తత్త్వత్రయం – అచిత్తు: పదార్థము అనగా నేమి?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< చిత్తు: నేను ఎవరు?

  • గత అధ్యాయములో  (https://granthams.koyil.org/2018/04/24/thathva-thrayam-chith-who-am-i-telugu/), చిత్తు (జీవాత్మ) యొక్క తత్వము తాలూకు వివరములను తెలుసుకున్నాము.
  • శ్రీ పిళ్ళై లోకాచార్యుల “తత్వత్రయం” అను ఈ గ్రంథమును శ్రీమణవాళ మహాముణుల దివ్య వ్యాఖ్యాన సహితముగా చిదచిదీశ్వర తత్వముల యొక్క వైభవమును తెలుసు కొనుటకు సాగిస్తున్న మన ప్రయాణములో ఈ అధ్యాయములో అచిత్తు, అనగా స్థూల పదార్థమును గూర్చి వివరాలను తెలుసుకొందాము.

జ్ఞానుల ఉపదేశముల ద్వారా అచిత్ (పదార్థము) యొక్క తత్వమును అర్థం చేసుకొనుట :

పరిచయము:

  • అచిత్తు (జడమైనది, అచేతనమైనది) జ్ఞాన విహీనమై మార్పు, రూపాంతరములకు లోబడి ఉండును.
  • జ్ఞాన విహీనమైన అచిత్తు కేవలం పారతంత్రుల భోగ విశేషముగా మాత్రమే ఉండును.
  • మార్పుకు అతీతమైన చిత్తత్వము వలె కాక అచిత్తు మార్పు ప్రధానమై ఉండగలదు.
  • అచిత్తును మూడు విధములుగా విభజించవచ్చు, అవి:
    • శుద్ధ సత్వము – రజస్తమో గుణ రహితమై నటువంటి శుద్ధాత్మకమైన పదార్థము.
    • మిశ్ర సత్వము: సత్వ – (సత్యపూతము), రజ: (కాముక), తమ: (అజ్ఞానము) గుణ మిళితమైన పదార్థము.
    • సత్వ శూన్యము – సర్వకాల సర్వావస్థల యందు సంపూర్ణ గుణ హీనమైన పదార్థము.

శుద్ధ సత్వము (స్వచ్ఛమైన సత్యము)

పరమపదము: శ్రియఃపతి యగు శ్రీమన్నారాయణుని నివాస స్థానమైన మోక్ష సామ్రాజ్యము: పరమ పవిత్రమైన మండపములు, ఉద్యాన వనములతో కూడిన శ్రీ స్థానము.

  • ఇది రజస్తమో గుణ రహితమై పరమ శుద్ధమైన, సత్యమైన పదార్థము. పరమపదమందలి అన్ని అచిత్పదార్థములనూ శుద్ధ సత్వములుగా వ్యవహరించవచ్చు.
  • దీని సహజ స్వభావములు:
    •  శాశ్వతమైనది
    • ఆనందమునకు, జ్ఞానమునకు నిలయమైనది.
    • కర్మ బద్ధుడైన జీవాత్మ యొక్క ఐహిక కామ్యము వలె గాక పరమాత్మ యొక్క లీలామాత్ర సంకల్పము చేత సృష్టించబడిన విమానములు/ గోపురములు, మండపములు ఇత్యాది రూపములు ధరించి ఉండును.
    • అనంత తేజోమాయమైన రూపము గలది.
    • నిత్యులు (శాశ్వతముగా సంసార ముక్తి పొందినవారు), ముక్తులు (సంసారము నుంచి ముక్తిని పొందినవారు) సైతం వర్ణింపనలవి గానిది. ఇక్కడ మణవాళ మహాముణులకు సైతం సందేహము కలిగినదట! సర్వజ్ఞుడైన భగవానునికి సైతం తెలుసుకొనుటకు సాధ్యము కానంతటి రూపము శుద్ధ సత్వమునకు ఉన్నచో మరి భగవానుడు సర్వజ్ఞుడు ఎట్లు కాగలడు? అని! దానికి పిదప మామునులే సమాధాన పడ్డారట, అనంతమైన శుద్ధసత్వపు నిజ తత్వము ఎఱిగినవాడు భగవానుడు కనుక భగవానుడు సర్వజ్ఞుడు, అని!
    • అపరిమితమైన వైభవము కలది!
  • అచిత్తును గూర్చి కొందరు ప్రకాశవంతమైనదని కొందరు కాదు అని అభిప్రాయం వెల్లడించారు.
  • అయితే అధిక భాగమున అచిత్తును ప్రకాశవంతమైన వస్తువుగా ఒప్పుకొనుట జరిగినది! అచిత్తు ప్రకాశవంతమైన వస్తువు అయినందు వలన నిత్యులకు, ముక్తులకు, మరియు భగవంతునికి గోచరమై యున్నది (అనగా తన అస్తిత్వమును పరమపద మందు నిలుపు కొనుటకు, పరమపద వాసులు గుర్తించుటకు అనువుగా ప్రకాశమును పొంది ఉన్నదని అర్థం)! అయితే సంసారుల చేత చూడనలవి కానిది ఇది!
    • అయితే ఇది ఆత్మ కలిగిన వస్తువు కాదు కనుక తనను గూర్చి తాను తెలుసుకోలేదు.
    • మార్పు చెందే స్వభావము కలిగి ఉండును.
  • అచిత్తు జ్ఞానమునకు కూడా అతీతమై ఉండును,
    • కనుక, ఉపకార ఆవశ్యకత లేకుండా మార్పులు చెందును.
    • తన్మాత్రల (శారీరిక ఇంద్రియములు) ప్రభావము లేనిదై జడమై ఉండును.
మిశ్ర సత్వము (సత్వరజస్తమో గుణ మిళితము):
  • స్వాభావికముగా ఇది,
    • సత్వరజస్తమో గుణ మిళితము.
    • జీవాత్మలను నిజజ్ఞానము తెలుసుకోనివ్వకుండా మనసుకు పొర వలె కమ్మివేయును.
    • జీవాత్మలలో అజ్ఞానమునకు కారణమైనది.
    • శాశ్వతమైనది.
    • జీవాత్మలపై ప్రయోగించుటకు భగవానునికి క్రీడా విశేషమైనది.
    • సమయమును బట్టి (సృష్టి యందు ఒకవిధముగా, అలాగే ప్రళయ మందు మరో విధముగా) తన స్థితిని సారూప్యముగా లేక వ్యతిరిక్తముగా (వ్యక్త, అవ్యక్త రూపములుగా) మార్చుకోగల గుణము కలది.
    • దీనినే ప్రక్రుతి (మార్పుకు నిలయమైనది), అవిద్య (అజ్ఞాన హేతువు), మాయ (పరిణామము విపరీతమై గ్రహించనలవి కానిది) అని వ్యవహరింతురు.
  • నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి యందు (10.7.10) పదార్థమును 24 రకములుగా చెప్పియున్నారు, అవి:
    • పంచ తన్మాత్రలు – శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
    • పంచ జ్ఞానేంద్రియములు – శ్రోత్ర (శబ్ద), త్వక్ (స్పర్శ), చక్షు: (దృష్టి), జిహ్వ (రుచి), ఘ్రాణ (వాసన పీల్చుట)
    • పంచ కర్మేంద్రియములు – వాక్ (నోరు), పాణి (కరములు), పాద (పాదములు), పాయు (విసర్జనంగాములు), ఉపస్థ (జననాంగములు)
    • పంచ భూతములు – ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ
    • మనస్సు – బుద్ధి
    • అహంకారము – జీవుల అస్థిత్వము
    • మహాన్ – అవిర్భుతమైన జీవజాలము
    • మూల ప్రక్రుతి – అనావిర్భుతమైన జీవ జాలము
  • మూల ప్రక్రుతి అనావిర్భావ దశ నుంచి గుణములను / గుణ సమూహమును బట్టి ఆవిర్భవించును.
  • గుణములు మూడు – అవి సత్వ గుణము (జ్ఞానపూర్ణము), రజో గుణము (కాముక స్థితి), తమో గుణము (అజ్ఞానావస్థ)
  • మూల ప్రకృతి యందు ఈ మూడు గుణములు సమ పాళ్ళలో నిండి యుండును.
  • సత్వ రజస్తమో గుణములు మూల ప్రకృతిలో అసమానమై ఉన్నచో జీవ జాలము ఆవిర్భవించును.
  • అవిర్భుతమైన జీవ జాలమందు మహాన్ మొదటి స్థితిగా సంభవించును.
  • మహస్థితి నుంచి అహంకారము ఉద్భవించును.
  • అహంకార స్థితి నుంచి వరుసగా తన్మాత్రలు, జ్ఞాన కర్మేంద్రియాదులు ప్రభవించును.
  • పైన చెప్పిన 24 పదార్థములతో భగవానుడు ఈ సమస్త ప్రకృతిని సృష్టించి యున్నాడు.
  • భగవానుడు కేవలం తన సంకల్ప మాత్రము చేత కార్య కారణ రూపముగా మూల ప్రకృతి నుంచి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించియున్నాడు.
  • భగవానుడు బ్రహ్మ, ప్రజాపతులు ఇత్యాది సమస్త జీవ గణాన్నిసృష్టించి వారిలోనే అంతర్యామిగా పరమాత్మగా కొలువై సృష్టి స్థితి లయలను లీలా వినోదియై సలుపుచుండును.

  •  ఈ విశాలమైన విశ్వమునకు సృష్టి కేవలము పరమాత్మ యొక్క సంకల్పము వల్లనే జరిగినది.
  • ఈ అనంతమైన విశ్వములో ఎన్నో బ్రహ్మాణ్డములు ఉన్నవి. ప్రతి బ్రహ్మాణ్డమునకు 14 పొరలు కలవు. సశాస్త్రీయముగా శ్రీమణవాళ మహాముణులు వాటిని గూర్చి చెప్పియున్నారు.
లీలా విభూతి యొక్క నిర్మాణం

లీలా విభూతి యొక్క రూపము (సంసారము –  బాహ్య ప్రపంచము):

  • 7 అథో లోకములు / తలములు/ పొరలు:
    • ఇవి అతల వితల సుతల నితల తలాతల పాతాళ లోకములు. ఇవి భూమికి అథో భాగములో ఉండి పిశాచములకు, సర్పములకు, కొన్ని జాతుల పక్షులకు నెలవై యుండును.
    • ఈ లోకములలో స్వర్గమును మించిన సుందరమైన నగరములు, ఇంద్ర భవనములు ఉండునని చెప్పబడినది.
  • 7 ఊర్థ్వ లోకములు తలములు/ పొరలు:
    • ఇవి భూలోక, భువర్లోక, స్వర్గ లోక, మహో లోక, జనో లోక, తపో లోకములు.
    • భూలోకము – ఇందులో ప్రజాపతులు, మనువులు సంకల్పించి సృష్టించిన మనుష్య జాతి, పశుపక్ష్యాది జంతు జాలము నివాసముండును. ఇది ఏడు ఖండములుగా విభజించ బడియున్నది.
    • భువర్లోకము – ఇది గంధర్వ లోకము: ఇందులో సంగీత దేవతలైన గంధర్వులు నివాసముంటారు.
    • స్వర్గ లోకము: భూర్భువర్లోకముల కార్యకలాపములు చూచే ఇంద్రుడు అతని పరివారము నివసించే లోకము.
    •  మహర్లోకము: ఇచ్చట ఇంద్రత్వము అనుభవించిన పాత ఇంద్రులు, ఇంద్రత్వము కొరకు వేచి ఉండేవారు వంటి మహాత్ములు నివసించే లోకము.
    • జనోలోకము: ఇచ్చట బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు, ఇతర ఋషులు, బ్రహ్మర్షులు నివసించే లోకము.
    • తపోలోకము: ప్రజాపతులు (సృష్టికి మూల పురుషులు) నివసించే లోకము.
  • సత్య లోకము – ఇచ్చట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు వారి పరివార గణములు నివసించును.
  • ప్రతి బ్రహ్మాణ్డము యందు ఈ పద్నాలుగు భువనములు ఉండును. వీటి పైన పంచ భూతములు, ఆఖరుగా వాటిపై మూల ప్రకృతి పొరగా ఆవరించు ఉండును.

  •  జ్ఞానేంద్రియములు స్థూల మరియు విశాల పదార్థముల నుంచి కర్మేంద్రియముల చేత జ్ఞానమును పొందును.  కర్మేంద్రియములు బాహ్య కర్మలను ఆచరించును. బుద్ధి ఇంద్రియములను నియంత్రించుచు వాటి ధర్మములు అవి ఆచరించుటకు సహాయపడును.
  • పంచీకరణం అనగా భగవానుడు రకరకాల పదార్థములను తగు పాళ్ళలో కలిపి సృష్టి చేసిన విధానము.
సత్వ శూన్యము (కాలము):
  • మూల ప్రకృతి నుంచి పదార్థము ఆవిర్భవించుటకు హేతువైన ఉత్ప్రేరకమునకు కాలము అని పేరు.
  • కాలము పరిపరి విధములైన కొలమానములలో అన్వయించబడినది.
  • ఆది అంతము లేని శాశ్వతమైన తత్వము కాలము.
  • భగవానుని క్రీడా వస్తువు.
  • భగవానుడే కాల స్వరూపుడు.
  • మామునులు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనుగ్రహించిన కాల విశ్లేషణను ఇక్కడ వివరించారు:
    • నిమేషము: కనురెప్ప కాలము. కొలవ దగ్గ అత్యల్ప కాలము.
    • 15 నిమేషములు: ఒక కాష్ఠము.
    • 30 కాష్ఠములు: ఒక కల
    • 30 కలలు: 1 ముహూర్తము
    • 30 ముహుర్తములు: 1 దినము
    • 30 దినములు: 1 మాసము: 2 పక్షములు (శుక్ల, కృష్ణ)
    • 2 మాసములు: 1 ఋతువు
    • 3 ఋతువులు: 1 అయనము (ఉత్తరాయన దక్షిణాయములు)
    • 2 అయనములు: 1 సంవత్సరము
    • 360 మానవ సంవత్సరములు: 1 దేవతా సంవత్సరము
  • శుద్ధ సత్వ, మిశ్ర సత్వ అచిత్తత్వములు భోగ్య విశేషములు. అవి పరమపదస్థులు, జీవాత్మల చేత అనుభవించదగ్గవి.
  • శుద్ధ సత్వము అథో భాగమందు మరియు పార్శ్వములలో అపరిమితముగా విస్తరించబడి ఉండును. కానీ ఊర్థ్వదిశ యందు పరిమితముగా విస్తరించి ఉండును.
  • మిశ్ర సత్వము పార్శ్వములలో మరియు అథోముఖంగా పరిమితమై ఉండును. కానీ ఊర్ధ్వ దిశలో అపరిమితముగా విస్తరించి యుండును.
  • అయితే కాలమునకు ఎటువంటి పరిమితులు లేవు. అది అన్ని లోకముల యందు విస్తరించబడి యుండును.
  • అయితే కాల తత్వము పరమపదంలో స్థిరముగా అనంతముగానూ, సంసార మందు అస్థిరంగా క్షణ భంగురమై కదులును. అయితే పెరియ వాచ్చాన్ పిళ్ళై “తత్వ త్రయ వివరణం” అనే గ్రంథములో కాలము పరమపదములోనూ, సంసారములోనూ సమముగా వ్యవహరించునని చెప్పినారని మామునులు ప్రస్తావించెను. అయితే ఇప్పుడు ఈ గ్రంథము లుప్తమైయున్నది. అయితే తర్వాతి కాలములలో ఎందరో ఆచార్యులు కాల తత్వము పరమపదంలో సంసారములో ఒకే విధముగా అన్వయించదని చెప్పియుండుట చేత సంసారము దృష్ట్యా కాలము మారుతూ ఉండునను సత్యమును గ్రహించి కాలము అస్థిరమైనదిగా పరిగణించబడినది.
  • కొందరు అసలు కాలమే లేదని వాదించెదరు. అయితే తర్కమున ఆ వాదము నిలువబోదు గనుక శాస్త్రము ఆ వాదమును పరిగణించదు.

ముగింపు

ఈ విధముగా ఈ అధ్యాయములో శుద్ధ సత్వ (పరమపద సంబంధితమైనది), మిశ్ర సత్వ (సంసార సంబంధమైనది), మరియు సత్వ శూన్యమైన (ఉభయ సత్వములకు సంబంధించిన) అచిత్స్వరూపమును లవలేశముగా తెలుసుకున్నాము. అనంత జ్ఞాన ప్రదాయమైన ఆచార్య సన్నిధిలో ఇటువంటి నిగూఢ రహస్యములైన శాస్త్ర విషయములు కాలక్షేపముగా విన్నచో మరింత విశదంగా ఈ విషయములు అవగతమవుతాయి.

శ్రీమతే రమ్యజామాతృ మునింద్రాయ మహాత్మనే |
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళం ||

మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: |
సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ ||

తరువాతి అధ్యాయములో ఈశ్వర తత్వమును గూర్చి తెలుసుకొందాము.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://granthams.koyil.org/2013/03/thathva-thrayam-achith-what-is-matter/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment