవకై నిత్యం సిద్ధంగా ఉండుట.  ఉదాహరణకు,  భార్య తన భర్తకు అనేక విధాలుగా సేవ చేయడం (మన సాంప్రదాయ జీవనశైలిలో) మనం సహజంగా చూస్తుంటాము. కానీ ఒక వేళ భర్త తన  భార్య పట్ల ప్రేమానురాగంతో సేవ చేస్తే, భార్య దాన్ని వ్యతిరేకించ కూడదు, “కాదు! మీరు నాకు సేవ చేయకూడదు, నేను మీ సేవ చేయాలి” – తన భార్యను సేవించడం ద్వారా ఆ భర్త పొందుతున్న ఆనందానికి ఇది అవరోధం అవుతుంది. పరమాత్మ మరియు జీవాత్మ మధ్య బర్త్రు (భర్త) – భార్య (అర్ధాంగి) సంబంధం ఉంది. ఈ కోణంలో చూస్తే , జీవాత్మ (భార్య) భగవానునికి సేవ చేయాలి. అయితే జీవాత్మకు సేవ అందించడం ద్వారా భగవానుడు ఆనందం పొందాలని ఇష్టపడితే, భగవానుని సంతోషాన్ని గ్రహించి వారికి సహకరించాలి. ఇదే సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడి సూత్రంలో 92 ఇక్కడి వ్యాఖ్యానంలో వివరించారు.
  • శేష (దాసుడు) అనగా శేషి (యజమాని) యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించువాడు అని అర్థం. పారతంత్రియం అనగా యజమాని యొక్క పూర్తి అధీనుడై ఉండుట, ఒక అచిత్ మాదిరిగా. (అనువాదకుని గమనిక: యజమాని తన గడియారాన్ని చేతికి పెట్టుకున్నా లేదా బల్లపై పెట్టినా ఆ యజమానిని ఎవరూ ప్రశ్నించరు. జీవాత్మ కూడా ఎమ్బెరుమాన్ పట్ల అలా ఉండాలి). అయితే మునుపటి వివరణలో ఉదహరించినట్లుగా, ఎమ్బెరుమాన్ జీవాత్మ ను ఆస్వాదించాలని కోరుకున్నప్పుడు, జీవాత్మ ఎలాంటి స్పందన లేకుండా ఒక రాయిలా ఉండకూడదు. భగవాన్ యొక్క ఆనందాన్ని పెంచడానికి జీవాత్మ ప్రతిస్పందించాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. (అనువాదకుని గమనిక: కుచేలుడు శ్రీకృష్ణుని చూడటానికి వెళ్ళినపుడు, శ్రీకృష్ణుడు కుచేలుని పాదాలను మర్దన చేసి వారికి సేవ చేస్తారు, కృష్ణుని ఆనందానికి అడ్డురాకుండా కుచేలుడు అంగీకరిస్తాడు. అదే విధంగా,   నమ్మాల్వారునికి ఎమ్బెరుమాన్ సేవ చేయాలనుకుంటారు, ఆళ్వారుని కుడి పాదానికి గొప్ప ఆనందంతో మర్దన చేయుడం ప్రారంభిస్తారు. ఆళ్వారు మొదట్లో కలవరపడతారు, కానీ తరువాత వారి ఆనందాన్ని తెలుసుకుంటారు. అవును! కొంతసేపు తర్వాత, ఆళ్వారు తన కుడి పాదాన్ని తీసి తన ఎడమ పాదాన్ని ఎమ్బెరుమాన్ ముందుంచుతారు.  ఎమ్బెరుమాన్ సంతోషం  రెట్టింపు అవుతుంది. అందువల్ల, పారతంత్రియం కారణంగా ఎమ్బెరుమాన్ యొక్క సేవాభావపు క్రియలకు  ప్రతిస్పందించకపోవుట ఒక అడ్డంకి.
  • భాగవత శేషత్వాన్ని తక్కువ ప్రాధాన్యత ఇచ్చుట (పైగా భగవత శేషత్వానికి  ప్రాథమికత ఇచ్చుట) ఒక అడ్డంకి. మనము సహజంగా భగవానుని అధీనులై ఉంటాము. ఈ భగవత శేశాత్వ  భావన భాగవత శేశత్వంగా  పురోగమించాలి. భాగవానుడు తన కంటే ఎక్కువ తన భక్తుల సేవ చేస్తే సంతోషిస్తారు.  అందువల్ల, భాగవత శేషత్వాన్ని ఏ కారణంగా కూడా తక్కువ ప్రాముఖ్యత  ఇచ్చుట ఒక అడ్డంకి.
  • అదే విషయం ఆచార్యుల పట్ల కూడా వర్తిస్తుంది. అనువాదకుని గమనిక: ప్రతి వారూ వారి అచార్యాధీనులై అన్ని పరిస్థితుల్లోనూ వారిని సేవించాలి. పిళ్ళై లోకాచార్యులు విశేషంగా శ్రీవచన భూషణంలో  ఆచార్యులకు శరణాగతిని, ప్రాముఖ్యతను  విస్తారంగా  కీర్తించారు. మణవాళ మామునులు ఈ సూత్రం యొక్క సారాంశతత్వాన్ని ఉపదేశ రత్నమాలలో ఉన్నతంగా కీర్తించారు.
25.  పరస్వరూప విరోధి  – పరమాత్మ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో అవరోధాలు
గరుడను అధీష్టించిన వాడు సర్వశ్రేష్టమైన దేవుడు (వేదాత్మాగా పేర్కొనబడిన)

పరస్వరూపం అనగా పరమాత్మ యొక్క నిజమైన స్వభావం. భగవానుడు సర్వశ్రేష్టులు , సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అన్ని లోకాలకు అధిపతి, ఏ మచ్చ లేనివాడు మరియు అన్ని కళ్యాణ గుణాలతో నిండి ఉన్నవాడు. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  •  విషయ వాంఛలకు, లౌకిక సుఖాలకు లోనవుట ఒక అడ్డంకి. ఈ ప్రకృతి ఒక తెరలాగా భగవానుడి నిజస్వరూపాన్ని దాచివేస్తుంది. ప్రకృతి మూడు గుణాలు – సత్వం (మంచితనం), రజస్సు (రాగ ద్వేషాలు) మరియు తమస్సు (అజ్ఞానం) తో కూడి ఉంటుంది. శారీరక సుఖాలకు అధీనుడై ఉండుట మనల్ని భగవానుని నుండి దూరంగా ఉంచుతుంది. ఒక వ్యక్తిలో సత్వ గుణం పెరిగితే భగవానుని యొక్క నిజమైన స్వభావాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ శరీరం ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. కానీ రజో / తమో గుణాలు పెరిగితే, అదే శరీరం భగవానుని అర్థం చేసుకోకుండా మనలను దూరం చేస్తుంది. అందువలన, విషయ వాంఛలకు లోనవుట ఒక అడ్డంకి.
  • లౌకిక ధోరణి ఉన్న వ్యక్తులను సర్వోపరి అని భావించుట ఒక అడ్డంకి. బ్రహ్మ, రుద్రుడు మొదలైన వంటి దేవతాంతరులు కూడా ప్రమాదకరమైన జన్మ మరణ చక్రంలో చిక్కుకున్నవారే. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై 10లో ” నాట్టినాన్ దెయ్వంగళాగ అత్  దెయ్వనాయగన్ తానే”, అని అన్నారు,  దేవతాంతరులందరికి నిర్దిష్ట కార్యములు ఇవ్వబడినవి, వారిని సర్వోపరిగా పరిగణించరాదు.
  • “ఈ దేవతాంతరులు ఏమ్బెరుమానుచే  నియంత్రించబడతారు” అని పరిగణనలోకి తీసుకోకపోవడం. ప్రతి ఒక్కరూ చివరికి భగవాన్ అధీనులు. కాబట్టి, అటువంటి ఆలోచన లేకపోవడం ఒక అడ్డంకి.
  • భగవానుని సౌలభ్యాన్ని (సరళత) చూసి వారి ఆధిపత్యాన్ని శంకించుట  ఒక అడ్డంకి. వాత్సల్యం (మమత), సౌలభ్యం (సరళత్వం / సులభంగా లభ్యత), సౌశీల్యం (ఔదార్యం) మొదలైనవి భగవానుని ప్రతిష్టాత్మకమైన కళ్యాణ గుణాలు. కానీ ఒకవేళ “భగవానుని సులభంగా అందుబాటులో ఉండటం వలన, అతను కూడా సామాన్య మానవుడై ఉండాలి”, అన్న అంచనా ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: గీతాచార్యులు గీతలో (9.11) “అవజానంతి మాం మూఢ” అని అన్నారు. “మూర్ఖులైన మనుష్యులు నన్ను (నా అవతారాల సమయంలో) సామాన్య మానవుడిగా పరిగణలోకి తీసుకుంటారు మరియు వారు నా ఆధిపత్యాన్ని అర్థం చేసుకోలేరు.
  • భగవత్ విషయంలో అజ్ఞానం మరియు అన్యథా జ్ఞానం కూడా అడ్డంకిగా ఉంటాయి. అనువాదకుని గమనిక: భగవానుని యొక్క పరత్వం (సార్వభౌమత్వo) మరియు సౌలభ్యం (సరళత) సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాంటి సరైన అవగాహన ఉండకపోయినా భగవత్ అపచారాలకు దారి తీస్తుంది.

26. స్వానుభవ విరోధి  – స్వీయ అనుభవంలో వచ్చే అడ్డంకులు

స్వానుభవం అంటే శుద్ధ స్థితిలో వారి సొంత ఆత్మను  అనుభవించుట/ఆనందించుట  అని అర్థం.   భగవానుని అనుభవించే కంటే ఇది తక్కువై ఉన్నప్పటికీ ఆత్మానుభవం ఆనందదాయకంగా పరిగణిస్తారు. ఆత్మ భౌతిక శరీరంలో చిక్కుకొని ఉండుటయే ఒక పెద్ద అడ్డంకి. ఈ క్రింద కొన్ని అడ్డంకులు వివరించబడినవి:

  • దేహ వాసనా (శారీరక ) నుండి సుఖానుభవాలు / జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొనుట ఒక అడ్డంకి. ఇంద్రియాల ద్వారా గతంలో అనుభవించిన సుఖానుభవాలు, అసలు అనుభవం తరువాత కూడా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఈ వాసనా (జ్ఞాపకాలు) చాలా ప్రమాదకరమైనవి, రచికి (రుచి) దారి తీస్తాయి. అనువాదకుని గమనిక: వాసనా – అచేతన మనస్సు ప్రభావాలు, రుచి – ఉద్దేశపూర్వకమైన కోరికలు.
  • భార్య, పిల్లలు, సంపద మొదలైనవి శరీరంకి సంభందమైన సుఖాలు జ్ఞప్తికి తెచ్చుకొనుట, అడ్డంకులవుతాయి,  అత్మానుభవమును పరిమితం చేస్తాయి.
  •  వాసనా (ప్రభావాలు) నుండి ఉద్భవించిన రుచి (రుచులు) కూడా ఒక అడ్డంకి. సాధారణంగా, పాల రుచిచూసిన పిల్లి మళ్ళీ పాలను దొంగిలించడానికి వస్తుందని అంటారు. అనువాదకుని గమనిక: మన శరీరం ఒక సారి సుఖాలను అనుభవిస్తే,   మన ఇంద్రియాలను నియంత్రించడం కష్టమైపోతుంది. అందువల్ల, గొప్ప ఋషులు మనలను  విషయ వాంఛల వైపు కాకుండా పరిత్యాగం వైపు మార్గనిర్దేశం చేసారు. కోరికలు ఎన్ని తీర్చినా అవి పెరిగుతూనే ఉంటాయి పుడుతూనే ఉంటాయి.
27. పరానుభవ విరోధి – పరమాత్మను అనుభవించడంలో వచ్చే అడ్డంకులు
ఎంతో మనోహరమైన తిరుక్కురుంగుడి నంబి అర్చావతారం

పారానుభవం అనగా మనస్పూర్తిగా అర్ధంచేసుకొని సర్వోపరి భగవానుని యొక్క స్వరూప (స్వభావం), రూప (రూపాలు), గుణ (కళ్యాణ గుణాలు), విభూతి (సంపద) అనుభూతిని ఆనందించుట అని అర్థం. భగవానుడు ఐదు ప్రాకారములు (రూపాలు) –   పర (పరమపదం లో), వ్యూహ (వాసదేవ, సంకర్షణ, ప్రధ్యుమ్న మరియు అనిరుద్ధ, క్షీరాబ్ధి నాథుడు), విభవం (శ్రీరాముడు, కృష్ణుడు మొదలైన వంటి అనేక అవతారాలు), అంతర్యామి (అంతటా  వ్యాపించి ఉన్న పరమాత్మ), అర్చా (విగ్రహ రూపాలు). వీటిలో, ప్రస్తుత పరిస్థితిలో, అర్చావతారం మాత్రమే మన ఇంద్రియాల ద్వారా అనుభవించి/ఆనందించ గలిగినది అని తిరుమంగై ఆళ్వారు తిరునెడుంతాండగం 10 లో  “పిన్నానార్ వణంగుం చోతి” – భవిష్యత్తు తరాలవారు (శ్రీకృష్ణునితో ముగించిన విభావావతారములు తరువాత ఆరాధించేటట్లుగా) అని వివరించారు.  ఇప్పుడు, ఇతర్లను మానస సాక్షాత్కారంతో (మనస్సు ద్వారా)  మాత్రమే అర్థం చేసుకోవచ్చు. అనుభవము (అనుభూతి / సంతోషం) భగవన్ పట్ల  అనురాగం / ప్రేమకు దారితీస్తుంది. ఆ ప్రేమ వారి కైన్కర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఇవన్నీ అనుభవంలోని భాగాలు – అటువంటి అనుభవానికి అంతరాయం కలిగించేది ఏదైనా ఆటంకమే. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  • స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు అడ్డంకులు. నమ్మాల్వారు తిరువాయ్మొళి 3.2.1లో “అన్నాళ్ నళ్ తంత ఆకైయిన్ వళి ఉళల్వేన్”  నేను నీవిచ్చిన ఈ శరీరం (ఉద్ధరణ మార్గాన్ని సులభతరం చేయడానికి), ఇంద్రియాలతో బాధపడుతున్నాను. శరీరాన్ని మరియు ఇంద్రియాలను ఉద్ధరణకు ఉపయోగించుటకు బదులుగా, సొంత స్వార్థ కార్యకలాపాల కోసం ఉపయోగించుటకు భగవత్ అనుభవానికి ఒక అడ్డంకి అవుతుంది.
  • ఎమ్బెరుమాన్ యొక్క పవిత్రమైన కళ్యాణగుణాల గురించి విన్నపుడు ఈర్ష్యపడుట ఒక అవరోధం అవుతుంది.  కాలం గడిచి మనం మరచిపోయిన పాపాల కారణంగా, భగవానుని యొక్క కీర్తి ప్రశంసలు వినడంతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారిలాగా అసూయపడవచ్చు. ఇది ఒక అడ్డంకి.
  • ఇతరుల (సంసారులు, రాక్షస ప్రవ్రుత్తి గలవారు మొదలైనవారు) గురించి విని ఆనందించుట ఒక అడ్డంకి అవును.
  • భగవానుని సార్వభౌమత్వాములో మునిగి నిమగ్నమై, తరువాత వదిలివేయుట ఒక అడ్డంకి. తిరుమంగై ఆళ్వార్ తిరునెడుంతాండగం 21లో “అవరైన్ఱ౦జినోమే” – భగవానుడు మహోన్నతుడని నేను తలచి భయపడ్డాను. ఆళ్వారుల సందర్భంలో, అది ఆళ్వార్ మరియు ఎమ్బెరుమాన్ మధ్య దివ్య పరస్పర సంభాషణ – ప్రశ్నకు అతీతమైనది, కానీ సాధారణంగా భగవానుని సార్వభౌమత్వాములో మునిగి నిమగ్నమై, తరువాత వారికి దూరంగా వెళ్లిపోవట అనేది ఒక అడ్డంకి.

28.  సంస్లేశ విరోధి – జీవాత్మ పరమాత్మను చేరకలో వచ్చే అవరోధాలు

సంస్లేశం అనగా ఎమ్బెరుమానునితో అనుభవం.  ఇది మానస అనుభవం (మనసులో) లేదా ప్రత్యక్ష అనుభవం (ముఖా-ముఖీ) కావచ్చు. ఏదో రకంగా ఎమ్బెరుమాన్తో కలసి ఆనందించుట సంస్లేశం అని పిలుస్తారు. అది 27వ వ్యాఖానంలో పరానుభావానికి  పోలి  ఉంది. ఈ అంశంపై అడ్డంకులను చూద్దాము.

  • భగవానుని సార్వభౌమత్వాములో మునిగి నిమగ్నమై, తరువాత వదిలివేయుట ఒక అడ్డంకి. 27వ సూత్రంలో చర్చించాము.
  • భగవానుని కళ్యాణ గుణాలతో సంతృప్తిపడి, మన ఆత్మ స్వల్పతను పరిగణించి భగవానుని సాంగత్యానికి దూరంగా ఉండుట ఒక అడ్డంకి.  తన ఆత్మను తక్కువగా భావించి,  భగవానునితో సాంగత్యం వారి కల్యాణ గుణాలను తగ్గించగలదు అన్న భావన భగవత్ అనుబంధానికి ఒక అడ్డంకి. ఈ స్థితిని “వళవేళులగు తలైయెడుత్తల్” గా సూచించబడింది – – (తిరువాయ్మొళి 1.5 పద్యగం). నమ్మాల్వారు తిరువాయ్మొళి 1.5.7లో “అడియేన్ చిఱియ జ్ఞానత్తాన్, అఱితళార్కుం అరియానై – కణ్ణనై – అడియేన్ కన్బాన్ అలఱ్ఱువన్, ఇతనిల్ మిక్కోర్ ఆయర్వున్డే” – గొప్ప ఋషులకు కూడా అతి కష్టంగా కనిపించే వాడు, శ్రీకృష్ణునిలా  అవతరించారు – నేను అతనిని చూడడానికి పరితపించి పోతున్నాను – ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? ఎమ్బెరుమాన్ మరియు ఆళ్వార్ మద్య ఇటువంటి పరస్పర సంభాషణలు ప్రేమను ఇచ్చి పుచ్చు కొనుటగా అర్థం చేసుకోవాలి. కానీ మనకు, భగవానునితో సాంగత్యం వారి కల్యాణ గుణాలను తగ్గించగలదని భావించి ఎమ్బెరుమానునికి దూరంగా ఉండకూడదు.
  • మహాలక్ష్మి తాయార్ యొక్క పురుషకారం (సిఫార్సు) లేకుండా భగవానుని సమీపించుట ఒక అడ్డంకి. భగవానుడు సర్వస్వతంత్రుడు  మరియు ఎవరి నియంత్రణలో లేనివాడు. ఒక వేళ వారిని నేరుగా సమీపిస్తే, నమ్మాల్వారు  తిరువాయ్మొళి 1.4.7లో చెప్పినట్లుగా, “ఎన్ పిళైయే నినైంతు అరుళాత తిరుమాళ్” – (కేవలం నా లోపాలను పరిగనించి, శ్రీమన్నారాయణ నన్ను అనుగ్రహించలేదు), భగవానుడు మన కర్మానుసారంగా మళ్ళీ క్రిందకు ఈ సంసారంలోకి తోసివేస్తాడు. కానీ మనము తాయార్ సిఫార్సుతో వెళ్ళితే, మన కోరికలు సులభంగా నెరవేరుతాయి. పురుషకారం అనగా సిఫార్సు అని అర్థం. తను ప్రతి ఒక్కరికీ తల్లిగా, భగవానుడు మన తప్పులు క్షమించేలా చేస్తుంది. (ఒక తండ్రి తన పిల్లవాడి తప్పును వాడి తల్లి సిఫార్సుతో క్షమించే విధంగా). ఈ పురుషకారం పిరాట్టి స్వభావం, అలాంటి పురుషకారాన్ని విస్మరించుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఈ ప్రపంచంలో,  ఆచార్యులు తాయార్ని సూచిస్తారు, వారు భగవానుని సులభంగా చేరుకునేటట్టు చేస్తారు.
  • భగవానుని చేరుకొనుట చాలా కష్టం అని వారి సహవాసానికి దూరంగా ఉండుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: తమ సొంత ప్రయత్నాలు చేసే వారికి భగవానుని చేరుకొనుట మహా కష్టం, ఆచార్యుల ద్వారా తనకు పూర్తి శరణాగతి చేసిన వారికి సులువుగా లభిస్తాడు.

29.   విశ్లేష విరోధి – పరమాత్మ నుండి విడిన జీవాత్మకు అడ్డంకులు

తమ ప్రియమైన వారి నుండి విడిపోవుటను విస్లేశం అంటారు.  వ్యాఖ్యానంలో విస్లేశమే ఒక అడ్డంకిగా వివరించ బడినది.

 పరాంకుస నాయకి (నమ్మాల్వారు) – శ్రీరంగం

  •  తగినంత భక్తి లేక విరహంలో వేదన పడకుండా సాధారణంగా ఉండుట విరోధాలు. “భక్తి పారవస్యం” (భగవానుని భక్తి భావంలో మునిగి ఉండుట) “పరగుణావిష్ట:” గా అర్థంచేసుకోవచ్చు (భగవానుని గుణాలు కలిగి ఉండుట), నమ్మాల్వారు యొక్క పెరియ తిరువంతాది 34లో “కాళాళుం నెంజళియుం” –  కాళ్లు తమ స్వంతంగా నిలబడలేకపోవుట, గుండె కరిగిపోతుంది) మరియు నమ్మాల్వారు యొక్క తిరువాయ్మొళి 7.2.1లో “కంగులుం పాగలుం కణ్తుయిలఱియాళ్ కణ్ణ నీర్  కైగళాలిఱైక్కుం – ఎంగనే ధరిక్కేన్ ఉన్నై విట్టు” – పరాంగుస నాయకి తల్లి తన కుమార్తె గురించి మాట్లాడుతూ “నా కుమార్తె రాత్రింబగళ్ళు నిద్రపోకుండా నిరంతరం విలపిస్తుంది మరియు శ్రీరంగనాథుడు  లేకుండా ఎలా భరిస్తుందని ఆలోచిస్తూన్నాను”). విరహంతో బాధపడే ఇటువంటి ఈ స్థితిని పారవస్యం అని పిలుస్తారు. ఆ స్థితిలో బాధ లేకుండా సాధారణ స్థితిలో ఉండటం అడ్డంకి.
  • భగవద్గీతలో గీతాచార్యులు 10.9లో అన్నారు “మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ” – నా భక్తులు నిరంతరం నన్ను స్మరిస్తూ నన్ను వారి ప్రాణ వాయువులా ఉంచి  నా లీలలను వారి మధ్య చర్చించుకుంటారు.  నిరంతరం నా దివ్య లీలలను చర్చించుకొనుట  ద్వారా, వారు (చెప్పేవారు మరియు వినేవారు) గొప్ప సంతృప్తి మరియు ఆనందాన్ని పొందుతారు. భగవానుని యొక్క లీలలను మరియు కీర్తిప్రతిష్ఠలను పంచుకోవడం మరియు చర్చించి తద్వారా సంతృప్తి మరియు సంతోషాన్ని పొందే ఈ చర్యను సాధారణంగా “బోధయంతః పరస్పరం” అని పిలుస్తారు. అలాంటి చర్చలలో పాల్గొనేవారిని “ఉచాత్తునై” (ఆధారపడదగిన సహచర) అని పిలుస్తారు. వారు హృదయంలో విరహవేదనను తగ్గిస్తారు. విరహవేదన సమయంలో భగవత్ విషయాన్ని చర్చించడానికి అటువంటి ఆధారపడే సహచరులతో సహవాసం చేయకపొతే మరింత దుఃఖానికి దారి తీస్తుంది తద్వారా అడ్డంకి అవుతుంది. నమ్మాల్వారు తిరువాయ్మొళి 5.4.9లో “చెంజుడర్త్  తామరైక్కణ్ చెల్వనుం  వారానాల్ – నెంజిడర్ తీర్పార్ ఇనియార్? నింన్ఱు అరుగుగిన్న్ఱెనే ” – ఎర్రటి కమల నయనాల శ్రీమాన్ రాకకోసం నేను విరహవేదనలో మునిగిపోతున్నాను. ఇప్పుడు నా హృదయం నుండి ఆ బాధలను ఎవరు తొలగిస్తారు?

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : https://granthams.koyil.org/2013/12/virodhi-pariharangal-5/

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment